మతశాఖలు—అంటే ఏమిటి?
అది ఫిబ్రవరి 28, 1993—వంద కంటే ఎక్కువమంది న్యాయపరిరక్షక ప్రతినిధులు, డజన్లకొలది స్త్రీపురుషులూ పిల్లలూ ఉన్న యిళ్ల కంపౌండుపై దాడి చేశారు. అక్రమంగా నిలువ చేస్తున్న ఆయుధాలను వెతికి, అనుమానితుడైన ఒక నేరస్థున్ని అరెస్టు చేయాలన్నదే వారి ధ్యేయం. అయితే ఆ బిల్డింగుల్లో నుండి తమపై బులెట్ల వర్షం కురవడం చూసి ఆ ప్రతినిధులు నివ్వెరపోయారు. ఆ ప్రతినిధులు తిరిగి కాల్పులు జరిపారు.
ఈ పోరాటంలో పదిమంది హతులయ్యారు, అనేకమంది గాయపడ్డారు. తర్వాతి 50 రోజుల్లో, ఒక చిన్న యుద్ధం చేయడానికి సరిపడు తుపాకులతో వందమంది ప్రభుత్వ ఏజెంట్లు ఆ కంపౌండును చుట్టుముట్టారు. ఈ ప్రతిష్టంభన, 17 మంది పిల్లలతోసహా 86 మందిని హతమార్చడంతో ముగిసింది.
అయితే శత్రువు ఎవరు? మాదక ద్రవ్యాలకు సంబంధించిన అల్లరి మూకల గుంపా? గెరిల్లా ముఠానా? కాదు. మీకు తెలిసే ఉండవచ్చు, ఆ “శత్రువు” ఒక మతానికి చెందిన భక్తులగుంపు, అంటే ఒక మతశాఖకు చెందిన సభ్యులు. ఈ విషాదకర సంఘటన, అమెరికా నందలి మధ్య టెక్సాస్ ప్రాంతంలోని ఒక అస్పష్ట మత గుంపుపై అంతర్జాతీయ ఆసక్తిని మళ్లించింది. ఛాందస్స మతశాఖల అపాయాలను గూర్చిన నివేదికలను, విశ్లేషణలను, వ్యాఖ్యానాలను వార్తా మాధ్యమాలు గాలి తరంగాలనూ పత్రికలనూ నింపివేశాయి.
మతశాఖకు చెందిన సభ్యులను తమ నాయకులు మరణానికి నడిపించిన గత సంఘటనలు ప్రజలకు గుర్తు చేయబడ్డాయి: 1969లో కాలిఫోర్నియానందు మాన్‌సన్ హత్యలు చేశాడు; గయాన, జోన్స్‌టౌన్ నందు 1978లో మతశాఖకు చెందిన సభ్యులు ఊకుమ్మడిగా ఆత్మహత్య చేసుకున్నారు; ఒక మతశాఖకు చెందిన కొరియా నాయకురాలైన పార్క్ సూజా 1987లో పన్నిన హత్యా-ఆత్మహత్యా పన్నాగం 32 మంది సభ్యుల మరణానికి దారితీసింది. ప్రాముఖ్యంగా, వీరిలో అనేకులు తాము క్రైస్తవులమనీ, బైబిలునందు నమ్మకముంచుతామనీ చెప్పుకున్నారు.
స్పష్టంగా, బైబిలును దేవుని వాక్యమని గౌరవించే అనేకులు, ఈ మతశాఖలు సిగ్గులేకుండా లేఖనాలను తప్పుగా అన్వయించడం చూసి వ్యాకులపడుతున్నారు. తత్ఫలితంగా, ఈ మతశాఖల ఉద్దేశాన్ని పర్యవేక్షించి, వాటి అపాయకరమైన అలవాట్లను బహిర్గతం చేయడానికి, అనేక సంవత్సరాల నుండి వందలాది సంస్థలు నియమించబడ్డాయి. మతశాఖల స్వభావాన్ని అధ్యయనం చేసిన నిపుణులు, కొద్ది సంవత్సరాల్లో రానున్న క్రొత్త యుగమందు ఈ మతశాఖల పెరుగుదల ఎక్కువ అవుతుందని ముందే చెబుతున్నారు. ఒక పత్రిక చెప్పినట్లుగా మతశాఖ వ్యతిరేక గుంపుల ప్రకారం, వేల కొలది మతశాఖలు “నీ శరీరంపై ఆధీనమేర్పర్చుకుని, నీ మనస్సును తమ స్వాధీనం చేసుకుని, నీ జీవాన్ని పాడుచేయడానికి సంసిద్ధంగా ఉన్నాయి. . . . కొన్నిటికే ఆయుధబలం ఉంది కానీ, అనేకం అపాయకరమని భావించబడుతున్నాయి. వారు నిన్ను మోసంచేసి, నీ డబ్బునూ వస్తువులనూ తీసేసుకుంటారు, నీకు పెళ్లి ఏర్పాట్లుచేసి, నీ అంత్యక్రియలు జరిపిస్తారు.”
మతశాఖ అంటే ఏమిటి?
“మతశాఖ” అనే పదము యొక్క గుణనిర్దేశం పూర్తిగా తెలియనివారు దానిని విరివిగా ఉపయోగిస్తుంటారు. గందరగోళాన్ని నివారించడానికి, కొందరు విధ్వాంసులు ఆ పదాన్ని వాడరు.
వరల్డ్ బుక్ ఎన్‌సైక్లోపీడియా, “అసలు, మతశాఖ అనే పదం ఏవిధమైన ఆరాధనకైనా లేక ఆచారవ్యవహారాలకైనా వర్తిస్తుంది” అని వివరిస్తోంది. దాన్ని ప్రమాణంగా తీసుకుని, అన్ని మతపర సంస్థలనూ మతశాఖల క్రింద వర్గీకరించవచ్చు. అయితే, ఈనాడు, “మతశాఖ” అనే పదానికి సాధారణ ఉపయోగంలో వేరే అర్థం ఉంది. “ఇరవయ్యో శతాబ్దపు మధ్యకాలంనుండీ, మతశాఖలను గూర్చిన ప్రచారం ఆ పదం భావాన్ని మార్చివేసింది. ఈనాడు అది, క్రొత్తవైన మరియు పూర్వాచారాలకు చెందని సిద్ధాంతాలనూ ఆచారాలను ప్రబోధించే సజీవ నాయకులను అనుసరించే గుంపులకు ఆపాదించబడుతోంది” అని అదే ఎన్‌సైక్లోపీడియా పేర్కొంది.
ఈ ప్రఖ్యాత పదం వాడుకను బలపరుస్తూ, “వాటి సభ్యులు, తమ గుర్తింపునూ ఉద్దేశాలను, మనుష్యులను ఆకట్టుకునే ఒకే ఒక వ్యక్తి నుండి పొందుతారు. ఈ మతశాఖలు సహజంగా చిన్నగా, తీవ్ర దృక్పథాలు కలిగి ఉంటాయి” అని న్యూస్‌వీక్ పత్రిక మతశాఖలను వర్ణిస్తోంది. అదే విధంగా, “[మతశాఖ] అనే పదమే అస్పష్టం, అయితే తరచు తానే దైవాన్నని చెప్పుకుని మనుష్యులను ఆకట్టుకునే ఒక నాయకుని చూట్టూ నిర్మించబడిన క్రొత మత విశ్వాసాన్ని అది సూచిస్తుంది,” అని ఏషియా వీక్ పత్రిక చెబుతోంది.
అమెరికా, మేరిలాండ్ రాష్ట్ర నూరవ కాంగ్రెస్ ఉమ్మడి ఒప్పందంలో ఉపయోగించిన భాషకూడ, మతశాఖ అనే పదం యొక్క అవమానకరమైన గుణవిశేషణాన్ని వ్యక్తపర్చింది. “మతశాఖ అంటే, ఒక వ్యక్తికి లేదా ఒక ఉద్దేశానికి అధిక భక్తిని కనపరచి, తమ నాయకుల ఆశయాలను చేరుకోడానికి చట్టబద్ధంకాని చర్యలు గైకొని యితరులను ఒప్పించడం, ఆధీనపర్చుకోవడం వంటివి చేసే ఒక గుంపు లేక ఉద్యమం” అని ఆ తీర్మానం పేర్కొంది.
స్పష్టంగా, ఈ మతశాఖలు, సహజ సమాజ నడవడిగా ఈనాడు అంగీకరించబడే వాటికి విరుద్ధమైన తిరుగుబాటు దృక్పథాలు, ఆచారాలు గల మతగుంపులుగా భావించబడుతున్నాయి. సాధారణంగా వారు తమ మత కార్యకలాపాలను రహస్యంగా జరుపుకుంటారు. ఈ మతశాఖల గుంపులనేకం, సమాజం నుండి తమ్మును తాము వేరుపర్చుకుంటాయి. తమ స్వయంప్రకటిత మానవ నాయకుని యెడల వారి సమర్పణకు షరతులులేవు, అది ప్రత్యేకమైంది. తరచూ ఈ నాయకులు తాము దైవికంగా ఎన్నుకోబడినవారని లేక తమలోనే దైవత్వం ఉందనీ చెప్పుకుంటుంటారు.
మతశాఖలను వ్యతిరేకించే సంస్థలూ సమాచార మాధ్యమాలూ అప్పుడప్పుడు, యెహోవాసాక్షులను ఒక మతశాఖగా పేర్కొన్నాయి. వార్తాపత్రికల్లోని యిటీవలి శీర్షికలందు అనేకసార్లు, ప్రశ్నార్హమైన ఆచారాలకు పేరుమోసిన మతపర గుంపులతో సాక్షులను చేర్చడం జరిగింది. అయితే యెహోవాసాక్షులను తీవ్ర దృక్పథాలు గల ఒక చిన్న మత గుంపుగా పేర్కొనడం సమంజసమేనా? మతశాఖలకు చెందిన సభ్యులు తరచూ తమ స్నేహితులు, కుటుంబం, సమాజం నుండి కూడా తమ్మునుతాము వేరుపర్చుకుంటారు. యెహోవాసాక్షులూ అలాగే చేస్తున్నారా? సభ్యులను చేర్చుకోడానికి సాక్షులు వంచనతో కూడిన చట్టవిరుద్ధమైన పద్ధతులను ఉపయోగిస్తున్నారా?
మతశాఖల నాయకులు, తమ అనుచరుల మనస్సును తమ అధీనంలో ఉంచుకోడానికిగాను మోసకరమైన పద్ధతులను ఉపయోగించడంలో పేరుగాంచారు. యెహోవాసాక్షులు ఈ పనిని చేస్తున్నారనడానికి ఆధారాలేమైనా ఉన్నాయా? వారి ఆరాధన రహస్యంగా మరుగున ఉందా? వారు మానవ నాయకులను అనుసరించి వారిని పూజిస్తున్నారా? సూటిగా అడగాలంటే, యెహోవాసాక్షులు ఓ మతశాఖా?
[3వ పేజీలోని చిత్రసౌజన్యం]
Jerry Hoefer/Fort Worth Star Telegram/Sipa Press