ర్వాండాలోని మన సహోదరుల ధైర్యంతో కూడిన విశ్వాసం
ఈ 1994 తొలి భాగంలో, ఆఫ్రికా దేశమైన ర్వాండాలో బారీ ఎత్తున జరిగిన ఊచకోతలను గూర్చిన నివేదికలు రావడంతో ప్రపంచం దిగ్భ్రాంతి చెందింది. పాశవికమైన అంతర్యుద్ధం తలెత్తింది—అది శతాబ్దాల ద్వేషం యొక్క చివరి పరిణామము.
శాంతిభద్రతలు పూర్తిగా పతనమవ్వడంతో, ర్వాండాలోని 2,000కంటే ఎక్కువమంది యెహోవాసాక్షులు తమ ప్రాణాలను కాపాడుకోడానికి పారిపోవలసి వచ్చింది. దాదాపు 1,300 మంది, దగ్గర్లోని జైరీ మరియు టాంజానియాలోని శరణార్థ శిబిరాల్లో ఆశ్రయం పొందారు, కాని కొందరు సరైన సమయానికి తప్పించుకోలేక పోయారు. మన సహోదరసహోదరీలలో యించుమించు 400 మంది—పెద్దలు, పిల్లలు, నిజానికి అందరు పౌరులు—ఆ ఉన్మాద దౌర్జన్యంలో మరణించారని నివేదించడానికి మేము దుఃఖిస్తున్నాము. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు, తమ యథార్థతను నిలుపుకున్న ఈ ధైర్యవంతులను కోల్పోయినందుకు రోధిస్తున్నారు, బైబిలులోని పునరుత్థానాన్ని గూర్చిన వాగ్దానాన్నిబట్టి ఆదరణ పొందుతున్నారు.—యోహాను 11:25.
ర్వాండాలోని, జీవించి ఉన్న సహోదర సహోదరీలు పరిస్థితి యిప్పుడెలా ఉంది? విషయాలను మొదట పరిశీలించడానికి అనేక దేశాలనుండి పెద్దలు పంపబడ్డారు. ర్వాండాలోని సహోదరులు పరిస్థితిని “ఎంతో హుందాతనం మరియు ధైర్యంతో” ఎదుర్కున్నారని ఒక నివేదిక తెలియజేసింది. ఉదాహరణకు, సహోదరులు కోరిన వాటిలో బైబిలు సాహిత్యాలు ముందు ఉన్నాయి. ‘వాళ్లకు ఎన్నో వస్తువులు కావలసి ఉన్నా వాళ్లు వస్తుదాయక సహాయంకంటే ఆత్మీయ ఆహారంపట్లనే ఎక్కువ శ్రద్ధ కలిగివున్నట్లు కనిపించిందని,’ నివేదిక ముగిస్తుంది. క్యాంపులోని పరిస్థితులు చాలా క్షీణించి ఉన్నా, ‘మన సహోదరులు ఉంటున్నదే అతి శుభ్రమైన స్థలం.’
ఆహారము, రగ్గులు, బట్టలు, చెప్పులు, మరియు మందులు కొనడానికి వాచ్‌టవర్ సంస్థ విరాళాలను సమకూర్చింది. ఫ్రాన్స్‌లోని మన సహోదరులు ఉదారంగా విరాళాలు యిచ్చారు, జూన్ తొలి భాగానికల్లా, అవసరంలో ఉన్న ర్వాండాలోని మన సహోదరుల కొరకు దాదాపు రెండు టన్నుల సరుకులు అందించబడ్డాయి.
ఆశ్చర్యాన్ని కల్గించని రీతిలో, ఈ పరిస్థితులు చక్కని సాక్ష్యమివ్వడానికి దారితీశాయి. ర్వాండాలోని మన సహోదరులు తమ తోటి సాక్షులనుండి అటువంటి సహాయాన్ని, మద్దతును పొందారని, ఈ సహాయాన్ని యితరులతో పంచుకోడానికి వీలు కలిగిందన్న వాస్తవాన్నిబట్టి గమనించేవారు కదిలింపబడ్డారు. తమ మతానికి చెందిన వారిచే దర్శింపబడినవారు మొత్తం శిబిరంలో కేవలం సాక్షులు మాత్రమేనని కొందరు వ్యాఖ్యానించారు!
ఈ “అంత్యదినములలో,” మనుష్యులు “క్రూరులు” మరియు “అజితేంద్రియులు”గా ఉంటారని మన ర్వాండాలోని సహోదరుల అవస్థ మనకు తెలియజేస్తుంది. (2 తిమోతి 3:1-5; టుడేస్ ఇంగ్లీష్ వర్షన్) యెహోవా తన ప్రజలను భౌతిక ప్రమాదాలనుండి అద్భుతంగా రక్షిస్తానని వాగ్దానం చేయకపోయినా, ఆయన వారి ఆత్మీయతను, తనతో వారి సంబంధాన్ని పరిరక్షిస్తానని, యిప్పుడు నశించిన వారిని క్రీస్తు వెయ్యేండ్ల పరిపాలనలో పునరుత్థానం చేస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. (కీర్తన 91:1-10) ఈ శ్రమతో కూడిన సమయంలో, ర్వాండాలోని జీవించివున్న మన సహోదరులను యెహోవా బలపర్చి, వారికి సహాయం చేయాలన్న మన ప్రార్థనలు వారికొరకు ఎడతెగక అర్పించబడును గాక.—కీర్తన 46:1.