కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w94 6/15 పేజీలు 17-22
  • హిత బోధను మీ జీవన మార్గంగా చేసుకోండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • హిత బోధను మీ జీవన మార్గంగా చేసుకోండి
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • హితకరమైన జీవన మార్గం
  • వృద్ధులకు సలహా
  • వృద్ధ స్త్రీల కొరకు
  • యౌవన స్త్రీల కొరకు
  • యౌవన పురుషుల కొరకు
  • దాసులు మరియు సేవకుల కొరకు
  • పరిశుభ్రపర్చబడిన ప్రజలు
  • ఆరోగ్యకరమైన విశ్వాసమును కలిగియుండుము!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
  • సత్యవాక్యమును సరిగా ఉపదేశించడానికి మనకేమి సహాయం చేయగలదు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
  • మనం స్త్రీలను గౌరవించాలని దేవుడు కోరుతున్నాడు
    కావలికోట: దేవుడు స్త్రీలను పట్టించుకుంటాడా?
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
w94 6/15 పేజీలు 17-22

హిత బోధను మీ జీవన మార్గంగా చేసుకోండి

“దైవభక్తి . . . అన్ని విషయములలో ప్రయోజనకరమవును.”—1 తిమోతి 4:8.

1, 2. ఎంతమేరకు మరియు ఏ ఫలితంతో ప్రజలు తమ ఆరోగ్యం కొరకు శ్రద్ధ కనబరుస్తారు?

జీవితంలోని అత్యంత విలువైన సంపదలలో మంచి ఆరోగ్యం ఒకటని అనేకులు తప్పకుండా అంగీకరిస్తారు. వారు తమను తాము శారీరకంగా ఆరోగ్యంగా ఉంచుకోడానికి, అవసరమైనప్పుడు తగిన వైద్య సదుపాయం తప్పకుండా పొందడానికి వారు ఎంతో డబ్బును, సమయాన్ని వెచ్చిస్తారు. ఉదాహరణకు, అమెరికాలో, ఇటీవలి ఒక సంవత్సరంలో వార్షిక ఆరోగ్య జాగ్రత్త కొరకు 9,00 బిలియన్ల డాలర్ల కంటే ఎక్కువ ఖర్చుచేయబడింది. అంటే దాన్నిబట్టి సంవత్సరానికి ప్రతి పురుషునికి, స్త్రీకి, బాలునికి 3,000 డాలర్ల కంటే ఎక్కువే అవుతుంది, అయితే ఇతర అభివృద్ధి చెందిన దేశాల తలసరి ఖర్చు కూడా ఇంచుమించు అంతే ఉంది.

2 సమయం, శక్తి, డబ్బుకు సంబంధించిన ఖర్చు మొత్తం ఏమి సాధించింది? మొత్తంమీద, చరిత్రలో మరే సమయంలోను లేని ఆధునిక వైద్య సదుపాయాలను, పనిముట్లను మనం కలిగివున్నామన్నదాన్ని కచ్చితంగా ఎవరూ కాదనలేరు. అయినా, ఇది దానంతటదే ఆరోగ్యవంతమైన జీవితానికి దారితీయదు. వాస్తవానికి, అమెరికా కొరకు రూపొందించబోతున్న ఆరోగ్య జాగ్రత్త కార్యక్రమాన్ని గూర్చిన ప్రసంగంలో, అమెరికా అధ్యక్షుడు నొక్కి చెప్పినదేమంటే, “ఈ దేశంలో దౌర్జన్యం దారుణంగా విజృంభించడంతోపాటు,” అభివృద్ధి చెందిన ఏ దేశంలో కంటే కూడా అమెరికా నివాసుల్లో “ఎయిడ్స్‌, పొగత్రాగడం, అధికంగా త్రాగడం, చిన్నవయసులో గర్భందాల్చడం, జన్మించినప్పుడు తక్కువ బరువుండే పిల్లలు వంటి విషయాల్లో అధిక రేటునుకల్గి ఉంది.” ఆయన ముగింపులో చెప్పేదేమిటి? “మనం ఒక జనాంగంగా నిజంగా ఆరోగ్యంగా ఉండాలంటే మనం మన విధానాల్ని మార్చుకోవాలి.”—గలతీయులు 6:7, 8.

హితకరమైన జీవన మార్గం

3. ప్రాచీన గ్రీకు సంస్కృతి దృష్ట్యా, పౌలు ఏ సలహా నిచ్చాడు?

3 మొదటి శతాబ్దంలో, శారీరక బలాన్ని పెంపొందించుకోవడం, శరీర సౌష్టవాన్ని పెంచుకోవడం, ఆటల పోటీలు వంటివాటి యెడల వారికి గల అంకితభావాన్ని బట్టి గ్రీకులు పేరుగాంచారు. ఈ పూర్వాపరాన్ని అనుసరించే, అపొస్తలుడైన పౌలు యౌవనుడైన తిమోతికి ఇలా రాయడానికి ప్రేరేపించబడ్డాడు: “శరీర సంబంధమైన సాధకము కొంచెముమట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి యిప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును.” (1 తిమోతి 4:8) అలా, నేడు ప్రజలు గ్రహిస్తున్నదాన్ని, అంటే వైద్య లేక శారీరక ఏర్పాట్లు నిజంగా ఆరోగ్యవంతమైన జీవన మార్గాన్ని ఇవ్వలేవన్న విషయాన్ని పౌలు సూచిస్తున్నాడు. అయినా, ఆత్మీయ ఆరోగ్యాన్ని, దైవభక్తిని పెంపొందించుకోవడం తప్పనిసరి అని పౌలు మనకు రూఢిగా చెబుతున్నాడు.

4. దైవభక్తి యొక్క ప్రయోజనాలేమిటి?

4 అలాంటి విధానం “ఇప్పటి జీవము” కొరకు ప్రయోజనకరం ఎందుకంటే, దైవభక్తిలేని ప్రజలు, లేక కేవలం “పైకి [లేక, రూపానికి] భక్తిగల వారు” తమపైకి తాము తెచ్చుకొనే హానికరమైన వాటన్నిటి నుండి అది భద్రత కలుగజేస్తుంది. (2 తిమోతి 3:5; సామెతలు 23:29, 30; లూకా 15:11-16; 1 కొరింథీయులు 6:18; 1 తిమోతి 6:9, 10) దైవభక్తి తమ జీవితాలను రూపుదిద్దేలా అనుమతించువారికి దేవుని సూత్రాలు, అర్హతల యెడల హితకరమైన గౌరవం ఉంటుంది, అది దేవుని హితబోధను తమ జీవన మార్గంగా చేసుకోడానికి వారిని ప్రేరేపిస్తుంది. అలాంటి చర్య వారికి ఆత్మీయ, శారీరక ఆరోగ్యం, సంతృప్తి, సంతోషాలను తెస్తుంది. వారు “వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము, రాబోవు కాలమునకు మంచి పునాది తమకొరకు వేసికొనుచు”న్నారు.—1 తిమోతి 6:19.

5. పౌలు తీతుకు వ్రాసిన తన పత్రికలోని రెండవ అధ్యాయంలో ఏ ఉపదేశాలనిచ్చాడు?

5 దేవుని హితబోధచే నడిపించబడే జీవితం అలాంటి ఆశీర్వాదాలను ఇప్పుడును, భవిష్యత్తులోను తెస్తుంది గనుక, ఆచరణాత్మకంగా, మనం దేవుని హితబోధను మన జీవన మార్గంగా ఎలా చేసుకోగలమో తెలుసుకోవలసిన అవసరత ఉంది. తీతుకు రాసిన తన పత్రికలో అపొస్తలుడైన పౌలు ఆ సమాధానాన్ని దయజేశాడు. ఆ పుస్తక మందలి రెండవ అధ్యాయాన్ని గురించి మనం ప్రత్యేక శ్రద్ధ తీసుకుందాము, అక్కడ ఆయన తీతుకు ఇలా ఉపదేశించాడు: “హితబోధకనుకూలమైన సంగతులను బోధించుము.” నిశ్చయంగా మనమందరం, అంటే యౌవనులు, వృద్ధులు, పురుషులు, స్త్రీలు, నేడు అలాంటి “హితబోధ” నుండి ప్రయోజనం పొందవచ్చును.—తీతు 1:4, 5; 2:1.

వృద్ధులకు సలహా

6. “వృద్ధులకు” పౌలు ఏ సలహా నిచ్చాడు, ఆయన తానుగా అలా చేయడం ఎందుకు దయగల పనియైయుంది?

6 మొదట, పౌలు సంఘంలోని వృద్ధులకు కొంత సలహా ఇస్తున్నాడు. దయచేసి తీతు 2:2 చదవండి. ఒక గుంపుగా “వృద్ధులు,” గౌరవింపబడి, విశ్వాస యథార్థతల విషయంలో మాదిరిగా ఎంచబడతారు. (లేవీయకాండము 19:32; సామెతలు 16:31) ఇందుమూలంగా, అత్యంత గంభీరం కాని విషయాల్లో పెద్దవారికి సలహా లేక సూచనలు ఇవ్వడానికి ఇతరులు వెనుకాడవచ్చు. (యోబు 32:6, 7; 1 తిమోతి 5:1) కాబట్టి, వృద్ధులను మొదట సంబోధించడం పౌలు తానుగా దయ చూపినట్లే, మరి వారు పౌలు మాటలను హృదయానికి తీసుకోవడం మంచిది, పౌలు వలె వారు కూడా నిశ్చయంగా అనుకరించదగిన వారిగా ఉండాలి.—1 కొరింథీయులు 11:1; ఫిలిప్పీయులు 3:17.

7, 8. (ఎ) “మితానుభవము” కలిగివుండడంలో ఏమి చేరివుంది? (బి) “మాన్యులై” ఉండడం “స్వస్థబుద్ధి కలిగివుండడం”తో ఎందుకు సమతూకం చేయబడాలి?

7 మొట్టమొదట, వృద్ధ క్రైస్తవ పురుషులు “మితానుభవముగల వారు”గా ఉండాలి. ఈ వాక్య మూలపదం త్రాగుడు అలవాటును (“సోబర్‌,” కింగ్‌డమ్‌ ఇంటర్‌లీనియర్‌) సూచించేదైనప్పటికీ, జాగ్రత్తగా ఉండడం, స్పష్టాలోచన కలిగివుండడం, లేక తెలివి కలిగివుండడం అనే భావం కూడా దానికి ఉంది. (2 తిమోతి 4:5; 1 పేతురు 1:13) అలా, త్రాగుడు లేక మరితర విషయాల్లోనూ, వృద్ధులు మితంగా ఉండాలేగాని, అధికంగా లేక మితిమీరి ఉండకూడదు.

8 తర్వాత, వారు “మాన్యులును, స్వస్థబుద్ధిగలవారునై” కూడా ఉండాలి. మాన్యులుగాను, లేక ఆదరణీయులుగాను, పూజ్యనీయులుగాను, గౌరవింపదగిన వారిగాను ఉండడం సహజంగా వయస్సుతోపాటు వస్తుంది. అయినా, కొందరు అధికంగా గంభీరతను వ్యక్తపరుస్తూ, బలముగల యౌవనస్థుల విధానాలను సహింపలేని వారిగా తయారవ్వడం జరుగుతుంది. (సామెతలు 20:29) అందుకే “మాన్యత, (గంభీరత)” “స్వస్థబుద్ధి”తో సమతూకం చేయబడింది. వృద్ధులు వయస్సుకు తగిన గంభీరతను ప్రదర్శించినా, అదే సమయంలో, సమతూకం కలిగివుండి, తమ భావాలను, ఉద్వేగాలను పూర్తిగా అదుపులో పెట్టుకొనివుండాలి.

9. వృద్ధులు విశ్వాస, ప్రేమ, సహనముల విషయంలో ఎందుకు హితకరంగా ఉండాలి?

9 చివరగా, వృద్ధులు “విశ్వాస ప్రేమ సహనములయందు లోపములేనివారునై” ఉండాలి. అనేకసార్లు పౌలు తన వ్రాతలలో, నిరీక్షణతోపాటు విశ్వాస ప్రేమలను పేర్కొన్నాడు. (1 కొరింథీయులు 13:13; 1 థెస్సలొనీకయులు 1:3; 5:8) అయితే ఇక్కడ ఆయన “నిరీక్షణ” స్థానంలో “సహనాన్ని” రాస్తున్నాడు. ఎందుకంటే, బహుశా పెరుగుతున్న వయస్సుతోపాటు విడువబడ్డామనే భావం సులభంగా కలుగవచ్చు. (ప్రసంగి 12:1) అయినప్పటికీ, యేసు నొక్కిచెప్పినట్లుగా, “అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును.” (మత్తయి 24:13) అంతేగాక, వృద్ధులు ఇతరులకు వారి వయస్సు లేక అనుభవాన్ని బట్టే కాదుగాని, విశ్వాసం, ప్రేమ, సహనం వంటి వారి పటిష్టమైన ఆత్మీయ లక్షణాలను బట్టి కూడా వారు అనుసరించదగిన ఉదాహరణలుగా ఉన్నారు.

వృద్ధ స్త్రీల కొరకు

10. సంఘంలోని “వృద్ధస్త్రీలకు” పౌలు ఏ సలహానిచ్చాడు?

10 తర్వాత పౌలు తన అవధానాన్ని సంఘంలోని వృద్ధ స్త్రీలవైపు మళ్లించాడు. దయచేసి తీతు 2:3 చదవండి. “వృద్ధస్త్రీలు” అంటే “వృద్ధుల” భార్యలు, ఇతర సభ్యుల తల్లులు, అమ్మమ్మ నాన్నమ్మలతో సహా సంఘమందలి స్త్రీలలో ఎక్కువ వయస్సున్న సభ్యులు. అలాంటివారు మంచికైనా, చెడుకైనా చెప్పుకోదగిన ప్రభావాన్ని చూపించగలరు. అందుకే పౌలు తన మాటలను “ఆలాగుననే” అని ప్రారంభిస్తున్నాడు, అంటే “వృద్ధస్త్రీలు” సంఘంలో తమ పాత్రను నిర్వహించడానికి వారు కూడా తుదముట్టించ వలసిన బాధ్యతలను కలిగివున్నారు.

11. దైవభక్తి గల ప్రవర్తన ఏమిటి?

11 మొదట, “ప్రవర్తనయందు భయభక్తులు గలవారై యుండవలెనని” పౌలు చెప్పాడు. “ప్రవర్తన” అంటే గుణం మరియు రూపం ద్వారా ప్రతిబింబించినట్లుగా, ఒకరి అంతర్గత దృక్పథం, వ్యక్తిత్వాలను బాహ్యంగా వ్యక్తం చేయడమే. (మత్తయి 12:34, 35) అయితే, ఒక వృద్ధ క్రైస్తవ స్త్రీ తన దృక్పథంలోను లేక వ్యక్తిత్వంలోను ఎలా ఉండాలి? ఒక్క మాటలో చెప్పాలంటే, “భయభక్తులు” కలిగివుండాలి. “దేవునికి సమర్పించబడిన వ్యక్తులు, క్రియలు లేక విషయాలకు తగినట్లు ఉండేది” అనే భావం గల గ్రీకుపదం నుండి ఇది అనువదించబడింది. ఇతరులపై, ప్రాముఖ్యంగా సంఘంలోని యౌవన స్త్రీలపై వారు కలిగివుండే ప్రభావం దృష్ట్యా ఇది కచ్చితంగా తగిన సలహాయే.—1 తిమోతి 2:9, 10.

12. నాలుక యొక్క ఏ దుర్వినియోగాన్ని అందరూ విసర్జించాలి?

12 తర్వాత రెండు ప్రతికూల లక్షణాలు చెప్పబడ్డాయి. “కొండెకత్తెలును, మిగుల మద్యపానాసక్తులునై యుండక.” ఈ రెండింటిని ఒకే గుంపులో చేర్చడం ఆసక్తికరమైన విషయం. అధ్యాపకుడైన ఇ. ఎఫ్‌. స్కాట్‌ ఇలా అంటున్నారు, “ప్రాచీన కాలంలో, ద్రాక్షారసము మాత్రమే మద్యపానీయంగా ఉన్న కాలాల్లో, వాళ్ల చిన్నచిన్న మద్యపాన విందుల్లో వృద్ధ స్త్రీలు తమ పొరుగువారిపై కొండాలు చెప్పుకొనేవారు.” పురుషుల కంటే స్త్రీలే సాధారణంగా ప్రజల యెడల ఆసక్తి కలిగివుంటారు, అది మెచ్చుకొనదగినది. అయినా ఆ ఆసక్తి, ప్రాముఖ్యంగా త్రాగడం చేత నాలుక అదుపు తప్పినప్పుడు వృధాప్రసంగంలోకి, ఇంకా కొండెములలోకి దిగజారిపోవచ్చు. (సామెతలు 23:33) నిశ్చయంగా, ఆరోగ్యకరమైన జీవన మార్గాన్ని చేపట్టేవారందరూ, అంటే పురుషులు, స్త్రీలు, ఈ ఉరిని గురించి జాగ్రత్త కలిగివుండాలి.

13. ఏయే విధాలుగా వృద్ధస్త్రీలు బోధకులుగా ఉండగలరు?

13 అందుబాటులోనున్న సమయాన్ని నిర్మాణాత్మకంగా ఉపయోగించడానికి వృద్ధస్త్రీలు “మంచి ఉపదేశము చేయువారునై యుండవలెనని” ప్రోత్సహింపబడుతున్నారు. మరోచోట, స్త్రీలు సంఘంలో బోధింప కూడదని పౌలు స్పష్టంగా సూచనలిచ్చాడు. (1 కొరింథీయులు 14:34; 1 తిమోతి 2:12) ఎలాగైనా, దేవుని అమూల్యమైన జ్ఞానాన్ని తమ ఇంటివారికి, బయటివారికి విశదీకరించకుండా ఇది వారిని ఆటంకపరచదు. (2 తిమోతి 1:5; 3:14, 15) తరువాతి వచనాలు చూపునట్లు, సంఘంలోని యౌవన స్త్రీలకు వారు క్రైస్తవ మాదిరిగా ఉండడం ద్వారా కూడా ఎంతో మంచిని సాధించవచ్చును.

యౌవన స్త్రీల కొరకు

14. తమ విధులను నిర్వహించడంలో క్రైస్తవ యౌవన స్త్రీలు ఎలా సమతూకాన్ని ప్రదర్శించగలరు?

14 “మంచి ఉపదేశము చేయువారునై యుండవలెనని” వృద్ధ స్త్రీలను ప్రోత్సహించడంలో, పౌలు ప్రాముఖ్యంగా యౌవన స్త్రీలను ప్రస్తావించాడు. దయచేసి తీతు 2:4, 5 చదవండి. ఎక్కువ ఉపదేశం గృహ సంబంధ విషయాలపై ఆధారపడినదే అయినప్పటికీ, యౌవన క్రైస్తవ స్త్రీలు, తమ జీవితాలను వస్తుదాయక విషయాలు అధిగమించడాన్ని అనుమతిస్తూ హద్దు మీరకూడదు. బదులుగా, వారు “స్వస్థబుద్ధి గలవారును పవిత్రులును . . . మంచివారునై” యుండాలి, అన్నిటికంటే ముఖ్యంగా, “దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు” క్రైస్తవ శిరసత్వ ఏర్పాటుకు ఎల్లప్పుడూ మద్దతునిచ్చువారై యుండాలి.

15. సంఘాల్లోని యౌవన స్త్రీలలో అనేకులు ఎందుకు మెచ్చుకొనదగిన వారైయున్నారు?

15 నేడు కుటుంబ పరిస్థితి పౌలు దినాల్లో ఉండినదాని కంటే గణనీయంగా మార్పు చెందింది. విశ్వాసానికి సంబంధించి అనేక కుటుంబాలు విభాగింపబడి ఉన్నాయి, ఇతరులకు కేవలం తల్లి లేక తండ్రి మాత్రమే ఉన్నారు. సాంప్రదాయబద్ధమైనవని చెప్పబడే కుటుంబాల్లో కూడా, భార్య లేక తల్లి పూర్తికాలం ఇంటిని చూచుకొనే దానిగానే ఉండడం ఎక్కువగా అసాధారణమై పోతున్నది. ఇదంతా యౌవన క్రైస్తవ స్త్రీపై చాలా ఉద్ధృతమైన వత్తిడిని, బాధ్యతను పెడుతున్నది, కాని ఇది వారిని లేఖనాధార బాధ్యతల నుండి విముక్తి చేయదు. విశ్వాసం గల అనేకమంది యౌవన స్త్రీలు, తమ అనేక బాధ్యతలలో సమతూకం కలిగివుండడానికి, అయినా రాజ్యాసక్తులను మొదట వుంచడానికి, అంతేగాక మరికొందరు సహాయ లేక క్రమ పయినీర్‌లుగా పూర్తికాల పరిచర్యలో ఉండడానికి కష్టపడి పనిచేయడాన్ని చూడడం గొప్ప సంతోషాన్ని కలిగిస్తుంది. (మత్తయి 6:33) వారు నిజంగా మెచ్చుకొనదగిన వారు!

యౌవన పురుషుల కొరకు

16. పౌలు యౌవన పురుషులకు ఏ సలహానిచ్చాడు, ఇది ఎందుకు సమయోచితమైనది?

16 తర్వాత పౌలు, తీతుతో సహా యౌవన పురుషులను గూర్చి మాట్లాడుతున్నాడు. దయచేసి తీతు 2:6-8 చదవండి. నేటి యౌవనుల బాధ్యతారాహిత్య, నాశనకరమైన అనేక విధానాలు అంటే పొగత్రాగడం, మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాల దుర్వినియోగం, లైంగిక దుర్నీతి, మరియు హింసాత్మక ఆటలు, నీచమైన సంగీతం, వినోదం వంటి ఇతర లోక సంబంధ లక్ష్యాల వంటివాటి దృష్ట్యా, ఆరోగ్యకరమైన, సంతృప్తికరమైన జీవన విధానాన్ని అనుసరించాలని కోరుకునే క్రైస్తవ యౌవనులకు నిజంగా ఇది సమయోచితమైన సలహాయే.

17. ఒక యౌవన పురుషుడు ‘స్వస్థబుద్ధిగలవాడై’ “సత్కార్యముల విషయమై మాదిరి”గా ఎలా తయారుకాగలడు?

17 లోకసంబంధ యౌవనులకు భిన్నంగా, ఒక యౌవన క్రైస్తవ పురుషుడు ‘స్వస్థబుద్ధిగలవాడై’ “సత్కార్యముల విషయమై మాదిరిగా” ఉండాలి. కేవలం పఠనముచేసేవారు గాక “అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగియున్నవారు” స్వస్థబుద్ధిని, పరిపక్వత చెందిన మనస్సును పొందగలరని పౌలు వివరించాడు. (హెబ్రీయులు 5:14) తమ యౌవన బలాన్ని స్వార్థపరమైన లక్ష్యాల కొరకు వ్యర్థం చేయడానికి బదులు, క్రైస్తవ సంఘమందలి అనేక బాధ్యతలలో పూర్తిగా భాగంవహించడానికి తమ సమయాన్ని శక్తిని స్వచ్ఛందంగా ఇస్తున్న యౌవనులను చూడడం ఎంత అద్భుతంగా ఉంటుంది! అలా చేస్తూ వారు కూడా తీతు వలెనే, క్రైస్తవ సంఘంలో ‘సత్కార్యముల విషయమై మాదిరి’గా తయారు కాగలరు.—1 తిమోతి 4:12.

18. ఉపదేశం విషయంలో మోసంలేనిదిగాను, క్రియలలో మాన్యులుగాను, సంభాషణలో హితకరంగాను ఉండడమంటే ఏమిటి?

18 యౌవన పురుషులకు గుర్తు చేయబడేదేమంటే, “[వారి] ఉపదేశము మోసములేనిదిగాను మాన్యమైనదిగాను నిరాక్షేపమైన హితవాక్యముతో కూడినదిగాను ఉండవలెను.” ‘మోసములేని’ ఉపదేశము దేవుని వాక్యంపై దృఢంగా ఆధారపడినదై ఉండాలి; కనుక, యౌవన పురుషులు పట్టుదలగల బైబిలు విద్యార్థులై ఉండాలి. వృద్ధ పురుషుల వలెనే, యౌవన పురుషులు కూడా మాన్యులై ఉండాలి. దేవుని వాక్య పరిచారకులై ఉండడం చాలా గంభీరమైన బాధ్యత అని వారు గుర్తించవలసిన అవసరం ఉంది, గనుక వారు “సువార్తకు తగినట్లుగా ప్రవర్తించు” వారైయుండాలి. (ఫిలిప్పీయులు 1:27) అలాగే వారి సంభాషణ ‘హితకరంగా’ ఉండాలి, మరి అలాంటిది “నిరాక్షేపమైన”దిగా ఉంటుంది. తద్వారా వ్యతిరేకించువారు ఫిర్యాదు చేయడానికి ఏ కారణము వారికి ఉండదు.—2 కొరింథీయులు 6:3; 1 పేతురు 2:12, 15.

దాసులు మరియు సేవకుల కొరకు

19, 20. ఇతరుల క్రింద ఉద్యోగం చేస్తున్నవారు ఎలా “మన రక్షకుడైన దేవుని బోధను అలంకరింపగలరు”?

19 చివరగా, పౌలు ఇతర ప్రజల క్రింద పనిచేస్తున్న వారిని గూర్చి మాట్లాడాడు. దయచేసి తీతు 2:9, 10 చదవండి. నేడు మనలో అనేకులం దాసులు లేక సేవకులముగా లేము, కాని అనేకులు ఇతరులకు సేవచేస్తున్న ఉద్యోగస్థులు, పనివారు. గనుక, పౌలు వివరించిన సూత్రాలు నేడు కూడా అలాగే వర్తిస్తాయి.

20 “దాసులైన వారు అన్ని విషయముల యందు . . . లోబడియుండవలెను” అంటే క్రైస్తవ ఉద్యోగస్థులు తమ యజమానులకు, పర్యవేక్షకులకు తగిన గౌరవం చూపాలని భావము. (కొలొస్సయులు 3:22) తన యజమానికి పూర్తి దినపు పనిని చేస్తూ, యథార్థమైన పనివారని వారికి మంచి పేరు కూడా ఉండాలి. అక్కడ ఉన్న ఇతరుల ప్రవర్తన ఎలావున్నప్పటికీ, తాము పనిచేయు స్థలాల్లో క్రైస్తవులు ఉన్నతమైన క్రైస్తవ ప్రవర్తనను కాపాడుకోవాలి. ఇదంతా వారు “మన రక్షకుడగు దేవుని ఉపదేశమును అలంకరించునట్లు” ఉండాలి. సాక్షులైన తమ తోటి పనివారు లేక ఉద్యోగస్థుల మంచి ప్రవర్తనను బట్టి యథార్థంగా గమనించేవారు సత్యానికి అనుగుణంగా ప్రతిస్పందించిన సంతోషకరమైన ఫలితాల గురించి మనం ఎంతో తరచుగా వింటాము! ఇది, తమ ఉద్యోగ స్థలాల్లో కూడా ఆయన హితబోధను అనుసరిస్తున్నందుకు యెహోవా వారికి అనుగ్రహించిన ప్రతిఫలము.—ఎఫెసీయులు 6:7, 8.

పరిశుభ్రపర్చబడిన ప్రజలు

21. యెహోవా ఎందుకు హితబోధను ఇచ్చాడు, దానికి మనమెలా ప్రతిస్పందించాలి?

21 పౌలు వివరించిన హితబోధ మనకు ఇష్టమైనప్పుడు మనం విచారించి చూచేటటువంటి కేవలం కొన్ని నైతిక సూత్రాలు లేక నైతిక విలువలు గల ధర్మశాస్త్రం కాదు. పౌలు దాని సంకల్పాన్ని వివరిస్తున్నాడు. దయచేసి తీతు 2:11, 12 చదవండి. అపాయకరమైన, భయంకరమైన ఈ కాలాల్లో మనం సంకల్పం గల, సంతృప్తికరమైన జీవితాన్ని జీవించడం నేర్చుకొనేలా, మన యెడల ఉన్న తన ప్రేమ, కృపాబాహుళ్యాన్ని బట్టి యెహోవా దేవుడు హితబోధను దయచేశాడు. హితబోధను అంగీకరించి, దాన్ని మీ జీవన విధానంగా చేసుకోడానికి మీరు ఇష్టపడుతున్నారా? అలా చేయడం మీ రక్షణకు నడిపిస్తుంది.

22, 23. హితబోధను మన జీవన విధానంగా చేసుకోవడం ద్వారా మనం ఏ ఆశీర్వాదాలను పొందుతాము?

22 అంతకంటే ఎక్కువగా, హితబోధను మన జీవన విధానంగా చేసుకోవడమనేది మనకు ఇప్పుడు విశేషమైన ఆధిక్యతను, భవిష్యత్తు కొరకు సంతోషకరమైన నిరీక్షణను తెస్తుంది. దయచేసి తీతు 2:13, 14 చదవండి. వాస్తవానికి, హితబోధను మన జీవన విధానంగా చేసుకోవడమనేది కలుషితమైన, నశించనైయున్న లోకం నుండి మనల్ని పరిశుభ్రపర్చబడిన ప్రజలుగా వేరుగా ఉంచుతుంది. యెహోవా “తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి ఘనత పేరు గలుగునట్లు నిన్ను హెచ్చించుదునని ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్టిత జనమై యుందువనియు” సీనాయి వద్ద మోషే ఇశ్రాయేలు కుమారుల కిచ్చిన జ్ఞాపికలకు పౌలు మాటలు సమాంతరంగా ఉన్నాయి.—ద్వితీయోపదేశకాండము 26:18, 19.

23 హితబోధను మన జీవన మార్గంగా చేసుకోవడం ద్వారా మనం యెహోవా యొక్క పరిశుభ్రపర్చబడిన ప్రజలుగా ఉండే ఆధిక్యతను ఎల్లప్పుడూ కాపాడుకుందాము! ఏ విధమైన భక్తిహీనతను లోకాశలను నిరాకరించడానికి ఎల్లప్పుడూ మెలకువ కలిగివుండడం ద్వారా, నేడు ఆయన చేయిస్తున్న ఘనమైన పనిలో యెహోవాచే ఉపయోగించుకోబడుటకు పరిశుభ్రంగా, తగినట్లుగా ఉండండి.—కొలొస్సయులు 1:10.

మీకు జ్ఞాపకం ఉన్నాయా?

◻ దైవభక్తి అన్ని విషయాలకు ఎందుకు లాభదాయకమైంది?

◻ వృద్ధ క్రైస్తవ పురుషులు, స్త్రీలు హితబోధను ఎలా జీవన మార్గంగా చేసుకోగలరు?

◻ సంఘంలోని యౌవన పురుషులకు, స్త్రీలకు పౌలు ఏ హితబోధను ఇచ్చాడు?

◻ హితబోధను మన జీవన మార్గంగా చేసుకుంటే మనం ఏ ఆధిక్యతను, ఆశీర్వాదాన్ని పొందవచ్చు?

[18వ పేజీలోని చిత్రాలు]

అనేకులు నేడు తీతు 2:2-4 నందలి ఉపదేశాన్ని అన్వయించుకుంటున్నారు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి