వాగ్దాన దేశమునుండి దృశ్యాలు
గెరిజీము—‘ఈ పర్వతం మీదే మేము ఆరాధించాము’
బావి దగ్గర సమరయ స్త్రీ. సుఖారను సమరయ పట్టణములో “యాకోబు [నీటిబుగ్గగల] బావి” నొద్ద యేసు ఒక స్త్రీకి తటస్థ సాక్ష్యమిచ్చిన ఆ వృత్తాంతాన్ని, ఆ మాట మీకు గుర్తుకు తేవడం లేదా? ఆ భావగర్భిత సంఘటనకు సంబంధించి మీ దృష్టికి మీరు మరింత పదును పెట్టాలనుకుంటున్నారా?—యోహాను 4:5-7.
పైనున్న ఆ రెండు పర్వతాలను గమనించండి, అవి యెరూషలేముకు ఉత్తరాన దాదాపు 50 కిలోమీటర్ల దూరాన ఉన్నాయి.a అటు ఎడమవైపు (దక్షిణాన) చెట్లతో నిండివున్నదే గెరిజీము; అది సారవంతముగా, కడు రమ్యముగా ఉండుటకు అక్కడి విస్తారమైన నీటిబుగ్గలు దోహదపడతాయి. కుడివైపున (ఉత్తరాన) కాస్త ఎత్తుగా, అయితే రాళ్లతో బంజరుగా ఉన్నదే అదే ఏబాలు.
ఆ రెంటికి మధ్యగా సారవంతమైన షెకెము లోయవుంది. దేవుని స్నేహితుడగు (ఆ తర్వాత అబ్రాహామని పిలువబడిన) అబ్రాము ఆ వాగ్దాన దేశముగుండా ప్రయాణించినప్పుడు, ఆయన షెకెములో ఆగడాన్ని మీరు జ్ఞాపకం తెచ్చుకోండి. ఆయనకు అంతకుముందే ప్రత్యక్షమై, ఈ దేశాన్ని అతని సంతానానికి ఇస్తానని వాగ్దానం చేసిన యెహోవాకు ఆయన ఇక్కడొక బలిపీఠాన్ని కట్టాడు. (ఆదికాండము 12:5-7) అటువంటి వాగ్దానం చేయడానికి ఆ దేశం నడిబొడ్డే ఎంత సరియైన స్థలం! ఇటు గెరిజీము లేదా అటు ఏబాలు శిఖరం అంచునుండి పితరుడు ఆ వాగ్దాన దేశపు అధిక భాగాలను చూడగలడు. తీరం నుండి యొర్దాను లోయకు మధ్యనున్న తూర్పు పడమర రహదారికి దగ్గరున్న ఉత్తర దక్షిణ పర్వత రహదారిలోనున్న షెకెము (ఆధునిక నాబ్లుస్) ఒక ప్రముఖ పట్టణమై యుండెను.
ఇక్కడ కేవలం అబ్రాహాము నిర్మించిన బలిపీఠమే గుర్తింపదగిన మతారంభమై యుండెను. ఆ తర్వాత, ఈ ప్రాంతములో యాకోబు స్థలంకొని సత్యారాధనను కొనసాగించాడు. ఆయన గెరిజీము క్రిందిబాగాన ఒక లోతైన బావి కూడ త్రవ్వాడు లేదా డబ్బిచ్చి త్రవ్వించాడు. శతాబ్దాల తర్వాత ఆ సమరయ స్త్రీ యేసుతో యిలా చెప్పింది: “యీ బావినీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రియగు యాకోబు.” దానికి నీటిబుగ్గ ఆధారమై యుండవచ్చును, గనుకనే అపొస్తలుడైన యోహాను దానిని “యాకోబు [నీటిబుగ్గ] బావి” అని వివరించాడు.
గెరిజీము, ఏబాలు సంబంధముగా సత్యారాధనను గూర్చిన ప్రస్తావన మోషే నిర్దేశించినట్లుగా, యెహోషువ ఇశ్రాయేలీయులను ఇక్కడికి తీసుకురావడం కూడ మీకు జ్ఞాపకం రావచ్చును. యెహోషువ “ధర్మశాస్త్ర వాక్యములన్నింటిని అనగా దాని దీవెన వచనమును దాని శాపవచనమును” చదువుచుండగా ప్రజలలో సగము మంది గెరిజీము ఎదుటను మిగిలిన వారు ఏబాలు ఎదుటను నిలువబడిన విషయాన్ని ఊహించండి. (యెహోషువ 8:30-35; ద్వితీయోపదేశకాండము 11:29) అనేక సంవత్సరాల తర్వాత, యెహోషువ తిరిగివచ్చి వారికిచ్చిన చివరి ఉపదేశమందు యిలా అన్నాడు: “నేనును నా యింటి వారును యెహోవాను సేవించెదము.” ఆలాగే చేస్తామని ఆ ప్రజలు నిబంధనా పూర్వకంగా ఒప్పుకున్నారు. (యెహోషువ 24:1, 15-18, 25) అయితే వారు నిజంగా అలా చేశారా?
దీని జవాబును బట్టి సమరయ స్త్రీతో యేసు చేసిన సంభాషణను అర్థం చేసుకోవడానికి ఇది మీకు సహాయం చేయవచ్చును. అబ్రాహాము, యాకోబు, యెహోషువలు అనుసరించిన సత్యారాధన ఇక్కడ సమరయలో కొనసాగకపోవడాన్ని మీరు చూడగలరు.
ఉత్తరానగల పదితెగలు విడిపోయిన తర్వాత, వారు ఆవుదూడ ఆరాధనకు తిరిగారు. కావున సా.శ.పూ. 740లో ఈ ప్రాంతాన్ని జయించడానికి యెహోవా అష్షూరీయులను అనుమతించాడు. వారు ప్రజలలో చాలామందిని పట్టుకుపోయి అష్షూరీయుల సామ్రాజ్యమందు తామెరుగని దేవతల నారాధించు పరదేశులున్న వివిధ ప్రాంతాలలో వారినుంచారు. ఆ అన్యులలో కొందరు ఇశ్రాయేలీయులలో కొందరిని మతాంతర వివాహం చేసుకొని, సున్నతివంటి సత్యారాధనకు సంబంధించిన బోధలు కొన్నింటిని నేర్చుకొనియుండవచ్చు. అయితే తత్ఫలితంగా రూపొందిన సమరయుల ఆరాధన నిశ్చయంగా దేవుని పూర్తిగా ప్రీతిపరచనిదాయెను.—2 రాజులు 17:7-33.
వారి మిశ్రిత ఆరాధనలో, సమరయులు కేవలము మోషే వ్రాసిన ఐదు పుస్తకాలను అనగా పంచగ్రంథాన్ని మాత్రమే లేఖనములుగా అంగీకరించారు. దాదాపు సా.శ.పూ. 4వ శతాబ్దం నాటికి వారు యెరూషలేములోని దేవుని ఆలయానికి పోటీగా, గెరిజీములో ఒక ఆలయాన్ని నిర్మించారు. ఆ తర్వాత గెరిజీము ఆలయం జీయస్ (లేదా బృహస్పతికి) ప్రతిష్ఠించబడి, చివరకు నాశనము చేయబడింది. గెరిజీము కేంద్రంగా సమరయ ఆరాధన ఇంకను కొనసాగింది.
నేటికి, సమరయులు గెరిజీములో వార్షిక పస్కా ఆచరణను ఆచరిస్తారు. వారక్కడ విస్తారంగా గొర్రెలను సంహరించి, వాటిని మరుగుతున్న నీటి బ్యారెల్స్‌లో ముంచి వాటి బొచ్చు తీసివేస్తారు. ఆ పిమ్మట వాటి మాంసాన్ని గంటల తరబడి గుంటలలో వండుతారు. మధ్యరాత్రి యెరూషలేము నుండి వచ్చిన అనేకులతో సహా వందలాదిమంది సమరయులు తమ పస్కా భోజనం చేస్తారు. ఎడమవైపున మీరు, గెరిజీము పర్వతం మీద తలపై ముసుగుతో, పస్కాను నిర్వహిస్తున్న సమరయ ప్రధాన యాజకుని చూడగలరు.
సమరయ స్త్రీ యేసుతో చెప్పిన దానిని జ్ఞాపకం చేసుకోండి: “మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి.” యేసు ఆమెకు, మనకు సరియైన భావాన్నిస్తూ యిలా అన్నాడు: “ఒక కాలము వచ్చుచున్నది; ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. . . . అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది; అది ఇప్పుడును వచ్చేయున్నది; తన్ను ఆరాధించు వారు అట్టివారే కావలెనని తండ్రి కోరుచున్నాడు; దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెను.”—యోహాను 4:20-24.
[అధస్సూచీలు]
a ఈ ఫొటోయొక్క పెద్ద చిత్రాన్ని మీరు యెహోవాసాక్షుల 1993 క్యాలండరులో పరిశీలించవచ్చును.
[24వ పేజీలోని చిత్రసౌజన్యం]
Pictorial Archive (Near Eastern History) Est.
[25వ పేజీలోని చిత్రసౌజన్యం]
Garo Nalbandian
Garo Nalbandian