సుసంపన్నమైన దేశమునకు కదలివెళ్లుటలోని తగులుబడిని యెంచిచూచుకొనుట
అభివృద్ధిచెందుతున్న ప్రపంచమంతట ఆయా దేశములలోని దౌత్య కార్యాలయములలో ఇంటర్వూ కొరకు ఎదురుచూస్తున్న జనముతో క్రిక్కిరిసియున్న వైయింటింగ్ రూమ్లు చాలా సామాన్యమైన దృశ్యము. ఆ క్లుప్తమైన మరియు ప్రాముఖ్యమైన చర్చద్వారా ప్రాశ్చాత్యమందలి ఒక పారిశ్రామిక దేశమునకు వీసా దొరకుతుందా లేదా యని నిర్ణయించబడుతుంది. అనేకులు ఇది వారి సుసంపన్నతకు మార్గమని నమ్ముతారు. “నేను నాలుగు సంవత్సరాలనుండి ఎంతో కష్టపడి పనిచేస్తున్నాను. అయినా ఇంతవరకు ఒక రేడియో కొనలేక పోయాను”, అదే “ఇంగ్లాండులోనో లేక యునైటెడ్ స్టేట్స్లోనో ఉండుంటే ఈ పాటికి ఒక కారు ఒక ఇల్లు సంపాదించుకొని యుండేవాడిని” అని ఒక పశ్చిమాఫ్రికా యౌవనుడు ఫిర్యాదుచేశాడు.
పేదవైన, అభివృద్ధి చెందుతున్న దేశాలలోని అనేకులు అటువంటి మనోభావల నెందుకు కలిగియున్నారో అర్థం చేసికొనుట కష్టమైనదేమి కాదు. వారికి ఉద్యోగాలు దొరకటం ఎంతో కష్టమవుతుంది. జీతము చాలా తక్కువ. ద్రవ్యోల్భణం మిగుల్చుకోటానికి వీలులేకుండా చేస్తుంది. ఇండ్లు దొరకుట అరుదై, క్రిక్కిరిసి యుంటున్నవి. సంపన్న దేశాలలోని వారివలన తీసిపారవేయబడిన దుస్తులను ప్రజలు ధరిస్తుంటారు. అనేకులు ఆర్థిక ఉరులలో బిగించుకు పోయినట్లు భావిస్తుంటారు.
సుసంపన్నమైన పాశ్చాత్యము ఎలా ఆశను రేపెడుతుంది! సియోర లియోన్ నందలి ఒక యౌవనుడు ఇలా అన్నాడు: “బయటి దేశాలకు వెళ్లి తిరిగివచ్చినవారిలో కొందరు, మనకై మనము పారిశ్రామిక దేశాలకు వెళ్లి చూడాలని ధైర్యము తెచ్చుకొనేలాంటి కథలను చెబుతారు. వాళ్లు చెప్పేదేమంటే, నీవు అక్కడ కష్టపడి పనిచెయ్యాలి, అయితే డబ్బు బాగా వస్తుంది. నిన్ను నీవు పోషించుకొనుటతో పాటు, కారు మొదలగు సుఖప్రదమైన సౌకర్యాలను పొందవచ్చు. దాదాపు రెండువేల డాలర్లు సంపాదించుకొని తిరిగివస్తే, వ్యాపారం పెట్టుకొని పెండ్లిచేసుకోవచ్చు.”
కొందరు దేవుని సేవకులు కూడ అలాగే తర్కిస్తారు. ఇందులో ఆశ్చర్యమేమి లేదు. ఒక ఆఫ్రికా దేశపు సహోదరి ఇట్లన్నది: “దూరము బయటి దేశాలకు వెళ్లిన ఇతరులు ఎంతబాగా పనిచేసు కొంటున్నారనే ముచ్చట్లను దేవుని సంస్థలో యౌవనులమైన మేము వింటుంటాము. అందువలన కొన్నిసార్లు నాకై నేను ఇట్లడుగు కుంటాను, ‘నా సంగతేమి? ఇక్కడ నేనెందుకు బాధపడుతుండాలి? నేను వెళ్లాల లేక వద్దా?’”
నీవు కూడ ఒక పేద దేశములో వుంటే అలా వెళ్తే, నా జీవితము కూడ ఏమైన మెరుగు పడుతుందా అని ఆలోచించవచ్చును. ఏమైనను, ఒక పర దేశానికి వెళ్లటమంటే, అది ఒక పెద్ద పథకమై, గంభీరమైన మెట్టయియున్నది. దానిలో క్రొత్త భాష నేర్చుకోటం, క్రొత్త ఉద్యోగపు నైపుణ్యాలను సంపాదించటం, క్రొత్త సంస్కృతికి తగినట్లు మలచుకోటం, విదేశీయుల పట్ల అనేకులు చూపు దురభిమానాన్ని సహించటం, పూర్తిగా క్రొత్త జీవిత విధానాన్ని నేర్చుకోవటం ఇమిడియున్నాయి. అయినను అనేకమంది క్రైస్తవులు ఇలా చేయుటలో విజయవంతులై, తాము క్రొత్తగా వెళ్లిన దేశాలలోని సంఘాలలో మాదిరికరమైన ప్రచారకులుగా, పయినీర్లగా, పెద్దలుగా, పరిచారకులుగా సేవచేస్తూ, వాటికి ఒక సంపదవలె యున్నారు.
అయితే, అందరూ ఈ విషయంలో అంత బాగా జరిగించలేదు. అలా తరలివెళ్లుటలోని వత్తిడులు, బాధలు కొందరిలో ఆత్మీయ నాశనానికి దారితీసినవి. కావున, నిశ్చయంగా అలా కదలివెళ్లుట గంభీరమైన మరియు ప్రార్థన పూర్వకమైన ఆలోచనలేకుండ జరగకూడదు. సామెతలు 3:5, 6 నందు బైబిలిట్లు హెచ్చరిస్తున్నది: “నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణ హృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును.” ఔను, నీవు యెహోవా చిత్తానికి అనుగుణ్యంగా ప్రవర్తిస్తున్నావను నిశ్చయతను కలిగియుండ గోరుతావు. (యాకోబు 4:13-15) అంతేగాక యేసు, తనను వినువారితో ‘తగులుబడిని చూచుకొనవలెనని’ గట్టిగా కోరినప్పుడు, నీవు అలా చేయుటకు సహాయపడగల కొంత అభ్యాసయుక్తమైన సలహాను ఇచ్చాడు. (లూకా 14:28) ఇందులో ఆర్థిక విషయాలను పరిశీలించుట కంటే ఎంతో ఇమిడియున్నది. అనగా అలా వలసవెళ్లుటలోని ఆత్మీయ తగులుబడులను లెక్కచూచు కొనుటయని దాని భావము.
బయటి దేశములోని జీవిత వాస్తవాలు
ఎక్కడకైన కదలి వెళ్లుటకు ముందు అక్కడికి వెళ్లిన తరువాత దేనిని ఎదురుచూడవచ్చునను విషయంలో నీవు ఒక మంచి వాస్తవిక అవగాహనను కలిగియుండవలెను. సాధ్యమైనట్లయిన ముందుగా ఒకసారి దానిని దర్శించి అచ్చటి పరిస్థితులు ఎలాగుంటాయో నీకై నీవు చూడుము. లేనియెడల, రెండవవారు చెప్పిన సమాచారముపై నీవు ఆధారపడవలసి యుంటుంది. దీనిని గూర్చి బైబిలు ఇట్లు హెచ్చరిస్తున్నది: “జ్ఞానము లేనివాడు ప్రతిమాట నమ్మును వివేకియైనవాడు తన నడతలను బాగుగా కనిపెట్టును.”—సామెతలు 14:15.
కొందరు ప్రాశ్చాత్య దేశాలలోని జీవితమును గూర్చి తాము పొందిన సమాచారమంతటిని, దూరదర్శిని, లేక సినిమాలనుండి సేకరించియున్నారు. అందువలన వారు, అక్కడున్నవారంతా ఐశ్వర్యవంతులై, క్రొత్త కారును నడుపుకుంటు, అతి సౌఖ్యమైన గృహాలలో నివసిస్తుంటారని నమ్ముతారు. అయితే, వాస్తవము మాత్రము అందుకు ఎంతో భిన్నంగా ఉన్నది. అనేక సుసంపన్న దేశాలు హెచ్చరిక పొందవలసిన స్థితిలో దారిద్ర్యము, ఇండ్లకొరత, నిరుద్యోగముతో ఉన్నవి. మరియు అందులో అత్యంత బీదవారెవరనగా క్రొత్తగా వలస వచ్చినవారు. ఒక పేద దేశములోని యు. యస్. దౌత్య కార్యాలయ అధికారి ఇలా వివరిస్తున్నాడు: “అమెరికాలో స్థిరపడటం ఎంత కష్టమో ప్రజలు కేవలం గుర్తించరు. కొందరు తమ ఇండ్లకు వారు ఎంత బాగున్నారో—రెండు కార్లను, ఒక యింటిని ఎలా కొన్నారో ఉత్తరాలు రాస్తుంటారు.—కాని వాస్తవానికి వారు నిజంగా పోరాటాన్ని సలుపుతుంటారు”.
వేరే ఇతర చోటనైనను పరిస్థితి అలాగే ఉంటుంది. పశ్చిమ ఆఫ్రికా వాడైన మిస్టరు. సార్ సోరి విద్యా బోధకుడు. ఆయన లండనులో జీవించి, అక్కడే చదువుకున్నాడు. ఆయన వ్యాఖ్యానము ఇలా ఉన్నది: “ఆఫ్రికా నుండి బయలుదేరి వచ్చి ఇంగ్లాండులో స్థిరపడడం సులభమైనది కాదు. వలసివచ్చిన వారిలో బహు ఎక్కువమంది చాలా పేద జీవితమును జీవిస్తున్నారు. కొందరు ఒక్క ఫోను కాల్ చేయుటకై 20 పెన్నీలను జమచేసికొనుట ఎంతో కష్టమైనదానిగా కనుగొంటున్నారు. తరచు ఒకే ఒక గదిలో అనేకులు కలసి ఉంటున్నారు. వారందరు వేడిని పొందటానికి కేవలము ఒక చిన్న హీటరు కలిగియుంటారు. వారు హీనముగా ఎంచబడు ఉద్యోగములను మాత్రమే సంపాదించుకొన గలుగుచున్నారు. అయినను అది వారి బిల్లులను కట్టుటకే సరిపోదు. దారిద్ర్యమును తప్పించుకోటానికి ఆఫ్రికాను వదలివచ్చువారు తరచు ఐరోపా మురికి వాడలలో ఇంకా దిగజారిన రీతిగా తమ్మును తాము కనుగొంటున్నారు.”
ఒక క్రొత్త దేశములో స్థిరపడుటకు వెనుకయున్న ఆర్థిక వత్తిడులు ఒక వ్యక్తియొక్క ఆత్మీయతను సులభముగా అణచివేయగలవు. (మత్తయి 13:22) నిజమే, కష్టించి పనిచేయుటను బైబిలు మెచ్చుకొనుచున్నది. (సామెతలు 10:4; 13:4) అయితే దూరదేశాలకు వెళ్లువారు వారి ఆర్థిక గురులను చేరుకోటానికైన లేక కేవలము కనీస అవసరతలను తీర్చుకొనుటకైన రెండు లేక మూడు ఉద్యోగములను చేయుటకు బలవంతపెట్టబడుచున్నారు. దేవుని ఆరాధించుటకు ఎక్కువ సమయం లేకపోవటమో లేక అసలు లేకపోవటమో జరుగుతుంది. దానివలన క్రైస్తవ కూటములు, బైబిలు సత్యములను ఇతరులతో పంచుకొనుట నిర్లక్షపరచబడుచున్నది. దుఃఖకరంగా యేసుక్రీస్తుయొక్క ఈ మాటలు నిజమగును: “మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు.”—మత్తయి 6:24.
నైతిక వత్తిడులు
నీవు వెళ్లబోవు క్రొత్త దేశముయొక్క నైతిక వాతావరణమును కూడ నీవు పరిగణనలోకి తీసికొనవలెను. లోతు జీవించుటకు యోర్దాను జిల్లా ప్రాంతమును ఎన్నుకొనినట్లు బైబిలు చెబుతుంది. వస్తుదాయకమైన దృష్టితో చూస్తే, ఆయన నిర్ణయము వివేకవంతమైనదానిగా కనబడుతుంది, ఎందుకనగా “అదంతయు యెహోవా తోటవలె. . .నీళ్లు పారు దేశమైయుండెను.” (ఆదికాండము 13:10) ఏమైనను, లోతు క్రొత్త పొరుగువారు “యెహోవా దృష్టికి బహుపాపులునై యుండిరి.” (ఆదికాండము 13:13) దాని ఫలితంగా, “ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి, తాను చూచిన వాటిని బట్టియు, వినినవాటిని బట్టియు, వారి అక్రమ క్రియల విషయములో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను.”—2 పేతురు 2:8.
అలాగే ఈనాడు, పాశ్చాత్త ప్రాంతమునకు వెళ్లుట నిన్ను, నీ కుటుంబాన్ని, నీ స్వంత ప్రదేశముకంటె ఎక్కువ తీవ్రంగా నైతిక వత్తిడులకు, శోధనలకు గురిచేయవచ్చు. ఇంకా అదనముగా వృద్ధులైనవారు తమ గృహమువద్ద గౌరవింపబడిరీతిగా గౌరవింపబడక పోవచ్చును. తల్లిదండ్రులయెడల గౌరవము ప్రోత్సహించబడక పోవచ్చును. పొరుగువారు ఒకరియెడల ఒకరు పెద్దగా శ్రద్ధతీసుకొనక యుండవచ్చును. అటువంటి వత్తిడులు నీపై, నీకుటుంబముపై ఎట్లు ప్రభావము చూపవచ్చును? ఇది ప్రార్థనాపూర్వక తలంపు నివ్వవలసిన విషయమైయున్నది.
అందుబాటులో లేని తల్లిదండ్రులు
కొంతమంది తల్లిదండ్రులు తమ కుటుంబములను విడిచిపెట్టి విదేశాలకు ఒంటరిగానే వెళ్లుటకు ఎన్నుకొన్నారు. వారి ఉద్దేశ్యము అక్కడ ఒకసారి స్థిరపడిన తరువాత వారికుటుంబముకొరకు పంపవచ్చునని లేక విస్తారమైన డబ్బుతో ఇంటికి తిరిగిరావచ్చునని. అటువంటి ఏర్పాటు వివేకవంతమైనదా?
తమ కుటుంబములకు కావలసిన వస్తు సంబంధమైన అవసరతలను తీర్చవలసిన బాధ్యతను లేఖనములు తల్లిదండ్రులపైన పెట్టుచున్నవి. కొన్ని విపరీతమైన సందర్భాలలో ఒక తండ్రి లేక తల్లి అలాంటి ఏర్పాట్లను అందించుటకు విదేశాలలో పనిచేయుట తప్ప వేరే అవకాశము లేక పోవచ్చును. (1 తిమోతి 5:8) అయినను, తల్లితండ్రులు తమ కుటుంబముయొక్క ఆత్మీయ అవసరతలను గూర్చి శ్రద్ధవహించవలసిన బాధ్యతలో యున్నారు. దేవుని వాక్యమిట్లు చెప్పుచున్నది: “తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువుయొక్క (యెహోవాయొక్క NW) శిక్షలోను బోధలోను వారిని పెంచుడి.”—ఎఫెసీయులు 6:4.
ఒక తండ్రి నెలలు లేక సంవత్సరాల కాలము కుటుంబమునకు దూరముగా వుంటే, ఈ పనిని ఫలవంతముగా చేయగలడా? చాలా వరకు లేదు. కావున నీవు పొందు వస్తుదాయక లాభములు ఏమైనను, నీవు ఇంట్లోలేనందున అది నీ పిల్లలపై చూపు ప్రభావము కంటె యోగ్యమైనదా అని నీవు తప్పక పరిశీలించవలెను. దానికి తోడు తరలివెళ్లినవారు తరచు వారి దశను మార్చుకొనుట వారనుకున్నంత సులభము కాదని కనుగొన్నారు. తరలివెళ్లినవారు తమ కుటుంబ ప్రయాణమునకు ఖర్చు భరించలేని పరిస్థితిలో యుంటే వారి యెడబాటు కొన్ని సంవత్సరముల వరకు కొనసాగవచ్చును. ఇది మరొక ప్రక్క గంభీరమైన నైతిక అపాయములను సృష్టించవచ్చు. (1 కొరింథీయులు 7:1-5 ను పోల్చుము.) చెప్పుటకు దుఃఖకరమైన సంగతేమనగా, అటువంటి శోధనాత్మకమైన పరిస్థితులలో కొందరు లైంగిక అవినీతికి లొంగిపోయిరి.
దేవుడు దయచేయువాటిపై నమ్మకముంచుట
లోక ఆర్థిక పరిస్థితులు క్షీణిస్తూ ఉండగా, దేవుని సేవకులు తాము వదలివేయబడుదుమని భయపడకూడదను విషయమును జ్ఞాపకముంచుకొనుట మంచిది. యేసు ఇలా చెప్పెను: “కాబట్టి ఏమి తిందుమో యేమి త్రాగుదుమో యేమి ధరించుకొందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నియు మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియును. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీ కనుగ్రహింపబడును.”—మత్తయి 6:31-33.
యెహోవాసాక్షులు నేడు సువార్తను ఆసక్తితో ప్రకటించుటద్వారా దేవుని రాజ్య శ్రద్ధల కొరకు పనిచేయుదురు. (మత్తయి 24:14; 28:19, 20) అనేక బీద దేశాలలో రాజ్యమును ప్రకటించువారి అవసరత ఎంతో గొప్పగా ఉన్నది. ప్రత్యేకంగా పరిక్వత కెదిగిన పెద్దల మరియు పరిచారక సేవకుల అవసరత ఉన్నది. అవసరత అంత ఎక్కువగా లేని ఆర్థికంగా వర్ధిల్లుతున్న దేశమునకు వెళ్లుటకంటె, అనేకులు తమ స్వంత దేశాలలోనే ఉండుటకు ఎన్నుకొనియున్నారు. అలాంటి కొందరు ఎలా జీవనము చేయగలుగుచున్నారు?
పశ్చిమ ఆఫ్రికాకు చెందిన అలీతియా, తన స్వంతదేశములో 30 సంవత్సరముల నుండి పూర్తికాల సేవలో పనిచేసింది. ఆమె ఇలా అన్నది: “నేను విదేశములో జీవించు అవకాశమును పొందియుంటిని. అయితే నేను వెళ్లలేదు. కారణమేమనగా నేను నా స్వంత ప్రజలతో, బంధువులతో ఉండటాన్ని ప్రేమిస్తాను. మేమందరము కలసి యెహోవాను ఆరాధించులాగున వారు సత్యమును నేర్చుకొనుటలో సహాయం చేయటాన్ని నేను ఆనందిస్తాను. ఇక్కడుంటం ద్వారా ఏ ఒక్క దాన్ని కూడ నేను పోగొట్టుకొనలేదు. నేను దేనిని గూర్చి దుఃఖించుట లేదు.”
అలాగే వినిఫ్రెడ్ అను ఆమె ఒక ఆఫ్రికా దేశంలో జీవిస్తుంది. ఇచ్చట భౌతిక జీవన స్థాయి, ప్రపంచములోని అతి తక్కువస్థాయిలలో ఒకటిగా యెంచబడుతుంది. అయితే పూర్తికాల పయినీరు సేవలో 42 సంవత్సరములు ఉన్న తరువాత, ఆమె ఇలా అంటుంది: “ఆర్థికంగా సర్దుకు పోవుట ఎల్లప్పుడు అంత సులభము కాదు. సాతాను పరిస్థితులను కష్టతరం చేయుటకు ప్రయత్నిస్తుంది. అయితే యెహోవా ఎల్లప్పుడు నాకు దయచేస్తూ, నా అవసరతలను తీర్చియున్నాడు.”
పురాతన కాలములో అబ్రాహాము “ఆయన [దేవుడు] వాగ్దానము చేసినదానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించెను.” (రోమా 4:21) అలాగే నీవును, నీ జీవితములో రాజ్యాసక్తులను మొదటగా ఉంచినట్లయిన యెహోవా నీ గురించి శ్రద్ధవహించి తన వాగ్దానమును నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా నమ్ముచున్నావా? “వేలకొలది వెండి బంగారు నాణెములకంటె నీ విచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు,” అని వ్రాసిన కీర్తన రచయితతో నీవు ఏకీభవిస్తావా? (కీర్తన 119:72) లేక అపొస్తలుడైన పౌలు ఇచ్చిన ఉపదేశమును నీవు మరియెక్కువగా అన్వయించుకొనవలసిన అవసరతలో యున్నావా? 1 తిమోతి 6:8 లో ఆయనిట్లు వ్రాసెను: “కాగా అన్న వస్త్రములు గలవారమై యుండి వాటితో తృప్తిపొందియుందము.” క్రొత్త పరిసరాలను వెదకుటకు బదులు, ఉన్నవాటినే బాగా ఉపయోగించుకొనుటయే చేయవలసిన వివేకయుక్తమైన పనిగా ఉంటుందా?
అనేక దేశములలోని ఆర్థిక పరిస్థితులు క్రైస్తవులకు చాలా తీవ్రమైన కష్టములను కలిగించవచ్చును. ఆవిధముగా ఇమిడియున్న విషయాలన్నిటిని పరిగణనలోకి తీసికొన్న తరువాత ఒక కుటుంబము వలస వెళ్లుటకు నిర్ణయించుకున్నయెడల, దాని విషయమై ఎవరు విమర్శనాత్మకంగా ఉండనవసరము లేదు. (గలతీయులు 6:5) అయితే అలా వెళ్లక నిలిచియుండువారు దేవుడిచ్చు ఆత్మీయ ఆశీర్వాదములందు ఆనందిస్తూ, ఈ విధానము తెచ్చు కష్టములను భరించుటకై సహాయము దయచేయుమని యెహోవాను అడుగుతూ ఉండవచ్చును. త్వరలో ఈ ప్రపంచపు అన్యాయములు, అసమానతలు దేవునిరాజ్యము క్రింద సరిచేయబడునని జ్ఞాపకముంచుకొనుము. అప్పుడు కీర్తనల రచయిత వ్రాసినట్లు ఉండును: “నీవు [యెహోవా] నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తి పరచుచున్నావు.”—కీర్తన 145:16. (w91 4/1)