“మీరు . . . తన నామమునుబట్టి చూపిన ప్రేమను” దేవుడు మరచిపోడు
“మీరు చేసిన కార్యమును, మీరు పరిశుద్ధులకు ఉపచారముచేసి యింకను ఉపచారము చేయుచుండుటచేత తన నామమునుబట్టి చూపిన ప్రేమను మరచుటకు, దేవుడు అన్యాయస్థుడు కాడు.” (హెబ్రీయులు 6:10) అపొస్తలుడైన పౌలు చెప్పిన ఈ మాటలు తూర్పు యూరపులోని యెహోవాసాక్షుల విషయంలో సత్యమై యున్నవి. దేవుని నామము కొరకు ఆసక్తితో నమ్మకముగా సేవచేయు నిమిత్తం వారు, సోవియట్ అధీనమందలి మాజీ ప్రభుత్వాలు విధించిన నిషేధముల క్రింద దశాబ్దముల పాటు శ్రమపడ్డారు. యెహోవా వారి సత్క్రియలను జ్ఞాపకం చేసుకొని వారిపై రాజ్యాశీర్వాదములను కుమ్మరిస్తున్నాడు. ఉదాహరణకు, అక్కడున్న మూడు ప్రాంతాలలోని గత సేవా సంవత్సరపు నివేదికను మాత్రమే చూద్దాము.
మాజీ సోవియట్ యూనియన్ ప్రాంతాలు
మాజీ సోవియట్ ప్రాంతాలు తమ 1992 సేవా సంవత్సరంలో రాజ్యప్రచారకులు 35 శాతం అనగా 49,171 నుండి 66,211కు పెరిగినట్లు శిఖరాగ్ర సంఖ్యలు నివేదిస్తున్నవి! అయితే అది మాత్రమే కాదు, ఆ ప్రచారకులు చాలా చురుకుగా ఉన్నారనే విషయాన్ని మనం పత్రికలతో సహా, బైబిలు సాహిత్యాల అందింపు పెరుగుదలలో చూడగలం. అధిక సంఖ్యలో అనగా 16,54,559 బ్రొషూర్లను, బుక్లెట్లను కూడా వారు అందించారు. ఇది పోయిన సంవత్సరపు సంఖ్య 4,77,235 కంటే రెండింతలు ఎక్కువ ఉన్నది! ఈ సాహిత్య అందింపులన్నింటి ప్రతిస్పందన ఏమైయున్నది? గృహ బైబిలు పఠనాల సంఖ్య రెండింతలుగా పెరిగిపోయినవి. ప్రస్తుతం 38,484 బైబిలు పఠనములు నిర్వహింపబడుతున్నవి.
ఆలాగే, సహాయ పయినీర్ సేవలో భాగం వహించడం 94 శాతానికి పెరిగింది. ఇది పోయిన సంవత్సరపు 6,570తో పోలిస్తే క్రొత్తగా బాప్తిస్మం పొందిన శిష్యులు 26,986 విశిష్ఠ సంఖ్యకు, అనగా ఆశ్చర్యం కల్గించే 311 శాతానికి పెరుగుటకు దోహదపడింది!
క్రొత్తగా బాప్తిస్మం పొందిన వారిలో కొందరికి సువార్తయందు మొదట ఎలా ఆసక్తి కలిగింది? కొన్నిసార్లు ఆ పఠనం చేస్తున్న సాక్షియొక్క మిగుల శ్రద్ధే దానికి కారణం. మోల్డోవె నుండి ఒక సంఘాధ్యక్షుడు యిలా వివరిస్తున్నాడు:
“గతంలో బైబిలు సత్యమందు ఆసక్తి కనబరచిన ఒక స్త్రీని నేను నా భార్య సందర్శించాము. ఆమెతో బైబిలు పఠనం ప్రారంభించాము. అయితే, ఆమె భర్త ఎలాంటి శ్రద్ధ చూపలేదు. ఆ పఠనం నిర్వహించడానికి ఒకరోజు మేము ఆమె యింటికి బయల్దేరాము, చలి విపరీతంగావుండి, మంచు కురుస్తుంది. వీధుల్లో దాదాపు ఎవరూ లేదు, అయినప్పటికిని, మేము సరిగ్గా అనుకున్న సమయానికి ఆమె యింటికి చేరుకున్నాము. అప్పుడామె తన భర్తతో ఇలా అంది: ‘చూశారా వీరు మన కొరకు ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారో? మంచు కురుస్తున్ననూ వారు సరిగ్గా సమయానికి వచ్చారు.’ ఈ సంఘటన ఆమె భర్తను ఆలోచింపజేసింది. ఆయన తన మనస్సు మార్చుకుని పఠనంలో మాతో చేరాడు, ఇప్పుడా భార్యాభర్తలిద్దరూ బాప్తిస్మం పొందిన సాక్షులయ్యారు.”
మరికొన్నిసార్లు సాక్షి చూపించే మర్యాద సువార్తయందు ఆసక్తి రేకెత్తించవచ్చును. మోల్డోవెలోవున్న మరో పెద్ద కూడ ఈ అనుభవాన్ని కలిగియున్నాడు:
“మేము ప్రకటించు ప్రాంతంలో యెహోవాసాక్షుల యందు ఆసక్తిచూపని ఓ వ్యక్తిని నేను కలిశాను. తన తండ్రి తాతలవలె తాను కూడ ఈస్ట్రన్ ఆర్థోడాక్స్ చర్చి సభ్యుడని అతడు చెప్పాడు. కాబట్టి తన యింటి ఆవరణనుండి బయటకు వెళ్లిపొమ్మని నాతో చెప్పాడు. అయితే, అలా వెళ్లకముందు, నేను వచ్చిన కారణాన్ని ఆయనకు చెప్పే అవకాశాన్ని ఆయన నాకిచ్చాడు. ‘మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమియ్యుడి’ అని చెప్పిన మత్తయి 28:19 చూపించాను. ఆ పిమ్మట నేను మన కూటములు జరిగే స్థలం అడ్రసిచ్చి వెనుదిరిగాను. నాకు ఆశ్చర్యమేసింది, ఒక వారం తర్వాత ఈ మనిషి మన కూటాలకు వచ్చాడు! ఆ కార్యక్రమమంతా ముగిసేవరకు ఆయనక్కడే వున్నాడు. నాతో అమర్యాదగా ప్రవర్తించినందుకు ఆ వారమంతా తను బాధపడ్డాడని అతను నాతో చెప్పాడు. వెంటనే ఆయనతో బైబిలు పఠనం ప్రారంభించాను. మరిప్పుడాయన మన సహోదరులలో ఒకడైనాడు.”
ఆ ప్రాంతమందలి మన సహోదరుల అవసరతలు తీర్చుటకు అమితంగా ప్రతిస్పందించడం ఆ సేవా సంవత్సరంలో మరొక ముఖ్యమైన విషయం. అవసరతలో ఉన్నవారి కొరకు 1991/92 శీతాకాలంలో, 400 టన్నుల ఆహార పదార్థాలు, స్త్రీలకు పురుషులకు, పిల్లలకు పెద్దయెత్తున వస్త్రాలు పంపడం జరిగింది. వీటన్నింటిని సైబీరియాలోని ఇర్క్స్తక్ మరియు జపానుకు సమీపమందలి కాబోరోవస్క్ వరకు మాజీ సోవియట్ యూనియన్‌లోని అన్ని ప్రాంతాలకు పంచిపెట్టడం జరిగింది. నిజంగా తన నామము కొరకు మన సహోదరులు చూపిన ప్రేమను యెహోవా మరచిపోలేదనుటకు ఇదొక బలమైన సూచన! యెహోవా ఆత్మ ప్రేరేపించిన సహోదర ప్రేమ వారిని ప్రపంచవ్యాప్త కుటుంబముతో ఐక్యపరచింది. ఉదాహరణకు, ఉక్రేయిన్లోని ఒక సహోదరి బ్రాంచి కార్యాలయానికి యిలా వ్రాసింది:
“మీరందించిన సహాయం మా హృదయాల్ని స్పర్శించింది. మా కన్నీళ్లు ఆగలేదు, మమ్ములను మరిచిపోనందుకు మేము యెహోవాకు కృతజ్ఞత చెల్లించాము. నిజమే మాకు ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులున్నాయి, అయితే పశ్చిమ దేశాల మన సహోదరుల నుండి వచ్చిన సహాయానికి మేమెంతో కృతజ్ఞులము, మేము మరలా ఆర్థికముగా పుంజుకున్నాము. ఇప్పుడు, మీ సహాయం మూలంగా, మా కుటుంబం యెహోవా సేవలో ఎక్కువ సమయం వెచ్చించడానికి వీలగుతున్నది. యెహోవా చిత్తమైతే, వేసవి నెలల్లో నేను, మా అమ్మాయి సహాయ పయినీర్ సేవ చేస్తాము.”
అంతేకాకుండ, సహాయక చర్యలు బయటి వారికి మంచి సాక్ష్యమిచ్చేందుకు దోహదపడ్డాయి, కారణమేమనగా చూసేవారు సాక్షులు క్రియాత్మకంగా తమ ప్రేమను ప్రదర్శించడాన్ని చూడగల్గారు. మరొక సంఘం నుండి ఒక కుటుంబం యిలా వ్రాసింది: “మాకు ఆహారం, వస్త్రాలు సహాయంగా అందాయి. మీరిచ్చిన మద్దతు, ప్రోత్సాహం మేము కూడ ఇతరులకు మేలు చేయాలనే పాఠాన్ని నేర్పాయి. ప్రేమతో చేయబడిన ఈ పనిని ఇతరులు, ఆసక్తిగల వ్యక్తులు వారి కుటుంబాలు గమనించలేదు; నిజమైన సహోదరత్వాన్ని గూర్చి అదొక గొప్ప సాక్ష్యమై యుండెను.”
తన సాక్షులు ఎంతో కష్టపడి చేసిన సేవపై మరియు తన నామాన్ని తెలియజేయుటకు వారు చూపిన ప్రేమపై యెహోవా ఆశీర్వాదమున్నదనుటకు గత జూన్, జూలై నెలల్లో “వెలుగు ప్రకాశకులు” అనే మూలాంశంతో జరిగిన ఐదు జిల్లా సమావేశాలు ఒక అంతర్జాతీయ సమావేశం మరొక నిదర్శనమై యుండెను. ఆ సమావేశాలకు 91,673 మంది హాజరుకాగా, 8,562 మంది బాప్తిస్మం పొందారు. అంతర్జాతీయ సమావేశం జరిగిన సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని కిరోవ్ స్టేడియంలో, ప్రపంచం నలుమూలల నుండి అనగా దాదాపు 30 దేశాలనుండి వచ్చిన ప్రతినిధులతో కలిపి మొత్తం 46,214 మంది సమావేశమయ్యారు.
సైబీరియాలో కేవలం చూద్దామనే తలంపుతో ఒక 60 ఏళ్ల వృద్ధుడు ఇర్క్స్తక్లోని సమావేశ స్థలానికి వచ్చాడు. ఆయనిట్లన్నాడు: “హాజరైన వారందరు చక్కని వస్త్రాలతో, చిరునగవులతో, పరస్పరం దయాపూర్వకంగా వున్నారు. ఈ ప్రజలు ఒకే కుటుంబం వారివలె వున్నారు. వారు కేవలం స్టేడియంలోనే కాదు జీవితంలో కూడ స్నేహితులై యున్నారని ఒకడు భావించగలడు. నేను అద్భుతమైన బైబిలు సాహిత్యాలు పొందాను, అది ఎటువంటి సంస్థయో కూడ మరింత చక్కగా నేర్చుకున్నాను. నేను యెహోవాసాక్షులతో కలిసి ఉండాలని, వారితో బైబిలు పఠించాలని కోరుకుంటున్నాను.”
ఐదువేల యాభైఒక్క మంది హాజరైన అదే ఇర్క్స్తక్ సమావేశానికి సైబీరియా, యాకుత్ రిపబ్లిక్ నుండి వచ్చిన ఆసక్తిగల ఒక స్త్రీ యిలా వ్యాఖ్యానించింది: “నేనా ప్రజలను చూసినప్పుడు, ఆనందంతో కేకలు వేయాలనిపించింది. అలాంటి ప్రజలను తెలుసుకోవడానికి సహాయపడినందుకు యెహోవాకు నేనెంతో కృతజ్ఞురాలను. ఈ సమావేశంలో నేను సాహిత్యాలు తీసుకున్నాను, దీనిని గూర్చి నేను ఇతరులతో మాట్లాడాలని కోరుకుంటున్నాను. యెహోవా ఆరాధికురాల్ని కావాలని నేను అమితంగా కోరుకుంటున్నాను.”
ఖజకిస్తాన్‌లోని ఆల్మా ఆటా సెంట్రల్ స్టేడియంలో జరిగిన సమావేశానికి 6,605 మంది హాజరయ్యారు. అక్కడొక డైరెక్టర్ ఈ క్రింది విధంగా చెప్పాడు: “మీ దృక్పధానికి నేను ముగ్ధున్నయ్యాను. పిల్లలేమి, పెద్దలేమి మీరందరు గౌరవపూర్వకమైన ప్రజలని నేనిప్పుడు ఒప్పుకుంటాను. దేవున్ని నమ్ముతానని నేను చెప్పలేను, కాని ఆత్మీయ, వస్తు విలువల యెడల మీ దృక్పధంలో మీ సహోదరత్వం ద్వారా అందజేయబడిన పవిత్ర సంగతులను నేను నమ్ముతాను.”
ఆల్మా ఆటా సమావేశం దగ్గర ఒక పోలీసు అధికారి యిలా అన్నాడు: “రెండు సమావేశాల్లో నేను మిమ్ములను చూశాను. యెహోవాసాక్షులతో కలిసి పనిచేయడం అత్యంత ఆనందదాయకం.”
రుమేనియా
తన నామమును బట్టి రుమేనియాలోని మన సహోదరులు చూపిన ప్రేమను సహితం యెహోవా మరచిపోలేదు. గత సేవా సంవత్సరంలో సాక్షులు అనేక సంతోషకరమైన సంఘటనలను చవిచూశారు. మొదటిది, బుచారెస్ట్‌లో బ్రాంచి కార్యాలయం మరలా ఒకసారి స్థాపించబడింది. ప్రభుత్వానుసారమైన చట్టబద్ధ సేవ 1949లో ఆపుజేయబడింది. కొత్త వసతులున్న కార్యాలయములో 20 మంది సహోదర సహోదరీలు పనిచేస్తున్నారు. ఆ బ్రాంచి కార్యాలయము 24,752 మంది ప్రచారకుల అవసరాలు తీరుస్తున్నది. క్రితమెన్నటి కంటె ఈ అత్యధిక ప్రచారకుల సంఖ్య ఏప్రిల్‌లో నివేదించబడగా, యిది గత సంవత్సరం కంటే 21 శాతం అభివృద్ధిని సూచిస్తున్నది.
రహస్యంగా అనేక సంవత్సరాలు ప్రకటించిన తర్వాత, బహిరంగముగా ఇంటింట సాక్ష్యమిచ్చు పనికి చక్కగా సరితూగగల్గుతున్నారు. ప్రయాణించే సమయంలో కూడ ఇతరులకు ప్రకటించే ఎలాంటి అవకాశమునైనను కొంతమంది సాక్షులు ఎలా సద్వినియోగపరచుకుంటున్నారో మ్యూరెస్ కౌంటీ నుండి వచ్చిన అనుభవము చూపిస్తున్నది. ఆ బ్రాంచి కార్యాలయము యిలా వ్రాస్తుంది:
“ఒక ప్రచారకుడు రైలులో ఒక బోగి నుండి మరో బోగికి వెళ్లి ప్రకటించడానికి తీర్మానించుకున్నాడు. ప్రజల ప్రతిస్పందన మామూలుగా అనుకూలంగానే ఉంది, అయితే చివరి బోగిలో కొన్ని కష్టాలు ఎదురయ్యాయి. ప్రయాణికులలో ఎవరూ మన పత్రికలలో ఒక్కటికూడ అంగీకరించడానికి యిష్టపడలేదు. చివరకు, ఒక వ్యక్తి కోపంతో లేచి నిలువబడి యిలా అరిచాడు: ‘నేను నీ పత్రికలన్నీ తీసి కిటికిలోనుండి అవతల పారేస్తానంతే! మీ మతంతో మమ్మల్ని ఎందుకింత ఇబ్బందిపెడుతున్నావు?’ దానికి ఆ ప్రచారకుడు, మీరలా పత్రికల్ని విసిరితే, ఆయనచేసిన ఆ పని ద్వారా వేరొకరు, అనగా బయటపడ్డ ఆ పత్రికల్ని తీసుకునేవారు ప్రయోజనం పొందగలరని మర్యాదపూర్వకంగా బదులిచ్చాడు. ఆ ప్రచారకుని శాంత స్వభావాన్ని గమనించిన, ఆ వ్యక్తి ఎంతగా ముగ్ధుడయ్యాడంటే తనే స్వయంగా ఆ పత్రికల్ని తీసుకుని ఆ బోగీలోవున్న ఇతర ప్రయాణికులకు పంచిపెట్టడం ఆరంభించాడు. ఆశ్చర్యకరమైన విషయమేమంటే, అందరూ ఒకొక్క పత్రికను తీసుకున్నారు. వాటిని పంచిన తర్వాత, ఆ పంచిన వ్యక్తికి ఒక్క పత్రిక కూడ మిగలలేదు. అందువలన, ఆ ప్రచారకుడు ఆయన్నిలా అడిగాడు: ‘సర్, మీకొరకు మరి పత్రికలేమి అవసరం లేదా?’ దానితో రెండు పత్రికలను కలిగియున్న ప్రయాణికుని నుండి ఒక పత్రిక తీసుకుని యిలా అన్నాడు: ‘ఇదిగో, నాకుకూడ ఓ పత్రిక దొరికింది!’”
అనేక దేశాల్లో యెహోవాసాక్షుల ప్రకటించు పని కొన్నిసార్లు క్రైస్తవమత సామ్రాజ్య మతనాయకుల వ్యతిరేకతను తెచ్చింది. రుమేనియాలో, ఆర్థొడాక్స్ చర్చి మతబోధకులు సాక్షులంటే తరచు కోపం తెచ్చుకుంటారు. అయితే తన నామమును బట్టి వారు చూపిన ప్రేమకు తన ప్రజలను ఆశీర్వదించుటను ఇది ఆపుచేయజాలదు. ఒక ప్రాంతీయ కాపరి యిలా వ్రాస్తున్నాడు:
“స్థానిక సంఘముతో కలిసి మేము సేవకై పల్లె ప్రాంతాలకు వెళ్లాము. మొత్తం వందమంది సహోదరులు ఉండిరి. ఒక బస్సు బాడుగకు మాట్లాడుకొని దాదాపు 50 కిలోమీటర్ల దూరంలోగల ఒక చిన్న పట్టణానికి మేమందరం వెళ్లాము. టౌన్ హాలులో ఏర్పాటు చేయబడిన బహిరంగ ప్రసంగానికి మేము చాలామందిని ఆహ్వానించాము. కూటము అలా ఆరంభమైందో లేదో, మా కూటాన్ని పాడుచేయడానికని ఒక ఆర్థొడాక్స్ చర్చి మతబోధకుడు అక్కడకు వచ్చాడు. పోలీసు అధికారులు ఆ మతబోధకున్ని ఆపుజేయడానికి ప్రయత్నించారు. అయినప్పటికిని అతడు శాంతించలేదు. చివరకు ముఖద్వారంయొక్క తలుపు అద్దాన్ని పగులగొట్టుట ద్వారా అతడు ఆ కూటాన్ని ఆపుజేయగలిగాడు. అయితే, ఆ మత బోధకుని ప్రవర్తనను అనేకమంది స్థానికులు నిరసించారు. దానితో అక్కడ హాజరైన వారందరికి సంపూర్ణంగా సాక్ష్యమిచ్చి, పెద్దయెత్తున సాహిత్యాలు అందించడం జరిగింది.”
దురదృష్టకరమైన విషయమేమంటే, దేశంలోని కొన్ని ప్రాంతాలలో కొద్దిమంది సాక్షులు మాత్రమే కలరు. ఓల్ట్ కౌంటికి ఒక క్రమ పయినీర్ మొదట వచ్చినప్పుడు, ఆ కౌంటీ అంతటిలో తొమ్మిది మంది సహోదరులను, ప్రకటించాల్సిన పెద్ద ప్రాంతం ఉండడాన్ని ఆయన కనుగొన్నాడు. ఒక సంవత్సరం తర్వాత సాక్షుల సంఖ్య 27కు వృద్ధికాగా, వారిలో ఐదుగురు మరలా క్రియాపూర్వక ప్రచారకులుగా చేయబడిరి. అసలు సాక్షులే లేని కొరొబ్యా పట్టణంలో ఆ పయినీర్ తన బస ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడ సాక్షులు కేవలం 45 దినములున్న తర్వాత, స్థానిక మతాచారి ఒకరు క్రెయెవో పట్టణ రేడియోలో వారి సేవకు వ్యతిరేకంగా మాట్లాడాడు. ప్రజల మతాన్ని మార్చడానికి ప్రయత్నిస్తూ, వారు తమ బోధలతో కొరొబ్యా పట్టణంపై “దండెత్తారని” ఆయన అన్నాడు. ఆ ప్రాంతంలో సాక్షుల సేవను ఆపుచేయడానికి, వారికున్న పేరును పాడుచేయడానికి దాడులు కొనసాగాయి. బుచారెస్ట్‌లో జిల్లా సమావేశానికి సహోదరులు హాజరైన సమయంలో అదంతా పరాకాష్టకు చేరింది. చర్చి సర్వీస్ తర్వాత కొరొబ్యా ఆర్థోడాక్స్ మాతాచారి తీవ్రంగా యిలా ప్రకటించాడు: “తమ సాహిత్యాలతో ప్రాంతాన్నంతా నింపి ప్రజలను విషపూరితం చేసిన సాక్షులపై చర్య తీసుకొనేటట్లు పోలీసులపై వత్తిడి తెచ్చేందుకు మనమందరం ఒక వీధి ప్రదర్శన చేయాలి.” అయితే ఆ మీటింగ్ జరగాల్సిన ముందు రాత్రి, అసాధారణమైన సంఘటనొకటి జరిగింది. పోకిరి మూకొకటి ఆ కెథడ్రిల్ను, పట్టణ సాంస్కృతిక గృహాన్ని నాశనం చేశారు. దానితో, ఆ నిరసన కూటము జరుగనే లేదు!
యుగోస్లావియా
యుగోస్లావియాలోని సహోదరులకు 1992వ సేవా సంవత్సరం అత్యంత కష్టతరమైన సంవత్సరంగా ఉండెను. అయితే, కొన్నిసందర్భాలలో వారు ఆనందకరమైన అనుభవాల్ని కలిగియుండిరి. కృతజ్ఞతాపూర్వకమైన విషయమేమంటే, వారి సేవను, ఆయన నామమును బట్టి వారు చూపిన ప్రేమను యెహోవా మరచిపోడు.
మొదట స్లొవేనియాలో, తర్వాత క్రోషియాలో అటు పిమ్మట బోస్నియా, హెర్జిగోవినాల్లోకి యుద్ధం ప్రాకింది. కేవలం ఒక్క సంవత్సరంలోనే, ఒక రిపబ్లిక్నుండి ఐదు రాష్ట్రాలు తమ స్వంత సరిహద్దులను, చట్టాలను, కరెన్సీని స్థాపించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. వందలాది మంది సాక్షులు తమ గృహాలు వదిలి పారిపోయి ఇతర ప్రాంతాలలోని తమ సహోదరులయొద్ద తల దాచుకోవాల్సివచ్చింది. అదే ప్రకారం తూర్పు ఐరోపాలోని ఇతర దేశాల్లోవలెనే, అవసరతలోనున్న సహోదరులకు బస, ఆహారము, వస్త్రాలు అందించడం శ్రద్ధ తీసుకోవడానికి పెద్ద నగరాలలో అత్యవసర కమిటీలు నియమించబడ్డాయి. సేవా సంవత్సరంలో విపత్కర పరిస్థితులున్న ప్రాంతాల సంఘాలల్లోని సహోదరులకు దాదాపు 55 టన్నుల ఆహారం సరఫరా చేయబడింది. తత్సంబంధముగా అనేక అభినందన లేఖలు అందాయి.
డుబ్రొవ్యిక్లోని సహోదరులు తమకు చేయబడిన సహాయానికి తామెంత కృతజ్ఞత కలిగియున్నారో వివరించారు. ఒక సహోదరి ఆహారపు పొట్లంతో యింటికి తిరిగి వెళ్లినప్పుడు, ప్రక్కింటావిడ ఆమె గ్రుడ్లు ఎక్కడ కొన్నదని అడిగింది. మరో ప్రాంతంలోని ఆమె ఆత్మీయ సహోదరులు వాటిని పంపారని ఆమెతో చెప్పింది. ఆ ప్రక్కింటావిడ ఆశ్చర్యపోయింది. మరో ప్రాంతంలో స్లొవేనియా నుండి వచ్చిన అపరిచితుడైన ఓ వ్యక్తి ఒక పెద్దను కలిసికొని యిలా అన్నాడు: “యెహోవాసాక్షులు తమ సహోదరుల నుండి అందుకున్న ఆహారాన్ని సక్రమంగా పంచుతున్నారని నేను విన్నాను. నేను ప్రజలకు అనేక పార్సిళ్ల ఆహారాన్ని పంపాను; అయితే అవి నేను పంపిన గమ్యానికి చేరనేలేదు. నేను అటువంటి సహాయక వస్తువుల్ని పంపిస్తే, మీరు వాటినలా పంచగలరా?” అంతేకాకుండా, వార్తాపత్రికలు, రేడియో మన సహాయక చర్యలను గూర్చి మెచ్చుకునే నివేదికలందించాయి.
జాగ్రెబ్ అంతర్జాతీయ సమావేశమందు 1991లో బాప్తిస్మం పొందిన ఒక సహోదరుడు పెరుగుతున్న కష్టాలను ముందే పసిగట్టి ఒక ఆహారపు దుకాణాన్ని మొత్తం కొనేశాడు. యుద్ధం జరుగుతున్న ప్రాంతానికి సమీపంలోనున్న తన యింటికి ఆయన ఈ ఆహారాన్ని తీసుకెళ్లాడు. ఆహార కొరత మరింత జటిలమైనప్పుడు, ఇది సహోదరులకు నిజమైన ఆశీర్వాదముగా ఉండెను.
సారజివొలో చిక్కుబడిన సహోదరులకు ముఖ్యమైన ఆహారం తీసుకెళ్లే పెద్ద ట్రక్కుకు అనుమతి సంపాదించడం సాధ్యమయ్యింది. ఆహారాన్ని వారికి విజయవంతంగా అందించగల్గామని చెప్పడానికి మేము సంతోషిస్తున్నాము.
ఆ పోరాటం అనేకమంది పౌరుల ప్రాణాలను బలిగొన్నది. విచారకరమైన విషయమేమంటే, సేవా సంవత్సర ముగింపునాటికి మన సహోదర సహోదరీలు ఆరుగురు, ఆసక్తిపరులైన వ్యక్తులు ఇద్దరు తమ ప్రాణాలు కోల్పోగా, మరికొంతమంది గాయపడ్డారు.
అయితే, ప్రధానంగా అనేక అనుభవాలు చూపించేదేమంటే యెహోవాసాక్షుల్లో ఒకరిగా ఉండడం రక్షణప్రదమైనది. ఒక సందర్భంలో బెల్గ్రెడ్లో జిల్లా సమావేశానికి సహోదరులు ప్రయాణమై వెళ్లుచుండగా సైనికులు ఆ బస్సును ఆపి, ఫలనా మతస్థులు వారిలో ఉన్నారా అని అడిగారు. దానికి సహోదరులు అలా వారిలో ఎవరూ లేరని సమాధానమిచ్చారు. అయితే వారు తమ గుర్తింపు కార్డులను చూపించవలసి యుండిరి, కాగా వారిలో కొందరి పేర్లు ఆ ఫలాని మతానికి చెందిన వారన్నట్లు సూచించినవి. వారు అబద్ధం చెబుతున్నారని ఆ సైనికులు నిందించగా, సహోదరులు తాము చర్చినుండి విరమించుకున్నట్లు తెల్పే తమవద్దనున్న నోటీసు పత్రాలను చూపించి, ఆ మతంలో జన్మించినను తామిప్పుడు యెహోవాసాక్షులని, తమ సమావేశానికి వెళ్తుతున్నామని చెప్పారు. దీనితో ఆ సైనికులు వారిని వెళ్లనిచ్చారు.
పయినీర్లు అమితాసక్తితో తమ సేవయందు కొనసాగుతున్నారు, అందువల్ల యిది సేవకు నిజమైన స్ఫూర్తి నిచ్చేదిగా నిరూపించబడింది. ది వాచ్‌టవర్ కడు రమ్యమైన నాలుగు రంగులతో ఆ ప్రాంతమందలి ముఖ్యమైన భాషలన్నింటిలోను ఏకకాలంలో అనువదించబడుతున్నది. సత్యాన్ని, నీతిని ప్రేమించే వారందరికి అది క్రమంగా “తగిన కాలమున” ఆత్మీయ “ఆహారము” అందిస్తున్నది. (లూకా 12:42) ఈ 1992 సేవా సంవత్సరంలో, 674 మంది క్రొత్త సహోదర సహోదరీలు బాప్తిస్మం పొందారు.
తన నామమును బట్టి తూర్పు యూరపులోని సహోదరులు చూపిన ప్రేమను, సేవను దేవుడు నిశ్చయంగా మరచిపోలేదు. అంతేకాదు, వారెక్కడ జీవించినను తన ఆరాధికులందరు పౌలు పిదప హెబ్రీయులు 6:11లో యిచ్చిన సలహాను పాటించవలెనని యిచ్ఛయిస్తున్నాడు. అక్కడిలా వుంది: “మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిదివరకు కనుపరచిన ఆసక్తిని తుదమట్టుకు కనుపరచవలెనని అపేక్షించుచున్నాము.”