మీ క్రైస్తవ స్వాతంత్ర్యమును తెలివిగా ఉపయోగించుడి
“స్వతంత్రులైయుండి, దేవుని దాసులుగా మీ స్వాతంత్ర్యమును వినియోగపరచుడి.”—1 పేతురు 2:16.
1. ఆదాము ఏ స్వాతంత్ర్యమును పోగొట్టుకొనెను, ఏ స్వాతంత్ర్యమునకు యెహోవా మానవజాతిని పునరుద్ధరించును?
ఏదెను వనములో మన ఆది తలిదండ్రులు పాపము చేసినప్పుడు, వారు తమ పిల్లలకొరకు మహిమగల వారసత్వమును అనగా పాపము, క్షయతనుండి లభించు స్వాతంత్ర్యమును పోగొట్టుకొనిరి. దాని ఫలితముగా, మనందరము క్షయత, మరణములకు దాసులుగా జన్మించాము. అయితే సంతోషదాయకమైన సంగతేమంటె, నమ్మకమైన మానవులకు అద్భుతకరమైన స్వాతంత్ర్యమును పునరుద్ధరించుటకు యెహోవా సంకల్పించియున్నాడు. ఈనాడు, సహృదయులు “దేవుని కుమారుల ప్రత్యక్షత” కొరకు ఆశతో ఎదురుచూచుచున్నారు, దాని ఫలితముగా వారు ‘నాశనమునకు లోనయిన దాస్యములోనుండి విడిపింపబడి, దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యమును పొందుదురు.’—రోమీయులు 8:19-21.
‘ప్రకటించుటకై అభిషేకించబడుట’
2, 3. (ఎ) “దేవుని కుమారులు” ఎవరు? (బి) వారు ఏ అద్భుతకరమైన స్థానమును కలిగియున్నారు, ఏ బాధ్యతతో?
2 ఈ “దేవుని పిల్లలు” ఎవరు? వారు పరలోక రాజ్యములో యేసుతోపాటు రాజులుగా ఉండబోవు తన ఆత్మాభిషేక సహోదరులై యున్నారు. వీరిలోని తొలిసభ్యులు సా.శ. మొదటి శతాబ్దములో కన్పించిరి. వారు యేసు బోధించిన స్వతంత్రులనుచేసే సత్యమును అంగీకరించిరి, మరియు సా.శ. 33 పెంతెకొస్తు నుండి, “ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తయిన ప్రజలునై యున్నారు” అని పేతురు వారికి వ్రాస్తు తెలిపిన మహిమాన్వితమైన ఆధిక్యతలలో వారు పాలుపంచుకొనిరి.—1 పేతురు 2:9; యోహాను 8:32.
3 దేవుని సొత్తయిన ప్రజలుగా ఉండుట—ఎంత అద్భుతకరమైన ఆశీర్వాదము! దేవుని ఈ అభిషక్త కుమారుల ఆధునిక-కాల శేషము దేవుని యెదుట అటువంటి దీవెనకరమైన స్థానమునే కలిగియున్నారు. అయితే అటువంటి ఉన్నతమైన ఆధిక్యతతోబాటు బాధ్యతలుకూడ వచ్చును. వీటిలో ఒకదానిపై దృష్టినిల్పుచు పేతురు ఇంకను ఇట్లనుచున్నాడు: “మీరు చీకటిలోనుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము” చేయవలెను.—1 పేతురు 2:9.
4. వారి స్వాతంత్ర్యముతోపాటు వచ్చు బాధ్యతను అభిషక్త క్రైస్తవులు ఎట్లు నెరవేర్చారు?
4 దేవుని గుణాతిశయములను ప్రచురము చేయవలెనను యీ బాధ్యతను అభిషక్త క్రైస్తవులు నెరవేర్చిరా? అవును నెరవేర్చిరి. 1919నుండి ఉన్న అభిషక్తులను గూర్చి ప్రవచనార్థకముగా మాట్లాడుచు, యెషయా ఇట్లనెను: “ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చియున్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకును చెరలోనున్న వారికి విడుదలను బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును దుఃఖక్రాంతులందరిని ఓదార్చుటకును . . . ఆయన నన్ను పంపియున్నాడు.” (యెషయా 61:1-3) ఈ లేఖనము ప్రాథమికముగా అన్వయింపబడిన యేసు మాదిరిని అనుసరించుచు, ఈనాడు అభిషక్తుల శేషము స్వాతంత్ర్యమును గూర్చిన సువార్తను ఆసక్తితో ఇతరులకు ప్రకటించుచున్నది.—మత్తయి 4:23-25; లూకా 4:14-21.
5, 6. (ఎ) అభిషక్త క్రైస్తవుల ఉత్సాహపూరిత ప్రకటన ఫలితమేమి? (బి) గొప్పసమూహమునకు సంబంధించిన వారు ఏ ఆధిక్యతలను, బాధ్యతలను కలిగియున్నారు?
5 వారి ఉత్సాహపూరిత ప్రకటింపు పని ఫలితముగా, ఈ చివరి దినములలో ప్రపంచమందు వేరేగొర్రెలకు సంబంధించిన గొప్ప సమూహము ప్రత్యక్షమైనది. యెహోవాను సేవించుటలో అభిషక్తులతో చేరుటకు వీరు అన్ని జనాంగములలోనుండి వచ్చిరి, మరియు సత్యము వీరినికూడ స్వతంత్రులుగా చేసెను. (జెకర్యా 8:23; యోహాను 10:16) విశ్వాసమునుబట్టి వారు అబ్రాహాము వలెనే నీతిమంతులని ప్రకటింపబడి, వారు యెహోవా దేవునితో ఒక సన్నిహిత సంబంధం లోనికి వచ్చారు. రాహాబు వలెనే నీతిమంతులని వారు ప్రకటింపబడుట వారిని రక్షింపబడువారి వరుస క్రమములో ఉంచినది—వీరు హార్మెగిద్దోనులో రక్షింపబడుదురు. (యాకోబు 2:23-25; ప్రకటన 16:14, 16) అయితే అటువంటి ఉన్నతిచేయబడిన ఆధిక్యతలు, దేవుని మహిమనుగూర్చి ఇతరులకు చెప్పవలసిన బాధ్యతనుకూడ అనివార్యం చేయును. అందుకే, “సింహాసనాసీనుడైన మా దేవునికిని గొఱ్ఱెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పుచు” వారు బహిరంగముగా యెహోవాను స్తుతించినట్లు యోహాను దర్శనములో చూచెను.—ప్రకటన 7:9, 10, 14.
6 కొద్దిమందిగాయున్న అభిషక్త శేషముతో కలిసి ఇప్పుడు నలభైలక్షలకు పైగానున్న గొప్పసమూహము యెహోవా గుణాతిశయములను సుదూర ప్రాంతములలో ప్రచురము చేయుచు, పోయిన సంవత్సరము దాదాపు నూరుకోట్ల గంటలు గడిపిరి. ఇది వారి ఆత్మీయ స్వాతంత్ర్యమును సాధ్యమైనంత శ్రేష్ఠమైన రీతిలో ఉపయోగించుటయై యున్నది.
“రాజును సన్మానించుడి”
7, 8. లోక అధికారము యెడల ఏ బాధ్యతను క్రైస్తవ స్వాతంత్ర్యము అనివార్యం చేయుచున్నది, ఈ విషయంలో మనమే తప్పుడు దృక్పధమును విసర్జించవలెను?
7 మన క్రైస్తవ స్వాతంత్ర్యము ఇతర బాధ్యతలను అనివార్యం చేయుచున్నది. వీటిలో కొన్నింటిని పేతురు సూచించుచు ఇట్లు వ్రాశాడు: “అందరిని సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజును సన్మానించుడి.” (1 పేతురు 2:17) “రాజును సన్మానించుడి” అను మాట భావమేమి?
8 “రాజు” లోక పాలకులను సూచించుచున్నాడు. ఈనాడు, లోకములో అధికారముయెడల అగౌరవ భావము పెరిగిపోయినందున, ఇది క్రైస్తవులపై సులభముగా ప్రభావము చూపగలదు. “లోకమంతయు దుష్టునియందున్నది” గనుక తానెందుకు “రాజును” గౌరవించాలి అనికూడ ఒక క్రైస్తవుడు ఆలోచించవచ్చును. (1 యోహాను 5:19) ఈ మాటల దృష్ట్యా, అతడు తనకు అనుకూలముకాని నియమాలకు లోబడకూడదని భావించవచ్చును, తప్పించుకోగలిగితే అతడు పన్నులు ఎగవేయవచ్చును. అయితే ఇలాచేయుట “కైసరువి కైసరునకు . . . చెల్లించుడి” అని యేసు స్పష్టముగా చెప్పిన ఆజ్ఞకు వ్యతిరేకమైయున్నది. నిజానికి అది ‘దుష్టత్వమును కప్పిపుచ్చుటకు తన స్వాతంత్ర్యమును ఉపయోగించుటయై’ యుండును.—మత్తయి 22:21; 1 పేతురు 2:16.
9. లోక అధికారమునకు లోబడియుండుటకు ఏ రెండు మంచి కారణములు కలవు?
9 అది పరిమితమై యున్నను, క్రైస్తవులు అధికారమును గౌరవించి దానికి లోబడు బాధ్యతను కలిగియున్నారు. (అపొ. కార్యములు 5:29) ఎందుకు? 1 పేతురు 2:14, 15లో పేతురు మూడు కారణములను సూచించుచు, పరిపాలకులు “దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును సన్మార్గులకు మెప్పు కలుగుటకును” దేవునిచే పంపబడిరని చెప్పుచున్నాడు. అధికారమునకు లోబడుటకు శిక్షాభయము సరిపోవును. దాడిచేసినందుకు, దొంగతనమునకు లేక ఇతర నేరమునకు జరిమానా విధించబడుట లేక జైలులో వేయబడుట ఒక యెహోవాసాక్షికి ఎంత అవమానకరమై యుండును! అటువంటి దానిని ప్రచారము చేయుటకు కొందరెట్లు ఉరకలువేయుదురో ఊహించుము! మరోవైపున, పౌరవిధేయత విషయములో మనము మంచిపేరును పెంపొందించుకొనుచు వుంటే, మంచి మనస్సుగల పాలనాధికారులు మనలను మెచ్చుకుంటారు. సువార్త ప్రకటించు పని చేయుటకు మనకు మరింత స్వాతంత్ర్యము ఇవ్వబడవచ్చును. పైగా, ‘మేలుచేయుట ద్వారా మనము అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు మూయించుదుము.’ (1 పేతురు 2:15) అధికారమునకు లోబడుటకు ఇది రెండవ కారణము.—రోమీయులు 13:3.
10. లోక అధికారమునకు లోబడియుండుటకు అత్యంత బలమైన కారణమేది?
10 అయితే మరో బలమైన కారణముకూడ కలదు. అధికారులు యెహోవా అనుమతి చొప్పుననే ఉనికిలో ఉన్నారు. పేతురు చెప్పునట్లుగా, రాజకీయ పరిపాలకులు యెహోవాచే “పంపబడిన” వారైయున్నారు, మరియు క్రైస్తవులు వారికి లోబడియుండ వలెననుట “దేవుని చిత్తమై” యున్నది. (1 పేతురు 2:15) అదేప్రకారము అపొస్తలుడైన పౌలు కూడ యిలా చెప్పుచున్నాడు: “ఉన్న అధికారములు దేవునివలననే నియమింపబడియున్నవి (వాటి పరిమిత స్థానములలో ఉన్నవి NW).” కావున బైబిలు శిక్షణ పొందిన మన మనస్సాక్షి అధికారులకు లోబడునట్లు మనలను పురికొల్పును. వారికి లోబడుటకు మనము తిరస్కరించినట్లయిన, మనము “దేవుని నియమమును ఎదిరించుచున్న” వారమగుదుము. (రోమీయులు 1:1, 2, 5) మనలో ఎవరు ఇష్టపూర్వకముగా దేవుని నియమమును ఎదిరించుటకు కోరుకుంటారు? అలాచేస్తే అది ఎంతగా క్రైస్తవ స్వాతంత్ర్యమును దుర్వినియోగపరచునదై యుండును!
“సహోదరులను ప్రేమించుడి”
11, 12. (ఎ) క్రైస్తవ స్వాతంత్ర్యముతోపాటు తోటి విశ్వాసుల యెడల ఏ బాధ్యతకూడ నెరవేర్చాలి? (బి) మన ప్రేమపూర్వక శ్రద్ధకు ప్రత్యేకముగా ఎవరు అర్హులైయున్నారు, ఎందుకు?
11 క్రైస్తవులు తమ ‘సహోదరుల సమూహమంతటిని ప్రేమించవలెనని’ కూడ పేతురు చెప్పెను. (1 పేతురు 2:17) ఇది క్రైస్తవ స్వాతంత్ర్యముతోపాటు వచ్చు మరొక బాధ్యతయై యున్నది. మనలో ఎక్కువమందిమి ఒక సంఘమునకు చెందియుందుము. నిజానికి, మనందరము ఒక అంతర్జాతీయ సహోదరుల సహవాసమునకు లేక సంస్థకు చెందిన వారమై యున్నాము. వీరియెడల ప్రేమ చూపించుట మన స్వాతంత్ర్యమును తెలివిగా ఉపయోగించుటయై యున్నది.—యోహాను 15:12, 13.
12 మన ప్రేమకు విశేషముగా పాత్రులైన ఒక క్రైస్తవుల గుంపును అపొస్తలుడైన పౌలు ప్రత్యేకించుచున్నాడు. ఆయనిట్లనెను: “మీపైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారివలె మీ ఆత్మలను కాయుచున్నారు; వారు దుఃఖముతో ఆ పని చేసినయెడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక, ఆనందముతో చేయునట్లు వారి మాట విని, వారికి లోబడియుండుడి.” (హెబ్రీయులు 13:17) సంఘములో నాయకత్వం తీసికొను వారు పెద్దలైయున్నారు. నిజమే, ఈ మనుష్యులు పరిపూర్ణులు కారు. అయినప్పటికిని, వారు పరిపాలక సభ పర్యవేక్షణ క్రింద నియమింపబడిరి. వారు మాదిరిచూపుచు శ్రద్ధతో నడిపింతురు, మరియు మన ఆత్మలను కాయు బాధ్యత వారికి అప్పగింపబడినది. ఎంత బాధ్యతాయుతమైన పని! (హెబ్రీయులు 13:7) సంతోషదాయకముగా, అధిక సంఘాలలో చక్కనైన మరియు సహకరించు ఆత్మగలదు, కాగా వారితో కలిసిపనిచేయుట పెద్దలకు ఆనందదాయకము. సంఘసభ్యులు సహకరించనట్లయిన అదెంతో కష్టముగా ఉండును. ఆ పెద్ద ఇంకను తన పనిని నెరవేర్చును, అయితే పౌలు చెప్పునట్లుగా అతడు దానిని “దుఃఖముతో” చేయును. నిశ్చయముగా మనము పెద్దలు దుఃఖపడునట్లు చేయుటకు ఇచ్ఛయించము. మనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు వారు వారి పనిలో ఆనందము కనుగొనవలెనని మనము కోరుకొందుము.
13. పెద్దలతో మనము సహకరించగల కొన్ని మార్గములు ఏమైయున్నవి?
13 మనము పెద్దలతో సహకరించగల కొన్ని మార్గములు ఏమైయున్నవి? వాటిలో ఒకటి రాజ్యమందిరమును శుభ్రపరచి దానిని ఎప్పటికప్పుడు తీర్చిదిద్దుటకు సహాయము చేయుటయై యున్నది. మరొక సంగతి ఏమనగా, రోగులను సందర్శించుటలో, వికలాంగులకు సహాయము చేయుటలో సహకరించుట. వీటికితోడు, మనమొక భారముగా తయారుకాకుండుటకు, ఆత్మీయముగా బలముగా ఉండుటకు మనము కృషిచేయవచ్చును. సహకరించుటలో ఒక ప్రాముఖ్యమైన సంగతి సంఘముయొక్క నైతిక, ఆత్మీయ పరిశుభ్రతను కాపాడుటలో చేరియున్నది. దీనిని మనం మన స్వంత ప్రవర్తన ద్వారా, మన దృష్టికివచ్చు గంభీరమైన పాపములను గూర్చి తెలియజేయుట ద్వారా చేయగలము.
14. పెద్దలు తీసికొనిన క్రమశిక్షణా చర్యతో మనమెట్లు సహకరించవలెను?
14 కొన్నిసార్లు సంఘమును పరిశుభ్రముగా ఉంచుటకు, పెద్దలు పశ్చాత్తాపము చూపని తప్పిదస్థుని బహిష్కరించవలసి యుండును. (1 కొరింథీయులు 5:1-5) ఇది సంఘమును కాపాడును. అది ఆ తప్పిదస్థునికిని సహాయముచేయును. తరచు, అటువంటి క్రమశిక్షణా చర్య పాపికి బుద్ధివచ్చునట్లు చేయుటకు సహాయముచేసి యున్నది. బహిష్కరింపబడిన వ్యక్తి మన సన్నిహిత స్నేహితుడో లేక బంధువో అయినట్లయిన అప్పుడేమి? ఆ వ్యక్తి మన తండ్రో, తల్లో లేక మన కొడుకో, కూతురో అనుకుందాం. అప్పుడుకూడ పెద్దలు తీసికొనిన చర్యను మనము గౌరవింతుమా? నిజమే, అది కష్టంగా ఉండవచ్చును. అయితే పెద్దల తీర్మానమును ప్రశ్నించి, సంఘములో చెడు ప్రభావము చూపువాడని నిరూపించబడిన వ్యక్తితో ఆత్మీయ సహవాసము చేయుట ఎంతగా మన స్వాతంత్ర్యమును దుర్వినియోగపరచుటయై యుండును! (2 యోహాను 10, 11) అటువంటి విషయాలలో వారు సహకరించు విధానానికి యెహోవా ప్రజలను ఒక గుంపుగా మెచ్చుకొనవలెను. తత్ఫలితముగా, అవినీతినిండిన ఈ లోకంలో యెహోవా సంస్థ నిష్కల్మషముగా నిలిచియుండును.—యాకోబు 1:27.
15. ఒక వ్యక్తి గంభీరమైన పాపము చేసినట్లయిన, అతడు వెంటనే ఏమి చేయవలెను?
15 మనము ఒక గంభీరమైన పాపము చేసినట్లయిన అప్పుడేమి? యెహోవా ఎవరిపై అనుగ్రహము చూపునో రాజైన దావీదు వర్ణించుచు ఇట్లనెను: “యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దానియందు మనస్సు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులును శుద్ధమైన హృదయమును కలిగియుండు వాడే.” (కీర్తన 24:3, 4) ఏదో కారణముచేతనైనా మనము ‘నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయము గలవారిగా’ లేనట్లయిన, మనము అత్యవసరముగా చర్య గైకొనవలెను. మన నిత్యజీవము అపాయములో ఉన్నది.
16, 17. గంభీరమైన పాపములు చేసిన దోషి స్వయంగా అట్టివాటిని పరిష్కరించుకొనుటకు ఎందుకు ప్రయత్నించకూడదు?
16 కొందరు గంభీరమైన పాపములను దాచిపెట్టుటకు శోధింపబడిరి. బహుశ వారిట్లు తర్కించుకొనియుండవచ్చును: ‘నేను యెహోవాయెదుట ఒప్పుకొని పశ్చాత్తాపపడ్డాను. కాబట్టి దీనిలో పెద్దలనెందుకు ఇమడ్చాలి?’ పెద్దలు ఏమోచేస్తారని ఆ తప్పిదస్థుడు కలతచెంద వచ్చును లేక భయపడ వచ్చును. కేవలము యెహోవా మాత్రమే మనలను పాపమునుండి శుద్ధిచేయగలవాడైనను, సంఘ స్వచ్ఛత విషయములో ఆయన ప్రాథమికముగా పెద్దలను బాధ్యులనుగా చేసియున్నాడని అతడు గుర్తుంచుకొనవలెను. (కీర్తన 51:2) స్వస్థత చేకూర్చుటకు, “పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు” చూచుటకు వారున్నారు. (ఎఫెసీయులు 4:12) మనకు ఆత్మీయ సహాయము అవసరమైనప్పుడు వారి దగ్గరకు వెళ్లకుండుట మనము రోగగ్రస్తులమైనప్పుడు వైద్యుని దగ్గరకు వెళ్లకుండుటను పోలియుండును.
17 స్వయంగా అట్టివాటిని పరిష్కరించుకొనుటకు ప్రయత్నించు కొందరు నెలలు లేక సంవత్సరముల తర్వాత, వారి మనస్సాక్షి ఇంకను వారిని తీవ్రముగా బాధించుచున్నట్లు కనుకొనిరి. మరింత హీనముగా, గంభీరమైన అపరాధములను దాచిపెట్టువారు రెండవసారి, మూడవసారికూడ పాపములో పడిపోవుదురు. చివరకు ఆ విషయము పెద్దల దృష్టికి వచ్చునప్పటికి, అది పదేపదే చేసిన తప్పిదముగా ఉండును. కావున యాకోబు ఇచ్చిన సలహా పాటించుట ఎంత శ్రేష్ఠము! ఆయనిట్లు వ్రాసెను: “మీలో ఎవడైనను రోగియై యున్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను; వారు ప్రభువు (యెహోవా NW) నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను.” (యాకోబు 5:14) స్వస్థత చేకూర్చుటకు ఇంకను సమయముండగానే పెద్దలయొద్దకు వెళ్లుము. మనమెక్కువ కాలము వేచియున్నట్లయిన, పాపము విషయములో మనము మరింత కఠినులము కావచ్చును.—ప్రసంగి 3:3; యెషయా 32:1, 2.
రూపురేఖలు మరియు వినోదము
18, 19. ఒక మతగురువు ఎందుకు యెహోవాసాక్షులను గూర్చి అభిమాన పూర్వకముగా వ్యాఖ్యానించెను?
18 ఐదు సంవత్సరాల క్రితము, చర్చికి సంబంధించిన ఒక పత్రికలో, ఇటలీనందలి ఒక కాథోలిక్ మతగురువు యెహోవాసాక్షులను గూర్చి స్నేహపూర్వకముగా మాట్లాడెను.a ఆయనిట్లనెను: “వ్యక్తిగతంగా నేను యెహోవాసాక్షులంటె ఇష్టపడతాను; దానిని నేను ధైర్యంగా ఒప్పుకుంటాను. . . . వారిలో నాకు తెలిసిన వారు మచ్చలేని మర్యాదస్థులు, మృదువుగా మాట్లాడువారు . . . [మరియు] చక్కగా ఒప్పింపజేయగలవారు. సత్యమునకు ఆమోదయోగ్యమైన అలంకరణ అవసరమని మనమెప్పుడు అర్థం చేసికుంటాము? సత్యమును ప్రకటించువారు అర్థహృదయులుగా, శరీర దుర్వాసనతో, చింపిరి జుట్టుతో, అశుభ్రముగా ఉండనవసరము లేదు.”
19 ఈ మాటల ప్రకారము ఇతర విషయాలతోపాటు ఆ మతగురువు, యెహోవాసాక్షుల వస్త్రధారణ మరియు ప్రవర్తన విషయములో ముగ్ధుడయ్యాడు. ఆయన కలిసికొనిన వారు స్పష్టముగా అనేక సంవత్సరాలనుండి “నమ్మకమును బుద్ధిమంతుడునైన దాసుడు” ఇచ్చిన సలహాను లక్ష్యపెట్టిరి. (మత్తయి 24:45) స్త్రీల వస్త్రధారణ ‘చక్కగా అమర్చబడి నమ్రతతో కూడినదై’ యుండవలెనని బైబిలు చెప్పుచున్నది. (1 తిమోతి 2:9) దిగజారిన యీ కాలములో, ఆ సలహా పురుషులకూ అవసరమే. దేవునిరాజ్య ప్రతినిధులు బయటివారికి గౌరవప్రదమైన వారిగా కనుపరచుకొనుట న్యాయసమ్మతము కాదా?
20. ఒక క్రైస్తవుడు అన్ని సమయాలలో తన దుస్తులనుగూర్చి ఎందుకు శ్రద్ధ కలిగియుండవలెను?
20 కూటములకు, ప్రాంతీయ పరిచర్యకు వెళ్లునప్పుడు తాము ధరించు వస్త్రముల విషయమై జాగ్రత్తగా ఉండాలని కొందరు అంగీకరించవచ్చును, అయితే ఇతర సమయాలలో బైబిలు సూత్రములు అన్వయింపవని వారు భావించవచ్చును. అయితే, మనమెప్పుడైనా దేవునిరాజ్య ప్రతినిధులుగా ఉండుటకు విరమించుకొందుమా? నిజమే, పరిస్థితులు పలువిధములుగా ఉండవచ్చును. రాజ్యమందిర నిర్మాణపు పనిలో మనము సహాయము చేయుచున్నట్లయిన, అదే రాజ్యమందిరమందలి కూటమునకు హాజరగునప్పుడు ధరించు వస్త్రములవంటి వస్త్రములు ధరించము. తీరికవేళల్లో, మనము బహుశ సాదాసీదా దుస్తులను ధరించవచ్చును. అయితే ఇతరులు మనలను గమనించునప్పుడెల్లా, అన్ని సమయాల్లోను మన వస్త్రధారణ చక్కగా అమర్చబడి నమ్రతతో కూడినదై యుండవలెను.
21, 22. హానికరమైన వినోదము నుండి మనమెట్లు కాపాడబడుచున్నాము, అటువంటి విషయాలపై ఇవ్వబడు సలహాను మనమే విధముగా దృష్టించవలెను?
21 ఎక్కువ దృష్టినిలుపవలసిన మరొక రంగము వినోదము. మానవులకు—ప్రత్యేకముగా యువతకు—వినోదము అవసరము. కుటుంబము కొరకు వినోద సమయాన్ని ఏర్పాటుచేయుట పాపము కాదు, సమయాన్ని వృథాచేయుట కాదు. “అలసట తీర్చుకొనుడని” యేసు సహితము తన శిష్యులను ఆహ్వానించెను. (మార్కు 6:31) కాని ఆ వినోదము ఆత్మీయ కల్మషమునకు దారితీయకుండునట్లు జాగ్రత్తపడుము. లైంగిక అవినీతిని, విపరీతమైన హింసను, భయానక దృశ్యాలను, అభిచారమును విస్తృతముగా ప్రదర్శించు వినోదముగల లోకములో మనము జీవించుచున్నాము. (2 తిమోతి 3:3; ప్రకటన 22:15) అటువంటి అపాయముల విషయాలలో నమ్మకమును బుద్ధిమంతుడునైన దాసుడు మెలకువగాయుండి, వాటినిగూర్చి మనలను తదేకముగా హెచ్చరించుచున్నాడు. ఈ జ్ఞాపికలు నీ స్వాతంత్ర్యమును భంగపరచునవని నీవు భావించుచున్నావా? లేక అటువంటి అపాయములను తదేకముగా నీ దృష్టికి తీసుకువచ్చుటకు యెహోవా సంస్థ తగిన జాగ్రత్త తీసుకొనుచున్నదని నీవు కృతజ్ఞత కలిగియున్నావా?—కీర్తన 19:7; 119:95.
22 మన స్వాతంత్ర్యము యెహోవానుండి వచ్చునదైనను, దానిని మనమెట్లు ఉపయోగించుదుమను విషయములో మనకు బాధ్యతగలదని ఎన్నటికి మరచిపోకుము. మనము మంచి సలహాను పెడచెవినబెట్టి తప్పుడు నిర్ణయాలు చేసినట్లయిన, దానికి మనమెవరినో నిందించలేము. అపొస్తలుడైన పౌలు ఇట్లు చెప్పుచున్నాడు: “మనలో ప్రతివాడును తన్నుగురించి దేవునికి లెక్క యొప్పగింపవలెను.”—రోమీయులు 14:12; హెబ్రీయులు 4:13.
దేవుని పిల్లలు పొందబోవు స్వాతంత్ర్యము కొరకు నిరీక్షించుము
23. (ఎ) స్వాతంత్ర్యము విషయమై మనమిప్పుడు ఏ ఆశీర్వాదములను అనుభవించుచున్నాము? (బి) ఏ దీవెనల కొరకు మనము ఆశతో ఎదురుచూస్తున్నాము?
23 మనము నిజముగా ఆశీర్వదించబడిన ప్రజలము. అబద్ధమతము నుండి, మూఢనమ్మకము నుండి మనము స్వతంత్రులమై యున్నాము. విమోచన క్రయధనమునకు కృతజ్ఞతలు, పాపమరణముల దాసత్వము నుండి ఆత్మీయ రీతిలో స్వతంత్రము గలవారిగా, మనమిప్పుడు పరిశుభ్రపరచబడిన మనస్సాక్షితో యెహోవాను సమీపించగలము. త్వరలోనే “దేవుని కుమారుల ప్రత్యక్షత” కనబడును. హర్మెగిద్దోనులో, తమ పరలోక మహిమతోవచ్చు యేసు సహోదరులు మానవులకు యెహోవా శత్రువులను నాశనము చేయువారిగా కన్పించుదురు. (రోమీయులు 8:19; 2 థెస్సలొనీకయులు 1:6-8; ప్రకటన 2:26, 27) ఆ తర్వాత, దేవుని ఈ కుమారుల ప్రత్యక్షత మానవజాతికి దేవుని సింహాసనమునుండి ప్రవహించు దీవెనలకు మార్గాలుగా ఉండును. (ప్రకటన 22:1-5) చివరకు, దేవుని కుమారుల యీ ప్రత్యక్షత ఫలితముగా నమ్మకమైన మానవజాతి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యముచే ఆశీర్వదించబడును. ఆ కాలమును నీవు కోరుదువా? అట్లయిన నీ క్రైస్తవ స్వాతంత్ర్యమును తెలివిగా ఉపయోగించుము. ఇప్పుడే దేవుని దాసుడవు కమ్ము, ఫలితముగా నీవు నిత్యము అట్టి అద్భుతమైన స్వాతంత్ర్యమును అనుభవించుదువు. (w92 6/1)
[అధస్సూచీలు]
a ఆ మతగురువు, తీసుకురాబడిన వత్తిడి కారణముగా ఆ తర్వాత ఈ మెప్పుకోలును ఉపసంహరించుకున్నాడు.
పునఃసమీక్షా భాగము
◻ అభిషక్తులు, వేరేగొర్రెలు యెహోవాను ఎట్లు మహిమపరచిరి?
◻ లోక అధికారమును క్రైస్తవులు ఎందుకు గౌరవించవలెను?
◻ ఒక క్రైస్తవుడు పెద్దలతో ఏయే విధములుగా సహకరించ గలడు?
◻ దుస్తుల విషయములో, యెహోవాసాక్షులు ఎందుకు లోకములోనున్న అనేకులకు భిన్నమై యున్నారు?
◻ వినోదము విషయములో మనము దేనిని విడనాడవలెను?
[10వ పేజీలోని చిత్రాలు]
మన ప్రేమకు, సహకారమునకు పెద్దలు ప్రత్యేకముగా అర్హులైయున్నారు
[11వ పేజీలోని చిత్రాలు]
ఒక క్రైస్తవుని దుస్తులు సందర్భానికి తగినట్లు చక్కగా అమర్చబడినవిగా, నమ్రతగలవై ఉండవలెను