యెహోవా మార్గాలలో ధైర్యంగా నడవండి
“యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచువారందరు ధన్యులు.”—కీర్తన 128:1.
1, 2. తొలి యెహోవాసాక్షుల మాటలు, క్రియల బైబిలు చరిత్ర వల్ల ఏ సహాయం కలదు?
యెహోవా పరిశుద్ధ వాక్యము తన యథార్థ సేవకుల శ్రమలు, సంతోషాల వృత్తాంతాలతో నిండివుంది. నోవహు, అబ్రాహాము, శారా, యెహోషువ, దెబోరా, బారాకు, దావీదు మరితరుల అనుభవాల వృత్తాంతాలు దాని పుటలలో విశేషంగా, స్పష్టంగా ఉన్నాయి. వారంతా నిజమైన వ్యక్తులైయుండి, వారందరూ సాధారణమైన ఒక ప్రత్యేకతను కలిగివుండిరి. వారికి దేవుని యందు విశ్వాసముండింది, వారు ఆయన మార్గాలలో ధైర్యంగా నడిచారు.
2 దేవుని మార్గాల్లో నడుచుటకు మనం ప్రయాసపడుతుండగా, యెహోవా తొలి సాక్షుల మాటలు, క్రియలు మనకు ప్రోత్సాహకరంగా ఉంటాయి. దేవుని యెడల గౌరవంతో కూడిన భక్తిని, ఆయనను అసంతోషపరచుటకు సరైన భయాన్ని ప్రదర్శిస్తే, మనం సంతోషాన్ని పొందగలము. మనం జీవితంలో శ్రమలు అనుభవించినప్పటికీ ఇది నిజం, ఎందుకంటే ప్రేరేపిత కీర్తనల రచయిత యిలా పాడాడు: “యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచువారందరు ధన్యులు.”—కీర్తన 128:1.
ధైర్యం అంటే ఏమిటి
3. ధైర్యమంటే ఏమిటి?
3 యెహోవా మార్గాలలో నడవాలంటే మనకు ధైర్యం కావాలి. వాస్తవానికి, ఈ లక్షణాన్ని ప్రదర్శించమని లేఖనాలు దేవుని ప్రజలకు ఆజ్ఞాపిస్తున్నాయి. ఉదాహరణకు, కీర్తనల రచయితయైన దావీదు ఇలా పాడాడు: “యెహోవాకొరకు కనిపెట్టువారలారా, మీరందరు మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా నుండుడి.” (కీర్తన 31:24) ధైర్యం అంటే, “అపాయాన్ని, భయాన్ని లేక కష్టాన్ని సహించి, పట్టుదలతో వాటిని తట్టుకునే మానసిక లేక నైతిక శక్తి.” (వెబ్స్‌టర్స్ నైన్త్ న్యూ కాలేజ్యేట్ డిక్షనరి) ధైర్యంగల ఒక వ్యక్తి దృఢంగా, నిర్భీతిగా, పరాక్రమశాలిగా ఉంటాడు. తన తోటిపనివాడైన తిమోతికి అపొస్తలుడైన పౌలు చెప్పిన ఈ మాటల ద్వారా యెహోవా తన సేవకులకు ధైర్యాన్ని ఇస్తాడన్నది స్పష్టమౌతుంది: “దేవుడు మనకు శక్తియు ప్రేమయు, ఇంద్రియ నిగ్రహమునుగల ఆత్మనే యిచ్చెను గాని పిరికితనముగల ఆత్మ నియ్యలేదు.”—2 తిమోతి 1:7.
4. ధైర్యాన్ని పొందుటకు ఒక మార్గమేమిటి?
4 దేవుడిచ్చే ధైర్యాన్ని పొందుటకు ఒక మార్గమేదనగా, యెహోవా వాక్యమైన బైబిలుకు ప్రార్థనాపూర్వక తలంపు నిచ్చుటయే. లేఖనాలలో కనబడే అనేక వృత్తాంతాలు ఎక్కువ ధైర్యవంతులమగుటకు మనకు సహాయం చేయగలవు. కావున, మొదట మనం యెహోవా మార్గాలలో ధైర్యంగా నడిచిన కొంతమందిని గూర్చి హెబ్రీ లేఖనాలలో ఉన్న చరిత్ర నుండి మనమేమి నేర్చుకోగలమో చూద్దాము.
దేవుని వర్తమానాన్ని ప్రకటించుటకు ధైర్యం
5. హనోకు ధైర్యం నేటి యెహోవా సేవకులకు ఎలా మేలు చేయగలదు?
5 దేవుని వర్తమానాన్ని ధైర్యంగా మాట్లాడుటకు ప్రస్తుత-దిన యెహోవా సేవకులకు హనోకు ధైర్యం సహాయం చేయగలదు. హనోకు పుట్టకముందు, “యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది.” మనుష్యులు “దూషణకరంగా” యెహోవా నామాన్ని బట్టి ప్రార్థించడం ప్రారంభించారు అని కొంతమంది పండితులు అంటారు. (ఆదికాండము 4:25, 26; 5:3, 6) దైవిక నామం మానవులకు లేక విగ్రహాలకు కూడా అనువర్తింపజేయబడి ఉండవచ్చు. కాబట్టి, సా.శ.పూ. 3404లో హనోకు జన్మించినప్పుడు అబద్ధమతం వర్ధిల్లుతుండెను. వాస్తవానికి, యెహోవా వెల్లడిచేసిన సత్యానికి అనుగుణంగా నీతియుక్తమైన మార్గాన్ని అవలంభిస్తూ, ‘దేవునితో నడచుటలో’ ఆయన ఒంటరివాడై ఉన్నట్లుంది.—ఆదికాండము 5:18, 24.
6. (ఎ) హనోకు ఏ దృఢమైన వర్తమానాన్ని ప్రకటించాడు? (బి) మనమే నమ్మకాన్ని కలిగివుండగలము?
6 హనోకు దేవుని వర్తమానాన్ని, బహుశా ప్రకటించడం ద్వారా, ధైర్యంగా అందజేశాడు. (హెబ్రీయులు 11:5; మరియు 2 పేతురు 2:5 పోల్చండి.) “ఇదిగో, అందరికిని తీర్పు తీర్చుటకును, వారిలో భక్తిహీనులందరును భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు, భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటినిగూర్చియు వారిని ఒప్పించుటకును, ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను,” అని ఈ ఒంటరి సాక్షి ప్రకటించాడు. (యూదా 14, 15) దైవభక్తిలేని వారిని ఖండించే వర్తమానాన్ని అందజేస్తున్నప్పుడు యెహోవా అనే నామాన్ని ఉపయోగించే ధైర్యం హనోకునకు ఉండింది. ఆ దృఢమైన వర్తమానాన్ని ప్రకటించుటకు యెహోవా హనోకునకు ధైర్యాన్నిచ్చినట్లే, పరిచర్యలో, పాఠశాలలో, మరెక్కడైనా ఆయన వాక్యాన్ని ధైర్యంగా మాట్లాడుటకు ప్రస్తుత-దిన సాక్షులను యెహోవా శక్తిమంతులను చేశాడు.—అపొస్తలుల కార్యములు 4:29-31 పోల్చండి.
శ్రమననుభవిస్తున్నప్పుడు ధైర్యం
7. నోవహు ధైర్యాన్ని గూర్చిన ఏ మాదిరిని అందజేస్తున్నాడు?
7 మనం శ్రమననుభవిస్తున్నప్పుడు నీతియుక్తమైన క్రియలు చేయుటలో ధైర్యంగా వుండుటకు నోవహు మాదిరి మనకు సహాయం చేయగలదు. ప్రపంచవ్యాప్త జలప్రళయాన్ని గూర్చిన దైవిక హెచ్చరికకు స్పందించి అతడు ధైర్యంతోను విశ్వాసంతోను “తన యింటివారి రక్షణకొరకు ఒక ఓడను సిద్ధముచేసెను.” విధేయతగల, నీతియుక్తమైన చర్యల ద్వారా, నోవహు అవిశ్వాస లోకాన్ని దాని చెడుక్రియలను బట్టి ఖండించి, అది నాశనానికి తగినదని నిరూపించాడు. (హెబ్రీయులు 11:7; ఆదికాండము 6:13-22; 7:16) క్రైస్తవ పరిచర్య వంటి నీతియుక్తమైన క్రియలలో ధైర్యంగా కొనసాగుటకు నోవహు విధానాన్ని గూర్చి ధ్యానించడం దేవుని ఆధునిక-దిన సేవకులకు సహాయం చేస్తుంది.
8. (ఎ) “నీతిని ప్రకటించిన” ధైర్యవంతునిగా నోవహు ఏమి ఎదుర్కొన్నాడు? (బి) మనం ధైర్యంగా నీతిని ప్రకటించేవారమై యుంటే యెహోవా మనకొరకేమి చేస్తాడు?
8 మనం ఒకవేళ నీతియుక్తమైన విధానాన్ని అవలంభిస్తూ, ఫలానా శ్రమతో ఎలా వ్యవహరించాలో తెలియకపోతే, దాన్ని ఎదుర్కొనుటకు కావలసిన జ్ఞానం కొరకు మనం ప్రార్థిద్దాము. (యాకోబు 1:5-8) శ్రమలను ధైర్యంతో, నమ్మకంతో ఎదుర్కోవడం సాధ్యమేనని, పరీక్షించబడినప్పుడు దేవుని యెడల నోవహు కనపర్చిన యథార్థత చూపిస్తుంది. దుష్ట లోకం, మానవ రూపం దాల్చిన దేవదూతలు, వారి సంకరజాతి సంతానం నుండి వచ్చిన వత్తిడిని ఆయన ఎదుర్కొన్నాడు. అవును, నాశనానికి సిద్ధమైన “పూర్వకాలమందున్న లోకము”నకు నోవహు “నీతిని ప్రకటించిన” ధైర్యవంతుడు. (2 పేతురు 2:4, 5; ఆదికాండము 6:1-9) జలప్రళయానికి ముందున్నవారికి దేవుని హెచ్చరికను ప్రకటించే దూతగా ఆయన ధైర్యంగా మాట్లాడినప్పటికీ, వారు “జలప్రళయమువచ్చి అందరిని కొట్టుకొనిపోవు వరకు ఎరుగక పోయిరి.” (మత్తయి 24:36-39) హింసింపబడినప్పటికీ, ఈనాడు అనేకులు మన బైబిలు ఆధారిత వర్తమానాన్ని నిరాకరించినప్పటికీ, నీతిని ప్రకటించేవారిగా మనం అదే విశ్వాసాన్ని, ధైర్యాన్ని ప్రదర్శిస్తే, యెహోవా నోవహును సమర్థించినట్లే మనల్ని సమర్థిస్తాడని మనం గుర్తుంచుకుందాము.
దేవునికి విధేయులగుటకు ధైర్యం
9, 10. అబ్రాహాము, శారా, ఇస్సాకు ఏ యే విధాలుగా ధైర్యంతో కూడిన విధేయతను చూపించారు?
9 దేవునికి ధైర్యంతో కూడిన విధేయతను చూపుటలో “దేవుని స్నేహితుడైన” అబ్రాహాము మంచి మాదిరి. (యాకోబు 2:23) యెహోవాకు విధేయుడై, వస్తుసంబంధ లాభాలతో నిండివున్న కల్దీయుల నగరమైన ఊరును విడిచి వచ్చుటకు ఆబ్రాహాముకు విశ్వాసము, ధైర్యము అవసరమయ్యుండెను. “భూమి యొక్క సమస్త వంశములు” తన ద్వారా ఆశీర్వదించబడతాయని, తన సంతానానికి దేశము ఇవ్వబడుతుందని దేవుడు చేసిన వాగ్దానాన్ని ఆయన నమ్మాడు. (ఆదికాండము 12:1-9; 15:18-21) విశ్వాసము ద్వారా అబ్రాహాము “వాగ్దత్త దేశములో పరవాసియై,” భూమిపై జీవించుటకు తాను పునరుత్థానము చేయబడగల దేవుని పరలోక రాజ్యమైన “పునాదులుగల ఆ పట్టణము” కొరకు ఎదురుచూశాడు.—హెబ్రీయులు 11:8-16.
10 ఊరును విడిచి, పరాయి దేశానికి తన భర్త వెంబడి వెళ్లి, అక్కడ వారికెదురయ్యే ఏ కష్టాలనైనా సహించుటకు అవసరమయ్యే విశ్వాసం, ధైర్యం అబ్రాహాము భార్యయైన శారాకు వుండింది. దేవునికి ఆమె చూపిన ధైర్యంతో కూడిన విధేయతకు ఆమె ఎంతగా ప్రతిఫలం పొందింది! దాదాపు 90 ఏళ్ల వరకు గొడ్రాలుగా వున్న శారా “వయస్సు గతించినదైనను” ‘వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగినవాడని యెంచుకొనెను గనుక గర్భము ధరించుటకు’ శక్తిపొందెను. తగిన కాలంలో, ఆమె ఇస్సాకును కన్నది. (హెబ్రీయులు 11:11, 12; ఆదికాండము 17:15-17; 18:11; 21:1-7) కొన్ని సంవత్సరాల తరువాత, అబ్రాహాము దేవునికి “ఇస్సాకును బలిగా” అర్పించునంతగా ధైర్యముతో విధేయుడయ్యాడు. ఆ పితరుడు దేవదూతచే నివారించబడి, ధైర్యవంతుడు, విధేయుడునైన తన కుమారున్ని “ఉపమానరూపముగా” మరణం నుండి తిరిగిపొందాడు. యెహోవా దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును, ఆయన యందు విశ్వాసముంచు వారందరు నిత్యజీవాన్ని పొందేలా విమోచనక్రయధనముగా ఏర్పాటు చేస్తాడని అబ్రాహాము, ఇస్సాకు అలా ప్రవచనార్థకంగా చిత్రించబడ్డారు. (హెబ్రీయులు 11:17-19; ఆదికాండము 22:1-19; యోహాను 3:16) నిశ్చయంగా, అబ్రాహాము, శారా, మరియు ఇస్సాకుల ధైర్యంతో కూడిన విధేయత, యెహోవాకు విధేయులమై, ఎల్లప్పుడు ఆయన చిత్తాన్ని చేయుటకు మనల్ని పురికొల్పాలి.
దేవుని ప్రజలతో నిలిచియుండుటకు ధైర్యం
11, 12. (ఎ) యెహోవా ప్రజలకు సంబంధించి మోషే ఎలా ధైర్యాన్ని ప్రదర్శించాడు? (బి) మోషే కనపర్చిన ధైర్యం దృష్ట్యా ఏ ప్రశ్న అడుగవచ్చు?
11 మోషే ధైర్యంగా అణగద్రొక్కబడిన దేవుని ప్రజల పక్షమున నిలబడ్డాడు. సా.శ.పూ. 16వ శతాబ్దంలో మోషే తలిదండ్రులు కూడా ధైర్యాన్ని చూపించారు. క్రొత్తగా జన్మించిన హెబ్రీ మగపిల్లలను చంపేయాలనే రాజాజ్ఞకు భయపడకుండా, వారు మోషేను దాచి, తరువాత ఆయనను ఒక పెట్టెలో పెట్టి, నైలునది ఒడ్డున జమ్ము గడ్డిమధ్యన విడిచిపెట్టారు. ఫరో కుమార్తె అతనిని కనుగొనినందున ఆత్మీయ తర్ఫీదును మొదట తన తలిదండ్రుల ఇంటివద్దనే పొందినను అతడు ఆమె కుమారునిగా పెంచబడ్డాడు. ఫరో ఇంటివారిలో భాగంగా, మోషే “ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి, మాటలయందును కార్యములయందును ప్రవీణుడై,” మానసిక, శారీరక సమర్థతలందు బలవంతుడయ్యాడు.—అపొస్తలుల కార్యములు 7:20-22; నిర్గమకాండము 2:1-10; 6:20.
12 రాజరిక గృహ వస్తుసంబంధ ప్రయోజనాలు ఉన్నప్పటికీ, ఆ కాలమందు ఐగుప్తీయుల అధీనంలో వున్న యెహోవా ఆరాధికుల పక్షమున నిలబడుటకు మోషే ధైర్యంగా ఎన్నుకున్నాడు. ఒక ఇశ్రాయేలీయున్ని రక్షించుటకు, ఆయన ఒక ఐగుప్తీయున్ని చంపి, మిద్యానుకు పారిపోయాడు. (నిర్గమకాండము 2:11-15) దాదాపు 40 సంవత్సరాల తరువాత, ఇశ్రాయేలీయులను దాసత్వం నుండి విడిపించుటలో నడిపింపునిచ్చుటకు దేవుడు ఆయనను ఉపయోగించుకున్నాడు. అప్పుడు మోషే, ఇశ్రాయేలీయుల పక్షమున యెహోవాకు ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు చంపేస్తానని బెదిరిస్తున్న “రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను.” మోషే ‘అదృశ్యుడైనవానిని’ అనగా యెహోవా దేవున్ని చూస్తున్నట్లు నడిచాడు. (హెబ్రీయులు 11:23-29; నిర్గమకాండము 10:28) కష్టము, హింస వున్నప్పటికీ, యెహోవాను, ఆయన ప్రజలను హత్తుకొనివుండగల అలాంటి విశ్వాసం, ధైర్యం మీకున్నాయా?
‘పూర్ణమనస్సుతో యెహోవాను అనుసరించుటకు’ ధైర్యం
13. యెహోషువ మరియు కాలేబు ఎలా ధైర్యాన్ని గూర్చిన మాదిరులనుంచారు?
13 ధైర్యవంతులైన యెహోషువ మరియు కాలేబు మనం దేవుని మార్గాలలో నడవగలమనే రుజువును అందజేశారు. వారు “పూర్ణమనస్సుతో యెహోవాను అనుసరించారు.” (సంఖ్యాకాండము 32:11) వాగ్దాన దేశాన్ని వేగు చూచుటకు పంపబడిన 12 మందిలో యెహోషువ, కాలేబు ఉన్నారు. దాని నివాసులకు భయపడి, 10 మంది వేగులవారు కనాను దేశంలో ప్రవేశించకుండా ఇశ్రాయేలీయులను నివారించుటకు ప్రయత్నించారు. అయినా, యెహోషువ, కాలేబు ధైర్యంగా ఇలా చెప్పారు: “యెహోవా మనయందు ఆనందించినయెడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును; అది పాలు తేనెలు ప్రవహించుదేశము. మెట్టుకు మీరు యెహోవామీద తిరుగబడకుడి, ఆ దేశప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీదనుండి తొలగిపోయెను. యెహోవా మనకు తోడై యున్నాడు, వారికి భయపడకుడి.” (సంఖ్యాకాండము 14:8, 9) విశ్వాసం, ధైర్యం లేనందున ఆ ఇశ్రాయేలీయుల తరం ఎన్నడూ ఆ వాగ్దాన దేశాన్ని చేరలేకపోయింది. కాని యెహోషువ, కాలేబు క్రొత్త తరం వారితో కలిసి దానిలో ప్రవేశించగలిగారు.
14, 15. (ఎ) యెహోషువ 1:7, 8, నందలి మాటలను యెహోషువ అనువర్తించినప్పుడు, తాను, ఇశ్రాయేలీయులు ఏమనుభవించారు? (బి) ధైర్యాన్ని గూర్చిన ఏ పాఠాన్ని మనం యెహోషువ, కాలేబుల నుండి నేర్చుకుంటాము?
14 దేవుడు యెహోషువకిలా చెప్పాడు: “నీవు నిబ్బరముగలిగి జాగ్రత్తపడి బహు ధైర్యముగానుండి, నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతిమార్గమున చక్కగా ప్రవర్తించునట్లు నీవు దానినుండి కుడికిగాని యెడమకుగాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్రగ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటిప్రకారము చేయుటకు నీవు జాగ్రత్తపడునట్లు దివారాత్రము దాని ధ్యానించినయెడల నీ మార్గమును వర్ధిల్లజేసికొని చక్కగా ప్రవర్తించెదవు.”—యెహోషువ 1:7, 8.
15 యెహోషువ ఆ మాటలను అనువర్తిస్తుండగా యెరికో మరితర పట్టణాలు ఇశ్రాయేలీయుల స్వాధీనమయ్యాయి. గిబ్యోను నొద్ద ఇశ్రాయేలీయులు విజయం సాధించేంత వరకు ప్రకాశిస్తుండేలా సూర్యుడు నిలిచివుండునట్లు కూడా దేవుడు చేశాడు. (యెహోషువ 10:6-14) “సముద్రతీరమందలి యిసుకరేణువులంత విస్తారముగానున్న” సంకీర్ణ శత్రు సేనలచే ముట్టడి చేయబడినప్పుడు, యెహోషువ ధైర్యంగా ప్రవర్తించాడు, దేవుడు మళ్లీ ఇశ్రాయేలీయులు గెలిచేలా చేశాడు. (యెహోషువ 11:1-9) మనం అపరిపూర్ణ మానవులమైనప్పటికీ, యెహోషువ మరియు కాలేబుల వలె పూర్ణమనస్సుతో యెహోవాను అనుసరించగలం, కాగా ఆయన మార్గాల్లో ధైర్యంగా నడుచుటకు దేవుడు మనల్ని శక్తిమంతులను చేయగలడు.
దేవున్ని విశ్వసించుటకు ధైర్యం
16. దెబోరా, బారాకు, యాయేలు ఏ యే విధాలుగా ధైర్యాన్ని కనుపర్చారు?
16 ఇశ్రాయేలీయులలో న్యాయాధిపతులు న్యాయపరిపాలన చేస్తున్న దినాలలో జరిగిన సంఘటనలు చూపినట్లు, దేవుని యందు ధైర్యంతో కూడిన నమ్మకముంచితే ప్రతిఫలముంటుంది. (రూతు 1:1) ఉదాహరణకు, న్యాయాధిపతియైన బారాకు, ప్రవక్త్రియైన దెబోరా ధైర్యంగా దేవున్ని నమ్మారు. కనాను రాజైన యాబీను 20 సంవత్సరాలు ఇశ్రాయేలీయులను అణగద్రొక్కినప్పుడు, తాబోరు కొండమీద 10,000 మంది పురుషులను సమకూర్చుటకు బారాకును దెబోరా పురికొల్పేలా యెహోవా చేసాడు. యాబీను యొక్క సేనాధిపతియైన సీసేరా తన సైన్యానికి, తన 900 ఇనుప చట్రాలుగల యుద్ధరథాలకు ఇశ్రాయేలు పురుషులు ఏమాత్రం సాటిరారనే దృఢనమ్మకముతో, కీషోను వాగు నొద్దకు వెళ్లాడు. ఇశ్రాయేలీయులు మైదానంలోకి వచ్చినప్పుడు, దేవుడు వారి పక్షాన నిలిచి, వరదవచ్చేలా చేసి సీసేరా రథాలను కదలకుండ చేసిన బురద ఊబిగా యుద్ధరంగాన్ని మార్చేసాడు. “సీసేరాయొక్క సర్వసేనయు కత్తివాత కూలేలా” బారాకు మనుష్యులు చేయగల్గారు. సీసేరా యావేలు గుడారానికి పారిపోయాడు, కాని అతడు నిద్రిస్తుండగా, అతని కణతలలో గుడారపు మేకు కొట్టి అతన్ని చంపేసే ధైర్యం ఆమెకుండింది. దెబోరా బారాకుకు చెప్పిన ప్రవచనార్థక వ్యాఖ్య నిజమయ్యేలా, ఈ విజయం యొక్క “ఘనత” అలా ఒక స్త్రీకి దక్కింది. దెబోరా, బారాకు, యావేలు ధైర్యంగా దేవున్ని నమ్మారు గనుకనే, ఇశ్రాయేలీయులు ‘తరువాత నలువది సంవత్సరములు నిమ్మళముగా నుండిరి.’—న్యాయాధిపతులు 4:1-22; 5:31.
17. న్యాయాధిపతియైన గిద్యోను యెహోవా యందు ధైర్యంతో కూడిన నమ్మకముంచడంలో ఏ మాదిరినుంచాడు?
17 మిద్యానీయులు మరితరులు ఇశ్రాయేలీయులపై దాడిచేసినప్పుడు న్యాయాధిపతియైన గిద్యోను ధైర్యంగా యెహోవాదేవుని యందు నమ్మకముంచాడు. దాదాపు 1,35,000 మంది దాడిచేసినప్పటికీ, 32,000 మందేవున్న ఇశ్రాయేలీయుల పురుషులు దేవుడిచ్చిన విజయాన్ని తమ సొంత ఘనతగా చెప్పుకోవచ్చు. యెహోవా నడిపింపు ప్రకారం, గిద్యోను తన సైన్యాన్ని ఒక్కొక్కటి 100 మంది వున్న మూడు గుంపులకు తగ్గించాడు. (న్యాయాధిపతులు 7:1-7, 16; 8:10) రాత్రియందు ఆ 300 మంది మిద్యాను గుడారాలను చుట్టుముట్టినప్పుడు, ఒక్కొక్కరి వద్ద ఒక బూర, లోపల దివిటీవున్న ఒక కుండ వున్నది. ఒక సంకేతమివ్వబడినప్పుడు వారు బూర ఊది, కుండలను పగులకొట్టి, వెలుగుతున్న దివిటీలను ఎత్తిపట్టుకొని, “యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము,” అని కేకలు వేసారు. (న్యాయాధిపతులు 7:20) భీతిచెందిన మిద్యానీయులు పారిపోవడం మొదలుపెట్టి, చివరకు వారు లొంగిపోయారు. ఈనాడు కూడా దేవుని యందలి ధైర్యంతోకూడిన నమ్మకం ప్రతిఫలాన్ని పొందుతుందని అలాంటి సంఘటనలు మనల్ని ఒప్పించాలి.
యెహోవాను ఘనపర్చి, స్వచ్ఛారాధనను ఉన్నతపర్చుటకు ధైర్యం
18. గొల్యాతును తాను హతమార్చినప్పుడు, దావీదు ధైర్యంగా ఏంచేశాడు?
18 కొన్ని బైబిలు మాదిరులు యెహోవాను ఘనపర్చి, స్వచ్ఛారాధనను ఉన్నతపర్చుటకు ధైర్యాన్నిస్తాయి. తన తండ్రి గొర్రెలను ధైర్యంగా రక్షించిన యౌవనుడైన దావీదు, ఫిలిష్తీయుల శూరుడైన గొల్యాతు యెదుట ధైర్యవంతుడని నిరూపించుకున్నాడు. దావీదు ఇలా చెప్పాడు: “నీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకధిపతియగు యెహోవా పేరట నేను నీమీదికి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును; నేను నిన్ను చంపి నీ తల తెగవేతును; ఇశ్రాయేలీయులలో దేవుడున్నాడని లోకనివాసులందరును తెలిసికొనునట్లు . . . యెహోవా కత్తి చేతను ఈటెచేతను రక్షించువాడుకాడని యీ దండువారందరు తెలిసికొందురు; యుద్ధము యెహోవాదే.” (1 సమూయేలు 17:32-37, 45-47) దైవిక సహాయంతో, దావీదు ధైర్యంగా యెహోవాను ఘనపర్చి, గొల్యాతును హతమార్చి, స్వచ్ఛారాధనకు ఏర్పడిన ఫిలిష్తీయుల బెడదను తొలగించుటలో ప్రముఖ పాత్ర వహించాడు.
19. ఏ పనికొరకు సొలొమోనుకు ధైర్యం అవసరమాయెను, ఆయన మాదిరిని మన దినాలలో ఎలా అన్వయించుకోవచ్చు?
19 రాజైన దావీదు కుమారుడైన సొలొమోను దేవుని ఆలయాన్ని నిర్మించనైయుండగా, వృద్ధుడైన అతని తండ్రి అతన్నిలా కోరాడు: “నీవు బలముపొంది, ధైర్యము తెచ్చుకొని యీ పనికి పూనుకొనుము, భయపడకుండుము, వెరవకుండుము, నా దేవుడైన యెహోవా నీతోకూడ నుండును; యెహోవా మందిరపు సేవను గూర్చిన పనియంతయు నీవు ముగించువరకు ఆయన నిన్ను ఎంతమాత్రమును విడువక యుండును.” (1 దినవృత్తాంతములు 28:20) ధైర్యవంతమైన చర్యలు గైకొనడం ద్వారా, సొలొమోను ఆలయ నిర్మాణాన్ని విజయవంతంగా ముగించాడు. ఈనాడు ఏదైనా దైవపరిపాలనా నిర్మాణ ప్రణాళిక సవాలుతో కూడినదై వుంటే, “నీవు బలముపొంది, ధైర్యము తెచ్చుకొని యీ పనికి పూనుకొనుము” అనే దావీదు మాటలను మనం గుర్తుచేసుకుందాము. యెహోవాను ఘనపర్చి, స్వచ్ఛారాధనను ఉన్నతపర్చుటకు ఎంత చక్కని మార్గం!
20. రాజైన ఆసా ఏవిధంగా ధైర్యం వహించాడు?
20 యెహోవాను ఘనపర్చి, స్వచ్ఛారాధనను ఉన్నతపర్చాలనే కోరిక వున్నందున రాజైన ఆసా, యూదాలో నుండి విగ్రహాలను, పురుషగాములను నిర్మూలించాడు. ఆయన తన మతభ్రష్ట అవ్వను పట్టపుదేవి స్థానం నుండి తొలగించి, ఆమె నిలువబెట్టించిన ‘అసహ్యమైన విగ్రహాన్ని’ కాల్చివేసాడు. (1 రాజులు 15:11-13) అవును, ఆసా “ధైర్యము తెచ్చుకొని యూదా బెన్యామీనీయుల దేశమంతటినుండియు, ఎఫ్రాయిము మన్యములో తాను పట్టుకొనిన పట్టణములలోనుండియు హేయములైన విగ్రహములన్నిటిని తీసివేసి, యెహోవా మంటపము ఎదుటనుండు యెహోవా బలిపీఠమును మరల కట్టించెను.” (2 దినవృత్తాంతములు 15:8) మీరు కూడా ధైర్యంగా మతభ్రష్టత్వాన్ని నిరాకరించి, స్వచ్ఛారాధనను ఉన్నతపరుస్తారా? రాజ్యాసక్తులను ముందుంచటానికి మీరు మీ వస్తుసంబంధ సంపదలను ఉపయోగిస్తున్నారా? ఆయన సాక్షులలో ఒకరిగా సువార్త ప్రకటించుటలో క్రమంగా పాల్గొనడం ద్వారా యెహోవాను ఘనపరచుటకు ప్రయత్నిస్తున్నారా?
21. (ఎ) క్రైస్తవ కాలానికి ముందున్న యథార్థవంతుల వృత్తాంతాలు మనకెలా సహాయం చేయగలవు? (బి) తరువాతి శీర్షికలో ఏమి పరిశీలించబడుతుంది?
21 క్రైస్తవ కాలానికి ముందున్న ధైర్యవంతులైన యథార్థవంతులకు సంబంధించిన లేఖన వృత్తాంతాలను దేవుడు భద్రపరచినందుకు మనమెంత కృతజ్ఞులమై వుండాలి! నిశ్చయంగా, ధైర్యం, దైవభయం, భక్తిపూర్వక గౌరవంతో యెహోవాకు పవిత్రసేవ చేయుటకు వారి మంచి ఉదాహరణలు మనకు సహాయం చేయగలవు. (హెబ్రీయులు 12:28) అయితే క్రైస్తవ గ్రీకు లేఖనాలలో దైవిక ధైర్యాన్ని కనబరుస్తున్న ఉదాహరణలు కూడా ఉన్నాయి. యెహోవా మార్గాలలో ధైర్యంగా నడుచుటకు వీటిలోని కొన్ని వృత్తాంతాలు మనకెలా సహాయం చేయగలవు?
మీరెలా జవాబిస్తారు?
◻ ధైర్యమంటే ఏమిటి?
◻ హనోకు మరియు నోవహు ధైర్యాన్ని ఎలా ప్రదర్శించారు?
◻ అబ్రాహాము, శారా, ఇస్సాకు ఏ యే విధాలుగా ధైర్యంతో ప్రవర్తించారు?
◻ మోషే, యెహోషువ, కాలేబులు ధైర్యంతోకూడిన ఏ మాదిరులుంచారు?
◻ ఇతరులు తమకు దేవునియందు నమ్మకముంచే ధైర్యముందని ఎలా చూపించారు?
[15వ పేజీలోని చిత్రం]
గిద్యోను మరియు ఆయన చిన్న గుంపు ధైర్యంగా యెహోవా యందు నమ్మకముంచారు