యెహోవా ఎవరు?
“యెహోవా ఎవరు?” అని 3,500 సంవత్సరాల క్రితం ఐగుప్తు రాజైన ఫరో అహంకారంతో అడిగాడు. ఆ ధిక్కారభావమే అతడు “నేను యెహోవాను ఎరుగను” అనడానికి సహితం పురికొల్పింది: కాని ఫరో ఎదుట నిలబడిన ఇద్దరు మనుష్యులకు మాత్రం యెహోవా ఎవరో తెలుసు. వారిద్దరు ఇశ్రాయేలీయుల లేవీ గోత్రానికి చెందిన అన్నదమ్ములై యున్నారు. మత సంబంధమైన పండుగ జరుపుకోవడానికి ఇశ్రాయేలీయులను అరణ్యములోనికి పంపవలెనని ఐగుప్తు పరిపాలకుని అడుగుడని యెహోవా వారిని పంపించాడు.—నిర్గమకాండము 5:1, 2.
తన ప్రశ్నకు జవాబు కావాలని ఫరో కోరలేదు. అతని అధికారము క్రిందగల, పూజారులు వందలాది అబద్ధ దేవతల ఆరాధనను ప్రోత్సహించారు. అంతెందుకు, ఫరోను ఒక దేవునిగా పరిగణించేవారు! ఐగుప్తీయుల పురాణాలు చెప్పిన ప్రకారం, అతను సూర్యదేవుడైన రా కుమారుడును, గద్ద తలగల హోరస్ దేవత అవతారమునై యున్నాడు. ఫరో “బలవంతుడైన దేవుడు,” “నిత్యుడు” అనే బిరుదులతో పిలువబడ్డాడు. కాబట్టి, “నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు?” అని అతడు హేళనగా అడగడంలో ఆశ్చర్యం లేదు.
ఆ ప్రశ్నకు అహరోను, మోషే జవాబివ్వనవసరం లేదు. ఆ కాలంలో ఐగుప్తునందు దాసత్వ మనుభవిస్తున్న ఇశ్రాయేలీయులు యెహోవా దేవున్ని ఆరాధించేవారని ఫరోకు తెలుసు. అయితే ఫరో, ఆలాగే సమస్త ఐగుప్తీయులు త్వరలోనే యెహోవా సత్యదేవుడని తెలుసుకొననై యుండిరి. అదే ప్రకారం నేడు, భూమ్మీద జీవించే ప్రతివారు తన నామాన్ని, దైవత్వాన్ని తెలుసుకునేట్లు యెహోవా చేస్తాడు (యెహెజ్కేలు 36:23) కాబట్టి, యెహోవా దేవుడు ప్రాచీన ఐగుప్తులో తన నామాన్ని ఎలా ఘనపర్చుకున్నాడో విచారించుట ద్వారా మనం ప్రయోజనం పొందగలము.
ఐగుప్తు దేవతలకంటె ఉన్నతుడు
తిరస్కారంతో యెహోవా ఎవరని ఫరో అడిగినప్పుడు, అతడు తాననుభవించిన పరిణామాలు సంభవిస్తాయని అనుకోలేదు. ఐగుప్తు మీదికి పది తెగుళ్లు రప్పించుట ద్వారా యెహోవా తానుగా ప్రత్యుత్తరమిచ్చాడు. ఆ పది తెగుళ్లు కేవలం ఆ దేశానికి తగిలిన దెబ్బలు మాత్రమే కాదు. అవి ఐగుప్తు దేవతలకు తగిలిన పిడిగుద్దులై యుండెను.
ఆ తెగుళ్లు ఐగుప్తు దేవతలపై యెహోవా ఉన్నతత్వాన్ని ప్రదర్శించాయి. (నిర్గమకాండము 12:12; సంఖ్యాకాండము 33:4) నైలు నదిని, ఐగుప్తునందలి సమస్త నీటిని యెహోవా రక్తముగా మార్చినప్పుడు కలిగిన పెడబొబ్బల సందడి నొక్కసారి ఊహించుము! ఈ సూచక క్రియతో, ఫరో, అతని ప్రజలు నైలు దేవతయగు హాపి కంటే యెహోవా ఉన్నతుడని తెలుసుకున్నారు. నైలు నదిలోని చేపలు చనిపోవడం కూడ ఐగుప్తు మతాన్ని దెబ్బతీసింది, ఎందుకంటె వారు కొన్నిరకాల చేపలను ఆరాధిస్తుండేవారు.—నిర్గమకాండము 7:19-21.
ఆ తర్వాత, యెహోవా ఐగుప్తు మీదికి కప్పలతో తెగులు రప్పించాడు. ఇది ఐగుప్తీయుల కప్ప దేవతగు హెక్ట్‌ను అవమానపరచింది. (నిర్గమకాండము 8:5-14) అద్భుతరీతిలో యెహోవా చేసినట్లు ధూళిని పేలుగా మార్చలేకపోయిన శకునగాండ్రను ఆ మూడవ తెగులు తీవ్రంగా కలవరపర్చింది. “ఇది దేవుని వ్రేలు” అని వారు పలికారు. (నిర్గమకాండము 8:16-19) మంత్ర శక్తుల అధినేతని కీర్తింపబడిన ఐగుప్తు దేవుడగు తోత్ ప్రగల్భాలు పలికిన వీరిని ఆదుకోలేకపోయాడు.
యెహోవా ఎవరో ఫరో నేర్చుకొన నారంభించాడు. మోషే ద్వారా తన సంకల్పాన్ని ప్రకటించి, ఆ తర్వాత అద్భుతరీతిలో ఐగుప్తు మీదికి తెగుళ్లు రప్పించుట ద్వారా ఆ సంకల్పాన్ని నెరవేర్చగల దేవుడే యెహోవా. ఆలాగే తన చిత్త ప్రకారమే విఘాతాలు కల్గించి, వాటిని ముగించగల సమర్థుడు యెహోవా. అయితే ఈ విషయ పరిజ్ఞానం కూడ యెహోవాకు లోబడునట్లు ఫరోను పురికొల్పలేదు. బదులుగా, అహంకారియైన ఐగుప్తు పాలకుడు మూర్ఖంగా యెహోవాను ఎదిరించడంలో కొనసాగాడు.
నాల్గవ తెగులు సంభవించినప్పుడు, జోరీగలు దేశమంతా ప్రబలి, గాలివాటంగా యిండ్లలో దూరాయి, ఈ గాలిని వారు దేవతయగు షుకు లేదా ఆకాశరాణియగు ఐసిస్ దేవతకు ప్రతిరూపమని ఆరాధిస్తుండేవారు. ఈ కీటకము కొరకు ఉపయోగింపబడిన హెబ్రీపదము “జోరీగ,” “కందిరీగ,” “పేడపురుగు” అని అనువదింపబడింది. (న్యూ వరల్డ్ ట్రాన్స్‌లేషన్; సెప్టోజింట్; యంగ్) ఆ తెగులునందు ఒకవేళ పేడపురుగులు చేరియుంటే, ఐగుప్తీయులు పవిత్రమని ఎంచిన కీటకముల ద్వారానే బాధింపబడ్డ వారౌతారు, పైగా ప్రజలు తమ కాళ్లతో వాటిని త్రొక్కకుండా నడువగల్గి యుండేవారు కారు. ఏదిఏమైనా, ఈ తెగులు యెహోవాను గూర్చి ఫరోకు ఒక క్రొత్త సంగతిని నేర్పింది. ఈ జోరీగల బారినుండి తమ ఆరాధికులను ఐగుప్తు దేవతలు కాపాడలేకపోయిననూ, యెహోవా మాత్రం తన ప్రజలను సంరక్షించాడు. ఇది దీని తర్వాత సంభవించిన తెగుళ్లన్నీ ఇశ్రాయేలీయులను తప్ప ఐగుప్తీయులందరిని బాధించాయి.—నిర్గమకాండము 8:20-24.
ఐదవ తెగులువల్ల ఐగుప్తీయుల పశువులన్నింటి మీద రోగం సోకింది. ఈ దెబ్బ హాథర్, ఆపిస్ ఆలాగే ఆవు రూపంగల ఆకాశ దేవతయైన నట్‌లను అవమానపర్చింది. (నిర్గమకాండము 9:1-7) ఆరవ తెగులుగా ప్రజలకు, పశువులకు కలిగిన దద్దుర్ల తెగులు తోత్, ఐసిస్, ప్టా దేవతలను చిన్నబుచ్చింది, ఈ ముగ్గురు దేవతలకు స్వస్థతా సామర్థ్యమున్నట్లు తప్పుగా ఎంచడం జరిగేది.—నిర్గమకాండము 9:8-11.
ఉరుములు, పిడుగులతో కలిసి బహుగా కురిసిన వడగండ్లతో ఏడవ తెగులు సంభవించెను. ఈ దెబ్బ మెరుపులకు ప్రభువని తలంచిన రెష్పు దేవతకు, వర్షానికి పిడుగులకు యజమానుడని చెప్పబడిన తోత్‌కు అవమానకరమై యుండెను. (నిర్గమకాండము 9:22-26) ఎనిమిదవదిగా సంభవించిన మిడతల తెగులు సస్యసమృద్ధికి దేవతని తలంచిన మిన్‌పై యెహోవా ఉన్నతత్వాన్ని చూపింది. (నిర్గమకాండము 10:12-15) ఐగుప్తుకు సంభవించిన తొమ్మిదవ తెగులైన కారుచీకటి ఐగుప్తు సూర్యదేవతలైన రా, హోరస్‌లపై తామెందుకూ పనికిరామనే భావాన్ని కుమ్మరించింది.—నిర్గమకాండము 10:21-23.
వినాశనకరమైన తొమ్మిది తెగుళ్లు సంభవించిననూ, ఫరో ఇంకనూ ఇశ్రాయేలీయులను విడుదల చేయడానికి తిరస్కరించాడు. దేవుడు పదియవదైన చివరి తెగులు రప్పించి మనుష్యుల, జంతువుల తొలి సంతతిని హతము చేసినప్పుడు, అతని మూర్ఖత్వం కారణంగా ఐగుప్తు అధిక మూల్యం చెల్లించింది. ఫరోను దేవునిగా తలంచిననూ, అతని జ్యేష్ఠపుత్రుడు సహితం మరణించాడు. ఆ విధంగా యెహోవా ‘ఐగుప్తు దేవతలందరికిని తీర్పు తీర్చెను.’—నిర్గమకాండము 12:12, 29.
ఈ సమయంలో ఫరో మోషేను, అహరోనును పిలిచి వారితో యిలా అన్నాడు: “మీరును—ఇశ్రాయేలీయులును లేచి నా ప్రజల మధ్య నుండి బయలు వెళ్లుడి, మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించుడి. మీరు చెప్పినట్లు మీ మందలను మీ పశువులను తీసికొని పోవుడి; నన్ను దీవించుడి.”—నిర్గమకాండము 12:31, 32.
తన ప్రజలను సంరక్షించువాడు
ఇశ్రాయేలీయులు వెళ్లిపోయారు, అయితే త్వరలోనే వారు అరణ్యమందు గురిలేని వారిగా సంచరిస్తున్నట్లు ఫరోకు అనిపించింది. అతను అతని సేవకులు యిలా అనుకున్నారు: “మనమెందుకీలాగు చేసితిమి మన సేవలో నుండకుండ ఇశ్రాయేలీయులను ఎందుకు పోనిచ్చితిమి”? (నిర్గమకాండము 14:3-5) ఈ దాస జనాంగమును పోగొట్టుకొనుట ఐగుప్తునకు ఆర్థికంగా పెద్ద దెబ్బ తీస్తుంది.
ఫరో తన సైన్యంతో ఇశ్రాయేలీయులను పీహహీరోతు వరకు వెంబడించాడు. (నిర్గమకాండము 14:6-9) ఈ సైనిక చర్య ఐగుప్తీయులకు మంచిదిగా తోచింది, ఎందుకంటే ఇశ్రాయేలీయులు సముద్రానికి, పర్వతాలకు మధ్య చిక్కుబడియుండిరి. అయితే వారికి ఐగుప్తీయులకు మధ్య ఒక మేఘమునుంచుట ద్వారా యెహోవా ఇశ్రాయేలీయులను సంరక్షించాడు. ఐగుప్తీయులవైపు “అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను” ఆ విధంగా వారు ముట్టడి వేయకుండా అది వారిని అడ్డగించింది. మరోవైపున, ఆ మేఘము ప్రకాశమానంగావుండి ఇశ్రాయేలీయులకు “వెలుగిచ్చెను.”—నిర్గమకాండము 14:10-20.
ఐగుప్తీయులు వారిమీద పడి, నాశనము చేయవలెనని చూసిరిగాని వారిని ఈ మేఘము అడ్డుకొనెను. (నిర్గమకాండము 15:9) అది వైదొలగినప్పుడు, పరిస్థితి ఎంత అద్భుతంగా ఉండెను! ఎర్రసముద్రం నీరు పాయలుగా విడిపోగా, ఇశ్రాయేలీయులు ఆరిన నేలపై అవతలి ఒడ్డుకు దాటివెళ్తున్నారు! ఫరో అతని సైన్యం తమకు మునుపు దాసులుగా ఉన్నవారిని పట్టుకొని, కొల్లగొట్టవలెనని సముద్ర గర్భంలోకి దూసుకొనివచ్చారు. అయితే, అహంకార ఐగుప్తు పాలకుడు హెబ్రీయుల దేవున్ని తక్కువ అంచనావేశాడు. యెహోవా ఐగుప్తీయులను కలవరపరచి వారి రథచక్రములు ఊడిపడునట్లు చేశాడు.—నిర్గమకాండము 14:21-25.
“ఇశ్రాయేలీయుల యెదుటనుండి పారిపోదము రండి; యెహోవా వారిపక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని” ఐగుప్తీయుల బలిష్ఠులు కేకలువేశారు. ఫరోకు, అతని మనుష్యులకు ఈ గ్రహింపు చాలా ఆలస్యంగా వచ్చింది. సురక్షితంగా ఆవలి ఒడ్డుచేరిన మోషే సముద్రము మీద తన చెయ్యిచాపగా, ఆ నీరంతయు తిరిగి పొర్లినందున, ఫరో అతని సైన్యము హతమయ్యింది.—నిర్గమకాండము 14:25-28.
అనుభవం ద్వారా పాఠాలు నేర్పబడెను
కాబట్టి, యెహోవా ఎవరు? ఆ ప్రశ్నకు అహంకార ఫరోకు జవాబు దొరికింది. ఐగుప్తు సంఘటనలు యెహోవా అద్వితీయ సత్యదేవుడని, జనాంగముల ‘వట్టి దేవతలవంటి’ వాడు ఎంతమాత్రము కాడని ప్రదర్శించాయి. (కీర్తన 96:4, 5) తన అధికబలము చేత యెహోవా “భూమ్యాకాశములను సృజించాడు.” ‘సూచక క్రియలు, మహత్కార్యములు జరిగిస్తూ, మహాబలము కలిగి, మహాభయము పుట్టించి, ఐగుప్తు దేశమునుండి తన ప్రజలను రప్పించిన’ వానిగా ఆయన గొప్ప విమోచకుడునై యున్నాడు. (యిర్మీయా 32:17-21) యెహోవా తన ప్రజలను కాపాడగలడని ఇదెంత చక్కగా నిరూపించింది!
చేదు అనుభవాల ద్వారా ఫరో ఆ పాఠాలు నేర్చుకున్నాడు. నిజానికి, చివరి పాఠం అతని ప్రాణాల్నే బలిగొంది. (కీర్తన 136:1, 15) “యెహోవా ఎవరు?” అని వినయంతో అడిగివుంటే, అతడు జ్ఞాని అనిపించుకునేవాడు. ఆ పిమ్మట, ఆ పాలకుడు తనకు లభించిన జవాబు కనుగుణంగా ప్రవర్తించి యుండగల్గేవాడు. సంతోషదాయకంగా, నేడు అనేకమంది వినయస్థులు యెహోవా ఎవరో నేర్చుకుంటున్నారు. మరి ఆయన ఎలాంటి వ్యక్తిత్వం కల్గియున్నాడు? మననుండి ఆయనేమి కోరుచున్నాడు? తర్వాతి శీర్షిక యెహోవా అను అద్వితీయ నామముగల దేవునియెడల మీ మెప్పు నధికం చేయవచ్చును.—కీర్తన 83:18.
[3వ పేజీలోని చిత్రసౌజన్యం]
Pictorial Archive (Near Eastern History) Est.