విభాగించబడిన చర్చి ఎంత అనర్థము?
“ఒక శిధిలావస్థలో ఉన్న పాత యింట్లో జీవిస్తూ, మొదటి గది గోడలు అకస్మాత్తుగా కూలి నందున కలవరపడిన పెద్ద కుటుంబంవలె, ప్రతి గదిలోనూ అల్లరి చెలరేగుతున్నట్లుగా అక్కడి పరిస్థితి ఉంది. అక్కడ జీసస్ చిల్డ్ర్‌న్—సొగసైన నల్లని పట్టు వస్త్రాలతో ఉన్న ఆంగ్లో కాథోలిక్ సలింగ సంయోగులపై తంబుర గోలతో విరుచుకుపడుతున్నారు.”—ది సన్‌డే టైమ్స్, లండన్, ఏప్రిల్ 11, 1993.
ఇక్కడ కుటుంబం అంటే చర్చ్ ఆఫ్ ఇంగ్లాండు. మహిళలను మతగురువులుగా చేర్చుకోవడాన్ని గూర్చి ఉన్న విపరీతమైన అనైక్యతను గూర్చిన ఈ అలంకారిక వర్ణన క్రైస్తవమత సామ్రాజ్యానికి సరిగ్గా సరిపోతుంది. మహిళలు మత గురువులుగా ఉండాలనే నిర్ణయాన్ని ఆర్థడాక్స్ చర్చి పెద్దలు మరియు ప్రధాన మతాధికారి ఖండిస్తుండగా, పునఃఐక్యత మొత్తం మీద దాని ఫలితం, “మిగిలిన క్రైస్తవమత సామ్రాజ్యంతో మరలా ఐక్యం కావడాన్ని గూర్చిన స్వప్నం ఎంతో సుదూరాన ఉంది” అని ఓ నివేదిక నిర్ధారించింది.
చర్చి ఎంతగా విభాగించబడింది?
మత్తయి 7:21లో మనం చదివేటట్లుగా, అనేకులు ఆయనను ప్రభువుగా విశ్వసిస్తారు గానీ తన ‘తండ్రి చిత్త ప్రకారము చేయడంలో’ విఫలులవుతారని యేసుక్రీస్తు చెప్పాడు. మాక్లీన్స్ పత్రిక యిలా పరిశీలిస్తోంది: “రక్షణను పొందాలనే కోరికతో మత్తయి సువార్తను చదివేవారు, దేవుని చిత్తం అసలు ఏమిటనే విషయంలోని గలిబిలిని బట్టి క్షమాపణ పొందవచ్చు. ఎందుకంటే ఈ ప్రశ్నపై క్రైస్తవులూ వారి చర్చీలూ ఎంతగానో విభాగించబడియున్నారు.” కెనడా దేశీయుల మధ్య జరిగిన ఎన్నికల అనంతరం “అక్కడి క్రైస్తవుల నమ్మకాలూ ఆచారాల్లో చాలా భేదాలున్నాయి—అంటే వాస్తవానికి, తెగల మధ్యగల తేడాలకన్నా ఏదొక తెగలోని వ్యక్తుల మధ్యగల తేడాలే మరి ఎక్కువగా ఉన్నాయని” ఆ పత్రిక నిర్ధారించింది.
అది నిర్వహించిన సర్వే ప్రకారం, తమ చర్చీలు కృత్రిమ కుటుంబ నియంత్రణను ఖండించినప్పటికీ 91 శాతం మంది కాథోలిక్‌లు ఆ పద్ధతులను ఉపయోగించడాన్ని అంగీకరిస్తున్నారు; స్త్రీలు మత గురువులుగా పనిచేసేందుకు అనుమతించబడాలని 78 శాతం మంది తలస్తున్నారు; అంతేకాకుండా 41 శాతం మంది “కొన్ని ప్రత్యేక సందర్భాల్లో” గర్భస్రావాన్ని అంగీకరిస్తారు. “అనేక దైవిక ప్రశ్నలపై” వేర్వేరు మతశాఖలలోగల భిన్నాభిప్రాయాలు, “ప్రముఖమైన చర్చీలలో విభాగాలను సృష్టించడానికి కారణమౌతున్నాయి” అని మాక్లీన్స్ చెబుతోంది.
ద్వంద ప్రమాణాలు
నైతిక విషయాలపై ద్వంద ప్రమాణాలు అదే విధంగా విరుద్ధమైన ప్రమాణాలూ ఉన్నాయి. కొందరు బైబిలు సూత్రాలను ఉన్నతపరుస్తున్నామని చెప్పుకుంటారు, అయితే మరి కొందరు బైబిలు సూత్రాలను ధిక్కరిస్తారు. ఉదాహరణకు, టొరాంటో మెట్రోపాలిటన్ చర్చిలో యిద్దరు లెస్బియన్లలకు “వివాహం” జరపడం దేవుని చిత్తానికి అనుగుణ్యంగా ఉందా? అందులో భాగం వహించినవారు అలాగే భావించారు. “మా ప్రేమను మేము దేవుని ముందూ బహిరంగంగానూ వ్యక్తపర్చాలనుకుంటున్నాము,” అని అన్నారు.
పత్రికా కాలమ్‌ల రచయిత, “పిల్లలను లైంగికంగా చెరిపిన చరిత్రగల మతగురువును తిరిగి, ఆరాధనకు తోడ్పడే అనేకమంది అబ్బాయిలున్న ప్రాంతానికి పంపించడం సమంజసమా” అనే విషయంపై ప్రశ్నించాడు. అండ్రూ గ్రీన్లే అనే ప్రీస్టు, 2,000 నుండి 4,000 మత గురువులు, 1,00,000 మంది చిన్నవయస్సు పిల్లలను లైంగికంగా చెరిపారు, దీన్ని గూర్చి తరచూ ఏమీ చేయడం లేదని సూచించాడు.
అనైక్యతగల చర్చి, అనైక్యత గల ప్రజలను ఉత్పత్తి చేస్తుంది. బాల్కన్ ద్వీపకల్పమందలి సెర్బియన్ మరియు క్రోయట్ “క్రైస్తవులు,” తాము చేసే “న్యాయమైన” యుద్ధంలో క్రీస్తు తమతోనే ఉన్నాడని భావిస్తారు. అనేకులు యుద్ధాల్లో సిలువను ధరించుకుంటారని, “యుద్ధం భీకరంగా జరుగుతున్నపుడు ఒకరు తన నోటిలో సిలువను పట్టుకుంటాడని” కూడా నివేదించబడింది.
‘మీలో విభేదాలు ఉండకూడదు’
నిజమే, బైబిలు కొన్ని విషయాలను మనస్సాక్షికి విడిచిపెడుతుంది, అయితే అది విభేదాలకు తావివ్వకూడదు. అపొస్తలుడైన పౌలు స్పష్టంగా యిలా పేర్కొన్నాడు: ‘మీరందరు ఏకభావముతో మాటలాడవలెను [ప్రవర్తించవలెను], మీలో విభేదాలు ఉండకూడదు.’—1 కొరింథీయులు 1:10; ఎఫెసీయులు 4:15, 16.
అపొస్తలుడైన పౌలు ఈ మాటలను రాసిన రెండు వేల సంవత్సరాల తర్వాత ఒకసారి “క్రైస్తవత్వాన్ని” నిజాయితీగా పరిశీలిస్తే, అది కొన్ని గంభీరమైన ప్రశ్నలను లేవదీస్తుంది. “క్రైస్తవులు” ఎందుకు అంతగా విభాగించబడ్డారు? అలా విభాగించబడిన చర్చి నిలువగలదా? క్రైస్తవమత సామ్రాజ్యం ఎన్నటికైనా ఐక్యంకాగలదా? తదుపరి శీర్షిక ఈ ప్రశ్నలను పరిశీలిస్తుంది.
[3వ పేజీలోని చిత్రం]
గర్భస్రావానికి వ్యతిరేకంగా ప్రీస్టుల ప్రదర్శన
[క్రెడిట్ లైను]
Cover and above: Eleftherios/Sipa Press