వేచివుండుటకు నేర్చుకొనుటలోగల సమస్య
మనకు కావలసిన వాటికొరకు వేచివుండుటను నేర్చుకొనుట అనేది బహుశ మనం నేర్చుకోవలసిన కఠినమైన పాఠాలలో ఒకటని మానవులమైన మనం అంగీకరించవలసిందే. చిన్నపిల్లలు స్వాభావికంగా తొందరపడుతూ వుంటారు. తమ దృష్టికి కన్పించేవన్నీ వారికి కావాలి, అదీ వారికి ఇప్పుడే కావాలి! అయితే కావాలనుకున్నదంతా దొరకదన్నది జీవిత వాస్తవమని అనుభవాన్నిబట్టి మీకు తెలిసేయుండవచ్చు. సహేతుకమైన కోరికల విషయంలోకూడా, వాటిని పొందడానికి తగిన సమయం కొరకు వేచివుండటం మనం నేర్చుకోవాలి. చాలామంది ఈ పాఠాన్ని నేర్చుకుంటారు; ఇతరులు ఎన్నటికీ నేర్చుకోరు.
దైవిక అనుగ్రహం పొందాలనుకునే ప్రజలు వేచివుండటాన్ని నేర్చుకొనుటకు కొన్ని కారణాలున్నాయి. క్రైస్తవ కాలానికి ముందున్న యెహోవా సేవకుడైన యిర్మీయా దీన్ని నొక్కిచెప్పాడు: “నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది.” తరువాత, క్రైస్తవ శిష్యుడైన యాకోబు ఇలా అన్నాడు: “సహోదరులారా, ప్రభువు రాకడవరకు ఓపిక కలిగి యుండుడి.”—విలాపవాక్యములు 3:26; యాకోబు 5:7.
దైవిక సంకల్పాలను నెరవేర్చడానికి యెహోవా తన స్వంత కాలపట్టికను కలిగివున్నాడు. కొన్ని నిర్ణీత పనులు చేయడానికి ఆయన గడువు తీరే వరకు వేచివుండకపోతే, మన ఆనందాన్ని హరించివేసే అసంతృప్తిని, అసంతుష్టిని పొందుతాము. “ప్రభువు నందలి ఆనందమే నీ బలము” అని నెహెమ్యా తన ప్రాంతప్రజలకు చెప్పినట్లుగా, ఆనందం లేకపోతే దేవుని సేవకుడు ఆత్మీయంగా బలహీనుడౌతాడు.—నెహెమ్యా 8:10, ది న్యూ ఇంగ్లీష్ బైబిల్.
వేచివుండుటను నేర్చుకొనే వివేకం
ఒంటరియైనవారు వివాహం చేసుకోవాలని కోరుకోవడం, లేక పిల్లలులేని దంపతులు కుటుంబాన్ని వృద్ధిచేసుకోవాలని కోరుకోవడం సహజమైన కోరిక. అంతేగాక సరైన భౌతికావసరతలు లేక కోరికలు తీర్చుకోవడంపై మన దృష్టిని నిలుపుటలో తప్పులేదు. అయిననూ, త్వరలోనే ఈ విధానం గతించిపోతుందని, రాబోయే నూతన విధానంలో దేవుడు ‘తన గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తాడని’ నమ్ముతున్నారు గనుక చాలామంది క్రైస్తవులు వీటిలో కొన్ని కోరికలు సముచిత సమయంలో తీరుతాయని వేచివుండటానికి నిర్ణయించుకున్నారు.—కీర్తన 145:16.
అయినా, గట్టి పునాదిగల యిట్టి క్రైస్తవ నిరీక్షణలేని ప్రజలు, వాయిదా వేయడం కారణరహిత మనుకుంటారు. “శ్రేష్ఠమైన ప్రతి యీవియు సంపూర్ణమైన ప్రతి వరమును” ఎవరినుండి వస్తున్నాయో, ఆ యెహోవా యందు వారికి విశ్వాసం లేకపోవడం వల్ల వస్తుందని వారు విశ్వసించని భవిష్యత్తులోకి విషయాలను వాయిదా వేయడంలోగల వివేకాన్ని గూర్చి వారు ప్రశ్నిస్తారు. “రేపు చనిపోదుము గనుక తిందము త్రాగుదము” అనే నమ్మకంపై వారు జీవిస్తున్నారు.—యాకోబు 1:17; 1 కొరింథీయులు 15:32; యెషయా 22:13.
అభివృద్ధిచెందిన దేశాలలో వ్యాపారప్రకటనా రంగం తక్షణ లాభం కొరకు వినిమయదారుల గిరాకీని ఆసరాగా తీసుకుని ప్రయోజనం పొందుతున్నది. ప్రజలు తమనుతాము అధికంగా ప్రేమించుకొనుటకు ప్రోత్సహించబడుతున్నారు. వ్యాపారం ఆధునిక సౌకర్యాలు, సౌఖ్యాలు తప్పనిసరియైన అవసరతలని మనం నమ్మేలా చేస్తుంది. ప్రాముఖ్యంగా, పరపతికార్డులు, వాయిదా పథకాలు, “ఇప్పుడు కొని—తరువాత డబ్బుకట్టే” పథకాలు, ఉన్నప్పుడు అన్నీ పొందడాన్ని, ఇప్పుడే పొందడాన్ని సాధ్యపరుస్తుండగా వాటిని పొందలేకపోవడంలో అర్థముందా? అని వాదిస్తారు. అంతేకాకుండ, ‘మీరు శ్రేష్ఠమైనది పొందడానికి అర్హులు; నిరాకరించవద్దు! గుర్తుంచుకోండి, ఇప్పుడే ఆనందించండి, లేదా మరెప్పుడూ సాధ్యం కాకపోవచ్చు!’ అని పేరుపొందిన వ్యాపార నినాదాలు నొక్కిచెబుతున్నాయి.
అయితే, అభివృద్ధి చెందుతున్న దేశాలలో కోట్లాదిమంది ప్రజలు కేవలం అంతంత మాత్రంగానే లేదా తక్కువగానే మనుగడ సాగిస్తున్నారు. మానవ రాజకీయ, ఆర్థిక విధానాల అపరిపూర్ణతను, అన్యాయాన్ని ఇంతకంటే ఎక్కువగా మరేదైనా ఎత్తిచూపించగలదా?
వేచివుండటానికి ఇష్టపడనివారు, లేదా కనీసం వేచివుండటంలో అర్థంలేదనే వారు తమ సత్వర కోరికలను తీర్చుకొనుటకై అధికంగా అప్పుల పాలైన లక్షలాదిమందినిబట్టి వేచివుండుటను నేర్చుకొనుట యందున్న వివేకాన్ని చూడవచ్చు. అనారోగ్యం, లేక నిరుద్యోగం వంటి ఊహించని పరిస్థితులు విపత్తులా సంభవించవచ్చు. జర్మనీలో 10 లక్షలమంది వ్యక్తులు ఎందుకు నిరాశ్రయులయ్యారో ఫ్రాంక్‌ఫర్ట్ అల్‌గెమీన్ జీటంగ్ అనే జర్మన్ వార్తాపత్రిక ఇలా వివరించింది: “విశిష్టమైన విధంగా, నిరుద్యోగం లేక విపరీతమైన అప్పుల మూలంగా నిరాశ్రయులౌతున్నారు.”
తమ ఖర్చులను భరించలేక, చాలామంది దురదృష్టవంతులు తమ గృహాల్ని, వస్తువులను కూడా కోల్పోతున్నారు. మరియు తరచూ, అధిక వత్తిడి కుటుంబములో ఉద్రిక్తతను కలుగజేస్తుంది. పటిష్టంగా లేని వివాహాలు విచ్ఛిన్నం కావడం మొదలౌతాయి. నిరాశా నిస్పృహ సమయాలు, ఆరోగ్య సమస్యలు సర్వసాధారణమై పోతాయి. క్రైస్తవుల విషయంలోనైతే, తప్పుడు ఆలోచన, అనుచిత ప్రవర్తనకు దారితీస్తూ ఆత్మీయత దెబ్బతినవచ్చు. అవివేకంగా అంతా కావాలనుకుని ప్రజలు దాదాపు ఏమి లేకుండా పోతున్నారు.
అనేకమందికి, ఒక క్రొత్త సవాలు
మనం జాగ్రత్తగా వుండాలి లేకపోతే “ఐహిక విచారములును, ధనమోసమును మరి ఇతరమైన అపేక్షలును లోపల చొచ్చి, వాక్యమును అణచివేయుటవలన అది నిష్ఫలమగును” అని యేసు స్పష్టం చేశాడు. (మార్కు 4:19) యేసు చెప్పిన ఆర్థికపరమైన, ఇతర వ్యాకులతలను ఏ రాజకీయ విధానం విజయవంతంగా నిర్మూలించలేక పోయిందని మనం మనస్సులో వుంచుకోవాలి.
ఇప్పుడు తూర్పు యూరపు దేశాలు నిరాకరించిన కమ్యూనిజం రాష్ట్ర ఆధీనమందున్న ఆర్థికవ్యవస్థ ద్వారా పరిస్థితిని చక్కదిద్దాలని ప్రయత్నించాయి. స్వతంత్ర వ్యవస్థ విధానానికి పోలిస్తే తరచు ఆ దేశాల్లోని వ్యక్తులకు పెట్టుబడిదారీవ్యవస్థ ఇవ్వలేకపోయిన కొంత ఆర్థిక భద్రతను కమ్యూనిస్టు పరిపాలన క్రింద వున్న ఆర్థిక వ్యవస్థ యివ్వగల్గింది. అయినా, యేసు చెప్పిన వ్యాకులతలు నిత్యావసర వస్తువుల కొరత, వ్యక్తిగత స్వాతంత్ర్య తగ్గింపు రూపంలో ఇంకా వున్నాయి.
ప్రస్తుతం, వాటిలోని చాలా దేశాలు వినియోగదారుల, ఉత్పత్తిదారుల ఆర్థికవ్యవస్థలను ప్రవేశపెడుతూ, వారి పౌరులకు ఒక క్రొత్త సవాలును పరిచయం చేస్తున్నాయి. ఇటీవలి నివేదిక ఒకటి ఇలా తెలియజేస్తున్నది: “పాశ్చాత్య వినియోగ ప్రమాణాల్ని త్వరగా చేరుకోవాలనే కోరికకు బోళాతనం తోడైంది.” దీన్ని పొందటానికి “తూర్పు జర్మనులోని క్రొత్త లెన్‌డార్‌లో చాలామంది ప్రజలు అప్పుల ఊబిలోకి దిగిపోతున్నారు.” ఆ నివేదిక ఇంకా ఇలా తెలియజేస్తున్నది: “క్రొత్త ఆర్థిక స్వాతంత్ర్యాల పైన తొలి ఆశలు గతించిన తరువాత ఇప్పుడు భయం, నిరాశ పెరుగుతున్నాయి.” ఆర్థిక వ్యవస్థ పెట్టుబడిదారి విధానానికి మారింది కాని వ్యాకులతలు మాత్రం అలాగే వున్నాయి.
గొప్ప రాజకీయ, ఆర్థిక స్వాతంత్ర్యాలు ఆర్థికాభివృద్ధికి క్రొత్త అవకాశాలను తెరిచాయి. అందుకే అనేకులు, తమ స్వంత వ్యాపారాన్ని మొదలు పెట్టాలని లేదా మంచి ఉద్యోగావకాశాలుగల మరో దేశానికి తరలి వెళ్లాలని తీవ్రంగా ఆలోచించడానికి శోధించబడియుండవచ్చు.
ఇలాంటి నిర్ణయాలు వ్యక్తిగతమైనవి. ఒక క్రైస్తవుడు తన ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచు కోవాలనుకోవడం తప్పుకాదు. “ఎవడైనను స్వకీయులను, విశేషముగా తన యింటివారిని, సంరక్షింపక పోయినయెడల వాడు విశ్వాసత్యాగము చేసినవాడై అవిశ్వాసికన్న చెడ్డవాడై యుండును,” అనే విషయాన్ని బట్టి, అతడు తన కుటుంబాన్ని సంరక్షించాలని పురికొల్పబడి యుండవచ్చు.—1 తిమోతి 5:8.
అందుకే, ఇతరులు చేసే నిర్ణయాన్ని విమర్శించడం యుక్తం కాదు. అదే సమయంలో ఆర్థిక వెసులుబాటు కొరకు వారినే ముంచేసేలా అధికంగా అప్పులు చేయడం జ్ఞానయుక్తం కాదని క్రైస్తవులు గుర్తుంచుకోవాలి. అలాగే ఆత్మీయ బాధ్యతలను, ఆసక్తులను నిర్లక్ష్యం చేసేలా ఆర్థిక వెసులుబాటు కొరకు పాటుపడడం తప్పు.
ఇతరుల నుండి నేర్చుకొనుట
రెండవ ప్రపంచ యుద్ధం తరువాత, వేలాది మంది జర్మను దేశస్థులు యుద్ధ కల్లోలిత యూరపు నుండి ఇతర దేశాలకు, ప్రాముఖ్యంగా ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాలకు వలసవెళ్లారు. అందువల్ల చాలామంది తమ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోగలిగారు, కాని యేసు చెప్పిన ఆర్థిక వ్యాకులతలను వారిలో ఎవరూ పూర్తిగా తప్పించుకోలేక పోయారు. ఆర్థిక సమస్యలను పరిష్కరించుకొనుటయనేది కొన్నిసార్లు ఇంటి మీది బెంగ, క్రొత్త భాష, క్రొత్త ఆహారానికి అలవాటు పడుట, వేర్వేరు ఆచారాలు, క్రొత్త స్నేహితులతో సాంగత్యం చేయగలుగుట, లేక వేర్వేరు దృక్పథాలతో వ్యవహరించుట మొదలైన క్రొత్త సమస్యలను సృష్టించింది.
ఇలా వలస వెళ్లినవారిలో కొంతమంది యెహోవా సాక్షులు వున్నారు. మెచ్చుకొనదగిన విధంగా, వారిలో చాలామంది వలసవెళ్లేవారికి ఎదురయ్యే సమస్యలు తమ ఆత్మీయతను దెబ్బతీయడానికి అనుమతించ లేదు. అలా జరగని కొన్ని సందర్భాలు కూడా ఉన్నాయి. కొందరు మోసకరమైన ధనాశకు లొంగిపోయారు. వారి ఆర్థిక ఉన్నతితోపాటు వారి ఆత్మీయ అభివృద్ధి ముందుకు సాగలేదు.
ఒకవేళ జ్ఞానయుక్తంకాని నిర్ణయాలు చేయటానికి ముందు మన పరిస్థితిని జాగ్రత్తగా బేరీజు వేసుకోవడంలోని వివేకాన్ని ఇది చూపిస్తుంది. వస్తుదాయక ఆశలు, క్రైస్తవులకు అప్పగింపబడిన తిరిగి పునరావృతం చేయబడని పనియైన శిష్యులను చేసేపనిలో మనం మందగొండులయ్యేలా చేస్తాయి. ఆర్థిక వ్యాకులతలు లేని పౌరులున్న దేశమేది లేదుగనుక, మనమెక్కడ జీవించినప్పటికీ ఇది వాస్తవమే.
మంచి పోరాటం పోరాడుట
“నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము, నిత్యజీవమును చేపట్టుము. దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల యెదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి” అని పౌలు తిమోతికి ఉద్బోధించాడు. కొరింథులోని క్రైస్తవులకు ఆయనిలా చెప్పాడు: “స్థిరులును, కదలనివారును, ప్రభువు కార్యాభివృద్ధియందు ఎప్పటికిని ఆసక్తులునై యుండుడి.”—1 తిమోతి 6:11, 12; 1 కొరింథీయులు 15:58.
ధనాపేక్షను విజయవంతంగా ఎదుర్కోవడానికి ఈ సలహాలను పాటించుట మంచి మార్గం, నిశ్చయంగా క్రైస్తవుడు చేయడానికి ఎంతోవుంది. రాజ్య ప్రచారకులు ఎక్కువమంది లేని కొన్ని దేశాలలో, చాలామంది ప్రజలకు సత్యం గురించి కొంతే తెలుసు. యేసు యుక్తంగా ఇలా ప్రవచించాడు: “కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు.”—మత్తయి 9:37.
ఈ దేశాలలోని ఆర్థిక వ్యాకులతలు వారి ఆత్మీయపనిని పక్కదారి పట్టనివ్వకుండ, ప్రస్తుత అవకాశాలను పూర్తిగా వాడుకోవటం ద్వారా యెహోవాసాక్షులు ఈ పరిస్థితుల నుండి ప్రయోజనాన్ని పొందుతారు. తాత్కాలికంగా నిరుద్యోగులైతే, వారిలో చాలామంది తమ ప్రకటనపనిని విస్తృతపరుస్తారు. వారి సేవ, యెహోవాను ఎలుగెత్తి స్తుతించుటను ఎక్కువ చేయడమేకాక, తమ స్వంత ఆర్థిక సమస్యలతో పోరాడుటకు అవసరమైన ఆనందాన్ని ఇస్తుంది.
ఈ సాక్షులు ఆర్థిక శ్రమలకంటే సువార్త ప్రకటనా పనికి ఎక్కువ ప్రాధాన్యతనివ్వడం ద్వారా యెహోవా తమ గురించి శ్రద్ధ వహిస్తాడని తాము గట్టిగా విశ్వసిస్తున్నట్లు ప్రపంచవ్యాప్త సహోదర బృందానికి చూపిస్తారు. ఆయన వాగ్దానం ఇలా వుంది: “కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును.”—మత్తయి 6:33
సత్యారాధన 1919లో పునఃస్థాపించబడినప్పటి నుండి యెహోవా తన ప్రజలను తడబడనివ్వలేదు. తీవ్రమైన హింస, కొన్ని ప్రాంతాలలో దశాబ్దాల రహస్య పరిచర్యలో ఆయన వారిని కాపాడాడు. హింస ద్వారా సాతాను ఏదైతే సాధించలేకపోయాడో, దాన్ని ఇంకా కుటిలమైన ధనాపేక్షయనే ఉచ్చు ద్వారా కూడా సాధించలేడని యెహోవా సాక్షులు దృఢనిశ్చయత కలిగివున్నారు!
ప్రతి విషయంలోను వేచియుండుటను నేర్చుకొనుట
విశాలమైన రాజ్యమందిరాలు, ఖరీదైన శబ్దపరికరాలు, సమావేశ హాళ్లు, ఆకర్షణీయమైన బేతేలు గృహాలు దేవునికి మహిమను తేవడమేకాక, ఆయన తన ప్రజలను దీవిస్తున్నాడనేదానికి మౌనసాక్ష్యాన్నిస్తాయి. చాలాకాలంగా వారి పని నిషేధింపబడిన దేశాలలో వున్న యెహోవా సాక్షులు ఇతర దేశాల ప్రమాణాలను చేరటానికి ఎంతో చేయవలసి వుందని భావించవచ్చు. కాని అంతకన్నా ప్రాముఖ్యమైన దేమిటంటే, వారు ఆత్మీయంగా అభివృద్ధి చెందడమే. వస్తుసంబంద విషయాల్లో యెహోవా ఆశీర్వదిస్తున్నాడనుటకు బాహ్య సూచనలు తగిన సమయంలో వస్తాయి.
యెహోవా సమర్పిత సేవకులు జాగ్రత్తగా వుండాలి లేకపోతే, వ్యక్తిగత ఆసక్తుల అన్వేషణలో, కొన్ని వస్తువులను లేకుండా ఇప్పటికే చాలాకాలం నుండి వున్నామని భావించడం మొదలెడతారు. ఆర్థిక, సాంఘిక అసమానతలనుండి ఉపశమనం పొందాలని అపేక్షించడాన్ని అర్థం చేసుకోవచ్చు, కాని దేవుని సేవకులు అందరూ ఉపశమనాన్ని అపేక్షిస్తున్నారనేది యెహోవా ప్రజలు ఉపేక్షించరు. గ్రుడ్డివారు మళ్లీ చూడటానికి అపేక్షిస్తారు, దీర్ఘకాలంగా అనారోగ్యంతో వున్నవారు ఆరోగ్యం బాగుపడటానికి అపేక్షిస్తారు, దుఃఖభరితులైనవారు ప్రకాశవంతమైన దృక్పథం కొరకు అపేక్షిస్తారు, పోగొట్టుకున్నవారు మృతులైన తమ ప్రియమైన వారిని మళ్లీ చూడటానికి అపేక్షిస్తారు.
పరిస్థితులను బట్టి, ప్రతి క్రైస్తవుడు తన సమస్యలు పరిష్కరింపబడుటకు యెహోవా తేబోయే నూతన లోకం కొరకు ఏదోవిధంగా వేచియుండాల్సి వస్తుంది. ఇది మనల్ని మనం ఇలా ప్రశ్నించుకొనేలా చేయాలి: ‘నాకు అన్నవస్త్రములు ఉంటే, వాటితో నేను తృప్తిపొంది, ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం కొరకు వేచివుండటానికి ఇష్టపడువాడనై యుండవద్దా?’—1 తిమోతి 6:8.
యెహోవాను సంపూర్ణంగా విశ్వసించే క్రైస్తవులు, వేచివుండటానికి ఇష్టపడుతుంటే వారి సరైన కోరికలు, అవసరతలు త్వరలోనే తీర్చబడతాయని వారు నమ్మవచ్చు. ఎవ్వరూ వ్యర్థంగా వేచివుండరు. మేము పౌలు మాటలను మళ్లీ చెప్తున్నాము: “మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థముకాదని యెరిగి, స్థిరులును, కదలనివారును, ప్రభువు కార్యాభివృద్ధియందు ఎప్పటికిని ఆసక్తులునై యుండుడి.”—1 కొరింథీయులు 15:58.
కాబట్టి వేచివుండటానికి నేర్చుకొనుట నిజంగా అంత పెద్ద సమస్యయైవుండవలెనా?
[10వ పేజీలోని చిత్రం]
వేచివుండుటకు నేర్చుకొనుట మీ జీవాన్ని రక్షించగలదు