“దైవ భయము” జిల్లా సమావేశానికి స్వాగతము!
అవును, యెహోవాసాక్షుల 1994 జిల్లా సమావేశానికి అప్పుడే దాదాపు సమయం వచ్చేసింది. జూన్ 1994 నుండి జనవరి 1995 వరకు, ఉత్తర అమెరికా, తూర్పు మరియు పశ్చిమ ఐరోపాలలో, ఆసియా, మధ్య మరియు దక్షిణ అమెరికాలలో, ఆఫ్రికా, ఆస్ట్రేలియా మరియు సముద్ర ద్వీపాల్లో, ప్రపంచ వ్యాప్తంగా వందలాది నగరాల్లో మూడు రోజుల సమావేశ కార్యక్రమం వినిపించబోతుంది.
“దైవ భయము” ఎంతటి ఆలోచన రేకెత్తించే అంశము! ఇది ఎవరి జీవితమైనా ఆపదలో ఉంటే కలిగేలాంటి అనారోగ్యకరమైన భయం కాదు. దేవుని యెడల చూపే ఈ భయము, మనశ్శాంతిని, ఆనందాన్ని కలుగజేసే భయము. బైబిలు సామెత ఇలా తెలియజేస్తుంది: “యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట వినయమునకు ప్రతిఫలము ఐశ్వర్యమును ఘనతయు జీవమును దానివలన కలుగును.” (సామెతలు 22:4) దేవునికి భయపడటం “ఐశ్వర్యమును ఘనతయు, జీవమును” ఎలా కలుగజేయగలదు? ప్రసంగాలు, చర్చలు, ప్రదర్శనలు, నాటకంతో నిండివుండే మూడు రోజుల్లో సమావేశ అంశం ద్వారా అది క్రమంగా స్పష్టమౌతుంది.
మనం ‘సమాజముగా కూడుట’ మానకూడదని అపొస్తలుడైన పౌలు వ్రాశాడు. (హెబ్రీయులు 10:25) సంఘ పఠనం కొరకు, ఆరాధన కొరకు వారానికి మూడు సార్లు కలుస్తూ, యెహోవాసాక్షులు దాన్ని గంభీరంగా తీసుకుంటారు. అయినా, సాంవత్సరిక జిల్లా సమావేశం ప్రత్యేకం. వారు దాని కొరకు ఆశతో ఎదురు చూస్తారు, నెలల తర్వాత దాని గురించి మాట్లాడుకుంటారు. మీ మతం ఏదైనప్పటికీ, వారి సమావేశం వద్ద వారితో కలిసి వాత్సల్యపూరితమైన క్రైస్తవ సహవాసాన్ని, ప్రాముఖ్యమైన ఆత్మీయ సమాచారాన్ని ఆనందించమని మేము మిమ్మల్ని హార్దికంగా ఆహ్వానిస్తున్నాము. మీకు దగ్గరలో ఎక్కడ, ఎప్పుడు సమావేశం జరుగుతుందో తెలియజేయటానికి యెహోవాసాక్షుల స్థానిక సంఘ సభ్యులు సంతోషిస్తారు.