మహోన్నత నామము యొక్క మర్మాన్ని స్పష్టపర్చుట
ముస్లిమ్ ఖురాన్ మరియు క్రైస్తవ బైబిలు ఈ రెండుకూడ మహోన్నత నామమును తెలియజేయడం చాలా ఆసక్తిదాయకంగా ఉంది. ఈ చర్చ మహోన్నత నామము యొక్క అర్థం మరియు ప్రాముఖ్యతను వివరిస్తోంది. ఆ నామం సర్వ మానవ జాతిని మరియు భూమిపై మన భవిష్యత్తును ఏలా ప్రభావితం చేస్తుందో కూడా ఇది తెలియజేస్తుంది.
ఈ భూమిపై లక్షలాదిమంది స్త్రీ పురుషులు నివసించి మరణించారు. చాలా సందర్భాల్లో వారి పేర్లు వారితోపాటు గతించిపోయాయి, మరి వారిని గూర్చిన జ్ఞాపకం కూడ మిగలలేదు. కానీ కొంతమంది ప్రముఖుల పేర్లు, అనగా అవిసేనా, ఎడిసన్, పాశ్చర్, బెతోవెన్, గాంధీ, న్యూటన్ వంటి పేర్లు సజీవంగా మిగిలాయి. ఆ పేర్లు వాటిని కలిగియున్న వారు సాధించిన, కనుగొన్న, మరియు ఆవిష్కరించిన విషయాలతో సంబంధాన్ని కలిగి ఉన్నాయి.
అయితే, ఇతర వాటన్నిటికంటే గొప్ప నామము ఒకటి ఉంది. సమస్త విశ్వంలోని గతించిన మరియు ప్రస్తుత అద్భుతాలన్ని దానికి సంబంధించినవి. అంతెందుకు, ఆనందభరిత దీర్ఘకాల జీవితం కొరకు మానవజాతికున్న నిరీక్షణ ఆ నామంతోనే ముడిపడి ఉంది!
ఈ నామమును తెలుసుకోవాలని చాలామంది కోరుకున్నారు. వారు దాని కొరకు అన్వేషించారు. మరియు దాని గురించి అడిగారు, కానీ వారు దాన్ని కనుగొన లేదు. అది వారికొక మర్మంగానే మిగిలిపోయింది. వాస్తవానికి, ఆ నామాన్ని కల్గియున్న యజమాని దానిని ఒకనికి తెలియజేస్తే తప్ప ఏ వ్యక్తికూడ ఆ నామాన్ని కనుగొనలేడు. సంతోషకరంగా, ఆ అద్వితీయ నామము యొక్క మర్మము బయల్పర్చబడింది. తనయందు నమ్మకముంచే వారు తన గురించి తెలుసుకోటానికి దేవుడు తానే దానిని వెల్లడి చేశాడు. ఆయన తన నామమును ఆదాముకు, తరువాత అబ్రాహాముకు, మోషేకు, మరియు ప్రాచీన కాలంనాటి తన నమ్మకమైన ఇతర సేవకులకు తెలియజేశాడు.
మహోన్నత నామమును గూర్చిన అన్వేషణ
“లేఖనాల్లో చాలా ప్రావీణ్యత” గల ఒకని గురించి ఖురాన్ చెబుతోంది. (27:40) ఈ వచనాన్ని వివరిస్తూ, తాఫసేర్ జలాలైన్ అనబడే ఒక వ్యాఖ్యానం యిలా అంటుంది: “బర్కెయా కుమారుడైన ఆసాఫ్ నీతిమంతుడు. ఆయన దేవుని మహోన్నత నామం ఎరిగియుండెను, అతడు ఆ నామాన్ని బట్టి ప్రార్థించినప్పుడల్లా, అతనికి జవాబు దొరికేది.” కీర్తన 83:18నందు, “యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవని వారెరుగుదురుగాక” అని చెప్పిన బైబిలు రచయితైన ఆసాపును ఇది మనకు గుర్తుకు తెస్తోంది.
ఖురాన్ 17:2నందు మనమిలా చదువుతాము: “మేము మోషేకు లేఖనాలను ఇచ్చాము మరియు ఇశ్రాయేలీయులకు వాటిని మార్గదర్శకంగా చేశాము.” ఆ లేఖనాల్లో, మోషే దేవునితో ఈ విధంగా అన్నాడు: “చిత్తగించుము; నేను ఇశ్రాయేలీయుల యొద్దకు వెళ్లి వారిని చూచి—మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపెనని వారితో చెప్పగా వారు—ఆయన పేరేమి అని అడిగిన యెడల వారితో నేనేమి చెప్పవలెనని దేవుని నడిగెను.” దేవుడు మోషేకు యిలా జవాబిచ్చాడు: “మీ పితరుల దేవుడైన యెహోవా, అనగా అబ్రాహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడునైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెను. నిరంతరము నా నామము ఇదే.”—నిర్గమకాండము 3:13, 15.
ప్రాచీన కాలాల్లో, ఇశ్రాయేలీయులకు దేవుని యొక్క ఈ మహోన్నత నామం తెలుసు. వారి స్వంత పేర్లలో ఒక అంశంగా కూడా అది ఉపయోగింపబడేది. అబ్దుల్లా, అనగా “దేవుని సేవకుడు” అను అర్థమిచ్చే పేరును ఈనాడు ఒకడు కనుగొనునట్లే, ప్రాచీన ఇశ్రాయేలీయులకు “యెహోవా సేవకుడు” అను అర్థమిచ్చు ఓబద్యా అనే పేరు ఉండేది. ప్రవక్తయైన మోషే తల్లి పేరు యోకెబెదు, బహుశా దాని అర్థం “యెహోవాయే ఘనత.” యోహాను అను పేరుకు “యెహోవా కనికరించాడు” అని అర్థం. ప్రవక్తయిన ఏలీయా పేరుకు “నా దేవుడు యెహోవా” అని అర్థము.
ప్రవక్తలకు ఈ గొప్ప నామము తెలుసు మరి వారు దాన్ని మిక్కిలి గౌరవంతో ఉపయోగించారు. పరిశుద్థ లేఖనాల్లో, అది 7,000 కంటే ఎక్కువ సార్లే కనుగొనబడుతుంది. మరియ కుమారుడైన యేసుక్రీస్తు, దేవునికి తాను చేసిన ప్రార్థనలో దాన్ని యిలా ఉన్నతపరిచాడు: “నీవు నాకు అనుగ్రహించిన మనుష్యులకు నీ నామమును ప్రత్యక్షపరచితిని . . . నీవు నాయందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లును, వారికి నీ నామమును తెలియజేసితిని, ఇంకను తెలియజేసెదను.” (యోహాను 17:6, 26) ఖురాన్‌పైని తాను వ్రాసిన తన ప్రసిద్ధ వ్యాఖ్యానంలో ఖురాన్ 2:87,ను గూర్చి బైదావి వ్యాఖ్యానిస్తూ, యేసు “చనిపోయిన వ్యక్తులను దేవుని మహోన్నత నామమున లేపాడు” అని అన్నాడు.
అయితే, ఆ నామాన్ని ఒక మర్మంగా చేసినదేమిటి? మనలో ప్రతి ఒక్కరి భవిష్యత్తుకు ఆ నామంతో ఏమి సంబంధం ఉంది?
ఆ నామం ఒక మర్మమెలా అయ్యింది?
హెబ్రీలో “యెహోవా” అంటే దాని అర్థం “అల్లా” (దేవుడు) అని కొందరు భావిస్తారు. కానీ “అల్లా” హెబ్రీలోని ఎలోహా (దేవుడు) అనే పదం యొక్క ఘనతకు బహువచన సంబోధనమైన ఎలోహిమ్‌కు సరిసమాన పదం. యెహోవా అను దైవిక నామాన్ని ఉచ్చరించడం మానుకొనే ఒక మూఢనమ్మకం యూదుల్లో ఉత్పన్నం అయింది. కావున, వారు పరిశుద్ధ లేఖనాలను చదువుతున్నప్పుడు యెహోవా అను నామము కనబడినప్పుడు, “ప్రభువు” అనే అర్థంగల అదొనాయ్ అని పలకడం వారి రివాజు అయింది. కొన్ని స్థలాల్లో, మూల హెబ్రీ ప్రతుల్లో “యెహోవా”కు బదులు అదొనాయ్ అని సహితం మార్చారు.
క్రైస్తవమత సామ్రాజ్య మత నాయకులు కూడ అదే మార్గాన్ని అనుసరించారు. వారు యెహోవా అను నామం స్థానంలో “దేవుడు” (అరబిక్‌లో “అల్లా”) మరియు “ప్రభువు” అని మార్చారు. పరిశుద్ధ లేఖనాల్లో ఎటువంటి ఆధారమూలేని అబద్ధ త్రిత్వ సిద్ధాంతం వృద్ధి చెందడానికి అది దోహదపడింది. అందును బట్టి, లక్షలాది మంది యేసును మరియు పరిశుద్ధాత్మను పొరపాటున ఆరాధిస్తూ వారు దేవునితో సమానం అని భావిస్తున్నారు.a
కావున, మహోన్నత నామమును గురించి ప్రబలి ఉన్న అజ్ఞానానికి క్రైస్తవమత సామ్రాజ్యం మరియు యూదా మత నాయకులు నిందింపబడాలి. కానీ దేవుడిలా ప్రవచించాడు: “నా ఘనమైన నామమును నేను పరిశుద్ధ పరచుదును . . . నేను ప్రభువగు యెహోవానని వారు తెలిసికొందురు.” అవును, యెహోవా తన నామమును సర్వ జనాంగములకు తెలియజేస్తాడు. ఎందుకు? ఎందుకంటే ఆయన కేవలం యూదులకు లేక ఇతర జనాంగానికి లేక ప్రజలకు మాత్రమే దేవుడు కాదు. యెహోవా సర్వ మానవజాతికీ దేవుడు.—యెహెజ్కేలు 36:23; ఆదికాండము 22:18; కీర్తన 145:21; మలాకీ 1:11.
మహోన్నత నామము, మన భవిష్యత్తు
పరిశుద్ధ లేఖనాలిలా చెబుతున్నాయి: “యెహోవా నామమునుబట్టి ప్రార్థన చేయు ప్రతివాడు రక్షింపబడును.” (రోమీయులు 10:13NW) తీర్పు దినమున మన రక్షణ మనం దేవుని నామమును తెలిసికొనుటతో సంబంధం కలిగి ఉంటుంది. ఆయన నామమును తెలిసికొనుట అంటే ఆయన గుణలక్షణాలు, క్రియలు మరియు సంకల్పాలను తెలిసికొని ఆయన అత్యున్నత ప్రమాణాలకు అనుగుణ్యంగా జీవించడం కూడా ఇమిడి ఉంది. ఉదాహరణకు, అబ్రాహాముకు దేవుని నామం తెలుసు, ఆయన ఆ నామమును బట్టి ప్రార్థించాడు. తత్ఫలితంగా, ఆయన దేవునితో మంచి సంబంధాన్ని అనుభవించాడు, ఆయనయందు విశ్వాసాన్ని చూపాడు, ఆయనపై ఆధారపడ్డాడు, మరియు ఆయనకు లోబడ్డాడు. ఆవిధంగా అబ్రాహాము దేవుని స్నేహితుడయ్యాడు. అదే విధంగా, దేవుని నామాన్ని తెలిసికొనడం మనల్ని ఆయనకు దగ్గరగా తీసుకెళ్తుంది మరియు ఆయన ప్రేమలో దృఢంగా ఉండటానికి, ఆయనతో వ్యక్తిగత సంబంధం ఏర్పర్చుకోటానికి సహాయం చేస్తుంది.—ఆదికాండము 12:8; కీర్తన 9:10; సామెతలు 18:10; యాకోబు 2:23.
బైబిలులో మనమిలా చదువుతాము: “యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండువారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను.” (మలాకీ 3:16) మహోన్నత నామాన్ని మనమెందుకు ‘స్మరించాలి’? యెహోవా అను నామానికి అక్షరార్థంగా “సంభవింప జేయువాడు” అని అర్థం. వాగ్దానాలు నెరవేర్చువానిగా యెహోవా తననుతాను సంభవింప జేయువానిగా చేసుకొంటున్నాడని ఇది తెలియజేస్తుంది. ఆయన తన సంకల్పాలను ఎల్లప్పుడూ నెరవేరుస్తాడు. ఆయన సర్వోన్నతుడైన దేవుడు, ప్రతి విధమైన మంచి గుణలక్షణంగల ఏకైక సృష్టికర్త. దేవుని దైవిక స్వభావాన్ని పూర్తిగా వర్ణించగల ఏకపదం ఏదీ లేదు. కానీ దేవుడు తానే తన కొరకు యెహోవా అనే మహోన్నత నామాన్ని ఎన్నుకొన్నాడు. అది ఆయన గుణలక్షణాలు, సంకల్పాలనన్నిటిని గుర్తుకు తెస్తుంది.
పరిశుద్ధ లేఖనాల్లో, దేవుడు మానవజాతి పట్ల తనకున్న సంకల్పాలను మనకు తెలియజేస్తున్నాడు. పరదైసులో నిరంతర, ఆనందకరమైన జీవితాన్ని అనుభవించటానికి యెహోవా దేవుడు మానవున్ని సృష్టించాడు. ప్రేమ, సమాధానాలతో ఐక్యపరచబడిన ఒక కుటుంబంగా ప్రజలంతా ఉండాలన్న ఉద్దేశాన్ని ఆయన మానవజాతి పట్ల కలిగి ఉన్నాడు. ప్రేమా స్వరూపి అయిన దేవుడు సమీప భవిష్యత్తులో ఈ సంకల్పాన్ని నెరవేరుస్తాడు.—మత్తయి 24:3-14, 32-42; 1 యోహాను 4:14-21.
దేవుడు, మానవజాతి ఎదుర్కొంటున్న బాధలకు కారణాలను వివరిస్తూ రక్షణ సాధ్యమని చూపిస్తున్నాడు. (ప్రకటన 21:4) కీర్తన 37:10, 11లో మనమిలా చదువుతాము: “ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడకపోవుదురు. దీనులు భూమిని స్వతంత్రించుకొందురు బహు క్షేమము కలిగి సుఖించెదరు.”—ఖురాన్ 21:105 కూడా చూడండి.
అవును, దేవుడు తన గొప్ప నామమును బట్టి తెలియబడును. ఆయన యెహోవా అని జనాంగములు తెలిసికోవాలి. ఆ మహోన్నత నామమును ఎరిగియుండడం, దాన్ని గురించి తెలియజేయటం, దానికి కట్టుబడి ఉండడం ఎంత మహత్తరమైన ఆధిక్యత! ఆ విధంగా, మనలో ప్రతి ఒక్కరియందు దేవుని ఆనందదాయకమైన ఈ సంకల్పం నెరవేర్చబడుతుంది: “అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతని తప్పించెదను. అతడు నా నామము నెరిగినవాడు గనుక నేనతని ఘనపరచెదను. అతడు నాకు మొఱ్ఱపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చెదను . . . దీర్ఘాయువుచేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను.”—కీర్తన 91:14-16.
[అధస్సూచీలు]
a త్రిత్వము బైబిలు బోధ కాదనే రుజువు కొరకు, 1989లో వాచ్ టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ప్రచురించిన త్రిత్వమును మీరు నమ్మవలయునా? అనే బ్రోషర్‌ను చూడండి.
[5వ పేజీలోని చిత్రం]
మండుచున్న పొదవద్ద దేవుడు ‘అబ్రాహాము దేవుడైన యెహోవాగా’ తనను తాను మోషేకు తెలియజేసుకున్నాడు.
[క్రెడిట్ లైను]
Moses and the Burning Bush, by W. Thomas, Sr.