మీరెంత కాలం జీవించగలరు?
జీవిత గమనంలో సమస్యలున్నాయని మనలో చాలామందిమి వెంటనే అంగీకరిస్తాము. అయినా, జీవించివున్నందుకు మనం సంతోషిస్తాము. కేవలం మన బాల్యంతో లేక స్వల్ప ఆయుష్కాలముతో మనం సంతృప్తిచెందము; మనం అనేక సంవత్సరాలు జీవించాలని కోరుకుంటాము. అయినప్పటికీ, మరణం అనివార్యమన్నట్లు ఉంది. అవునా?
మరణాన్ని మరి కొంత కాలంపాటు ఆపటం సాధ్యమేనా? మన ఆయుష్కాలము పొడిగించబడగలదా?
పొడిగించబడిన ఆయుష్కాలము?
మానవ ఆయుష్కాలము “నూట పది సంవత్సరాలకు” పొడిగించే సాధ్యత ఉందని ఒక వార్తానివేదిక 1990లో ప్రకటించింది. నిస్సందేహంగా ఇది, “మా ఆయుష్కాలము డెబ్బది సంవత్సరములు అధికబలమున్న యెడల ఎనుబది సంవత్సరములగును అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే అది త్వరగా గతించును మేము ఎగిరిపోవుదుము” అని బైబిలు కీర్తన రచయిత అయిన మోషే చెప్పిన ఈ మాటల పరోక్ష వివరణే. (కీర్తన 90:10, కింగ్ జేమ్స్ వర్షన్) గనుక బైబిలు సగటు మానవ ఆయుష్కాలము 70 లేక 80 సంవత్సరాలని చెప్తుంది. కాని ఈనాడు ఒక వ్యక్తి దాదాపు ఎన్ని సంవత్సరాలు జీవించగలడని ఆశించవచ్చు?
ప్రపంచ ఆరోగ్య సంస్థ 1992లో ప్రచురించిన ఒక నివేదిక ప్రపంచవ్యాప్త సగటు జీవిత ప్రతీక్షను 65 సంవత్సరాలుగా పరిగణించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఇది “రాబోయే ఐదు సంవత్సరాలలో ఒక సంవత్సరానికి నాలుగు నెలల చొప్పున పెరుగుతుందని నిరీక్షించబడింది, ముఖ్యంగా శిశుమరణాలను తగ్గించడం ద్వారా.” ఏదైనా ఒక వైద్య అద్భుతం ఎవరినైనా 50 సంవత్సరాలకంటే ముందే మరణించకుండా ఆపగలిగినప్పటికీ, అమెరికాలో “సగటు జీవిత ప్రతీక్షలో పెరుగుదల కేవలం మూడున్నర సంవత్సరాలు మాత్రమే వుండగలదని” టైమ్ పత్రిక చెబుతుంది.
జీవితం ఎందుకింత చిన్నదిగా ఉంది?
కొన్ని వ్యాధులకు మానవశరీర కణాల లోపాలతో సంబంధంవున్నట్లే, వార్థక్య ప్రక్రియ కూడా జన్యుకారకములచే ప్రభావితం చేయబడుతున్నట్లు కనిపిస్తుంది అని నెథర్లాండ్స్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్స్పరిమెంటల్ గారెంటాలజీలో పనిచేస్తున్న డా. యాన్ ఫాక్ వాదిస్తున్నాడు. మనం వృద్ధులమయ్యేకొలది “తగినన్ని సర్వోత్కృష్టమైన జన్యుకణాలు” తిరిగి స్థాపించబడగలిగితే మనం ఎక్కువ కాలం జీవించగలమని కొంతమంది పరిశోధకులు నమ్ముతున్నారు. అలాంటి ప్రతిపాదనకు ఇతరులు “నమ్మశక్యం కానిది” అనే పేరుపెడతారు.
ఏదియేమైనా, “ఒక విధమైన స్వయం నిర్మిత జీవసంబంధ పరిధి మానవ శరీర కణాల్లోకి ప్రణాళిక చేయబడినట్లుంది” అని శాస్త్రవేత్తలు అంగీకరిస్తున్నారని టైమ్ పత్రిక తెలియజేస్తుంది. మనం “సజీవంగా వుండటానికే ప్రణాళిక చేయబడ్డామని” వాదించేవారు కూడా “ఏదో లోపమున్నదని” అంగీకరిస్తున్నారు. వాస్తవానికి, బైబిలు చెబుతున్నట్లుగా 65, 70, లేక 80 లేక ఆపై మరికొన్ని సంవత్సరాల్లో మరణించడంతో మన జీవితం “త్వరగా గతించును”.
అయినను, సా.శ. మొదటి శతాబ్దపు క్రైస్తవ అపొస్తలుడైన పౌలు ధైర్యంగా ఇలా ప్రవచించాడు: “కడపట నశింపజేయబడు శత్రువు మరణము.” (1 కొరింథీయులు 15:26) మరణం ఎలా అంతం చేయబడగలదు? అలా జరిగినప్పటికీ, ప్రియులైనవారి మరణాన్ని ఈనాడు మీరెలా తాళుకొనగలరు?