యెహోవా దినము కొరకు కనిపెట్టుకొని యుండుడి
“తీర్పు తీర్చు లోయలో రావలసిన యెహోవాదినము వచ్చేయున్నది.”—యోవేలు 3:14.
1. యెహోవా ప్రకటించిన రానైయున్న పరిశుద్ధ యుద్ధము మానవజాతి “పరిశుద్ధ” యుద్ధములకు ఎందుకు భిన్నముగా యుండును?
“అన్యజనులకు ఈ సమాచారము ప్రకటనచేయుడి—యుద్ధము ప్రతిష్ఠించుడి.” (యోవేలు 3:9) ఇదొక పరిశుద్ధ యుద్ధమని దీని భావమా? క్రైస్తవమత సామ్రాజ్యం ప్రముఖపాత్ర వహించిన ధర్మయుద్ధాలను, మతయుద్ధాలను, రెండు ప్రపంచ యుద్ధాలను వెనుదిరిగి చూసినట్లయిన, “పరిశుద్ధ” యుద్ధమను తలంపే మనకు వణకు పుట్టించును. అయితే యోవేలు ప్రవచనమందలి పరిశుద్ధ యుద్ధము దేశముల మధ్య జరుగు యుద్ధము కాదు. మతమునొక సాకుగా ఉపయోగించి ఓ ప్రాంతము కొరకు లేక ఆధిపత్యము కొరకుచేయు ద్వేషభరిత యుద్ధముకూడా కాదది. అది నీతియుక్తమైన యుద్ధము. అది దురాశ, కలహం, అవినీతి, అణచివేతను భూమినుండి తొలగించు దేవునియుద్ధమై యున్నది. తన సృష్టియంతటి మీద యెహోవాకున్న సార్వభౌమాధిపత్యమును అది మహిమపరచును. దేవుని ప్రవక్తలు ప్రవచించిన విశ్వశాంతి, సౌభాగ్యము మరియు సంతోషము విరాజిల్లు వెయ్యేండ్లపాలనలోనికి మానవజాతిని ప్రవేశపెట్టు క్రీస్తు రాజ్యమునకు ఆ యుద్ధము మార్గమును సుగమము చేయును.—కీర్తన 37:9-11; యెషయా 65:17, 18; ప్రకటన 20:6.
2, 3. (ఎ) యోవేలు 3:14లో ప్రవచింపబడిన “యెహోవాదినము” ఏమైయున్నది? (బి) ఆ దినమందు జనాంగములు ఎదుర్కొనవలసిన దానికి వారెందుకు పాత్రులై యున్నారు?
2 మరైతే యోవేలు 3:14లో ప్రవచింపబడిన “యెహోవా దినము” ఏమైయున్నది? యెహోవా తానుగా ఇట్లు నొక్కిచెప్పుచున్నాడు: “ఆహా, యెహోవా దినము వచ్చెనే అది ఎంత భయంకరమైన దినము! అది ప్రళయమువలెనే సర్వశక్తునియొద్దనుండి వచ్చును.” అదెట్లు ప్రళయమువలె నున్నది? ఆ తర్వాత ప్రవక్త ఇట్లు వివరించుచున్నాడు: “తీర్పు తీర్చు లోయలో రావలసిన యెహోవాదినము వచ్చేయున్నది; తీర్పుకై జనులు గుంపులు గుంపులుగా కూడియున్నారు.” (యోవేలు 1:15; 3:14) ఇది భూమ్యాకాశములపై ఆయనకున్న సార్వభౌమాధిపత్యపు హక్కును ధిక్కరించు భక్తిహీన మానవ సమూహములపై యెహోవా తన న్యాయతీర్పును విధించు దినమైయున్నది. ఇంతకాలముగా మానవజాతిని తన కబంధహస్తాలలో బంధించిన సాతాను విధానమును కూలద్రోయుటే యెహోవా నిర్ణయమై యున్నది.—యిర్మీయా 17:5-7; 25:31-33.
3 భూమిపైనున్న అవినీతి విధానము ఆ నిర్ణయమును ఎదుర్కొనవలెను. కానీ లోకవిధానము నిజముగా అంత చెడ్డగానున్నదా? ఒక్కసారి దాని చరిత్రను చూస్తేచాలు సరిపోతుంది! మత్తయి 7:16లో యేసు ఒక సూత్రము చెప్పాడు: “వారి ఫలములవలన మీరు వారిని తెలిసికొందురు.” లోకమందలి మహా నగరములు మాదక ద్రవ్యములు, నేరము, భయోత్పాతము, లైంగిక దుర్నీతి, కలుషితముల మురికికూపములుగా లేవా? అనేక ప్రాంతాలలో క్రొత్తగా లభించిన స్వాతంత్ర్యములు రాజకీయ గందరగోళము, ఆహారకొరత, దారిద్ర్యములచే ఊపిరాడకుండా చేయబడుచున్నవి. నూరుకోట్లకు పైగా ప్రజలు చాలీచాలక పస్తులతో జీవించుచున్నారు. పైగా మాదక ద్రవ్యములు, లైంగిక దుర్నీతినిండిన జీవన విధానముల మూలంగా వస్తున్న ఎయిడ్స్ తెగులునుబట్టి భూమియొక్క అధికభాగంపై ఒక కారుమేఘం కమ్ముచున్నది. ప్రత్యేకముగా 1914లో మొదటి ప్రపంచయుద్ధం జరిగిన దగ్గరనుండి, ప్రపంచవ్యాప్తముగా జీవితమందలి ప్రతి ఆకృతి క్షీణిస్తూనే వున్నది.—2 తిమోతి 3:1-5 పోల్చుము.
4. జనాంగములకు యెహోవా ఎటువంటి సవాలు విసురుచున్నాడు?
4 ఏమైనను, ఆయన మార్గములను గూర్చిన ఉపదేశమును సంతోషముతో స్వీకరించి ఆయన త్రోవలలో నడచు ప్రజలను సమస్త జనాంగములలోనుండి యెహోవా సమకూర్చుచున్నాడు. భూవ్యాప్తముగానున్న ఈ ప్రజలు, లోకముయొక్క హింసాయుత విధానాలను త్యజించుచు తమ ఖడ్గములను నాగటి నక్కులుగా సాగగొట్టిరి. (యెషయా 2:2-4) అవును, ఖడ్గములను నాగటి నక్కులుగానే సాగగొట్టుచున్నారు! అయితే యోవేలు 3:9, 10లో ప్రకటించుమని యెహోవా చెప్పినదానికి ఇది విరుద్ధము కాదా? అక్కడ మనమిట్లు చదువుదుము: “అన్యజనులకు ఈ సమాచారము ప్రకటనచేయుడి—యుద్ధము ప్రతిష్ఠించుడి, బలాఢ్యులను రేపుడి, యోధులందరు సిద్ధపడి రావలెను. మీ కఱ్ఱులు చెడగొట్టి ఖడ్గములు చేయుడి, మీ పోటకత్తులు చెడగొట్టి ఈటెలు చేయుడి.” హార్‌మెగెద్దోనులో తననెదుర్కొనుటకు తమ సమీకృత సైనిక బలగాలను తీసుకురావల్సిందిగా ఇక్కడ యెహోవా లోక పాలకులకు సవాలు చేయుచున్నాడు. అయినను వారు జయించలేరు. వారు సంపూర్ణముగా ఓడిపోవలసినవారే!—ప్రకటన 16:16.
5. “భూమిమీద ఉన్న ద్రాక్షపండ్లు” కోయబడినప్పుడు దాని ఫలితమేమై యుండును?
5 సార్వభౌమాధిపతియగు యెహోవాకు వ్యతిరేకముగా, బలాఢ్యులైన పాలకులు భయంకరమైన ఆయుధములుగల ఆయుధగారాలను నిర్మించిరి—అయినా వ్యర్థమే! యోవేలు 3:13లో యెహోవా ఇట్లు ఆజ్ఞాపించుచున్నాడు: “పైరు ముదిరినది, కొడవలిపెట్టి కోయుడి; గానుగ నిండియున్నది; తొట్లు పొర్లి పారుచున్నవి, జనుల దోషము అత్యధికమాయెను, మీరు దిగి రండి.” ఆ మాటలు ప్రకటన 14:18-20లోని మాటలకు సమాంతరముగా నున్నవి, “భూమిమీద ఉన్న ద్రాక్షపండ్లు పరిపక్వమైనవి; . . . దాని గెలలు కోయుమని” అక్కడ కిరీటధారియైన మెస్సీయ రాజగు యేసు ఆజ్ఞాపించబడెను. గనుక రాజు వాడిగల కొడవలిదూసి ఆ తిరుగుబాటు జనాంగములను “దేవుని కోపమను ద్రాక్షల తొట్టిలో” పడద్రోయును. అలంకారార్థముగా, ఆ ద్రాక్షల తొట్టినుండి రక్తము గుర్రముల కళ్లెములమట్టుకు పొంగి, దాదాపు 300 కిలోమీటర్ల దూరము వరకు పారుతుంది! యెహోవాను అవమానపరచు జనాంగములకు ఎంత భయానకమైన విపత్తు రానైయున్నది!
నియమమునకు కట్టుబడియుండు పౌరులు
6. జనాంగములను వారి పాలకులను యెహోవాసాక్షులు ఎట్లు దృష్టింతురు?
6 అంటే యెహోవాసాక్షులు జనాంగముల యెడల, వారి పాలకుల యెడల అగౌరవముగా ఉందురని దీని భావమా? కానేకాదు. వారు కేవలము అందరు తేటగా చూడగల అవినీతిని గ్రహించుదురు, మరియు వారు తీర్పు తీర్చు యెహోవా దినము అత్యంతవేగముగా సమీపించుచున్నదని హెచ్చరిక చేయుదురు. అదే సమయములో, వారు “ప్రతివాడును పై అధికారులకు లోబడియుండవలెనని” రోమీయులు 13:1లో పౌలు ఇచ్చిన ఆజ్ఞకు లోబడియుందురు. ఈ మానవ పాలకులకు వారు ఆరాధన కాదుగాని, సరియైన గౌరవమిత్తురు. నియమమునకు కట్టుబడియుండు పౌరులుగా, వారు నమ్మకత్వము, సత్యసంధత, పరిశుభ్రత, తమ కుటుంబములో చక్కని నైతిక విలువలను కట్టుటవంటి బైబిలు ప్రమాణములను అనుసరింతురు. దీనిని తామును ఎలా చేయగలరో నేర్పించుటకు వారు ఇతరులకు సహాయము చేయుదురు. మనుష్యులందరితో వారు సమాధానముగా జీవింతురు, ఆలాగే వారు నిరసన ప్రదర్శనలలో లేక రాజకీయ విప్లవాలలో పాల్గొనరు. ఈ భూమిపై పరిపూర్ణ సమాధానమును, నీతియుక్తమైన ప్రభుత్వమును పునరుద్ధరించుటకు, యెహోవాసాక్షులు సర్వోన్నత అధికారియైన, సార్వభౌమాధిపతియగు యెహోవాపై ఆధారపడుతూనే, మానవ పైఅధికారుల నియమాలకు లోబడుటలో మాదిరిగా ఉండుటకు ప్రయత్నింతురు.
ఆయన తన తీర్పు తీర్చుట
7, 8. (ఎ) జనాంగములు ఏ విధముగా కొట్టబడుదురు, వారిపై అంధకారమెట్లు కమ్మును? (బి) ఈనాడు యోవేలు ఎవరికి చిత్రీకరణగా యున్నాడు, సాధారణ ప్రపంచానికి భిన్నముగా, వీరెట్లు ఆశీర్వదించబడి యున్నారు?
7 స్పష్టమైన అలంకార భాషలో, తన తీర్పు విధించుటను గూర్చిన వివరణను యెహోవా ఇంకా ఇలా దయచేయుచున్నాడు: “సూర్య చంద్రులు తేజోహీనులైరి; నక్షత్రముల కాంతి తప్పిపోయెను. యెహోవా సియోనులోనుండి గర్జించుచున్నాడు; యెరూషలేములోనుండి తన స్వరము వినబడజేయుచున్నాడు; భూమ్యాకాశములు వణకుచున్నవి. అయితే యెహోవా తన జనులకు ఆశ్రయమగును, ఇశ్రాయేలీయులకు దుర్గముగా ఉండును.” (యోవేలు 3:15, 16) మానవజాతికిగల తేజోవంతమైన, సౌభాగ్యవంతమైన పరిస్థితి అంధకారమగును, విపత్సూచకమగును మరియు చిరిగి పీలికలైన ఈ లోకవిధానము ఉనికిలో లేకుండా కొట్టివేయబడును, ఒక గొప్ప భూకంపము సంభవించిన రీతిలో అది నాశనము చేయబడును.—హగ్గయి 2:20-22.
8 యెహోవా తన ప్రజలకు ఆశ్రయదుర్గముగా, ఒక కోటగా ఉంటాడను సంతోషకరమైన అభయమును గమనించుము. ఎందుకు? ఎందుకనగా, వారు మాత్రమే—ఒక అంతర్జాతీయ ప్రజగా—యెహోవా మాటలకు ప్రత్యుత్తరమిచ్చిన ప్రజలైయున్నారు: “మీ దేవుడనైన యెహోవాను నేనే, . . . (అని) మీరు తెలిసికొందురు.” (యోవేలు 3:17) యోవేలు అను పేరుకు “యెహోవాయే దేవుడు” అని భావమైనందున, యెహోవా సార్వభౌమాధిపత్యమును ధైర్యముగా ప్రకటించుటలో సేవచేయుచున్న ఆధునిక-కాల యెహోవా అభిషక్త సాక్షులకు, ఆయన సరియైన చిత్రీకరణయై యున్నాడు. (మలాకీ 1:11 పోల్చుము.) యోవేలు ప్రవచనమందలి ప్రారంభపు మాటలకు మన అవధానము త్రిప్పినట్లయిన, ఈనాటి దేవుని ప్రజల కార్యక్రమమును ఆయనెంతో స్పష్టముగా ప్రవచించుటను మనము కనుగొందుము.
ఒక మిడతల దండు
9, 10. (ఎ) యోవేలు ఏ తెగులును గూర్చి ప్రవచించెను? (బి) తెగులునుగూర్చి యోవేలు ప్రవచనమును ప్రకటన ఎట్లు ప్రతిధ్వనించుచున్నది, ఈ తెగులు క్రైస్తవమత సామ్రాజ్యంపై ఏ ప్రభావమును కలిగియున్నది?
9 ఇప్పుడు “యోవేలునకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కును” ఆలకించుము: “పెద్దలారా, ఆలకించుడి దేశపు కాపురస్థులారా, మీరందరు చెవియొగ్గి వినుడి ఈలాటి సంగతి మీ దినములలోగాని మీ పితరుల దినములలోగాని జరిగినదా? ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయుడి. వారు తమ బిడ్డలకును ఆ బిడ్డలు రాబోవు తరము వారికిని తెలియజేయుదురు. గొంగళిపురుగులు విడిచినదానిని మిడుతలు తినివేసియున్నవి మిడుతలు విడిచినదానిని పసరుపురుగులు తినివేసియున్నవి పసరుపురుగులు విడిచినదానిని చీడపురుగులు తినివేసియున్నవి.”—యోవేలు 1:1-4.
10 తరతరాలు జ్ఞాపకము చేసికొనబడునట్లు, ఇది అసాధారణమైన రీతిలో జరుగు దాడియై యున్నది. దండుమీద దండుగా వచ్చి ఈ క్రిమికీటకాలు, ప్రాముఖ్యముగా మిడుతలు, దేశమును పాడుచేయును. దీని భావమేమి? మరెవరోకాదు క్రీస్తుయేసనే “పాతాళపు (abyss) దూత . . . రాజు” ఆధ్వర్యంలో యెహోవాచే పంపబడిన మిడుతల తెగులునుగూర్చి ప్రకటన 9:1-12 కూడ మాట్లాడుచున్నది. ఆయనకుగల అబద్దోను (హెబ్రీ) అపొల్లుయోను (గ్రీకు) అను పేర్లకు “నాశనము” మరియు “నాశనము చేయువాడు” అని భావము. ఈ మిడుతలు అభిషక్త క్రైస్తవులకు చిత్రీకరణగా యున్నవి. అబద్ధమతమును పూర్తిగా బహిర్గతముచేసి, దానిపైవచ్చు యెహోవా ఉగ్రతను చాటుటద్వారా వారిప్పుడు ప్రభువు దినమందు, క్రైస్తవమత సామ్రాజ్యపు పచ్చికబయళ్లను పాడుచేయుచున్నారు.
11. ఆధునిక-దిన మిడుతలు ఎట్లు బలపరచబడెను, మరియు వాటి ముట్టడులకు ప్రత్యేకముగా ఎవరు గురైరి?
11 ప్రకటన 9:13-21 సూచించినట్లుగా, మిడుతల తెగులు వెంబడి గుర్రపు దండుయొక్క పెద్ద తెగులు వచ్చును. కొన్నివేల మందేవున్న అభిషక్తులైన క్రైస్తవుల శేషము నలభైలక్షలకు పైగావున్న “వేరే గొఱ్ఱెలతో” బలపరచబడి నందున, ఇది ఈనాడు ఎంత సత్యమైయున్నది! వీరిరువురు కలిసి ఒక ఎదురులేని సైన్యముగా తయారైరి. (యోహాను 10:16) క్రైస్తవమత సామ్రాజ్య విగ్రహారాధికులను మరియు ‘తాముచేసిన నరహత్యలు లేక అభిచార క్రియలు లేక వ్యభిచారము లేక దొంగతనాల విషయమై పశ్చాత్తాపము చూపని వారిని’ కుట్టినట్లుండే యెహోవా తీర్పులను ప్రకటించుటలో వారు ఐకమత్యమును కలిగియున్నారు. ఈ తీర్పు వర్తమానములు ఎవరికి వ్యతిరేకముగా నిర్దేశింపబడెనో వారిలో, ఈ శతాబ్దపు హత్యాపూర్వక యుద్ధములకు చురుకుగా తమ మద్దతునిచ్చిన—కాథోలిక్కు మరియు ప్రొటస్టెంటు—మతనాయకులు, ఆలాగే శిశుసంయోగ ప్రవృత్తిగల మత గురువులు మరియు అదుపుతప్పిన టివి., సువార్తికులును చేరియున్నారు.
12. తీర్పు వర్తమానములు వినుటకు క్రైస్తవమత సామ్రాజ్య మతనాయకులు ఎందుకు పాత్రులై యున్నారు, మరియు మహాబబులోను సభ్యులందరితోసహా త్వరలో వారికేమి సంభవించును?
12 అటువంటి నీతిమాలిన “పెద్దమనుషులకు,” యెహోవా జారీచేసిన ఆదేశము ఇట్లు ధ్వనించుచున్నది: “మత్తులారా, మేలుకొని కన్నీరు విడువుడి ద్రాక్షారసపానము చేయువారలారా, రోదనము చేయుడి. క్రొత్త ద్రాక్షారసము మీ నోటికి రాకుండ నాశనము మాయెను.” (యోవేలు 1:5) ఈ 20వ శతాబ్దములో, క్రైస్తవమత సామ్రాజ్యం లోకముయొక్క అదుపులేని తనమును దేవునివాక్య పరిశుభ్రమైన నైతిక సూత్రాలకు ప్రత్యామ్నాయముగా చేసినది. లోక విధానములను తమ స్వంతం చేసికొనుట అబద్ధమతమునకు దాని మతపరిచారకులకు తీయగా అన్పించెను, కాని వారెటువంటి ఆత్మీయ మరియు భౌతిక రుగ్మతల ఫలాన్ని అనుభవించిరి! ప్రకటన 17:16, 17లో వర్ణింపబడినట్లుగా, త్వరలోనే రాజకీయ శక్తులు ప్రపంచ అబద్ధమత సామ్రాజ్యమైన మహా బబులోనుమీద ఆకస్మికముగా దాడిచేసి దానిని నాశనముచేయుట దేవుని “సంకల్పమై” యున్నది. తనపై దేవుని తీర్పుతీర్చబడినదని చూచినప్పుడు మాత్రమే, అది తన మైకమునుండి ‘మేల్కొకొనును.’
“బలమైన యొక గొప్ప సమూహము”
13. మిడుతల దండు ఏ విధముగా క్రైస్తవమత సామ్రాజ్యమునకు ‘బలమైన యొక గొప్ప సమూహముగా’ కన్పించుచున్నది?
13 యెహోవా ప్రవక్త ఆ మిడుతల దండును, “అవి బలమైన యొక గొప్ప సమూహమని” ఇంకను వర్ణించుచున్నాడు. మహా బబులోనుకు అవి అలా కన్పించుచున్నవి. (యోవేలు 2:2) ఉదాహరణకు, బౌద్ధమత జపానులో క్రైస్తవమత సామ్రాజ్య మతములు ప్రజలను మార్చుటలో విఫలమయ్యాయను విషయమై దాని మతనాయకులు ప్రలాపించుచున్నారు. అయినను, ఈనాడు 1,60,000లకు పైగావున్న జపానుదేశ యెహోవాసాక్షులు ఆ దేశములో నలుమూలలకు బయలువెళ్లి, 2,00,000లకు పైగా ప్రజల గృహములలో వ్యక్తిగత బైబిలు పఠనములు నిర్వహించుచున్నారు. ఇటలీలోని 1,80,000లకు పైగావున్న యెహోవాసాక్షులు కాథోలిక్కుల తర్వాత రెండవ సంఖ్యగా ఇప్పుడు గుర్తింపబడియున్నారు. యెహోవాసాక్షులు చర్చినుండి ప్రతిసంవత్సరము ‘కనీసము 10,000 మంది నమ్మకమైన కాథోలిక్కులను’ తీసికొనుచున్నారని రోమను కాథోలిక్కు ప్రముఖ మతాధిపతి ఒకరు వ్యర్థముగా విలపించుచున్నాడు.a అటువంటి వారిని సాక్షులు సంతోషముతో ఆహ్వానింతురు.—యెషయా 60:8, 22.
14, 15. మిడుతల దండును యోవేలు ఎట్లు వర్ణించుచున్నాడు, ఏ విధముగా ఇది ఈనాడు నెరవేరియున్నది?
14 అభిషక్త సాక్షుల మిడుతల సమూహమును వర్ణించుచు, యోవేలు 2:7-9 ఇట్లనుచున్నది: “బలాఢ్యులు పరుగెత్తునట్లు అవి పరుగెత్తుచున్నవి శూరులు ప్రాకారములను ఎక్కునట్లు అవి గోడలు దాటుచున్నవి ఇటు అటు తిరుగకుండ అవన్నియు చక్కగా పోవుచున్నవి ఒకదానిమీద ఒకటి త్రొక్కులాడక అవన్నియు చక్కగా పోవుచున్నవి ఆయుధములమీద పడినను త్రోవ విడువవు. పట్టణములో నఖముఖాల పరుగెత్తుచున్నవి గోడలమీద ఎక్కి యిండ్లలోనికి చొరబడుచున్నవి దొంగలు వచ్చినట్లు కిటికీలలోగుండ జొరబడుచున్నవి.”
15 అభిషక్తుల “మిడుతల” సైన్యమునకు, అది నిజముగా ఒక స్పష్టమైన చిత్రీకరణయే! నలభైలక్షలకు పైగావున్న వేరేగొర్రెల సహవాసులు ఇప్పుడు వీరితో తమ చేతులు కలిపియున్నారు. మత శత్రుత్వమనే ఏ “గోడ” వారిని అడ్డుకోలేదు. ధైర్యముగా సర్వజనులకు సాక్ష్యమిచ్చుటలో, ఇతర క్రైస్తవ కార్యక్రమములలో వారు ‘ఇదే వాడుకచొప్పున అహర్నిశలు క్రమముగా నడుచుకొందురు.’ (ఫిలిప్పీయులు 3:16 పోల్చుము.) నాజీ జర్మనీ కాథోలిక్కు హిట్లరుకు జయమని అభివాదము చేయుటకు తిరస్కరించినందుకు ‘క్షిపణులమధ్య పడవేయబడిన’ వేలాదిమంది సాక్షులవలెనే, రాజీపడుటకు బదులు వారు మరణమెదుర్కొనుటకు ఇష్టపడిరి. అడ్డంకులన్నింటిని అధిగమించుచు, ఇండ్లలోనికి దొంగ చొరబడు విధంగా అన్నట్లు, ముందుకు దూసుకువెళ్లి తమ ఇంటింటిసేవా కార్యక్రమముద్వారా కోట్లాది బైబిలు ప్రచురణలను పంచిపెట్టి, ఈ మిడుతల సమూహము క్రైస్తవమత సామ్రాజ్యపు “పట్టణములో” సంపూర్ణముగా సాక్ష్యమునిచ్చెను. ఈ విధముగా సాక్ష్యమియ్యవలెననుట యెహోవా చిత్తమై యున్నది, కాగా దీనిని భూమ్యాకాశముల యందలి ఏ శక్తియు ఆపుజేయలేదు.—యెషయా 55:11.
‘పరిశుద్ధాత్మతో నిండిరి’
16, 17. (ఎ) యోవేలు 2:28, 29లోని మాటలు ఎప్పుడు ఒక అసాధారణమైన నెరవేర్పును కలిగియుండెను? (బి) యోవేలుయొక్క ఏ ప్రవచన వాక్కులు మొదటి శతాబ్దములో పూర్తిగా నెరవేరలేదు?
16 యెహోవా తన సాక్షులకిట్లు సెలవిచ్చుచున్నాడు: “[ఆత్మీయ] ఇశ్రాయేలీయులమధ్య నున్నవాడను నేనే యనియు, నేనే మీ దేవుడనైన యెహోవాననియు, నేను తప్ప వేరు దేవుడొకడును లేడనియు మీరు తెలిసికొందురు.” (యోవేలు 2: 27) యోవేలు 2:28, 29లోని తన మాటలను యెహోవా నెరవేర్చుట కారంభించినప్పుడు ఆయన ప్రజలు ఈ అమూల్యమైన గ్రహింపునకు వచ్చిరి. “నేను సర్వజనులమీద నా ఆత్మను కుమ్మరింతును; మీ కుమారులును మీ కుమార్తెలును ప్రవచనములు చెప్పుదురు.” ఇది సా.శ. 33 పెంతెకొస్తునాడు జరిగెను. అప్పుడు సమకూడియున్న యేసు శిష్యులు అభిషేకించబడి ‘పరిశుద్ధాత్మతో నిండినవారైరి.’ ఆ పరిశుద్ధాత్మ శక్తితో వారు ప్రకటించగా, ఆ ఒక్క దినమందే “ఇంచుమించు మూడువేలమంది చేర్చబడిరి.”—అపొ. కార్యములు 2:4, 16, 17, 41.
17 ఆ సంతోష సమయములో, పేతురుకూడ యోవేలు 2:30-32ను ఎత్తివ్రాయుచున్నాడు: “ఆకాశమందును భూమియందును మహాత్కార్యములను, అనగా రక్తమును అగ్నిని ధూమ స్తంభములను కనుపరచెదను. యెహోవాయొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును. . . . ఆ దినమున యెహోవా నామమునుబట్టి ఆయనకు ప్రార్థనచేయు వారందరును రక్షింపబడుదురు.” సా.శ. 70లో యెరూషలేము నాశనము చేయబడినప్పుడు ఆ మాటలు పాక్షికముగా నెరవేరెను.
18. యోవేలు 2:28, 29యొక్క గొప్ప నెరవేర్పు జరుగుట ఎప్పుడు ఆరంభమాయెను?
18 అయితే, యోవేలు 2:28-32యొక్క నెరవేర్పు ఇంకను మిగిలియున్నది. నిజానికి, ఈ ప్రవచనము 1919 సెప్టెంబరు నుండి అసాధారణ రీతిలో నెరవేర్పును కలిగియున్నది. ఆ సమయములో అమెరికాలోని, ఒహాయోనందలి, సీడార్ పాయింట్‌నందు యెహోవా ప్రజలయొక్క ఒక మరువరాని సమావేశము జరిగెను. అప్పుడు దేవుని ఆత్మ స్పష్టముగా వ్యక్తపర్చబడెను, మరియు ఆయన అభిషక్త సేవకులు ఈనాటి వరకు విస్తరింపజేయబడు భూవ్యాప్త సాక్ష్యపుపనిని ఆరంభించుటకు పురికొల్పబడిరి. ఫలితముగా ఎంత గొప్ప విస్తరణ జరిగెను! సీడార్ పాయింట్ సమావేశమునకు హాజరైన 7,000 మంది సంఖ్య, 1991 మార్చి 30న జరిగిన యేసు మరణ జ్ఞాపకార్థదిన ఆచరణ నాటికి హాజరైన 1,06,50,158 మందిగా పెరిగినది. వీరిలో కేవలము 8,850 మంది మాత్రమే తాము అభిషక్త క్రైస్తవులమని అంగీకరించిరి. యెహోవా బలాధిక్యమైన ఆత్మ భూవ్యాప్తముగా కలిగించిన ఫలితమును చూచిన వీరందరి ఆనందము ఎంత గొప్పది!—యెషయా 40:29, 31.
19. యెహోవాయొక్క దినము సమీపించుట దృష్ట్యా, మనలో ప్రతిఒక్కరి దృక్పధమేమై యుండవలెను?
19 సాతాను విధానమును నాశనమొందించు ‘యెహోవాయొక్క భయంకరమైన ఆ మహాదినపు రాకడ’ ఇంకెంతో దూరములో లేదు. (యోవేలు 2:31) సంతోషకరమైన విషయమేమంటె, “అప్పుడు ప్రభువు [యెహోవా, NW] నామమునుబట్టి ప్రార్థనచేయు వారందరును రక్షణపొందుదురు.” (అపొ. కార్యములు 2:21) ఎట్లు? అపొస్తలుడైన పేతురు, “ప్రభువు [యెహోవా, NW] దినము దొంగవచ్చినట్లు వచ్చునని” మనకు చెప్పుచు, ఇంకను ఇట్లనుచున్నాడు: “ఇవన్నియు ఇట్లు లయమై పోవునవి గనుక, . . . దేవుని [యెహోవా NW] దినపు రాకడకొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్తగలవారై యుండవలెను.” యెహోవా దినము సమీపముననే ఉన్నదను విషయమును మన మనస్సు నందుంచుకొన్నప్పుడు, నీతియుక్తమైన ‘నూతన ఆకాశము, నూతన భూమిని’ గూర్చిన యెహోవా వాగ్దాన నెరవేర్పును కూడ చూచుటకు మనమానందింతుము.—2 పేతురు 3:10-13. (w92 5/1)
[అధస్సూచీలు]
a లా రిపబ్లిక, రోమ్, ఇటలీ, నవంబరు 12, 1985, మరియు లా రివిస్ట డిల్ క్లెరో ఇటాలియానొ, మే 1985.
మీరు వివరించగలరా?
◻ “యెహోవాయొక్క దినము” ఏమైయున్నది?
◻ యేసు ‘భూమియొక్క ద్రాక్షపండ్లను’ ఎట్లు కోయును, ఎందుకు?
◻ మిడుతల దండు 1919నుండి ఏ విధముగా క్రైస్తవమత సామ్రాజ్యమును బాధిస్తున్నది?
◻ సా.శ. 33లో, ఆలాగే 1919లో ఎట్లు యెహోవా ఆత్మ ఆయన ప్రజలపై క్రుమ్మరింపబడెను?