సత్యమందు జతపనివారిగా నడుచుకొనుము!
రెండవ మరియు మూడవ యోహాను నుండి ఉన్నతాంశములు
సత్యమునుగూర్చిన జ్ఞానము యెహోవా ఆరాధికులను గుర్తించు గురుతైయున్నది. (యెహాను 8:31, 32; 17:17) రక్షణకొరకు దైవిక సత్యమును అనుసరించి నడుచుకొనుట ప్రాముఖ్యము. మరియు దేవుని సేవకులు సత్యమందు జతపనివారై యుండవలెను.
యెహాను వ్రాసిన రెండవ మరియు మూడవ ప్రేరేపిత లేఖలు “సత్యమును అనుసరించి నడుచుకొనుటను” గూర్చి మాట్లాడుచున్నవి. (2 యోహాను 4; 3 యోహాను 3, 4) మూడవ యోహాను “సత్యములో జతపనివారిగా” సహకరించుకొనుటను కూడ ప్రోత్సహించుచున్నది. (3 యోహాను 5-8) ఈ రెండు లేఖలుకూడ బహుశ ఎఫెసుకు సమీప ప్రాంతములో సా.శ. 98లో వ్రాయబడియుండవచ్చును. అయితే అవి తెలియజేయు విషయములు ఈనాడు యెహోవా ప్రజలకు ప్రయోజనమును తీసుకురాగలవు.
రెండవ యోహాను సత్యమును నొక్కి తెల్పుచున్నది
రెండవ యోహాను మొదట సత్యమును ప్రేమను నొక్కి తెలియజేసి, ఆ పిమ్మట “క్రీస్తు విరోధిని” గూర్చి హెచ్చరించినది. (1-7 వచనములు) ఈ లేఖ ఏర్పరచబడిన అమ్మగారికి, బహుశ ఒకవ్యక్తిని ఉద్దేశించి వ్రాయబడియుండవచ్చును. అయితే అది ఒక సంఘమునకు పంపబడినట్లయిన, ఆమె “పిల్లలు” పరలోక జీవితము కొరకు దేవుడు “ఏర్పరచుకొనిన” ఆత్మద్వారా జన్మించిన క్రైస్తవులై యుందురు. (రోమీయులు 8:16, 17; ఫిలిప్పీయులు 3:12-14) కొందరు “సత్యమును అనుసరించి నడుచుకొనుచు” ఆ విధముగా మతభ్రష్టత్వమును ఎదిరించుచున్నందుకు యోహాను సంతోషించెను. అయినను, వారు యేసు శరీరధారియై వచ్చెననుటను ఒప్పుకొనని “క్రీస్తు విరోధి” విషయములో జాగ్రత్తగా ఉండవలసిన అవసరమున్నది. యెహోవా సాక్షులు ఈనాడు మతభ్రష్టత్వమునుగూర్చిన హెచ్చరికలను లక్ష్యపెట్టవలెను.
ఆ తర్వాత మతభ్రష్టులతో ఎట్లు వ్యవహరించవలెనో ఉపదేశించి వ్యక్తిగత వందనములతో ఆయన లేఖను ముగించెను. (8-13 వచనములు) ప్రకటించుటవంటి కష్టమైన పనులను ఆయన మరియు ఇతరులు చేయుటవలన ఈ లేఖ పంపబడినవారు మారుటవంటి సత్ఫలితములు కలిగెను. తమకొరకు కేవలము ఆత్మీయ సంగతుల కొరకు ‘చూచుటద్వారా’ వారు “పూర్ణఫలమును” అనగా అభిషక్తుల కొరకు దాచిపెట్టబడిన పరలోక “కిరీటమును” కూడ సంపాదించుకొందురు. (2 తిమోతి 4:7, 8) ‘క్రీస్తుబోధయందు నిలిచియుండని’ వాడెవడైనను తమయొద్దకు వచ్చినట్లయిన, “అతని దుష్టక్రియలలో” పాలివారు కాకుండుటకు, వారు అటువంటి వానిని ‘ఇంట చేర్చుకొనకూడదు మరియు శుభమని చెప్పకూడదు.’ తోటి విశ్వాసులను కలిసికొని ముఖాముఖిగా మాట్లాడుటకు ఎదురుచూచుచున్నానని చెప్పి, యెహాను తన లేఖను వందనములతో ముగించెను.
మూడవ యోహాను సహకారమును నొక్కి తెల్పుచున్నది
మూడవ యోహాను గాయునకు వ్రాయబడి, ఆయన తోటి విశ్వాసులయెడల చేయుచున్న పనిని మొదట ప్రస్తావించెను. (3 యోహాను 1-8 వచనములు) క్రైస్తవ బోధలన్నింటికి అంటిపెట్టుకొనుటద్వారా గాయు “సత్యమును అనుసరించి నడుచుకొనుచుండెను.” అంతేకాకుండ ఆయన సందర్శించుటకు వచ్చిన విశ్వాసులకు సహాయము చేయుటలో “నమ్మకముగా పనిచేసెను.” (NW) యోహాను ఇట్లువ్రాసెను: “మనము సత్యములో జతపనివారమవునట్టు, అట్టివారికి ఆతిథ్యమివ్వ బద్ధులమైయున్నాము.” యెహోవా సాక్షులు ఈనాడు ప్రయాణకాపరులకు అటువంటి ఆతిథ్యమిత్తురు.
దేమేత్రియు ప్రవర్తనకు భిన్నముగా నడుచుకొనుచున్న దియొత్రెఫే చెడునడతనుగూర్చి చెప్పిన తర్వాత యోహాను తన లేఖను ముగించెను. (3 యోహాను 9-14 వచనములు) దియొత్రెఫే యోహానును గౌరవించక సాదరముగా చేర్చుకొనుచున్న సహోదరులను సంఘమునుండి వెలివేయుటకు ప్రయత్నించెను. అయితే దేమేత్రియు మంచి ఉదాహరణగా ఎత్తిచెప్పబడెను. గాయును త్వరలోనే కలిసికొనుటకు నిరీక్షించుచు, యోహాను వందనములతో, మరియు గాయుకు సమాధానము కలుగుగాక అని చెప్పి తన లేఖను ముగించెను. (w91 4/15)
[31వ పేజీలోని బాక్సు/చిత్రం]
కాగితము, కలము, మరియు సిరాతో: “సిరాతోను కాగితముతోను” అనేక సంగతులను వ్రాయుటకు బదులు యోహాను “ఏర్పరచబడిన అమ్మగారిని ఆమె పిల్లలను” కలిసికొనుటకు ఇష్టపడెను. గాయునకు ఇంకను “సిరాతోను కలముతోను” వ్రాయుటకు బదులు అపొస్తలుడు త్వరలోనే ఆయనను కలిసికొనుటకు ఎదురుచూచెను. (2 యోహాను 1, 12; 3 యోహాను 1, 13, 14) “కలము” అని తర్జుమా చేయబడిన గ్రీకు పదము (కాలమోస్) పేము లేక రెల్లు (వెదురు) సూచించుచున్నది మరియు దానిని “వ్రాయుటకు ఉపయోగించు రెల్లు” అని తర్జుమా చేయవచ్చును. గ్రీకులు మరియు రోమన్లలో ఈ రెల్లుకలము ఆ తర్వాతి కాములలోని ఈకతో చేయబడి చివర చీలియుండు కలములను పోలియుండెడిది. మెలాస్ అను గ్రీకు పదము “సిరా” అని తర్జుమా చేయబడిన, “నలుపు” అను అర్థముగల పురుషలింగ విశేషణా పదమగు మెలాస్ యొక్క తటస్థలింగ రూపమైయున్నది. అతి పురాతనమైన సిరాలలో, బొగ్గుతో మేళమించిన—కాలుచున్న తైలము లేక కర్ర, లేక కాయగూరలు లేక జంతువులనుండి సేకరించిన రంగుయైయుండెను. సాధారణముగా ఈ సిరాలను ఘనీభవింపజేసి ముక్కలుగా, లేక బిళ్లలరూపమున దాచిపెట్టెడివారు, వాటిని లేఖికులు తడిపి కుంచె లేక రెల్లును ఉపయోగించి వ్రాయుట జరిగేది. ఆ రోజులలో ఒకవిధమైన రెల్లుగడ్డినుండి సంపాదించిన పొరలతో పల్చని రేకులుగా కాగితమును తయారుచేసెడివారు. తొలి క్రైస్తవులు వాటిని లేఖలకు, గ్రంథపుచుట్టలకు మరియు వ్రాతప్రతులకు ఉపయోగించెడివారు.