దొంగలు లేని లోకం
అది శరవేగంతో జరిగిపోయింది. బ్రెజిల్లోని సావో పౌలొలో, ఆన్‌టోన్యోa తన ఇంటి ముంగిట వుండగా మంచి దుస్తులు ధరించిన ఒక వ్యక్తి అతని తలకు తుపాకి గురిపెట్టి, కారు తాళాలు, కారుకు సంబంధించిన కాగితాలు తనకిమ్మని అడిగి తీసుకుని వెంటనే కారులో పారిపోయాడు.
రియో డె జనెయిరోలో, తన పది సంవత్సరాల కుమార్తె కళ్ల యెదుట నలుగురు సాయుధులైన వ్యక్తులు పౌలో అనే వ్యక్తిని పట్టుకున్నారు. తరువాత, వారు అతని ఇంటికి వెళ్లి, ఇంట్లో ప్రవేశించి, వారికి కావలసిన సమస్తాన్ని దొంగిలించి, పౌలోకున్న రెండు కార్లలో నింపుకున్నారు. పౌలో భార్యను చంపేస్తామని బెదిరించి, ఆమెను మరో ఉద్యోగినిని తమవెంట తీసుకుని పౌలో ఆభరణాల దుకాణానికి వెళ్లి, విలువైనవాటన్నింటిని దోచుకున్నారు. అనుకోని విధంగా, అతని కార్లను వారెక్కడ విడిచి పెట్టింది తరువాత ఫోన్ చేసి తెలియజేశారు.
కష్టపడి సంపాదించుకున్న డబ్బు, వస్తువులు దొంగిలించబడడం ఎంత విచారకరం! ఆన్‌టోన్యోగాని, పౌలోగాని చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోలేదు, కానీ ఇతరులు అలా చేస్తున్నారు. వారు దొంగను చంపవచ్చు లేక వికలాంగున్ని చేయవచ్చు లేదా వారే తమ ప్రాణాల్ని కోల్పోవచ్చు. ఉదాహరణకు, ఒక యౌవనస్థుడు ఒక బ్రెజిల్ స్త్రీ చేతిగడియారాన్ని లాక్కున్నప్పుడు, ఆగ్రహించిన ఆ స్త్రీ వెంటనే తన సంచిలోనుండి తుపాకి తీసి ఆ దొంగను కాల్చి చంపేసింది. దాని ఫలితం? “ఆ ఉదంతాన్ని చూసిన వారు గుర్తుతెలియని ఆ స్త్రీ దృక్పథాన్ని మెచ్చుకొన్నారు, ఆమెను గుర్తించటానికి పోలీసులకు సహాయం చేయుటకు ఎవరూ ఇష్టపడలేదు” అని ఒ ఇస్టాడో డె ఎస్. పౌలో పత్రిక తెల్పుతుంది. క్రైస్తవులు దొంగలు లేని లోకం కొరకు ఎదురుచూస్తున్నప్పటికీ, ఆ స్త్రీ చేసినట్లు వారు పగతీర్చుకొనరు. పగతీర్చుకొనుట దేవుని వంతుగనుక, వారు సామెతలు 24:19, 20 నందలి, “దుర్మార్గులను చూచి నీవు వ్యసనపడకుము భక్తిహీనులయెడల మత్సరపడకుము. దుర్జనునికి ముందు గతి లేదు భక్తిహీనుల దీపము ఆరిపోవును” అను మాటలను లక్ష్యపెడతారు.
కాని మీ మీద దాడి చేస్తే ఏం చేస్తారు? శాంతంగా వుండడం ఎంత ప్రాముఖ్యమో రియో డె జనెయిరోలో జరిగిన ఒక సంఘటన చూపిస్తుంది. ఎలోయీజ అనే ఒక క్రైస్తవ స్త్రీ, బైబిలు పఠనాన్ని నిర్వహించటానికి బస్సులో వెళుతూంది. ఇద్దరు వ్యక్తులు ప్రయాణికుల్ని దోచుకోవడం మొదలెట్టారు. తాను దిగవలసిన బస్‌స్టాప్ రాగానే, తాను యెహోవాసాక్షినని, బైబిలు పఠనాన్ని నిర్వహించటానికి వెళ్తున్నానని ఎలోయీజ వారికి చెప్పింది. ఆమె తన బైబిలును, పఠనపుస్తకాన్ని చూపించింది. దొంగలు ఆమెను దోచుకోకుండ, దిగిపోవుటకు అనుమతిచ్చారు. మరో ప్రయాణికురాలిని మాత్రం దిగనివ్వలేదు. ఇలాంటిది నేనెప్పుడు చూడలేదని డ్రైవరు ఆ తరువాత అన్నాడు.
రెజీనాను తన కారులోకి ఎక్కమని ఇద్దరు సాయుధులైన వ్యక్తులు ఆజ్ఞాపించినప్పుడు ఆమె కూడా మౌనంగా వుంది. అవేక్! పత్రిక తన స్వంతకాపీని చూపించి, ఆమె సాక్ష్యమిచ్చింది. దొంగలు కంగారుపడుతున్నందున, తాను వాహనంలో కొన్ని మిఠాయిలు పెట్టిన పెట్టెను తెరువమని ఆమె వారికి చెప్పింది. కాని వారు కింగ్‌డమ్ మెలోడీస్ క్యాసెట్లను చూసి, ఆ సంగీతాన్ని వినడం మొదలెట్టారు. వాతావరణం స్నేహపూరితంగా మారడంతో, దొంగలు రెజీనాను రహదారిపై వదలి వెళ్లటానికి నిర్ణయించుకుని, సహాయం చేసే ఒక మంచి వ్యక్తి కలుస్తాడని వారు ఆమెకు ధైర్యం చెప్పారు. ఒక పది నిమిషాలు నడిచిన తరువాత, ఆమెకు ఒక ఇల్లు కన్పించింది, తన కథ చెప్పినప్పుడు ఆ గృహస్థుడు “మీ మీద దాడి జరిగినట్లు లేదే; మీరు చాలా శాంతంగా వున్నారు” అని చెప్పి ఆమె కథనాన్ని నమ్మలేకపోయాడు.
ఒక బాదితుడు శారీరకంగా హాని పొందనప్పటికీ, అలాంటి భయంకర అనుభవం వలన అటుతరువాత చాలా తీవ్రపరిణామాలు కలుగవచ్చు. ‘బాదితుడు భద్రతలేనట్లు భావిస్తూ, కుటుంబ సభ్యులను లేదా అతనికి సహాయం చేయాలనుకునేవారిని ద్వేషిస్తూ, ఇతరులను నమ్మలేక, వివరాలు చెప్పటానికి భయపడుతూ, లోకమంతా అన్యాయంతో నిండిపోయివుందని భావిస్తాడు’ అని ఒ ఇస్టాడో డె ఎస్. పౌలో తెలియజేస్తుంది. దానికి వ్యతిరేకంగా, యెహోవా దేవుని యందు విశ్వాసముంచు వ్యక్తి ఈ అనుభవం నుండి శారీరకంగా, మానసికంగా హాని పొందకుండ బయటపడగలడు. అయినా, నేరంగాని, భయం కలిగించేది గాని ఏదీ లేకపోతే అది ఆశీర్వాదకరమని మీరంగీకరించరా?
“దొంగిలువాడు ఇకమీదట దొంగిల”కూడదు
చాలామంది పేరాశగల జీవన విధానాన్ని కోరుకున్నను, దొంగలు తమ కోరికలను, వ్యక్తిత్వాలను మార్చుకోటానికి దేవుని వాక్యం సహాయం చేసింది. (ఎఫెసీయులు 4:23) జీవితంలో బైబిలు ఆధారిత వాస్తవిక సంకల్పం వున్నందున, వారీ మాటలను లక్ష్యపెడతారు: “అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడికంటె నీతితోకూడిన కొంచెమే శ్రేష్ఠము.” (సామెతలు 16:8) “దాదాపు నా కుటుంబములోని వారంతా సాక్షులే, యెహోవాను గూర్చి, ఆయన సంకల్పాలను గూర్చి వారేమి చెబుతున్నారో నేనెప్పుడు వినలేదు. దొంగిలించిన వాహనంలో దాదాపు 2,000 కిలోమీటర్లు ప్రయాణించి వస్తున్నప్పుడు నేను ఎన్నో పోలీసుల తనిఖీస్థలాలను దాటి రావలసి వచ్చింది. ఆ సమయంలోనే నేను నా జీవనవిధానాన్ని మార్చుకోవలసి వుందని తెలుసుకున్నాను. అది చేయాలని ముందే నేనెంతో ప్రయత్నించాను గాని, సఫలం కాలేదు. ఆనందం, సంతోషం, సమాధానం కలిగి ఎంతో వ్యత్యాసంగా వున్న యెహోవా సాక్షులైన నా బంధువులను గురించి ఆలోచించడం మొదలుపెట్టాను” అని క్లాడియో చెప్పాడు. ఫలితంగా, క్లాడియో దేవుని వాక్యాన్ని పఠించడం ప్రారంభించి, మాదక ద్రవ్యాలను, తన మునుపటి స్నేహితులను వదిలేసి, క్రైస్తవ పరిచారకుడయ్యాడు.
“బలాత్కారమందు నమ్మికయుంచకుడి దోచుకొనుటచేత గర్వపడకుడి,” అనే మాటలను ఇప్పుడు ఇతరులు కూడా లక్ష్యపెడుతున్నారు. (కీర్తన 62:10) ఒక దోపిడి సమయంలో హత్య చేయటానికి ప్రయత్నించిన కారణంగా శిక్ష విధించబడిన మాదకద్రవ్యాల వ్యసనపరుడు, మాదకద్రవ్యాల వ్యాపారియైన జోజ్, తన బావ యిచ్చిన బైబిలు పఠనం వల్ల ప్రయోజనం పొందాడు. అతను మాదకద్రవ్యాల వాడకాన్ని, వ్యాపారాన్ని మానివేసి, ఇప్పుడు ఒక ఉత్సాహవంతమైన సాక్షి అయ్యాడు.
అయిననూ, ఒక క్రొత్త వ్యక్తిత్వం వెంటనే లేక అద్భుతరీతిగా రాదు. మాదకద్రవ్యాలు, దొంగతనాలలో పూర్తిగా మునిగివున్న ఆస్కార్ ఇలా చెబుతున్నాడు: “నేను యెహోవాకు ఎంత పట్టుదలతో ప్రార్థించేవాడినంటే, అనేకసార్లు నా కన్నీళ్లతో నేల చిన్న చెరువులా అయినట్లుండేది.” అవును, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా పఠించడమే కాకుండా, పట్టుదలతో కూడిన హృదయపూర్వక ప్రార్థన కూడా అవసరం. ఈ ప్రార్థనాపూర్వక దృక్పథంలో వున్న జ్ఞానాన్ని పరిశీలించండి: “వ్యర్థమైనవాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచుము, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఎక్కువైనయెడల నేను కడుపు నిండినవాడనై నిన్ను విసర్జించి—యెహోవా యెవడని అందునేమో లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో.”—సామెతలు 30:8, 9.
స్వార్థానికి బదులు నిజమైన ప్రేమ ఉండాలి: “దొంగిలువాడు ఇకమీదట దొంగిలక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలుకలుగు నిమిత్తము తన చేతులతో మంచి పనిచేయుచు కష్టపడవలెను.” (ఎఫెసీయులు 4:28) మునుపు ‘దొంగలుగా లేక పేరాశగల వ్యక్తులుగా’ వున్న కొంతమంది మొదటి శతాబ్దపు క్రైస్తవుల విషయంలోలాగే పశ్చాత్తాపపడే వారిని యెహోవా దయతో యేసుక్రీస్తు విమోచనబలి ద్వారా క్షమిస్తాడు. (1 కొరింథీయులు 6:9-11) మన గతమేమై వున్నప్పటికీ, మనం మన జీవనవిధానాన్ని మార్చుకుని, దేవుని అనుగ్రహం పొందగలమనేది ఎంతటి ఓదార్పుకరమోగదా!—యోహాను 3:16.
దేవుని నూతన లోకంలో భద్రత
దొంగలు లేని లోకాన్ని ఊహించండి. అక్కడ చట్టాన్ని కచ్చితంగా అమలు జరిపించే పటిష్టమైన న్యాయాధికారులు, న్యాయవాదులు, పోలీసులు, జైళ్ల అవసరతవుండదు. అది ప్రతిఒక్కరు ఇతరులను, వారి సంపదను గౌరవించి వర్ధిల్లే లోకమైవుంటుంది. అది నమ్మశక్యం కాదనిపిస్తున్నదా? దేవుడు నిజంగా మానవుల విషయాల్లో జోక్యం చేసుకుని, అవినీతిని అరికడతాడా? బైబిలు దేవుని వాక్యమని, దానిలోని ప్రవచనాలు నమ్మదగినవని తెలిపే సాక్ష్యాధారాలను పరీక్షించమని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మార్పు వస్తుందని నమ్మటానికి గల గట్టి పునాదిని మీరు కనుగొంటారు. నీతిని ప్రేమించేవారందరికి ఆయన వాగ్దానం చేసిన ఉపశమనాన్ని తీసుకురాకుండా ఎవరూ దేవున్ని ఆపలేరు: “చెడ్డవారిని చూచి నీవు వ్యసనపడకుము. దుష్కార్యములు చేయువారిని చూచి మత్సరపడకుము. వారు గడ్డివలెనే త్వరగా ఎండిపోవుదురు. పచ్చని కూరవలెనే వాడిపోవుదురు.” (కీర్తన 37:1, 2) ఎంతోకాలం క్రితం వ్రాయబడిన ఆ మాటలు త్వరలోనే పూర్తిగా నెరవేరుతాయి.
ఎంతో నిరాశ, అనిశ్చయతలను కలిగించే ఆవేదనను, అవినీతిని దేవుని రాజ్యం తీసివేస్తుంది. అవసరం కాబట్టి, దొంగతనం చేయాలనే వత్తిడి క్రింద ఎవరూ వుండరు. మనకిలా ప్రవచనపూర్వక అభయమివ్వబడింది: “దేశములోను పర్వత శిఖరములమీదను సస్య సమృద్ధి కలుగును దాని పంట [ప్రాచీన] లెబానోను వృక్షములవలె తాండవమాడుచుండును నేలమీది పచ్చికవలె పట్టణస్థులు తేజరిల్లుదురు.” (కీర్తన 72:16) నిజంగా, పునఃస్థాపించబడిన పరదైసులో, సత్యదేవున్ని తెలుసుకుని ఆరాధించే మానవుల సమాధానాన్ని ఏది చెరపదు.—యెషయా 32:18.
పేరాశగల ఈ ప్రపంచ విధానాలను ప్రతిఘటించినందుకు అదెంతటి ప్రతిఫలమైయుండునోగదా! సామెతలు 11:19 ఇలా చెబుతుంది: “యథార్థమైన నీతి జీవదాయకము దుష్టక్రియలు విడువక చేయువాడు తన మరణమునకే చేయును.” దుష్టులు నిర్మూలించబడినప్పుడు, తన జీవితాన్ని గూర్చి, తన సంపదను గూర్చి ఎవరూ భయపడుటకు కారణముండదు. కీర్తన 37:11 మనకీ వాగ్దానాన్నిస్తుంది: “దీనులు భూమిని స్వతంత్రించుకొందురు బహు క్షేమము కలిగి సుఖించెదరు.”
[అధస్సూచీలు]
a దీనిలో కొన్ని పేర్లు మార్చబడ్డాయి.
[5వ పేజీలోని బాక్సు]
దొంగతనము యొక్క వాస్తవికతను ఎదుర్కొనుట
ఇంటివద్ద—మీరు ఇంటివద్ద వున్నా లేకపోయినా దొంగలు మీ ఇంటిపై దాడిచేస్తారు గనుక ఇంటి తలుపులు మూసి, తాళం వేసి వుంచండి. అలారములను లేదా కావలికుక్కను వుంచుకొమ్మని నిపుణులు సలహాయిస్తున్నారు. మీరు సెలవుమీద బయటికి వెళుతుంటే నమ్మదగిన పొరుగువారికి చెప్పివెళ్లండి. దొంగలు చాలా త్వరగా, ఊహించని విధంగా ప్రవర్తిస్తారు, వారు కంగారు పడితే తమ పథకాలను వెంటనే మార్చుకోగలరు, గనుక శాంతంగా వుండండి. మీరు యెహోవాసాక్షులలో ఒకరైతే, ఆ విషయం వారికి తెలిపి, సాక్ష్యం ఇవ్వటానికి ప్రయత్నించండి. మీరు స్నేహభావాన్ని లేదా సానుభూతిని సంపాదించుకోవచ్చు. శారీరకంగా దాడి చేయబడేంత వరకు ఎదిరించకండి.
బహిరంగ స్థలాల్లో—మిమ్మల్ని ఎవరైనా అనుసరిస్తున్నారేమో గమనించండి. ఫుట్‌పాత్ మధ్యలో నడవండి. చీకటిగా, జనసంచారం లేకుండా వుండే వీధులలో వెళ్లకండి. మీ పర్సును, విలువైన వస్తువులను జాగ్రత్తగా పెట్టుకోండి. మీరు ఎక్కడికో వెళుతున్నట్లు త్వరగా వెళ్లండి. ఖరీదైన వస్త్రాలు లేక మెరిసే ఆభరణాలు ధరించకండి. అవసరమైతే కొనటానికి వెళ్లేటప్పుడు మీతోపాటు ఒక వ్యక్తిని తీసుకెళ్లండి. మీకు అవసరమైనంత డబ్బును మాత్రమే, వేరువేరు జేబుల్లో లేక స్థలాలలో వుంచుకుని వెళ్లండి.
కారులో—మీ ప్రాంతంలో “మనిషితో సహా కారును అపహరించుకుపోవడం” సాధారణమైయుంటే, నిలిపివున్న మీ కారులోనే వుండిపోకండి. మీరు ఉద్యోగానికి వెళ్లివచ్చే దారిని మారుస్తూ వుండండి. దూరమైనప్పటికీ, సురక్షితమైన మార్గాన్నే ఎన్నుకోండి. కారును నిలిపే ముందు, ఏదయినా అనుమానాస్పదంగా వుందేమోనని చుట్టూ పరికించి చూడండి. జనసంచారం లేని ప్రాంతంలో మీ వస్తువులున్న సంచిని తెరవకండి. విలువైన వస్తువులను కారులో కనిపించేలా విడిచిపెట్టకండి. కనిపించేలా వుండే తాళం వేయబడిన చైను లేక దోపిడీని అరికట్టే ఇతర పరికరం మామూలు దొంగలను నిరుత్సాహపరచవచ్చు.
[6వ పేజీలోని బాక్సు]
“భూమిమీద మీకొరకు ధనమును కూర్చుకొనవద్దు; ఇక్కడ చిమ్మెటయు, తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. పరలోకమందు మీకొరకు ధనమును కూర్చుకొనుడి; అచ్చట చిమ్మెటయైనను, తుప్పైనను దాని తినివేయదు, దొంగలు కన్నమువేసి దొంగిలరు.”—మత్తయి 6:19, 20