“యెహోవాసాక్షులు నన్ను సంరక్షించారు”
ఈ అంత్యదినాల్లో, అనేకులు తాము “క్రూరులు సజ్జనద్వేషులు” అని రుజువు చేసుకున్నారు. (2 తిమోతి 3:1, 3) పశ్చిమ ఆఫ్రికా నందలి వాచ్‌టవర్ బ్రాంచి కార్యాలయంలోని స్వచ్ఛంద పరిచారకుడైన ఐజ్సక్ ఇది నిజమని కనుగొన్నాడు. ఆయన యిలా వివరిస్తున్నాడు:
“జనవరి 1992లో నేను ఓ టాక్సీలో ఐదుగురు యితర ప్రయాణీకులతో ఓ పొడవైన నిర్జన రోడ్డుపైన ప్రయాణిస్తున్నాను. నా ప్రక్కన కూర్చున్న ఓ మహిళతో నేను సంభాషించడం ప్రారంభించాను. ఆమె సంతోషంగా నా దగ్గరన్నుండి ఓ బైబిలు ఆధారిత బ్రోషూర్‌ను పుచ్చుకుంది.
“అకస్మాత్తుగా, మధ్యాహ్నం సుమారు నాలుగు గంటలకు ఓ కొత్త కారు నంబరు ప్లేటు లేకుండా మా ముందుకు దూసుకు వచ్చింది, అప్పుడు మా కారు పెద్ద శబ్దంతో ఆగిపోయింది. ముగ్గురు బలమైన మనుషులు చేతుల్లో తుపాకులు పుచ్చుకుని ఆ కారునుండి దిగి, మా తలుపును తెరిచారు. ‘అందరూ బయటికు రండి’ అరిచాడు అందులోని ఒకడు.
“మరొకడు నా పుస్తకాల బ్యాగ్‌ను లాక్కున్నాడు, ఆ బ్యాగ్‌లో బైబిలు ప్రచురణలు తప్ప మరేవి లేవని చూసినవాడు బ్యాగ్‌ను విసిరేశాడు. తుపాకీని నావైపు చూపుతూ, ‘నీ దగ్గర యింకేముంది?’ అని నన్నడిగాడు. నా పర్సులోని డబ్బును నేను వెంటనే యిచ్చేశాను. ‘అంతేనా?’ అని అడిగాడు. నేను ఓ యెహోవాసాక్షినని, సాక్షులు ఎన్నడూ అబద్ధమాడరని నేను అతనితో చెప్పాను. నా పర్సు నా నుండి లాక్కుని, నా వాచ్‌టవర్ గుర్తింపు కార్టును చూసి, తర్వాత ‘సరే, వాచ్‌టవర్ యిక్కడుండు’ అన్నాడు.
“తర్వాత, అతను నేను టాక్సీలో సంభాషించిన మహిళవైపు తిరిగాడు. ఆవిడ త్వరగా తన నెక్లేసును తీసేసి, ఆమె పర్సులోని డబ్బును యిచ్చేసింది. ఆ దారిదోపిడీ దొంగ ఆమె వణికే చేతుల్లో బ్రోషూర్‌ను గమనించాడు, మేము కలిసి ఉన్నామనుకున్నాడు, అందుకని ఆవిడను నాతో ఉండమని సైగ చేశాడు.
“ఈ మధ్యలో యితర దొంగలు మాతోటి ప్రయాణీకులపైకి క్రూరంగా దాడిచేశారు. వారు డ్రైవరును మాతో ప్రయాణించే మరో వ్యక్తినీ కొట్టి దోచుకున్నారు. ఒక దొంగ రెండో మహిళ నెక్లేసును గట్టిగా పట్టుకున్నాడు. ఆవిడ యివ్వడానికి నిరాకరించినప్పుడు, వారు రైఫిల్ హేండిల్తో ఆమె చనిపోయేంత వరకు తలమీద ఛాతీమీద కొట్టారు. మూడవ మహిళను వారు బయిటికి లాగి, ఛాతీలో కాల్చేశారు. విషాదకరంగా ఆమెకూడా మరణించింది, కేవలం నేను నాతో ఉన్న ఆ యువతి మాత్రమే పూర్తిగా హానికల్గకుండా మిగిలాము.
“ఆ దారిన వెళ్లే ఓ మోటారు వ్యక్తి మాకు లిఫ్ట్ యిచ్చినప్పుడు, భయపడిన మహిళ పదేపదే యిలా చెబుతూవుంది: ‘యెహోవాసాక్షులు నన్ను సంరక్షించారు!’”