యెహోవా—సజీవుడైన సత్యదేవుడు
“యెహోవా ఎవరు?” అని ప్రశ్నించినప్పుడు ఐగుప్తు ఫరో తిరస్కారంతో, అగౌరవంగా ఆ మాటలు పలికాడు. (నిర్గమకాండము 5:2) ముందరి శీర్షికలో చూపినట్లు, ఆ దృక్పథం ఫరోకు, అతని సైన్యాలకు జలసమాధితో సహా ఐగుప్తీయులకు పది తెగుళ్లను, మరణాన్ని తీసుకొచ్చింది.
ప్రాచీన ఐగుప్తునందు అబద్ధ దేవతలపై యెహోవా తన ఉన్నతత్వాన్ని నిరూపించుకున్నాడు. అయితే ఆయనను గూర్చి నేర్చుకోవాల్సింది యింకా ఎంతోవుంది. ఆయన వ్యక్తిత్వపు ముఖరూపాలు కొన్ని ఏమి? మననుండి ఆయన ఏమి కోరుతున్నాడు?
ఆయన పేరు, ప్రతిష్ఠ
ఐగుప్తు ఫరో దగ్గరకు వెళ్లి, ‘ప్రభువు ఫలాని ఫలాని విషయాలు చెబుతున్నాడు’ అని మోషే అనలేదు. ఫరో మరియు ఇతర ఐగుప్తీయులు అనేకులైన తమ అబద్ధ దేవుళ్లు, ప్రభువులని తలంచేవారు. కాని మోషే దైవ నామమగు యెహోవా అనే పేరును ఉపయోగించాడు. మిద్యాను అరణ్యమందు మండుచున్న పొదదగ్గర మోషే తానుగా పైనుండి ఆ పేరు చెప్పడాన్ని విన్నాడు. ప్రేరేపిత వాక్యమిలా అంటుంది:
“దేవుడు మోషేతో ఇట్లనెను—నేనే యెహోవాను; . . . ఐగుప్తీయులు దాసత్వమునకు లోపరచియున్న ఇశ్రాయేలీయుల మూలుగును విని నా నిబంధనను జ్ఞాపకము చేసుకొని యున్నాను. కాబట్టి నీవు ఇశ్రాయేలీయులతో ఈలాగు చెప్పుము—నేనే యెహోవాను; నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించి, వారి దాసత్వములో నుండి మిమ్మును విడిపించి, నా బాహువు చాపి గొప్ప తీర్పులుతీర్చి మిమ్మును విడిపించి, మిమ్మును నాకు ప్రజలగా చేర్చుకొని మీకు దేవుడనై యుందును. అప్పుడు ఐగుప్తీయుల బరువు క్రిందనుండి మిమ్మును వెలుపలికి రప్పించిన మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలిసికొందురు. నేను [మీ పితరులైన] అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు ఇచ్చెదనని చెయ్యి యెత్తి ప్రమాణము చేసిన [కనాను] దేశములోనికి మిమ్మును రప్పించి దాని మీకు స్వాస్థ్యముగా ఇచ్చెదను; నేను యెహోవాను.”—నిర్గమకాండము 6:2-8.
యెహోవా అదే ప్రకారం చేశాడు. ఆయన ఐగుప్తు దాసత్వాన్నుండి ఇశ్రాయేలీయులను విడిపించి వారు కనాను దేశమును స్వతంత్రించుకొనునట్లు చేశాడు. వాగ్దానం చేసినట్లుగా, దేవుడు దీనిని నెరవేర్చాడు. ఎంత అనుగుణ్యత! యెహోవా అనే ఆయన నామమునకు “సంభవింపజేయువాడు” అని భావం. బైబిలు “దేవుడు,” “సర్వాధిపతి,” “సృష్టికర్త,” “తండ్రి,” “సర్వశక్తిమంతుడు,” “సర్వోన్నతుడు” అనే బిరుదులతో యెహోవాను సూచిస్తున్నది. అయిననూ, ప్రగతి పూర్వకంగా తన దివ్య సంకల్పం నెరవేర్చు సత్యదేవునిగా ఆయన నామమగు యెహోవా ఆయనను గుర్తిస్తున్నది.—యెషయా 42:8.
బైబిలును దాని ఆదిమ భాషలో చదివినట్లయిన, అందులో మనం దేవుని నామాన్ని వేలసంఖ్యలో చూస్తాము. హెబ్రీ భాషలో అది యోద్ హె వా హె (יהוה) అనే నాలుగు హల్లులతో సూచింపబడింది, చతురక్షర రూపమని పిలువబడిన ఆ పదాన్ని కుడినుండి ఎడమకు చదివేవారు. హెబ్రీ భాష మాట్లాడు వారు దానికి అచ్చులు చేర్చి చదివేవారు, అయితే నేటి ప్రజలకు అవి ఏ అచ్చులో రూఢిగా తెలియదు. దాని ఉచ్చారణ యావె అని కొందరన్ననూ, యెహోవా అనే పేరు అందరికి తెలిసినది పైగా అది సరిగా మన సృష్టికర్తను గుర్తించేదై యున్నది.
యెహోవా అనే నామ ప్రయోగము కీర్తన 110:1లో వున్న “నా ప్రభువు” అని పిలువబడిన వానినుండి దేవున్ని భిన్నంగా చూపుతుంది. అక్కడ ఒక అనువాదం యిలావుంది: “ప్రభువు [హెబ్రీలో, יהוה] నా ప్రభువుతో యిలా అన్నాడు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయువరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము.” (కింగ్ జేమ్స్ వర్షన్) హెబ్రీ గ్రంథమందు ఇక్కడున్న దేవుని నామాన్ని గుర్తించిన, న్యూ వరల్డ్ ట్రాన్స్‌లేషన్ నందు అదిలా చదువబడుతుంది: “యెహోవా నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, ‘నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయువరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము.’” యెహోవా పలికిన ఆ మాటలు ప్రవచనార్థకముగా ఆ రచయిత “నా ప్రభువు” అని పిలిచిన యేసుక్రీస్తును సూచిస్తున్నాయి.
ఫరో కాలంలో యెహోవా తన పేరును తానే ప్రతిష్ఠపర్చుకున్నాడు. కఠిన హృదయుడైన ఆ పాలకునికి మోషే ద్వారా దేవుడు యిలా చెప్పాడు: “సమస్త భూమిలో నావంటివారెవరును లేరని నీవు తెలిసికొనవలెనని ఈసారి నేను నా తెగుళ్లన్నియు నీ హృదయము నొచ్చునంతగా నీ సేవకుల మీదికిని నీ ప్రజలమీదికిని పంపెదను; భూమిమీద నుండకుండ నీవు నశించిపోవునట్లు నేను నా చెయ్యి చాపియుంటినేని నిన్నును నీ జనులను తెగులుతో కొట్టివేసియుందును. నా బలమును నీకు చూపునట్లును, భూలోకమందంతట నా నామమును ప్రచురము చేయునట్లును ఇందుకే నేను నిన్ను నియమించితిని.”—నిర్గమకాండము 9:14-16.
ఐగుప్తు నుండి ఇశ్రాయేలీయుల నిర్గమమును గూర్చి, కొంతమంది కనానీయ రాజులు కూలద్రోయబడుటను గూర్చి, వేగులవారైన ఇద్దరు హెబ్రీయులతో యెరికో పట్టణస్థురాలైన రాహాబను స్త్రీ యిలాచెప్పింది: “యెహోవా ఈ దేశమును [ఇశ్రాయేలీయులైన] మీకిచ్చుచున్నాడనియు, మీవలన మాకు భయము పుట్టుననియు, మీ భయమువలన ఈ దేశనివాసులందరికి ధైర్యము చెడుననియు నేనెరుగుదును. మీరు ఐగుప్తు దేశములోనుండి వచ్చినప్పుడు మీ యెదుట యెహోవా యెఱ్ఱసముద్రపు నీరును ఏలాగు ఆరిపోచేసెనో, యొర్దాను తీరముననున్న అమోరీయుల యిద్దరు రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసితిరో, అనగా మీరు వారిని ఏలాగు నిర్మూలము చేసితిరో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమియందును దేవుడే. మీ యెదుట ఎట్టి మనుష్యులకైనను ధైర్యమేమాత్రము ఉండదు.” (యెహోషువ 2:9-11) అవును, యెహోవా కీర్తి విస్తరించెను.
యెహోవా ఆయన లక్షణములు
కీర్తనల రచయిత హృదయపూర్వకమైన ఈ అభిలాషను వ్యక్తపర్చాడు: “యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవని వారెరుగుదురు గాక.” (కీర్తన 83:18) యెహోవా సర్వాధిపత్యం విశ్వవ్యాప్తమై యుంటుంది గనుక, హింసింపబడుతున్న యేసు శిష్యులిలా ప్రార్థించగల్గారు: “నాథా, నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగజేసినవాడవు.” (అపొస్తలుల కార్యములు 4:24) యెహోవా “ప్రార్థన ఆలకించువాడని” తెలుసుకొనుట ఎంత ఓదార్పుకరము!—కీర్తన 65:2.
యెహోవా ముఖ్య లక్షణం ప్రేమ. నిజముగా, “దేవుడు ప్రేమాస్వరూపి” అనగా ఆయన ఆ లక్షణమునకు ప్రతిరూపమై యున్నాడు. (1 యోహాను 4:8) అంతేకాదు, “జ్ఞానశౌర్యములు ఆయనయొద్ద ఉన్నవి.” యెహోవా సర్వజ్ఞాని, సర్వశక్తిమంతుడు, అయితే ఆయనెన్నడూ తన శక్తిని దుర్వినియోగము చేయడు. (యోబు 12:13; 37:23) అన్నిసమయాల్లో యెహోవా మనతో న్యాయముగా వ్యవహరిస్తాడనే నమ్మకాన్ని మనం కలిగియుండగలము, ఎందుకంటె “నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారము.” (కీర్తన 97:2) మనం తప్పుచేసిననూ, పశ్చాత్తాపపడితే యెహోవా “కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములుగల దేవుడనే” జ్ఞానాన్నిబట్టి మనం ఓదార్పు పొందగలము. (నిర్గమకాండము 34:6) యెహోవా సేవయందు మనకానందం కలదనుటలో ఆశ్చర్యమేమీ లేదు!—కీర్తన 100:1-5.
సాటిలేని పరలోక రాజు
యెహోవా కుమారుడైన, యేసుక్రీస్తు యిలా చెప్పాడు: “దేవుడు ఆత్మ.” (యోహాను 4:24) కాబట్టి, యెహోవా మానవనేత్రాలకు అదృశ్యుడు. నిజానికి, యెహోవా మోషేకిలా చెప్పాడు: “నీవు నా ముఖమును చూడజాలవు; ఏ నరుడును నన్ను చూచి బ్రదుకడు.” (నిర్గమకాండము 33:20) ఈ పరలోక రాజు ఎంత మహిమాన్వితుడంటే, మానవులు ఆయన మహిమను చూడటాన్ని భరింపజాలరు.
యెహోవా మన కన్నులకు అదృశ్యుడైననూ, సర్వశక్తిగల దేవునిగా ఆయన ఉనికికి సమృద్ధిగా రుజువుకలదు. అవును, “ఆయన అదృశ్య లక్షణములు, అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుటవలన తేటపడుచున్నవి.” (రోమీయులు 1:20) భూమియందలి, పచ్చిక, వృక్షాలు, ఫలాలు, కూరగాయలు, పుష్పాలు ఇవన్నియు యెహోవా దేవత్వాన్ని రుజువు చేస్తున్నాయి. వట్టి విగ్రహములవలె కాకుండ, యెహోవా వర్షాన్ని ఫలవంతమైన రుతువుల్ని దయచేస్తున్నాడు. (అపొస్తలుల కార్యములు 14:16, 17) రాత్రియందు ఆకాశ నక్షత్రాల్ని చూడండి. యెహోవా దేవత్వానికి, వ్యవస్థీకరణ సామార్థ్యానికి ఎంతటి మహాగొప్ప నిదర్శనము!
యెహోవా పరలోకమందు పరిశుద్ధమును, తెలివిగల ఆత్మీయ ప్రాణులను సహితం వ్యవస్థీకరించాడు. పొందికగల ఒక సంస్థగా వారు కీర్తనల రచయిత చెప్పినట్లు దేవుని చిత్తం నెరవేరుస్తుంటారు: “యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకులోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా, ఆయనను సన్నుతించుడి. యెహోవా సైన్యములారా, ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా, మీరందరు ఆయనను సన్నుతించుడి.” (కీర్తన 103:20, 21) యెహోవా ఈ భూమ్మీద కూడ వ్యవస్థీకరింపబడిన ప్రజలను కలిగియున్నాడు. ఇశ్రాయేలు జనాంగము ఎలా చక్కని సంస్థగావుండిరో, దేవుని కుమారుని అనుచరులును ఆలాగేవుండిరి. అదేవిధంగా నేడు, ఆయన రాజ్యం సమీపంగా ఉందని ప్రకటించే ఆసక్తిపరులైన సాక్షుల అంతర్జాతీయ సంస్థను యెహోవా కలిగియున్నాడు.—మత్తయి 24:14.
యెహోవా సజీవుడైన సత్యదేవుడై యున్నాడు
యెహోవా దేవత్వం అనేక విధాలుగా ప్రదర్శింపబడింది. ఆయన ఐగుప్తు అబద్ధ దేవతలను అవమానపర్చాడు, ఇశ్రాయేలీయులను సురక్షితంగా వాగ్దాన దేశానికి నడిపించాడు. సృష్టి యెహోవా దేవత్వానికి కావలసినంత రుజువునిస్తున్నది. ఒక్కమాటలో చెప్పాలంటే ఆయనకు అబద్ధమత నిష్ప్రయోజనమైన విగ్రహ దేవతలకు ఏ మాత్రం పోలికలేదు.
సజీవుడైన దేవుడగు యెహోవాకు మానవ నిర్మిత నిర్జీవ విగ్రహాలకు మధ్యగల తీవ్ర భేదాన్ని యిర్మీయా చూపించాడు. ఆ భేదం యిర్మీయా 10వ అధ్యాయంలో చక్కగా వ్యక్తపర్చబడింది. మిగతా విషయాలతోపాటు యిర్మీయా యిలా వ్రాశాడు: “యెహోవాయే నిజమైన దేవుడు. ఆయనే జీవముగల దేవుడు, సదాకాలము ఆయనే రాజు.” (యిర్మీయా 10:10) సజీవుడైన సత్యదేవుడగు యెహోవా సమస్తాన్ని సృజించాడు. ఐగుప్తు దాసత్వమందు మ్రగ్గుచున్న ఇశ్రాయేలీయులను ఆయన విడిపించాడు. ఆయనకు అసాధ్యమైనది లేదు.
“పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడు గాక; నీ రాజ్యము వచ్చుగాక; నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక” అనే ప్రార్థనకు “యుగములలో రాజైన” యెహోవా జవాబిస్తాడు. (1 తిమోతి 1:17; మత్తయి 6:9, 10) ఇప్పటికే యేసుక్రీస్తు అధికారము క్రిందనున్న పరలోక మెస్సీయ రాజ్యము త్వరలోనే దుష్టులపై చర్యగైకొని యెహోవా శత్రువులనందరిని నాశనం చేస్తుంది. (దానియేలు 7:13, 14) విధేయులైన మానవజాతికి అనంత ఆశీర్వాదములు తెచ్చే నూతన లోకాన్నికూడ ఆ రాజ్యం ప్రవేశపెడుతుంది.—2 పేతురు 3:13.
యెహోవాను గూర్చి, ఆయన సంకల్పాలను గూర్చి నేర్చుకోవాల్సిందింకా ఎంతోవుంది. అటువంటి జ్ఞానము సంపాదించి, తదనుగుణంగా ప్రవర్తించుటను నీ తీర్మానముగా ఎందుకు చేసుకొనకూడదు? నీవట్లు చేసినట్లయితే, రాజ్యపాలన క్రింద భూపరదైసులో నిత్యజీవమనుభవించు ఆధిక్యత నీకివ్వబడుతుంది. దుఃఖం, వేదన, చివరకు మరణం గతించి ఈ భూమి యెహోవాను గూర్చిన జ్ఞానంతో నింపబడిన కాలంలో నీవు జీవిస్తావు. (యెషయా 11:9; ప్రకటన 21:1-4) “యెహోవా ఎవరు?” అనే ప్రశ్నకు బైబిలు ఆధారిత జవాబులను వెదకి, వాటిని కనుగొని తదనుగుణంగా ప్రవర్తించినట్లయితే ఆ భాగ్యం నీదవుతుంది.
[7వ పేజీలోని చిత్రసౌజన్యం]
Pictorial Archive (Near Eastern History) Est.