నియమమా, ప్రజాసమ్మతమా—ఏది మిమ్ముల నడిపిస్తుంది?
ఆరవ తరగతి చదువుతున్న నోరిహితో, ఒక క్రీడా కార్యక్రమంలో పాల్గొంటుండగా, అకస్మాత్తుగా ఆయనొక నిర్ణయాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. దేశభక్తికి సంబంధించిన ఒక ఆచరణలో పాల్గొనాలని విద్యార్థులందరూ కోరబడ్డారు. సాధారణ వంతుప్రకారం జరిగే ఈ కార్యక్రమంలో తనతోటి విద్యార్థులతోపాటు ఆయన పాల్గొనాలా?
నోరిహితో యెహోవాను తప్ప మరి ఏ దేవుని ఆరాధనలో పాల్గొనటమైనా తప్పు అని బైబిలు నుండి నేర్చుకున్నాడు. (నిర్గమకాండము 20:4, 5; మత్తయి 4:10) క్రైస్తవులు ప్రపంచ సమస్త రాజకీయవ్యవహారాల్లో తటస్థంగా ఉండాలనికూడా ఆయనకు తెలుసు. (దానియేలు 3:1-30; యోహాను 17:16) తోటి విద్యార్థులు తమతో పాల్గొనాలని ఆయనను బలవంతపెట్టినను ధైర్యంగా, అదే సమయంలో గౌరవపూర్వకంగా ఆయన తన స్థానంలో తాను నిలబడివున్నాడు. అలాంటి పరిస్థితిలో మీరేమి చేసి ఉండేవారు?
ఒక తరగతి ప్రజలకు సంబంధించిన వాళ్లం కావాలనే కోరిక
మానవులు సాంఘికంగా, ఒకరితో ఒకరు కలిసిపోతూ, పనులను కలిసిమెలిసి చేయడంలో ఆనందం పొందే రీతిగా సృష్టించబడ్డారని లేఖనములు సూచిస్తున్నవి. తమతోటి వయస్కుల మధ్య ఉండాలని, వారు తమను అంగీకరించాలని, వారితో వారి సంబంధీకులుగా ఉండాలనే కోరిక కలిగియుండటం సహజమే. అలాంటి భావాలు జీవితాన్ని సంతోషదాయకంగాను, ఇతరులతో వ్యవహరించేటప్పుడు సమాధానము, అనుగుణ్యతను పెంచుకొనడానికి తోడ్పడతాయి.—ఆదికాండము 2:18; కీర్తన 133:1; 1 పేతురు 3:8.
ఒకరికొకరం సంబంధించిన వాళ్లుగా ఉండాలనే ఈ సహజమైన కోరిక, ఈనాటికి కొన్ని సంస్కృతులు ఏకమైయుండాలనే దానికిచ్చే ప్రాధాన్యతలో స్పష్టమౌతుంది. ఉదాహరణకు జపాను పిల్లలకు చిన్నవయస్సునుండే, ఎక్కువమంది అనుసరించి నడుచుకునే భావాలకు అనుగుణంగా నడుచుకొనే తీరును తెలుసుకునే విషయంలో తర్ఫీదివ్వబడుతుంది. వారి సమాజానికి అనుగుణ్యంగా నడుచుకోవడం ఒక ముఖ్యమైన కర్తవ్యంగా వారి పారంపర్య సాంప్రదాయం బోధిస్తుంది. గతంలో జపానుకు రాయబారిగా ఉన్న, అమెరికా రాయబారి ఎడ్విన్ రిషాయుర్, జపానీయుల ఆచారవ్యవహారాలను జాగ్రత్తగా పరిశీలించినవాడై ఇలా అన్నాడు: “సామూహికంగా ఉండటంలో జపానీయులు పాశ్చాత్యులకంటే మిన్నగా ఉంటారు.” ఇంకా ఆయన ఇలా అన్నారు: “పాశ్చాత్యులకు స్వతంత్ర్య వ్యక్తిత్వాలున్నట్లు డాబుసరి ప్రదర్శిస్తున్నట్లు చూపుతారు, కాని జపానీయులైతే వారి దుస్తుల్లో, ప్రవర్తనలో, జీవనవిధానంలో, చివరకు తలంపులలోకూడా వారి సమాజంతో ఏకీభావంగా ఉండటంలో ఎక్కువ తృప్తిపొందుతారు.” అయినా, ఒకరితోఒకరు కలిసిపోయే వారిలా ఉండాలనేది జపానీయులకే పరిమితం కాదు. అది విశ్వవ్యాప్తమైంది.
ఏకీభవించి వెళ్లేందుకు వత్తిళ్లు
ఇతరులతో ఏకీభవించి పోయేందుకు ఒకడు తన శక్తికొలది కృషిచేయడం మంచిదే అయినా, సర్వసామాన్యంగా ప్రజాదరణ పొందినదానిని గుడ్డిగా అనుసరించడంలో అపాయముంది. ఎందుకు? ఎందుకనగా తరచు ప్రజలందరికి సమ్మతమైంది దేవునిచిత్తానికి వ్యతిరేకమైంది కావచ్చు. “లోకమంతయు దుష్టునియందున్నద”ని బైబిలు చెబుతుంది. (1 యోహాను 5:19) జనసమూహంపై ప్రభావాన్నిచూపి దేవునినుండి వారు వేరయ్యేలా తనకు అందుబాటులో ఉన్న ప్రతిదాన్ని సాతాను యుక్తిగా ఉపయోగిస్తాడు. అవేమనగా వస్తుసంబంధమైన ఆశ, దిగజారిన నైతికత్వం, జాతి దురభిమానం, మూఢమైన మత నమ్మకం, దేశాభిమానం మొదలైనవి. అలాంటి అలవాట్లతో కలిసిపోవడమంటె, మరోరీతిలో యెహోవాకు ఆయన సంకల్పాలకు వ్యతిరేకంగా నిలవటమే. అందుకే క్రైస్తవులకు ఈ విధమైన హెచ్చరిక ఇవ్వబడింది: “మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును సంపూర్ణమునైయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సుమారి నూతనమగుటవలన రూపాంతరము పొందుడి.”—రోమీయులు 12:2.
ఈ యుగ విధానంలో జీవిస్తున్న క్రైస్తవులు, జనసమ్మతమైనదానితో ఏకీభవించాలనే ఎడతెగని వత్తిడి క్రింద ఉన్నారు. ఈ విషయానికి సులభంగా లొంగిపోయేవారు యౌవనులు. పాఠశాల సహవిద్యార్థులవలెనే తాము కనిపించాలని, వారివలెనే నడుచుకోవాలనే కోరిక మరీబలంగా ఉంటుంది. తమతోటి వయస్కులకు వారి కొన్నికార్యకలాపాల్లో తాము ఎందుకు పాల్గొనరో వివరించడానికి వారికి నిజమైన ధైర్యమవసరం. అలా ధైర్యంగా మాట్లాడలేకపోతే, అది వారి ఆత్మీయ విపత్తుకు దారితీయగలదు.—సామెతలు 24:1, 19, 20.
పెద్దవారు కూడా వారి ఉద్యోగ స్థలాల్లో అలాంటి వత్తిళ్లనే ఎదుర్కొంటారు. కొన్ని సెలవుదినాల్లో, లేక పనిగంటలైన తర్వాత కొన్ని సాంఘికపరమైన వ్యవహారాల్లో పాల్గొనాలని వారిని కోరటం జరగవచ్చును. వారలా అంగీకరించకపోతే, వారు సరిగ్గా సహకరించనివారిగా, తమనుతాము వేరుపర్చుకొనేవారిగా కనిపించి, ఉద్యోగ స్థలంలో ఒకవిధమైన ఇబ్బందికర వాతావరణాన్ని అది సృష్టిస్తుంది. ఇతరులు చేస్తున్నారు కాబట్టి వారి మాదిరే వీరుకూడా ఎక్కువగంటలు పనిచేయాలని కోరబడుతున్నట్లు, లోలోపల వారును అలానే చేయవలసి ఉందనే భావనకు లోనౌతారు. అలాంటివాటికి లొంగిపోతే ఆత్మీయంగా వారికి హానికరము, వారి ఇతర కర్తవ్యాలను నిర్వహించడంలో ఆటంకాన్నెదుర్కోవడం జరుగుతుంది.—1 కొరింథీయులు 15:33; 1 తిమోతి 6:6-8.
తమతో ఏకీభవించాలనే వత్తిళ్లు పాఠశాల, ఉద్యోగ స్థలాలలోనేగాక, ఇతర చోట్లనుండి కూడా వస్తాయి. క్రైస్తవ తల్లి ఒకసారి తన బిడ్డకు క్రమశిక్షణ తప్పక అవసరమైనప్పటికి, అక్కడవున్న ఇతర గృహిణులు దాన్ని అంగీకారంగా ఎంచరనే భావాన్నిబట్టి, దాన్ని అమలు జరపకుండా మానుకోవలసి వచ్చిందని చెబుతుంది.—సామెతలు 29:15, 17.
జనసమూహానిదే తప్పుకావొచ్చు
గుంపును అనుసరించిపోయే విషయంలో బైబిలు మనకు సూటియైన హెచ్చరిక నిస్తుంది. ఉదాహరణకు ఇశ్రాయేలు జనాంగానికి ఇలా చెప్పబడింది: “దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడించవద్దు. న్యాయమును త్రిప్పివేయుటకు సమూహముతో చేరి వ్యాజ్యెములో సాక్ష్యము పలుకకూడదు.” (నిర్గమకాండము 23:2; రోమీయులు 6:16 పోల్చండి.) అయితే ఈ హెచ్చరికను అన్నిసమయాల్లో గైకొనలేదు. ఐగుప్తును విడిచివచ్చిన కొద్దికాలానికే మోషే అక్కడ లేనిసమయంలో, కొంతమంది వ్యక్తులు అహరోనును ఇతరుల జనులను ప్రేరేపించి, ఒక బంగారు దూడనుచేసి “యెహోవాకు పండుగ” జరిపించి దానినారాధించారు. ఆ దూడకు బలినర్పిస్తూ జనులు తింటూ తాగుతూ నాట్యమాడుతున్నారు. నిర్భీతితో చేసిన ఈ విగ్రహారాధన క్రియకు సూత్రధారులైన 3,000 మంది వధించబడ్డారు. అంతేగాక అనాలోచనగా జనసమూహాన్ని వెంబడించినందుకు అనేకమంది ఇతరులు కూడా యెహోవా కలుగచేసిన తెగులువలన నాశనమయ్యారు.—నిర్గమకాండము 32:1-35.
దుష్కార్యాన్ని జరిగించడానికి గుంపును వెంబడించిన మరో సంఘటన యేసుక్రీస్తు మరణసంబంధంగా మొదటి శతాబ్దములో జరిగింది. అసూయతోనిండిన మతనాయకులచే నడిపించబడి యేసును సిలువవేయమని కేకలువేసిన జనసమూహముతో ప్రజలు ఏకీభవించారు. (మార్కు 15:11) ఆ పిమ్మట, యేసు పునరుత్థానమై, అరోహణమైన తర్వాత పెంతెకొస్తునాడు పేతురు వారి గంభీరమైన తప్పును సూచించినప్పుడు, అనేకులు ‘హృదయములో పొడుచుకొని’ జనసమూహాన్ని అనుసరించి వారు చేసిన దానిని గ్రహించారు.—అపొస్తలుల కార్యములు 2:36, 37.
బైబిలు సూత్రములు శ్రేష్ఠము
ఈ వృత్తాంతాలు స్పష్టంగా చూపుతున్నట్లు, జనసమ్మతమైన దానిని గుడ్డిగా అనుసరించుట తీవ్రమైన ఫలితాలకు దారితీయగలదు. బైబిలును అనుసరించి దాని సూత్రముల ప్రకారం మన జీవితాలను నడుపుకొనుట ఎంత శ్రేష్ఠము! “ఆకాశములు భూమికిపైన ఎంత యెత్తుగా ఉన్నవో మీ మార్గములకంటె నా మార్గములు మీ తలంపులకంటె నా తలంపులు అంత యెత్తుగా ఉన్నవి” అని యెహోవా చెబుతున్నాడు. (యెషయా 55:9) నైతిక విషయాలు, అలాగే మానవ సంబంధాలలోను, నిజానికి జీవిత అన్ని తీర్మానాల్లోను, జనసమ్మతమైన దానిని అనుసరించడంకంటే యెహోవా మార్గాలను అనుసరించుట ఎంతో శ్రేష్ఠమని ఎన్నోమారులు రుజువుపర్చబడింది. అది సంతోషదాయకమైన, ఆరోగ్యవంతమైన జీవనమార్గానికి కీలకము.
ఉదాహరణకు, కాజూయా అనుభవాన్నే తీసుకొనండి. ఆయన బైబిలును కొంతకాలం పఠించినప్పటికి అందరికి ఆమోదకరమైన మార్గాన్ని అనుసరించాలని అందరికంటె పైనుండాలని, ధనికుడు కావాలనే మార్గాన్ని వెంబడించాడు. తన పైవారిని సంతోషపెట్టే ప్రయత్నంలో, తోటి పనివాళ్లందరితో మంచి అనిపించుకోవాలనే ఆరాటంలో, తరచు రాత్రులు దాదాపు అర్థరాత్రి దాటేంతవరకు తాగుతూ గడపాల్సివచ్చింది. ప్రతిదాన్ని అధికంగా కోరేవానిగా, అసహనంగలవానిగా, కోపిష్ఠిగా తయారయ్యాడు. చివరకది పక్షవాతానికి దారితీసింది. పాక్షికంగా చచ్చుబడిపోయాడు. కోలుకోడానికి ఆసుపత్రి పడకమీదనున్న సమయంలో బైబిలునుండి తాను నేర్చుకున్న విషయాలను, తన జీవిత మార్గాన్ని ఆలోచించడానికి సమయం దొరికింది. తాను నేర్చుకున్న వాటిని అన్వయించుకోవలసిన సమయం ఇదే అని నిర్ణయించుకున్నాడు. తన మేనేజరు స్థానానికి రాజీనామాచేసి, తన సహవాసులను మార్చుకున్నాడు. క్రైస్తవ వ్యక్తిత్వాన్ని ధరించుకోవడానికి మనఃపూర్వక కృషిసల్పుతూ, వస్తుసంబంధమైన వాటి విషయాల్లో తన దృక్పథాన్ని మార్చుకున్నాడు. ఫలితంగా తన విలువలు మారాయి. ఆరోగ్యం కుదుటపడింది. చివరకు తన జీవితమును యెహోవాకు సమర్పించుకొని బాప్తిస్మము తీసుకున్నాడు.
ఎక్కువగా జనసమ్మతంకాని విధానాన్ని అనుసరించడంలో విజయం పొందాలంటే, అందులో ఇమిడివున్న సూత్రాలను ఒకడు యెరిగి, అవి సరైనవని పూర్తిగా ఒప్పించబడాలి. మేసారో అనుభవించిన ఒక విషయం ఇది వాస్తవమని చూపింది. అతను ప్రాథమిక పాఠశాలలో ఆరవ తరగతిలో ఉన్నప్పుడు, అతని తరగతి విద్యార్థులు ఆయనను విద్యార్థుల మండలి (స్టూడెంట్ కౌన్సిల్) అధ్యక్షునిగా ఉండేందుకు సిఫారసుచేశారు. కొంత కలతతో ఆయన దాన్ని ఇలా గుర్తుచేసుకుంటున్నాడు. అదేమంటే, ఆ విషయంలో ఇమిడివున్న బైబిలు సూత్రాలను పూర్తిగా అర్థం చేసుకోలేక పోయినందున, ఎందుకు తాను ఆ విధమైన పాఠశాల రాజకీయ ప్రవేశం చేయలేడో తన తోటి తరగతి విద్యార్థులకు వివరించలేకపోయాడు. మనుష్యులకు భయపడటంచేత తాను, క్రైస్తవుడని చెప్పుకోలేకపోయాడు. మొదట దానిని అంగీకరించి, చివరకు, “నేను దాన్ని నిర్వహించలేనని” చెప్పుకొని కన్నీళ్లు విడిచాడు.
ఈ చేదు అనుభవం క్రైస్తవుడు ఎందుకు రాజకీయ కార్యకలాపాలలో పాల్గొనలేడనే సంగతిని అతడు పరిశోధించడానికి నడిపింది. (యోహాను 6:15 పోల్చండి.) తరువాత తాను హైస్కూల్లో ఉన్నప్పుడు అదే పరిస్థితినెదుర్కొన్నాడు. అయితే ఈసారి తన నమ్మకాన్ని టీచరుకు వివరించడానికి తగిన చర్యతీసుకున్నాడు. ఆ టీచరు ఆయన వివరణను అంగీకరించాడు. తోటి తరగతి విద్యార్థులు కూడా ఆయనను తన బైబిలు నమ్మకాలనుగూర్చి వివరాలు అడిగారు.
అందరూ సరైనదాన్ని చేసే సమయం
క్రీస్తు పరిపాలన క్రిందవుండే రాబోవు నూతనలోకంలో జనులందరు ఏమిచేస్తారో, దానిని చేయటమే సరైనదవుతుంది. అంతవరకు, జనసమ్మతంగా ఎంచబడి అందరూ చేసేదాన్ని, చేసేందుకు ఏకీభవించే విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. పౌలు చేసిన ఈ ఉద్బోధనుండి మనము ప్రోత్సాహం పొందవచ్చును: “ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘమువలె మనలను ఆవరించియున్నందున మనముకూడ ప్రతిభారమును సుళువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి . . . మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము.”—హెబ్రీయులు 12:1.
వివాదాంశాలు, సవాల్లు మీకెదురైనప్పుడు మీరేం చేస్తారు? మనుష్యుల భయముచేత ఆవరించబడి అందరికి ఏది సమ్మతమో, దాన్ని చేయడానికి లొంగిపోతారా? లేక దేవుని వాక్యమైన బైబిలుతట్టు తిరిగి, దాని సూత్రాలను అనుసరిస్తారా? ఈ రెండవ మార్గాన్ని అనుసరిస్తే, అది మీకు ప్రస్తుతం ప్రయోజనకరమేగాక, “విశ్వాసముచేతను, ఓర్పుచేతను వాగ్దానములను స్వతంత్రించుకొను” వారితోపాటు ఉండే ఉత్తరాపేక్షను అందిస్తుంది.—హెబ్రీయులు 6:12.