ప్రభువురాత్రి భోజనం—దానిని ఎంత తరచుగా ఆచరించాలి?
క్రిస్టమస్, ఈస్టర్, “సెయింట్స్” దినాలు. ఇటువంటి అనేక పర్వ దినాలనూ పండుగలనూ క్రైస్తవమత సామ్రాజ్య చర్చీలు ఆచరిస్తున్నాయి. అయితే ఎన్ని ఆచరణలను ఆచరించమని యేసుక్రీస్తు తన అనుచరులకు ఆజ్ఞాపించాడో మీకు తెలుసా? దాని జవాబు, కేవలం ఒక్కటే! మరింకే యితర పండుగల్ని ఆచరించమని క్రైస్తవమత స్థాపకుడు ఆనతినివ్వలేదు.
స్పష్టంగా, యేసు ఈ ఒక్క ఆచారాన్నే ఏర్పాటుచేసినట్లైతే, అది చాలా ప్రాముఖ్యమైంది అవుతుంది. క్రైస్తవులు కచ్చితంగా యేసు ఆజ్ఞాపించినట్లుగానే ఆచరించాలి. ఈ విశిష్ట ఆచరణ ఏమిటి?
ఒకే ఆచరణ
యేసు తాను చనిపోయిన రోజు రాత్రి ఈ ఆచరణను ప్రారంభించాడు. తన అపొస్తలులతో ఆయన యూదుల పస్కా పండుగను ఆచరించాడు. తర్వాత కొన్ని పులియని పస్కా రొట్టెలను వారికి పంచుతూ యిలా అన్నాడు: “ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము.” పిమ్మట, యేసు ఒక గిన్నెలో ద్రాక్షారసాన్ని అందిస్తూ యిలా అన్నాడు: “ఈ గిన్నె మీకొరకు చిందింపబడుచున్న నా రక్తము వలననైన క్రొత్త నిబంధన.” ఆయన యింకా యిలా అన్నాడు: “నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడి.” (లూకా 22:19, 20; 1 కొరింథీయులు 11:24-26) ఈ ఆచరణ, ప్రభువు రాత్రి భోజనమని లేక జ్ఞాపకార్థ దినం అని పిలువబడుతోంది. యేసు తన అనుచరులను ఆచరించమని ఆజ్ఞాపించిన ఏకైక ఆచరణ యిదే.
అనేక చర్చీలు, తాము యితర పండుగలతో పాటు ఈ ఆచరణను కూడా జరుపుకుంటామని చెప్పుకుంటుంటాయి, అయితే అందులో అనేకం యేసు ఆజ్ఞాపించిన విధానానికి భిన్నంగా దీనిని ఆచరిస్తాయి. బహుశ ఈ ఆచరణ ఎంత తరచుగా ఆచరించబడుతోందన్నదే అత్యంత గమనార్హమైన తేడాకావచ్చు. కొన్ని చర్చీలు దీన్ని నెలకోసారి, వారానికోసారి, రోజుకోసారి కూడా ఆచరిస్తుంటాయి. “నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడి” అని యేసు తన అనుచరులకు చెప్పినప్పుడు యిలానే ఉద్దేశించాడా? ది న్యూ ఇంగ్లీష్ బైబిల్ యిలా అంటోంది: “దీన్ని నా జ్ఞాపకార్థమై చేయండి.” (1 కొరింథీయులు 11:24, 25) ఓ జ్ఞాపకార్థదినాన్ని గానీ లేక ఓ వార్షిక ఆచరణను గాని ఎన్నిసార్లు జరుపుతారు? సహజంగా, సంవత్సరానికి ఒక్కసారే జరుపుతారు.
యేసు ఈ ఆచరణను ప్రారంభించి, యూదుల క్యాలెండరు ప్రకారం నీసాను 14వ తేదీన మరణించాడన్నది కూడా జ్ఞాపకముంచుకోండి.a సా.శ.పూ. 16వ శతాబ్దంలో ఐగుప్తు నందు యూదులు అనుభవించిన గొప్ప విడుదలను జ్ఞాపకం చేసే పండుగే ఈ పస్కా దినం. ఆనాడు, గొర్రెపిల్ల బలి యూదుల మొదటి సంతానానికి రక్షణ కాగా, ఐగుప్తులోని మొదటి సంతానాన్ని యెహోవా దూత హతమార్చాడు.—నిర్గమకాండము 12:21, 24-27.
ఇది మన గ్రహణ శక్తికి ఎలా తోడ్పడుతుంది? క్రైస్తవ అపొస్తలుడై పౌలు యిలా రాశాడు: “యేసు అను మన పస్కా పశువు వధింపబడెను.” (1 కొరింథీయులు 5:7) యేసు మరణం, మానవజాతి ఎంతో గొప్ప రక్షణనుపొందే అవకాశాన్నిస్తూ మరి గొప్ప పస్కా బలిగా ఉండెను. కాబట్టి క్రైస్తవులకు, యూదుల పస్కా స్థానే క్రీస్తు మరణదిన జ్ఞాపకార్థం వచ్చింది.—యోహాను 3:16.
పస్కా సాంవత్సరిక ఆచరణగా ఉండేది. కనుక సహేతుకంగా, జ్ఞాపకార్థదినం కూడా అంతే అవుతుంది. యేసు మరణించిన ఆ పస్కా దినం, అన్ని సమయాల్లో యూదుల నెలైన నీసాను 14వ రోజున వచ్చేది. కాబట్టి, మన క్యాలెండరులో నీసాను 14కు సరిగ్గా సరిపడే దినాన, అదీ సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే యేసు మరణ దినాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ రోజు 1994లో మార్చి 26 శనివారం నాడు సూర్యాస్తమయం తర్వాత వస్తుంది. అయితే, క్రైస్తవమత సామ్రాజ్య చర్చీలు దీనిని ఒక ప్రత్యేక ఆచరణ దినంగా ఎందుకు చేయలేదు? చరిత్రను క్లుప్తంగా పరిశీలించడం ఈ ప్రశ్నకు జవాబునిస్తుంది.
అపొస్తలుల ఆచారం అపాయంలో పడింది
సా.శ. మొదటి శతాబ్ద కాలంలో యేసు అపొస్తలులచే నడిపించబడినవారు ప్రభువు రాత్రి భోజనాన్ని ఆయన ఆజ్ఞాపించినట్లే తు.చ. తప్పకుండా ఆచరించారనడానికి సందేహం లేదు. అయితే, రెండవ శతాబ్ద కాలంలో, కొందరు దీన్ని ఆచరించే సమయాన్ని మార్చ నారంభించారు. వారు జ్ఞాపకార్థ దినాన్ని నీసాను 14కు సరిపడే దినాన కాక, వారంలోని మొదటి రోజున (ఇప్పుడు ఆదివారమని పిలవబడుతోంది) జరుపుకునేవారు. అలా ఎందుకు జరిగించారు?
యూదులకు, సాయంత్రం దాదాపు ఆరు గంటలకు ఓ రోజు ప్రారంభమై, మరుసటి రోజు అదే సమయం వరకు అది కొనసాగేది. యేసు సా.శ. 33, నీసాను 14న మరణించాడు, అది గురువారం సాయంత్రం నుండి శుక్రవారం సాయంత్రం వరకు కొనసాగింది. మూడవ రోజున అంటే ఆదివారం తెల్లవారుజామున ఆయన పునరుత్థానుడయ్యాడు. కొందరు యేసు మరణ దినాన్ని, అసలు నీసాను 14 ఏ రోజు వస్తుందో ఆ రోజుకు బదులుగా ప్రతి సంవత్సరమూ వారంలోని ఒక నిర్ణీత దినాన ఆచరించాలని కోరారు. అంతేకాదు, యేసు మరణ దినం కంటే, ఆయన పునరుత్థాన దినమే అతి ప్రాముఖ్యమైందిగా కూడా వారు దృష్టించారు. కనుక, వారు ఆదివారాన్ని ఎన్నుకున్నారు.
యేసు తన మరణాన్ని జ్ఞాపకం చేసుకోమన్నాడు గానీ ఆయన పునరుత్థానాన్ని కాదు. మనం యిప్పుడు ఉపయోగిస్తున్న గ్రెగోరియన్ క్యాలెండరు ప్రకారం, యూదుల పస్కా ప్రతి సంవత్సరమూ వేరువేరు రోజుల్లో వస్తుంది కనుక, జ్ఞాపకార్థ దినం విషయంలో కూడా అదే సరైందన్నది నిజం. కాబట్టి అనేకులు మొట్టమొదటి ఏర్పాటుకు హత్తుకుని ప్రభువు రాత్రి భోజనాన్ని ప్రతి సంవత్సరం నీసాను 14నే ఆచరించారు. కొద్ది కాలానికి వారు క్వార్టోడెసిమెన్స్ అని పిలువబడ్డారు, అంటే “పద్నాల్గవ దినాన్ని ఆచరించేవారు” అని అర్థము.
ఈ “పద్నాల్గవ దినాన్ని ఆచరించేవారు” అపొస్తలుల మొట్టమొదటి పద్ధతిని అనుసరిస్తున్నారని కొందరు విద్వాంసులు, గుర్తించారు. ఒక చరిత్రకారుడు యిలా అన్నాడు: “పస్కాను [ప్రభువు రాత్రి భోజనం] ఆచరించే దినం విషయంలో, ఆసియా నందలి క్వార్టోడెసిమన్ చర్చీలు యెరూషలేము చర్చీల పద్ధతిని అనుసరిస్తున్నాయి. రెండవ శతాబ్దంలో ఈ చర్చీలు నీసాను 14న ఆచరించే తమ పస్కా పండుగ క్రీస్తు మరణంవల్ల కలిగిన విమోచనను ఆచరించేవి.”—స్టడియా పాట్రిస్టికా సంపుటి 5, 1962, పేజి 8.
ఓ వివాదం పెరుగుట
ఆసియా మైనర్ నందలి అనేకులు అపొస్తలుల ఆచారాన్ని అనుసరిస్తూ ఉండగా, రోమ్‌లో మాత్రం ఆచరణకొరకు ఆదివారం నియమించబడింది. దాదాపు సా.శ. 155వ సంవత్సరానికి స్ముర్నాకు చెందిన ఆసియా సంఘాల ప్రతినిధి, పాలికార్ప్, దీన్నీ మరితర సమస్యలనూ చర్చించడానికి రోమ్ను సందర్శించాడు. విచారకమైన విషయమేమంటే, వారు ఈ విషయమై ఏ అంగీకారానికీ రాలేకపోయారు.
లాయన్స్కు చెందిన ఐరేనియస్ తన లేఖలో యిలా వ్రాశాడు: “అటు [రోమాకు చెందిన] ఆనిసిటస్ కూడా, పాలికార్ప్‌ను తాను సహవసించిన మన ప్రభువు శిష్యుడైన యోహానుతోనూ యితర అపొస్తలులతోను ఎల్లప్పుడూ ఆచరించిన దాన్ని మానుకొమ్మని ఒప్పించలేకపోయాడు; ఇటు పాలికార్ప్ దాన్ని ఆచరించమని ఆనిసిటస్ను ఒప్పించలేకపోయాడు, కారణం తన ముందున్న పెద్దల ఆచారానికి హత్తుకుని ఉండాలని ఆనిసిటెస్ చెప్పాడు.” (యుసెబియస్ 5వ పుస్తకం, 24వ అధ్యాయం) పాలికార్ప్ తన వైఖరిని అపొస్తలుల అధికారంపై ఆధారం చేశాడు, అయితే ఆనిసెటస్ రోమ్ నందలి మునుపటి పెద్దల ఆచారాన్ని గూర్చి మాట్లాడటాన్ని గమనించండి.
ఈ వివాదం సా.శ. రెండవ శతాబ్దాంతానికి ఉద్ధృతమైపోయింది. సా.శ. 190 సంవత్సరం వచ్చేసరికి, విక్టర్ రోమ్కు ఎన్నుకోబడిన బిషప్‌గా ఉన్నాడు. ప్రభువు రాత్రి భోజనం ఆదివారం నాడు జరగాలని ఆయన నమ్మాడు, అందుకు అతను తనకు సాధ్యమైనంతమంది యితర నాయకుల మద్దతును అర్థించాడు. విక్టర్ ఆసియా సంఘాలను ఆదివారం ఏర్పాటుకు మార్చుకోమని బలవంతం చేశాడు.
ఆసియా మైనరులోనివారి పక్షంగా జవాబునిస్తూ, ఎఫెస్సుకు చెందిన పోలిక్రెటెస్ ఈ వత్తిడికి లొంగలేదు. ఆయన యిలా అన్నాడు: “ఆ దినాన్ని మేము మార్పుచేయకుండా, దానికి ఏమీ చేర్చకుండా దానిలోనుండి ఏమీ తీసివేయకుండా ఆచరిస్తాం.” ఆ తర్వాత అపొస్తలుడైన యోహానుతో సహా ఆయన అనేక అధికార మూలాలను సూచించాడు. “వీరందరూ, దీన్నుండి ఏమాత్రం తొలగకుండా సువార్తల ప్రకారం పస్కాను పద్నాల్గవ దినాన ఆచరించారు” అని చెప్పాడు. పోలిక్రెటెస్ యింకా యిలా అన్నాడు: “సహోదరులారా నేను మాత్రం . . . బెదిరింపులకు జడిసిపోను. ఎందుకంటె నాకంటే మరి శ్రేష్ఠులైన అపొస్తలులు, మనం మనుష్యులకు కాదుగానీ దేవునికే లోబడి ఉండాలని అన్నారు.”—యుసెబియస్, 5వ పుస్తకం, 24వ అధ్యాయము.
ఈ ప్రత్యుత్తరానికి విక్టర్ అప్రీతి చెందాడు. ఒక చారిత్రాత్మక మూలం యిలా చెబుతోంది, “ఆయన ఆసియా చర్చీలన్నింటిని బహిష్కరించాడు, అంతేకాకుండా ఆ చర్చీలతో ఏ సంబంధం కల్గివుండవద్దనే తాఖీదును తనతో ఏకీభవించే చర్చీలన్నిటికీ, పంపించాడు.” అయితే, “తన అభిప్రాయానికి చెందినవారిలో వివేకం, స్థిరనిశ్చయత గల వ్యక్తులనేకులు ఈ కఠినమైన, నిర్భిక్ష చర్యను సమ్మతించలేదు. వారిలో చాలామంది ఆయనకు సలహానిస్తూ . . . ప్రేమ, ఐక్యత, శాంతిని కాపాడవలసిందని ఖండితంగా రాసారు.”—బింగ్హామ్ వ్రాసిన ఆంటిక్విటీస్ ఆఫ్ ది క్రిస్టియన్ చర్చ్, 20వ పుస్తకం, 5వ అధ్యాయము.
వ్యవస్థాపరమైన మతభ్రష్టత్వం
అటువంటి వ్యతిరేకత ఉన్నప్పటికీ, ఆసియా మైనరులోని క్రైస్తవులు, ప్రభువురాత్రి భోజనం ఎప్పుడు ఆచరించాలన్న విషయంపై మరింత వేరైపోయారు. మరోచోట విభిన్నాభిప్రాయాలు మెల్లి మెల్లిగా చోటుచేసుకోవడం ప్రారంభించాయి. కొందరు నీసాను 14 నుండి ఆదివారం వరకు అంటే ఆ మధ్యనున్న రోజుల్నీ ఆచరించారు. మరికొందరు ఈ ఆచరణను యింకా తరచుగా జరుపుకునేవారు అంటే, వారానికోసారి ఆదివారం నాడు జరుపుకునేవారు.
సా.శ. 314లో ఎర్లెస్ కౌన్సిల్ (ఫ్రాన్స్) రోమ్ చేసిన ఏర్పాటును బలవంతంగా అమలుపెట్టడానికి, ఎలాంటి ప్రత్యామ్నాయాలనైనా అణగద్రొక్కడానికి ప్రయత్నించింది. మిగిలిన క్వార్టోడెసిమెన్స్ దానిని తిరస్కరించారు. ఈ విషయాన్ని, అలాగే తన సామ్రాజ్యంలో నామకార్థ క్రైస్తవులను విడదీసే యితర విషయాలనూ సరిదిద్దడానికి, సా.శ. 325లో అన్యుడైన కాన్స్టెంటైన్ చక్రవర్తి నైసియా కౌన్సిల్ అనే ఓ సర్వమత సభను ఏర్పాటు చేశాడు. ఆ సభ ఆసియా మైనరులో ఉన్నవారందరూ రోమన్ ఆచరణకు కట్టుబడియుండాలనే ఓ ఉత్తరువును జారీచేసింది.
క్రీస్తు మరణ జ్ఞాపకార్థ దినాన్ని యూదుల క్యాలెండరు ప్రకారం ఆచరించకపోడానికి వెల్లడించబడిన ఓ ప్రముఖ వాదనను గమనించడం ఆసక్తికరంగా ఉంటుంది. కె. జె. హఫెలె వ్రాసిన ఎ హిస్టరీ ఆఫ్ ది క్రిస్టియన్ కౌన్సిల్స్ యిలా పేర్కొంటోంది: “అన్ని పండుగల కంటే అతి పరిశుద్ధమైనదాన్ని ప్రత్యేకంగా దీన్ని అతి భయానక హింసల్లో పాల్గొన్న, గ్రుడ్డి మనస్కులైన యూదుల ఆచారం (లెక్కల) ప్రకారం ఆచరించడం, ఏమాత్రం తగింది కాదని ప్రకటించబడింది.” (సంపుటి 1, పేజీ 322) “అలా చేయడమంటే, చర్చి అధికారాన్ని సంకటపర్చే సమాజమందిరానికి ‘అవమానకరంగా లోబడ్డం అవుతుంది’” అని జె. జస్టర్ చెప్పినట్లు స్టడియా పాట్రిస్టికా, సంపుటి 4, 1961, పేజీ 412లో ప్రస్తావించింది.
అది యూదులను మతగుంపుగా నిరాకరించడమే! యేసు మరణ జ్ఞాపకార్థ దినాన్ని ఆయన మరణించిన దినాన ఆచరించినవారు యూదుల ఆచారాలను అనుసరించేవారని పరిగణించబడ్డారు. యేసు తానే ఓ యూదుడనీ ఆయన తన జీవితాన్ని మానవజాతి కొరకు అర్పించి ఆ రోజుకున్న భావాన్ని తెలియజేశాడనీ మరువబడింది. ఆనాటినుండి, క్వార్టోడెసిమన్లు ధర్మవిరోధులని మత విభేదం కల్గించేవారనీ నిందించబడి, హింసించబడ్డారు. సా.శ. 341లో ఆంటియాక్ కౌన్సిల్, వారు బహిష్కరించబడినవారని ప్రకటించింది. అయినప్పటికి, సా.శ. 400లో యింకా చాలా మంది క్వార్టోడెసిమన్లు ఉన్నారు, ఆ తర్వాత వారు కొద్ది సంఖ్యల్లో అలా కొనసాగుతూ వచ్చారు.
ఆ నాటి నుండి, క్రైస్తవమత సామ్రాజ్యం యేసు చేసిన మొదటి ఏర్పాటుకు కట్టుబడి ఉండడంలో విఫలమైంది. విలియం బ్రైట్ అనే ప్రొఫెసర్ యిలా ఒప్పుకున్నారు: “మరణానికి ముందు యేసు అనుభవించిన శ్రమలను జ్ఞాపకం చేసుకోడానికి ప్రత్యేక దినమైన గుడ్ ప్రైడే నియమించబడేటప్పటికి, పండుగల్లోకెల్లా అతి పవిత్రమైన ఈ పండుగను, ప్రత్యేకంగా పరిశుద్ధ పౌలు బలి మరణానికి ముడిపెట్టిన ‘పస్కా’ సంబంధిత అంశాలకు దానిని పరిమితం చేయడానికి అప్పటికే అది ఆలస్యమైపోయింది. పస్కా సంబంధిత అంశాలు అరమరికలులేకుండా పునరుత్థాన పండుగలకే అన్వయించబడ్డాయి. ఆ కారణంగా గ్రీకు, లాటిన్ క్రైస్తవమత సామ్రాజ్య మతాచార భాషల్లో గందరగోళ తలంపులు నెలకొన్నాయి.”—ది ఏజ్ ఆఫ్ ది ఫాదర్స్, సంపుటి 1, పేజీ 102.
ఈనాటి మాటేమిటి?
‘ఇన్ని సంవత్సరాల తర్వాత, జ్ఞాపకార్థ దినాన్ని ఎప్పుడు ఆచరిస్తున్నామన్నది పరిశీలించాల్సిన విషయమేనా?’ అని మీరడగవచ్చు. అవును, తప్పనిసరిగా. అధికారం కొరకు తాపత్రయపడిన కఠిన మనస్కులు ఆ మార్పులను చేశారు. యేసుక్రీస్తుకు లోబడడానికి బదులు ప్రజలు తమ స్వంత తలంపులను అనుసరించారు. అపొస్తలుడైన పౌలు చేసిన హెచ్చరిక స్పష్టంగా నెరవేరింది: “నేను వెళ్లిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్లు [క్రైస్తవుల్లో] మీలో ప్రవేశించునని నాకు తెలియును; వారు మందను కనికరింపరు. మరియు శిష్యులను తమవెంట ఈడ్చుకొని పోవలెనని వంకర మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుదురు.”—అపొస్తలుల కార్యములు 20:29, 30.
ఇక్కడి విషయం విధేయతకు సంబంధించింది. క్రైస్తవులు ఆచరించడానికి యేసు ఒకేఒక ఆచరణను ఏర్పాటు చేశాడు. దాన్ని ఎప్పుడు ఎలా ఆచరించాలన్న విషయాలను బైబిలు స్పష్టంగా వివరిస్తోంది. మరి దాన్ని మార్చగల హక్కు ఎవరికుంది? మొదటి క్వార్టోడెసిమన్లు ఈ విషయంపై రాజీపడకుండా హింసనూ, బహిష్కారాన్ని అనుభవించారు.
యేసు ఉద్దేశాలను గౌరవించి, ఆయన మరణ జ్ఞాపకార్థ దినాన్ని ఆయన ఏర్పాటు చేసిన రోజునే ఆచరించే క్రైస్తవులు యింకా ఉన్నారని తెలుసుకోవడం మీకు ఆసక్తికరంగా ఉండవచ్చు. ఈ సంవత్సరం, నీసాను 14వ దినం ప్రారంభమైనప్పుడు—యెహోవాసాక్షులు తమ రాజ్యమందిరాల్లో మార్చి 26 శనివారం నాడు సా. 6:00గం. తర్వాత కూడుకుంటారు. ఈ అత్యంత అర్థవంతమైన సమయంలో యేసు దేన్నైతే చేయమన్నాడో దాన్ని వీరు అలాగే చేస్తారు. మీరు వారితో ప్రభువు రాత్రి భోజనాన్ని ఎందుకు ఆచరించకూడదు? మీరక్కడ హాజరుకావడం వల్ల, యేసుక్రీస్తు ఉద్దేశాలకు మీరు కూడా గౌరవాన్ని కనపర్చవచ్చు.
[అధస్సూచీలు]
a యూదుల మొదటి నెలైన నీసాను, పున్నమి చంద్రుడు మొట్టమొదటిసారిగా కనిపించినప్పుడు ప్రారంభమౌతుంది. కాబట్టి నీసాను 14 పున్నమి చంద్రుడున్న నాడే ఎల్లప్పుడూ వస్తుంది.
[6వ పేజీలోని బాక్సు]
“ఆ అమూల్య విమోచన క్రయధనము”
యేసుక్రీస్తు విమోచన క్రయధన బలి మరే సిద్ధాంతంకన్నా ఎంతో గొప్పది. యేసు తనను గూర్చి యిలా చెప్పాడు: “మనుష్యకుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెను.” (మార్కు 10:45) ఆయన యింకా యిలా వివరించాడు: “దేవుడు [మానవజాతి] లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.” (యోహాను 3:16) ఈ విమోచన క్రయధనం మృతులకు పునరుత్థాన ద్వారాన్ని తెరచి, నిత్యజీవితపు ఉత్తరాపేక్షను అందిస్తుంది.—యోహాను 5:28, 29.
ప్రభువు రాత్రి భోజనం ఆచరణనందు ఎంతో ఆవశ్యమైన యేసుక్రీస్తు మరణ దినం జ్ఞాపకం చేసుకోబడుతుంది. ఆయన బలి ఎంతో సాధిస్తుంది! దైవభక్తిగల తలిదండ్రుల నుండి శిక్షణ పొంది, దేవుని సత్యంలో ఏళ్లతరబడిగా ఉన్న ఓ మహిళ ఈ మాటల్లో తన మెప్పును వ్యక్తపర్చింది:
“మేము జ్ఞాపకార్థదినానికై ఎదురు చూస్తున్నాము. ప్రతి సంవత్సరమూ అది మరింత ప్రాముఖ్యమౌతోంది. నేను 20 ఏళ్లక్రితం, నా ప్రియమైన నాన్నగారి శవం వంక చూస్తూ అంత్యక్రియలు జరిపించడానికి ఏర్పాట్లుచేసిన గృహంలో నిలబడటం, విమోచన క్రయధనం యెడల నిజమైన హృదయపూర్వక మెప్పును పొందడం నాకు జ్ఞాపకమున్నాయి. అంతకుముందు అది పైపై జ్ఞానంగా మాత్రమే ఉండేది. నాకిప్పుడు అన్ని లేఖనాలూ వాటిని వివరించడం కూడా తెలుసు! అయితే మరణాన్ని గూర్చిన తలంపు వచ్చినప్పుడు మాత్రం, ఆ అమూల్య విమోచన ద్వారా ఏమి సాధ్యమౌతుందన్న విషయాన్నిబట్టి నా హృదయం ఆనందంతో పరవళ్లుత్రొక్కుతుంది.”