రాజ్య ప్రచారకుల నివేదిక
మన క్రైస్తవ పరిచర్యను అలంకరించు ప్రవర్తన
అపొస్తలుడైన పేతురు క్రైస్తవులను, “అన్యజనుల . . . మధ్యను మంచి ప్రవర్తనగలవారై యుండవలెను” అని హెచ్చరిస్తున్నాడు. (1 పేతురు 2:12) మనము మన ప్రవర్తన ద్వారా “అన్ని విషయములందు మన రక్షకుడగు దేవుని ఉపదేశమును” అలంకరించుదుమని అపొస్తలుడైన పౌలు సూచిస్తున్నాడు. (తీతు 2:10) ప్రపంచవ్యాప్తముగా యెహోవాసాక్షులు సత్ప్రవర్తన విషయంలో మంచి పేరును కలిగియున్నారు. కొన్ని ఉదాహరణలను గమనించుము.
ఉపాధ్యాయుని ముగ్ధుణ్ణిచేసిన మంచి ప్రవర్తన
◻ కోస్టారికాలో అనేకమంది యౌవనస్థులు చక్కనిమాదిరి ఉంచినట్లుగా ఆ దేశపు వాచ్‌టవర్ సొసైటి బ్రాంచి కార్యాలయము రిపోర్టుచేయుచున్నది. తనను సత్యమువైపు ఆకర్షించిన వైనమును ఒక సహోదరుడు చెప్పుచున్నాడు. ఆయనిలా వివరించుచున్నాడు: “యౌవనస్థుల మరియు పెద్దల ప్రవర్తన, ప్రత్యేకంగా యౌవనస్థుల చక్కని ప్రవర్తన నన్నెంతో ఆకర్షించింది. నేను ఉపాధ్యాయునిగా పనిచేయుచుండగా, నా పాఠశాలలోని సాక్షులను జాగ్రత్తగా పరిశీలించుటకు నాకు అవకాశముండెను. నేను ఒక యెహోవాసాక్షుల కుటుంబముతో కలిసి జీవించినందున, అక్కడున్న పిల్లల ప్రవర్తనను కూడా నేను గమనించాను.
“నేను చేయగలిగిందేమీ లేకపోయిననూ నా పాఠశాలలోని విద్యార్థులలో సాక్షులైయున్న వారికిని, ఇతర విద్యార్థుల మధ్య భేదమును గమనించాను. సాక్షులు ఎల్లప్పుడు సమయానికి వచ్చి చక్కగా ప్రవర్తించేవారు, ఎప్పుడూ అబద్ధము చెప్పేవారు కారు, అన్ని సమయాలలో వారికప్పగించిన పనిని వారు చేసేవారు. ఇంకా నేను గమనించినదేమనగా పరీక్షలప్పుడు సాధారణముగా ఇతర విద్యార్థులు మోసము చేసిననూ వారు నమ్మకముగా ఉండేవారు. అంతేకాకుండా, వారి ఉపాధ్యాయునిగా వారు నాతో మర్యాదగా గౌరవంగా మాట్లాడేవారు. పాఠశాలలో మరియు నేను నివసించిన ఇంటిలోని యౌవన సాక్షులద్వారా ముగ్ధుడనై, నేను ఈ మతమును పరిశోధించ నారంభించి చివరకు సత్యమును అంగీకరించితిని.”
సమావేశమందలి క్రైస్తవ ప్రవర్తన వలన మంచి ఫలితములు
◻ ఎల్‌సాల్వడార్‌లో పశ్చిమ భాగమందలి సంఘములోని ఒక యెహోవాసాక్షి ఒకరు తన ఇద్దరి సోదరులతో సువార్తను పంచుకొనవలెనని ఆశించాడు. వారిలో ఒకరు విని యెహోవాసాక్షులతో బైబిలు పఠించుటకు ఆరంభించాడు. ప్రిన్స్ ఆఫ్ పీస్ అని పిలువబడిన ఇవాంజిలికల్ చర్చికి చెందిన వేరొక సోదరుడు తన తమ్మునితో, “నాకు నువ్వేమి చెప్పనక్కరలేదు; నువ్వు అపవాదిని సేవించుచున్నావు” అని అన్నాడు.
జిల్లాసమావేశపు సమయము వచ్చినప్పుడు, పఠనము చేయుచున్న వ్యక్తి తనతో సమావేశమునకు రమ్మని తన సోదరుణ్ణి ఆహ్వానించాడు. దానికి ఆ సోదరుడు, “సరే, వస్తాను పద; అయితే నేను కేవలము సాక్షులలో తప్పుపట్టుకోవడానికే నేను నీతో అక్కడికి వస్తున్నాను” అని చెప్పాడు. ఆ ఇద్దరు సోదరులు సమావేశమునకు హాజరయ్యారు. ఎంతోమంది హాజరగుట, సమావేశములో మంచి క్రమము, ఆ ఇవాంజిలికల్ను ఎంతో ముగ్ధుణ్ణి చేశాయి. ఇంతవరకు నేను అటువంటి దానిని చూడలేదని ఆయనన్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఆయన తన సోదరునితో, “నీ చెయ్యి ఇలాగివ్వు” అని అడిగాడు. దానికి అతడు, “ఏమిటి విశేషం” అనగా, “ముందైతే నీ చెయ్యి ఇలాగివ్వు” అని చెప్పి, వారిద్దరు కరచాలనం చేసిన తర్వాత ఇవాంజిలికల్ చర్చికి చెందిన సోదరుడు తన తమ్మునితో “ఇప్పటినుండి నేను యెహోవాసాక్షులతో పఠనము చేయబోవుచున్నాను. నిజంగా, నేను పోగొట్టుకొంటున్నదేమిటో తెలిసికోలేదు” అని చెప్పాడు. ప్రస్తుతము ఆయనకూడా దేవునిరాజ్య సువార్తను ప్రకటించుటలో చురుకైన ఆసక్తిగల ప్రచారకునిగా ఉన్నాడు. (w91 6/1)