కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w94 11/15 పేజీలు 26-28
  • “మీరు పన్ను చెల్లించవలసివుంటే చెల్లించండి”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “మీరు పన్ను చెల్లించవలసివుంటే చెల్లించండి”
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • నడిపింపునిచ్చే ఐదు సూత్రాలు
  • దేవున్ని గౌరవించే మంచి పేరును కాపాడుకోండి
  • మీరు పన్నులు కట్టాలా?
    కావలికోట: మీరు పన్నులు కట్టాలా?
  • మీకు తెలుసా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2021
  • పైఅధికారులకు మన పరిమితమైన విధేయత
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
  • అది నిజంగా మోసమేనా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2010
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
w94 11/15 పేజీలు 26-28

“మీరు పన్ను చెల్లించవలసివుంటే చెల్లించండి”

“ఈ లోకంలో మరణం, పన్నులు తప్ప మరేది నిశ్చితం కాదు.” పద్దెనిమిదవ శతాబ్దపు అమెరికా రాజనీతిజ్ఞుడు, కనుగొన్నవాడు అయిన బెన్జమిన్‌ ఫ్రాంక్లిన్‌ అలా అన్నాడు. తరచుగా ఉదాహరించబడే ఆయన మాటలు, పన్నుల యొక్క అనివార్యతనే కాదు, అవి కలుగజేసే భయాన్ని కూడా ప్రతిబింబిస్తాయి. అనేకమందికి, పన్నులు కట్టడం చనిపోవడం కంటే కష్టం.

పన్నులు కట్టడం ఎంతో అప్రీతికరమైనప్పటికీ, యిది నిజమైన క్రైస్తవులు ఎంతో గంభీరంగా భావించే బాధ్యత. రోమాలోని క్రైస్తవ సంఘానికి అపొస్తలుడైన పౌలు యిలా వ్రాశాడు: “ప్రతి ఒక్కరికి మీరు రుణపడివున్నది చెల్లించండి: ఎవరికి పన్నో వారికి పన్ను; ఎవరికి సుంకమో వారికి సుంకము; ఎవరిని గౌరవించవలెనో వారికి గౌరవం; ఎవరిని ఘనపర్చవలెనో వారికి ఘనతను.” (రోమీయులు 13:7, న్యూ యింటర్‌నేషనల్‌ వర్షన్‌) “కైసరువి కైసరునకును దేవునివి దేవునికిని చెల్లించుడి” అని యేసుక్రీస్తు చెప్పినప్పుడు ఆయన ప్రత్యేకంగా పన్నులను గూర్చి సూచిస్తున్నాడు.—మార్కు 12:14, 17.

యెహోవా, ప్రభుత్వ “పై అధికారులు” ఉనికిలో వుండడానికి అనుమతించి, తన సేవకులు వారికి తగిన విధేయతను కనపర్చాలని కోరుతున్నాడు. అయితే, తన సేవకులు పన్నులు చెల్లించాలని దేవుడు ఎందుకు నొక్కి చెబుతున్నాడు? పౌలు మూడు ప్రాథమిక కారణాలను చూపిస్తున్నాడు: (1) చట్టాన్ని అధిగమించేవారిని శిక్షించే “పై అధికారుల” “ఆగ్రహము”; (2) తాను కట్టవలసిన పన్నులు కట్టకుండా ఎగవేస్తే పరిశుభ్రంగా వుండని ఒక క్రైస్తవుని మనస్సాక్షి; (3) మనకు సేవలు చేస్తున్నందుకు, కొంతమేరకు సమాధానాన్ని కాపాడుతున్నందుకు ఈ “పరిచారకులకు” చెల్లించవలసిన అవసరత. (రోమీయులు 13:1-7) అనేకులు పన్నులు కట్టడం యిష్టపడకపోవచ్చు. అయినప్పటికీ, పోలీసులు లేక అగ్ని మాపక భద్రత, సరైన రహదార్ల నిర్వహణ, పాఠశాలలు, తపాలా వ్యవస్థ వంటివి లేని ప్రాంతంలో జీవించడానికి కూడా వారు కచ్చితంగా యిష్టపడరు. అమెరికా న్యాయశాస్త్రవేత్త అయిన ఓలీవర్‌ వెన్‌డెల్‌ హోమ్స్‌ ఒకసారి దాన్నిలా చెప్పాడు: “నాగరిక సమాజం కొరకు మనం చెల్లించేవే పన్నులు.”

పన్నులు కట్టడం దేవుని సేవకులకు క్రొత్తేమి కాదు. ప్రాచీన ఇశ్రాయేలు నివాసులు తమ రాజులకు మద్దతునిచ్చేందుకు ఒక విధమైన పన్నులను కట్టేవారు, ఆ పరిపాలకుల్లో కొంతమంది ప్రజలపై కారణరహితమైన పన్నులు అధికంగా విధించడం ద్వారా వారిపై ఎక్కువ భారం పెట్టేవారు. యూదులు కూడా తమపై ఆధిపత్యం వహించిన ఐగుప్తు, పర్షియా, రోము వంటి విదేశీ శక్తులకు విరాళాలు, పన్నులు చెల్లించారు. కాబట్టి పౌలు పన్నులు చెల్లించడం అని చెప్పినప్పుడు ఆయన దేని గురించి మాట్లాడుతున్నాడో పౌలు దినం నాటి క్రైస్తవులకు బాగా తెలుసు. పన్నులు కారణసహితమైన వైనప్పటికీ, కాకపోయినప్పటికీ, ప్రభుత్వం ఈ డబ్బును దేని కొరకు ఖర్చు చేసినప్పటికీ, వారు అచ్చివున్న పన్ను చెల్లించాలని వారికి తెలుసు. అదే నేటి క్రైస్తవులకు కూడా వర్తిస్తుంది. అయితే, ఈ కష్టతరమైన కాలాల్లో మనం పన్నులు చెల్లించడంలో ఏ సూత్రాలు మనకు నడిపింపునివ్వగలవు?

నడిపింపునిచ్చే ఐదు సూత్రాలు

క్రమం కలిగివుండండి. ‘అల్లరికి కాదుగాని క్రమానికి కర్తయైన దేవుడు’ అయిన యెహోవాను మనం సేవిస్తున్నాము, అనుకరిస్తున్నాము. (1 కొరింథీయులు 14:33; ఎఫెసీయులు 5:1) పన్నులు కట్టడం విషయంలో క్రమంగా వుండడమంటే చాలా కష్టం. మీ రికార్డులు పూర్తిగా, కచ్చితంగా, క్రమంగా వున్నాయా? సాధారణంగా, వ్యయంతో కూడిన ఫైళ్ల వ్యవస్థ అవసరంలేదు. మీరు ఒక్కొక్క రకం రికార్డుల కొరకు (అంటే మీ అనేక ఖర్చులను ప్రత్యేకపరుస్తున్న రసీదుల వంటివి) ఒక్కొక్క పేరున్న ఒక విభాగం కలిగివుంటే చాలు. ప్రతి సంవత్సరం కొరకు పెద్ద విభాగాలలో వాటిని జతచేయడానికి అది సరిపోతుంది. ప్రభుత్వం పాత రికార్డులను పరిశీలించాలని నిర్ణయిస్తుందేమోనని కొన్ని దేశాల్లో అలాంటి రికార్డులను అనేక సంవత్సరాల వరకు భద్రపరచవలసి వుంటుంది. అది యింక ఎంత మాత్రం అవసరం లేదని కచ్చితంగా తెలిసే వరకు ఏది పారవేయకండి.

యథార్థంగా వుండండి. పౌలు యిలా వ్రాశాడు: “మా నిమిత్తము ప్రార్థనచేయుడి; మేమన్ని విషయములలోను యోగ్యముగా ప్రవర్తింప గోరుచు మంచి మనస్సాక్షి కలిగియున్నామని నమ్ముకొనుచున్నాము.” (హెబ్రీయులు 13:18) మన పన్నులను కట్టేటప్పుడు మనం చేసే ప్రతి నిర్ణయాన్ని యథార్థంగా వుండాలనే మన హృదయపూర్వక కోరిక నడిపించాలి. మొదట, ప్రభుత్వానికి నివేదించవలసిన డబ్బుపై కట్టే పన్నులను గూర్చి పరిశీలించండి. అనేక దేశాల్లో, టిప్స్‌, విశేషమైన ఉద్యోగాలు, అమ్మకం వంటివాటి నుండి వచ్చే అదనపు సొమ్ము, అది ఒక నిర్దిష్ట మొత్తాన్ని దాటిన వెంటనే పన్ను విధింపబడవలసి వుంటుంది. ఒక క్రైస్తవుడు “మంచి మనస్సాక్షి”తో తాను నివసించే ప్రాంతంలో పన్ను కట్టవలసిన సొమ్ము ఏదో తెలుసుకుని, తగిన పన్ను చెల్లిస్తాడు.

రెండవదిగా, తగ్గింపుల విషయం. సాధారణంగా ప్రభుత్వాలు, పన్ను కట్టేవారు కట్టవలసిన పన్ను విధించబడే సొమ్ము నుండి కొన్ని ఖర్చులను తగ్గించడానికి అనుమతిస్తాయి. ఈ యథార్థతలేని లోకంలో, అలాంటి తగ్గింపులను క్లెయిమ్‌ చేసేటప్పుడు, “కల్పితమైన” వారిగా వుండడంలో ఏ హాని లేదని భావిస్తారు. అమెరికాలోని ఒక వ్యక్తి తన భార్య కొరకు ఒక ఖరీదైన ఫర్‌ కోట్‌ కొని, తాను పనిచేసే స్థలంలో “అలంకరణగా” దానిపై విధింపబడే పన్నును తగ్గించడానికి దాన్ని ఒకరోజు తన వ్యాపార స్థలంలో వ్రేలాడదీశాడట! మరో వ్యక్తి తన కుమార్తె వివాహ ఖర్చులను వ్యాపార తగ్గింపులుగా చూపించాడు. తూర్పు ప్రాంతంలో తనతో పాటు తన భార్య నెలల పాటు కలిసి తిరగడంతో అయిన ఖర్చులను, అంటే ఆమె నిజానికి ముఖ్యంగా సామాజిక, వినోద సంబంధమైన ఉద్దేశంతో వచ్చినప్పటికీ, తగ్గించడానికి ప్రయత్నించాడు. అలాంటి విషయాలకు అంతం లేనట్లుంది. ఒక్కమాటలో చెప్పాలంటే, నిజంగా వ్యాపార తగ్గింపు కానప్పుడు దాన్ని వ్యాపార తగ్గింపు అని చెప్పడం ఒక విధమైన అబద్ధం చెప్పడమే—దాన్ని మన దేవుడైన యెహోవా ఎంతో అసహ్యించుకుంటాడు.—సామెతలు 6:16-19.

జాగ్రత్తగా వుండండి. యేసు తన అనుచరులను “పాములవలె వివేకులును పావురములవలె నిష్కపటులునై యుండుడి” అని కోరాడు. (మత్తయి 10:16) మన పన్నులు కట్టే అలవాట్లకు కూడా ఆ సలహా చక్కగా వర్తిస్తుంది. ప్రాముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాల్లో, ఈ రోజుల్లో అనేకమంది ప్రజలు తాము కట్టవలసిన పన్నులను సిద్ధం చేయడానికి అక్కౌంటింగ్‌ కంపెనీని లేక కొంతమంది అదే పని చేసేవారిని కోరుతారు. తర్వాత వారు కేవలం పత్రాలపై సంతకం చేసి చెక్కు పంపించేస్తారు. “జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును వివేకియైనవాడు తన నడతలను బాగుగా కనిపెట్టును” అని సామెతలు 14:15 నందు వ్రాయబడివున్న హెచ్చరికను గమనించడానికి యిది మంచి సందర్భం.

పన్నులు కట్టేవారు అనేకమంది ప్రభుత్వంతో సమస్యను ఎదుర్కొన్నారు ఎందుకంటే, వారు నీతినియమాలు లేని అక్కౌంటెంటు నందు లేక పన్ను సిద్ధం చేయడంలో అనుభవం లేని వారి ‘ప్రతి మాట యందు విశ్వాసముంచుతారు.’ నిపుణత కలిగివుండడం ఎంత మంచిది! మీరు సంతకం చేసే ముందు ఏ పత్రాన్నైనా చదవడం ద్వారా జాగ్రత్తగా వుండండి. ఏదైనా ఎక్కించినది, తీసివేసినది లేక తగ్గించినది మీకు క్రొత్తగా అనిపిస్తే, అవసరమైతే అదేమిటో చాలాసార్లు అడిగి తెలుసుకోండి, విషయం యథార్థంగా, చట్టపరంగా వుందని మీకు సంతృప్తి కలిగే వరకు వివరంగా తెలుసుకోండి. నిజమే, అనేక దేశాల్లో పన్ను చట్టాలు చాలా క్లిష్టంగా తయారయ్యాయి కాని, వీలైనంత వరకు, మీరు సంతకం చేసేది ఏదైనప్పటికీ అర్థం చేసుకోవడం జ్ఞానయుక్తంగా వుంటుంది. కొన్ని సందర్భాల్లో, పన్ను సూత్రాల విషయం బాగా తెలిసిన తోటి క్రైస్తవుడు మీకు కొంత తెలియజేయవచ్చు. న్యాయవాదిగా పన్ను విషయాలు చూసే ఒక క్రైస్తవ పెద్ద సంక్షిప్తంగా యిలా చెప్పాడు: “నిజమైయుండలేనంత మంచిగా అనిపించే ఏదైనా మీ అక్కౌంటెంటు చెప్పినట్లయితే, అది బహుశా నిజం కాకపోవచ్చు!”

బాధ్యత కలిగివుండండి. అపొస్తలుడైన పౌలు యిలా వ్రాశాడు: “ప్రతివాడును తన బరువు తానే భరించుకొనవలెను.” (గలతీయులు 6:5) పన్ను కట్టే విషయానికి వచ్చినప్పుడు, ప్రతి క్రైస్తవుడు యథార్థంగావుండే విషయంలో, చట్టానికి లోబడి వుండే విషయంలో తన బరువు తానే భరించుకోవాలి. ఇది సంఘ పెద్దలు తమ శ్రద్ధ క్రింద మందను పైవిచారణ చేసే విషయం కాదు. (2 కొరింథీయులు 1:24 పోల్చండి.) గంభీరమైన తప్పు, బహుశా సమాజంలో కళంకం కలుగజేసేదేదైనా తమ దృష్టికి వస్తే తప్ప వారు పన్నుకు సంబంధించిన విషయాల్లో జోక్యం చేసుకోరు. సాధారణంగా, యిది లేఖనాధార సూత్రాలను అన్వయించు కోవడంలో సరైన విధంగా శిక్షణ పొందిన తన మనస్సాక్షిని ఉపయోగించడం విషయంలో ప్రతి క్రైస్తవుడు బాధ్యత వహించవలసిన రంగము. (హెబ్రీయులు 5:14) ఒక పన్ను పత్రంపై సంతకం చేయడం కూడా దీనిలో యిమిడి వుంది—దాన్ని ఎవరు తయారు చేసినప్పటికీ—పన్ను పత్రంపై సంతకం చేయడం, మీరు పత్రాన్ని చదివారని దానిలో వున్నదంతా సత్యమని మీరు నమ్ముతున్నారని చట్టపరంగా ఒక వ్యాఖ్యానం చేసినట్లే అవుతుంది.a

నిందారహితంగా ఉండండి. క్రైస్తవ అధ్యక్షులు తాము ఆ స్థానాన్ని పొందడానికి అర్హులయ్యేందుకు “నిందారహితులై” యుండాలి. అలాగే, సంఘమంతా దేవుని దృష్టిలో నిందారహితంగా వుండాలి. (1 తిమోతి 3:2; ఎఫెసీయులు 5:27 పోల్చండి.) కాబట్టి వారు పన్ను కట్టే విషయంలో కూడా, సమాజంలో మంచి పేరును కలిగివుండడానికి ప్రయాసపడతారు. ఈ విషయంలో యేసుక్రీస్తు తానే మాదిరినుంచాడు. కేవలం అర షెకెలు అయిన ఆలయపన్ను యేసు చెల్లిస్తాడా అని శిష్యుడైన పేతురు ప్రశ్నించబడ్డాడు. నిజంగా, ఆ ఆలయం తన తండ్రి గృహం గనుక, ఏ రాజు తన స్వంత కుమారునిపై పన్ను విధించడు గనుక నిజానికి యేసు పన్ను నుండి మినహాయించ బడ్డాడు. యేసు అలా చెప్పాడు; అయినా ఆయన పన్ను కట్టాడు. వాస్తవానికి, అవసరమైన డబ్బును ఉత్పత్తి చేయడానికి ఆయన ఒక అద్భుతాన్ని కూడా ఉపయోగించాడు! ఆయన కట్టనవసరంలేని పన్నును ఆయనెందుకు కట్టాడు? యేసు తానే చెప్పినట్లుగా, అది “వారికి అభ్యంతరము కలుగజేయకుండుటకు.”—మత్తయి 17:24-27.b

దేవున్ని గౌరవించే మంచి పేరును కాపాడుకోండి

తాము యితరులను అభ్యంతర పెట్టకూడదని యెహోవా సాక్షులు నేడు అలాగే శ్రద్ధ కలిగివున్నారు. ఏమాత్రం ఆశ్చర్యం కాని విధంగా, అప్పుడు, ఒక గుంపుగా వారు ప్రపంచవ్యాప్తంగా యథార్థపరులైన, పన్ను చెల్లించె పౌరులుగా మంచి పేరును కలిగివున్నారు. ఉదాహరణకు, స్పెయిన్‌లో విస్తృతంగా పన్ను ఎగవేయడాన్ని గూర్చి వ్యాఖ్యానిస్తూ, స్పానిష్‌ భాష వార్తాపత్రిక అయిన ఎల్‌ డైరియో వాస్‌కో యిలా తెలియజేసింది: “కేవలం యెహోవా సాక్షులే మినహాయింపు. వారు [ఆస్తి] కొన్నప్పుడుగాని అమ్మినప్పుడుగాని తమ పన్ను గురించి వారు యిచ్చే వ్యాఖ్యానం పూర్తిగా సత్యవంతంగా వుంటుంది.” అలాగే, అమెరికా వార్తాపత్రిక అయిన సాన్‌ ఫ్రాన్సిస్‌కో ఎక్సామినర్‌ కొన్ని సంవత్సరాల క్రితం యిలా అన్నది: “[యెహోవా సాక్షులను] మంచి పౌరులుగా పరిగణించవచ్చు. వారు పన్నులు సరిగ్గా కడతారు, రోగుల గురించి శ్రద్ధ తీసుకుంటారు, నిరక్షరాస్యతను నిర్మూలించడానికి ప్రయత్నిస్తారు.”

కష్టపడి సంపాదించిన ఈ మంచి పేరును పాడుచేయగల దేనిని చేయడానికి నిజమైన క్రైస్తవులు యిష్టపడరు. మనము ఎంపిక చేసుకోవలసి వస్తే, కొంత డబ్బు మిగుల్చుకోడానికి మీరు పన్ను ఎగవేసేవారనే పేరు తెచ్చుకోడానికి యిష్టపడతారా? లేదు. తప్పకుండా మీరు డబ్బైనా వదులుకుంటారు గాని మంచి పేరు పోగొట్టుకోడానికి, యెహోవా యొక్క మీ ఆరాధనపైకి మచ్చ తేవడానికి యిష్టపడరు.

నిజానికి, కొన్నిసార్లు మంచివాడు, నిజాయితీపరుడనే పేరును కాపాడుకోడానికి కొంత డబ్బు వదులుకోవలసి రావచ్చు. దాదాపు 24 శతాబ్దాల క్రితం ప్రాచీన గ్రీకు వేదాంతికుడైన ప్లాటో చెప్పినట్లుగా: “ఆదాయపు పన్ను కట్టవలసివున్నప్పుడు, ఒకే మొత్తంపై ఒక న్యాయవంతుడైన వ్యక్తి ఎక్కువ కడితే, అన్యాయస్థుడైన వ్యక్తి తక్కువ కడతాడు.” న్యాయంగా వున్న వ్యక్తి తాను అలా వున్నందుకు చెల్లించవలసి వచ్చే మూల్యాన్ని చెల్లించడానికి ఎన్నడూ బాధపడడు అని ఆయన జతచేయవలసింది. అలాంటి పేరును కలిగివుండడం కూడా తగిన మూల్యమే. ఇది క్రైస్తవుల విషయంలో కచ్చితంగా నిజం. వారి మంచి పేరు వారికి విలువైనది ఎందుకంటే, అది వారి పరలోకపు తండ్రిని ఘనపరుస్తుంది, యితరులను వారి జీవిత విధానానికి తేవడానికి, వారి దేవుడైన యెహోవా వైపుకు ఆకర్షించడానికి సహాయం చేస్తుంది.—సామెతలు 11:30; 1 పేతురు 3:1.

అయితే, దాదాపు నిజమైన క్రైస్తవులందరు యెహోవాతో తమ స్వంత సంబంధాన్ని విలువైనదిగా భావిస్తారు. వారు చేసే ప్రతిదాన్ని దేవుడు చూస్తాడు, వారు ఆయనను ప్రీతి పర్చడానికి యిష్టపడతారు. (హెబ్రీయులు 4:13) గనుక, ప్రభుత్వాన్ని మోసగించడానికి ప్రయత్నించాలనే శోధనను వారు నిరాకరిస్తారు. యథార్థమైన, నీతియుక్తమైన ప్రవర్తన యందు దేవుడు ఆనందిస్తాడని వారు గుర్తిస్తారు. (కీర్తన 15:1-3) యెహోవా హృదయాన్ని ఆనందపర్చాలని వారు కోరుకుంటారు గనుక, వారు కట్టవలసిన పన్నులన్నీ కడతారు.—సామెతలు 27:11; రోమీయులు 13:7.

[అధస్సూచీలు]

a అవిశ్వాసి అయిన జతతో జాయింట్‌ టాక్స్‌ రిటర్న్‌ చేయడమంటే ఒక క్రైస్తవునికి సవాలు కాగలదు. శిరసత్వపు సూత్రాన్ని కైసరు యొక్క పన్ను చట్టాలకు లోబడ వలసిన అవసరతతో సమతూకం చేయడానికి క్రైస్తవ భార్య మనస్సాక్షి పూర్వకమైన ప్రయత్నం చేయాలి. తప్పైన పత్రంపై తెలిసి సంతకం చేయడం వల్ల రాగల చట్టసంబంధమైన పర్యవసానాలను గూర్చి ఆమె ఎంతో జాగ్రత్తగా వుండాలి.—రోమీయులు 13:1 పోల్చండి; 1 కొరింథీయులు 11:3.

b ఆసక్తిదాయకంగా, యేసు భూజీవితంలోని ఈ వృత్తాంతం కేవలం మత్తయి సువార్తలో మాత్రమే వ్రాయబడి వుంది. మునుపు పన్ను వసూలు చేసేవానిగా, ఈ విషయంలో యేసు దృక్పథాన్ని బట్టి మత్తయి ప్రభావితమయ్యాడనడంలో సందేహమే లేదు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి