కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w94 3/1 పేజీలు 24-28
  • నా జీవితంలో “యెహోవా బాహుబలము”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • నా జీవితంలో “యెహోవా బాహుబలము”
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • తొలి ప్రాయంలోనే ప్రకటనా పని
  • కెనడాలో మన సేవ నిషేధింపబడింది
  • పూర్తికాల పరిచర్య యొక్క అనేక ఆకృతులు
  • బ్రెజిల్‌లో మా పిల్లలను పెంచుట
  • కెనడాకు తిరిగి రావడం
  • సరైన ఎంపికలు చిరకాల ఆశీర్వాదాలను తెచ్చాయి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
  • యెహోవా నాకు చిన్నప్పటి నుండి శిక్షణ ఇచ్చాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2026
  • ఐక్య కుటుంబంగా యెహోవా సేవచేయడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • మేము ఎన్నో విధాలుగా దేవుని అపారదయను రుచిచూశాం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2017
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
w94 3/1 పేజీలు 24-28

నా జీవితంలో “యెహోవా బాహుబలము”

లారెన్స్‌ థామ్స్‌న్‌ చెప్పింది

ఒకరాత్రి 1946లో, ఆకాశంలో ఉత్తరధ్రువప్రకాశం నాట్యంచేస్తుంటే నేను, మా నాన్న కారులో కూర్చొని గమనిస్తున్నాము. మేము యెహోవా యొక్క ఉన్నతత్వాన్ని, మా అల్పత్వాన్ని గురించి చర్చించుకున్నాము. కెనడాలో యెహోవా సాక్షుల పని నిషేధింపబడినప్పటి సంవత్సరాలలోని ఘటనలను గురించిన గతస్మృతులను గుర్తుచేసుకున్నాము. ఆ సంవత్సరాలలో యెహోవా తన ప్రజలను ఎలా కాపాడి నడిపింపునిచ్చాడో నాన్న నాకు తెలియజేశాడు.

నేను అప్పటికి 13 సంవత్సరాల వాడినే అయినప్పటికీ, నేను నాన్న చెబుతున్నదానిలోని సత్యాన్ని గ్రహించగల్గాను. ఇంకా జరగవలసివున్న ప్రచార పని అత్యవసరతను, విస్తారతను గూర్చి కూడ నాన్న నాకు తెలియజేశాడు. సంఖ్యాకాండము 11:23ను ఉదహరిస్తూ, నిజంగా యెహోవా బాహుబలము ఎప్పుడూ తక్కువకాదని నాన్న నొక్కి చెప్పాడు. మన అవిశ్వాసం, ఆయనయందలి మన అపనమ్మకమే మనకు ఆయన చేసేదానిని తగ్గిస్తుంది. అది తండ్రి కుమారుల మధ్య జరిగిన ఎంతో విలువైన సంభాషణ. దానిని నేనెన్నటికీ మరచిపోలేను.

వాచ్‌టవర్‌ ప్రచురణలను చదవడం ముఖ్యంగా, 1939లో ప్రచురింపబడిన సాల్వేషన్‌ పుస్తకాన్ని చదవడం నా తొలి జీవితంపై చాలా ప్రభావాన్ని చూపింది. దాని నాటకీయమైన ప్రారంభ ఉపమానాన్ని నేను ఎన్నటికీ మరచిపోలేను: “ప్రయాణీకులతో క్రిక్కిరిసి వున్న స్ట్రీమ్‌లైన్‌ ఎక్స్‌ప్రెస్‌ గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నది. బల్లపరుపుగావున్న చివరి బోగీలో వారు ఇంజన్‌ను చూడగల్గేలా దాదాపు 50 శాతం వంపు తిరిగిన నదిపైనున్న వంతెనను అది దాటాలి . . . ఆ చివరి బోగీలో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు . . . వంతెన యొక్క ఆ చివర మంటలు అంటుకొని వంతెనకూలి నదిలోకి పడిపోతున్నట్లు చూసారు. వారు తాము పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కోబోతున్నామని గ్రహించారు. అది నిజంగా అత్యవసర పరిస్థితి. ప్రయాణిస్తున్న అనేకుల జీవాన్ని రక్షించుటకు వీలుగా రైలు తగిన సమయానికి ఆపబడగలదా?”

ఆ ఉపమానాన్ని అన్వయిస్తూ, ఆ పుస్తకం ఇలా ముగించింది: “అలాగే ఈనాడు, ప్రపంచంలోని జనులందరు గొప్ప అత్యవసర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. దేవుడు ఆజ్ఞాపించునట్లు, అర్మగిద్దోను యొక్క నాశనం త్వరలోనే వుందని వారు హెచ్చరింపబడుతున్నారు. . . . అలా హెచ్చరింపబడిన ప్రతి ఒక్కరు తమ స్వంత మార్గాన్ని ఎన్నుకోవాలి.”

వేగంగా వెళుతున్న రైలు, కాలుతున్న వంతెన, ప్రకటనపని అత్యవసరత నా మనస్సులో చెరగని ముద్రవేశాయి.

తొలి ప్రాయంలోనే ప్రకటనా పని

నాకు ఐదేళ్లు ఉన్నప్పుడు, 1938లో నేను ప్రకటనా పనిలో భాగం వహించడం మొదలుపెట్టాను. హెన్రీ మరియు ఆలిస్‌ ట్వీడ్‌ అనే ఇద్దరు పయినీర్లు, నన్ను తమ వెంట తీసుకుని వెళ్లేవారు, మేము రోజుకు 10 నుండి 12 గంటల వరకు ప్రజలతో మాట్లాడుతూ గడిపేవారము. యెహోవా సేవలో గడిపిన ఆ పూర్తి దినాలను నేను చాలా ఆనందించాను. మరుసటి సంవత్సరం నేను ప్రచారకున్నై, నా సేవను రిపోర్టు చేయటానికి మా అమ్మా, నాన్న అనుమతించినందుకు నేనెంతో సంతోషించాను.

ఆ తొలికాలంలో అబద్ధ మతాన్ని బహిర్గతం చేసి. దేవుని రాజ్యాన్ని ప్రకటించే నినాదాలు వ్రాసివున్న అట్టలను ధరించి నగర ప్రధాన వీధుల్లో నడుస్తూ, మేము సమాచార యాత్రలలో పాల్గొన్నాము. మేము తేలికైన ఫోనోగ్రాఫ్‌లను మరియు బైబిలు ఆధారిత సమాచారాలను తీసుకువెళ్లి గృహస్థుల గడపవద్దనే వినిపించేవారము. వాచ్‌టవర్‌ సంస్థ అధ్యక్షుడైన జె. ఎఫ్‌. రూథర్‌ఫోర్డ్‌ ప్రసంగాలను వినిపించేవారము. వాటిలో కొన్ని నాకు కంఠస్థం వచ్చు. “మతం ఒక ఉచ్చు, ఒక కుంభకోణం అని తరచుగా చెప్పబడుతుంది!” అని ఆయన అనడం నాకు ఇంకా గుర్తుంది.

కెనడాలో మన సేవ నిషేధింపబడింది

నాజీ జర్మనీ మరియు ఇతర దేశాలలో జరిగినట్లే, కెనడాలో కూడా యెహోవాసాక్షుల పని రెండవ ప్రపంచ యుద్ధసమయంలో నిషేధింపబడింది. కాబట్టి మేము కేవలం బైబిలును మాత్రమే ఉపయోగించాము కాని, బైబిలు ఉపదేశాలకు లోబడుతూ, దేవుడిచ్చిన పనిని కొనసాగించాము. (మత్తయి 28:19, 20; అపొస్తలుల కార్యములు 5:29) మా ఇళ్లపై, మా కూటాలపై పోలీసు దాడులు జరిగితే, దాన్ని ఎదుర్కొనడాన్ని మేము నేర్చుకున్నాము. మేము న్యాయాధిపతుల ముందు సాక్ష్యమివ్వడంలో, న్యాయవాదులకు జవాబివ్వడంలో కూడా అనుభవజ్ఞులమయ్యాము.

నా అన్నయ్య జిమ్‌, నేను కదులుతున్న వాహనాలలో నుండి గడపలలోకి, వరండాలలోనికి చిన్నపుస్తకాలను విసరడంలో సిద్ధహస్తులమయ్యాము. అమెరికాలో సమావేశాలకు హాజరు కావడానికి సరిహద్దును దాటి వెళ్తున్న వారికొరకు మేము వార్తాహరులుగా, కొన్నిసార్లు కావలివారిగా కూడ పనిచేసాము.

రెండెకరాల స్థలంలో చెట్లు, పొదలతో చుట్టుముట్టివున్న అర్తర్‌ ఓడరేవు (ఇప్పుడు తండర్‌ బే), ఆన్‌టార్యో పొలిమేరలలో మా ఇల్లు వుండేది. దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తున్నందుకు నిర్భందించటానికి గాలించబడుతున్న తోటి క్రైస్తవ యౌవనస్థులను ఇతరులకు తెలియకుండా దాచడానికి మాకున్న ఒక ఆవు, ఒక దూడ, పందులు, కోడిపిల్లలు ఎంతో సహాయపడ్డాయి.

క్రైస్తవ యౌవనస్థులను తీసుకువెళ్లే కార్లు, ట్రక్కులు, ట్రెయిలర్లు రాత్రికెల్లా, మా ప్రాంగణంలోనికి వస్తూ వెళ్తూండేవి. మేము ఈ యౌవనస్థులను ఇంట్లో వుంచుకుని, దాచి, మారువేషం వేయించి, భోజనం పెట్టి వారి దారిన వారిని పంపేవాళ్లము. నేను యెహోవాను ప్రేమించి, సేవించటానికి పూర్ణాత్మతో సేవచేస్తున్న నా తలిదండ్రులు, ఆ తొలి పనివారు నా లేతహృదయాన్ని ప్రేరేపించారు.

ఆగష్టు 1941లో, నేను నా జీవితాన్ని యెహోవాకు సమర్పించుకుని అడవిలోని ఒక చిన్న చెరువులో బాప్తిస్మం తీసుకున్నాను. దీపం వెలిగింపబడిన ఒకచిన్న గదిలో చాలా రాత్రయ్యాక, ఈ సంఘటన కొరకు కొంతమందిమి సమావేశమయ్యాము. చెరువును సెర్చిలైట్లతో గాలిస్తూ, పోలీసులు అనుమానంతో మా కొరకు వెదికారు కాని మమ్మల్ని కనుగొనలేకపోయారు.

పూర్తికాల పరిచర్య యొక్క అనేక ఆకృతులు

నేను 1951లో ఉన్నత పాఠశాల విద్య ముగించుకుని కోబెర్గ్‌, ఆన్‌టార్యో నందు పయినీరు పనిని చేపట్టడానికి దాదాపు 1,600 కిలోమీటర్లు ప్రయాణించాను. ఆ సంఘం చిన్నది, నాకు పయినీరు జత కూడ లేరు. కాని యెహోవా బాహుబలము తక్కువకాదని గుర్తుంచుకొని, ఒక గది అద్దెకు తీసుకుని, స్వయంగా వంటచేసుకుంటూ, యెహోవాను సేవించగలుగుతున్నందుకు నేనెంతో ఆనందించాను. తరువాతి సంవత్సరం సేవచేయటానికి టోరంటోలోని వాచ్‌టవర్‌ సంస్థ బ్రాంచి కార్యాలయానికి నేను ఆహ్వానింపబడ్డాను. భవిష్యత్‌ రాజ్య పరిచర్య కొరకు నన్ను శుద్ధిచేసిన అనేక విలువైన పాఠాలను అక్కడ నేను నేర్చుకున్నాను.

నేను పయినీరుగా టోరంటోలో ఒక సంవత్సరం సేవ చేసిన తరువాత, నేను, లూసి ట్రూడియో వివాహం చేసుకున్నాము. తరువాత 1954 చలికాలంలో, లేవీస్‌, క్యూబెక్‌లో సేవచేయటానికి మేము పయినీర్లుగా నియమింపబడ్డాము. అక్కడ వాతావరణం చాలా చలిగా వుంది, అల్లరిమూకలు, పోలీసుల బాధలు భయపెట్టేవి, ఫ్రెంచి భాష నేర్చుకోవడం ఒక సవాలుగా ఉండేది. వీటన్నిటిలో యెహోవా బాహుబలము ఎప్పుడూ తక్కువకాలేదు కాబట్టి, కష్టసమయాలు ఉన్నప్పటికీ, మేము ఎన్నో ఆశీర్వాదాలను కూడా పొందాము.

ఉదాహరణకు, 1955లో పెద్ద అంతర్జాతీయ ఐరోపా సమావేశాలకు ప్రతినిధులను తీసుకువెళ్లటానికి సంస్థ ఉపయోగించ దలచిన రెండు ఓడలను (అరోసా స్టార్‌, అరోసా కల్మ్‌) పరిశీలించమని మమ్మల్ని కోరారు. సంస్థతో వ్యాపారలాభం పొందడానికి, ఓడ కంపెనీల అధికారులు అప్పుడప్పుడు మాకు ఆతిధ్యం ఇచ్చేవారు, ఆ సమయంలో క్యూబెక్‌లో పరిచర్య చాలా భారంగా ఉండేది గనుక వారి ఆతిధ్యం విశ్రాంతి కలిగించేదిగా వుండేది.

నేను 1955 శరదృతువులో ప్రయాణకాపరిగా సేవచేయటానికి ఆహ్వానించబడ్డాను, అతిశీతల ఉత్తర ఆన్‌టార్యోలోని సుదూర సంఘాలను దర్శిస్తూ మేము ఆ చలికాలం గడిపాము. తరువాతి సంవత్సరం అమెరికాలో వాచ్‌టవర్‌ బైబిల్‌ స్కూల్‌ ఆఫ్‌ గిలియడ్‌కు హాజరై, తరువాత దక్షిణ అమెరికా, బ్రెజిల్‌కు మిషనరీలుగా పంపబడ్డాము.

మాక్రొత్త పనిని మేము ఉత్సాహంగా మొదలుపెట్టి త్వరలోనే పోర్చుగీస్‌ భాషలో ప్రకటించడం, బోధించడం చేయగలిగాము. మళ్లీ 1957లో నేను ప్రయాణకాపరిగా నియమింపబడ్డాను. ఇప్పుడు, ఉత్తరపు అతిశీతల చల్లదనానికి బదులు మేము తీవ్రమైన వేడితో పోరాడాలి. అనేకసార్లు మేము ఆగి మా బూట్లలో పడిన కాలుతున్న ఇసుకను తీసివేసుకోవడం లేక మా శక్తిని నూతన పర్చుకోవటానికి చెరుకుగడలను తినవలసివచ్చేది. అయినా ఆశీర్వాదాలు కూడా వుండేవి.

రిజెంటి ఫాజు నగరంలో, నేను పోలీసు ఉన్నతాధికారితో మాట్లాడాను, అన్ని దుకాణాలు మూసివేసి ప్రతిఒక్కరినీ నగర కూడలి యొద్దకు వెళ్లమని ఆయన ఆదేశించాడు. ఒక పెద్ద ఆకులున్న పువ్వుల చెట్టు క్రింద నేను నగర ప్రజలందరికీ బైబిలు ప్రసంగమిచ్చాను. నేడు అక్కడ ఒక సాక్షుల సంఘం వుంది.

బ్రెజిల్‌లో మా పిల్లలను పెంచుట

లూసీ 1958లో గర్భవతి అయినప్పుడు, మేము జ్యుయిజ్‌ డె ఫోరాలో స్థిరపడి, ప్రత్యేక పయినీర్లుగా సేవచేసాము. తరువాతి రెండు సంవత్సరాలలో, మా కుమార్తెలు సూజెన్‌, కిమ్‌ జన్మించారు. వారు నగరంలో ఒక విశేషంగా తయారవ్వటం ద్వారా మాకు పరిచర్యలో నిజంగా ఆశీర్వాదమని నిరూపించబడ్డారు. వారిని మేము కాబల్‌స్టోన్‌ వీధుల గుండా షికారుకు తీసుకునివెళ్తుంటే వారిని చూడటానికి ప్రజలు బయటికి వచ్చేవారు. భూమధ్యరేఖకు దక్షిణాన, రిసైఫ్‌లో రాజ్య ప్రచారకుల అవసరత ఎక్కువగా వుంది గనుక మేము ఆ అతి ఉష్ణప్రాంతానికి వెళ్లాము.

సావొ పౌలోలో జరుగుతున్న సమావేశానికి వెళుతున్న సాక్షులకు విమాన ప్రయాణ ఏర్పాట్లు చేయటంలోనే గాక 1961లో నేను కూడా ఆ జ్ఞాపకార్ధ సమావేశానికి హాజరు కాగలిగాను. దాదాపు 20 నిమిషాల తరువాత, ప్రయాణీకులు కాబిన్‌ చుట్టూ పడిపోయేలా చేస్తూ హఠాత్తుగా విమానం క్రిందికి కూలిపోవడం ప్రారంభించింది. విమానం లోపలిభాగం పగిలిపోయింది; సీట్లు వాటి స్ధానాల్లోనుండి కదిలిపోయాయి, ప్రయాణీకులకు గాయాలయ్యి, రక్తం చిందింది. సంతోషకరంగా, పైలెట్‌ విమానం కూలిపోకుండా ఆపగలిగాడు, మేము క్షేమంగా దిగాము. వేరే విమానంలో సావొ పౌలోకు వెళ్లలేక పోయేంతగా మాకు ఎవరికీ పెద్ద గాయాలేమి తగలలేదు. మేము అద్భుతమైన సమావేశాన్ని ఆనందించాము, కాని నేను మళ్లీ ఎప్పుడూ విమానం ఎక్కనని చెప్పాను.

అయితే, నేను సమావేశం నుండి ఇంటికి వచ్చిన తరువాత, నాకు మరో పని అప్పగింపబడింది. పావూ రాష్ట్రంలో, తెరెసినా అడవిలో జరిగే సమావేశాన్ని నేను పర్యవేక్షించాలి. అక్కడికి నేను విమానంలో వెళ్లాలి. నేను భయపడినప్పటికీ, యెహోవా బాహుబలముపై ఆధారపడి నేను ఆ పనిని చేపట్టాను.

నా కుమారుడు గ్రెగ్‌, 1962లో రిసైఫ్‌లో జన్మించాడు. నాకు పెరుగుతున్న కుటుంబం వుంది గనుక నేను పయినీరుగా కొనసాగలేకపోయాను కాని, చిన్న సంఘంపై అనుకూల ప్రభావాన్ని చూపించగల్గాను. మేము వారికి ఆసక్తి కలిగేలా చేసాము కాబట్టి, పిల్లలు మాతో సేవలో పాల్గొనటానికి ఆసక్తి చూపేవారు. వారు మూడేళ్లనాటి నుండే, గృహాలవద్ద సువార్త అందజేసేవారు. కూటాలకు హాజరుకావడం, ప్రాంతీయసేవకు వెళ్లడం ఎప్పుడూ తప్పిపోకుండేలా వారికి అలవాటు చేశాము. కుటుంబంలో ఎవరికైనా అనారోగ్యంగా వుంటే, వారికి తోడుగా మరొకరిని వుంచి, మిగతావారు కూటాలకు వెళ్లడం లేక ప్రాంతీయ సేవలో పాల్గొనడం చేసేవారము.

సంవత్సరాలుగా, మేము ఒక కుటుంబంగా పిల్లల విద్యాభ్యాసం గురించి, జీవితంలో వారి గమ్యాల గురించి, యెహోవా సంస్థలో ఒక పని కలిగివుండేలా వారిని సిద్ధపరుస్తూ క్రమంగా చర్చించేవారము. వారిని దూరదర్శిని వంటి బలహీనపర్చే ప్రభావాలకు గురికాకుండా చూశాము. పిల్లలు యౌవనస్థులయ్యేంత వరకు మేము మా ఇంటికి టివి తెచ్చుకోలేదు. మాకు తగిన ఆదాయం ఉన్నప్పటికీ, వస్తుసంబంధమైన వాటితో మేము వారిని చెడగొట్టలేదు. ఉదాహరణకు, ముగ్గురూ పంచుకోవడానికి మేము కేవలం ఒక్క సైకిలును మాత్రమే కొన్నాము.

బాస్కెట్‌బాల్‌ ఆడటం, ఈతకొట్టడం, కుటుంబంగా ప్రయాణించడం వంటివి వీలయినంత వరకు కలిసిచేసేవాళ్లము. మా ప్రయాణాలు క్రైస్తవ సమావేశాలకు హాజరగుటకు సంబంధించినవి లేక ఇతర దేశాల్లోవున్న బేతేలు గృహాలను దర్శించడం వంటివై యుండేవి. ఈ ప్రయాణాలు, పిల్లల హృదయాలలో ఏముందో తెలుసుకొనెలా నేను, లూసీ వారితో స్వేచ్ఛగా మాట్లాడటానికి సమయం లభించేలా చేసాయి. ఆ ఆనందకరమైన సంవత్సరాల కొరకు యెహోవాకు మేమెంతో కృతజ్ఞత కలిగివున్నాము!

చివరకు మేము భూమధ్యరేఖకు దగ్గరగా గడిపిన పది సంవత్సరాలు లూసీ ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపాయి. దక్షిణాన పరానా రాష్ట్రం, కురిటిబా నందలి మంచి వాతావరణంగల ప్రాంతానికి మా పనిని మార్చడాన్ని మేము ఆహ్వానించాము.

కెనడాకు తిరిగి రావడం

బ్రెజిల్‌లో 20 సంవత్సరాలు గడిపిన తరువాత 1977లో, అనారోగ్యంగావున్న నా తండ్రిని చూసుకోవటానికి మా పిల్లలతోపాటు నేను, లూసీ కెనడాకు తిరిగి వచ్చాము. సాంప్రదాయపరంగా, మా కుటుంబానికి అది ఎంత పెద్ద మార్పు! మేము ప్రేమగల మా క్రైస్తవ సహోదరులతో అదేమాదిరిని అనుసరించాము కాబట్టి, ఆత్మీయంగా అది మాకు ఏ భేదం కలుగజేయలేదు.

కెనడాలో, మా కుమార్తెలిద్దరూ పూర్తికాల పయినీరు సేవలో ప్రవేశించారు గనుక పూర్తికాల సేవ మా కుటుంబంలో ఒక భాగమయ్యింది. అందరం కుటుంబ క్షేమం కొరకు పాటుపడేవారం. పార్ట్‌టైమ్‌ పని ద్వారా వచ్చిన ఏ ఆదాయాన్నయినా ఇంటి ఖర్చు కొరకు, దూరదూరంగావున్న ప్రాంతాల్లో సేవ చేయడానికి మాకు అవసరమైన మూడు వాహనాల ఖర్చు కొరకు వాడేవాళ్లము. ప్రతి వారం, మా కుటుంబ బైబిలు పఠనం తరువాత, కుటుంబ ప్రణాళికల గురించి చర్చించుకునే వాళ్లము. మా జీవితాలతో మేము ఏం చేస్తున్నాము, ఎక్కడికెళ్తున్నాము అనేవి గ్రహించుకోవటానికి మాకు ఈ చర్చలు సహాయం చేసాయి.

మా కుమారుడు గ్రెగ్‌ కూడ, తన అక్కల్లాగే, పూర్తికాల సేవ తన గమ్యంగా పెట్టుకున్నాడు. తనకు ఐదేళ్లున్నప్పుడే బేతేలు అని పిలువబడే, సంస్థ బ్రాంచీ కార్యాలయం వద్ద పనిచేయాలనే కోరికను వ్యక్తపర్చాడు. అతనెప్పుడూ ఆ గమ్యాన్ని మర్చిపోలేదు, ఉన్నత పాఠశాల విద్య ముగించిన వెంటనే, “నేను బేతేలు కొరకు ధరఖాస్తు చేయాలని మీరనుకుంటున్నారా?” అని నన్ను, వాళ్లమ్మను అడిగాడు.

మా కుమారున్ని విడిచి వుండటం మాకు బాధ కలిగించినప్పటికీ, నిస్సంకోచంగా మేమిలా జవాబిచ్చాము: “యెహోవా సంస్థ యొక్క హృదయమైన—బేతేలు నొద్ద కంటే ఇంకెక్కడా నీవు యెహోవా బాహుబలాన్ని అంతగా పొందలేవు.” రెండు నెలల్లో ఆయన కెనడా బేతేలుకు వెళ్లాడు. అది 1980లో, ఇప్పటి వరకు అతను అక్కడే సేవచేస్తున్నాడు.

నాకు, లూసీకి 1980వ దశకం క్రొత్త సవాళ్లను తెచ్చింది. మేము ప్రారంభించిన దగ్గరే వుండిపోయాము—కేవలం మేమిద్దరమే. సూజెన్‌ వివాహం చేసుకుని తన భర్తతో కలిసి పయినీరు సేవ చేస్తున్నది, కిమ్‌, గ్రెగ్‌ ఇద్దరూ బేతేలులో సేవచేస్తున్నారు. మేమేం చేయాలి? కెనడాలో దాదాపు 2,000 కిలోమీటర్ల వరకు వ్యాపించివున్న పోర్చుగీసు సర్క్యూట్‌లో సేవచేయటానికి 1981లో మేము ఆహ్వానింపబడడంతో ఆ ప్రశ్నకు త్వరలోనే సమాధానం దొరికింది. మేమిప్పటికీ ప్రయాణసేవలోనే వున్నాము.

కిమ్‌ వివాహం చేసుకుని గిలియడ్‌ పాఠశాలకు హాజరై, తన భర్తతో కలిసి ఇప్పుడు బ్రెజిల్‌ సర్క్యూట్‌లో సేవచేస్తున్నది. సూజెన్‌, ఆమె భర్త ఇంకా కెనడాలోనే వుండి, తమ ఇద్దరు పిల్లలను పెంచుతున్నారు, ఆమె భర్త పయినీరు సేవ చేస్తున్నాడు. పూర్తికాల సేవలో మా పనులను బట్టి మా కుటుంబం శారీరకంగా విడిపోయినప్పటికీ ఆత్మీయంగా, మానసికంగా మేము దగ్గరగానే వున్నాము.

పరిశుభ్ర పర్చబడిన భూమిపై మా కుటుంబంతో కలిసివుండే ఉత్తేజకరమైన భవిష్యత్తును గురించి నేను లూసీ నిరీక్షిస్తున్నాము. (2 పేతురు 3:13) ప్రాచీన మోషే వలెనే, సంఖ్యాకాండము 11:23 నందలి “యెహోవా బాహుబలము తక్కువైనదా? నా మాట నీ యెడల నెరవేరునో లేదో యిప్పుడు చూచెదవు.” అనే అలంకారిక ప్రశ్నకు సమాధానాన్ని మేము అనుభవపూర్వకంగా తెలుసుకున్నాము. వాస్తవంగా, తన సేవకుల హృదయపూర్వక సేవను బట్టి వారిని ఆశీర్వదించకుండ ఏది యెహోవాను అడ్డగించలేదు.

[25వ పేజీలోని చిత్రం]

నా భార్య లూసీతో

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి