ఈ సువార్త ముందుగా ప్రకటింపబడవలెను
“సకల జనములకు సువార్త ముందుగా ప్రకటింపబడవలెను.”—మార్కు 13:10.
1, 2. సాక్షుల గుర్తింపు చిహ్నం ఏమిటి, ఎందుకు?
యెహోవాసాక్షులు ఎందుకు అంత పట్టువిడువకుండా ప్రకటిస్తారు? నిజంగా, అది ఇంటింటి సేవయైనా, వీధి సాక్ష్యమైనా, లేక తటస్థ సాక్ష్యమైనా, మనం కచ్చితంగా మన బహిరంగ పరిచర్యను బట్టి ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందాము. ప్రతి అనుకూల సందర్భంలోను మనల్ని మనం సాక్షులుగా తెలియజేసుకుని, మనకు సంపదగావున్న సువార్తను నేర్పుగా అందజేయడానికి ప్రయత్నిస్తాము. వాస్తవానికి, ఈ పరిచర్య మన గుర్తింపు చిహ్నం అని చెప్పగలము!—కొలొస్సయులు 4:6.
2 ఒకసారి దీని గురించి ఆలోచించండి—తమ బ్యాగ్‌లను పట్టుకుని తగిన దుస్తులు ధరించిన స్త్రీ పురుషులను, పిల్లలను తమ ఇరుగుపొరుగున చూసినప్పుడు, సాధారణంగా ప్రజల మొట్టమొదటి తలంపు ఏమిటి? ‘అదిగో, కాథోలిక్‌లు (లేక ఆర్థడాక్స్ సభ్యులు) వస్తున్నారు!’ లేక, ‘అదిగో పెంతెకొస్తువారు (లేక బాప్టిస్టువారు) వస్తున్నారు!’ అని అనుకుంటారా? లేదు. అలాంటి మతాలలో కుటుంబాలన్నీ కలిసి ఇంటింటి పరిచర్యలో పాల్గొనడం లేదని ప్రజలకు తెలుసు. బహుశా కొన్ని మత గుంపులు కొంతమంది “మత ప్రచారకులను” కొన్ని ప్రాంతాలకు రెండు సంవత్సరాల కాలనిడివి కొరకు పంపిస్తారు, కాని వారి సభ్యులు మాత్రం అలాంటి ఏ పరిచర్యలోనూ పాల్గొనరు. ప్రతి అనుకూల సందర్భంలోను తమ సందేశాన్ని ఇతరులకు అందజేయడంలో తమ ఆసక్తిని బట్టి కేవలం యెహోవాసాక్షులు మాత్రమే ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపబడ్డారు. వారు తమ కావలికోట మరియు తేజరిల్లు! పత్రికల ద్వారా సుపరిచితులే.—యెషయా 43:10-12; అపొస్తలుల కార్యములు 1:8.
క్రైస్తవమత సామ్రాజ్య మతనాయకులకు భిన్నంగా
3, 4. సమాచార మాధ్యంలో క్రైస్తవమత సామ్రాజ్య మత నాయకులు తరచూ ఎలా వర్ణించబడుతున్నారు?
3 పూర్తి భిన్నంగా, వార్తా నివేదికలు ఎన్నోసార్లు కొన్ని దేశాల్లోని అనేకమంది మత నాయకులను పిల్లలతో లైంగిక సంబంధాన్ని కలిగి ఉండేవారిగా, అవినీతిపరులైన వంచకులుగా, మోసగాళ్లుగా బయల్పర్చాయి. వారి శరీరకార్యాలు, వారి అతి విలాసవంతమైన జీవన విధానాలు అందరికి కనిపించేలా ఉన్నాయి. దీన్ని ఒక ప్రఖ్యాత గీత రచయిత “తన దూరదర్శిని కార్యక్రమంలో యేసు రోలెక్స్ [అతి విలువైన బంగారు గడియారము] ధరిస్తాడా?” అనే తన పాటలో చక్కగా వ్యక్తపర్చాడు. ఆయన యిలా ప్రశ్నిస్తాడు: “యేసు మళ్లీ భూమిపైకి తిరిగివస్తే ఆయన రాజకీయాల్లో ఉంటాడా? పామ్ స్ప్రింగ్స్‌లో [ఒక సంపన్నవంతమైన కాలిఫోర్నియా సమాజము] తన రెండవ ఇంటిని కలిగివుండి, తన సంపదను దాచుకోడానికి ప్రయత్నిస్తాడా?” యాకోబు చెప్పిన ఈ మాటలు ఎంత సరైనవి, “మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై వధదినమునందు మీ హృదయములను పోషించుకొంటిరి.”—యాకోబు 5:5; గలతీయులు 5:19-21.
4 మత నాయకులు రాజకీయ నాయకులతో కలిసి తిరగడం, రాజకీయ అభ్యర్థులుగా ఎన్నికల్లో కూడా పాల్గొనడం వారు ఆధునిక దిన శాస్త్రులు, పరిసయ్యులని వెల్లడి చేస్తున్నాయి. అదే సమయంలో, అమెరికా, కెనడా వంటి దేశాల్లో పిల్లలు మరియు పెద్దలతో మత నాయకుల విచ్చలవిడి ప్రవర్తన మూలంగా దాఖలైన వ్యాజ్యాలు, తీర్పుల కొరకైన అధిక వ్యయాల నిమిత్తం మతం యొక్క ధనం ఖర్చైపోతున్నది.—మత్తయి 23:1-3.
5. క్రైస్తవమత సామ్రాజ్య మతనాయకులు “నమ్మకమైనవాడును, బుద్ధిమంతుడునైన దాసునిగా” ఎందుకు నిరూపించబడలేదు?
5 తగినరీతిగా, యేసు తన కాలంనాటి మత నాయకులకు యిలా చెప్పగలిగాడు: “అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నముకొట్టిన సమాధులను పోలియున్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడును గాని లోపల చచ్చినవారి యెముకలతోను సమస్త కల్మషముతోను నిండియున్నవి. ఆలాగే మీరు వెలుపల మనుష్యులకు నీతిమంతులుగా నగపడుచున్నారు గాని, లోపల వేషధారణతోను అక్రమముతోను నిండి యున్నారు.” అందుచేత, దేవుడు క్రైస్తవమత సామ్రాజ్య మతనాయకులకు, వారు కాథోలిక్కులైనా, ప్రొటెస్టెంటులైనా, ఆర్థడాక్స్వారైనా, లేక ఏ మతశాఖకు చెందిన వారైనా సువార్త ప్రకటించే పనిని అప్పగించలేదు. ప్రవచింపబడిన “నమ్మకమైన వాడును బుద్ధిమంతుడునైన దాసుని”గా వారు నిరూపించుకోలేదు.—మత్తయి 23:27, 28; 24:45-47.
సువార్తను ఎందుకు మొదట ప్రకటించాలి?
6. త్వరలోనే ఏ సంఘటనలు జరుగవలసి ఉన్నవి?
6 జనాంగములకు సువార్త ప్రకటించమన్న యేసు ఆజ్ఞను గూర్చిన తన సంక్షిప్త వివరణలో, కేవలం మార్కు మాత్రమే “మొదట” అనే పదాన్ని ఉపయోగించాడు. (మార్కు 13:10; మత్తయి 24:14 పోల్చండి.) జె. బి. ఫిలిప్స్ అనువాదం యిలా ఉంది: “అంతము రాకముందు సువార్త అన్ని జనాంగాలకు ప్రకటించబడాలి.” “మొదట” అనే పదం యొక్క క్రియావిశేషణ ఉపయోగం ప్రపంచవ్యాప్త సువార్త పని తర్వాత ఇతర సంఘటనలు జరుగుతాయని సూచిస్తుంది. ఆ సంఘటనల్లో వాగ్దానం చేయబడిన మహా శ్రమలు, నూతన లోకంపై క్రీస్తుయొక్క నీతియుక్తమైన పరిపాలన చేరివుంటాయి.—మత్తయి 24:21-31; ప్రకటన 16:14-16; 21:1-4.
7. సువార్త మొదట ప్రకటింపబడాలని దేవుడు ఎందుకు కోరుతున్నాడు?
7 కాబట్టి సువార్త మొదట ప్రకటించబడాలని దేవుడు ఎందుకు కోరుతున్నాడు? ఒక కారణం ఏమిటంటే, ఆయన ప్రేమ, న్యాయము, జ్ఞానము, శక్తి గల దేవుడు. మత్తయి 24:14 మరియు మార్కు 13:10 నందు వ్రాయబడిన యేసు మాటల నెరవేర్పులో, యెహోవా యొక్క ఈ గుణాల ప్రభావవంతమైన వ్యక్తీకరణను మనం చూడవచ్చు. వాటిని మనం ఒకదాని తర్వాత ఒకటి క్లుప్తంగా పరిశీలించి, అవి సువార్త ప్రకటించబడడానికి ఎలా సంబంధాన్ని కలిగి ఉన్నాయో చూద్దాము.
సువార్త మరియు యెహోవా ప్రేమ
8. సువార్త ప్రకటించబడడమనేది ఎలా దేవుని ప్రేమను స్పష్టంచేసేదై ఉంది? (1 యోహాను 4:7-16)
8 సువార్త ప్రకటించడం దేవుని ప్రేమను ఎలా ప్రతిబింబిస్తుంది? మొట్టమొదటిదిగా, అది ప్రత్యేకంగా ఒక జాతి లేక వర్గం వారికొరకు ఉద్దేశింపబడిన వర్తమానము కాదు. అది “సకల జనముల”కు సువార్త. దేవుడు మానవ కుటుంబాన్ని ఎంతో ప్రేమించాడు గనుకనే, ఆయన తన అద్వితీయ కుమారున్ని కేవలం ఒక జాతి కొరకు కాదుగాని, మానవ జాతి అంతటి పాపాల నిమిత్తం విమోచన బలిగా ఉండుటకు భూమిపైకి పంపించాడు. అపొస్తలుడైన యోహాను యిలా వ్రాశాడు: “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకేగాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడాయనను లోకములోనికి పంపలేదు.” (యోహాను 3:16, 17) నిశ్చయంగా, శాంతి, సామరస్యం, న్యాయం నెలకొని ఉండే నూతన లోకాన్ని వాగ్దానం చేసే సమాచారం దేవుని ప్రేమకు నిదర్శనమై ఉంది.—2 పేతురు 3:13.
సువార్త మరియు యెహోవా శక్తి
9. సువార్త ప్రకటించడానికి క్రైస్తవమత సామ్రాజ్యం యొక్క శక్తివంతమైన మతాలను యెహోవా దేవుడు ఎందుకు ఉపయోగించుకోలేదు?
9 సువార్త ప్రకటింపబడటంతో యెహోవా శక్తి ఎలా వ్యక్తపర్చబడుతుంది? ఈ విషయాన్ని పరిశీలించండి, ఈ పనిని చేయడానికి ఆయన ఎవరిని ఉపయోగించుకున్నాడు? రోమను కాథోలిక్ చర్చి లేక ప్రముఖ ప్రొటెస్టెంటు మతశాఖ వంటి అత్యంత శక్తివంతమైన మత సంస్థలనా? కాదు, వారు రాజకీయాల్లో యిమిడి ఉండడం వారిని ఈ పనికి అనర్హులను చేస్తుంది. (యోహాను 15:19; 17:14; యాకోబు 4:4) వారి సంబంధిత సంపదగాని, ప్రత్యేక పరిపాలక వర్గంతో వారికున్న సంబంధాలుగాని, ప్రాబల్యం గాని, వారి సాంప్రదాయబద్ధమైన వేదాంతంగాని యెహోవాను ప్రీతిపర్చలేదు. దేవుని చిత్తం నెరవేర్చబడడానికి మానవ శక్తి అవసరం కాలేదు.—జెకర్యా 4:6.
10. ప్రకటన పనిచేయడానికి దేవుడు ఎవరిని ఎంచుకున్నాడు?
10 అది అపొస్తలుడైన పౌలు కొరింథు సంఘానికి తాను వ్రాసిన లేఖలో చెప్పిన విధంగా ఉంది: “సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను, ఘనులైనను, గొప్పవంశమువారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరియు దేవుని యెదుట అతిశయింపకుండునట్లు, జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములోనుండు వెఱ్ఱివారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైనవారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు. ఎన్నికైనవారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైనవారిని, తృణీకరింపబడినవారిని, ఎన్నికలేనివారిని దేవుడు ఏర్పరచుకొని యున్నాడు.”—1 కొరింథీయులు 1:26-29.
11. సాక్షులను గూర్చిన ఏ వాస్తవాలు వారిని సాటిలేని వారిగా చేశాయి?
11 యెహోవాసాక్షుల సంస్థలో చాలా తక్కువమంది సంపన్నవంతమైన సభ్యులు ఉన్నారు, రాజకీయపరంగా శక్తిగలవారు నిశ్చయంగా లేరు. రాజకీయ విషయాల్లో వారి కచ్చితమైన తటస్థత అంటే వారు రాజకీయపరమైన ప్రభావాన్ని ప్రదర్శించలేరని భావము. దానికి భిన్నంగా, ఈ 20వ శతాబ్దంలో తరచూ వారు మత, రాజకీయ నాయకుల అవమానకరమైన హింసకు గురయ్యారు. అయినా, నాసిజమ్, ఫాసిజమ్, కమ్యూనిజమ్, నేషనలిజమ్ మరియు అబద్ధమతాల అనుచరులచే వారికి వ్యతిరేకత ఎదురైనప్పటికీ, సాక్షులు ప్రపంచమంతటా సువార్తను ప్రకటించడమే కాకుండా, సంఖ్యలో కూడా వారు అత్యధికంగా వృద్ధి అయ్యారు.—యెషయా 60:22.
12. సాక్షులు ఎందుకు విజయవంతులౌతున్నారు?
12 సాక్షులు తమ విజయానికి మూలం ఏదని చెబుతారు? యేసు తన శిష్యులకు ఇలా వాగ్దానం చేశాడు: “అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశములయందంతటను భూదిగంతముల వరకును, నాకు సాక్షులైయుందురు.” కాబట్టి, వారి విజయానికి కచ్చితమైన మూలం ఏమిటి? “పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు” అని యేసు చెప్పాడు. అలాగే నేడు, మానవ సామర్థ్యం కాదుగాని, దేవుని నుండి వచ్చిన శక్తి సాక్షుల ప్రపంచ వ్యాప్త పరిచర్య నందలి వారి విజయానికి కీలకము. ప్రజలలో బలహీనులైన వారిని ఉపయోగించుకోవడం ద్వారా, దేవుడు చరిత్రలోకెల్లా అత్యంత గొప్ప విద్యాపని జరిగేలా చూస్తున్నాడు.—అపొస్తలుల కార్యములు 1:8; యెషయా 54:13.
సువార్త మరియు యెహోవా జ్ఞానము
13. (ఎ) సాక్షులు ఎందుకు స్వచ్ఛందంగా, జీతం తీసుకోకుండా సేవచేస్తారు? (బి) సాతాను ఆరోపణకు యెహోవా ఎలా సమాధానమిచ్చాడు?
13 సువార్త స్వచ్ఛంద సేవకులచే ప్రకటించబడుతుంది. యేసు యిలా చెప్పాడు, “ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయ్యుడి.” (మత్తయి 10:8) కాబట్టి, దేవున్ని సేవిస్తున్నందుకు యెహోవాసాక్షులెవరూ జీతము పుచ్చుకొనుటలేదు, జీతము కావాలని వారు ఆశించరు. వాస్తవానికి, వారు తమ కూటాలలో చందాలు కూడా వసూలు చేయరు. తనను నిందించువాడైన అపవాదియగు సాతానుకు దేవుడు సమాధానమిచ్చులాగున, తాము దేవునికి చేస్తున్న నిస్వార్థ సమర్పిత సేవ ద్వారా వారు సంతోషిస్తారు. దేవునికి వ్యతిరేకియైన ఈ ఆత్మీయ ప్రాణి మానవులు నిస్వార్థ దృక్పథంతో దేవున్ని సేవించరని అన్నాడు. లక్షలాదిమంది నమ్మకస్థులైన క్రైస్తవ సాక్షులు సువార్తను ఇంటింటికి, వీధుల్లో, తటస్థంగా ప్రకటించడాన్నిబట్టి యెహోవా తన జ్ఞానముతో సాతాను నిందలకు తిరుగులేని సమాధానమిచ్చాడు.—యోబు 1:8-11; 2:3-5; సామెతలు 27:11.
14. పౌలు సూచించిన ‘మరుగైయున్న జ్ఞానము’ ఏది?
14 సువార్త ప్రకటింపబడనిచ్చుటలో దేవుని జ్ఞానాన్ని గూర్చిన మరో నిదర్శనమేమంటే, రాజ్య వాగ్దానం దానంతట అదే దేవుని జ్ఞానాన్ని స్పష్టం చేయడమే. అపొస్తలుడైన పౌలు యిలా వ్రాశాడు: “పరిపూర్ణులైనవారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము, అది యీ లోక జ్ఞానము కాదు, నిరర్థకులై పోవుచున్న యీ లోకాధికారుల జ్ఞానమును కాదుగాని దేవుని జ్ఞానము పరిశుద్ధ మర్మమైనట్టుగా బోధించుచున్నాము; ఈ జ్ఞానము మరుగైయుండెను. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను.” ఆ “మరుగైయున్న జ్ఞానము (NW)” ఏదేనులో ప్రారంభమైన తిరుగుబాటును అంతం చేయుటకు దేవుడు ప్రయోగించిన ఆయన వివేకవంతమైన పద్ధతిని సూచిస్తుంది. దేవుని రాజ్య సువార్తకు కేంద్రమైవున్న యేసుక్రీస్తు నందు ఆ పరిశుద్ధ మర్మము యొక్క జ్ఞానము బయల్పర్చబడింది.a—1 కొరింథీయులు 2:6, 7; కొలొస్సయులు 1:26-28.
సువార్త మరియు దేవుని న్యాయము
15. యెహోవా న్యాయముగల దేవుడని మనకెలా తెలుసు? (ద్వితీయోపదేశకాండము 32:4; కీర్తన 33:5)
15 ప్రాముఖ్యంగా, న్యాయానికి సంబంధించి మార్కు 13:10 నందు “మొదట” అనే పదం యొక్క ప్రాముఖ్యతను చూస్తాము. న్యాయానికి కృపావాత్సల్యం జత చేయబడిన దేవుడు యెహోవా. ఆయన తన ప్రవక్తయైన యిర్మీయా ద్వారా యిలా చెప్పాడు: “అతిశయించువాడు దేనినిబట్టి అతిశయింపవలెననగా, భూమిమీద కృపచూపుచు నీతిన్యాయములు జరిగించుచునున్న యెహోవాను నేనేయని గ్రహించి నన్ను పరిశీలనగా తెలిసికొనుటనుబట్టియే అతిశయింపవలెను; అట్టి వాటిలో నేనానందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు.”—యిర్మీయా 9:24.
16. న్యాయం నిమిత్తం మొదట హెచ్చరించడం అవసరమని ఎలా వివరించవచ్చు?
16 సువార్తను ప్రకటించడానికి సంబంధించి యెహోవా న్యాయం ఎలా చూపబడింది? అతిథులు వచ్చినప్పుడు సాయంత్రము తినటానికి రుచికరమైన చాక్లెట్ కేక్ చేసిన ఒక తల్లితో దాన్ని మనం పోల్చి చూద్దాము. దాన్ని ఎప్పుడు తినాలి అనే ఒక్కమాట కూడా చెప్పకుండా ఆమె దాన్ని వంటగది బల్లపై ఉంచినట్లైతే, సహజంగా పిల్లల ఇష్టం ఏమైయుంటుంది? మనమందరం ఒకప్పుడు పిల్లలమే! ఓ చిన్ని వ్రేలు ఆ కేకు రుచి చూడాలని ఆరాటపడుతుంది! ఈ విషయంలో తల్లి ఇవ్వవలసిన హెచ్చరికను ఇవ్వకపోతే, క్రమశిక్షణలో పెట్టడానికి ఆమెకు బలమైన ఆధారం ఉండదు. అయితే, ఆ కేకు అతిథులు వచ్చిన తర్వాత తినాలి గనుక దాన్ని అంతవరకు ముట్టకూడదు అని స్పష్టంగా చెప్పి ఉన్నట్లైతే, ఆమె స్పష్టమైన హెచ్చరిక చేసినదౌతుంది. ఆ తర్వాత అవిధేయత చూపితే, ఆమె దృఢమైన, తగిన చర్య గైకొనుటకు హక్కును కలిగి ఉంటుంది.—సామెతలు 29:15.
17. యెహోవా 1919 నుండి ఒక ప్రత్యేకమైన విధంగా న్యాయాన్ని ఎలా వ్యక్తపర్చాడు?
17 యెహోవా కూడా తన న్యాయాన్ని బట్టి, అవసరమైన హెచ్చరిక మొదట ఇవ్వకుండా ఈ దుష్ట విధానంపై న్యాయపరమైన చర్య గైకొనడు. కాబట్టి, ప్రాముఖ్యంగా 1919 నుండి, మొదటి ప్రపంచ యుద్ధం “వేదనలను” తెచ్చినప్పటి నుండి, యెహోవా తన సాక్షులు భూవ్యాప్తంగా ఆసక్తితో సువార్త ప్రకటించులాగున చేశాడు. (మత్తయి 24:7, 8, 14) ఈ సాటిలేని హెచ్చరిక మాకు తెలియదని జనాంగాలు న్యాయంగా చెప్పలేవు.
సువార్త ప్రపంచ వ్యాప్తంగా ఎంత విస్తృతంగా ప్రకటించబడింది?
18. (ఎ) సుదూర ప్రాంతాల్లో సాక్షుల పనిని గూర్చి ఏ నిదర్శనం ఉంది? (బి) మీకు మరే యితర ఉదాహరణలు తెలుసు?
18 ఈ ప్రపంచవ్యాప్త విద్యాపని యొక్క ప్రభావాన్ని గూర్చిన సూచనను మనం లాస్ట్ ప్లేసెస్—ఎ జర్నీ ఇన్ ది నార్త్ అనే పుస్తకంలో చూడవచ్చు. దాని రచయిత స్కాట్లాండ్కు ఉత్తరంగా ఉన్న షెట్లాండ్ ద్వీపాలలో ఒకటైన ఫౌలా ప్రత్యేకించబడిన ద్వీపం కొరకు సముద్ర చార్టులను పరిశీలించినప్పుడు, “ద్వీపం చుట్టూ WKS (ఓడల శిథిలాలు), RKS (శిలలు), LDGS (ఒడ్డున ఉన్న బండరాళ్లు), OBS (ప్రతిబంధకాలు) ఉన్నట్లు” చార్టులు సూచించాయి. ఈ సూచనలు “రాబోయే నావికున్ని దూరంగా ఉండమని హెచ్చరించాయి. ఫౌలాను ఆవరించివున్న జలాలు ప్రేలుడు పదార్థములతో నిండివున్నాయి. పడవ విహారానికి వచ్చేవారు, యాత్రికులు, చివరికి ఇంగ్లాండు రాణి యొక్క ప్రజా నిర్మాణపనుల శాఖ వారు కూడా అక్కడ ఉండలేని విధంగా అవి చేశాయి కాని—కొన్ని రోజుల్లో నేను తెలుసుకున్నదేమిటంటే అవి యెహోవాసాక్షులను మాత్రం ఆపలేక పోయాయి.” ఆయనిలా కొనసాగించాడు: “వారు మత మార్పిడి చేసుకునే వారి కొరకు పెద్ద నగరాల మురికివాడలను, అలీన దేశాలను ఎలా బాగా వెదికారో అలాగే సుదూర ఫౌలాలో కూడా వారు తమ విశ్వాసానికి మారేవారి కొరకు వెదికారు.” కొన్ని నెలల క్రితం అండ్రూ అనే స్థానిక నివాసి గడప వద్ద కావలికోట పత్రిక ఉంచబడినట్లు ఆయన చెప్పాడు. ఆయన యింకా యిలా చెప్పాడు: “ఒక వారం తర్వాత ఫెయిరోస్లో [ఉత్తర సముద్ర ద్వీపాలు] నేను [డానిష్ భాషలో తేజరిల్లు!] పత్రికను చూశాను, రెండునెలల తర్వాత గ్రీన్లాండ్ నందలి నాక్‌లో [గాడ్తాబ్ అని కూడా పిలువబడే పట్టణం] [డానిష్ భాషలో కావలికోట] పత్రికను చూశాను.” ఆ ఉత్తర ప్రాంతాల్లో ఆసక్తితో కూడిన యెహోవాసాక్షుల పనికి ఎంతటి గొప్ప సాక్ష్యం!
ప్రకటించే పనిని కొనసాగించడానికి సాక్షులను ఏది పురికొల్పుతుంది?
19, 20. (ఎ) ప్రకటించడంలో కొనసాగడానికి యెహోవాసాక్షులను ఏది ప్రేరేపిస్తుంది? (బి) ఏ ప్రశ్నలకు తర్వాత సమాధానమివ్వబడుతుంది?
19 ఒకరు ఎన్ని సంవత్సరాల నుండి సాక్షిగా ఉన్నప్పటికీ, ఇంటింటికి వెళ్లి కొత్త వారికి ప్రకటించడం సుళువైన పనేమి కాదు. మరి ఈ క్రైస్తవులు పనిలో కొనసాగడానికి ఏది సహాయపడుతుంది? వారి క్రైస్తవ సమర్పణ, బాధ్యతగా భావించే వారి దృక్పథము. పౌలు యిలా వ్రాశాడు: “నేను సువార్తను ప్రకటించుచున్నను నాకు అతిశయకారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నామీద మోపబడియున్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపక పోయినయెడల నాకు శ్రమ.” నిజ క్రైస్తవుల వద్ద జీవమనే సందేశం ఉంది, గనుక దాన్ని వారెలా తమ వద్దనే వుంచుకోగలరు? ప్రమాద సమయంలో హెచ్చరించ లేకపోవడం రక్తాపరాధాన్ని తెస్తుందనే సూత్రమే సువార్త ప్రకటించడానికి వారిని ప్రేరేపించే కారణము.—1 కొరింథీయులు 9:16; యెహెజ్కేలు 3:17-21.
20 అయితే, ఈ సువార్త ఎలా ప్రకటించబడుతుంది? సాక్షుల విజయానికి కీలకం ఏమిటి? వారిది నిజమైన మతం అని గుర్తించడానికి వారి పరిచర్య మరియు సంస్థ యొక్క ఏ అంశాలు సహాయపడతాయి? మా తదుపరి శీర్షిక ఈ ప్రశ్నలకు సమాధానమిస్తుంది.
[అధస్సూచీలు]
a దేవుని జ్ఞానం మరియు “పరిశుద్ధ మర్మాన్ని,” గూర్చిన మరింత వివరణ కొరకు వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటి ఆఫ్ న్యూయార్క్, వారు ప్రచురించిన ఇన్సైట్ ఆన్ ది స్క్రిప్చ్‌ర్స్, సంపుటి II, 1190 పేజీని చూడండి.
మీకు జ్ఞాపకం ఉన్నాయా?
◻ మతగురువుల నుండి యెహోవాసాక్షులను ఏది వేరు చేస్తుంది?
◻ ప్రకటించడం దేవుని ప్రేమ, శక్తి, జ్ఞానములను ఎలా ప్రతిబింబిస్తుంది?
◻ సువార్తను ప్రకటించడం దేవుని న్యాయాన్ని ఎలా ప్రతిబింబిస్తుంది?
◻ యెహోవాసాక్షులు తమ పరిచర్యను కొనసాగించేలా ఏది చేస్తుంది?
[15వ పేజీలోని చిత్రం]
ప్రజలు ఎంత ప్రత్యేకించబడిన ప్రదేశంలో ఉన్నా, యెహోవాసాక్షులు వారిని చేరాలని కోరుకుంటారు