కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w92 8/1 పేజీలు 6-7
  • 1914నాటి తరము ఎందుకు ప్రాముఖ్యమైనది?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • 1914నాటి తరము ఎందుకు ప్రాముఖ్యమైనది?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
w92 8/1 పేజీలు 6-7

1914నాటి తరము ఎందుకు ప్రాముఖ్యమైనది?

“ఈ శకము ఒక భయంకర కష్టకాలముతో ముగింపునకు వచ్చునని మేము ఎదురుచూస్తున్నట్లు కొన్ని సంవత్సరాలుగా మా పాఠకులు ఎరిగియున్నారు, మరియు అది అక్టోబరు, 1914 తర్వాత అనతికాలంలోనే ఎంతో శక్తివంతముగా, ఆకస్మికముగా సంభవించునని మేము ఎదురుచూస్తున్నాము.”—ది వాచ్‌టవర్‌ అండ్‌ హెరాల్డ్‌ ఆఫ్‌ క్రైస్ట్స్‌ ప్రెసెన్స్‌, మే 15, 1911.

ది వాచ్‌టవర్‌ అండ్‌ హెరాల్డ్‌ ఆఫ్‌ క్రైస్ట్స్‌ ప్రెసెన్స్‌ (ఇప్పుడది ది వాచ్‌టవర్‌ అనౌన్సింగ్‌ జెహోవాస్‌ కింగ్‌డం అని పిలువబడుచున్నది) పత్రిక 1879నుండి బైబిలు ప్రవచనములో 1914 ఒక గుర్తింపబడిన సంవత్సరమని తరచుగా సూచించినది. ఆ సంవత్సరము సమీపించుచుండగా, “ఒక భయంకర కష్టకాలమును” ఎదురుచూడవచ్చునని పాఠకులు గుర్తుచేయబడిరి.

ఈ వర్తమానమును క్రైస్తవులు అన్నిదిక్కులా ప్రచారము చేశారు. వారు బైబిలులో వ్రాయబడియున్న “ఏడు కాలములు,” ‘అన్యజనముల కాలములను’ గూర్చిన తమ అవగాహనపై దీనిని ఆధారముచేసికొనిరి.a ఈ కాలము 2,500 సంవత్సరాలు ఉండునని, అది యెరూషలేములో ప్రాచీన దావీదువంశస్థుల రాజ్యము కూలద్రోయబడిన దగ్గరనుండి 1914 అక్టోబరు నెలాఖరు వరకున్న మధ్యకాలమని వారు అర్థము చేసికొనిరి.b—దానియేలు 4:16, 17; లూకా 21:24, కింగ్‌ జేమ్సు వర్షన్‌.

వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటి ఆనాటి అధ్యక్షుడగు ఛార్లెన్‌ టేజ్‌ రస్సెల్‌ 1914 అక్టోబరు 2న, ధైర్యముగా ఇట్లు ప్రకటించెను: “అన్యజనముల కాలములు సంపూర్ణమైనవి; రాజులకివ్వబడిన కాలము అంతమాయెను.” ఆయన మాటలు ఎంత నిజమని నిరూపించబడెను! మానవ నేత్రాలకు అదృశ్యముగా, 1914 అక్టోబరులో ప్రపంచాన్ని కుదిపివేయు ప్రాముఖ్యమైన సంఘటన ఒకటి పరలోకములో జరిగెను. “దావీదు సింహాసనమునకు” శాశ్వత స్వాస్థ్యకర్తయగు యేసుక్రీస్తు, యావత్‌ మానవజాతిపై రాజుగా తన పరిపాలనను ఆరంభించెను.—లూకా 1:32, 33; ప్రకటన 11:15.

‘కానీ, క్రీస్తు 1914 నుండి తన పరిపాలనను ఆరంభించినట్లయిన, భూమిపై సంగతులెందుకు మరింత హీనముగా తయారగుచున్నవని’ మీరడుగవచ్చును. ఎందుకంటె మానవజాతియొక్క అదృశ్య శత్రువైన సాతాను ఇంకనూ ఉనికిలో ఉన్నాడు. 1914 వరకు, సాతాను పరలోకములో ప్రవేశించు అవకాశమును కలిగియుండెను. అయితే 1914లో దేవుని రాజ్యము నెలకొల్పబడుటతో పరిస్థితి మారిపోయెను. “పరలోకమందు యుద్ధము జరిగెను.” (ప్రకటన 12:7) సాతాను అతని దయ్యములు ఓడింపబడి భూమి మీదికి పడద్రోయబడెను, దానితో మానవజాతికి విపత్కర సంఘటనలు జరుగుట ఆరంభమాయెను. బైబిలు ముందుగనే ఇట్లు చెప్పినది: “భూమి, సముద్రమా, మీకు శ్రమ; అపవాది తనకు సమయము కొంచెమే అని తెలిసికొని బహు క్రోధముగలవాడై మీయొద్దకు దిగివచ్చియున్నాడు.”—ప్రకటన 12:12.

భూమియొక్క క్రొత్తరాజుగా తన అదృశ్య ప్రత్యక్షత, దృశ్యమగు సూచనచే గుర్తింపబడునని యేసు సా.శ. మొదటి శతాబ్దములో చెప్పెను. “నీ రాకడకును (ప్రత్యక్షతకును, NW) ఈ యుగసమాప్తికిని సూచనలేవి?” అని అడిగిన ప్రశ్నకు ఆయన ఇట్లు జవాబిచ్చెను: “జనముమీదికి జనమును రాజ్యముమీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరవులును భూకంపములును కలుగును; ఇవన్నియు వేదనలకు ప్రారంభము.”—మత్తయి 24:3, 7, 8.

ఆ ప్రకారముగానే, 1914లో సంభవించిన యుద్ధముతోపాటు దాదాపు నాలుగు సంవత్సరాలు సాధారణ ఆహార ఉత్పత్తి దెబ్బతినుటతో భయంకరమైన కరవులు ప్రబలెను. “అక్కడక్కడ . . . భూకంపముల” విషయమేమి? 1914 తర్వాతి దశాబ్దములో, పదికి తక్కువకాకుండా సంభవించిన వినాశనకరమైన భూకంపములలో దాదాపు 3,50,000లకు పైగా ప్రజలు చనిపోయిరి. (బాక్సు చూడుము.) నిజముగా 1914 నాటి తరము “వేదనల ప్రారంభమును” అనుభవించెను. ఇక అప్పటినుండి, ఈ వేదనలు క్రమముగా ప్రకృతి విపత్తులు, కరవులు, ఇంకా అనేకానేక యుద్ధముల రూపములో కలుగుచునే యున్నవి.

ఏమైనప్పటికిని, 1914లో స్థాపించబడిన దేవుని రాజ్యవార్త, సువార్తయే, ఎందుకనగా ఆ రాజ్యము ఈ భూమి నాశనంకాకుండ కాపాడును. ఎట్లు? ఎట్లనగా అది అబద్ధమైన, వేషధారణతోకూడిన సమస్త మతములను, అవినీతిమయమైన ప్రభుత్వములను, సాతానుయొక్క దుష్ట ప్రభావమును నిర్మూలించును. (దానియేలు 2:44; రోమీయులు 16:20; ప్రకటన 11:18; 18:4-8, 24) అంతేకాకుండా, అది “నీతి నివసించు” ఒక క్రొత్త లోకమును ప్రవేశపెట్టును.—2 పేతురు 3:13.

మొదటి ప్రపంచ యుద్ధం అయిపోయిన వెంటనే, చిత్తశుద్ధిగల బైబిలు విద్యార్థులు—యెహోవాసాక్షులు అప్పుడు అలా పిలువబడేవారు—రాజుగా యేసు ప్రత్యక్షతా సూచనలోని మరొక అంశము విషయమై వారికిగల ఆధిక్యతను వివేచించిరి. యేసుక్రీస్తు ఇట్లు ప్రవచించెను: “ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటుతరువాత అంతము వచ్చును.”—మత్తయి 24:14.

పందొమ్మిది వందల పందొమ్మిదిలో చిన్న ఆరంభములనుండి, యెహోవాసాక్షులు అవిశ్రాంతముగా “సువార్తను” ప్రకటించుచున్నారు. తత్ఫలితముగా, దేవుని రాజ్య ప్రజలగుటకు ఇప్పుడు 200లకు పైగా దేశాలనుండి లక్షలాదిమంది ప్రజలు సమకూర్చబడుచున్నారు. ఈ ప్రజలకు ఎంతటి ఆశీర్వాదములు వేచియున్నవి! ఆ రాజ్యము యుద్ధమును, కరవును, నేరమును, అణచివేతను అంతమొందించును. అది రోగము మరియు మరణమును సహితము అధిగమించును!—కీర్తన 46:9; 72:7, 12-14, 16; సామెతలు 2:21, 22; ప్రకటన 21:3, 4.

పందొమ్మిది వందల పధ్నాలుగవ తరము గతింపకముందే, రాజ్యమును ప్రకటించు పని దాని సంకల్పమును నెరవేర్చినదై యుండును. “అప్పుడు, మహా శ్రమ కలుగును. . . . లోకారంభమునుండి ఇప్పటివరకును అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడును కలుగబోదు. ఆ దినములు తక్కువ చేయబడక పోయినయెడల ఏ శరీరియు తప్పించుకొనడు. ఏర్పరచబడినవారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును” అని యేసు ముందేచెప్పెను.—మత్తయి 24:20-22.

పందొమ్మిది వందల పధ్నాలుగునకు ముందున్న తరమువారు చేసిన తప్పిదమును చేయకుము. పరిస్థితులు ఇప్పుడున్నట్లే అన్నిసమయాలలో ఉండబోవు. ఆశ్చర్యం కలిగించే మార్పులు ముందున్నవి. అయితే జ్ఞానయుక్తముగా ప్రవర్తించు వారికొరకు, అద్భుతకరమైన ఉత్తరాపేక్షలు కలవు.

కావున, ప్రాచీనకాల ప్రవక్త చెప్పిన ఈ మాటలను లక్ష్యపెట్టుము: “దేశములో(ని) . . . సమస్త దీనులారా, యెహోవాను వెదకుడి; మీరు వెదకి వినయముగలవారై నీతిని అనుసరించినయెడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు.” (జెఫన్యా 2:3) ఈ సలహాను మనమెట్లు అన్వయించగలము? ఆ ప్రశ్నకు సమాధానమిచ్చుటకు తర్వాతి శీర్షికలు సహాయము చేయును. (w92 5/1)

[అధస్సూచీలు]

a సినారియో ఆఫ్‌ ది ఫొటో-డ్రామా ఆఫ్‌ క్రియేషన్‌, 1914 యొక్క టైటిల్‌ పేజి.

b మరిన్ని వివరాల కొరకు, వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటి ఆఫ్‌ న్యూయార్క్‌ వారు ప్రచురించిన మీరు పరదైసు భూమిలో నిరంతరము జీవించగలరు అను పుస్తకములో 16వ అధ్యాయము చూడుము.

[7వ పేజీలోని బాక్సు]

భూకంపములు 1914 తర్వాతి దశాబ్దములో

తేది: ప్రాంతము: మరణ సం:

జనవరి 13, 1915 ఎవెజానో, ఇటలీ 32,600

జనవరి 21, 1917 బాలి, ఇండోనేషియా 15,000

ఫిబ్రవరి 13, 1918 క్వాంగ్‌టుంగ్‌ రాష్ట్రము, చైనా 10,000

అక్టోబరు 11, 1918 ప్యూర్టోరికో (పశ్చిమ) 116

జనవరి 3, 1920 వెరాక్రుజ్‌, మెక్సికో 648

సెప్టెంబరు 7, 1920 రిగ్గియో డి కలాబ్రియా, ఇటలీ 1,400

డిశంబరు 16, 1920 నింగ్‌సియా రాష్ట్రము, చైనా 2,00,000

మార్చి 24, 1923 జెష్‌వాన్‌ రాష్ట్రము, చైనా 5,000

మే 26, 1923 ఇరాన్‌ (ఈశాన్యం) 2,200

సెప్టెంబరు 1, 1923 టోక్యొ-యొకొహామ, జపాను 99,300

జేమ్స్‌ ఎమ్‌. జెర్‌ మరియు హరేష్‌ సి. షా వ్రాసిన, టెర్రా నాన్‌ ఫిర్మా అను పుస్తకములోని “సిగ్నిఫికెంట్‌ ఎర్త్‌క్వేక్స్‌ ఆఫ్‌ ది వరల్డ్‌” క్రిందగల పట్టికనుండి ఇవ్వబడినవి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి