యెహోవా ప్రకాశమానమైన రథ కదలికకు అనుగుణ్యముగా నడువుము
“వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటను నీవు వారికి తెలియజేయుము.”—యెహెజ్కేలు 2:7, NW
1, 2. ఏ రాజవాహనమును యెహెజ్కేలు చూసెను, మరియు ఆయనకు ఏమి చెప్పబడినది?
యెహోవాయొక్క ప్రకాశమానమైన రథము ఇప్పుడు తన సేవకుల ముందు నిలబడియున్నది. వారు విశ్వాసమను కన్నులతో తమ సార్వభౌమ ప్రభువుయొక్క రాజవాహనమును చూచెదరు. అది మహిమగలది, ఆశ్చర్యకరముగా భీతిగొల్పునది, మహత్తరమైనది.
2 అదే రాజవాహనము 2,600 సంవత్సరముల క్రితము దర్శనములో ప్రవక్తయైన యెహెజ్కేలు ముందుకు తేబడినది. సింహాసనమును మోయుచున్న ఈ రథముపైనుండి అనగా—ఆత్మీయప్రాణులతో కూడిన దేవుని పరలోక సంస్థనుండి—యెహోవా నాటకీయమైన ఈ ఆజ్ఞను యెహెజ్కేలుకు జారీ చేసెను: “వారు సిగ్గుమాలిన వారును కఠిన హృదయులునైయున్నారు, వారియొద్దకు నేను నిన్ను పంపుచున్నాను, వారు తిరుగుబాటు చేయువారు గనుక వారు వినినను వినకపోయినను తమ మధ్య ప్రవక్తయున్నాడని వారు తెలిసికొనునట్లు—ప్రభువగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడని నీవు వారికి ప్రకటింపవలెను.”—యెహెజ్కేలు 2:4, 5.
3. యెహెజ్కేలు ఆధునికమైన ఏ ప్రతిరూపమును కలిగియున్నాడు?
3 యెహెజ్కేలు దేవుని హస్తముక్రింద ఒకే ఒక కార్యసాధనముగా సేవచేయుచు దేవుడు ఆజ్ఞాపించిన పనిని దృఢ సంకల్పముతో నెరవేర్చెను. ఆలాగే, ప్రస్తుతము దేవుడు ఒకే ఒక సంస్థాపరమైన కార్యసాధనమును తన ఆధీనములో ఉంచుకొనియున్నాడు. అభిషక్త శేషమైన ఈ యెహెజ్కేలు తరగతి చిట్టచివరి సాక్ష్యమిచ్చు పనిలో, తమ చుట్టు మద్దతుగాయున్న “వేరేగొఱ్ఱెల” లోని “గొప్పసమూహము” తోపాటు ముందంజవేయుచున్నది. (ప్రకటన 7:9, 10; యోహాను 10:16) వారు రథముపై స్వారీచేయుచున్న మహోన్నతుడగు యెహోవాదేవుని సార్వభౌమాధిపత్యము క్రింద మంచికాపరియగు యేసుక్రీస్తు నడిపింపులో యేకముగా “ఒక్క మంద” యై ఉన్నారు.
4, 5. దేవుని దృశ్యమైన సంస్థ ఎట్లు ఉనికిలోనికి వచ్చినది, మరియు యెషయా 60:22కు అనుగుణ్యముగా అది దేనిని అనుభవించియున్నది?
4 యెహోవా నడిపింపు క్రింద ఈ ప్రపంచవ్యాప్తమైన సంస్థ, “మీరు దేవునికి భయపడి ఆయనను మహిమ పరచుడి; ఆయన తీర్పుతీర్చు గడియవచ్చెను” అను ఆజ్ఞను ప్రకటించుటకు, ఒక చిన్న ప్రారంభమునుండి పెద్ద శక్తివంతమైన మూలముగా ఎదిగినది. (ప్రకటన 14:7) యెహెజ్కేలు తనంతట తానే ఎట్లు బయలుదేరలేదో లేక తన్నుతాను ప్రవక్తగా నియమించుకొనలేదో ఆలాగే దేవుని దృశ్యమైన సంస్థ కూడ తన్నుతాను సృజించుకొనలేదు లేక నియమించుకొన లేదు. అది మానవ ఉద్దేశ్యమునుండి లేక ప్రయత్నమునుండి ఆవిర్భవించలేదు. దైవిక రథమును స్వారీచేయువాడు ఈ సంస్థను ఉనికిలోనికి తెచ్చెను. యెహోవా ప్రజలు దేవుని ఆత్మచే శక్తిపొంది, పరిశుద్ధ దూతల మద్దతుతో ఒక నాటకీయమైన విస్తరణను అనుభవించిరి. ఎట్లనగా ‘ఎన్నికలేనివాడు బలమైన జనమాయెను.’—యెషయా 60:22.
5 రాజ్య వర్తమానమును 212 దేశములలో 40,00,000 కంటె ఎక్కువ మంది యెహోవాసాక్షులు ప్రకటించుచున్నారు. వారు 63,000 సంఘములలో గుంపులుగా చేయబడి, ప్రాంతములుగాను, జిల్లాలగాను వ్యవస్థీకరించబడియున్నారు. సంస్థయొక్క ముఖ్యకార్యాలయములకు కేంద్రముగా పరిపాలక సభ ఆధ్వర్యములో విస్తృతంగా బ్రాంచి కార్యాలయములు, ముద్రణా సౌకర్యములు పనిచేయుచున్నవి. వారు ఒక్క వ్యక్తి వలె, సువార్తను ప్రకటించుచు, ప్రత్త్యుత్తరమిచ్చువారికి బోధిస్తూ, కూటముల స్థలములను నిర్మించుచు అందరు ముందుకు సాగుచున్నారు. ఔను, యెహోవాయొక్క దృశ్య సంస్థ, ప్రకాశమానమైన రథము మరియు దానిపై స్వారీచేయువాని కదలికకు తగినట్లు నడచుచున్నది.
6. యెహోవా దృశ్యసంస్థ కదలికకు పొందికగా నడచుటలో ఏమి ఇమిడియున్నది?
6 నీవును, యెహోవాసాక్షులలో ఒకడివైయున్నట్లయిన, దేవుని దృశ్యమైన సంస్థ కదలికకు పొందికగా నడచుచున్నావా? అలా చేయుటయనగా, కేవలము క్రైస్తవ కూటములకు హాజరగుట, పరిచర్యలో సమయము గడుపుటయే కాదు. కదలిక ముఖ్యముగా అభివృద్ధి మరియు ఆత్మీయ పెరుగుదలకు సంబంధముగలదైయున్నది. అందులో అనుకూలమైన మనోవైఖరి, ప్రాముఖ్యమైనవాటిని వాటి స్థానములో నుంచుట, అనుదినాభివృద్ధికి తగినట్లు సిద్ధపడియుండుట చేరియున్నవి. యెహోవాయొక్క ప్రకాశమానమైన రథ కదలికకు అనుగుణ్యముగా మనము నడచుచున్నట్లయిన, మన జీవితములు మనము ప్రకటించు వర్తమానముతో పొందికగాయుండును.
7. దేవుని ప్రవక్తగా యెహెజ్కేలు ప్రవర్తనను ఎందుకు పరిశీలించవలెను?
7 కదలికకు పొందికగా యుండు విషయములో ఆధునిక యెహోవా సేవకులు యెహెజ్కేలు మాదిరినుండి ఎంతో నేర్చుకొనవచ్చును. యెహెజ్కేలు ఒక ప్రవక్తగా, యెహోవాచే ప్రత్యేకముగా నియమించబడినను, యెహెజ్కేలు ఇంకను తన తన భావాలను, చింతలను, అవసరములను కలిగియున్నాడు. ఉదాహరణకు వివాహమునొందిన యౌవనునిగా తన భార్యను మరణములో పోగొట్టుకొనిన దుఃఖమును ఆయన అనుభవించాడు. అయినను, ఎప్పుడును ఆయన యెహోవా ప్రవక్తగా తనకాజ్ఞాపింపబడిన పనిని మరువలేదు. ఇతర విషయములందును యెహెజ్కేలు తననుతాను నడిపించుకొనిన తీరును పరిశీలించుటద్వారా, దేవుని దృశ్యసంస్థ కదలికకు అనుగుణ్యముగా నడుచుకొనునట్లు మనలను మనము బలపరచుకొనగలము. ఇది మనకు దేవుని అదృశ్యసంస్థ కదలికకును అనుగుణ్యముగా నడుచునట్లు సహాయపడును.
ఆజ్ఞాపించబడిన పని అంగీకరించబడి నెరవేర్చబడెను
8. తన కాజ్ఞాపించబడిన పని విషయములో యెహెజ్కేలు ఏ మాదిరిని ఉంచెను?
8 తన కాజ్ఞాపించబడిన పనిని అంగీకరించి దానిని నెరవేర్చుటలో యెహెజ్కేలు మంచి మాదిరి నుంచెను. ఏమైనను, దానిని నెరవేర్చుటకు విధేయత మరియు ధైర్యము అవసరము. ఏలయనగా మనమిట్లు చదువుదుము: “నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్లలోను ముండ్ల తుప్పలలోను తిరుగుచున్నావు. తేళ్ల మధ్య నివసించుచున్నావు; అయినను ఆ జనులకు భయపడకుము, వారి మాటలకును భయపడకుము. వారు తిరుగుబాటు చేయువారు వారికి భయపడకుము. వారు తిరుగుబాటు చేయువారు గనుక వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటను నీవు వారికి తెలియజేయుము. నరపుత్రుడా, వారు తిరుగుబాటు చేసినట్లు నీవు చేయక” యుండుము.—యెహెజ్కేలు 2:6-8.
9. కేవలము ఏమి చేయుటను బట్టియే యెహెజ్కేలు రక్తాపరాధంనుండి విడుదలనొందును?
9 యెహెజ్కేలు ఉదాసీనత లేక భయమును లేనివాడై తనపనిని నెరవేర్చుటకు యెడతెగక తన్నుతాను పురికొల్పు కొనవలసియుండెను. ఆయన యిష్టపూర్వకంగాను, నిర్భయంగాను యెహోవా మాటలను మాట్లాడినప్పుడు వారి రక్తాపరాధ విషయములో తాను విడుదలనొందును. యెహెజ్కేలుకు ఇట్లు చెప్పబడినది: “అయితే నీవు దుర్మార్గుని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గతనుండి దుష్క్రియలనుండియు మరలనియెడల అతడు తన దోషమునుబట్టి మరణమవును గాని నీవు (ఆత్మను) తప్పించుకొందువు.”—యెహెజ్కేలు 3:19.
10. యెహెజ్కేలు తరగతి ఎట్లు ఆ ప్రవక్తవలెనే యున్నట్లు రుజువుపరచుకొనినది?
10 యెహెజ్కేలు విషయంలాగానే, అభిషేకించబడిన యెహెజ్కేలు తరగతివారు, దేవుడు తమకాజ్ఞాపించిన పనిని అంగీకరించి దానిని నెరవేర్చుచున్నారు. మనము యెహోవాసాక్షులమైనట్లయిన మన జీవితము మరియు ఇతరుల జీవితములు మన విధేయతపైనే ఆధారపడియున్నవని జ్ఞాపకముంచుకొనవలెను. (1 తిమోతి 4:15, 16) ప్రతి సాక్షి యెహోవా సంస్థ కదలికకు అనుగుణ్యముగా నడవవలెను. దేవుడు మనలను తన రథమునకు కట్టుకొని దానితో పాటు ఈడ్చుకుపోడు. ఉదాసీనత మరియు విభాగించబడిన హృదయము రథముపై స్వారీచేయువానిని కించపరచును. అందుకే యెహోవా దృశ్యసంస్థ మనలను దైవిక శ్రద్ధలను మన జీవితములలో కేంద్రస్థానమందుంచవలెనని ఉద్బోధిస్తుంది. అటువంటి ఉద్బోధకు అనుగుణ్యమైన ప్రతిస్పందన మనలను యెహోవాసంస్థతో పాటు అడుగువేస్తూ, మన పరిశుద్ధ పరిచర్య కేవలము యాంత్రికముగా, ఏదో అలవాటు ప్రకారమైనది కాకుండ ఉన్నతపరచునట్లు చేయును. నిశ్చయముగా యెహోవా ప్రజలు ఒక సమూహముగా ఎంతో గుర్తింపదగిన భక్తిని ప్రదర్శిస్తున్నారు. మన వ్యక్తిగత బాధ్యత మాత్రము ఆ కదలికకు పొందికగా అడుగువేయుటయైయున్నది.
దేవుని మాటలు హృదయములోకి తీసుకొనబడినవి
11. దేవుని మాటల విషయంలో యెహెజ్కేలు ఏ మాదిరినుంచెను?
11 దేవుని మాటలను హృదయములోకి తీసుకొనుటలోను యెహెజ్కేలు మంచి మాదిరి నుంచెను. ఆజ్ఞమేరకు, ఆయన దేవుడిచ్చిన చుట్టను లేక గ్రంథపు చుట్టను తినివేసెను. దానినిగూర్చి యెహెజ్కేలు “అది నా నోటికి తేనెవలె మధురముగా నుండెనని” చెప్పెను. ఆ గ్రంథము ‘మహావిలాపము మనోదుఃఖము రోదనముతో’ నిండియున్నను అది యెహెజ్కేలుకు మధురముగా ఉండెను, ఎందుకనగా ఆయన యెహోవాకు ప్రాతినిధ్యము వహించుటలోని ఘనతను గుణగ్రహించెను. దేవుడు తనకిచ్చిన పనిని నెరవేర్చుట ప్రవక్తకు ఒక తియ్యని అనుభవమైయుండెను. దేవుడు ఆయనతో ఇట్లు చెప్పెను: “నరపుత్రుడా, చెవియొగ్గి నేను నీతో చెప్పుమాట లన్నిటిని చెవులారా విని మనస్సులో (హృదయములో NW) ఉంచుకొనుము.” (యెహెజ్కేలు 2:9–3:3, 10) ఆ దర్శనములు యెహెజ్కేలును తనను దేవుడు వేటియందు పాలుపొందునట్లు అనుమతించెనో వాటిని సూక్ష్మబుద్ధితో తెలిసికొనునట్లు చేసి యెహోవాతో తన సంబంధమును బలపరచినవి.
12. రెండు దశాబ్దములకంటె ఎక్కువైన ప్రవచన సేవా కాలములో యెహెజ్కేలు ఏమిచేసెను?
12 వివిధ సంకల్పములకై మరియు తనను వినువారి నిమిత్తమై యెహెజ్కేలునకు దర్శనములు వర్తమానములు యివ్వబడెను. ఆయన శ్రద్ధగావిని ఇవ్వబడిన నడిపింపు ప్రకారము మాట్లాడి ప్రవర్తించవలసియున్నాడు. తాను ప్రవక్తగా సేవచేసిన 22 సంవత్సరముల కాలములో క్రమక్రమముగా ఆయనకు నూతన సమాచారము మరియు విధానములు బయలు పరచబడినవి. కొన్నిసార్లు యెహెజ్కేలు ప్రత్యేకమైన పదములతో కూర్చబడిన వర్తమానమును మాట్లాడెను. మరి ఇతర సమయములలో యెరూషలేమునకు సూచనగా ఉన్న ఒక పెంకు ముందర పండుకొనినట్లు మాటలు లేని అభినయములను చూపించవలసి వచ్చెను. (యెహెజ్కేలు 4:1-8) తన భార్య మరణించినప్పుడు తాను ప్రతిస్పందించిన తీరు మొదలగు వ్యక్తిగత విషయములలోని తన మాదిరియు వర్తమానమును అందించెను. (యెహెజ్కేలు 24:15-19) ఆయన ఎల్లప్పుడు తాజాగా, సరైన సమాచారమును అందిస్తూ, సరైన సమయములో సరైన చర్యను గైకొనవలసియుండెను. యెహెజ్కేలు యెహోవాతో అతి సన్నిహితమైన, క్రమక్రమాభివృద్ధినొందు పనిగల సంబంధములో కట్టుబడియుండెను.
13. యెహోవాతో మనమెట్లు సన్నిహిత సంబంధమును నిర్మించుకొనగలము?
13 అలాగే, యెహోవాతో ఆయన జతపనివారముగా సన్నిహిత సంబంధమును నిర్మించుకొని కాపాడుకొనుటకు దేవుని వాక్యమును మనము మన హృదయములోకి తీసికొనవలెను. (1 కొరింథీయులు 3:9) ఈ విషయంలో దేవుని దృశ్య సంస్థ కదలికకు పొందికగా నడచుటకై, తగినవేళ అది అందించబడుకొలది, ప్రవాహమువలెవచ్చు ఆత్మీయాహారమును ఎప్పటికప్పుడు పుచ్చుకొనుచుండవలెను. (మత్తయి 24:45-47) “స్వచ్ఛమైన భాష” తదేకముగా విస్తృతమగుచున్నది. (జెఫన్యా 3:9 NW) మనము దిన దినమునకు దానికి తగినట్లు సిద్ధముగా ఉన్నప్పుడే రథముపై స్వారీచేయువాని నడిపింపునకు విధేయతతో నిజముగా ప్రత్త్యుత్తర మివ్వగల వారమైయుందుము.
14, 15. దేవుని సంస్థచే అందించబడు కదలికకు పొందికగా అడుగు వేయుటకు ఏ క్రమ వృత్తము (వాడుక) అవసరమైయున్నది?
14 ఆమట్టుకు, మనకు వ్యక్తిగత ప్రార్థన, ఏకాంత పఠనము, సువార్తయొక్క పరిశుద్ధ పరిచర్యలో పాల్గొను ఒక మంచి నియమబద్ధమైన క్రమము అవసరము. (రోమీయులు 15:16) దేవుని వర్తమానముగల గ్రంథపు చుట్టను భక్షించుటలో యెహెజ్కేలు మాదిరిని గుర్తుకు తెచ్చుకొనుము. యెహెజ్కేలు దానిలో కొంత భాగమునుకాక గ్రంథమునంతటిని తినివేసెను. ఆయన తన వ్యక్తిగత అభిరుచికి బాగా యిష్టమైన కొన్ని ముక్కలను ఏరుకొని తినలేదు. ఆలాగే, బైబిలు మరియు క్రైస్తవ ప్రచురణల మన వ్యక్తిగత పఠనము ఆత్మీయాహార ప్రవాహపు కదలికకు పొందికగా క్రమపరచబడవలెను. మరియు మనము లోతైన సత్యములతో సహా ఆత్మీయ బల్లపై పెట్టబడిన దానంతటిలో పాలు పుచ్చుకొనవలెను.
15 బలమైన ఆహారపు భావమును గ్రహించుటకు మనము ప్రార్థనా పూర్వకమైన ప్రయత్నమును చేయుదుమా? కదలికకు అనుగుణంగా వెళ్లుటకు మన జ్ఞానము మరియు వివేచన ప్రాథమికమైన దానికంటె మిన్నగా వృద్ధిచెందవలెను. ఏలయనగా మనమిట్లు చదువుదుము: “పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్యవిషయములో అనుభవములేనివాడై యున్నాడు. వయస్సు వచ్చినవారు అభ్యాసముచేత మేలు కీడులను వివేచించుటకు సాధకముచేయబడిన జ్ఞానేంద్రియములు కలిగియున్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును.” (హెబ్రీయులు 5:13, 14) ఔను, ఆత్మీయాభివృద్ధిని చేసికొనుట దేవుని సంస్థ అందించు కదలికకు అనుగుణ్యముగా నడచుటలో ముఖ్యభాగమై యున్నది.
తటస్థతా విధానమునుబట్టి ఆగిపోలేదు
16, 17. తటస్థతా విధానము, అపహాస్యము, సరైన ప్రత్త్యుత్తరమివ్వక పోవువాటితో యెహెజ్కేలు ఎట్లు వ్యవహరించెను?
16 విధేయతగలవాడై తటస్థతా విధానమునుబట్టి లేక అపహాస్యమునుబట్టి ఆగిపోకుండుటలో యెహెజ్కేలు మంచి మాదిరినుంచాడు. అలాగే స్వచ్ఛమైన భాష అభివృద్ధియగుకొలది దానిని వృద్ధిచేసికొనుటద్వారా సార్వభౌమునిగా రథముపై స్వారీచేయువాని నడిపింపుకు తగినట్లు మాట్లాడగలము. ఆవిధముగా ఆయన ఆజ్ఞలకు ప్రతిస్పందించుటకై సిద్ధముచేయబడి, యెహోవా తీర్పువర్తమానమును మాట్లాడునప్పుడు మనము మాట్లాడువారి తటస్థతా విధానము లేక అపహాస్యముబట్టి ఆగిపోకుండునట్లు బలపరచబడుదుము. యెహెజ్కేలుకు చెప్పినట్లే, దేవుడు ముందుగానే, కొందరు కఠినహృదయముగలవారై, తలబిరుసుతనముతో గట్టిగా వ్యతిరేకింతురని మనలను హెచ్చరించెను. కొందరు యెహోవా మాటను గైకొనుకొనుటకు యిష్టపడనందున వినరు. (యెహెజ్కేలు 3:7-9) ఇంకను మరికొందరు, యెహెజ్కేలు 33:31, 32 చెప్పినట్లు వేషధారులైయుందురు: “నా జనులు రాదగిన విధముగా వారు నీయొద్దకు వచ్చి, నా జనులైనట్టుగా నీ యెదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారు నోటితో ఎంతో ప్రేమ కనుపరచుదురు గాని వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది. నీవు వారికి వాద్యము బాగుగా వాయించుచు మంచి స్వరము కలిగిన గాయకుడవుగా ఉన్నావు, వారు నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి నడుచుకొనరు.”
17 దాని ఫలితము ఏమైయుండును? 33 వ వచనము ఇట్లనుచున్నది: “అయినను ఆ మాట నెరవేరును, అది నెరవేరగా ప్రవక్తయొకడు తమ మధ్యయుండెనని వారు తెలిసికొందురు.” ఆ మాటలు, వారు ప్రతి జవాబివ్వనందున యెహెజ్కేలు విడిచిపెట్టలేదని చూపుచున్నవి. ఇతరులయొక్క ఉదాసీనత తనను ఉదాసీనునిగా చేయలేదు. ప్రజలు విన్నను వినకపోయినను ఆయన దేవునికి విధేయుడై తన పనిని నెరవేర్చెను.
18. నీకై నీవు ఏ ప్రశ్నలు అడుగుకొనవచ్చును?
18 అందరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచవలెనను ప్రకటనను యెహోవాయొక్క దృశ్య సంస్థ ఇప్పుడు ఉధృతము చేయుచున్నది. రాజ్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటలో నిర్భయమైన స్థానము వహించినందుకు, జీవిత విధానములో నైతికముగా ఉన్నందుకు విమర్శించబడినప్పుడు వాటిలో నీవు దృఢముగా కొనసాగుదువా? రక్తమునంగీకరించనందుకు, జాతీయ చిహ్నములను ఆరాధించనందుకు, లోకసంబంధమైన సెలవు దినములను ఆచరించనందుకు నీవు వత్తిడికి గురియైనప్పుడు నీవు దృఢముగా నిలబడుచున్నావా?—మత్తయి 5:11, 12; 1 పేతురు 4:4, 5.
19. యెహోవాయొక్క ప్రకాశమానమైన రథ కదలికకు అనుగుణ్యముగా నడచుచున్నట్లయిన, నడిపింపు విషయములో మనము ఏమి చేయుదుము?
19 ఇట్టి విధానము సులభమైన దేమి కాదు. అయితే అంతము వరకు సహించువారు రక్షించబడుదురు. (మత్తయి 24:13) లోకప్రజలు మనలను వారివలె తయారుచేసి, తద్వారా యెహోవాయొక్క ప్రకాశమానమైన రథ కదలికకు అనుగుణ్యముగా నడుచుటనుండి ప్రక్కకు లాగకుండునట్లు యెహోవా సహాయమువలన చేసికొనగలము. (యెహెజ్కేలు 2:8; రోమీయులు 12:21) మనము రథములాంటి దూతల సంస్థ కదలికకు అనుగుణ్యముగా వెళ్లుచున్నట్లయిన, దేవుని దృశ్యసంస్థనుండి వచ్చు ఉపదేశములకు మరియు నడిపింపుకు మనము చురుకుగా పొందుపరచుకొందుము. మన విశ్వాసముపై వచ్చు ముట్టడులను ఎదిరించుటకు, జీవవాక్యమును గట్టిగా చేపట్టుటకు, ప్రకాశమానమైన రథముపై స్వారీచేయు సార్వభౌమునిపై కేంద్రీకరింపబడు ఆత్మీయ వాస్తవాలపై మన కన్నులను నిలుపుటకు మనకు అవసరమైనవాటిని యెహోవా దయచేయును.
కదలికకు అనుగుణ్యంగా వెళ్లుటకు పురికొల్పబడుట
20. మనలను కదలికకు అనుగుణ్యంగా నడుచునట్లు పురికొల్పవలసిన యే కొన్ని సంగతులను యెహెజ్కేలు వ్రాసెను?
20 యెహెజ్కేలు దర్శనము మనలను కదలికకు అనుగుణ్యంగా వెళ్లుటకు పురికొల్పవలెను. ఆయన ఇశ్రాయేలీయులపై దేవుని తీర్పులను ప్రకటించుటయేగాక, వారు పునరుద్ధరించబడు ప్రవచనములను కూడ లిఖించెను. నిర్ణయకాలమున యెహోవా సింహాసనముపై పరిపాలించు స్వాస్థ్యకర్తను యెహెజ్కేలు సూచించెను. (యెహెజ్కేలు 21:27) ఆ రాజ సేవకుడగు, “దావీదు” దేవుని ప్రజలను తిరిగి సమకూర్చి వారిని కాయును. (యెహెజ్కేలు 34:23, 24) మాగోగువాడైన గోగుచే వారు ముట్టడింపబడినను, దేవుడు వారిని విడిపించును. మరియు ఆయన శత్రువులు నాశనమునకు వెళ్లునప్పుడు ‘యెహోవాను తెలిసికొనుటకు’ బలవంతపెట్టబడుదురు. (యెహెజ్కేలు 38:8-12; 39:4, 7) అప్పుడు దేవుని సేవకులు ఆత్మీయ ఆలయము ఇమిడియున్న పవిత్రారాధన విధానములో నిరంతర జీవితమును అనుభవింతురు. పరిశుద్ధ స్థలమునుండి ప్రవహించు జలములు స్వస్థతకు, పోషణకు మూలముగా నుండును. వారి ఆశీర్వాదముకొరకై భూస్వాస్థ్యము ప్రత్యేకముగా కేటాయించబడును.—యెహెజ్కేలు 40:2; 47:9, 12, 21.
21. యెహోవాయొక్క ఆధునిక-దిన సాక్షుల పాత్ర యెహెజ్కేలు దానికంటె ఎందుకు గొప్పది?
21 ఆ ప్రవచనములను వ్రాయుటకు యెహెజ్కేలు ఎంతగా పులకరించిన వాడైయుండును! అయినను యెహోవాయొక్క ఆధునిక దిన సాక్షుల పాత్ర ఇంకా గొప్పనైనది. అందులోని కొన్ని ప్రవచనములు నెరవేరుచున్న కాలములో మనము జీవించుచున్నాము. నిజమునకు, కొన్ని ప్రవచన నెరవేర్పులలో మనమే పాలివారమైయున్నాము. మనము జీవించు విధానమును బట్టి, స్వాస్థ్యమును పొందవలసిన హక్కుదారునిగా యేసు ఇప్పుడు పరిపాలించుచున్నాడను దృఢనమ్మకమును వ్యక్తిగతముగా ప్రదర్శింతుమా? యెహోవా త్వరలో తన్నుతాను మహిమపరచుకొని, తన సంస్థ కదలికకు అనుగుణ్యముగా నడచువారిని నూతనలోకములోనికి ప్రవేశింపజేయునని మనము వ్యక్తిగతముగా ఒప్పించబడియున్నామా? (2 పేతురు 3:13) విశ్వాస సంబంధమైన క్రియలతో కూడిన అట్టి ఒప్పుదల మనము నిజముగా యెహోవా ప్రకాశమానమైన రథ కదలికకు అనుగుణ్యంగా వెళ్లుచున్నామని ప్రదర్శించును.
కదలికకు అనుగుణ్యంగా ఉండుటలో కొనసాగుము
22. స్పష్టమైన ఆత్మీయ బాహ్యదృక్పథమును కాపాడుకొనునట్లు పరధ్యానము కలిగించువాటిని నిరోధించుటకు ఏమి చేయవచ్చును?
22 మనము ‘మన చేతిని నాగలిపై ఉంచి’ లోకము అందించు దేనికొరకైనను ఆశతో వెనుదిరిగి చూడకూడదు. (లూకా 9:62; 17:32; తీతు 2:11-13) కావున, భూమిపై ధనమును సమకూర్చుకొందమను ఏ ఆలోచననైనను అణచివేసికొని, కేవలము రాజ్యముపైననే దృష్టిని నిలుపునట్లు మనము మన కంటిని తేటగా ఉంచుకొందము. (మత్తయి 6:19-22, 33) జీవితములను సామాన్యమైనవిగా చేసికొనుట, సాధ్యమైన చోటలెల్లా ఐహిక భారములను తొలగించుకొనుట యెహోవా సంస్థ కదలికకు అనుగుణ్యముగా వెళ్లుటకు మనకు సహాయముచేయును. (హెబ్రీయులు 12:1-3) పరధ్యానమునకు మళ్లించు విషయములు ప్రకాశమానమైన రథము, దానిపై స్వారీ చేయువాని యెడలగల మన దృష్టిని మందముచేయును. అయితే ఆయన సహాయముతో, యెహెజ్కేలు వలెనే, స్పష్టమైన ఆత్మీయ బాహ్యదృక్పథమును కాపాడుకొనగలము.
23. నమ్మకమైన సాక్షులు క్రొత్తవారి విషయములో ఏమి చేయవలసిన అవసరమున్నది?
23 యెహోవాసాక్షులముగా మనము కలిగియున్న బాధ్యతలో భాగంగా అనేకమంది క్రొత్తవారికి వారును దేవుని ప్రకాశమానమైన రథ కదలికకు అనుగుణంగా నడచునట్లు సహాయపడవలసిన పని ఇమిడియున్నది. 1990 వ సంవత్సరములో యేసుక్రీస్తు మరణ జ్ఞాపకార్థదినమునకు దాదాపు 1,00,00,000 మంది హాజరయ్యారు. వీరిలో అనేకమంది క్రైస్తవ కూటములలో కొన్నింటికి హాజరగుచుండగా, వారు యెహోవా దృశ్య సంస్థతోపాటు అభివృద్ధిచెందవలసిన ప్రాముఖ్యతను చూడవలసిన అవసరములో ఉన్నారు. నమ్మకమైన సాక్షులముగా మనము చూపు ఆత్మ మూలముగాను, మనమిచ్చు ప్రోత్సాహము వలనను వారికి మనము సహాయముచేయగలము.
24. సమస్తము వాటివాటి తుది దశకు చేరుకొను ఈ సమయములలో మనమేమి చేయవలెను?
24 ఇవి సమస్తము తమ తమ తుది దశకుచేరుకొను సమయములు. విశ్వాసపు కన్నులతో ప్రకాశమానమైన రథము మన యెదుటికి లాగబడుటను చూసియున్నాము. చిట్టచివరకు యెహోవా ఎవరో అన్యజనులు తెలిసికొనునట్లు వారికి ప్రకటించు పనిని, రథముపై స్వారీచేయు సార్వభౌముడు తన దృశ్య సంస్థకు ఆజ్ఞాపించియున్నాడు. (యెహెజ్కేలు 39:7) యెహోవాయొక్క ప్రకాశమానమైన రథ కదలికకు అనుగుణ్యముగా నడచుటద్వారా దేవుని సార్వభౌమాధిపత్యపు సత్యత్వమును రుజువుపరచుటలో పాల్గొనుటకును, ఆయన పరిశుద్ధ నామమును మహిమపరచుటకును ఈ యొక్క గొప్ప అవకాశమును పూర్తిగా ఉపయోగించుము. (w91 3/15)
మీరెట్లు జవాబిచ్చెదరు?
◻ తనకాజ్ఞాపించబడిన పని విషయములో యెహెజ్కేలు ఏ మాదిరి నుంచాడు?
◻ దేవుని సంస్థ కదలికకు అనుగుణ్యంగా నడచుట అనగా అర్థమేమి?
◻ యెహోవా మాటలను యెహెజ్కేలు ఎట్లు దృష్టించాడు?
◻ తటస్థతా విధానముతో వ్యవహరించునప్పుడు మనమెట్లు యెహెజ్కేలు మాదిరిని అనుసరించగలము?
◻ యెహోవా ప్రకాశమానమైన రథ కదలికకు అనుగుణ్యంగా నడుచునట్లు ఆయన సేవకులను ఏది పురికొల్పవలెను?
[14వ పేజీలోని చిత్రాలు]
యెహోవాయొక్క ప్రకాశమానమైన రథ కదలికకు అనుగుణ్యంగా నడచుటకు ఏమి అవసరమైయున్నది?
[15వ పేజీలోని చిత్రాలు]
యెహెజ్కేలు దేవునిచే తనకివ్వబడిన ఆధిక్యతలను మెచ్చుకున్నాడు. మరి నీవు?