యెహోవా, నిష్పక్షపాతియైన “సర్వలోక” న్యాయాధిపతి
“పక్షపాతము లేకుండ క్రియలనుబట్టి ప్రతివానిని తీర్పుతీర్చువాడు తండ్రి.”—1 పేతురు 1:17.
1, 2. (ఎ) యెహోవా మహాగొప్ప న్యాయధిపతియను తలంపునుబట్టి మనమెందుకు భయపడాలి మరియు ఓదార్పుపొందాలి? (బి) జనాంగములకు వ్యతిరేకముగా యెహోవా కలిగియున్న చట్టపరమైన వ్యాజ్యెములో, ఆయన భూసంబంధమైన సేవకులు ఏ పాత్ర వహింతురు?
యెహోవా “సర్వలోకమునకు తీర్పుతీర్చు” మహాగొప్ప న్యాయాధిపతి. (ఆదికాండము 18:25) ఈ విశ్వానికే సర్వోన్నత దేవునిగా, తాను సృష్టించిన వారికి తీర్పుతీర్చు హక్కు ఆయనకున్నది. అదే సమయములో, ఇది ఒకేసారి భయము పుట్టించునదియు మరియు ఓదార్పుకరమైన తలంపైయున్నది. పరస్పర విరుద్ధత ఉన్నట్లుగా కన్పించు దీనిని మోషే భావగర్భితముగా ఇట్లు వ్యక్తపరచెను: “నీ దేవుడైన యెహోవా పరమదేవుడును పరమప్రభువునై యున్నాడు. ఆయనే మహాదేవుడు పరాక్రమవంతుడు భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్యపెట్టని వాడు, లంచము పుచ్చుకొనని వాడు. ఆయన తలిదండ్రులు లేనివానికిని విధవరాలికిని న్యాయము తీర్చి, పరదేశియందు దయయుంచి అన్నవస్త్రముల ననుగ్రహించువాడు.”—ద్వితీయోపదేశకాండము 10:17, 18.
2 ఎంత ఆశ్చర్యదాయకమైన సమతూకము! ఆయన మహాదేవుడును, పరాక్రమవంతుడును, భయంకరుడైన దేవుడు. అయినను ఆయన నిష్పక్షపాతి మరియు అనాధలను, విధవరాండ్రను, పరదేశులను ప్రేమతో ఆదుకొనువాడై యున్నాడు. యెహోవా కంటె ఎక్కువ ప్రేమగల న్యాయాధిపతిని ఎవరు కోరుకొనగలరు? సాతానుయొక్క లోకమందలి జనాంగములకు వ్యతిరేకముగా ఒక చట్టపరమైన వ్యాజ్యెమును కలిగియున్నట్లు తనను చిత్రీకరించుకొనుచు, భూమిమీది తన సేవకులను తన సాక్షులైయుండుమని యెహోవా పిలుచుచున్నాడు. (యెషయా 34:8; 43:9-12) తన దేవత్వమును, న్యాయపరమైన తన సార్వభౌమాధిపత్యమును నిరూపించుటకు ఆయన వారి సాక్ష్యముపై ఆధారపడడు. అయితే ఆయన సర్వోన్నతను తాము గుర్తించామని వారు యావత్ మానవజాతి ఎదుట రూఢిపరచుటకు ఆయన తన సాక్షులకు ఒక అద్భుతమైన అధిక్యతనిచ్చును. ఆయన సాక్షులు తాముగా ఆయన నీతియుక్తమైన సార్వభౌమాధిపత్యమునకు లోబడి, వారు తమ పరిచర్యద్వారా సర్వోన్నత న్యాయాధిపతి అధికారము క్రిందికి రావలెనని ఇతరులను ప్రేరేపింతురు.
యెహోవా తీర్పుతీర్చు విధానము
3. యెహోవా న్యాయతీర్పు విధానమును ఎట్లు క్లుప్తీకరించవచ్చును, ఇది ఆదాము హవ్వల విషయములో ఎట్లు దృష్టాంతపరచబడెను?
3 మానవజాతి చరిత్ర తొలికాలములో కొంతమంది నేరస్థులకు యెహోవా వ్యక్తిగతముగా తీర్పుతీర్చెను. న్యాయసంబంధమైన విషయాలతో ఆయన వ్యవహరించిన విధానపు ఉదాహరణలు, ఆ తర్వాతి కాలములలో తన ప్రజల మధ్య న్యాయవ్యవహారములను నిర్వహించు బాధ్యత కలిగియుండు తన సేవకులకు ఒక మాదిరినుంచుచున్నవి. (కీర్తన 77:11, 12) ఆయన తీర్పుతీర్చు విధానమును ఇట్లు క్లుప్తీకరించవచ్చును: అవసరమైనచోట దృఢముగా ఉండుట, సాధ్యమైనచోట కనికరము చూపుట. పరిపూర్ణ ప్రాణులైయుండి ఉద్దేశపూర్వకముగా తిరుగుబాటు చేసిన ఆదాము హవ్వల విషయానికొస్తే, కనికరంపొందే అర్హతను వారు కోల్పోయిరి. కావున, యెహోవా వారికి మరణదండన విధించెను. అయితే వారి సంతానముయెడల ఆయన కనికరం చూపించాడు. యెహోవా వారి మరణశిక్షను వాయిదావేసి, అలా ఆదాము హవ్వలు పిల్లలను కనుటకు వారిని అనుమతించెను. ఆయన ప్రేమతో వారి సంతానమునకు పాపమరణముల చెరనుండి విడుదలకు ఒక నిరీక్షణను సమకూర్చెను.—ఆదికాండము 3:15; రోమీయులు 8:20, 21.
4. కయీనుతో యెహోవా ఎట్లు వ్యవహరించెను, ఈ విషయము ప్రత్యేకముగా ఎందుకు ఆసక్తికరమై యున్నది?
4 కయీనుతో యెహోవా వ్యవహరించిన విధము ప్రత్యేకముగా ఆసక్తిదాయకమై యున్నది, ఎందుకంటె ఇది “పాపమునకు అమ్మబడిన” ఆదాము హవ్వల అసంపూర్ణ సంతతిలో ఒకనిగూర్చి వ్రాయబడిన మొదటి వ్యాజ్యెము. (రోమీయులు 7:14) యెహోవా దీనిని లెక్కలోనికి తీసుకొని కయీను తలిదండ్రులతో వ్యవహరించిన దానికి భిన్నముగా ఈయనతో వ్యవహరించెనా? ఈ సంగతి ఈనాటి క్రైస్తవ అధ్యక్షులకు ఒక పాఠమును సమకూర్చగలదా? మనమా విషయాన్ని చూద్దాం. తానర్పించినది అనుగ్రహపూర్వకముగా స్వీకరించబడలేదని కయీను తప్పుగా ప్రతిస్పందించుటను గ్రహించిన వెంటనే, అతడున్న ప్రమాదమును గూర్చి యెహోవా అతన్ని ప్రేమపూర్వకముగా హెచ్చరించాడు. ఒక పురాతన సామెత ఇట్లనుచున్నది: ‘ముందు జాగ్రత్త, చికిత్సకంటె మేలు.’ పాపము అతనిపై ఏలుటకు అనుమతించుటను గూర్చి కయీనుకు హెచ్చరిక చేయుటకు తాను ఎంతమేరకు వెళ్లగలడో అంత మేరకు యెహోవా వెళ్లెను. అతడు “సత్క్రియ” చేయునట్లు సహాయపడుటకు ఆయన కృషిచేసెను. (ఆదికాండము 4:5-7) పాపియైన మానవుడు మారుమనస్సు నొందవలెనని దేవుడు కోరుట ఇదే మొదటిసారి. కయీను పశ్చాత్తాపము లేని మనోభావము చూపి, మహాపరాధం చేసిన తర్వాత, ఇతర మానవులెవ్వరు అతని చంపకయుండునట్లు శాసనము చేయుచు, యెహోవా అతనికి బహిష్కరణ శిక్షను విధించెను.—ఆదికాండము 4:8-15.
5, 6. (ఎ) జలప్రళయమునకు ముందున్న తరమువారితో యెహోవా ఎట్లు వ్యవహరించెను? (బి) సొదొమ గొమొఱ్ఱా నివాసులపై తీర్పు విధించక ముందు యెహోవా ఏమిచేసెను?
5 జలప్రళయానికి ముందు, ‘భూమిపై నరుల చెడుతనము విస్తారముగా యుండుట చూచి, తన యెహోవా హృదయమందు నొచ్చుకొనెను.’ (ఆదికాండము 6:5, 6) జలప్రళయానికి ముందున్న తరములో అత్యధికులు తమ స్వేచ్ఛాచిత్తమును దుర్వినియోగపరచినందున తానే వారిని శిక్షింపవలసివచ్చెనని బాధపడునంతగా ఆయన “సంతాపము నొందెను.” అయినను, “నీతిని ప్రకటించు” వానిగా నోవహును అనేక సంవత్సరాలు ఉపయోగించుచు ఆయన వారికి తగిన హెచ్చరికనిచ్చెను. ఆ పిమ్మట, ‘ఆ భక్తిహీన లోకమును శిక్షించకుండా ఉండు’ ఏ కారణము యెహోవాకు లేకుండెను.—2 పేతురు 2:5.
6 అదే విధముగా యెహోవా అవినీతిమయమైన సొదొమ గొమొఱ్ఱాలపై న్యాయమైన చర్య తీసుకొన బద్ధుడైయుండెను. అయితే ఆయన దానినెట్లు జరిగించెనో గమనించుము. ఈ ప్రజల ఘోరమైన ప్రవర్తనను గూర్చి చేయబడిన ‘గొప్ప మొరను’ ఆయన ఆలకించెను, బహుశ నీతిమంతుడైన లోతు ఆ ప్రార్థన చేసియుండవచ్చును. (ఆదికాండము 18:20; 2 పేతురు 2:7, 8) అయితే చర్య గైకొనుటకు ముందు, ఉన్న వాస్తవాలను ధృవపరచుటకు ఆయన తన దేవదూతల మూలముగా ‘క్రిందికి దిగివెళ్లెను.’ (ఆదికాండము 18:21, 22; 19:1) తాను అన్యాయముగా ప్రవర్తింపనని అబ్రాహాముకు హామియిచ్చుటకు కూడ ఆయన సమయము తీసికొనెను.—ఆదికాండము 18:23-32.
7. యెహోవా తీర్పుతీర్చు విధానముయొక్క మాదిరులనుండి న్యాయనిర్ణయ కమిటీలలో సేవచేయు పెద్దలు ఏ పాఠములు నేర్చుకొనగలరు?
7 ఈ ఉదాహరణల నుండి యీనాడు పెద్దలు ఏమి నేర్చుకొనగలరు? దోషులైన ఆదాము హవ్వల బంధువుల విషయానికొస్తే, ఆ వివాదమందు దోషారోపణ లేనివారి యెడల యెహోవా ప్రేమను, శ్రద్ధను చూపించెను. ఆదాము హవ్వల సంతానము యెడల ఆయన కనికరము చూపించెను. కయీను విషయములో, కయీను కలిగియున్న ప్రమాదమును యెహోవా ముందేచూసి, అతడు పాపముచేయకుండా అడ్డుకొనుటకు ప్రయత్నించుచు అతనితో దయాపూర్వకముగా తర్కించెను. అతన్ని బహిష్కరించిన తర్వాతకూడ, యెహోవా కయీను యెడల శ్రద్ధ చూపెను. అంతేకాకుండా, ఎంతో ఓపికను సహనమును చూపిన తర్వాతనే జలప్రళయానికి ముందున్న తరము వారిపై యెహోవా తీర్పుతీర్చెను. విపరీతమైన దుష్టత్వమున్నందున, యెహోవా “హృదయములో నొచ్చుకొనెను.” తన నీతియుక్తమైన పరిపాలనపై మనుష్యులు తిరుగుబాటు చేసినందున, తానే వారిపై ప్రతికూలమైన తీర్పు విధించవలసి వచ్చెనని ఆయన సంతాపమునొందెను. (ఆదికాండము 6:6; పోల్చుము యెహెజ్కేలు 18:31; 2 పేతురు 3:9.) సొదొమ గొమొఱ్ఱాల విషయములో, వాస్తవాలను ధృవీకరించుకొనిన తర్వాత మాత్రమే యెహోవా చర్య తీసికొనెను. ఈనాడు న్యాయసంబంధ విషయాలతో వ్యవహరించవలసిన వారికి ఇవి ఎంత అద్భుతమైన ఉదాహరణలు!
పితరుల కాలములలో మానవ న్యాయాధిపతులు
8. పితరుల కాలములలో యెహోవాయొక్క ఏ ప్రాథమిక నియమములను వారు ఎరిగియుండిరి?
8 ఆ కాలములో నిజానికి వ్రాతపూర్వక నియమావళి లేకపోయిననూ, పితరుల సమాజము యెహోవాయొక్క ప్రాథమిక నియమములను ఎరిగియుండెను, మరియు ఆయన సేవకులు వాటిని పాటించు బాధ్యతను కలిగియుండిరి. (ఆదికాండము 26:5 పోల్చుము.) ఏదెనులో జరిగిన గాధ యెహోవా సార్వభౌమాధిపత్యమునకు విధేయతచూపు మరియు లోబడియుండు అవసరతను చూపించినది. కయీను విషయము యెహోవా నరహత్యను అంగీకరించడని బయల్పరచినది. జలప్రళయము అయిపోయిన వెంటనే, దేవుడు మానవజాతికి జీవ పవిత్రతను గూర్చి, నరహత్యనుగూర్చి, మరణశిక్షను గూర్చి, రక్తమును గూర్చి నియమములను ఇచ్చెను. (ఆదికాండము 9:3-6) అబ్రాహాము, శారా, గాజా సమీపమందుగల గెరారు రాజైన అబీమెలెకు చేరియున్న ఒక సందర్భమందు జారత్వమును యెహోవా గట్టిగా ఖండించెను.—ఆదికాండము 20:1-7.
9, 10. పితరుల సమాజములో ఒక న్యాయ విధానము ఉనికిలో యుండెనని ఏ ఉదాహరణలు చూపించుచున్నవి?
9 ఆ కాలమందు కుటుంబ యజమానులు న్యాయాధిపతులుగా వ్యవహరించి న్యాయ సమస్యలను తీర్చెడివారు. అబ్రాహామును గూర్చి యెహోవా ఇట్లనెను: “తన తరువాత తన పిల్లలును తన యింటివారును నీతి న్యాయములు జరిగించుచు, యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారి కాజ్ఞాపించునట్లు నేనతని నెరిగియున్నాను.” (ఆదికాండము 18:19) తన మరియు లోతు పశువుల కాపరుల మధ్య చెలరేగిన జగడమును పరిష్కరించుటలో అబ్రాహాము నిస్వార్థతను, వివేచనను ప్రదర్శించెను. (ఆదికాండము 13:7-11) మూలపురుషుడైన యూదా యజమానిగా, న్యాయధిపతిగా తన కోడలగు తామారు జారిణియని తలంచి ఆమెను రాళ్లతోకొట్టి చంపి అగ్నితో కాల్చివేయవలెనని నేరస్థాపన చేసెను. (ఆదికాండము 38:11, 24; పోల్చుము యెహోషువ 7:25.) అయితే, ఉన్న వాస్తవాలను తెలిసికున్నప్పుడు, ఆమె తనకంటె నీతిమంతురాలని ఆయన ప్రకటించెను. (ఆదికాండము 38:25, 26) ఒక న్యాయ నిర్ణయము చేయకముందు వాస్తవాలన్నింటిని తెలిసికొనుట ఎంత ప్రాముఖ్యము!
10 యోబు గ్రంథము ఒక న్యాయ విధానమును సూచించుచు, నిష్పక్షపాత తీర్పు కోరదగినదని చూపించుచున్నది. (యోబు 13:8, 10; 31:11; 32:21) గౌరవనీయ న్యాయాధిపతిగా పట్టణ గవినియొద్ద కూర్చుని ఒక విధవరాలి తరపున, తండ్రిలేని ఒక బాలుని తరపున న్యాయము తీర్చిన సమయమును గూర్చి యోబు స్మరణకు తెచ్చుకొనును. (యోబు 29:7-16) ఆ విధముగా, ఇశ్రాయేలు జనాంగ నిర్గమమునకు మరియు దేవుడు వారికిచ్చిన న్యాయ సంవిధానమునకు ముందే పితరుల సమాజములో అబ్రాహాము సంతతి వారిలో న్యాయాధిపతులుగా పనిచేయుచుండిన ‘పెద్ద మనుషులు’ ఉండిరనుటకు నిదర్శనాధారము కలదు. (నిర్గమకాండము 3:16, 18) వాస్తవానికి, ధర్మశాస్త్రమందలి నియమాలు మోషేద్వారా, ప్రజలకు ప్రాతినిధ్యము వహించిన ఇశ్రాయేలీయులలోని ‘పెద్ద మనుషులకు,’ లేక పెద్దలకు తెలియజేయబడెను.—నిర్గమకాండము 19:3-7.
ఇశ్రాయేలీయుల న్యాయ విధానము
11, 12. ఇద్దరు బైబిలు విద్వాంసులు చెప్పినదాని ప్రకారము, ఇశ్రాయేలీయుల న్యాయ విధానము యితర జనాంగములనుండి ఎంత విభిన్నమై యుండెను?
11 ఇశ్రాయేలీయులలో అమలుచేయబడు న్యాయమునకు వారిచుట్టువున్న జనాంగములు అనుసరించిన న్యాయ విధానములకు చాలా భేదము ఉండెను. పౌర చట్టాలకు, నేర చట్టాలకు మధ్య ఎలాంటి భేదము ఉంచబడలేదు. ఇవి రెండుకూడ నైతిక, మత చట్టాలతో అల్లబడియుండెను. ఒకని పొరుగువాని యెడల చేయు నేరము యెహోవాకు వ్యతిరేకముగా చేయు నేరమైయుండెను. తను వ్రాసిన పుస్తకమగు ది పీపుల్ అండ్ ది ఫెయిత్ ఆఫ్ ది బైబిల్, నందు గ్రంథకర్త ఆండ్రి షురాకి ఇలా వ్రాయుచున్నాడు: “హెబ్రీయులలో సంప్రదాయ న్యాయవిధానము, దాని నియమముల నిజమైన భావమందు తప్పిదములను నిర్వచించుటలోనే కాకుండ శిక్షల విషయములోను వారి పొరుగువారి నుండి భిన్నముగా యుండెను. . . . తోరా [ధర్మశాస్త్రము] దైనందిన జీవితమునుండి వేరైయుండలేదు; ఆశీర్వాదమును లేదా శాపమును కలుగజేయుచు అది ప్రతిదిన జీవిత స్వభావమును, పనిని తన అధీనములో ఉంచుకొనెను. . . . ఇశ్రాయేలీయులలో . . . పట్టణమునకు చెందిన న్యాయసంబంధ కార్యములలో స్పష్టమైన వ్యత్యాసము చూపుట దాదాపు అసాధ్యమై యుండెను. సజీవుడైన దేవుని చిత్తాన్ని నెరవేర్చుట చుట్టే పూర్తిగా పరిభ్రమించు జీవితముల ఏకతయందు అవి దాచబడియుండెను.”
12 ఈ ఉన్నతమైన పరిస్థితి ఇశ్రాయేలీయులలో అమలుచేయబడు న్యాయమును సమకాలీన జనాంగములకంటె ఎంతో ఉన్నత స్థాయిలో ఉంచెను. బైబిలు విద్వాంసుడగు రోలెన్ డి వొ ఇలా వ్రాయుచున్నాడు: “ఇశ్రాయేలీయుల ధర్మశాస్త్రము దాని స్వరూపమందును, విషయాలందును పోలికలను కలిగియున్నను, మధ్యప్రాచ్య ‘ఒప్పందముల’ మరియు వారి ‘సూత్రావళి’ శీర్షికల ఉపనియమాల నుండి అది పూర్తిగా భిన్నమై యున్నది. . . . దేవుడే దాని గ్రంథకర్తయని పూర్తిగా చెప్పబడిన ఇశ్రాయేలీయుల ధర్మశాస్త్రమునకు ఏ మధ్యప్రాచ్య సూత్రావళిని పోల్చలేము. అది మతపరమైన, సంప్రదాయ నియమాలను కలిగియుండి తరచు వాటితో మిళితమగుచున్నట్లున్నది, ఎందుకంటె అది దైవిక నిబంధనా క్షేత్రమంతటిని కప్పుచున్నది, మరియు ఈ నిబంధన మనుష్యుల పరస్పర సంబంధ బాంధవ్యాలను, ఆలాగే దేవునితో వారికున్న సంబంధమును నడిపించెను.” మోషే యిట్లడిగాడనుటలో ఎంతమాత్రము ఆశ్చర్యం లేదు: “నేడు నేను మీకు అప్పగించుచున్న యీ ధర్మశాస్త్రమంతటిలో నున్న కట్టడలును నీతివిధులునుగల గొప్ప జనమేది?”—ద్వితీయోపదేశకాండము 4:8.
ఇశ్రాయేలీయులలోని న్యాయాధిపతులు
13. ఏ విషయములందు మోషే ఈనాటి పెద్దలకు చక్కని మాదిరియై యున్నాడు?
13 అటువంటి ఉన్నతమైన న్యాయ విధానముతో, న్యాయాధిపతిగా విధిని నిర్వహించుటకు ఎటువంటి వ్యక్తి అవసరము? ఇశ్రాయేలీయులలో నియమించబడిన మొదటి న్యాయాధిపతిని గూర్చి బైబిలిట్లు చెప్పుచున్నది: “మోషే భూమిమీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు.” (సంఖ్యాకాండము 12:3) ఆయన తన విషయములో అతి నమ్మకస్థుడు కాదు. (నిర్గమకాండము 4:10) ఆయన ప్రజలకు తీర్పుతీర్చు అవసరమున్నను, ఆయా సమయాలలో వారికొరకు తననుతాను త్యాగం చేసికుంటూ, వారిని క్షమించుమని వేడుకొనుచు ఆయన యెహోవా ఎదుట వారి తరపున ఉత్తరవాదిగా నిలువబడెను. (నిర్గమకాండము 32:11, 30-32) ఆయన కవితా ధోరణిలో ఇట్లనెను: “నా ఉపదేశము వానవలె కురియును, నా వాక్యము మంచువలెను లేతగడ్డిమీద పడు చినుకువలెను, పచ్చికమీద కురియు వర్షమువలెను ఉండును.” (ద్వితీయోపదేశకాండము 32:2) తన స్వంత జ్ఞానముమీద ఆధారపడి ప్రజలకు తీర్పుతీర్చుటకు బదులు, ఆయనిట్లు ప్రకటించెను: “వారికి వ్యాజ్యెము ఏదైనను కలిగినయెడల నాయొద్దకు వచ్చెదరు. నేను వారి విషయము న్యాయము తీర్చి, దేవుని కట్టడలను ఆయన ధర్మశాస్త్రవిధులను వారికి తెలుపుచున్నాను.” (నిర్గమకాండము 18:16, ఇటాలిక్స్ మావి) సందేహము కలిగినప్పుడు, ఆ విషయమును ఆయన యెహోవాకు అప్పగించెను. (సంఖ్యాకాండము 9:6-8; 15:32-36; 27:1-11) ఈనాడు ‘దేవుని మందను మేపుచు,’ న్యాయ నిర్ణయములు చేయు పెద్దలకు మోషే చక్కని ఉదాహరణగా ఉన్నాడు. (అపొ. కార్యములు 20:28) అదే ప్రకారము తమ సహోదరులతో వారి సంబంధము “లేతగడ్డిమీద పడు చినుకువలె” నుండును గాక.
14. ఇశ్రాయేలీయులలో మోషే న్యాయాధిపతులుగా నియమించిన మనుష్యుల ఆత్మీయ అర్హతలు ఏమైయుండెను?
14 కొంతకాలానికి ప్రజలకు న్యాయము తీర్చు భారమును మోషే తానొక్కడే మోయలేకపోయెను. (నిర్గమకాండము 18:13, 18) సహాయకులను ఏర్పాటు చేసుకొమ్మని తన మామ ఇచ్చిన సలహాను ఆయన అంగీకరించాడు. మరలా, ఎటువంటి మనుష్యులు ఎంపికచేసికొనబడిరి? మనమిట్లు చదువుదుము: “నీవు ప్రజలందరిలో సామర్థ్యము దైవభక్తి సత్యాసక్తి కలిగి, లంచగొండులు కాని మనుష్యులను ఏర్పరచుకొనుము. . . . మోషే . . . ఇశ్రాయేలీయులందరిలో సామర్థ్యముగల మనుష్యులను ఏర్పరచుకొని, వెయ్యిమందికి ఒకనిగాను, నూరుమందికి ఒకనిగాను, ఏబదిమందికి ఒకనిగాను, పదిమందికి ఒకనిగాను, న్యాయాధిపతులను ఏర్పాటుచేసి వారిని ప్రజలమీద ప్రధానులుగా నియమించెను. వారెల్లప్పుడును ప్రజలకు న్యాయము తీర్చువారు. వారు కఠిన వ్యాజ్యెములను మోషేయొద్దకు తెచ్చుచు, స్వల్ప వ్యాజ్యెములను తామే తీర్చుచువచ్చిరి.”—నిర్గమకాండము 18:21-26.
15. ఇశ్రాయేలీయులలో న్యాయాధిపతులుగా సేవచేసినవారి అర్హతలు ఏమైయుండెను?
15 కేవలం వయస్సునుబట్టి న్యాయాధిపతులుగా సేవచేయువారిని ఎంపిక చేసికొనుట కాదని చూడవచ్చును. మోషే ఇట్లనెను: “జ్ఞానవివేకములు కలిగి, మీమీ గోత్రములలో ప్రసిద్ధిచెందిన మనుష్యులను ఏర్పరచుకొనుడి వారిని మీమీద నియమించెదను.” (ద్వితీయోపదేశకాండము 1:13) అనేక సంవత్సరాల క్రితం యౌవనుడైన ఎలీహు చెప్పిన మాటలను మోషే నిర్దిష్టముగా ఎరిగియుండెను: “వృద్ధులు మాత్రమే జ్ఞానవంతులు కారు, బహువయస్సు గలవారు ఒకప్పుడు న్యాయము తెలిసినవారు కారు.” (యోబు 32:9) నిశ్చయముగా, నియమించబడువారు “ప్రసిద్ధిచెందిన” వారై యుండవలెను. అన్నింటికంటె ఎక్కువగా వారు సామర్థ్యము, దైవభక్తి, సత్యాసక్తి కలిగి, లంచగొండులుకాని వారిగాను, జ్ఞానవివేకములు గలవారిగాను ఉండవలెను. కావున, యెహోషువ 23:2 మరియు 24:1లో ప్రస్తావించబడిన ఆ “ప్రధానులు,” “న్యాయాధిపతులు” అదే వచనములలో చెప్పబడిన “పెద్దలలో” నుండి వేరుగా యున్నవారు కాదుగాని వారిలోనుండే ఏర్పరచబడిన వారని స్పష్టమగుచున్నది.—ఇన్సైట్ ఆన్ ది స్క్రిప్చర్స్, సంపుటి 2, పుట 549 చూడుము.
న్యాయము తీర్చుట
16. క్రొత్తగా నియమించబడిన న్యాయాధిపతులకు మోషే ఇచ్చిన ఉపదేశములను గూర్చి మనమీనాడు ఏమి గమనించవలెను?
16 ఈ నియమిత న్యాయాధిపతులకు ఇవ్వబడిన ఉపదేశములను గూర్చి మోషే ఇలాచెప్పెను: “నేను మీ న్యాయాధిపతులతో—మీ సహోదరుల వ్యాజ్యెములను తీర్చి, ప్రతి మనుష్యునికిని వాని సహోదరునికిని వానియొద్దనున్న పరదేశికిని న్యాయమునుబట్టి మీరు తీర్పు తీర్చవలెను. తీర్పుతీర్చునప్పుడు అల్పుల సంగతిగాని ఘనుల సంగతిగాని పక్షపాతము లేకుండ వినవలెను; న్యాయపుతీర్పు దేవునిదే. కాబట్టి మీరు మనుష్యుని ముఖముచూచి భయపడవద్దు. మీకు అసాధ్యమైన కఠినవ్యాజ్యెమును నాయొద్దకు [మోషే] తీసికొనిరావలెను; నేను దానిని విచారించెదను.”—ద్వితీయోపదేశకాండము 1:16, 17.
17. న్యాయాధిపతులుగా ఎవరు నియమించబడిరి, మరియు యెహోషాపాతు వారికి ఎటువంటి హెచ్చరిక చేసెను?
17 అయితే మోషే జీవించినంతకాలము మాత్రమే వ్యాజ్యెమును ఆయనయొద్దకు తీసుకువెళ్లడం సాధ్యమే. అందువలన కఠినవ్యాజ్యెములు యాజకుల యొద్దకు, లేవీయుల యొద్దకు, ప్రత్యేకంగా నియమించబడిన న్యాయాధిపతుల యొద్దకు తీసుకువెళ్లు ఏర్పాట్లుకూడ చేయబడెను. (ద్వితీయోపదేశకాండము 17:8-12; 1 దినవృత్తాంతములు 23:1-4; 2 దినవృత్తాంతములు 19:5, 8) యూదా దేశమందలి పట్టణములలో తాను నియమించిన న్యాయాధిపతులకు యెహోషాపాతు ఇట్లు చెప్పాడు: “మీరు యెహోవా నియమమును బట్టియే గాని మనుష్యుల నియమమునుబట్టి తీర్పు తీర్చవలసినవారు కారు; . . . యెహోవాయందు భయభక్తులు కలిగినవారై, నమ్మకముతోను యథార్థ మనస్సుతోను మీరు ప్రవర్తింపవలెను. . . . ఆయాపట్టణములో నివసించు మీ సహోదరులు తెచ్చు ఏ సంగతినేగాని మీరు విమర్శించునప్పుడు, మీమీదికిని మీ సహోదరుల మీదికిని కోపము రాకుండునట్లు వారు యెహోవా దృష్టికి ఏ అపరాధమును చేయకుండ వారిని హెచ్చరిక చేయవలెను; మీరాలాగు చేసిన యెడల అపరాధులు కాకయుందురు.”—2 దినవృత్తాంతములు 19:6-10.
18. (ఎ) ఇశ్రాయేలీయులలో న్యాయాధిపతులు అనువర్తించవలసిన సూత్రములు కొన్ని ఏమైయుండెను? (బి) న్యాయాధిపతులు ఏమి గుర్తుంచుకొనవలెను, మరియు దీనిని వారు మరచిపోవుట యొక్క పరిణామములను ఏ లేఖనములు చూపించుచున్నవి?
18 ఇశ్రాయేలీయులలోని న్యాయాధిపతులు అనువర్తింపజేయవలసిన సూత్రములలో ఈ క్రిందివి చేరియుండెను: బీదలకు ధనికులకు ఒకటే న్యాయము (నిర్గమకాండము 23:3, 6; లేవీయకాండము 19:15); ఖండితముగా పక్షపాతము చూపకుండుట (ద్వితీయోపదేశకాండము 1:17); లంచము పుచ్చుకొనకుండుట. (ద్వితీయోపదేశకాండము 16:18-20) న్యాయాధిపతులు ఎల్లవేళల తాము యెహోవా గొర్రెలకు తీర్పుతీర్చుచున్నామని గుర్తుంచుకొనవలసి యుండెను. (కీర్తన 100:3) వాస్తవానికి, ఇశ్రాయేలీయులను యెహోవా తిరస్కరించుటకుగల ఒక కారణమేమనగా వారి యాజకులు, కాపరులు నీతిననుసరించి న్యాయము తీర్చుటలో విఫలులై ప్రజలను కఠినముగా చూచుటయే.—యిర్మీయా 22:3, 5, 25; 23:1, 2; యెహెజ్కేలు 34:1-4; మలాకీ 2:8, 9.
19. సామాన్య శకమునకు పూర్వము యెహోవా యొక్క న్యాయకట్టడల ఈ పరీక్ష మనకు ఎటువంటి విలువను కల్గియున్నది, తర్వాతి శీర్షికలో ఏమి విచారించబడును?
19 యెహోవా మార్పుచెందడు. (మలాకీ 3:6) ఇశ్రాయేలీయులలో న్యాయము తీర్చబడిన విధానము మరియు న్యాయము జరిగించకపోవుటను యెహోవా ఎట్లు దృష్టించునను విషయముల ఈ క్లుప్త పునఃసమీక్ష, ఈనాడు న్యాయ నిర్ణయముచేయు బాధ్యతను కలిగియున్న పెద్దలు ఆగి ఒక క్షణం ఆలోచించునట్లు చేయవలెను. న్యాయాధిపతిగా యెహోవా మాదిరి, ఇశ్రాయేలీయులలో ఆయన నెలకొల్పిన న్యాయవిధానము, స్థిరపర్చబడిన సూత్రములు క్రైస్తవ సంఘములో న్యాయమును అమలుచేయుటకు మాదిరినుంచుచున్నది. తర్వాతి శీర్షికలో దీనిని మనము చూచెదము. (w92 7/1)
పునఃసమీక్షా ప్రశ్నలు
◻ న్యాయముతీర్చు యెహోవా విధానమును ఎట్లు క్లుప్తీకరించవచ్చును?
◻ కయీనుతో, జలప్రళయము ముందున్న తరమువారితో తన వ్యవహారములందు యెహోవా విధానము ఎట్లు మాదిరికరముగా ఉండెను?
◻ పితరుల కాలములలో న్యాయాధిపతులుగా ఎవరు వ్యవహరించిరి మరియు ఎందుకు?
◻ ఇశ్రాయేలీయుల న్యాయ విధానమును ఇతర జనాంగములనుండి ఏది వేరుచేసినది?
◻ ఇశ్రాయేలీయులలో ఎటువంటి మనుష్యులు న్యాయాధిపతులుగా నియమించబడేవారు, వారు ఏ సూత్రములను అనుసరించి యుండవచ్చును?
[10వ పేజీలోని చిత్రాలు]
పితరుల కాలములలో, ఇశ్రాయేలీయులలో నియమిత పెద్దలు పట్టణ గవినియొద్ద న్యాయము తీర్చెడివారు