సాత్వికులు ధన్యులు
“దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును.”—1 పేతురు 5:5.
1, 2. యేసు తన కొండ మీది ప్రసంగంలో సంతోషంగా ఉండే విషయాన్ని సాత్వికంగా ఉండడంతో ఎలా ముడిపెట్టాడు?
సంతోషంగా ఉండడమూ సాత్వికులుగా ఉండడం ఏవిధంగానైనా సంబంధాన్ని కల్గివున్నాయా? జీవించిన వారిలో కెల్లా మహాగొప్ప మనిషి అయిన యేసుక్రీస్తు తానిచ్చిన ప్రఖ్యాత ప్రసంగంలో తొమ్మిది సంతోషాలను లేక ధన్యతలను వివరించాడు. (మత్తయి 5:1-12) యేసు సంతోషంగా ఉండడాన్ని సాత్వికంగా ఉండడంతో ముడిపెట్టాడా? అవును, ఆయన పేర్కొన్న అనేక సంతోషాల్లో వినయంగా ఉండడం యిమిడివుంది. ఉదాహరణకు, ఒక వ్యక్తి ఆత్మీయావసరతపై శ్రద్ధకల్గివుండాలంటే అతను సాత్వికుడై ఉండాలి. సాత్వికులు మాత్రమే నీతికొరకు ఆకలి దప్పులను కల్గివున్నారు. మరి గర్విష్ఠులు, సాత్వికులుకారు, వారు కనికరం గలవారు కారు, శాంతిని నెలకొల్పేవారు కారు.
2 సాత్వికులు సంతోషవంతులు, ఎందుకంటే సాత్వికంగా ఉండడం సరైంది, నిజాయితీపరమైంది. అంతేకాకుండా, సాత్వికులు సంతోషంగా ఉంటారు ఎందుకంటే సాత్వికం వివేకయుక్తమైంది; అది యెహోవా దేవునితో తోటి క్రైస్తవులతో మంచి సంబంధాలను పెంచుకోడానికి నడుపుతుంది. అంతేకాకుండా, సాత్వికులు సంతోషవంతులు, కారణం సాత్వికంగా ఉండడమంటే వారి భావంలో ప్రేమను వ్యక్తపర్చడమై ఉంటుంది.
3. నిజాయితీ, మనం విధిగా సాత్వికులమై ఉండాలని ఎందుకు కోరుతోంది?
3 నిజాయితీగా ఉండాలంటే మనం సాత్వికంగా ఎందుకుండాలి? ఒక విషయమేమంటే, మనమందరం అపరిపూర్ణులం, ఎన్నో తప్పులను చేస్తూ ఉంటాము. అపొస్తలుడైన పౌలు తనను గూర్చి యిలా చెప్పుకున్నాడు: “నాయందు, అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేనెరుగుదును. మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుచున్నది గానీ దానిని చేయుట నాకు కలుగుటలేదు.” (రోమీయులు 7:18) అవును, మనమందరమూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేనివారమే. (రోమీయులు 3:23) నిష్పక్షపాతం మనం గర్వపడకుండా ఉండేలా కాపాడుతుంది. మనమొక తప్పు చేసినప్పుడు ఆ తప్పు ఒప్పుకొని, నిందను అంగీకరించడానికి సాత్వికం, నిజాయితీ అవసరమౌతాయి. మనం చేయాలనుకున్నవి చేయలేకపోతుంటాం గనుక, సాత్వికులుగా ఉండటానికి మనకు తగిన కారణాలున్నాయి.
4. మనం సాత్వికులుగా ఉండడానికి మనలను బలవంతపెట్టే ఏ కారణాలు 1 కొరింథీయులు 4:7లో యివ్వబడ్డాయి?
4 నిజాయితీ మనం సాత్వికంగా ఉండేలా ఎందుకు చేస్తుందో చూపడానికి అపొస్తలుడైన పౌలు మరో కారణాన్ని యిస్తున్నాడు. ఆయన యిలా అంటున్నాడు: “నీకు ఆధిక్యము కలుగజేయువాడెవడు? నీకు కలిగిన వాటిలో పరునివలన నీవు పొందనిది ఏది? పొందియుండియు పొందనట్టు నీవు అతిశయింపనేల?” (1 కొరింథీయులు 4:7) ఈ విషయమై ఏ అనుమానమూ లేదు, మనకై మనం ఘనులుగా ఎంచుకోవడం, మన వస్తువులు, సామర్థ్యాలు లేక మనం సాధించినవాటిని గూర్చి మనం గర్వపడడం నిజాయితీకానేరదు. “మేమన్ని విషయములలోను యోగ్యముగా ప్రవర్తించి . . . మంచి మనస్సాక్షి కలిగియున్నామని” చెప్పుకుని, దేవుని యెదుట మనం మంచి మనస్సాక్షిని కల్గివుండడానికి నిజాయితీ దోహదపడుతుంది.—హెబ్రీయులు 13:18.
5. మనం ఒక పొరపాటు చేసినప్పుడు నిజాయితీ మనకు ఎలా సహాయపడుతుంది?
5 మనమొక తప్పిదం చేసినప్పుడు, మనం సాత్వికులుగా ఉండడానికి నిజాయితీ సహాయపడుతుంది. మనలను మనం సమర్థించుకోవడం లేక యితరులపైకి నిందను నెట్టడం వంటివి చేయకుండా, ఆ నిందను మనం అంగీకరించడానికి అది దోహదపడుతుంది. ఆదాము హవ్వపై నిందను వేశాడుగాని దావీదు, ‘ఆమె పూర్తిగా కనిపించేలా స్నానం చేయకుండా ఉండాల్సింది. నేను శోధించబడకుండా ఉండలేకపోయాను’ అని ఆ నిందను బత్షెబా మీదికి త్రోసివేయలేదు. (ఆదికాండము 3:12; 2 సమూయేలు 11:2-4) నిజంగా, ఒకవైపు నిజాయితీగా ఉండటం మనం సాత్వికులుగా ఉండటానికి సహాయపడుతుంది; మరోవైపు సాత్వికంగా ఉండడం నిజాయితీని కనబరుస్తుంది.
యెహోవా యందలి విశ్వాసం, మనం సాత్వికులుగా ఉండడానికి సహాయపడుతుంది
6, 7. దేవుని యందు విశ్వాసం మనం సాత్వికంగా ఉండడానికి ఎలా దోహదపడుతుంది?
6 యెహోవా యందలి విశ్వాసం కూడ మనం సాత్వికంగా ఉండడానికి సహాయపడుతుంది. సృష్టికర్త, సర్వాధిపతియైనవాడు నిజంగా ఎంత గొప్పవాడో గుణగ్రహించడం, మనలను మనం ఎక్కువ ప్రాముఖ్యంగా పరిగణించడాన్ని నివారిస్తుంది. ప్రవక్తయైన యెషయా దీన్ని గూర్చి మనకు ఎంత చక్కగా జ్ఞాపకం చేస్తున్నాడు! యెషయా 40:15, 22 నందు మనం యిలా చదువుతాం: “జనములు చేదనుండి జారు బిందువులవంటివి జనులు త్రాసుమీది ధూళివంటివారు. . . . ఆయన భూమండలముమీద ఆసీనుడై యున్నాడు దాని నివాసులు మిడతలవలె కనబడుచున్నారు.”
7 యెహోవా యందలి విశ్వాసం, మనం అన్యాయాన్ని అనుభవించామని భావించినప్పుడు కూడా సహాయపడుతుంది. ఆ విషయమై మనం కోపగించుకోవడం కాకుండా, మనం యెహోవామీద ఆధారపడి, కీర్తన రచయిత కీర్తన 37:1-3, 8, 9 నందు చెప్పినట్లుగా నడుచుకుందాం. అపొస్తలుడైన పౌలు ఇదే దృక్పథాన్ని చెబుతున్నాడు: “ప్రియులారా, మీకు మీరే పగతీర్చుకొనక, దేవుని ఉగ్రతకు చోటియ్యుడి—‘పగతీర్చుట నా పని, నేనే ప్రతిఫలము నిత్తును’ అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడియున్నది.”—రోమీయులు 12:19.
సాత్వికం—వివేకయుక్త మార్గం
8. యెహోవాతో మనం మంచి సంబంధం ఏర్పర్చుకోడానికి సాత్వికం ఎలా సహాయపడుతుంది?
8 సాత్వికంగా ఉండడం వివేకయుక్తమనడానికి ఎన్నో కారణాలున్నాయి. ఒకటేమంటే, ముందుగానే సూచించబడినట్లుగా మనలను చేసినవానితో మనకు మంచి సంబంధాన్ని ఏర్పరుస్తుంది. దేవుని వాక్యం సామెతలు 16:5 నందు స్పష్టంగా యిలా చెబుతోంది: “గర్వహృదయులందరు యెహోవాకు హేయులు.” సామెతలు 16:18లో కూడా మనం యిలా చదువుతాం: “నాశనమునకు ముందు గర్వము నడచును పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడచును.” ఇప్పుడు కాకపోతే తర్వాతైనా గర్విష్ఠులు బాధననుభవించక తప్పదు. మొదటి పేతురు 5:5లో మనం చదివే ప్రకారం అది అలాగే జరగాలి: “మీరందరు ఎదుటివానియెడల దీనమనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి; దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును.” యేసు ఇదే విషయాన్ని పరిసయ్యుడు, సుంకరుడు చేసిన ప్రార్థనల దృష్టాంతంలో చూపాడు. సాత్వికుడైన సుంకరుడే ఎక్కువ నీతిమంతునిగా నిరూపించబడ్డాడు.—లూకా 18:9-14.
9. బాధలున్నప్పుడు సాత్వికం ఎలా తోడ్పడుతుంది?
9 సాత్వికం వివేకయుక్త మార్గం, ఎందుకంటే యాకోబు 4:7లో ఉన్న సలహాను మనం సులభంగా గైకొనడానికి సాత్వికం సహాయం చేస్తుంది: “కాబట్టి దేవునికి లోబడియుండుడి.” మనం సాత్వికులమైతే, యెహోవా మనల్ని బాధననుభవించడానికి అనుమతించినపుడు మనం తిరుగుబాటు చేయం. మన పరిస్థితితో సంతృప్తిపడి దాన్ని సహించడానికి సాత్వికం మనకు సహాయపడుతుంది. గర్విష్ఠునికి తృప్తిలేదు, ఎప్పుడూ వానికి ఎక్కువే కావాలి, బాధను తెచ్చే పరిస్థితుల్లో అతడు ఎదురుతిరుగుతాడు. మరోవైపు, సాత్వికుడైతే యోబు చేసినట్టుగా కష్టాలనూ శ్రమలను సహిస్తాడు. యోబు తన సంపాదన అంతటినీ పోగొట్టుకున్నాడు, బాధాకరమైన రోగంతో ఆవరించబడ్డాడు, ఆ తర్వాత చివరికి తన భార్యకూడా, “దేవుని దూషించి మరణము కమ్ము” అని చెబుతూ గర్విష్ఠుల మార్గాన్ని అనుసరించమని సలహానిచ్చింది. అతనెలా ప్రతిస్పందించాడు? బైబిలు వృత్తాంతం మనకిలా చెబుతోంది: “అందు కతడు— ‘మూర్ఖురాలు మాటలాడునట్లు నీవు మాటలాడుచున్నావు; మనము దేవునివలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప తగదా?’ అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటిమాటతోనైనను పాపము చేయలేదు.” (యోబు 2:9, 10) యోబు సాత్వికుడు గనుక, అతను ఎదురుతిరగకుండా వివేకయుక్తంగా యెహోవా దేన్నైతే అనుమతించాడో దాన్ని తనపైకి రానివ్వడానికి తన్నుతాను అర్పించుకున్నాడు. మరి చివరకి అతను ఎంతో గొప్ప బహుమానాన్ని పొందాడు.—యోబు 42:10-16; యాకోబు 5:11.
సాత్వికం యితరులతో మంచి సంబంధాన్ని పెంపొందించుట
10. సాత్వికం మన తోటి క్రైస్తవులతో మన సంబంధాన్ని అభివృద్ధి చేసుకోడానికి ఎలా సహాయం చేస్తుంది?
10 సాత్వికం వివేకయుక్త మార్గం, కారణం అది మన తోటి క్రైస్తవులతో మంచి సంబంధాన్ని పెంపొందిస్తుంది. అందుకే అపొస్తలుడైన పౌలు మనకు యిలా సలహానిస్తున్నాడు: “కక్షచేతనైనను వృథాతిశయము చేతనైనను ఏమియు చేయక, వినయమైన మనస్సుగలవారై యొకనినొకడు తనకంటే యోగ్యుడని యెంచుచు మీలో ప్రతివాడును తన సొంతకార్యములను మాత్రమేగాక యితరుల కార్యములను కూడ చూడవలెను.” (ఫిలిప్పీయులు 2:3, 4) సాత్వికం మనం యితరులతో పోటీపడటం లేక వారికంటె గొప్పగా కనపడడానికి ప్రయత్నించడం వంటి వాటి నుండి మనలను జ్ఞానయుక్తంగా దూరంచేస్తుంది. అలాంటి మానసిక దృక్పథం మనకు మన తోటి క్రైస్తవులకు సమస్యలను తెచ్చిపెడుతుంది.
11. పొరపాట్లు చేయకుండా ఉండడానికి సాత్వికం ఎలా సహాయపడుతుంది?
11 అనేక సందర్భాల్లో సాత్వికం మనం తప్పిదాలను చేయకుండా నివారిస్తుంది. ఎలా? ఎలాగంటే సాత్వికం మనపై మనం విపరీతమైన నమ్మకాన్ని కల్గివుండడాన్ని నివారిస్తుంది. అలాకాకుండా, 1 కొరింథీయులు 10:12లో అపొస్తలుడైన పౌలు సలహాను మనం గుణగ్రహిస్తాం: “తాను నిలుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను.” గర్విష్ఠుడు అతిగా స్వయం నమ్మకాన్ని కల్గివుంటాడు, కాబట్టి అతను తప్పులు చేయడానికి ఎక్కువ లోనౌతాడు. అది తనపై పడే బయటి ప్రభావం వల్లనే కావచ్చు లేక స్వంత బలహీనతల వల్ల కావచ్చు.
12. ఏ లేఖనాధార విధిని మనం చేరడానికి సాత్వికం దోహదపడుతుంది?
12 సాత్వికం, మనం లోబడివుండే అవసరతను గుర్తించడానికి దోహదపడుతుంది. ఎఫెసీయులు 5:21లో మనకు యిలా సలహా యివ్వబడుతోంది: “క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడియుండుడి.” నిజంగా, మనందరికి లోబడివుండే అవసరత లేదా? పిల్లలు తమ తలిదండ్రులకు, భార్య భర్తకు, భర్త క్రీస్తుకు లోబడివుండాలి. (1 కొరింథీయులు 11:3; ఎఫెసీయులు 5:22; 6:1) అలా, ఏ క్రైస్తవ సంఘంలోనైనా, పరిచారకులతో సహా అందరూ పెద్దలకు లోబడివుండాలి. మరి పెద్దలు నమ్మకమును బుద్ధిమంతుడునైన దాసునికి, ప్రత్యేకంగా ఆ తరగతికి ప్రాతినిధ్యం వహించే ప్రాంతీయకాపరికి లోబడివుండాల్సిన అవసరంలేదా? మరలా, ప్రాంతీయకాపరి జిల్లాకాపరికీ, జిల్లాకాపరి తాను సేవచేసే ప్రాంతంలోని బ్రాంచి కమిటీకి విధేయులై ఉండాలి. మరి బ్రాంచి కమిటీ సభ్యులమాటేమిటి? వారు “ఒకనికొకడు లోబడి” ఉండాలి అంతేకాకుండా “నమ్మకమును బుద్ధిమంతుడునైన దాసుని తరగతికి ప్రాతినిధ్యంవహించే పరిపాలక సభకు, మరి అది తిరిగి రాజైన యేసుకు జవాబుదారులై యున్నారు. (మత్తయి 24:45-47) పెద్దల సభలాగానే పరిపాలక సభలోని సభ్యులు ఒకని దృక్కోణాన్ని ఒకరు గౌరవించాలి. ఉదాహరణకు, ఒకరు తనకు చాలా చక్కటి తలంపు వచ్చిందని అనుకోవచ్చు. అయితే, తన సలహాకు తగినంతమంది యితర సభ్యులనుండి ఆమోదం లభించకపోతే, అతను ఆ విషయాన్ని ప్రక్కన ఉంచాల్సిందే. నిజంగా, మనందరికీ సాత్వికం అవసరం ఎందుకంటే మనమందరమూ ఒకరికి లోబడివున్నవారమే.
13, 14. (ఎ) ఏ ప్రత్యేక సందర్భాల్లో సాత్వికం మనకు తోడ్పడుతుంది? (బి) సలహాను అంగీకరించే విషయంలో పేతురు ఏ మాదిరినుంచాడు?
13 ప్రాముఖ్యంగా సాత్వికం ఒక వివేకయుక్త మార్గం అంటే, సలహాలను క్రమశిక్షణను మనం అంగీకరించడానికి సాత్వికం సులభం చేస్తుందని దాని భావం. కొన్నిసార్లు మనలో ప్రతి ఒక్కరికీ క్రమశిక్షణ అవసరమౌతుంది, అందుకే మనం సామెతలు 19:20 నందిచ్చిన సలహాను అంగీకరించాలి: “నీవు ముందుకు జ్ఞానివగుటకై ఆలోచన విని ఉపదేశము అంగీకరించుము.” చక్కగా చెప్పబడినట్లు, సాత్వికులకు గద్దింపు లేక క్రమశిక్షణ యిచ్చినప్పుడు, వారు బాధపడరు. అంతేకాకుండ, అపొస్తలుడైన పౌలు హెబ్రీయులు 12:4-11 నందు సాత్వికంగా క్రమశిక్షణకు లోబడివుండే వివేకాన్ని గూర్చిన సలహాను యిచ్చాడు. కేవలం ఈ విధంగానే మనం మన భవిష్యత్ జీవితాన్ని వివేకయుక్తంగా మలచుకోగలం, దాని ఫలితంగా నిత్యజీవాన్ని బహుమానంగా పొందగలం. అది ఎంత సంతోషకరమైన ఫలితమోగదా!
14 ఈ విషయంలో మనం అపొస్తలుడైన పేతురు మాదిరిని చూపవచ్చు. గలతీయులు 2:14లో మనం చదివేట్లుగా అతను అపొస్తలుడైన పౌలు నుండి గంభీరమైన సలహాను పొందాడు: “వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోవుట నేను చూచినప్పుడు అందరి యెదుట కేఫాతో (పేతురు) నేను చెప్పినదేమనగా—‘నీవు యూదుడవై యుండియు యూదులవలె కాక అన్యజనులవలెనె ప్రవర్తించుచుండగా, అన్యజనులు యూదులవలె ప్రవర్తింపవలెనని యెందుకు బలవంతము చేయుచున్నావు?” అపొస్తలుడైన పేతురు బాధపడ్డాడా? బాధపడినా ఎంతో కాలం కాదు, తర్వాత తన లేఖలో “ప్రియ సహోదరుడైన పౌలు” అని సంబోధించడం 2 పేతురు 3:15, 16లో మనం చూడవచ్చు.
15. మనం సాత్వికంగా ఉండడానికి, సంతోషంగా ఉండడానికి మధ్యనున్న సంబంధమేమిటి?
15 ఉన్నవాటితో తృప్తిపడటం, అంటే సంతృప్తి నొందే విషయం కూడా ఉంది. మనకున్న దానితో, అనగా మన ఆధిక్యతలతో మన ఆశీర్వాదాలతో మనం సంతృప్తి పొందకపోతే మనం ఎన్నటికీ సంతోషంగా ఉండలేము. ఒక సాత్వికుడైన క్రైస్తవుడు యిలాంటి ధోరణిని పెంచుకుంటాడు: “ఒకవేళ దేవుడు అనుమతిస్తే నేను పొందుతాను.” ఇది సరిగ్గా అపొస్తలుడైన పౌలు 1 కొరింథీయులు 10:13లో చెప్పినట్లుగా ఉంది: “సాధారణముగా మనుష్యులకు కలుగు శోధనతప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు; మీరు సహింపగలిగినంతకంటె ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనియ్యడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడ తప్పించుకొను మార్గమును కలుగ జేయును.” కాబట్టి మరలా మనం సాత్వికం వివేకయుక్త మార్గమని చూశాము, ఎందుకంటే మన స్థితి ఏమైనా సంతోషంగా ఉండడానికి అది తోడ్పడుతుంది.
ప్రేమ మనం సాత్వికులుగా ఉండడానికి తోడ్పడుతుంది
16, 17. (ఎ) ఏ లేఖనాధార మాదిరి, మనం సాత్వికులుగా ఉండడానికి అవసరమైన గొప్ప లక్షణాన్ని చూపుతోంది? (బి) లోకసంబంధమైన ఏ మాదిరి కూడ ఈ విషయాన్ని ఉదహరిస్తోంది?
16 అన్నిటికంటే ముఖ్యంగా, స్వార్థరహిత ప్రేమైన అగాపే, మనం సాత్వికంగా ఉండేట్లు సహాయపడుతుంది. పౌలు ఫిలిప్పీయులకు వివరించినట్లు యేసు ఎలా సాత్వికంతో హింసా కొయ్యను సహించగలిగాడు? (ఫిలిప్పీయులు 2:5-8) తాను దేవునితో సమానంగా ఉండడానికి ఆయన ఎందుకంత ప్రాముఖ్యతనివ్వలేదు? ఎందుకంటే “నేను తండ్రిని ప్రేమించుచున్నాను” అని ఆయనే చెప్పాడు. (యోహాను 14:31) అందుకే ఆయన అన్నివేళలా ఘనతనూ గౌరవాన్ని తన పరలోక తండ్రియైన యెహోవాకు చెందనిచ్చాడు. కాబట్టి, మరో సందర్భంలో తన పరలోక తండ్రి మాత్రమే మంచివాడని చెప్పాడు.—లూకా 18:18, 19.
17 ఈ విషయాన్ని అమెరికాలోని తొలి కవుల్లో ఒకడైన జాన్ గ్రీన్‌లిఫ్ వైట్టిర్ జీవితమందలి ఒక సంఘటన ఉదహరిస్తుంది. అతను యౌవనుడిగా ఉన్నపుడు అతనికి ఒక ప్రేయసి ఉండేది. పదాల్లోని అక్షరాలను సరిగ్గా చెప్పే పందెంలో ఆమె ఒక పదాన్ని సరిగ్గా చెప్పింది, కానీ అతడు చెప్పలేకపోయాడు. ఆ విషయమై ఆమె చాలా బాధపడింది. ఎందుకు? కవి దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఆమె యిలా అన్నదని చెప్పాడు: “అయ్యో నేను ఆ పదం సరిగ్గా పలికినందుకు నన్ను క్షమించు. నేను నీకంటే గొప్పగావుండడం నాకిష్టంలేదు. . . . ఎందుకంటే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను.” అవును, మనం ఎవరినైనా ప్రేమిస్తే, వారు మనకంటె ఉన్నతంగా ఉండాలని కోరుకుంటాం గాని మన క్రింద కాదు, కారణం ప్రేమ సాత్వికమైంది.
18. సాత్వికం ఏ లేఖనాధార సలహాను అంగీకరించడానికి తోడ్పడుతుంది?
18 ఇది క్రైస్తవులందరికీ ఒక మంచి పాఠం, ముఖ్యంగా సహోదరులకు. ఒక ప్రత్యేకమైన ఆధిక్యత విషయానికొచ్చినప్పుడు, మనకు బదులు మన సహోదరుడు దాన్ని పొందాడని మనం సంతోషిస్తామా, లేక ఈర్ష్య, అసూయ భావాలను కల్గివుంటామా? మనం నిజంగా మన సహోదరుని ప్రేమిస్తే, ఆ ప్రత్యేకమైన పని లేక గుర్తింపు లేక సేవాధిక్యత అతనికి వచ్చిందని సంతోషిస్తాం. అవును, వినయం సలహాని అంగీకరించడానికి సహాయపడుతుంది: “ఘనత విషయంలో ఒకని నొకడు గొప్పగా ఎంచుకొనుడి.” (రోమీయులు 12:10) మరో అనువాదంలో యిలా ఉంది: “ఒకనినొకడు మీకంటే ఎక్కువగా గౌరవించండి.” (న్యూ ఇంటర్నేష్నల్ వర్ష్‌న్) మరలా, అపొస్తలుడైన పౌలు మనకు సలహా యిస్తున్నాడు: “ప్రేమకలిగినవారై యొకనికొకడు దాసులైయుండుడి.” (గలతీయులు 5:13) అవును, మనకు ప్రేమ ఉన్నట్లైతే, మన సహోదరులకు పరిచారం చేయడానికి, వారికి దాసులు కావడానికి, వారి ఆసక్తిని క్షేమాన్ని మనదానికంటే ముందుంచడంలో ఆనందిస్తాం, మరి దానికి సాత్వికం అవసరం. మనం గొప్పలు చెప్పుకొని, తద్వారా యితరుల్లో ఈర్ష్య లేక అసూయ భావాలు మేల్కొల్పకుండా ఉండేట్లు కూడా సాత్వికంచేస్తుంది. పౌలు, ప్రేమ “మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు” అని రాశాడు. ఎందుకు? ఎందుకంటే మత్సరపడడం, డంబంగా ప్రవర్తించడం వెనుక స్వార్థం, గర్వపు ఉద్దేశాలుంటాయి, అయితే ప్రేమ నిస్వార్థానికి ప్రతిరూపం.—1 కొరింథీయులు 13:4.
19. గర్వం, స్వార్థాల వలె సాత్వికం, ప్రేమ సమాంతరంగా వెళ్తాయని ఏ బైబిలు మాదిరి ఉదహరిస్తుంది?
19 దావీదుకు, రాజైన సౌలుతో అతని కుమారునితో ఉన్న సంబంధం, ప్రేమ, సాత్వికం ఎలా ఒకదానితో ఒకటి సమాంతరంగా నడుస్తాయో అలాగే గర్వం, స్వార్థం ఎలా సమాంతరంగా నడుస్తాయో చూపడానికి ఒక చక్కటి ఉదాహరణ. దావీదు యుద్ధంలో గెలిచినప్పుడు ఇశ్రాయేలీయుల స్త్రీలు యిలా పాడారు: “సౌలు వేలకొలదియు, దావీదు పదివేలకొలదియు (శత్రువులను) హతము చేసిరి.” (1 సమూయేలు 18:7) కొద్దిపాటి సాత్వికం కూడా లేకుండా, అసలు చెప్పాలంటే, అహంకారం చేత ఆవరించబడిన సౌలు, అప్పటినుండి దావీదు యెడల హత్యాయుత ద్వేషాన్ని పెంచుకున్నాడు. తన కుమారుడైన యోనాతాను స్వభావానికి యిది ఎంత విరుద్ధంగా ఉంది! యోనాతాను దావీదును తన సొంత శరీరంలా ప్రేమించాడని మనం చదువుతాం. (1 సమూయేలు 18:1) కాబట్టి, సంఘటనలు జరిగే కొలది, యెహోవా యోనాతానును కాక దావీదును ఆశీర్వదిస్తున్నాడని, సౌలు స్థానంలో దావీదు రాజుగా వస్తాడని తెలుసుకున్నప్పుడు యోనాతాను ఎలా ప్రతిస్పందించాడు? యోనాతాను ఈర్ష్యపడ్డాడా లేక మత్సరపడ్డాడా? లేనేలేదు! దావీదు యెడల తనకున్న అపారమైన ప్రేమను బట్టి 1 సమూయేలు 23:17 నందు మనం చదివినట్లుగా అతను యిలా అనగల్గాడు: “నీవు ఇశ్రాయేలీయులకు రాజువగుదువు, నేను నీకు సహకారినౌదును, ఇది నాతండ్రియైన సౌలునకు తెలిసియున్నదని అతనితో చెప్పి దేవునిబట్టి అతని బలపరచెను.” దావీదు యెడల యోనాతానుకు గల అపారమైన ప్రేమ, తన తండ్రి తర్వాత ఎవరు ఇశ్రాయేలీయుల రాజుకావాలనేది దేవుని చిత్తమని తాను భావించినదాన్ని సాత్వికంగా అంగీకరించడానికి సహాయపడింది.
20. ప్రేమ, సాత్వికాల మధ్యగల సన్నిహిత సంబంధాన్ని యేసు ఎలా చూపాడు?
20 అంతేకాకుండా, ప్రేమ సాత్వికంల సంబంధాన్ని చూపిస్తూ యేసుక్రీస్తు చనిపోకముందు రాత్రి, తన అపొస్తలులతో ఉన్నప్పుడు జరిగినది మరింత బలపరుస్తోంది. యోహాను 13:1లో మనం యిలా చదువుతాం “యేసు . . . లోకములోనున్న తనవారిని ప్రేమించి, వారిని అంతము వరకు ప్రేమించెను.” ఆ మాటలు చెప్పిన తర్వాతనే ఒక నీచమైన పనివానిలా ప్రవర్తిస్తూ యేసు తన అపొస్తలుల పాదాలు కడిగాడు అని మనం చదువుతాం. సాత్వికం గూర్చి ఎంతటి శ్రేష్ఠమైన పాఠం!—యోహాను 13:1-11.
21. సారాంశంగా, మనం ఎందుకు సాత్వికులమై ఉండాలి?
21 నిజమే, సాత్వికంగా ఉండడానికి ఎన్నో కారణాలున్నాయి. సాత్వికంగా ఉండడం సబబే, అది నిజాయితీతో కూడినది. అది విశ్వాస మార్గం. యెహోవా దేవునితో అలాగే మన తోటి విశ్వాసులతో మంచి సంబంధాన్ని ఏర్పర్చుకోడానికి అది సహాయపడుతుంది. అది వివేకయుక్త మార్గం. అన్నిటికంటే ప్రాముఖ్యంగా, అది ప్రేమ కనపర్చే విధానం, అంతేకాకుండా అది నిజమైన సంతోషాన్ని తెస్తుంది.
మీరు ఎలా జవాబిస్తారు?
◻ మనం సాత్వికులుగా ఉండడానికి నిజాయితీ ఏ యే విధాలుగా సహాయపడుతుంది?
◻ యెహోవా యెడల విశ్వాసం మనం సాత్వికులుగా ఉండడానికి ఎందుకు తోడ్పడుతుంది?
◻ సాత్వికంగా ఉండడం వివేకయుక్త మార్గమని ఏమి చూపుతోంది?
◻ సాత్వికంగా ఉండడానికి ప్రేమ ప్రత్యేకంగా ఎందుకు సహాయకరం?
[21వ పేజీలోని చిత్రం]
యోబు సాత్వికంతో తన్ను తాను యెహోవాకు లోపర్చుకున్నాడు. ఆయన “దేవుని దూషించి చనిపో”లేదు
[23వ పేజీలోని చిత్రం]
పేతురును బహిరంగంగా పౌలు గద్దించినప్పుడు ఆయన సాత్వికంతో లోబడ్డాడు