యెహోవాసాక్షులు ఓ మతశాఖా?
యేసు త్రాగుబోతని, తిండిపోతని, సబ్బాతును ఆచరించనివాడని, అబద్ధ సాక్షియని, దేవ దూషకుడని, సాతాను దూత అని నిందించబడ్డాడు. విద్రోహి అని కూడా ఆయనను నిందించారు.—మత్తయి 9:34; 11:19; 12:24; 26:65; యోహాను 8:13; 9:16; 19:12.
అదే విధంగా, యేసు మరణించి పునరుత్థానం అయిన తర్వాత, ఆయన అనుచరులు కూడా గంభీరమైన నిందకు గురయ్యారు. ‘ఈ మనుష్యులు భూలోకమును తలక్రిందులు చేశారు’ అన్న కేకలతో ప్రజలు మొదటి శతాబ్దంలోని ఒక క్రైస్తవుల గుంపును పట్టణ పరిపాలకుల వద్దకు యీడ్చుకొని పోయారు. (అపొస్తలుల కార్యములు 17:6) మరో సందర్భంలో, ఫిలిప్పీ పట్టణాన్ని ఎంతగానో కలతపరుస్తున్నారన్న ఆరోపణతో పౌలును ఆయన సహచరుడైన సీలను అధికారుల వద్దకు తీసుకుపోయారు.—అపొస్తలుల కార్యములు 16:20.
పిమ్మట, “ఈ మనుష్యుడు పీడవంటివాడును, భూలోకమందున్న సకలమైన యూదులను కలహమునకు రేపువాడును, . . . దేవాలయమును అపవిత్రము చేయుటకు” ప్రయత్నించువాడని పౌలును నిందించారు. (అపొస్తలుల కార్యములు 24:5, 6) “ఈ మతభేదమునుగూర్చి అంతటా ఆక్షేపణ చేయుచున్నారు ఇంతమట్టుకు మాకు తెలియునని” రోము నందలి యూదుల ప్రధానులు చెప్పినపుడు, యేసు అనుచరుల స్థితి ఎలా ఉన్నదన్న విషయం కచ్చితంగా వర్ణించబడింది.—అపొస్తలుల కార్యములు 28:22.
స్పష్టంగా, తీవ్రవాద ఆలోచనలుకలిగి, ఆనాడు సహజ సమాజ ప్రవర్తనగా అంగీకృతమైన దానికి విరుద్ధంగా ఉన్న ఆచారాలు కలిగివుందని కొందరు యేసుక్రీస్తు ప్రారంభించిన ఈ క్రొత్త గుంపును గూర్చి భావించారు. నిస్సందేహంగా, ఈనాడు అనేకులు క్రైస్తవులను నాశనకర మతశాఖగా దృష్టించి ఉండవచ్చు. ఇలా నిందించేవారు తరచూ సమాజంలోని పేరుపొందిన గౌరవనీయ సభ్యులై ఉండేవారు, కాబట్టి ఈ నిందారోపణకిది మరింత బలాన్నిచ్చి ఉండవచ్చు. యేసుపై, ఆయన శిష్యులపై వేసిన నిందలు నిజమని అనేకులు నమ్మారు. అయినా ఈ నిందలన్నీ అబద్ధాలేనని బహుశా మీకు తెలిసే ఉండవచ్చు! ప్రజలు ఈ విషయాలను చెప్పారన్న వాస్తవం వీటిని నిజం చేయలేదు.
ఈ రోజు మాటేమిటి? యెహోవాసాక్షులు తీవ్రవాద ధోరణిగలిగి, సహజ సమాజ ప్రవర్తన అని అంగీకరించబడిన వాటికి విరుద్ధమైన ఆచారాలు గల మతశాఖగా వారిని పేర్కొనడం సరియేనా? యెహోవాసాక్షులు ఒక తెగా?
ఆధారాలు చూపుతున్న విషయం
రష్యా నందలి సెంట్. పీటర్స్బర్గ్ పట్టణంలోని ఒక ప్రభుత్వ అధికారి యిలా వివరించాడు: “యెహోవాసాక్షులు, ముసుగులో ఉండి, పిల్లలను వధిస్తూ తమ్మును తాము చంపుకునే ఒక రకమైన రహస్య శాఖకు చెందినవారని విన్నాము.” అయితే, యిటీవల రష్యా ప్రజలు సాక్షుల నిజ వ్యక్తిత్వం గూర్చి మరింత తెలుసుకున్నారు. అంతర్జాతీయ సమావేశానికి సంబంధించి, యెహోవాసాక్షులతో పనిచేసిన తర్వాత, అదే అధికారి యిలా గమనించాడు: “నాకు పరిచయం ఉన్న ప్రజలకంటే కూడా సాధారణంగా ఉండి, నవ్వుతూవుండే ప్రజలు కనిపించారు. వారు సమాధానకరంగా నెమ్మదిగా ఉంటూ, ఒకరినొకరు ఎంతగానో ప్రేమించుకుంటున్నారు.” ఆయన యింకా యిలా అన్నాడు: “అసలు ప్రజలు వీరిని గూర్చి ఎందుకు అలాంటి అబద్ధాలు చెబుతారో నాకు అర్థంకావడంలేదు.”
యెహోవాసాక్షులు ఏ ఆచార సంబంధమైన కూటాలు నిర్వహించరు, లేదా రహస్య ఆరాధనను చేయరు. సాక్షికాని ఒక రచయిత్రి జూల్యా మిచెల్ కర్బెట్ యిలా పేర్కొంది: “వారానికి ఒకసారికంటే ఎక్కువ సార్లు వారు తమ రాజ్యమందిరాల్లో (వారి కూటాలు జరిగే స్థలాలు చర్చీలని పిలవబడవు) కలుసుకున్నప్పుడు, అధిక సమయాన్ని వారు బైబిలు పఠనంలో, చర్చల్లో గడుపుతారు.” వారి కూటాలు జరిగే స్థలాలకు స్పష్టమైన గుర్తులుంటాయి. కూటాలు బహిరంగంగా జరుగుతాయి, వాటికి హాజరుకావడానికి సాధారణ ప్రజానీకం ఆహ్వానించబడుతుంది. అనాహ్వానిత అతిధులను యింకా చక్కగా ఆహ్వానిస్తారు.
“సాక్షులు యథార్థపరులనీ, మర్యాదగలవారనీ, కష్టపడి పనిచేసేవారని మంచి పేరును సంపాదించుకున్నారు” అని కార్బెట్, రిలిజియన్ యిన్ అమెరికా అనే తన పుస్తకంలో పేర్కొంది. యెహోవాసాక్షుల్లో చపలచిత్తం గానీ అనియంత్రిత గానీ లేదని సాక్షులుకానివారు వెంటనే ఒప్పుకుంటారు. సహజ సమాజ ప్రవర్తనగా ఆమోదించబడిన దానికి వారి ప్రవర్తన విభిన్నంగా ఉండదు. సాక్షులు “వ్యక్తిగత ప్రవర్తనలో ఉన్నత నైతిక ప్రమాణాలను కల్గివుండడాన్ని నొక్కిచెబుతారని” న్యూ ఎన్సైక్లోపీడియా బ్రిటానిక సరిగ్గా పేర్కొంది.
యెహోవాసాక్షులను గూర్చి దురభిప్రాయపూరితమైన నివేదికను 60 నిమిషాల టీవీ వార్తల్లో చూపించిన దానికి ప్రతిస్పందనగా, అమెరికా టీవీ స్టేషన్లోని వార్తలకూ ప్రత్యేక కార్యక్రమాలకూ డైరెక్టరైన ఓ వ్యక్తి యెహోవాసాక్షులకు ఒక ఉత్తరం రాశాడు. అందులో ఆయన యిలా అన్నాడు: “మీ విశ్వాసంలో ఉన్నవారు జీవించినట్టుగా నేటి ప్రజలు జీవిస్తే, ప్రస్తుతం దేశం ఉన్న రీతిలో అది ఉండిఉండకపోయేది. మీ సంస్థ, సృష్టికర్త యెడల ప్రేమ, బలమైన విశ్వాసాలపై నిర్మితమని తెలిసిన వార్తా విలేఖరిని నేను. వార్తా విలేఖరులందరూ దురభిప్రాయపూర్ణులు కాదని మీరు తెలుసుకోవాలని కోరుతున్నాను.”
ప్రఖ్యాతిగాంచిన మతం
యెహోవాసాక్షులు ఏదో చిన్న మరియు తీవ్ర దృక్పథాలుగల మతశాఖ అని చెప్పడం సమంజసమేనా? ఒక భావంలో, కొన్ని మతాలకు పోల్చి చూస్తే యెహోవాసాక్షులు లెక్కకు తక్కువే. అయినప్పటికి, యేసు మాటలను జ్ఞాపకం చేసుకోండి: “జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై యున్నది, దాని కనుగొనువారు కొందరే.”—మత్తయి 7:13, 14.
ఏదియేమైనా, సాక్షులు ఒక చిన్న, తీవ్ర దృక్పథాలుగల మతశాఖ కానేకాదు. వసంతకాలం 1993నందు కోటి 10 లక్షలమంది కంటె ఎక్కువ మంది ప్రజలు సాక్షులు జరిపే, క్రీస్తు మరణ జ్ఞాపకార్థ దిన ఆచరణకు హాజరయ్యారు. అయితే వారి సంఖ్యకంటే వారికి ప్రపంచవ్యాప్త మెప్పును తెచ్చిన వారి నైతిక గుణాలు, మాదిరికర ప్రవర్తన ప్రాముఖ్యం. నిస్సందేహంగా ఈ కారణంగానే అనేక దేశాలు, వారి మతం యథార్థమైందని అధికారిక గుర్తింపును యిచ్చాయి.
ఇటీవల యూరోపియన్ కోర్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యిచ్చిన తీర్పు గమనార్హం. ఆలోచన, మనస్సాక్షి, మతం వంటి వాటిలో సాక్షులు స్వేచ్ఛను అనుభవించాలి, అంతేకాదు వారు తమ విశ్వాసాన్ని గూర్చి యితరులతో మాట్లాడి, దాన్ని బోధించే హక్కు వారికి ఉంది అని అది ప్రకటించింది. ఒకవేళ యెహోవాసాక్షులు మనుష్యులను చేర్చుకోడానికి వంచనతో కూడిన చట్టవిరుద్ధమైన పద్ధతులను ఉపయోగించో లేక తమ అనుచరుల మనస్సులను తమ ఆధీనంలో ఉంచుకోడానికి తంత్రవిద్యలను ఉపయోగిస్తూవుంటే, యూరోపియన్ కమీషన్ అలాంటి ప్రకటనను చేసివుండేది కాదు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేలాది మందికి యెహోవాసాక్షులతో పరిచయం ఉంది. సాక్షులతో బైబిలును పఠిస్తున్న లేక పఠించిన లక్షలాది సాక్షులు కానివారిని మేము ఈ ప్రశ్నను అడుగుతున్నాం, మిమ్మల్ని బలవంతంగా ఒప్పింపజేసే ప్రయత్నమేదైనా జరిగిందా? మీ మనస్సును అదుపులో పెట్టుకునే పద్ధతులను సాక్షులు మీపైన ప్రయోగించారా? నిస్సందేహంగా, “లేదు” అని మీరు సూటిగా సమాధానమిస్తారు. స్పష్టంగా, ఈ పద్ధతులు ఉపయోగించివుంటే, యెహోవాసాక్షుల పక్షంలో చేసే ఏ వాదనకైనా విరుద్ధంగా, విస్తారమైన బాధితుల సమూహం తయారై ఉంటుంది.
“మానవతా కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు”
మతశాఖ సభ్యులు తరచు తమ కుటుంబం నుండి, స్నేహితులనుండి, సహజ సమాజం నుండి కూడా తమ్మును తాము వేరుచేసుకుంటారు. “నేను యెహోవాసాక్షిని కాను” అని జెక్ రిపబ్లిక్ నందున్న ఒక వార్తా విలేఖరి రాశాడు. అయినప్పటికి, ఆయన యిలా అన్నాడు: “వారికి [యెహోవాసాక్షులకు] గొప్ప నైతిక శక్తి ఉందన్నది స్పష్టం. . . . ప్రభుత్వ అధికారాలను వారు గుర్తిస్తారు గాని, దేవుని రాజ్యమే మానవుల సమస్యలకు పరిష్కారం తీసుకురాగలదని నమ్ముతారు. అయితే, వారు మూఢనమ్మకస్థులు కాదు సుమా. వారు, మానవతా కార్యక్రమంలో నిమగ్నమైన ప్రజలు.”
వారు తమ్మును తాము బంధువుల నుండి యితరులనుండి వేరుచేసుకుని, ఏకాంత ప్రాంతాల్లో వారు నివసించరు. తమ కుటుంబాలను ప్రేమించి వాటికి శ్రద్ధకనపర్చడం లేఖనాధార బాధ్యతగా వారు గుర్తిస్తారు. వారు అన్ని మతాలవారితోనూ, అన్ని జాతులవారితోనూ జీవిస్తారు, వారితో పనిచేస్తారు. విపత్తులు తారసిల్లినప్పుడు, సహాయక సామాగ్రిని అందించడానికి, యితర ప్రేమ పూర్వక సహాయాన్ని అందించడానికి వారు ముందుంటారు.
అన్నిటికంటే ప్రాముఖ్యంగా, సాటిలేని విద్యా కార్యక్రమంలో వారు నిమగ్నులై ఉన్నారు. తమ సమాజంలో ఉన్న ప్రతిఒక్కరిని కలవడానికి వ్యవస్థీకరించబడిన పద్ధతి గల మతాలెన్ని ఉన్నాయి? యెహోవాసాక్షులు 200 కంటే ఎక్కువ దేశాల్లో, 200 కంటే ఎక్కువ భాషల్లో ఈ పనిని చేస్తున్నారు! స్పష్టంగా, యెహోవాసాక్షులు “మానవతాకార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు.”
బైబిలును గట్టిగా హత్తుకుని ఉండడం
యెహోవాసాక్షుల బోధలు చర్చీలు అందించే వాటికి భిన్నంగా ఉంటాయి. యెహోవా సర్వోన్నతుడైన దేవుడని, యేసు త్రిత్వంలో ఒక భాగం కాక కుమారుడేనని యెహోవాసాక్షులు నమ్ముతారు. వేదనలో ఉన్న మానవజాతికి కేవలం దేవుని రాజ్యమే ఉపశమనాన్ని కలిగిస్తుందన్న నమ్మకంలో వారి విశ్వాసం నాటుకుని ఉంది. ఈ కుళ్లిన విధానపు సమూల నాశనాన్ని గూర్చి వారు ప్రజలను హెచ్చరిస్తుంటారు. విధేయత గల మానవజాతికి దేవుడు వాగ్దానం చేసిన భూపరదైసును గూర్చి వారు ప్రకటిస్తారు. వారు సిలువను పూజించరు. వారు క్రిస్టమస్ పండుగను ఆచరించరు. ఆత్మ మరణిస్తుందని, నరకాగ్ని లేదని వారు నమ్ముతారు. వారు రక్తాన్ని తినరు, రక్త మార్పిడిని అంగీకరించరు. వారు రాజకీయాల్లోనూ, యుద్ధాల్లోనూ పాల్గొనడం వంటి వాటికి దూరంగా ఉంటారు. యెహోవాసాక్షుల బోధలు ఎందుకు వేరుగా ఉంటాయని మిమ్మల్ని మీరెన్నడైన ప్రశ్నించుకున్నారా?
మాస్చుసెట్స్ పత్రికైన డైలీ హామ్షైర్ గాజెట్, యెహోవాసాక్షులు, “మొదటి శతాబ్ద క్రైస్తవుల మాదిరిని బైబిలు వాక్యాన్ని అనుకరించడానికి ప్రయత్నిస్తారు . . , యితరులు ఫరవాలేదులే అని అనుకునే చర్యలను చేపట్టడాన్ని, వారు బైబిలును అన్వయించే విధానం కచ్చితంగా నిరాకరిస్తుంది” అని వివరించింది. “వారు నమ్మేదంతా బైబిలుపైన ఆధారపడినదే. పారంపర్య ఆచారాలను పూర్తిగా తీసివేసే బైబిలు అధికారాన్ని ప్రశ్నించకుండా, వారు చేసే ప్రతి విశ్వాసపరమైన వ్యాఖ్యానానికి ‘ఆధార లేఖనాన్ని’ (అంటే, దాని ఆధారంగా బైబిలు వచనాన్ని ఎత్తిచూపుతారు) చూపిస్తారు” అని ది ఎన్సైక్లోపీడియా ఆఫ్ రిలిజియన్ అంగీకరిస్తోంది. రిలిజియన్ యిన్ అమెరికా అనే పుస్తకం యిలా పేర్కొంటోంది: “ఈ గుంపు బైబిలు పఠనం నుండి ఎన్నడూ వైదొలగలేదు, అంతేకాదు, లేఖనాలను సూచించే సవివర పద్ధతి ద్వారా దాని బోధలకు మద్దతు లభిస్తోంది.”
వారి నాయకుడు ఎవరు?
ప్రాముఖ్యంగా, బైబిలు బోధలకు యిలా సన్నిహితంగా హత్తుకొని ఉండడం వల్లనే, నేటి మతశాఖల లక్షణమైన మానవ నాయకులను పూజించడం, వారిని ఆరాధించడం యెహోవాసాక్షుల్లో కనబడదు. వారు మతనాయకులకు ప్రజలకు మధ్య తేడాను చూపే సిద్ధాంతాన్ని తృణీకరిస్తారు. ది ఎన్సైక్లోపీడియా ఆఫ్ రిలిజియన్ యెహోవాసాక్షులను గూర్చి యిలా సరిగ్గా పేర్కొంది: “వీరిలో మతనాయకుల తరగతి, ప్రత్యేక బిరుదులు నిషేధించబడ్డాయి.”
తమ నాయకునిగా, క్రైస్తవ సంఘానికి శిరస్సుగా వారు యేసుక్రీస్తును అనుసరిస్తారు. “మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరు సహోదరులు. మరియు భూమిమీద ఎవనికైనను తండ్రి అని పేరుపెట్టవద్దు; ఒక్కడే మీ తండ్రి; ఆయన పరలోకమందున్నాడు. మరియు మీరు ‘గురువులని’ పిలువబడవద్దు; క్రీస్తు ఒక్కడే మీ గురువు.”—మత్తయి 23:8-12.
కాబట్టి, యేసు ఎలాగైతే తిండిబోతు త్రాగుపోతుకాడో అలాగే యెహోవాసాక్షులు కూడా ఒక మతశాఖ కాదన్నది స్పష్టం. యేసును, ఆయన శిష్యులను గూర్చి అబద్ధ సమాచారాన్ని వినిన వారందరూ దానివల్ల ప్రభావితులై, ఆయనపై అబద్ధాలుచెప్పే ఉరిలో పడలేదు. బహుశ కొందరికి తప్పుడు సమాచారం యివ్వబడి ఉండవచ్చు. మీకు ఒక వేళ యెహోవాసాక్షులను గూర్చి వారి నమ్మకాలను గూర్చి ప్రశ్నలేమైనా ఉన్నట్లైతే, వారిని గూర్చి యింకా ఎక్కువగా ఎందుకు తెలుసుకోకూడదు? సత్యాన్ని వెదికేవారందరికి రాజ్యమందిరపు తలుపులు పూర్తిగా తెరిచి ఉంటాయి.
సరైన బైబిలు జ్ఞానం కొరకు వారు చేసే జాగ్రత్తతోకూడిన పరిశోధన వల్ల మీరు కూడా ప్రయోజనం పొంది, యేసు చెప్పిన ఈ మాటలకనుగుణంగా దేవున్ని మనం ఎలా ఆరాధించాలో నేర్చుకోవచ్చు: “యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించుకాలము వచ్చుచున్నది; అది ఇప్పుడును వచ్చేయున్నది; తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరుచున్నాడు.”—యోహాను 4:23.