విభేదాలను మీరు ఎలా పరిష్కరిస్తారు?
నేర్పులేని ఒక కదలిక వల్ల అలమరాలో నేర్పుతో అమర్చబడిన ఐదు పింగాణి ఏనుగుల వరుసలోని మూడవ ఏనుగు క్రింద పడిపోయింది. దాన్ని మళ్లీ దాని స్థానంలో ఉంచాలి. లేదా ఆ ఏనుగుల వరుసంతటి సమరూపం దెబ్బతింటుంది. అయితే, అది ఎంతో సున్నితమైన క్రియ, ఆ పని చేసే సామర్థ్యము మీకు ఉందని మీరు భావించరు. మరొకరి నుండి సలహా తీసుకోవాలి లేదా ఆ పని చేయమని నిపుణుడిని ఆశ్రయించాలి.
కేవలం అలంకార వస్తువులైన వాటి కంటే ఆత్మీయ సహోదర సహోదరీల మధ్య ఉండే ఐక్యత ఎంతో విలువైనది. అందుకే కీర్తనల రచయిత తగిన విధంగానే ఇలా పాడాడు: “సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు! ఎంత మనోహరము!” (కీర్తన 133:1) తోటి క్రైస్తవునితో వివాదాన్ని పరిష్కరించుకోవడం కొన్నిసార్లు ఒక సున్నితమైన విషయం కాగలదు అంతేగాక, కొందరు దీన్ని చేయవలసిన సరైన విధానాన్ని అనుసరించరు. తరచూ “పూర్వ స్థితికి రావడం” అనవసరంగా బాధాకరంగా లేక అంత పటుత్వం లేనిదిగా చూడనసహ్యమైన కళంకాలను మిగులుస్తుంది.
కొందరు క్రైస్తవులు తమంతట తాము పరిష్కరించుకోగల విషయాల్లోకి కూడా నియమిత పెద్దలను అనవసరంగా ఇమడ్చడానికి ప్రయత్నిస్తారు. ఏమి చేయాలో వారికి సరిగ్గా తెలియదు గనుక వారలా చేస్తుండవచ్చు. బైబిలు ఉపదేశం ఇవ్వడంలో అనుభవం గల ఒక సహోదరుడు ఇలా వ్యాఖ్యానించాడు: “మన సహోదరులలో చాలామందికి తమ విభేదాలను పరిష్కరించుకోడానికి బైబిలు ఉపదేశాన్ని ఎలా అన్వయించుకోవాలో తెలియదు. తరచూ వారు యేసు అవలంభించిన పద్ధతిని అవలంభించరు.” కాబట్టి, ఒక క్రైస్తవుడు తన సహోదరునితో విభేదాలను ఎలా పరిష్కరించుకోవాలి అనే దానిని గురించి యేసు వాస్తవంగా ఏమి చెప్పాడు? ఈ ఉపదేశాన్ని బాగా అర్థం చేసుకొని, దాన్ని ఎలా అన్వయించుకోవాలో నేర్చుకోవడం ఎందుకు ప్రాముఖ్యము?
చిన్న చిన్న విభేదాలు
“కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము నర్పించుచుండగా నీమీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చినయెడల అక్కడ బలిపీఠము నెదుటనే నీ యర్పణము విడిచిపెట్టి, మొదట వెళ్లి నీ సహోదరునితో సమాధానపడుము; అటు తరువాత వచ్చి నీ యర్పణము నర్పింపుము.”—మత్తయి 5:23, 24.
యేసు ఆ మాటలు చెప్పినప్పుడు, యెరూషలేము ఆలయ బలిపీఠము నొద్ద యూదులు ఆచారంగా బలులు అర్పించేవారు, లేక అర్పణములు తెచ్చేవారు. ఒక యూదుడు తోటి ఇశ్రాయేలీయుని యెడల తప్పిదము చేసిన యెడల, తప్పు చేసినవాడు దహన బలిని లేక పాపపరిహారార్థబలిని అర్పించాలి. యేసు చెప్పిన ఉదాహరణ మంచి కీలకదశకు ముడిపెట్టబడింది. ఒక వ్యక్తి బలిపీఠము వద్ద ఉండి, దేవునికి తన అర్పణమును అర్పించనైయుండగా, తన సహోదరునికి తనకు వ్యతిరేకంగా ఏదో వివాదం ఉన్నదని జ్ఞాపకం వస్తుంది. అవును, అలాంటి మతసంబంధ పనిని చేయడం కంటే తన సహోదరునితో ఐక్యత కలిగి ఉండడం ప్రాముఖ్యమైనదని ఇశ్రాయేలీయుడు గ్రహించవలసిన అవసరత ఉంది.
అలాంటి బలులు మోషే ధర్మశాస్త్రం ప్రకారం అవసరమైనప్పటికీ, దేవుని దృష్టిలో వాటిమట్టుకు అవే ఎక్కువ విలువైనవి కావు. ప్రవక్తయైన సమూయేలు అపనమ్మకస్థుడైన రాజగు సౌలుతో ఇలా చెప్పాడు: “తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించునట్లు, ఒకడు దహనబలులను బలులను అర్పించుటవలన ఆయన సంతోషించునా? ఆలోచించుము, బలులు అర్పించుటకంటె ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుటకంటె మాట వినుటయు శ్రేష్ఠము.”—1 సమూయేలు 15:22.
యేసు తన కొండ మీది ప్రసంగములో, ప్రాముఖ్యతను గూర్చిన ఈ క్రమాన్ని పునరుద్ఘాటించి, తమ అర్పణలను అర్పించక ముందే వారు తమ విభేదాలను పరిష్కరించుకోవాలని తన శిష్యులకు తెలిపాడు. నేడు, క్రైస్తవుల నుండి కోరబడుతున్న అర్పణలు ఆత్మీయ సంబంధమైనవి—“స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు, జిహ్వాఫలము అర్పించుదము.” (హెబ్రీయులు 13:15) అయినప్పటికీ, ఆ సూత్రం విలువైనదిగానే ఉంటుంది. ఒకడు తన సహోదరుని ద్వేషిస్తూ దేవున్ని ప్రేమిస్తున్నానని చెప్పడం వ్యర్థమని అపొస్తలుడైన యోహాను అదే విధంగా చూపిస్తున్నాడు.—1 యోహాను 4:20, 21.
ఆసక్తిదాయకంగా, తనకు వ్యతిరేకంగా తన సహోదరునికి ఏదైనా వివాదం ఉందని గుర్తు తెచ్చుకొన్న వ్యక్తి మొదట చర్య గైకొనాలి. తద్వారా ఆయన చూపించే సాత్వికం చాలామట్టుకు మంచి ఫలితాలను తెస్తుంది. అలాగే, తన స్వంత తప్పులను అంగీకరిస్తూ వచ్చే వ్యక్తితో సహకరించడానికి గాయ పర్చబడిన వ్యక్తి నిరాకరించడు. ఏదైనా తప్పుగా తీసుకొన్న దాన్ని తిరిగి పూర్తిగా ఇవ్వాలని, దానికితోడు అయిదవ వంతును చెల్లించాలని మోషే ధర్మశాస్త్రం నిర్దేశించింది. (లేవీయకాండము 6:5) అలాగే, తప్పుచేసిన వ్యక్తి, అవసరమైన దానికంటే ఎక్కువే చేయడానికి చర్యగైకొని అనగా కచ్చితమైన భావంతో చెప్పాలంటే తాను కలిగించిన నష్టాన్ని పూరించాలనే కోరికను వ్యక్తపరిస్తే సమాధానకరమైన, సామరస్యమైన సంబంధాలను పునఃస్థాపించడం సులభతరం అవుతుంది.
అయినా, సమాధానకరమైన సంబంధాలను పునఃస్థాపించడం కొరకు చేసే ప్రయత్నాలు ఎల్లప్పుడూ విజయవంతం కాకపోవచ్చు. స్పందించడానికి సుముఖత చూపని వ్యక్తితో విభేదాలు పరిష్కరించడం కష్టమని సామెతల పుస్తకం మనకు గుర్తు చేస్తున్నది. సామెతలు 18:19 ఇలా చెబుతున్నది: “బలమైన పట్టణమును వశపరచుకొనుటకంటె ఒకనిచేత అన్యాయము నొందిన సహోదరుని వశపరచుకొనుట కష్టతరము. వివాదములు నగరు తలుపుల అడ్డగడియలంత స్థిరములు.” మరో తర్జుమా ఇలా చెబుతున్నది: “ఒక బలమైన పట్టణాన్ని జయించుట కంటే కోపం రేపబడిన సహోదరున్ని జయించడం కష్టము: వారి వివాదములు కోట అడ్డగడియల వలెనున్నవి.” (ది ఇంగ్లీష్‌మ్యాన్స్ బైబిల్) ఏమైనా, దేవున్ని ప్రీతిపర్చాలనే కోరికగల తోటి విశ్వాసుల విషయంలో యథార్థమైన, వినయంతో కూడిన ప్రయత్నాలు తప్పకుండా విజయవంతమౌతాయి. గంభీరమైన పాపం ఆరోపించబడినప్పుడు మత్తయి 18వ అధ్యాయమందు వ్రాయబడివున్న యేసు ఉపదేశాన్ని అన్వయించవలసిన అవసరత ఉంటుంది.
గంభీరమైన విభేదాలను పరిష్కరించుకొనుట
“మరియు నీ సహోదరుడు నీయెడల తప్పిదము చేసిన యెడల నీవు పోయి, నీవును అతడును ఒంటరిగానున్నప్పుడు అతనిని గద్దించుము; అతడు నీ మాట వినినయెడల నీ సహోదరుని సంపాదించుకొంటివి. అతడు విననియెడల, ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడునట్లు నీవు ఒకరినిద్దరిని వెంటబెట్టుకొని అతని యొద్దకు పొమ్ము. అతడు వారి మాటయు విననియెడల ఆ సంగతి సంఘమునకు తెలియజెప్పుము; అతడు సంఘపు మాటయు విననియెడల అతనిని నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకొనుము.”—మత్తయి 18:15-17.
ఒకవేళ ఒక యూదుడు (లేక ఆతర్వాత, ఒక క్రైస్తవుడు) తోటి యెహోవా ఆరాధికుని వలన తీవ్రమైన కష్టాలను ఎదుర్కొన్నట్లైతే, అప్పుడేమిటి? తన యెడల తప్పు జరిగిందని భావించేవ్యక్తి మొదట చర్య తీసుకోవాలి. అతడు గాయపరుస్తున్నవానితో ఒంటరిగా విషయాలను చర్చించాలి. తన పరిస్థితులకు మద్దతు పొందడానికి ప్రయత్నించకుండా ఉండడం ద్వారా, ప్రాముఖ్యంగా, త్వరగా సరిదిద్దగలిగే లాంటి అపార్థం మాత్రమే కారణమయినప్పుడు ఆయన తప్పకుండా తన సహోదరుని సంపాదించుకోగలడు. దానిలో నేరుగా ఇమిడి ఉన్నవారికి మాత్రమే విషయం తెలిసినప్పుడు పరిస్థితి మరింత సుళువుగా చక్కబడుతుంది.
అయితే, మొదటి చర్యే సరిపోకపోవచ్చు. ఆ పరిస్థితితో వ్యవహరించడానికి, యేసు ఇలా చెప్పాడు: “ఒకరిద్దరిని వెంటబెట్టుకొని . . . పొమ్ము.” వీరు ప్రత్యక్షసాక్షులై ఉండవచ్చు. బహుశా వారు ఒక వ్యక్తి మరొక వ్యక్తిపై కొండెములు చెప్పడం వినివుండవచ్చు, లేక ఇప్పుడు సమ్మతించని ఇరు వర్గాలవారిని గూర్చిన వ్రాతపూర్వక ఒప్పందానికి వారు సాక్షులుగా ఉండి ఉండవచ్చు. అంతేగాక, సమస్యకు కారణాన్ని నిర్ధారించడానికి వ్రాతపూర్వక లేక మౌఖిక సాక్ష్యాన్ని పెంపొందింపజేయడానికి తీసుకొనిపోబడిన వారు సాక్షులు కాగలుగుతారు. మళ్లీ ఇక్కడ కూడా, వీలైనంత చిన్న సంఖ్య అంటే “ఒకరు లేక ఇద్దరు” సమస్య గురించి తెలుసుకోవాలి. విషయం కేవలం ఒక అపార్థం మాత్రమే అయితే పరిస్థితి ఇంకా దిగజారిపోకుండా ఇది కాపాడుతుంది.
గాయపర్చబడిన వ్యక్తి ఏ ఉద్దేశాలు కలిగి ఉండాలి? తన తోటి క్రైస్తవున్ని అవమానించ ప్రయత్నించాలా, అతడు తన్ను తానే కించపర్చుకోవాలని ఆశించాలా? యేసు ఉపదేశానుసారంగా, తమ సహోదరులను నిందించడానికి క్రైస్తవులు తొందరపడ కూడదు. తప్పుచేసిన వ్యక్తి తన తప్పును గుర్తించి, క్షమాపణ చెప్పి, విషయాన్ని సరి చేసుకోడానికి ప్రయత్నిస్తే, ఎవరి యెడల తప్పిదము చేయబడిందో అతడు తన ‘సహోదరున్ని సంపాదించుకున్నట్లే’ అవుతుంది.—మత్తయి 18:15.
సమస్యను పరిష్కరించుకోలేకపోతే, దాన్ని సంఘం యొద్దకు తీసుకువెళ్ల వలసినదే. అంటే పూర్వం యూదులలోని పెద్దల యొద్దకు, కాని తర్వాత, క్రైస్తవ సంఘంలోని పెద్దల యొద్దకు తీసుకువెళ్లాలి. తప్పుచేసి పశ్చాత్తాపము చెందని వ్యక్తి సంఘము నుండి వెలివేయబడవల్సి ఉండవచ్చు. యూదులు తమకు దూరముగా ఉంచెడి వ్యక్తుల వలె అతన్ని “అన్యునిగాను సుంకరిగాను” ఎంచుకొనడమంటే భావమిదే. ఏ క్రైస్తవుడు యీ గంభీరమైన చర్యను వ్యక్తిగతంగా తీసుకోకూడదు. సంఘానికి ప్రాతినిధ్యం వహించే నియమిత పెద్దలు మాత్రమే అలాంటి చర్య తీసుకోడానికి అధికారం గలవారు.—1 కొరింథీయులు 5:13 పోల్చండి.
పశ్చాత్తాపము చెందని తప్పిదస్థుడు సంఘము నుండి వెలివేయబడగల సాధ్యత మత్తయి 18:15-17 చిన్న విభేదాలకు వర్తించదని చూపిస్తున్నది. గంభీరమైన తప్పులను ఉద్దేశించి యేసు చెబుతున్నాడు, అయినా కేవలం సంబంధిత ఇద్దరు వ్యక్తుల మధ్య పరిష్కరించబడేదై ఉండాలి. ఉదాహరణకు, ఆ తప్పు బాధితుని పేరు ప్రతిష్ఠలకు గంభీరమైన దెబ్బను కలుగజేసే కొండెములు చెప్పడం అయివుండవచ్చు. లేక తరువాతి వచనాలలో గొప్ప అప్పు క్షమించబడిన దయలేని సేవకుని గురించి చెబుతున్నట్లు అది ఆర్థిక విషయాలకు సంబంధించినది కావచ్చు. (మత్తయి 18:23-35) చెప్పబడిన సమయంలో తిరిగి కట్టని అప్పు కూడా పెద్ద కష్టం కావచ్చు, అది ఇద్దరు వ్యక్తుల మధ్య సుళువుగా పరిష్కరించబడవచ్చు. కానీ అప్పు తీసుకున్న వ్యక్తి ఆ అప్పును తిరిగి కట్టడానికి నిరాకరిస్తే, అది గంభీరమైన పాపం అంటే దొంగతనం, అవుతుంది.
ఇతర పాపములు కేవలం ఇద్దరు క్రైస్తవుల మధ్య పరిష్కరించబడలేక పోవచ్చు. మోషే ధర్మశాస్త్రం ప్రకారం, గంభీరమైన పాపాలు రిపోర్టు చేయబడాలి. (లేవీయకాండము 5:1; సామెతలు 29:24) అలాగే, సంఘ పవిత్రతకు సంబంధించిన పెద్ద తప్పులు క్రైస్తవ పెద్దలకు తెలియజేయబడాలి.
అయితే, క్రైస్తవుల మధ్య ఉండే అనేక సమస్యలు ఈ పద్ధతి క్రిందికి రావు.
మీరు కేవలం క్షమించగలరా?
గంభీరమైన విభేదాలను ఎలా పరిష్కరించుకోవాలో వివరించిన తర్వాత యేసు మరో ప్రాముఖ్యమైన పాఠాన్ని నేర్పించాడు. మనమిలా చదువుతాము: “ఆ సమయమున పేతురు ఆయనయొద్దకు వచ్చి—ప్రభువా, నా సహోదరుడు నాయెడల తప్పిదము చేసిన యెడల నేనెన్నిమారులు అతని క్షమింపవలెను? ఏడు మారులమట్టుకా? అని అడిగెను. అందుకు యేసు అతనితో ఇట్లనెను ఏడుమారులమట్టుకే కాదు, డెబ్బది ఏళ్లమారులమట్టుకని నీతో చెప్పుచున్నాను.” (మత్తయి 18:21, 22) మరో సందర్భంలో యేసు తన శిష్యులకు “రోజుకు ఏడు మారులు” క్షమించమని చెప్పాడు. (లూకా 17:3, 4) కాబట్టి స్పష్టంగా, క్రీస్తు అనుచరులు ధారాళంగా ఒకరినొకరు క్షమించుకోవడం ద్వారా విభేదాలను పరిష్కరించుకోవాలని కోరబడ్డారు.
ఈ విషయంలో తగిన ప్రయత్నం అవసరము. మునుపు ప్రస్తావించబడిన వ్యక్తి ఇలా చెబుతున్నాడు: “ఎలా క్షమించాలో కొంతమంది సహోదరులకు అసలు తెలియదు.” ఇంకా ఆయనిలా చెప్పాడు: “మొట్టమొదటిగా, ప్రాముఖ్యంగా క్రైస్తవ సంఘములో శాంతిని కాపాడడానికి వారు క్షమించాలని ఎవరైనా వివరించినప్పుడు వారు ఆశ్చర్యపోతారు.”
అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “ఎవడైనను తనకు హాని చేసెనని యొకడనుకొనిన యెడల ఒకని నొకడు సహించుచు ఒకని నొకడు క్షమించుడి, ప్రభువు (యెహోవా NW) మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి.” (కొలొస్సయులు 3:13) మన యెడల తప్పు చేసిన సహోదరుని యొద్దకు వెళ్లుటకు ముందు ఈ ప్రశ్నల గురించి ఆలోచించడం మంచిది: ఈ తప్పు ఆయనతో మాట్లాడ తగినదా? నిజ క్రైస్తవ ఆత్మతో గతించిపోయిన వాటిని గతించిపోయిన విషయాలుగా వదిలివేయడం నిజంగా నాకు అసాధ్యమా? నేను ఆయన స్థానంలో ఉన్నట్లైతే, క్షమించబడాలని నేను కోరుకోనా? నేను క్షమించడానికి నిరాకరిస్తే, దేవుడు నా ప్రార్థనలకు సమాధానమిచ్చి, నన్ను క్షమించాలని నేను ఎదురుచూడగలనా? (మత్తయి 6:12, 14, 15) మనం క్షమించడానికి అలాంటి ప్రశ్నలు తప్పకుండా మనకు సహాయం చేయగలవు.
క్రైస్తవులుగా, యెహోవా ప్రజల సంఘములో శాంతిని నెలకొల్పడం మన ప్రాముఖ్యమైన బాధ్యతలలో ఒకటి. కాబట్టి, మనం యేసు ఉపదేశాన్ని ఆచరణలో పెడదాము. అది మనం స్వేచ్ఛగా క్షమించడానికి మనకు సహాయం చేస్తుంది. యేసు శిష్యుల గుర్తింపు చిహ్నమైన సహోదర ప్రేమను పెంపొందించుకోడానికి అలాంటి క్షమాగుణం దోహదపడుతుంది.—యోహాను 13:34, 35.
[23వ పేజీలోని చిత్రం]
యేసు ఉపదేశాన్ని అనుసరించడం ద్వారా క్రైస్తవులు తమ విభేదాలను పరిష్కరించుకోగలరు