పాఠకుల ప్రశ్నలు
బైబిలు మనకు: “మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి,” అని చెబుతున్నందున, క్రైస్తవుడొకడు అవిశ్వాసితో కలిసి వ్యాపారం చేయడం యుక్తమేనా?
“మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్ణీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమిపొందిక?” అను, ఈ ఉపదేశము మనకు 2 కొరింథీయులు 6:14-16లో కనపడుతుంది.
ఒక క్రైస్తవుడు అవిశ్వాసితో కలిసి వ్యాపారంచేయడం మొదలైనటువంటి వాటి విషయంలో, కొన్ని నిర్దిష్టమైన నిషేధాలను విధించాలనే ఉద్దేశంతో అపొస్తలుడైన పౌలు ఈ ఉపదేశాన్నిస్తున్నాడని తలంచుటకు ఏ ఆధారమూ లేదు. అయినప్పటికి, ఈ ఉపదేశము ఆ విషయంలోను, మరి ఇతర జీవిత రంగాలలోనూ తప్పక ప్రభావాన్ని కలిగివుంది.
ఆ ఉపదేశాన్ని పౌలు పురాతన కొరింథులోని తన క్రైస్తవ సహోదరులకు వ్రాశాడు. వారు ప్రతిదినము నైతిక, ఆత్మీయ ప్రమాదాలతో పోరాడవలసి యున్నటువంటి, చెడిపోయిన పట్టణంలో జీవిస్తున్నారు. వారు జాగ్రత్తగాలేకపోతే, వారిని సులభంగా ముట్టడించగల చెడు ప్రభావాలు క్రమేణ “ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజకసమూహమును, పరిశుద్ధజనమును, దేవునిసొత్తయిన ప్రజలు”గా, ఒక ప్రత్యేక ప్రజలుగా ఉండే వారి తీర్మానాన్ని బలహీనపరచగలదు.—1 పేతురు 2:9.
పౌలు, 2 కొరింథీయులు 6:14-16లో కనిపించేదానిని వ్రాయుటకు ముందు, తన కొరింథు సహోదరుల మధ్యనున్న ఒక గంభీర సమస్యను గూర్చి మాట్లాడాడు. అదేమనగా వారు తమ మధ్య గంభీరమైన అవినీతి నుండనిచ్చారు. అందుచేత పౌలు, పశ్చాత్తాపము నొందని అటువంటి పాపిని బహిష్కరించమని లేక వెలివేయమని వారికి సూచించాడు. (1 కొరింథీయులు 5:1) లోక నైతికవ్యవహారాల్లో జాగ్రత్తగాలేకుంటే, లేక దానిలో మునిగిపోతే అది క్రైస్తవులపై ప్రభావం చూపగలదని ఆ వ్యక్తియొక్క ప్రవర్తన చూపుతోంది.
వెలివేయబడిన అట్టి వ్యక్తితో కొరింథులోని క్రైస్తవులు సాంగత్యమును నిరోధించవలసి ఉన్నారు. అయితే దాని భావము వారు పూర్తిగా అవిశ్వాసులకు దూరమై ఉండాలనా? మృత సముద్రం దగ్గరవున్న కుమ్‌రాన్‌కు వెళ్లిపోయిన యూదులవలెనే, క్రైస్తవేతరులతో పూర్తి సంబంధాలను, వ్యవహారాలను తెగతెంపు చేసుకొని మతసన్యాసుల గుంపువలె వేరై ఉండాలా? ఇందుకు పౌలు సమాధానమేమిటో చూద్దాము: “జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు వ్రాసియుంటిని. అయితే ఈ లోకపు జారులతో . . . ఏ మాత్రమును సాంగత్యము చేయవద్దని కాదు; ఆలాగైతే మీరు లోకములోనుండి వెళ్లిపోవలసివచ్చును గదా?”—1 కొరింథీయులు 5:9, 10.
ఈ మాటలలోని అంతర్భావమేమిటో స్పష్టంగా గోచరిస్తుంది. హీనమైన, భిన్నమైన నైతిక ప్రమాణాలుగల అవిశ్వాసులతో అనుదిన వ్యవహారాలలో సంబంధముకలిగి వారి మధ్యే జీవిస్తున్నారని, వారింకా ఈ భూగ్రహంపైనే జీవిస్తున్నారని పౌలు గుర్తించాడు. అది పూర్తిగా నిరోధించలేని విషయమైనందున, క్రైస్తవులు అటువంటి సంబంధాల విషయంలో జాగరూకతతో ఉండాలి.
పౌలు కొరింథీయులకు వ్రాసిన రెండవ పత్రికను మరలా పరిశీలిద్దాము. అభిషక్త క్రైస్తవులు దేవుని పరిచారకులుగా ఉండుటకు అర్హులని, క్రీస్తు స్థానంలో వారు రాయబారులని ఆయన సూచించాడు. వారి పరిచర్యను నిందింపజేసే ఏ విధమైన అభ్యంతర కారణానికైనా తావివ్వొద్దని వారితో చెప్పాడు. (2 కొరింథీయులు 4:1–6:3) తనకు ఆత్మీయ కుమారులవలెనున్న తన క్రైస్తవ సహోదరులను మీ హృదయాలను విశాలపరచుకోవాలని పురికొల్పాడు. (2 కొరింథీయులు 6:13) ఆ తర్వాత ఆయన: “అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి,” అని వారిని ప్రోత్సహించాడు. ఆయన ఈ అంశంయొక్క ప్రాధాన్యతను వివరించడానికి ఆలోచనను రేకెత్తింపజేసే ప్రశ్నలను వరుసగా ఉపయోగించాడు.
ఇక్కడ సందర్భము, పౌలు ఒక వ్యాపారం, ఉద్యోగం మొదలైన ఒక నిర్థిష్ట జీవిత రంగాన్ని గూర్చి మాట్లాడుతూ, ఆ విషయంలో ఒక నియమాన్ని విధిస్తున్నట్లు చూపబడటం లేదు. బదులుగా ఆయన విస్తృత పరిధిగల, ఆరోగ్యవంతమైన, సహాయకరమైన ఉపదేశాన్ని తన ప్రియ సహోదరులకు ఇస్తున్నాడు.
ఉదాహరణకు ఈ ఉపదేశం, వివాహం చేసుకోవాలనుకునే క్రైస్తవునికి అన్వయిస్తుందా? తప్పక అన్వయిస్తుంది. తన మొదటి పత్రికలో వివాహం చేసుకోగోరే క్రైస్తవులు “ప్రభువునందు మాత్రమే” వివాహం చేసుకోవాలని అపొస్తలుడు కొరింథీయులకు ఉపదేశించాడు. (1 కొరింథీయులు 7:39) తదుపరి ఆయన, 2 కొరింథీయులు 6:14-18లో వ్రాసిన దానినిబట్టి ఆ మాటలలోని జ్ఞానాన్ని నొక్కి తెలియపర్చాడు. ఒక క్రైస్తవుడు యెహోవా సేవలో లేనివారిని, లేక క్రీస్తు అనుచరులు కానివారిని వివాహం చేసుకోవాలని తలస్తే, అతను లేక ఆమె అవిశ్వాసితో సంబంధమేర్పరచుకోడానికి తలస్తున్నారు. (లేవీయకాండము 19:19 పోల్చండి; ద్వితీయోపదేశకాండము 22:10.) ప్రాథమికంగా ఒకరికొకరు సరిపోల్చని జోడియైనందున, సమస్యలొచ్చే అవకాశమెక్కువగా ఉంది. ఆత్మీయ సమస్యలు కూడా రావచ్చు. ఉదాహరణకు, అవిశ్వాసి ప్రస్తుతమేగాని, భవిష్యత్తులోనేగాని అబద్ధ దేవుని ఆరాధనను చేపట్టవచ్చును. పౌలు ఇలా తర్కించాడు: “క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము?”
అవిశ్వాసితో కలిసి వ్యాపారంచేసే—మరొక జీవిత రంగం సంగతేమిటి? కొన్ని సందర్భాలలో జీవనోపాధికోసం, కుటుంబాన్ని పోషించడంకోసం తన తోటి క్రైస్తవుడు కాని మరో వ్యక్తితో వ్యాపార భాగస్వామ్యాన్ని కుదుర్చుకోవడం అవసరమని ఒక క్రైస్తవుడు భావించవచ్చును. (1 తిమోతి 5:8) కొన్ని ఉదాహరణలను గమనించండి:
ఒక క్రైస్తవుడు ఏవైనా వాణిజ్యపర వస్తువులను అమ్మే వ్యాపారం చేయాలని, అనుకోవచ్చును. దానికి ఏకైక మార్గం, సరుకులను ఉత్పత్తిచేసే వ్యక్తితోనో, తగిన పెట్టుబడి పెట్టగల వ్యక్తితోనో భాగస్వామ్యాన్ని అంగీకరించడం కావచ్చును. మరో క్రైస్తవుడు వ్యవసాయం, (లేక పశుపోషణ) చేయాలనుకోవచ్చు; అలాంటప్పుడు లాభంలో వాటా తీసుకొనడానికి ఒప్పందమేర్పరచుకొని, తనకు భూమిని కౌలుకిచ్చే వ్యక్తితో కలిసి చేయాల్సిన స్థితి ఉండొచ్చును. బహుశా మరో క్రైస్తవుడు ప్రభుత్వం కొన్ని లైసెన్సులనే పరిమితంగా ఇస్తున్నందున, వాటిని అప్పటికే ఇతరులు తీసుకొన్నందున తాను ప్లంబింగ్ వ్యాపారం చేయాలనుకున్నప్పుడు, లైసెన్సు పొందివున్న అవిశ్వాసియగు ఒక బంధువుతో కలిసి చేయడం తప్ప వేరే మార్గం లేకపోవచ్చును.—మార్కు 12:17.
ఇవి కేవలం దృష్టాంతాలు మాత్రమే. ఇక్కడ మేము వేరే అవకాశాలేవి లేవని చెప్పడం లేదు లేక దానిని సమర్ధించడానికో, సమర్థించక పోడానికో చెప్పే మాటలు కావు. కాని ఈ ఉదాహరణలను మనస్సులో పెట్టుకొని, 2 కొరింథీయులు 2:6-14లోని ఉపదేశాన్ని నిర్లక్ష్యపరచకూడదని గ్రహించమా?
అతడు బంధువైనా, కాకపోయినా, ఒక అవిశ్వాసితో కలిసి వ్యాపారాన్ని చేసే క్రైస్తవుడు ఎదురుచూడని సమస్యలను, శోధనలను ఎదుర్కొన వచ్చును. బహుశా సరైనరీతిలో లాభం రావాలంటే అది ప్రభుత్వ చట్టానికి వ్యతిరేకమైనప్పటికి, తక్కువ ఆదాయాన్ని చూపడం, పనివారికి అవసరమైన రికార్డులను సరిగా భద్రపర్చకపోవడం వంటివాటిని చెయ్యాలని భాగస్వామి నిర్ణయించుకోవచ్చును. వస్తువులను అధికారిక పత్రంపై చూపకుండా అమ్మకంలో పనిచేసేవానికి లోగుట్టుగా డబ్బులు చెల్లించి, వస్తువులను తీసుకోవడానికి సంతోషపడవచ్చును. అలాంటి అక్రమంలో క్రైస్తవుడు ఏ మాత్రమైనా వంతు కల్గియుండవచ్చా? కొన్నిసార్లు పన్ను పేపర్లపై, లేక వారు వ్యాపారాన్ని ఎలా చేస్తారో చూపించే ఇతర చట్టపరమైన పత్రాలపై సంతకాలు చేయాల్సి వచ్చినప్పుడు క్రైస్తవుడు ఏమిచేస్తాడు?—నిర్గమకాండము 23:1; రోమీయులు 13:1, 7.
లేనియెడల, అవిశ్వాసియైన వ్యాపార సహవాసి, అన్యమత సెలవు దినాలకు సంబంధించిన వస్తువులను స్టాకులో ఉంచమనడం, లేక ఆయా పండుగలకు కంపెని పేరుమీద గ్రీటింగ్ కార్డులు పంపడం, మత సంబంధమైన పండుగలకు వ్యాపారస్థలాన్ని అలంకరించడం చేయాలనుకోవచ్చును. పౌలు: “దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమిపొందిక? మనము జీవముగల దేవుని ఆలయమై యున్నాము” అని తర్కిస్తూ, ఆయన చేసిన వ్యాఖ్యానం ఎంత యుక్తముగా ఉందో చూడండి: “‘కావున మీరు వారి మధ్యనుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి;” “అపవిత్రమైనదానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు”—“మరియు నేను మిమ్ము చేర్చు కొందును.’” (2 కొరింథీయులు 6:16, 17) ఆ జ్ఞానయుక్తమైన ఉపదేశాన్ని అన్వయించుకుంటూ, వారికి సాధ్యమైనంత తక్కువ సమస్యలను తేగల లౌకిక ఉద్యోగాలను చాలామంది క్రైస్తవులు ఎంపిక చేసికొన్నారు.—హెబ్రీయులు 13:5, 6, 18.
లౌకిక ఉద్యోగంలోని సంఘ సభ్యులందరూ వారు యజమానులైనా, వ్యాపార స్వంతదారులైనా వారి లౌకిక కార్యకలాపాలలో చేసే ప్రతిదానిని కనిపెట్టాలని, పరిశోధించాలని సంఘముపై బాధ్యత మోపబడలేదు. అయినప్పటికి, క్రైస్తవుడు అబద్ధ ఆరాధనను పురికొల్పడం, అబద్ధం, దొంగతనం మొదలగు చెడు ప్రవర్తనకు బాధ్యుడై యున్నాడని తెలిసినప్పుడు, యెహోవా ప్రమాణాలను ఉన్నతపరచడానికి సంఘం చర్య తీసుకోవలసివుంటుంది.
ప్రధానమైన అంశమేమంటే, “అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి” అను పౌలు ప్రేరేపిత ఉపదేశం క్రైస్తవులు తమ సమస్యలను నిరోధించుకొనడానికి, అవసరమైన న్యాయపర చర్యలు తీసుకోవలసిన అవసరతలు తలెత్తకుండా సహాయపడుతుంది. జ్ఞానయుక్తమైన క్రైస్తవులు తాము బైబిలు సూత్రములకు రాజీపడే పరిస్థితులలోకి ప్రవేశించకుండా ఆ ఉపదేశాన్ని హృదయంలోకి తీసుకుంటారు. ఒకరు తాను అవిశ్వాసితో వ్యాపారంలో కలవాల్సొస్తుందని భావించుకొన్నప్పుడు, తన నిర్ణయానికి తానే బాధ్యత వహించాల్సి వుంటుంది గనుక, ఇతరులు అతనిని, విమర్శించడానికి, అతనికి తీర్పుతీర్చడానికి తొందరపడకూడదు. ప్రాథమికంగా అవిశ్వాసితో వ్యాపారంచేసే విషయంలో తప్పక పాటించాల్సిన నియమాన్ని పౌలు ఏర్పరచడంలేదు. అయినా ఆయన ఉపదేశాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. దేవుడు ప్రేరేపించిన ఆ ఉపదేశం మన ప్రయోజనార్థమై బైబిలులో లిఖించబడి ఉంది. దానిని గైకొంటే మనము జ్ఞానులమవుతాము.