క్రమశిక్షణను అంగీకరించుట ద్వారా విధేయత నేర్చుకొనండి
అక్షరార్థంగా లోకంలో అందరికంటే పైగా ఉన్నాననే భావంతో ఒక ఎత్తైన శిఖరం అంచున నిలుచుండుటను ఊహించుము. ఎంత ఆనందభరితమగు స్వేచ్ఛా భావం!
అయినను మన స్వాతంత్ర్యం నిజంగా ఎంతో పరిమితమై యుంది. భూమ్యాకర్షణ నియమం తీవ్రంగా మీ ప్రతి కదలికను నియంత్రిస్తుంది; ఒక అడుగు తప్పితే అది వినాశనకరంగా పరిణమించగలదు. మరోవైపున, అదే భూమ్యాకర్షణ నీవు నిస్సహాయంగా అంతరిక్షంలోకి ఎగిరిపోకుండా నిన్ను అడ్డుకుంటుందని తెలిసికొనుట ఎంత సంతోషదాయకం. ఆ శిఖరాగ్రపు అంచున నీ కదలికలపై అదివుంచే పరిమితులను అంగీకరించుట ప్రయోజనకరం, పైగా అది ప్రాణాన్ని రక్షించుకోవడం అవుతుంది.
అవును, కొన్నిసార్లు నియమాలు, వాటికి లోబడియుండుట మన స్వాతంత్ర్యాన్ని పరిమితం చేయవచ్చు, అయితే ఇది విధేయతను కోరదగని విషయంగా చేస్తున్నదా?
విధేయతను దేవుడెట్లు దృష్టిస్తున్నాడు
“సృష్టికర్తగా” యెహోవా “జీవపు ఊటయై” యున్నాడు. ఈ కారణమునుబట్టి ఆయన సృష్టిప్రాణులందరు సరియైన రీతిలో ఆయనకు విధేయతచూప బద్ధులైయున్నారు. సరియైన దృక్పధమును ప్రదర్శిస్తూ, కీర్తనల రచయిత ఇలా వ్రాశాడు: “మనము ఆయన పాలించు ప్రజలము ఆయన మేపు గొఱ్ఱెలము. రండి నమస్కారముచేసి సాగిలపడుదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము.”—ప్రసంగి 12:1; కీర్తన 36:9; 95:6, 7.
ప్రారంభం నుండే యెహోవా తన సృష్టిప్రాణులనుండి విధేయతను కోరాడు. పరదైసులో ఆదాము హవ్వలు జీవిస్తూ ఉండుట విధేయతపై ఆధారపడి యుండెను. (ఆదికాండము 2:16, 17) దేవదూతలు మానవులకన్నా ఉన్నతమైన జీవనవిధానాన్ని కల్గియున్నను, వారును అదే ప్రకారము విధేయత చూపవలసి యున్నారు. “దేవుని దీర్ఘశాంతము ఇంక కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో” ఆత్మీయ ప్రాణులు కొంతమంది “అవిధేయులైన” కారణముగా, “కటిక చీకటిగల బిలములోనికి త్రోసి, తీర్పుకు కావలిలో ఉంచబడుటకు” అప్పగింపబడి శిక్షింపబడిరి.—1 పేతురు 3:19, 20; 2 పేతురు 2:4.
సరళముగా చెప్పాలంటే, తన అంగీకారమును సంపాదించుటకు దేవుడు విధేయతను ఒక అవసరతగా దృష్టిస్తున్నాడు. మనమిలా చదువుదుము: “తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించునట్లు, ఒకడు దహనబలులను బలులను అర్పించుటవలన ఆయన సంతోషించునా? ఆలోచించుము, బలులు అర్పించుటకంటె ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుటకంటె మాట వినుటయు శ్రేష్ఠము.”—1 సమూయేలు 15:22.
విధేయతను నేర్చుకొనవలెను—ఎందుకు, ఎట్లు
విధేయత దేవునియెదుట నీతియుక్తమైన స్థానమునకు నడుపును, కావున దానిని మనం నేర్చుకొనుట ఎంత ఆవశ్యకం! పర భాషను నేర్చుకొనునట్లే, మనం యౌవనులముగా ఉన్నప్పుడే విధేయతచూపే అలవాటును నేర్చుకోవచ్చును. అందుకే పిల్లలకు బాల్యంనుండే శిక్షణయిచ్చుటను బైబిలు నొక్కితెల్పుచున్నది.—యెహోషువ 8:35.
పిల్లలనుండి విధేయతను కోరుట మానసిక అత్యాచారమునకు సరిసమానమని చెప్పుచు కొంతమంది ఆధునిక వాదులు బైబిలు దృష్టికి భిన్నంగా మాట్లాడుదురు. పెద్దవారి ప్రమేయం లేకుండా తమ జీవనానికి కావలసిన వ్యక్తిగత తలంపులను, కట్టడలను అభివృద్ధిపరచు కొనుటకు పిల్లలను అనుమతించాలని వారు వాదిస్తారు.
అయితే 1960వ దశాబ్దంలో అనేకమంది తలిదండ్రులు ఈ దృష్టిని కలిగియున్నప్పుడు, ఉపన్యాసకుడు, సంపాదకుడు, మానసిక శాస్త్ర పండితుడైన విల్హెల్మ్ హాన్సెన్ దానికి ఒప్పుకోలేదు. ఆయనిలా వ్రాశాడు: “శిశువు ఎదిగే ప్రాయంలో తలిదండ్రులతో ఆ శిశువుకుండే అనుబంధం ఇంకనూ కొనసాగుచుండగా, తలిదండ్రులు చెడ్డవాటిని కాక మంచివాటినే సిఫారసు చేస్తారు. కాబట్టి, విధేయత మాత్రమే ఆ శిశువును సత్ప్రవర్తన, మౌలిక విలువల మార్గమందు నడిపిస్తుంది, దానిపైనే నైతిక క్రమమునకు అతనికున్న సంబంధము ఆధారపడియున్నది.”—సామెతలు 22:15 పోల్చుము.
విధేయతను నేర్చుకొను అవసరతను దేవుని వాక్యము నొక్కితెల్పుచున్నది. మనమిట్లు చదువుదుము: “ప్రభువా, నరుని మార్గాలు అతని ఇష్టప్రకారం లేవని, లేక తన జీవన విధానాన్ని తీర్మానించుకొనుట నరుని పనికాదని నేనెరుగుదును.” (యిర్మీయా 10:23, ది న్యూ ఇంగ్లీష్ బైబిల్) మానవులు వ్యక్తిగత కట్టడల ప్రకారము తమ జీవన విధానాన్ని రూపుదిద్దుకుని, పిదప అలా చేసినందున గంభీరమైన సమస్యలలో చిక్కుకొనిన సంఘటనలు చరిత్రలో కోకొల్లలున్నవి. ఇదెందుకు తరచు సంభవిస్తుంది? ఎందుకంటె ఏ సహాయం లేకుండా తమ జీవన విధానాన్ని రూపుదిద్దుకొను జ్ఞానము, వివేకము, అవగాహన మానవులకు లేవు. అంతకంటె దుస్థితి ఏమంటే, తప్పుడు నిర్ణయాలుచేసే వారసత్వ లక్షణాన్ని వారు కలిగియున్నారు. జలప్రళయము సంభవించిన వెంటనే, నరునిగూర్చి యెహోవా యీలాగు సెలవిచ్చాడు: “నరుల హృదయాలోచన వారి బాల్యమునుండి చెడ్డది.”—ఆదికాండము 8:21.
కావున, యెహోవాకు విధేయత చూపు దృక్పధం వారసత్వంగా ఎవరికీ లేదు. దానిని మనం మన పిల్లలలో పెంపొందించాలి మరియు మన జీవన కాలమంతటిలో దానిని నేర్చుకుంటూ వుండాలి. మనలో ప్రతి ఒక్కరు రాజైన దావీదుకున్న హృదయ పరిస్థితిని పెంపొందించుకొనే అవసరత వుంది. ఆయనిలా వ్రాశాడు: “యెహోవా, నీ మార్గములను నాకు తెలియజేయుము. నీ త్రోవలను నాకు తేటపరచుము, నన్ను నీ సత్యము ననుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు, దినమెల్ల నీ కొరకు కనిపెట్టుచున్నాను.”—కీర్తన 25:4, 5.
విధేయులైయుండి విధేయతను నేర్పండి
యేసు తల్లికి, ఆయనను పెంచిన తండ్రికి యేసు పుట్టినప్పటి పరిస్థితులు తెలుసు. కాబట్టి ఆయన యెహోవా సంకల్పముల నెరవేర్పులో ఒక ప్రముఖ పాత్ర వహించునని వారు గ్రహించారు. (లూకా 1:35, 46, 47 పోల్చుము.) వారి విషయంలో, “కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము” అను మాటలు ఎంతో ఉన్నతమైన భావాన్ని కలిగియుండెను. (కీర్తన 127:3) తమకున్న గొప్ప బాధ్యతను వారు పూర్తిగా గుర్తించారు కాబట్టే ఐగుప్తుకు పారిపోవలెనని లేదా గలిలయకు వెళ్లవలెనని చెప్పిన దైవిక నడిపింపులకు వారు తక్షణమే లోబడ్డారు.—మత్తయి 2:1-23.
శిక్షణ విషయములో తమ బాధ్యతను కూడ యేసు తలిదండ్రులు గుర్తించారు. నిజమే, తన మానవపూర్వ ఉనికిలో, యేసు అన్ని సమయాల్లో విధేయుడై యుండెను. అయితే భూమిమీద వుండగా, ఆయన పూర్తిగా క్రొత్త పరిస్థితులందు విధేయుడై యుండుటను నేర్చుకొనెను. ఒక సంగతేమంటే, ఆయన తన అసంపూర్ణ తలిదండ్రులకు లోబడవలెను ఎందుకనగా పరిపూర్ణ పిల్లవానికి సహితం విద్య, ఉపదేశం రూపంలో శిక్షణ అవసరం. దీనిని ఆయన తలిదండ్రులు అందజేస్తారు. మరోవైపున శిక్ష రూపములో శిక్షణ ఆయనకు అవసరం లేదు. యేసు అన్నిసమయాల్లో విధేయుడై యుండెను; ఎన్నడును ఆయనకు రెండుసార్లు చెప్పాల్సిన అవసరత రాలేదు. మనమిలా చదువుదుము: “ఆయన వారితో [తలిదండ్రులతో] కూడ బయలుదేరి నజరేతుకు వచ్చి, వారికి విధేయుడై యుండెను.”—లూకా 2:51, ఫిలిప్స్.
మాదిరినుంచుట ద్వారా యేసుకు ఎలా బోధించవలెనో కూడ యోసేపు, మరియలు ఎరిగియుండిరి. ఉదాహరణకు, “పస్కా పండుగప్పుడు ఆయన తలిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్లుచుండువారు” అని మనం చదువుదుము. (లూకా 2:41) తనతోపాటు కుటుంబమును వెంట తీసుకొని వెళ్లుట ద్వారా యోసేపు వారి ఆత్మీయ సంక్షేమమందు శ్రద్ధకలిగియున్నాడని, తాను యెహోవా ఆరాధనను గంభీరముగా తీసుకొనుచున్నాడని చూపెను. ఆ విధముగా, తలిదండ్రులు ఆరాధనా విషయములందు తామే విధేయత చూపుటద్వారా తమ పిల్లలకీనాడు విధేయతను నేర్పించ గలరు.
యోసేపు, మరియలు నీతియందు చక్కని క్రమశిక్షణనిచ్చిన కారణముగా, “యేసు జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయయందును, మనుష్యుల దయయందును వర్థిల్లుచుండెను.” ఈనాడు క్రైస్తవ తలిదండ్రులు అనుకరించుటకు ఇదెంత చక్కని మాదిరి!—లూకా 2:52.
“అన్ని విషయములలో . . . మాట వినుడి”
“పిల్లలారా, అన్ని విషయములలో మీ తలిదండ్రుల మాట వినుడి; ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది.” (కొలొస్సయులు 3:20) ప్రతి విషయములోను యేసు తన తలిదండ్రులకు విధేయుడై యుండగల్గెను, ఎందుకంటే యెహోవా చిత్తానికి వ్యతిరేకముగా దేనినైనా చేయవలెనని యేసును—లేదా ఆయన సహోదర, సహోదరీలను బలవంతపెట్టుటకు యెహోవాకు వారుచూపిన విధేయత వారిని అడ్డగించింది.
ఈనాడు కూడ అనేకమంది తలిదండ్రులు ప్రతి విషయంలోను పిల్లలకు విధేయత నేర్పించుటలో విజయం సాధించారు. పిల్లల్ని పెంచే రోజులు గడచిపోయిన ముగ్గురు తండ్రులు చెప్పే విషయాలు వినండి. వీరు ప్రస్తుతం వాచ్‌టవర్ సొసైటి యొక్క ఒక బ్రాంచి కార్యాలయములో పనిచేస్తున్నారు.
తాను తన భార్య కలిసి ఐదుగురు కుమారులను ఎలా పెంచారో టావో తెలియజేస్తున్నాడు. ఆయనిలా అంటున్నాడు: “పెద్దలమైన మనం కూడ తప్పులు చేస్తామని పిల్లలు ప్రారంభం నుండే తెలిసికొనుట ప్రాముఖ్యం. విచారకరమైన విషయమేమంటే, మనం అనేకమార్లు అలా తప్పిపోతాం కాబట్టి క్షమాపణ మరియు సహాయం కొరకు మనం మన పరలోకపు తండ్రిని ఎడతెగక అడగాలి. యౌవనస్థులకుండే చింతలతో వారెట్లు పోరాడుచున్నారో, పెద్దలకుండే చింతలతో మేమును అట్లే పోరాడుచున్నామని చూచునట్లు మేము మా పిల్లలను ఉద్దేశపూర్వకంగానే అనుమతించాము.”
పిల్లవాడు విధేయత నేర్చుకోవాలంటే, అతనికి అతని తలిదండ్రుల మధ్య ప్రేమపూర్వకమైన సంబంధము అవశ్యకము. హెర్మాన్ తన భార్యను గూర్చి ఇలా చెప్పుచున్నాడు: “ఆమె పిల్లలకు తల్లి మాత్రమే కాదు వారి స్నేహితురాలు కూడ. దీనిని వారు మెచ్చుకుంటారు, కాబట్టి విధేయత చూపుట వారికి కష్టంగా ఉండేది కాదు.” పిల్లల, తలిదండ్రుల సంబంధమును మరింత శ్రేష్ఠతరం చేసికొనుటకు ఉపయుక్తమగు చిట్కానిస్తూ, ఆయన ఇలా అంటున్నాడు: “గిన్నెలు చేత్తో కడిగి ఆరబెట్టునట్లు మేము అనేక సంవత్సరాలు గిన్నెలు కడిగే మెషీన్ లేకుండానే ఆ పని చేశాము. వంతుల వారీగా ఆరబెట్టే పనిచేయడానికి మా కుమారులకు పని అప్పగించాము. పరస్పర సంభాషణకు అదెంతో మంచి సమయమై యుండెను.”
పిల్లవానికి తలిదండ్రులకు మధ్యగల ప్రేమపూర్వక సంబంధము ఒక క్రైస్తవుడు యెహోవాతో కలిగియుండాల్సిన సంబంధమునకు మాదిరిగా పనిచేయును. అటువంటి సంబంధమును కలిగియుండుటకు తమ ఇద్దరు కుమారులకు తాను, తన భార్య ఎలా సహాయం చేశారో రుడాల్ఫ్ వివరిస్తున్నాడు: “క్రమమైన కుటుంబ పఠనమును ఆధారంగా తీసుకున్నాము. పరిశోధించుటకు తగిన అంశాలను మేము పిల్లలకు అనేకం ఇచ్చాము. ఆలాగే మేము కలిసి బైబిలు పఠనంచేసి ఆ పిదప విషయాల్ని కలిసి చర్చించేవాళ్లం. పిల్లలనుండే కాదు యెహోవా తలిదండ్రులనుండి కూడ విధేయత కోరుచున్నాడని మా కుమారులు గ్రహించగల్గేవారు.”
“శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గములు” అనే ప్రేరేపిత వాక్యము తమకు, తమ పిల్లలకు అన్వయించునని క్రైస్తవ తలిదండ్రులు గ్రహిస్తారు. కాబట్టి ప్రతి విషయములో పిల్లలు తలిదండ్రులకు లోబడియుండే బాధ్యతను కలిగియుండగా, తలిదండ్రులు కూడా యెహోవా వారినుండి కోరు ప్రతి విషయములోను లోబడియుండవలెను. పిల్లల, తలిదండ్రుల మధ్యగల సంబంధమును బలపరచుకొనుటకు తోడుగా, తలిదండ్రులు, పిల్లలు యెహోవాతో తమకున్న సంబంధాన్ని బలపరచుకోవాలని కోరుకుంటారు.—సామెతలు 6:23.
విధేయతను సరియైన దృష్టితో చూడండి
పిల్లలను పెంచే విషయంలో దేవుని వాక్యం అటువంటి అభ్యాసయోగ్యమైన సలహాను దయచేస్తున్నందుకు మనమెంత కృతజ్ఞులమై యుండగలము! (బాక్సు చూడుము.) నీతియందు శిక్షచేయు తలిదండ్రులనుండి విధేయత నేర్చుకొను పిల్లలు యావత్ క్రైస్తవ సహోదరత్వమునకు ఆనందమిచ్చే నిజమైన మూలమై యున్నారు.
దేవునికి విధేయత చూపుట అనగా జీవము గనుక, మన స్వాతంత్ర్యముపై దేవుని ఆజ్ఞలుంచే పరిమితులను—ఒక క్షణమైనను—అలక్ష్యం చేయ యోచించకూడదు. ఉదాహరణకు, భూమ్యాకర్షణా నియమాన్ని కొద్దిసేపు ఆపగల్గామనుకోండి. మన స్వాతంత్ర్యాన్ని అడ్డగించేది ఏదీ లేకుండా ఆ పర్వత శిఖరాన్నుండి ఆకాశంలోకి ఎగరే అత్యానందం మనలను ఎంతగా పులకింపజేయును! అయితే పరిస్థితులు ఒక్కసారి వెనుదిరిగితే ఏం సంభవిస్తుంది? మనం పడబోయే పాటు ఏ పాటిదో ఒక్కసారి ఆలోచించండి!
శిక్షణను అంగీకరించుట ద్వారా విధేయతను నేర్చుకొనుట సమతూకమైన వ్యక్తిత్వాన్ని వృద్ధిపరచుకొనుటకు దోహపడుటయే గాకుండా మన పరిమితులను మనం తెలుసుకొనుటకు సహాయపడును. ఇతరుల హక్కులను, అవసరతలను దబాయించి అడిగేవారిగా, మూర్ఖత్వంగా ఉండకుండుటకు మనకు సహాయపడును. అనిశ్చయముగా తొందరపడి ఏదియు చేయకుండ అది మనకు సహాయపడును. ఒక్కమాటలో చెప్పాలంటే, దానివలన ధన్యత కలుగును.
కాబట్టి మీరు పెద్దవారైనను లేదా పిల్లలైనను మీకు “మేలు కలుగునట్లును,” మీరు “భూమిమీద దీర్ఘాయుష్మంతులగు” నట్లును శిక్షణను అంగీకరించుట ద్వారా విధేయతను నేర్చుకొనుము. (ఎఫెసీయులు 6:1-3) శిక్షణను అంగీకరించక విధేయతను నేర్చుకొనుటలో తప్పిపోవుట ద్వారా నిత్యజీవపు ఉత్తరాపేక్షను ప్రమాదములో పడవేసికొనుటకు ఎవరు కోరుకుంటారు?—యోహాను 11:26.
[31వ పేజీలోని బాక్సు]
తలిదండ్రులారా, నీతియందు శిక్షణనిస్తూ విధేయతను నేర్పండి
1. లేఖనాధారమైన నియమములు, సూత్రములపై ఆధారపడి శిక్షణ నివ్వండి.
2. విధేయతను దబాయించి అడుగుట ద్వారా గాక విధేయత ఎందుకు జ్ఞానయుక్తమైన విధానమో వివరించుట ద్వారా శిక్షణ నివ్వండి.—మత్తయి 11:19.
3. కోపంతో లేక పెద్దగా అరవడం ద్వారా శిక్షణ నివ్వకండి.—ఎఫెసీయులు 4:31, 32.
4. ప్రేమపూర్వకమైన ఆప్యాయత, శ్రద్ధాపూర్వకమైన సంబంధమందు శిక్షణ నివ్వండి.—కొలొస్సయులు 3:21; 1 థెస్సలొనీకయులు 2:7, 8; హెబ్రీయులు 12:5-8.
5. బాల్యంనుండే పిల్లలకు శిక్షణ నివ్వండి.—2 తిమోతి 3:14, 15.
6. పదేపదే మరియు సరళతతో శిక్షణ నివ్వండి.—ద్వితీయోపదేశకాండము 6:6-9; 1 థెస్సలొనీకయులు 2:11, 12.
7. మొదట మీకైమీరు శిక్షణ నిచ్చుకొని ఆ విధంగా మాదిరిచూపుట ద్వారా వారికి నేర్పించండి.—యోహాను 13:15; పోల్చుము మత్తయి 23:2, 3.
8. యెహోవా మీద పూర్తిగా ఆధారపడి, ప్రార్థనలో ఆయన సహాయాన్ని వేడుకొంటూ శిక్షణ నివ్వండి.—న్యాయాధిపతులు 13:8-10.
[30వ పేజీలోని చిత్రం]
“శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గములు”