త్వరలోనే—యుద్ధం లేని లోకం!
డిశంబరు 24, 1914 నాడు జిమ్ ప్రిన్స్ అనే ఒక యువ బ్రిటీషు సైనికుడు, జర్మన్ పదాతి సైనికునితో మాట్లాడ్డానికి, ఎవరూ ఆక్రమించుకోని ప్రదేశం దాటి వెళ్లాడు. “నేను జర్మన్ దేశీయుడను. నువ్వు ఆంగ్లోజర్మన్‌వి మరి మనం ఎందుకు పోరాడుతున్నట్లు?” అని ఆ జర్మన్ దేశీయుడు అతన్ని అడిగాడు. సంవత్సరాల తర్వాత, ప్రిన్స్ యిలా ఒప్పుకున్నాడు: “నాకా ప్రశ్నకు జవాబు నేటికీ తెలియదు.”
ఒక అసాధారణ వారంపాటు, 1914లో బ్రిటీషు, జర్మన్ సైనికులు సౌభ్రాతృత్వంతో ఫుట్‌బాల్ ఆడారు, క్రిస్టమస్ బహుమతులను కూడా యిచ్చిపుచ్చుకున్నారు. కానీ, ఆ యుద్ధవిరమణ సంధి అనధికారికం. యుద్ధ ప్రచారంలో వర్ణించబడినట్లు తమ “శత్రువులు” భయానక రాకాసి వంటివారు కాదనే విషయాన్ని తమ దళాలు తెలుసుకోకూడదని సేనాధిపతుల ఉద్దేశం. బ్రిటీషు సైనికుడైన ఆల్బర్ట్ మోరెన్ తర్వాత యిలా జ్ఞాపకం చేసుకున్నాడు: “ఈ కాల్పుల విరమణ మరో వారం వరకు కొనసాగివుంటే, మరలా యుద్ధం ప్రారంభించడం చాలా కష్టమైపోయుండేది.”
శిక్షణపొందిన అనేకమంది సైనికులు కూడ యుద్ధాన్ని కాదుగానీ శాంతినే కోరుతున్నారని ఆ తలవని తలంపుతో ఏర్పడిన సంధి తెల్పుతోంది. పోరాటాల్లోని బీభత్సాన్ని ఎరిగిన సైనికులనేకులు యీ స్పానిష్ సామెతను ఆమోదిస్తారు: “యుద్ధం అంటే ఏమిటో తెలియనివారినే యుద్ధానికి వెళ్లనివ్వండి.” నిస్సందేహంగా, సామాన్య ప్రజానీకంపై నిర్వహించిన అభిప్రాయ సేకరణలో ఆశ్చర్యకరంగా, అధికశాతం ప్రజలు యుద్ధంకన్నా శాంతినే ఎక్కువగా కోరుతున్నారని తేలింది. అయితే, శాంతి కావాలనుకునే ఈ విశ్వవ్యాప్త కోరిక, యుద్ధరహిత లోకంగా ఎలా మారగలదు?
యుద్ధం నిషేధించబడక ముందు, మనుష్యుల వైఖరిలో మార్పు రావాలి. యుఎన్ యొక్క విద్యా, శాస్త్రీయ, సాంస్కృతిక సంస్థ సంవిధానం యిలా పేర్కొంది: “యుద్ధాలు, మానవుల మనస్సుల్లో మొదలౌతాయి గనుక, మనుష్యుల మనస్సుల్లోనే శాంతిని కాపాడుకోవాలనే భావన నిర్మితం కావాలి.” అయితే అపనమ్మకం, ద్వేషం ఎక్కువగా ఉన్న ప్రస్తుత సమాజం, శాంతియుతంగా మారక మరింత దౌర్జన్యవంతంగా మారుతోంది!
అయినప్పటికి, నీతియుక్తమైన ప్రజల మనస్సుల్లో ఒకనాటికి శాంతి ముద్రించబడుతుందని దేవుడు తానే వాగ్దానం చేశాడు. తన ప్రవక్తయైన యెషయా ద్వారా ఆయన యిలా అన్నాడు: “ఆయన మధ్యవర్తియై అన్యజనులకు న్యాయము తీర్చును అనేక జనములకు తీర్పుతీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ యీటెలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురు. జనముమీదికి జనము ఖడ్గమెత్తక యుండును యుద్ధముచేయ నేర్చుకొనుట ఇక మానివేయును.”—యెషయా 2:4.
మనస్సుల్లో శాంతిని పెంపొందించుట
ఆలోచనలో అంతటి గణనీయమైన మార్పు రాగలదా? ప్రజలు, ఎన్నటికైనా యుద్ధాన్ని కొనియాడే బదులు శాంతిని కాపాడుకోవటం నేర్చుకోగలరా? వుల్ఫ్‌గన్ కుసిరొ ఉదాహరణను పరిశీలించండి. తాను ‘యుద్ధము నేర్చుకోనందున’ నాజీలు 1942లో యీ 20 సంవత్సరాల జర్మన్ యువకుని తల నరికేశారు. అతను చావును ఎందుకు ఎన్నుకున్నాడు? లిఖితపూర్వకంగా యిచ్చిన వాగ్మూలములో, “నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెను,” “కత్తి పట్టుకొనువారందరు కత్తిచేతనే నశింతురు” అన్నటువంటి లేఖన సంబంధిత సూత్రాలను అతను పేర్కొన్నాడు. (మత్తయి 22:39; 26:52) ఆ తర్వాత అతను సూటిగా యిలా ప్రశ్నించాడు: “మన సృష్టికర్త వీటన్నిటినీ చెట్లకొరకు రాశాడా?”
బైబిలులో వ్రాయబడిన దేవుని వాక్యం, ‘బలముగలదై,’ పరిణామాలెలా ఉన్నప్పటికి, ఈ యువ యెహోవాసాక్షి శాంతిని వెంబడించేలా ప్రేరేపించింది. (హెబ్రీయులు 4:12; 1 పేతురు 3:11) అయితే అలా శాంతిని వెంబడించింది వుల్ఫ్‌గన్ కుసిరొ ఒక్కడు మాత్రమే కాదు. ది నాజీ పర్సిక్యూషన్ ఆఫ్ ది చర్చస్ 1933-45 అనే తన పుస్తకంలో జె.ఎస్. కాన్వే, అధికారిక నాజీ దస్తావేజుల నుండి సూచిస్తూ, యెహోవాసాక్షులందరూ ఒక గుంపుగా యుద్ధోపకరణాలను చేపట్టడానికి తిరస్కరించారని సాక్ష్యమిచ్చాడు. కాన్వే సూచించినట్లు, అటువంటి తెగువతో కూడిన స్థానం వహించడం అంటే, తమ మరణ పత్రంపై తామే సంతకం చేసినట్లౌతుంది.
ఈనాడు యెహోవాసాక్షులు, తాము ఏ జాతి వారైనా ఏ రాష్ట్రం వారైనప్పటికి శాంతిని అపేక్షిస్తూనే ఉన్నారు. ఎందుకు? ఎందుకంటే, దేవుని నిజమైన సేవకులు తమ కత్తులను నాగటి నక్కులుగా మలచుకోవాలని వారు బైబిలు నుండి నేర్చుకున్నారు. ఇశ్రాయేలుకు 1987లో వలసపోయిన అలెకాన్‌డ్రో అనే ఒక అర్జెంటీనా యువకుడు, వ్యక్తిగతంగా ఈ వాస్తవానికి సాక్ష్యమివ్వగలడు.
అలెకాన్‌డ్రో యూనివర్శిటీలో చదివేటప్పుడు, మూడు సంవత్సరాల వరకూ వివిధ హోటళ్ళలోను, రెస్టారెంట్లలోను పనిచేస్తూ అక్కడున్న సామూహిక వ్యవసాయ కేంద్రంలో నివసించాడు. ఆ సమయంలో, అతను బైబిలును చదవడం ప్రారంభించి, జీవిత సంకల్పాన్ని గూర్చి అన్వేషిస్తూ ఉన్నాడు. అన్నిటికంటె ప్రాముఖ్యంగా, ప్రజలు శాంతి భద్రతలను అనుభవించే ప్రపంచాన్ని చూడాలని ఎంతగానో కోరాడు. యూదుడైన అలెకాన్‌డ్రో యూదులతోను, అరబ్బులతోను పనిచేసేవాడు, అయితే వారిలో ఎవరి పక్షమూ వహించకుండా ఉండడానికి ఆయన ఎంచుకున్నాడు.
యెహోవాసాక్షులతో బైబిలు పఠిస్తున్న అతని స్నేహితుడొకరు, 1990లో అలెకాన్‌డ్రోను హైఫనందు జరిగిన ఒక దిన సమావేశానికి ఆహ్వానించాడు. సమావేశంలో 600 యూదులూ అరబ్బులు సంతోషంగా ఒకరితో ఒకరు కలిసిపోవడాన్ని చూసి తనలో తాను యిలా అనుకున్నాడు, ‘ప్రజలు జీవించడానికి యిదే సరైన పద్ధతి.’ ఆరునెల్లలో అతను కూడా ఒక సాక్షి అయ్యాడు, మరి యిప్పుడు, బైబిలులోని శాంతి వర్తమానాన్ని యితరులకు ప్రకటించడంలో ఎక్కువ సమయాన్ని గడుపుతున్నాడు.
దేవుడు శాంతిని ఎలా తెస్తాడు
ఈ ఉదాహరణలు మనలను హత్తుకునే విధంగా ఉన్నట్లే, నేటి ప్రపంచ ధోరణికి యివి ఎంతో అరుదైనవిగా ఉన్నాయి. ప్రస్తుత విధానం పైకి మాత్రం శాంతి శాంతి అన్నప్పటికి, యుద్ధమనే విత్తనం మొలకెత్తేలాగున దానికి నీరు పోసి పెంచుతోంది. ప్రజలు తమ ఆదాయంలో 7, నుండి 16 శాతం వరకు, తుపాకీలకూ యింటి సంరక్షణకు ఖర్చుపెట్టేవారు నివసించే వీధిలో మీరూ నివసించడానికి యిష్టపడతారా? అలాగే, యిటీవలి సంవత్సరాల్లో దేశాలు తమ సైన్యాలకొరకు ఖర్చు చేయడం ద్వారా అదే పనిని చేస్తున్నాయి. దేవుడు తానే ‘అనేక జనముల ‘వివాదమును పరిష్కరించేంత’ వరకు, మానవజాతి అంతా ఎన్నడూ తమ ఖడ్గాలను నాగటినక్కులుగా మలచుకోరని యెషయా ప్రవచనం బయల్పర్చడంలో ఆశ్చర్యం లేదు. ఆయన దాన్ని ఎలా చేస్తాడు?
వివాదాన్ని పరిష్కరించే ప్రాముఖ్యమైన మార్గం యెహోవా దేవుని రాజ్యమే. దానియేలు ప్రవక్త ప్రవచించిన విధంగా, ‘పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికి ఎన్నటికిని నాశనము కలుగదు.’ ఇంకా చెబుతూ ఈ రాజ్యం, “ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగులగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగముల వరకు నిలుచును.” (దానియేలు 2:44) దేవుని రాజ్యం, భూమినంతటిని తన ఆధీనంలో ఉంచుకుంటుందని ఈ మాటలు బయల్పరుస్తున్నాయి. దేశ సరిహద్దులను తొలగించడంద్వారా, ఆ రాజ్యం విరోధాలను రూపుమాపుతుంది. అంతేకాకుండా, అందుండే నివాసులు “యెహోవా చేత ఉపదేశము నొందుదురు” గనుక, వారి విశ్రాంతి ‘అధికంగా’ ఉంటుంది. (యెషయా 54:13) యేసు మనల్ని దేవునికి యిలా ప్రార్థించమనడంలో ఆశ్చర్యం లేదు: “నీ రాజ్యము వచ్చునుగాక!”—మత్తయి 6:10.
మతపర అడ్డంకులను తొలగించుట
శాంతికి అడ్డుపడే మతపర అడ్డంకులను సహితం దేవుడు తీసివేస్తాడు. చరిత్రపుటల్లోని అతి దీర్ఘకాలీన ఆయుధ పోరాటాలకు మతం కారణంగా ఉండెను, వాటిలో సా.శ. 1095 నందు పోప్ అర్బ్‌న్ II ప్రారంభించిన క్రూసేడ్లు, లేక “పరిశుద్ధ యుద్ధాలు” కూడా ఉన్నాయి.a మన శతాబ్దంలో, మత నాయకులు పూర్తిగా లౌకికమైనటువంటి యుద్ధాలకు సహితం తమ మద్దతునిచ్చి ప్రేరేపించి వాటిని జయించడంలో పేరెన్నికగన్నారు.
మొదటి ప్రపంచ యుద్ధకాలంలో నామకార్థ క్రైస్తవ చర్చీల పాత్రను పేర్కొంటూ, పాల్ జాన్సన్ అనే చరిత్రకారుడు యిలా రాశాడు: “మతనాయకులు జాతీయత కన్నా క్రైస్తవ విశ్వాసాన్ని ముందుంచలేకపోయారు, చెప్పాలంటే అధిక శాతం మంది అలా చేయడానికి యిష్టపడనే లేదు. అనేకులు సులభ మార్గాన్ని ఎంచుకుని, క్రైస్తవత్వాన్ని దేశభక్తితో సమాంతరం చేశారు. అన్ని శాఖలకు సంబంధించిన క్రైస్తవ సైనికులు, తమ రక్షకుని పేరట ఒకరినొకరు చంపుకోవాలని ఉద్బోధించబడ్డారు.”
మతం శాంతిని పెంపొందించడం కంటే, యుద్ధాన్ని రేపడంలోనే ఎక్కువ భాగం వహించింది. వాస్తవానికి, అబద్ధ మతాన్ని, లోక రాజుల వాంఛను తీర్చే “వేశ్య” అని బైబిలు వర్ణిస్తోంది. (ప్రకటన 17:1, 2) భూమిపై చంపబడినవారందరి రక్తానికి ముఖ్య అపరాధి యిదే అని దేవుడు దాన్ని గూర్చి పేర్కొంటున్నాడు. (ప్రకటన 18:24) తత్ఫలితంగా, యెహోవా దేవుడు శాంతికి వ్యతిరేకంగా ఉన్న ఈ అడ్డంకును యిక ఎన్నడూ లేకుండా నిర్మూలిస్తాడు.—ప్రకటన 18:4, 5, 8.
రాజకీయం, అబద్ధ మతం వంటి వేర్పాటు శక్తులు కనుమరుగైనప్పటికీ, అందరికంటే యుద్ధపిపాసియైన—అపవాదియగు సాతానును నిర్మూలించకుండా శాంతిని సాధించడం అసాధ్యం. భూమిపై సంపూర్ణ శాంతిని నెలకొల్పే కార్యక్రమమందు దేవుని రాజ్యం చేపట్టే పనులలో యిది చివరిది. సాతాను “ఇక జనములను మోసపరచకుండునట్లు,” “పట్టుకొనబడి,” “బంధించి అగాధములో పడవే”యబడతాడు అని బైబిలు పుస్తకమైన ప్రకటన వర్ణిస్తోంది. ఆ తర్వాత అతను సంపూర్తిగా నాశనం చేయబడతాడు.—ప్రకటన 20:2, 3, 10.
యుద్ధం అంతం కావడం కేవలం ఒక కలకాదని బైబిలు వాగ్దానం చేస్తోంది. శాంతి కొరకైన యెహోవా దేవుని ఏర్పాట్లు యిప్పటికే ఆచరణలో ఉన్నాయి. ఆయన రాజ్యం పరలోకమందు స్థాపించబడింది, మరి ప్రపంచవ్యాప్త శాంతికి అభయమిచ్చే మరికొన్ని చర్యలను చేపట్టడానికి సంసిద్ధంగా ఉంది. ఈలోగా, ఈ పరలోక రాజ్యానికి మద్దతునిచ్చే లక్షలాది మంది యెహోవాసాక్షులు, శాంతితో జీవించడానికి నేర్చుకున్నారు.
అందుచేత, యుద్ధాలు అనివార్యంకాదని నమ్మడానికి మనకు చక్కటి కారణాలున్నాయి. అంతకంటే గొప్పగా, యుద్ధాలు యిక ఎన్నటికి లేకుండా యెహోవా వాటిని తీసివేసే ఆ రోజుకొరకు మనం ఎదురుచూడవచ్చు. (కీర్తన 46:9) త్వరలోనే యుద్ధంలేని లోకం వచ్చేట్లు దేవుడు చేస్తాడు.
[అధస్సూచీలు]
a కొన్నిసార్లు మతనాయకులు తామే యుద్ధవీరులుగా మారారు. హాస్టింగ్ పోరాటంలో (1066) కాథోలిక్ బిషపు ఒడో, ఖడ్గానికి బదులు అధికార దండాన్ని చేపట్టి తన చురుకైన పాత్రను సమర్థించుకున్నాడు. రక్తం చిందించబడకపోతే, ఒక దైవభక్తిగల వ్యక్తిగా న్యాయబద్ధంగా చంపవచ్చు అని అతను పేర్కొన్నాడు. అయిదు శతాబ్దాల తర్వాత, ఉత్తర ఆఫ్రికాపై స్పానిష్ దండయాత్రను కార్డినల్ క్సీమెన్స్ స్వయంగా నిర్వహించాడు.
[7వ పేజీలోని చిత్రం]
యుద్ధంలేని నూతన లోకంలో మీరు జీవించగలరు