మానవ బాధలు—వాటిని దేవుడెందుకు అనుమతిస్తున్నాడు?
మానవ చరిత్ర ప్రారంభంలో, నొప్పి లేక దుఃఖపు కన్నీళ్లు లేనేలేవు. మానవ బాధలు ఉనికిలోలేవు. మానవజాతి పరిపూర్ణంగా ప్రారంభించబడింది. “దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలమంచిదిగ నుండెను.”—ఆదికాండము 1:31.
కాని కొందరిలా ఆక్షేపిస్తారు, ‘ఏదెను వనంలోని ఆదాము హవ్వలను గూర్చిన కథ కేవలం దృష్టాంతంగా చెప్పబడినది మాత్రమే.’ దుఃఖకరంగా, క్రైస్తవమత సామ్రాజ్యంలోని అనేకమంది మతనాయకులు యిలా చెబుతారు. అయితే, యేసుక్రీస్తు అంతటి అధికారం గలవాడే ఏదెనులోని సంఘటనలను చారిత్రాత్మకమైనవిగా ధృవపరుస్తున్నాడు. (మత్తయి 19:4-6) అంతేకాకుండా, దేవుడు మానవ బాధలను ఎందుకు అనుమతించాడో అర్థం చేసుకోడానికి ఏకైక మార్గం మానవుని తొలి చరిత్రనాటి సంఘటనలను పరిశీలించడమే.
మొదటి మానవుడైన ఆదాముకు ఏదెను తోటను గూర్చి శ్రద్ధ తీసుకోవాల్సిన సంతృప్తిదాయకమైన పని యివ్వబడింది. యింకా తన ఏదెను గృహాన్ని, భూవ్యాప్త నందనవనంగా విస్తరింపజేయవల్సిన లక్ష్యాన్ని కూడా దేవుడు ఆదాము ముందుంచాడు. (ఆదికాండము 1:28; 2:15) ఈ గొప్ప కార్యాన్ని సాధించేందుకు ఆదాముకు సహాయంగా దేవుడు ఒక వివాహజతను, హవ్వను యిచ్చి, ఫలించి, అభివృద్ధి పొంది మరియు భూమిని లోబరచుకోమని వారికి చెప్పాడు. అయినా భూమి మరియు మానవ జాతిపట్ల దేవునికున్న సంకల్పం విజయవంతమవ్వడానికి మరింకేదో కూడా అవసరమైయుంది. దేవుని పోలికచొప్పున నిర్మింపబడినందుకు మానవునికి స్వేచ్ఛాచిత్తం యివ్వబడింది; కాబట్టి, మానవుని చిత్తం దేవుని చిత్తానికి విరుద్ధంగా ఎప్పటికీ ఉండకూడదు. ఉండినట్లయితే విశ్వంలో క్రమరాహిత్యం ఏర్పడుతుంది, శాంతియుత మానవ కుటుంబంతో భూమిని నింపాలన్న దేవుని సంకల్పం నెరవేర్చబడదు.
దేవుని పరిపాలనకు లోబడటం దానంతట అదే జరిగేది కాదు. అది మానవుని స్వేచ్ఛాచిత్తం నుండి వ్యక్తపర్చబడే ప్రేమపూర్వక భావన అయివుండాలి. ఉదాహరణకు, యేసుక్రీస్తు ఒక తీవ్రమైన పరీక్షను ఎదుర్కొన్నప్పుడు, ఆయనిలా ప్రార్థించాడని మనం చదువుతాము: “తండ్రీ, యీ గిన్నె నా యొద్దనుండి (తొలగించుటకు) నీ చిత్తమైతే తొలగించుము; అయినను నా యిష్టముకాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక.”—లూకా 22:42.
అదేవిధంగా, దేవుని పరిపాలనకు లోబడాలని వారు యిష్టపడుతున్నారా లేదాయని ఆదాము హవ్వలు కూడా నిరూపించుకోవలసి ఉంది. ఇందునిమిత్తం, యెహోవా దేవుడు ఒక చిన్న పరీక్షను పెట్టాడు. తోటలోని చెట్లలో ఒకటి “మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షము” అని పిలువబడింది. సరైన ప్రవర్తనా నియమాలను తీర్మానించే దేవుని హక్కుకు అది ప్రాతినిధ్యం వహించింది. స్పష్టమైన రీతిలో చెప్పాలంటే, ఈ ఫలాని చెట్టు పండ్లను తినడాన్ని దేవుడు నిషేధించాడు. ఒకవేళ ఆదాము హవ్వలు అవిధేయులైతే, అది వారి మరణానికి దారితీస్తుంది.—ఆదికాండము 2:9, 16, 17.
మానవ బాధల ప్రారంభం
ఒకరోజు దేవుని ఆత్మీయ కుమారులలో ఒకడు దేవుని పరిపాలనా పద్ధతి తప్పని అహంకారంగా సవాలుచేయడం ప్రారంభించాడు. ఒక సర్పం ద్వారా మాట్లాడుతూ, వాడు హవ్వను యిలా అడిగాడు: “ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా?” (ఆదికాండము 3:1) దేవుని పరిపాలనా పద్ధతి సరైనదా కాదా అని హవ్వ మనస్సులో చిన్న అనుమాన బీజం నాటబడింది.a దానికి జవాబుగా హవ్వ, తాను తన భర్తనుండి తెలుసుకున్న సరైన జవాబు చెప్పింది. అయితే, ఆ ఆత్మీయప్రాణి దేవుడు చెప్పినదానికి విరుద్ధంగా మాట్లాడి, అవిధేయత యొక్క పర్యవసానాన్ని గురించి యిలా అబద్ధం చెప్పాడు: “మీరు చావనే చావరు; ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతలవలె ఉందురనియు దేవునికి తెలియును.”—ఆదికాండము 3:4, 5.
దుఃఖకరంగా, అవిధేయత మానవ బాధలకు కాదుగానీ, మంచి జీవితానికి నడిపిస్తుందని ఆలోచించేలా హవ్వ మోసగింపబడింది. ఆమె పండు వైపు చూసినకొలది, ఆమెకు ఆ పండు ఎంతో మంచిదిగా కనిపించింది, ఆమె దాన్ని తినడం ప్రారంభించింది. తర్వాత, ఆదాము కూడా దాన్ని తినేలా ఆమె అతన్ని పురికొల్పింది. దుఃఖకరంగా, ఆదాము దేవునికంటే తన భార్యను సంతోషపర్చటానికే ఎన్నుకున్నాడు.—ఆదికాండము 3:6; 1 తిమోతి 2:13, 14.
ఈ తిరుగుబాటును ప్రేరేపించడం ద్వారా, ఆ ఆత్మీయప్రాణి తనను తాను దేవునికి విరోధిగా చేసుకున్నాడు. అలా అతను సాతాను అని పిలువబడ్డాడు, ఆ హెబ్రీ పదానికి “వ్యతిరేకి” అని అర్థం. అతను దేవున్ని గురించి కూడా అబద్ధం చెప్పాడు, అలా తనను తాను కొండెములు చెప్పువానిగా చేసుకున్నాడు. అందుకే, “కొండెములు చెప్పువాడు” అనే అర్థాన్నిచ్చే గ్రీకు పదమైన అపవాది అని కూడా అతను పిలువబడుతున్నాడు.—ప్రకటన 12:9.
అలా మానవ బాధలు ప్రారంభమయ్యాయి. దేవుడు సృష్టించిన వారిలో ముగ్గురు తమ సృష్టికర్తకు విరుద్ధంగా స్వార్థపూరిత జీవిత విధానాన్ని ఎన్నుకోవడం ద్వారా తమ స్వేచ్ఛాచిత్తమనే బహుమానాన్ని దుర్నినియోగపర్చారు. ఇప్పుడు తలెత్తిన ప్రశ్నేమిటంటే, పరలోకమందలి నమ్మకమైన దూతలు, ఆదాము హవ్వల రాబోవు తరాల వారితో సహా జ్ఞానవంతులైన తన మిగతా సృష్టినంతటిని ధైర్యపర్చేలా న్యాయవంతమైన పద్ధతిలో దేవుడు ఈ తిరుగుబాటును ఎలా సరిచేయగలడు?
దేవుని జ్ఞానవంతమైన ప్రతిస్పందన
సాతాను, ఆదాము, హవ్వలను దేవుడు వెంటనే నాశనం చేసివుంటే బాగుండేదని కొందరు వాదించవచ్చు. కాని అది తిరుగుబాటు ద్వారా రేపబడిన వివాదాలను సరిచేసి ఉండేదికాదు. దేవుని పరిపాలన లేకుండానే మానవులు మంచి జీవితాన్ని ఆనందించగలరని సూచిస్తూ, సాతాను దేవుని పరిపాలనా పద్ధతిని ప్రశ్నించాడు. మొదటి యిద్దరు మానవులను దేవుని పరిపాలనకు విరుద్ధంగా త్రిప్పగల్గడంలో అతను పొందిన విజయం కూడా యితర ప్రశ్నలను రేకెత్తింది. ఆదాము హవ్వలు పాపం చేశారు గనుక, దేవుడు మానవున్ని సృష్టించిన విధానంలో లోపముందని దీని భావమా? తనకు యథార్థంగా నిలిచివుండే వారినెవరినైనా దేవుడు భూమిపై కలిగి ఉంటాడా? సాతాను తిరుగుబాటును చూచిన యెహోవా కుమారులైన దేవదూతల విషయమేమిటి? ఆయన సార్వభౌమాధిపత్యం యొక్క యథార్థతను వాళ్లు ఉన్నతపరుస్తారా? స్పష్టంగా, ఈ విషయాలను సరిచేయడానికి సరిపడేంత సమయం కావాలి. అందుకే దేవుడు సాతానును మన దినంవరకూ జీవించివుండడానికి అనుమతించాడు.
ఆదాము హవ్వల విషయానికొస్తే, వారు అవిధేయత చూపించిన దినమందే, దేవుడు వారికి మరణశిక్ష విధించాడు. కాబట్టి మరణించే ప్రక్రియ ప్రారంభమైంది. ఆదాము హవ్వలు పాపం చేసిన తర్వాత, వారి సంతానములు తమ అపరిపూర్ణ తలిదండ్రులనుండి పాపమరణాలను వారసత్వంగా పొందారు.—రోమీయులు 5:14.
వివాదంలో సాతాను మొదటి యిద్దరు మానవులను తన పక్షమందు కలిగుండడంతో ప్రారంభించాడు. అతను తనకివ్వబడిన సమయాన్ని, ఆదాము సంతానపు వారందరినీ తన ఆధీనంలో ఉంచుకునేందుకు ప్రయత్నించడానికి ఉపయోగించుకున్నాడు. అనేకమంది దేవదూతలు తనతోపాటు తిరుగుబాటులో చేరేలా వారిని మోసగించడంలో కూడా అతను విజయం సాధించాడు. అయితే, దేవుని కుమారులైన దేవదూతలలో ఎక్కువమంది, యెహోవా పరిపాలన యొక్క నీతిని యథార్థంగా ఉన్నతపర్చారు.—ఆదికాండము 6:1, 2; యూదా 6; ప్రకటన 12:3, 9.
దేవుని పరిపాలనకు సాతాను పరిపాలనకు మధ్య వివాదం ఉంది, ఆ వివాదం యోబు దినాల్లో కూడా ఉంది. దేవుని భయముగల మనుష్యులైన హేబెలు, హనోకు, నోవహు, అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు మరియు యోసేపు యిదివరకే చేసినట్లు, ఈ నమ్మకమైన వ్యక్తి తను సాతాను యిచ్చే స్వాతంత్ర్యానికి బదులు దేవుని నీతియుక్తమైన పరిపాలననే ఎంచుకున్నానని తన ప్రవర్తన ద్వారా నిరూపించాడు. దేవుని యథార్థమైన దూతల ఎదుట పరలోకంలో జరిగిన ఒక సంభాషణలో యోబు ముఖ్య విషయమయ్యాడు. తన నీతియుక్తమైన పరిపాలనకు మద్దతుగా, దేవుడు సాతానుతో యిలా చెప్పాడు: “నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు, భూమిమీద అతనివంటివాడెవడును లేడు.”—యోబు 1:6-8.
అపజయాన్ని అంగీకరించడానికి నిరాకరిస్తూ సాతాను, యోబును దేవుడు వస్తుసంపదతో ఆశీర్వదించాడు గనుక, యోబు దేవున్ని కేవలం స్వార్థపూరిత కారణాలనుబట్టి మాత్రమే సేవిస్తున్నాడని ఆరోపించాడు. సాతాను యిలా నిందించాడు: “అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన యెడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును.” (యోబు 1:11) సాతాను యింకా కొంత ముందుకు పోయి, దేవుని సృష్టిప్రాణులందరి యథార్థతను కూడా ప్రశ్నించాడు. “తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును గదా,” అని అతను ఆరోపించాడు. (యోబు 2:4) కేవలం యోబు మాత్రమేకాదుగాని, పరలోకము, భూమిపైనున్న దేవుని నమ్మకమైన ఆరాధికులందరూ, అపనిందతో కూడిన ఈ ముట్టడిలో యిమిడివున్నారు. తమ జీవితాలు కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్లు యెహోవాతో తమకున్న సంబంధాన్ని వదులుకుంటారని సాతాను సూచించాడు.
యెహోవా దేవునికి యోబు యథార్థతయందు పూర్తి నమ్మకం ఉంది. ఆ విషయాన్ని రుజువుపరుస్తూ, యోబుపై మానవ బాధలను తీసుకురాడానికి ఆయన సాతానును అనుమతించాడు. తన యథార్థత ద్వారా యోబు తన స్వంత నామాన్ని కాపాడుకోడమేకాక, అతి ప్రాముఖ్యంగా యెహోవా సర్వాధిపత్యపు యథార్థతను ఉన్నతపర్చాడు. అపవాది అబద్ధికునిగా నిరూపించబడ్డాడు.—యోబు 2:10; 42:7.
అయితే, పరీక్ష ఎదుర్కొంటున్నప్పుడు యథార్థంగా ఉండటంలో యేసుక్రీస్తు శ్రేష్ఠమైన మాదిరి. దేవుడు తన కుమారుడైన దూత జీవాన్ని పరలోకంనుండి ఒక కన్యక గర్భానికి మార్చాడు. కాబట్టి యేసు, పాపాన్ని మరియు అసంపూర్ణతను సంతరించుకోలేదు. బదులుగా ఆయన పరిపూర్ణమైన వ్యక్తిగా, మొదటి మానవుడు తన పరిపూర్ణతను కోల్పోకమునుపు కలిగి ఉండిన స్థితినే కల్గివుండి పెరిగాడు. ఆయనపైకి అనేక శోధనలు, శ్రమలను తెస్తూ, చివరకు అవమానకరమైన మరణాన్ని తీసుకురావడంతో సాతాను యేసును ప్రత్యేకమైన గురిగా చేసుకున్నాడు. కాని సాతాను యేసు యథార్థతను కోల్పోయేలా చేయడంలో విఫలమయ్యాడు. యేసు తన తండ్రి పరిపాలన యొక్క యథార్థతను సంపూర్ణంగా ఉన్నతపర్చాడు. పరిపూర్ణ మానవుడైన ఆదాము సాతాను తిరుగుబాటులో చేరడానికి అతనికి ఏ సాకులూ లేవని నిరూపించాడు. ఆదాము తన అతి చిన్న పరీక్షలో నమ్మకంగా ఉండగలిగేవాడే.
యింకా ఏమికూడా నిరూపించబడింది?
ఆదాము, హవ్వల తిరుగుబాటు తర్వాత దాదాపు 6,000 సంవత్సరాలు మానవులు బాధలను అనుభవించారు. ఈ సమయంలో దేవుడు, వేర్వేరు రకాలైన అనేక ప్రభుత్వాలతో ప్రయత్నించమని మానవజాతికి సమయాన్ని అనుమతించాడు. మానవుడు తననుతాను పరిపాలించుకోలేడని మానవ బాధల ఘోరమైన చరిత్ర నిరూపిస్తుంది. వాస్తవానికి, యిప్పుడు భూమి యొక్క అనేక ప్రాంతాల్లో అరాజకత్వం ఉంది. సాతాను సమర్థించిన దేవునినుండి స్వేచ్ఛ, చాలా విపత్కరమైనది.
యెహోవా తనకుతాను ఏదీ నిరూపించుకోవాల్సిన అవసరంలేదు. తన పరిపాలనా పద్ధతి నీతియుక్తమైనదని, తన సృష్టి ప్రాణుల మేలు కొరకేనని ఆయనకు తెలుసు. అయితే, సాతాను తిరుగుబాటు ద్వారా లేవదీయబడిన ప్రశ్నలన్నిటికీ సంతృప్తిదాయకంగా జవాబు చెప్పడానికి, తన నీతియుక్తమైన పరిపాలనకు తమ ప్రాధాన్యతను చూపించడానికి ఆయన తన జ్ఞానవంతమైన సృష్టి ప్రాణులందరికీ అవకాశాన్ని కలిగించాడు.
దేవుని ప్రేమించి, ఆయనకు నమ్మకంగా ఉండడం వలన వచ్చే బహుమానాలు, అపవాది చేతుల్లో తాత్కాలికంగా అనుభవించే శ్రమలకంటే ఎంతో గొప్పవి. యోబు విషయం దీన్ని దృష్టాంతపరుస్తుంది. అపవాది యోబుపైకి తెచ్చిన అనారోగ్యాన్ని యెహోవా దేవుడు స్వస్థపర్చాడు. అంతేకాకుండా, “యోబునకు పూర్వము కలిగిన దానికంటె రెండంతలు అధికముగా” దేవుడు “అతనికి దయచేసెను.” చివరకు, 140 సంవత్సరాలు పొడిగింపబడిన జీవితాన్ని అనుభవించి, “యోబు కాలము నిండిన వృద్ధుడై మృతినొందెను.”—యోబు 42:10-16.
క్రైస్తవ బైబిలు రచయిత అయిన యాకోబు యిలా చెప్పడం ద్వారా, ఈ విషయంవైపుకు అవధానాన్ని మళ్లిస్తున్నాడు: “మీరు యోబు యొక్క సహనమునుగూర్చి విన్నారు. యెహోవా యిచ్చిన ప్రతిఫలాన్నిబట్టి యెహోవా ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలిసికొనియున్నారు.”—యాకోబు 5:11 NW, అథఃస్సూచి.
సాతాను, అతని లోకం యొక్క సమయం యిప్పుడు గతించింది. సాతాను తిరుగుబాటు మానవజాతిపైకి తెచ్చిన బాధలను దేవుడు త్వరలో తీసివేస్తాడు. మృతులు కూడా లేపబడతారు. (యోహాను 11:25) అప్పుడు యోబువంటి నమ్మకమైన వ్యక్తులకు పరదైసు భూమిపై నిత్యజీవాన్ని పొందగల అవకాశం లభిస్తుంది. దేవుడు తన సేవకులపై కుమ్మరించే ఈ భవిష్యత్తు ఆశీర్వాదాలు, ఆయన వాస్తవంగా “ఎంతో జాలియు కనికరమును” గలవాడైన నీతియుక్తమైన సర్వాధిపతియని ఆయనను ఎల్లప్పటికీ నిరూపిస్తాయి.
[అధస్సూచీలు]
a తొలి 20వ శతాబ్దపు న్యాయవాది, గ్రంథకర్త అయిన ఫిలిప్ మారో, “ది ఆరిజిన్ ఆఫ్ ఇవిల్” అనే తన చర్చలో యీ ప్రశ్నను పరిశీలించి, యిదే “మానవజాతి శ్రమలన్నిటికీ కారణమని” తేల్చి చెప్పాడు.
[8వ పేజీలోని బాక్సు/చిత్రం]
మానవుల క్రూరమైన దేవుళ్లు
పురాతన దేవుళ్లు తరచూ రక్తపిపాసన, కామాతురతగల వారిగా చిత్రీకరించబడేవారు. వారిని శాంతింపజేసేందుకుగాను, తలిదండ్రులు తమ పిల్లలను సహితం మంటల్లో సజీవంగా వేసి దహించేవారు. (ద్వితీయోపదేశకాండము 12:31) మరో విపరీత విషయమేమిటంటే, దేవునికి కోపం లేక జాలి వంటి భావాలు లేవని అన్యమత వేదాంతులు బోధించారు.
ఈ వేదాంతులు కల్గివున్న దయ్యాల ప్రేరేపితమైన దృక్పథాలు దేవుని ప్రజలమని చెప్పుకుంటున్న యూదులను కూడా ప్రభావితం చేశాయి. యేసుకు సమకాలికుడైన యూదా వేదాంతియైన ఫిలో, దేవునికి “భావాల వంటివేవీ లేనే లేవని” నొక్కి చెప్పాడు.
కఠినమైన యూదా మత విభాగమైన పరిసయ్యులు సహితం గ్రీకు వేదాంత ప్రభావాన్ని తప్పించుకోలేకపోయారు. మానవ శరీరంలో చిక్కుకుని ఉన్న ఓ అమర్త్యమైన ఆత్మతో మానవుడు తయారు చేయబడ్డాడనే ప్లూటో బోధలను వారు స్వీకరించారు. అంతేకాకుండ, మొదటి శతాబ్దపు చరిత్రకారుడైన జోసిఫస్ ప్రకారం, దుష్ట ప్రజల ఆత్మలు “నిత్య శిక్షను అనుభవిస్తాయని” పరిసయ్యులు నమ్మేవారు. అయితే, బైబిలు మాత్రం అలాంటి దృక్పథానికి ఏ ఆధారాన్నివ్వడం లేదు.—ఆదికాండము 2:7; 3:19; ప్రసంగి 9:5; యెహెజ్కేలు 18:4.
యేసు అనుచరుల విషయమేమిటి? అన్యమత వేదాంతుల చేత ప్రభావితమయ్యేలా వారు తమ్మును తాము అనుమతించుకున్నారా? ఈ అపాయాన్ని గుర్తించి, అపొస్తలుడైన పౌలు తన తోటి క్రైస్తవులను యిలా హెచ్చరించాడు: “ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును, అనగా ఈ లోకసంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వ జ్ఞానముచేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడెవడైన ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి.”—కొలొస్సయులు 2:8; 1 తిమోతి 6:20 కూడా చూడండి.
విచారకరంగా, రెండు, మూడు శతాబ్దాలకు చెందిన నామకార్థ క్రైస్తవ అధ్యక్షుల్లో అనేకమంది ఆ హెచ్చరికను అలక్ష్యంచేసి, దేవునికి భావాలే లేవని బోధించారు. ది ఎన్సైక్లోపీడియా ఆఫ్ రెలిజియన్ యిలా పేర్కొంది: “మొత్తానికి, అవి యూదా మరియు తత్వ శాస్త్ర సంబంధిత తలంపులు గల కాలమందు ధృవపర్చబడినట్లుగానే దేవుని గుణాలు అర్థమయ్యాయి. . . . దేవుడైన తండ్రికి జాలి వంటి భావాలు ఉంటాయనే ఆలోచన . . . ఇరవైయ్యవ శతాబ్దం వరకూ కూడా సామాన్యంగా అంగీకరించదగనిదిగా పరిగణించబడేది.”
అలా, క్రైస్తవమత సామ్రాజ్యం, పాపులను నిరంతరం సజీవంగా హింసించే క్రూరమైన దేవుళ్లను గూర్చిన అబద్ధ బోధను అంగీకరించింది. మరోవైపు యెహోవా దేవుడు, తన వాక్యమైన బైబిల్లో “పాపము వలన వచ్చు జీతము మరణ”మేగానీ నిరంతరం సజీవంగా హింసించబడ్డం కాదని స్పష్టంగా చెబుతున్నాడు.—రోమీయులు 6:23.
[క్రెడిట్ లైను]
Above: Acropolis Museum, Greece
Courtesy of The British Museum
[7వ పేజీలోని చిత్రం]
భూమిని ఏదెనువంటి పరదైసుగా మార్చాలన్న దేవుని సంకల్పం నెరవేర్చబడుతుంది!