“దేవుని మందిరము”ను మెప్పుతో చూచుట
“యెహోవా యొద్ద ఒక్క వరము అడిగితిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింప గోరుచున్నాను.”—కీర్తన 27:4.
మెప్పుగల దావీదు రాజు యెహోవా మందిరాన్ని సంతోషం, లేక ఆనందంతో చూశాడు. నేడు మీరు కూడా సత్యారాధన కేంద్రాల గురించి అలాగే భావిస్తారా? మన కాలంలో యెహోవా ఆరాధనకు సంబంధించిన సౌకర్యాలలో, వాచ్‌టవర్ సంస్థ బ్రాంచీల నందున్న 95 కంటే ఎక్కువ బేతేలు గృహాలు చేరివున్నాయి.
జర్మనీ నందలి బేతేలు గృహంలో 1948లో పనిచేయడం ప్రారంభించిన హెల్గా ఇలా వివరిస్తుంది: “నేను చేసిన ఎన్నో సంవత్సరాల బేతేలు సేవను వెనుదిరిగి చూస్తున్నప్పుడు నేను లోతైన కృతజ్ఞతా భావంతోను, గొప్ప మెప్పుదలతోను నిండిపోతాను, ఇది ప్రతి సంవత్సరము పెరిగింది.” ప్రపంచ వ్యాప్తంగా 1993 సేవా సంవత్సరంలో ‘యెహోవా ప్రసన్నతను చూసిన’ 13,828 మంది సంతోషభరిత బేతేలు పనివారిలో హెల్గా ఒకరు. అసలు బేతేలు అనే పేరుకు కచ్చితమైన భావమేమిటి? యెహోవాసాక్షులలోని ప్రతి ఒక్కరు, బేతేలులో ఉండి దేవున్ని సేవించినా, బేతేలు వెలుపల ఉండి దేవున్ని సేవించినా, ఈ ఏర్పాటును ఎలా మెప్పుతో చూడవచ్చును?
భక్తిని కోరే నామం
“బేతేలు” అనేది యుక్తమైన పేరు ఎందుకంటే, హెబ్రీ పదమైన బెత్-ఎల్ అంటే “దేవుని మందిరము” అని భావము. (ఆదికాండము 28:19, అధఃస్సూచి) అవును, బేతేలు చక్కగా వ్యవస్థీకరించబడిన గృహం లేక దేవునికి, ఆయన చిత్తానికి ప్రాముఖ్యతనిచ్చేదై ‘జ్ఞానము వలన కట్టబడిన ఇంటిని’ పోలి ఉంటుంది. (సామెతలు 24:3) మెప్పుదలతో హెర్టా ఇలా అంటుంది: “అది ఒక కుటుంబంలో జీవిస్తున్నట్లు ఉంటుంది. చక్కగా వ్యవస్థీకరించబడిన ప్రతిదిన కార్యక్రమం మాకు ఉంటుంది.” ఈమె కూడా హెల్గా ఉన్న బేతేలులోనే 45 కంటే ఎక్కువ సంవత్సరాల నుండి సేవ చేస్తున్నది. ఈ పెద్ద కుటుంబంలోని ప్రతి సభ్యునికి తన పని, తన స్థలం ఉంటుంది, ఇది వారు సంతోషంగా, భద్రంగా ఉన్నట్లు భావించడానికి వీలుకలిగిస్తుంది. బేతేలు అనే పేరుకు తగినట్లుగా, ప్రతి విభాగంలో మంచి ఏర్పాటు, సంస్థీకరణ ఉంటుంది. తద్వారా ఇది సమాధానాన్ని పెంపొందిస్తుంది, ఫలితంగా సువార్త ప్రకటించడాన్ని సాధ్యం చేస్తుంది, “దేవుని మందిరాన్ని” సంఘాలు ఉన్నతంగా దృష్టించడానికి మంచి కారణాన్నిస్తుంది.—1 కొరింథీయులు 14:33, 40.
అలాంటి సౌకర్యాలు ఎందుకు అవసరం? ఉదాహరణకు ఈ పత్రిక, బేతేలు ముద్రణాలయంలో తయారు చేయబడింది. యేసుక్రీస్తుచే ముందే దృష్టించబడిన రాజ్య సందేశాన్ని ప్రకటించడం, ఆత్మీయాహారాన్ని పంచిపెట్టడం వంటివి బేతేలువంటి సంస్థాపర ఏర్పాట్లు అనివార్యమయ్యేలా చేస్తాయి. దీనికి స్వచ్ఛంద పనివాళ్ల మద్దతు ఇవ్వబడుతుంది. ఇది యెహోవా ఆరాధికులందరిచే అత్యంత గౌరవభావంతో చూడబడుతుంది.—మత్తయి 24:14, 45.
ఇక్కడి పని దిన కార్యక్రమాన్ని గురించి ఎక్కువ తెలుసుకోవాలని మీరు ఇష్టపడుతున్నారా? హెల్గా, హెర్టా జీవించేచోట, ఉదయం 6:30కు శ్రావ్యమైన ఘంటానాదం అన్ని నివాస భవనాల్లోను వినిపిస్తుంది, దినం కొరకు సిద్ధమవడానికి అక్కడ ఉన్న 800 కంటే ఎక్కువమంది క్రమపనివారిలో అనేకులు ఇంకా ముందే లేస్తారు. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 7:00లకు ఉదయకాల ఆరాధన లేక దిన వచన చర్చ కొరకు కుటుంబం భోజనశాలల్లో సమావేశమౌతుంది. తర్వాత పోషణకరమైన ఉపాహారం ఉంటుంది ప్రతి పని దినం ఉదయం 8:00లకు ప్రారంభమై, ఎనిమిది గంటల సేపు కొనసాగుతుంది, మధ్యలో కేవలం మధ్యాహ్న భోజనం కొరకు విరామం ఉంటుంది. (సాధారణంగా శనివారాల్లో కుటుంబం సగం దినమే పనిచేస్తుంది.) వంటగది, ముద్రణాలయం, లాండ్రీ, ఆఫీసులు, ఫ్యాక్టరీలు, పుస్తకాలు బైండింగ్ చేసే దగ్గర, లేక ఏ విభాగంలోనైనా, చేయవలసిన పని ఎంతో ఉంది.
సాయంకాలాలు, వారాంతాలలో కుటుంబ సభ్యులు కూటాలకు, బహిరంగంగా సువార్త ప్రకటించడానికి స్థానిక సంఘాలతో సమకూడుతారు. ఈ సంఘాల్లో అనేకమంది బేతేలు సహోదరులు పెద్దలుగా లేక పరిచారకులుగా ఉన్నారు. ఈ సహకారాన్ని అనగా రెండు గుంపులవారు పొందికగా ఒక శరీరంగా పరస్పర గౌరవం, గ్రహింపు కలిగి పనిచేయడాన్ని స్థానిక సాక్షులు నిజంగా మెచ్చుకుంటారు. (కొలొస్సయులు 2:19) “దేవుని మందిరం”లో తన పని ఇతర కార్యాలన్నిటి కంటే ప్రాధాన్యమైనదని ప్రతి బేతేలు పనివానికి తెలుసు. అయినప్పటికీ, సువార్త ప్రకటన యెడల ఉత్సాహం, సంఘంతో సహవసించడం, దానికితోడు సమతూకమైన దృక్పథం ఉన్నట్లైతే, అవి బేతేలు పనివాని ఆత్మీయతను బలపర్చి, అతని ఆనందాన్ని అధికం చేసి, అతన్ని కుటుంబంలో అధిక ఫలవంతమైన సభ్యునిగా చేస్తాయి. పూర్ణాత్మతోకూడిన భక్తితో సంబంధం కలిగివున్న పేరుగల “మందిరంలో” పనిచేస్తున్నప్పుడు ఈ లక్షణాలు ఎంత కీలకమైనవో కదా!
బేతేలు సేవను విజయవంతంగా చేయుట
బేతేలు సేవను విజయవంతంగా చేయడానికి అసంఖ్యాకమైన యెహోవాసాక్షులకు ఏది సహాయం చేసింది? బేతేలు సేవలో అనేక సంవత్సరాల అనుభవం గల ఫ్రాన్సు నందలి బేతేలు కుటుంబ సభ్యులు ఇలా చెబుతున్నారు: “యెహోవా యెడల ప్రేమ. ఆయన మనల్ని ఎక్కడ ఉంచినా పనిలో కొనసాగుతూ, సంస్థచే మనకివ్వబడిన నడిపింపుకు తగ్గించుకుని, లోబడి విధేయత చూపించాలనే దృఢనిశ్చయం కల్గివుండడం.” (డెనీజ్) “‘ఘనత విషయములో ఒకని నొకడు గొప్పగా ఎంచుకొనుడి,’ అని రోమీయులు 12:10 నందు పౌలు చెప్పిన సూత్రాన్ని గౌరవించడం ఎంత ప్రాముఖ్యమో నేను గమనించాను. మన స్వంత అభిప్రాయం అంగీకరింపబడాలని ఒత్తిడి చేయడం కాదుగాని, బదులుగా, ఇతరుల అభిప్రాయాలను దృష్టిలోకి తీసుకోవడం యొక్క ప్రాముఖ్యతను ఈ లేఖనం మనకు చూపిస్తుంది. వేరే మాటల్లో చెప్పాలంటే, ప్రధానత్వాన్ని కోరకపోవడమే.” (జాన్-జాక్) బార్బారా ఇలా చెబుతుంది: “మనం విషయాలను శరీర సంబంధ, మానవ దృక్కోణం నుండి చూస్తే, బేతేలు సేవ యెడల గల మన గౌరవం నాశనం కాగలదు, ఎందుకంటే ఇది యెహోవా తన సంస్థను నడిపిస్తున్నాడనే వాస్తవాన్ని మనం మరచిపోయేలా చేస్తుంది. ఇతరుల అసంపూర్ణతలను బట్టి మనం అభ్యంతరపడితే అలాంటి గౌరవాన్ని కోల్పోతాము.”
బేతేలు నందున్న ప్రతి ఒక్కరూ అపరిపూర్ణులే, గనుక సహవాసం విషయంలో జాగ్రత్తగా ఆలోచించడం అవసరము. యౌవనులు లేక ఇటీవల వచ్చిన వారు తమ సహవాసాన్ని కేవలం తమ ఈడువారి వరకే పరిమితం చేసుకోకుండా ఉడటం మంచిది. ఫిర్యాదు చేయడం లేక ప్రతికూలంగా ఆలోచించడం వంటి దృక్పథాన్ని కనబర్చేవారు బేతేలునందు లేక సంఘంలోను నిర్మాణాత్మకమైన సహవాసులు కారు. బదులుగా మరో ప్రక్క, యాకోబు 3:17 నందు వివరించబడిన “పైనుండివచ్చు జ్ఞానము”ను అనుకరించడం ఆశీర్వాదాలను తెస్తుంది. ఇది “మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతోను మంచి ఫలములతో నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణయైనను లేనిదియునై యున్నది.” దీర్ఘశాంతము, దయాళుత్వములతో కలిపి అలాంటి లక్షణాలు “దేవుని మందిరంలో” గమనార్హమైనవి, అవి ఒకరు అక్కడ ఉండటాన్ని ఆహాద్లకరమైనదిగా, ఉత్తేజపరిచేదిగా చేస్తాయి. చివరకు సాక్షులు కాని సందర్శకులు కూడా తరచూ అక్కడున్న పనివారి మంచి ప్రవర్తన, స్నేహశీలత, సంతోషకరమైన స్ఫూర్తిని బట్టి తమ ప్రశంసను వ్యక్తపరిచారు.
దాదాపు 70 కంటే ఎక్కువ సంవత్సరాలు గల ఆనీ 1956 నుండి జర్మనీ నందలి బేతేలు కుటుంబంలో సభ్యురాలుగా ఉంది, సేవ చేయాలనే ఇష్టతను తాను ఎలా కొనసాగించుకుంటుందో ఇలా వివరిస్తుంది: “నేను ఆత్మీయంగా బాగుండాలని, సంస్థ ప్రచురణలను ఎప్పటికప్పుడు చదువుతుండడానికి, కూటాలకు క్రమంగా హాజరు కావడానికి, సువార్త ప్రకటనపనిలో క్రమంగా పాల్గొనడానికి నేను ఎంతో కష్టపడతాను. ప్రతి ఉదయం వ్యాయామం చేయడం ద్వారా, ఎక్కువగా లిఫ్ట్‌లో ఎక్కకుండా ఉండడం ద్వారా, వీలైనప్పుడల్లా ప్రాముఖ్యంగా ప్రాంతీయ సేవలో తరచూ నడవడం ద్వారా నేను శారీరకంగా కూడా మంచి ఆరోగ్యాన్ని కలిగివుండడానికి ప్రయత్నిస్తాను.”
బేతేలు జీవితంలో అనుభవం గల అనేకులు ఆనీతో ఏకీభవిస్తారు. వారు ఎన్నడూ నేర్చుకోవడం ఆపరు, ఎన్నడూ పనిచేయడం మానివేయరు. శారీరక ఆరోగ్యం కొరకు వారికి తగిన నిద్ర, కొంత వ్యాయామం, తినడం త్రాగడం విషయాల్లో మితంగా ఉండడం అవసరం. అన్నిటికన్నా ముఖ్యంగా, వ్యక్తిగత ప్రార్థన, బైబిలు పఠనాలను వారు నిర్లక్ష్యం చేయరు.
బేతేలు నందు పరిశుద్ధ సేవ యెడల ఉన్నత భావం
“మీరు ఎక్కడ పనిచేస్తారు?” అనేది సాధారణంగా బేతేలు సభ్యులను అడిగే ప్రశ్న. పని నియామకాలు విభిన్నంగా ఉంటాయి, కాని అందరిచే ఉన్నతంగా చూడబడుటకు ప్రతి నియామకము అర్హమైనదే. ఎందుకు? ఎందుకంటే, ప్రతి నియామకం అంటే ఆత్మీయాహారాన్ని ముద్రించే యంత్రాన్ని నడపడం, బట్టలు ఉతకడం, కుటుంబం కొరకు వంట చేయడం, శుభ్రం చేయడం, లేక ఆఫీసుపని చేయడం, ఏదైనా పరిశుద్ధ సేవయే. పైన చెప్పబడినట్లుగా, క్రైస్తవులు పక్షపాతమైన వేర్పాటులు చేయరు. ఆలయంలో అంటే దాని ప్రాంగణాల్లోను, భోజనశాలల్లోను యాజకులు, లేవీయులచే నిర్వహించబడిన అవసరమైన విధులన్నీ యెహోవాకు పరిశుద్ధ సేవగానే పరిగణించబడ్డాయని గుర్తుంచుకోండి. బలి కొరకు జంతువులను వధించి సిద్ధంచేయడం, నూనె దీపాలను తిరిగి నింపడం, చివరికి శుభ్రం చేయడం, కావలివాని విధులను నిర్వహించడం వంటివి కూడా వాటిలో భాగమై ఉన్నాయి. అలాగే, బేతేలు నందలి ప్రతి నియామకం “ప్రభువు కార్యాభివృద్ధియందు” సంతృప్తికరమైన, తగిన కార్యం గనుక అది ప్రత్యేకమైన ఆధిక్యత.—1 కొరింథీయులు 15:58.
“దేవుని మందిరాన్ని” మనం మెప్పుతో చూడటాన్ని ఆటంకపరిచే ఒక అవాంతరాన్ని క్లుప్తంగా పరిశీలించండి. బేతేలులోను, బేతేలు వెలుపలను ఉన్న క్రైస్తవులు ఉభయులూ, ‘ఎముకలకు కుళ్లు అయిన’ ఈర్ష్యా, అసూయలను గురించి జాగ్రత్తగా ఉండాలి. (సామెతలు 14:30) బేతేలు పనివారి సేవా ఆధిక్యతల గురించి ఎవరైనా ఈర్ష్యపడవలసిన అవసరం లేదు. అంతేగాక, శరీర కార్యాలలో ఒకటైన అసూయకు బేతేలు కుటుంబంలో స్థానం లేదు. దీనంగా ఎదురుచూడండి అనేది ఇతరులకు గొప్ప ఆధిక్యతలు ఇవ్వబడుతుండగా తమను పట్టించుకోవడం లేదు అని భావించే వారికివ్వబడే మంచి సలహా ఏమిటంటే, దీనంగా వేచివుండండి అనేదే. అంతేకాక, వేరువేరు ఆర్థిక పూర్వాపరాలుగల వ్యక్తులు బేతేలు నందు సన్నిహితంగా కలిసి జీవిస్తారు. ఒకరు తన పరిస్థితులను “మరో వ్యక్తితో పోల్చుకుని” చూస్తే ఎంత బాధగా ఉంటుంది! “అన్నవస్త్రములు” కలిగి సంతృప్తిపడడం “దేవుని మందిరంలో” దశాబ్దాలుగా విశ్వాసంగా కొనసాగడానికి అనేకులకు సహాయం చేసింది.—గలతీయులు 5:20, 26; 6:4; 1 తిమోతి 6:8.
దేవుని యెడల, పొరుగువాని యెడల ఉన్న ప్రేమనుబట్టి నిస్వార్థంగా చేయబడిన పనిని బట్టి అనగా—బేతేలు నందు ఉచితంగా చేయబడిన సేవల నుండి యెహోవాసాక్షులు, అలాగే లక్షలాదిమంది ఇతరులు గొప్ప మేలు పొందుతున్నారు. బేతేలు గృహాలు, వాచ్‌టవర్ సంస్థ ముద్రణాలయాలు ఇతర దైవపరిపాలనా సౌకర్యాలవలెనే స్వచ్ఛంద విరాళాలచే నడుపబడుతున్నాయి. (2 కొరింథీయులు 9:7) ఇశ్రాయేలీయుల రాజైన దావీదు, రాజకుమారులు, ముఖ్యుల వలే మనం సంస్థకు నైతికపరమైన, ఆర్థికపరమైన మద్దతు నివ్వడం ద్వారా “దేవుని మందిరం” యెడల మనకు గల గౌరవాన్ని, మెప్పును చూపించవచ్చు. (1 దినవృత్తాంతములు 29:3-7) బేతేలు నందు “యెహోవా ప్రసన్నతను చూచుట” ఎలా సాధ్యమౌతుందో ఇప్పుడు మనం చూద్దాము.
“దేవుని మందిరంలో” ఆశీర్వాదాలు
ఒక సమావేశానికి హాజరౌతున్నప్పుడు, యెహోవా యొక్క సంతోషకరమైన ఆరాధికులు నా చుట్టూ ఉన్నారనే లోతైన సంతృప్తిని మీరు పొందుతారా? ఒకసారి ఊహించండి, ఒక బేతేలు పనివానికి ప్రతిరోజు ఒక సహోదరుల గుంపు మధ్య యెహోవాను సేవించే ఆధిక్యత ఉంటుంది! (కీర్తన 26:12) అది ఆత్మీయాభివృద్ధికి ఎంతటి అద్భుతమైన అవకాశాలనిస్తుంది! తన వ్యక్తిత్వాన్ని రూపొందించుకోడానికి తాను మూడు సంవత్సరాల్లో వేరేచోట నేర్చుకున్న దాని కంటే బేతేలు నందు కేవలం ఒక సంవత్సరంలోనే ఎంతో ఎక్కువ నేర్చుకున్నానని ఒక సహోదరుడు గుర్తించాడు. ఎందుకు? ఎందుకంటే అంతమంది పరిపక్వత చెందిన క్రైస్తవ వ్యక్తిత్వాల విశ్వాసాన్ని గమనించి, అనుకరించే అవకాశం మరెక్కడా ఆయనకు లేదు.—సామెతలు 13:20.
సూచనార్థకంగా చెప్పాలంటే, బేతేలు నందు ఒక వ్యక్తి అనుభవజ్ఞులైన సలహాదారుల మధ్యన ఉంటాడు. అదనంగా, ఉదయకాల ఆరాధనలోను, బేతేలు కుటుంబ కావలికోట పఠనంలోను, బాగా సిద్ధపడి ఇచ్చే వ్యాఖ్యానాలనూ, సోమవార సాయంకాలాల్లో ఇవ్వబడే ప్రసంగాలనూ వినే అవకాశం ఉంటుంది. కొత్తగా వచ్చినవారికి బేతేలు ప్రవేశ పాఠశాలలో ఉపదేశం ఇవ్వబడుతుంది, తొలి 12 నెలల్లో మొత్తం బైబిలును చదివే పని కూడా అప్పగించబడుతుంది.
వేరే దేశాలనుండి వచ్చే సందర్శకుల రిపోర్టులు, అనుభవాలు అదనపు ప్రోత్సాహాన్నిస్తాయి. అంతేగాక పరిపాలక సభ సభ్యులు లేక వారి ప్రతినిధులు బ్రాంచి కార్యాలయాలను దర్శిస్తుంటారు. హెల్గా ఇలా చెబుతుంది: “వారు చేయవలసింది ఎంతో ఉన్నప్పటికీ, ఒక స్నేహపూరితమైన మాట చెప్పడానికి లేక చిరునవ్వు నవ్వడానికి ఆ సహోదరులు ఎప్పుడూ సమయం తీసుకుంటారు.” అలాంటి విశ్వాసులైన వ్యక్తుల ఉత్తేజకరమైన, మంచి మాదిరిని వ్యక్తిగతంగా చూడడం ఎంత ప్రోత్సాహాన్నిస్తుంది!
దేవుని సంస్థ ఎలా పనిచేస్తుందో, ఇష్టపూర్వకమైన హృదయాలు, చేతులను కార్యశీలతకు ఆయన పరిశుద్ధాత్మ ఎలా పురికొల్పుతుందో ప్రాముఖ్యంగా బేతేలునందు కచ్చితంగా చూడవచ్చు. ఫ్రాన్సు నందలి బేతేలులో 1949 నుండి సేవచేస్తున్న ఒక సహోదరుడు ఇలా వివరిస్తున్నాడు: “బేతేలులో ఉన్నవారు ‘కార్యకేంద్రానికి దగ్గరగా ఉన్నట్లు’ భావిస్తారు.” ఆయనిలా కొనసాగించాడు: “నాకున్నదానిలో ఎక్కువ సమయాన్ని, శక్తిని యెహోవా సేవ కొరకు వెచ్చించడానికి, ఎక్కువమంది సహోదరులకు సేవచేయడానికి నాకు అనుకూలం కలుగజేసే పూర్తికాల సేవావిధానం బేతేలేనని, నేను నిజంగా చెప్పగలను.” నిజంగా దేవుని చిత్తం చేయాలన్నదే మన జీవితంలోని నిజ సంకల్పం కాదా? బేతేలులో ఒకరు “దినమెల్లా స్తుతించవచ్చు.” ఎంతటి ఆశీర్వాదం!—కీర్తన 44:8.
మనం కనుగొన్నట్లుగా, బేతేలు గృహంలో పనిచేసేవారు యెహోవా ప్రసన్నతను చూచి, విస్తృత ఆశీర్వాదాలను పొందగలరు. (హెబ్రీయులు 6:10) “దేవుని మందిరంలో” సేవ మీకు విలువైనదైయుండ గలదా? యెహోవాసాక్షులలో కనీసం 19 సంవత్సరాల వయసున్నవారు, మంచి ఆత్మీయ, శారీరక ఆరోగ్యాన్ని కలిగివుండి, తిమోతివలె “సహోదరుల వలన మంచిపేరు పొందినవారు” బేతేలు సేవకొరకు ధరఖాస్తు చేసుకోవచ్చు. (అపొస్తలుల కార్యములు 16:2) ముందు చెప్పబడినవారివలే, అనేకులు బేతేలు సేవను తమ జీవితపనిగా చేసుకున్నారు. ‘నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింప గోరుచున్నాను’ అనే కీర్తన గ్రంథకర్త గాఢమైన కోరిక వారికి వాస్తవం అయ్యింది.
బేతేలు నందున్న తమ సహోదర సహోదరీలు వారి నియామకాలను ఇష్టపూర్వకంగాను, సంతోషకరంగాను నిర్వర్తించడంలో చూపించే స్వయంత్యాగ స్ఫూర్తి యెడల యెహోవాసాక్షులు గొప్ప గౌరవాన్ని కలిగివుంటారు. మనం బేతేలులో సేవచేసినా లేక మరెక్కడ సేవచేసినా, మనలో ప్రతి ఒక్కరం రాజైన దావీదు భావించినట్లు, “దేవుని మందిరం” యెడల మెప్పు లేక సంతోషం కలిగివుండడానికి మంచి కారణం ఉంది.
[31వ పేజీలోని చిత్రం]
దశాబ్దాలుగా, జర్మను నందలి బేతేలు నందు పరిశుద్ధ సేవ చేయడంలో ఈ క్రైస్తవులు ఆనందాన్ని పొందారు