తిరిగి జన్మించిన వారెవరు?
మంచి వారంతా పరలోకానికి వెళ్తారా? అనేక మంది అలాగే అనుకుంటారు. కానీ యేసుక్రీస్తు అందుకు అంగీకరించలేదు. రాత్రివేళ తనయొద్దకు రహస్యంగా వచ్చిన యూదా అధికారియైన నీకొదేముతో యేసు మాట్లాడుతూ: “పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడును లేడు” అని చెప్పెను.—యోహాను 3:13.
అయినా, మనుష్యులు కొందరు పరలోక రాజ్యములో ప్రవేశించే అవకాశాన్ని పొందే సమయమొస్తుందని నీకొదేముకు యేసు సూచించెను. యేసు వారిని గూర్చి ఇలా అన్నాడు: “ఒకడు నీటి మూలముగాను ఆత్మమూలముగాను జన్మించితేనేగాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీరమూలముగా జన్మించినది శరీరమును ఆత్మమూలముగా జన్మించినది ఆత్మయునైయున్నది. మీరు క్రొత్తగా జన్మింపవలెనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు” అనెను. అందుకు నీకొదేము ఒకడు క్రొత్తగా ఎలా జన్మించగలడని ఆశ్చర్యపడ్డాడు.—యోహాను 3:1-9.
బహుశా మీరు కూడా యేసు భావమేమిటని ఆశ్చర్యపడవచ్చును. దేవుని పరిశుద్ధాత్మతో నింపబడ్డామని భావిస్తూ, ఆకస్మికంగా మారిపోయామను అనుభవములను చెప్పుకొనేవారికి ఆయన మాటలు అన్వయిస్తాయా?
భావోద్రేకములు, మనస్సు
ఒకడు తిరిగి జన్మించాడా లేదా అని నిర్ణయించడానికి కావలసింది, ఆత్మశక్తిని చవిచూడటమే అని చెప్తారు కొందరు. అయినా, మన హృదయము మన మనస్సును, మనలను మోసపుచ్చగలదు. ప్రత్యేకంగా మనము బలమైన భావోద్రేకముతో నిండి ఉన్నప్పుడు ఇది వాస్తవము.—యిర్మీయా 17:9.
మనస్సుపై భావోద్రేక ప్రభావాలనుగూర్చి పరిశోధన జరుపు విలియం సార్జెంట్ “భావోద్రేక ప్రేరణ సమయంలో మన మెదడు మనలను మోసపుచ్చవచ్చును గనుక ఆ స్థితిలో అంగీకరించే నమ్మకాల విషయంలో జాగ్రత్త పడవలసిన” అవసరతను పేర్కొంటున్నాడు. సార్జెంట్ ప్రకారము అప్పటికప్పుడు మారుమనస్సు పొందేందుకు ఉద్రేకపూరిత ప్రసంగాలు చేసేవారి ప్రభావము, నరకాగ్ని శిక్షను గూర్చిన బెదరింపులు ఇందుకు ఒక ఉదాహరణ. పరలోకానికి వెళ్లేందుకు తిరిగి జన్మించకపోతే నరకాగ్నిలో యాతన తప్పదన్నప్పుడు, తిరిగి జన్మించటానికి యిష్టపడని వారెవరుంటారు? అలాంటి భావోద్రేకపూరిత వత్తిడి కింద, “తర్కానికి తావుండదు. సహజమైన మెదడు కంప్యూటరు తాత్కాలికంగా పనిచేయదు, క్రొత్త తలంపులు, నమ్మకాలు నిర్విచారణతో స్వీకరించబడతాయి” అని సార్జెంటు అంటున్నాడు.—ది మైండ్ పొసెస్డ్.
కాబట్టి, తిరిగి జన్మించే విషయానికి సంబంధించిన నమ్మకం “నిర్విచారణతో స్వీకరించబడిందని” ఒకడు ఎలా చెప్పగలడు? దేవుని పరిశుద్ధాత్మ బైబిలు రచయితలను ప్రేరేపించి వ్రాయించిన వాక్యమంతటినిబట్టి నడుచుకొనుటే నిజంగా తెలివైన పని. క్రైస్తవులు దేవుని ‘పరీక్షించి తెలుసుకొని’ ఆరాధించవలెనని, తాము నమ్మేదేదో సత్యమైయుండేలాగున నిశ్చయపరచుకోవాలని క్రైస్తవులు ప్రోత్సహించబడుతున్నారు.—రోమీయులు 12:1, 2; 1 థెస్సలొనీకయులు 5:21.
తిరిగి జన్మించుటయనేది మానవులకెన్నడూ అనుగ్రహించబడని అత్యంత ఉన్నత ఆధిక్యతలలో ఒక దానికి మార్గం తెరుస్తుంది. అది దేవుని సంకల్పము యొక్క నెరవేర్పులోని గొప్ప పురోగతికి సంబంధించినది. ఇదంతా వాస్తవమైనప్పటికిని, ఇటువంటి ప్రశ్నలు తలెత్తును: తిరిగి జన్మించు వారెవరు? ఇది ఎలా జరుగుతుంది? అటువంటి వ్యక్తులముందు ఏ ఉత్తరాపేక్షలున్నవి? మరి వారు మాత్రమే రక్షించబడతారా?
[3వ పేజీలోని చిత్రం]
నీకొదేము ఒకడు ఎట్లు తిరిగి జన్మించగలడని ఆశ్చర్యపడెను