క్రైస్తవ యౌవనులారా విశ్వాసమందు స్థిరులైయుండండి
“అందరు తప్పక హాజరు కావలెను” అని ప్రకటన చేయబడింది. జపానీయుల ఒక పాఠశాలలో విద్యార్ధులంతా జనరల్ అసెంబ్లీకి ఆడిటోరియంలో హాజరుకావాలి. కాని, వారిలో ఒక క్రైస్తవ యౌవనునికి అచ్చట పాఠశాల గీతంలో వ్యక్తమయ్యే కొన్ని తలంపులు ఆమోదయోగ్యమైనవి కావు. అందుచేత ఈ యౌవనుడు, “పాఠశాల గీతము పాడుదురు. నేను మాత్రం మామూలుగా వెనుక కూర్చొంటాను, నాకేమీ కష్టముండదులే” అని అనుకున్నాడు.
అయితే ఈ యౌవన యెహోవాసాక్షి ఆడిటోరియంలోకి వెళ్లగానే అతని ఉపాధ్యాయ బృందమంతా వెనుక వరుసలోనే ఆసీనులైయున్నారు. ఈయన వారి ముందే కూర్చోవలసి వచ్చింది. ఇతర విద్యార్ధులందరు పాఠశాల గీతాన్ని పాడటానికి లేచి నిలబడినప్పుడు ఈయన మాత్రం గౌరవప్రదంగా కూర్చొనేవున్నాడు. ఐతే, దీనిని గమనించిన ఉపాధ్యాయులు అతనిని భౌతికంగా లేపి నిలబెట్టాటానికి బలవంతం చేశారు. ఆ పరిస్థితిలో నిన్ను నీవు ఊహించుకోగలవా? నీవేయైతే ఏమిచేసియుండేవాడివి?
బలమైన విశ్వాసం ఎందుకు అవసరం
ప్రజలు క్రైస్తవులను వారివిధానంలో వారిని వెళ్లనిచ్చి, బైబిలుచే తర్ఫీదుపొందిన వారి మనస్సాక్షి ప్రకారం జీవించుటకు అనుమతిస్తే బాగుంటుంది. కానీ, క్రైస్తవులు తరచు ఒత్తిడినెదుర్కొనే పరిస్థితులకు గురికావలసి వస్తుంది. ఇందుకు మనము ఆశ్చర్యపడకూడదు. ఎందుకనగా దేవుని స్వంత కుమారుడైన యేసుక్రీస్తు ఇలా చెప్పాడు: “లోకులు నన్ను హింసించినయెడల, వారు మిమ్మును కూడ హింసింతురు.” (యోహాను 15:20) కాబట్టి యెహోవా సేవకులు ప్రత్యక్షంగా హింసించబడుటతో పాటు, నానావిధములైన విశ్వాస పరీక్షలను ఎదుర్కొనవలసి వస్తుంది.
అందువలన, క్రైస్తవ యౌవనులు పాఠశాలలో ఎదురయ్యే పరీక్షలను ఎదుర్కొనవలెనంటే వారికి బలమైన విశ్వాసము అవసరము. అవినీతికరమైన భాషను ఉపయోగించేటువంటి లేక దేవుని అగౌరపరచే స్వభావములుగల తోటి పాఠశాల విద్యార్ధులతో సంబంధంకలిగి ఉండాల్సిన పరిస్థితి వారికి ఏర్పడవచ్చును. ఈ క్రైస్తవ యౌవనులు జాతీయభావమునకు అతిగా ప్రాధాన్యతనివ్వాలనుట, ఆత్మీయంగా హానికరమైనటువంటి పాఠశాల రాజకీయాలలో, క్లబ్బులలో, ఇతర కార్యాలలో పాల్గొనవలెననులాంటి ఒత్తిడికి గురౌతుంటారు. ఈ విషయాలలో తమతో రాజీపడమని ఉపాధ్యాయులు, తోటి విద్యార్ధులు వారిపైకి ఒత్తిడి తేవచ్చును. కావున దైవసంబంధీకులైన యువకులు తమ నిరీక్షణను కాపాడుకొనుటకు అవసరమైన విశ్వాసము నిమిత్తమై యెహోవా ఆత్మపై ఆధారపడవలెను.—మత్తయి 10:19, 20; గలతీయులు 5:22, 23.
‘సమాధానము చెప్పుటకు సిద్ధంగా ఉండండి’
క్రైస్తవులలో యౌవనులైనవారికీ అలాగే పెద్దవారికి అపొస్తలుడైన పేతురు ఇచ్చిన ఉపదేశము ఎంతో యుక్తమైనది: “మీలో ఉన్న నిరీక్షణనుగూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడు సిద్ధముగా ఉండుడి.” (1 పేతురు 3:15) ఆ విధముగా సమాధానమిచ్చుటకు సిద్ధమైయుండాలంటే అందుకు కావలసిన దేమిటి? దానికి మొదట మీరు లేఖనములు ఏమి బోధించుచున్నవో అర్ధము చేసికొనవలెను. పాఠశాలలో జాతీయత, రాజకీయము, మాదక ద్రవ్యముల వాడుక, నైతిక సంబంధమైన విషయాలు మొదలగువాటియందు ఒక స్థానమును గైకొనవలెనంటే, మొదట అట్టి క్రైస్తవ స్థానమునకు కారణమేమిటి అని మీరు అర్థంచేసికొని, దాన్ని నిష్కపటంగా నమ్మాలి.
ఉదాహరణకు, అపొస్తలుడైన పౌలు తోటి క్రైస్తవులకు, “మోసపోకుడి, దుష్టసాంగత్యము మంచి నడవడిని చెరుపును,” అని చెప్పాడు. (1 కొరింథీయులు 15:33) దానిని మీరు అంగీకరిస్తారా? పౌలు సూచించినట్లు సహవాసము విషయములో మోసపోవుట సులభము. ఒక వ్యక్తి ఎంతో స్నేహపూర్వకంగా, ఇష్టమైనవానిగా కనిపించవచ్చు. కాని యెహోవా సేవ విషయంలో అతనికి నీలాంటి శ్రద్ధలేకపోతే లేక బైబిలు వాగ్దానములను నమ్మకపోతే అతను మంచి సహవాసి కాదు. ఎందుకు? ఎందుకనగా అతని జీవితము వేరే సూత్రాలపై ఆధారపడి ఉంది. క్రైస్తవునికి చాలా ప్రాముఖ్యమైన విషయములు అతనికి ఏమాత్రమూ పట్టింపుకరమైనవి కాకపోవచ్చును.
ఇందుకు మనము ఆశ్చర్యపడకూడదు. ఎందుకనగా యేసు తన అనుచరులను గూర్చి ఇలా చెప్పాడు: “నేను లోకసంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు.” (యోహాను 17:16) సాతానును దేవునిగా కల్గియున్న లోకమునకు సంబంధించినవాడై ఉంటూ, ఒక వ్యక్తి నిజమైన క్రైస్తవునిగా వుండుట అసాధ్యము. (2 కొరింథీయులు 4:4) కావున లోకమునకు వేరైయుండుట ఈనాడు అనేకులను పీడిస్తున్న అవినీతి, జగడములనుండి ఒక క్రైస్తవుని ఎలా కాపాడుతుందో మీరు చూస్తున్నారా? ఆలాగైతే, లోకమునకు మీరు ఎందుకు వేరైయుండాలో అర్థంచేసికుంటారు. తద్వారా కొన్ని పాఠశాల కార్యక్రమాల్లో మీరు ఎందుకు పాల్గొనలేరో కూడ అర్థంచేసికుంటారు.a
విశ్వాసమందు స్థిరులైయుండి రాజ్యాసక్తులను జీవితములో మొదటపెట్టవలసిన ప్రాముఖ్యత ఒక యౌవన క్రైస్తవ బాలిక విషయంలో చూపబడింది. (మత్తయి 6:33) ఆమె తన స్నాతకోత్సవ దిన కార్యక్రమానికి సంబంధించి రిహార్సల్ కొరకు ఒక దినము నిర్ణయించబడింది. కాని ఆ రోజే ఆమె హాజరుకావలనుకున్న యెహోవాసాక్షుల ప్రాంతీయ సమావేశము కూడా వస్తుంది. అందుచేత ఆమె గౌరవపూర్వకంగా తన టీచరుకు ఒక ఉత్తరం వ్రాసి ఆ రిహార్సిల్కు తాను ఎందుకు హాజరుకాలేదో వివరించి, దానిని టీచరుకు క్లాసులోనే ఇచ్చింది. క్లాసు అవగానే టీచరు ఆమెను ప్రక్కకు పిలిచి, ఆమె ఎందుకు రిహార్సల్‌కు రాలేక పోతుందో వివరించమని అడిగాడు. ఆ బాలిక ఇలా అంటుంది: “ఆయన నేను అదే మాటలు చెప్తానో లేదో చూడాలనుకున్నాడు. అది నాతలంపేనా, లేక ఉత్తరంలో కేవలం మా అమ్మ చెప్పిన మాటలు ఉన్నాయా అని చూడగోరాడు? ఈ విషయంలో నా స్వంత నమ్మకాన్ని గమనించిన తరువాత ఆయన నన్ను వ్యతిరేకించలేదు.”
“ప్రతి ఒక్కరి ఎదుట సమాధానము చెప్పుట”
క్రైస్తవ యువకులు వారి స్థానాన్నిగూర్చి ఉపాధ్యాయ బృందమునకు, విద్యార్ధులకు ముందే స్పష్టంగా తెలియజేసివుంటే, సమస్య తలెత్తినప్పుడు దాదాపు వత్తిడి అంత ఎక్కువగా ఉండదు. ఒక జపానీయుల క్రైస్తవ యౌవనురాలు ఇలా తెల్పుతుంది: ఆమె 11 సంవత్సరాల వయస్సులోనున్నప్పుడు వారి పాఠశాలలో విద్యార్ధులందరూ క్రిస్టమస్ పార్టీలో పాల్గొనాలని కోరబడటం జరిగింది. తనకంటే పైతరగతులలోని విద్యార్ధులందరూ దానిలో పాల్గొనటానికి ఆమెపైకి వత్తిడి తెచ్చారు. కాని ఆమె హాజరు కాలేదు. ఆమె టీచరు ఆమె స్థానాన్ని అర్థంచేసుకున్నారు. ఎందుకు? ఎందుకంటే పాఠశాల ప్రారంభమప్పుడే సాక్షి మరియు ఆమె తల్లిదండ్రులు టీచరును కలిసికొని ఆమె క్రైస్తవ స్థానంయొక్క వివిధ అంశాలను వివరించారు.
ప్రాంతీయ పరిచర్యలో పాల్గొనేటప్పుడు కొంతమంది యౌవనులైన క్రైస్తవులు వారి తోటి విద్యార్ధులనుగాని, లేక టీచర్లనుగాని కలుసుకోటానికి భయపడుతుంటారు. నీవుకూడా అలాగే భావిస్తావా? అలాగైతే, ముందుగానే చొరవతీసికొని నీవు ఇంటింటికి ప్రకటించటానికి వెళ్తావని, అలా ఎందుకెళ్తుంటావో వారికి ఎందుకు తెలియపరచకూడదు? ఒక 14 సంవత్సరముల యెహోవాసాక్షి, ఈ విధంగా తెలియజేసెను: “నా క్రైస్తవ స్థానాన్ని గూర్చి ప్రతి ఒక్కరికి తెలుసు. నేను నా తోటి విద్యార్ధులను పరిచర్యలో కలిస్తే వారికి ఆ విషయం బాగా తెలుసు గనుక నేనెంతమాత్రము కలతగా భావించను. తోటి విద్యార్ధులు సాధారణంగా వింటారు. అనేకసార్లు బైబిలు సాహిత్యములను వారు తీసుకొంటారు. ఒక 12 సంవత్సరముల బాలుడు ఇలా తెలియజేస్తున్నాడు: ‘తాను పరిచర్యలో పాల్గొనేటప్పుడు, తన తోటి విద్యార్ధులను కలవాలని వారికొరకు ఎదురుచూస్తూ ఉంటాడు. ఈ విషయంలో సిగ్గుతో భయముచెందే బదులు క్రమంగా తాను చెప్పబోయేదాన్ని ముందుగా అభ్యాసం చేసికుంటాడు. ఆవిధంగా అతను తన విశ్వాసమునకు సరియైన కారణములను చూపుటకు సిద్ధంగా ఉండును.”
అనేక పాఠశాలల్లో స్కూలు తర్వాత వారు పాల్గొనవలసిన కార్యక్రమాలు వ్యక్తిగత యిష్టంపై ఆధారపడియున్నవని అంటారు. కాని నిజానికైతే, విద్యార్ధులు మరియు టీచర్లు వాటిలో పాల్గొనమని వత్తిడి చేస్తూ ఉంటారు. ఒక 20 సంవత్సరముల క్రైస్తవ యౌవనురాలు ఇలాంటి వత్తిడిని ఎదుర్కొనటానికి మంచి మార్గాని కనిపెట్టింది. ఆమె ఇలా చెబుతుంది: “హైస్కూల్లో ఉన్నంతవరకు నేను సహాయ పయినీరుగా చేశాను. ఇతర కార్యక్రమములలో పాల్గొనలేనంతగా నేను నా మత కార్యాలలో నిమగ్నమైయున్నానని వారికి తెలుసు.” ఈ సాక్షియొక్క చెల్లెలు అదే పద్దతిని అనుసరించింది. కొంతమంది క్రైస్తవ యౌవనులు తమ స్కూలు సంవత్సరములన్నింటిలో సహాయపయినీర్లుగా చేసి పాఠశాల చదువు అయినవెంటనే పూర్తి కాల రాజ్య ప్రచారకులుగా దానిలో నుండి క్రమ పయినీర్లగునట్లు తయారుగుచున్నారు.
మీ మంచి ప్రవర్తన మరియు ధైర్యముగా సాక్ష్యమిచ్చుటనుబట్టి వచ్చు మంచి ఫలితములను ఎప్పటికి అలక్ష్యముచేయవద్దు. మౌనముగా వుండే బదులు, గౌరవపూర్వకంగా నిర్భయంగా మాట్లాడుట ద్వారా నీవు విశ్వాసమందు స్థిరముగా వున్నావని ఎందుకు చూపకూడదు? చెరగా కొనిపోబడి, సిరియా సైన్యాధిపతియగు నయమాను గృహములోవున్న ఇశ్రాయేలు బాలిక ఆలాగే చేసింది. (2 రాజులు 5:2-4) ఆయౌవన బాలిక తీసుకున్న చొరవ మూలంగా యెహోవా నామము స్తుతించబడింది. అలాంటి విశ్వాసమునే మీరు కూడ ప్రదర్శిస్తే దేవునికి మహిమకలిగి, ఇతరులు ఆయన నామమును స్తుతించే వారగునట్లు సహాయము చేసెదరు.
కాబట్టి మన విశ్వాసములో రాజీపడి మనము క్రైస్తవులుగా నిలిచివుండలేము. యేసు ఇలా అన్నాడు: “మనుష్యుల యెదుట నన్ను ఒప్పుకొనువాడెవడో పరలోకమందున్న నా తండ్రియెదుట నేనును వానిని ఒప్పుకొందును. మనుష్యుల యెదుట ఎవడు నన్ను ఎరుగననునో వానిని పరలోకమందున్న నా తండ్రియెదుట నేనును ఎరుగనందును.” (మత్తయి 10:32, 33) యేసుయొక్క అనుచరునిగా విశ్వాసమందు స్థిరముగా ఉండుట ఒక గంభీరమైన బాధ్యత, కాదా?
సహాయము అందుబాటులో ఉంది
యెహోవాసాక్షిగా స్థిరమైన స్థానమును చేపట్టుటకు, మీకు బలమైన విశ్వాసము అవసరము. అందుకొరకై బైబిలును మీరు పట్టుదలతో చదివి, క్రైస్తవ కూటములకు హాజరగుతూ, ప్రాంతీయపరిచర్యలో పాల్గొనవలెను. ఇంకా మీకు ఏదో కొరవడి ఉందని భావిస్తే మీరు ఏమి చేయవచ్చును? శిష్యుడైన యాకోబు ఇలా చెప్పాడు: “మీలో ఎవనికైనను జ్ఞానము కొదువగా ఉన్నయెడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింప బడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగ దయచేయువాడు.” (యాకోబు 1:5) యెహోవాతో ప్రార్థనలో నీ సమస్యనుగూర్చి మాట్లాడుము; నీ విశ్వాసముయొక్క పరీక్షలను లేక శోధనలను ఎదుర్కొనుటకు నిన్ను ఆయన బలపరచును.
యౌవనుడైన ఒక క్రైస్తవుడు ఇంకా ఏమిచేయగలడు? సామెతల గ్రంథం మనకు ఇలా చెబుతుంది: “నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము. నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము.” (సామెతలు 23:22) ఈ సలహాను అపొస్తలుడైన పౌలు బలపరస్తూ ఇలా చెప్పాడు: “పిల్లలారా అన్ని విషయములలో మీ తలిదండ్రుల మాట వినుడి; ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనతగినది.” (కొలొస్సయులు 3:20) మీరు విశ్వాసమందు స్థిరులైయుండులాగున క్రైస్తవ తల్లిదండ్రులు సహాయము చేయగలరు. వారి సలహాలను వినుము. వారి సహాయముతో ఆలోచనలు, సలహాలు, మరియు అనుభవములకొరకు లేఖనములు మరియు బైబిలు ఆధారితమైన ప్రచురణలను పరిశోధించండి. ఇది మిమ్ములను, మీ తల్లిదండ్రులను ఆనందపరస్తుంది. అది మీకు పిరికితనమును భయమును అధికమించుటకు కూడ సహాయముచేయును.—2 తిమోతి 1:7.
యెహోవాదేవుడు క్రైస్తవ సంఘముద్వారా చేసిన ఏర్పాటులనుండి పూర్తి ప్రయోజనమును పొందండి. కూటములకు బాగా సిద్ధపడండి. ఇప్పుడు నీవు ఎదుర్కొనచున్నటువంటి అనుభవములను అనుభవపూర్వకంగా ఎరిగిన పెద్దలతో మరియు ఇతరులతో మాట్లాడండి. సొలొమోను ఇలా అన్నాడు: “జ్ఞానముగలవాడు విని పాండిత్యమును వృద్ధిచేసికొనును. వివేకముగలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించి కొనును.” (సామెతలు 1:5) కావున ఇలాంటి పెద్దవారినుండి నేర్చుకొనుము. మీలాంటి సమస్యలనే విజయవంతంగా ఎదుర్కొనుచున్న క్రైస్తవ యౌవనులనుండికూడా మీరు నేర్చుకొనవచ్చును.
నమ్మకత్వము ఆశీర్వాదములను తెచ్చును
విశ్వాసమందు స్థిరముగా నిలబడుటద్వారా “స్థిరులును, కదలనివారును, ప్రభువు కార్యాభివృద్ధియందు ఎప్పటికిని ఆసక్తులునై యుండుడి” అను పౌలు సలహాను మీరు అన్వయించుకొనువారై ఉందురు. (1 కొరింథీయులు 15:58) యెహోవా మీరు ఎదుర్కొను సమస్యలను ఎరిగియుండి వాటిని అర్థం చేసికొంటాడు. అలాంటి కష్టములనే ఎదుర్కొనిన ఎంతోమందిని ఆయన బలపరచాడు. ఆయన మిమ్ములను కూడ బలపరచును. మీరు ఆయనపై ఆధారపడినయెడల ఆయన మీకు ఆధారముగా ఉండును. కీర్తన రచయిత చెప్పినట్లు: “నీ భారము యెహోవామీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొనును నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు.”—కీర్తన 55:22.
పేతురు ఇలా వ్రాశాడు: ‘నిర్మలమైన మనస్సాక్షి కలిగినవారై యుండుడి. . . అప్పుడు మీరు దేనివిషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ ప్రవర్తన మీద అపనిందవేయువారు సిగ్గుపడుదురు.’ (1 పేతురు 3:16) దేవుని నీతియుక్తమైన శాసనముల మరియు సూత్రముల విషయంలో రాజీపడుటకు తిరస్కరించినయెడల, మీరు మంచి మనస్సాక్షి కలిగియుందురు. అది యెహోవానుండి లభించే నిజమైన ఆశీర్వాదము. అంతేగాక బలహీనమైన విశ్వాసముగల క్రైస్తవ యువకులకు నీవు మంచి మాదిరినుంచెదవు. (1 తిమోతి 4:15, 16) మీ ప్రవర్తన వారిని విశ్వాసములో స్థిరులైయుండి పరీక్షలను సహించులాగున ప్రోత్సహించవచ్చును.
మొదట మీ క్రైస్తవస్థానమును వ్యతిరేకించిన వారికి కూడ మీరు సహాయము చేయవచ్చును. నిరీక్షణను ప్రేరేపించు ఈ మాటలను జ్ఞాపకముంచుకొనండి: “ఉదయమందు విత్తనము విత్తుము, అస్తమయమందును నీ చేయి వెనుక తియ్యక విత్తుము, అది ఫలించునో యిది ఫలించునో లేక రెండును సరిసమానముగా ఎదుగునో నీవెరుగవు.” (ప్రసంగి 11:6) నీ నమ్మకమైన క్రియలద్వారా నీవు మంచి విత్తనములను విత్తుటనుబట్టి ఏ మంచి ఫలితములు వచ్చునో ఎవరికి తెలియును?
నీవు పొందే అత్యంత గొప్ప ఆశీర్వాదములలో ఒకటి యెహోవా దేవునియెదుట నీవు ఆమోదయోగ్యమైన స్థానము కలిగియుండుటే. విశ్వాసమందు స్థిరముగా వుండుటద్వారా చివరకు కలుగు ఫలితము నిత్యజీవము. (యోహాను 17:3; యాకోబు 1:12 ను పోల్చుము.) పరీక్షలో రాజీపడుట వలన పొందు తాత్కాలిక విశ్రాంతి ఏది కూడా ఆ వరమును పొగొట్టుకొనవలసినంత విలువైనది కాదు.
ఈ శీర్షిక ప్రారంభములో ప్రస్తావించబడిన యువకుని సంగతేమి? తన పరీక్షను ఆయన సహించాడు. పాఠశాల అసెంబ్లీ ముగిసిన తరువాత తన స్థానమునుగూర్చి ఆయన ఉపాధ్యాయులకు నేర్పుగా వివరించటానికి ప్రయత్నించాడు. ఆయన మాటలను వారు చెవినబెట్టకపోయినను ఆయనకు మాత్రము తాను యెహోవా హృదయమును సంతోషపెట్టానను తృప్తిమిగిలింది. (సామెతలు 27:11) పాఠశాల చదువు పూర్తయ్యేంతవరకు తన విశ్వాసమును కాపాడుకున్నాడు. తరువాత పయినీరయ్యాడు. మీ నమ్మకమైన సహనముకూడ అలాంటి సంతోషకర ఫలితాన్నే ఇచ్చునుగాక. విశ్వాసమందు స్థిరముగా ఉన్నట్లయిన నిశ్చయముగా అట్లు జరుగును. (w91 7/15)
[అధస్సూచీలు]
a ఈ విషయాలలో మరియు ఇతర బైబిలు సూత్రముల చర్చకొరకు వాచ్‌టవర్ బైబిలు అండ్ ట్రాక్ట్ సొసైటి ఆఫ్ న్యూయార్కు, Inc., వారిచే ప్రచురింపబడిన క్వెశ్చన్స్ యంగ్ పీపుల్ ఆస్క్—ఆన్సర్స్ దట్ వర్క్ అను పుస్తకమును చూడుము.
[27వ పేజీలోని బాక్సు]
లభ్యమగు సహాయము
◻ దేవునికి భయపడు నీ తల్లిదండ్రుల నుండి వచ్చు వివేకమును ఆలకించుము.
◻ క్రైస్తవ సంఘములోని ఆత్మీయ ఏర్పాట్లనుండి ప్రయోజనము పొందుము.
◻ బహుశా ఒకప్పుడు నీలాంటి సమస్యలనే కలిగివున్న నియమించబడిన పెద్దలతో లేక ఇతరులతో మాట్లాడుము.
◻ ఇటువంటి ఆటంకములనే విజయవంతముగా ఎదుర్కొంటున్న ఇతర యౌవన క్రైస్తవులతో మాట్లాడుము.