వారు అనుకున్న దానికంటే అది ఆలస్యముగా ఉండెను!
సంవత్సరము, సా. శ. పూ. 609. స్థలము యెరూషలేము. ప్రసంగీకుడు ప్రవక్తయైన యిర్మీయా. ఆయన తన ప్రియమైన పరిశుద్ధ పట్టణమగు యెరూషలేముయొక్క నాశనమునుగూర్చి ప్రవచించెను. ఆ నాశనము యూదులు యెహోవాకు వెన్ను చూపినందుకు మరియు అబద్ధదేవతల ఆరాధనలో మునిగిపోయినందుకు వారిపైకి రానైయుండెను. వారు ఎత్తైన స్థలములలో కామాతురతతో కూడిన ఆరాధనలో పాలుపొంది, అన్యదేవతలకు పానీయార్పణలను అర్పించిరి. సూర్యుని, చంద్రుని, మరియు నక్షత్రములను ఆరాధించిరి. బయలుకు ధూపము వేసిరి. తమ పిల్లలను మోలేకునకు బలిగా అర్పించిరి.—1 రాజులు 14:23, 24; యిర్మీయా 6:15; 7:31; 8:2; 32:29, 34, 35; యెహెజ్కేలు 8:7-17.
వారి దృష్టిలో యిర్మీయా విపత్తు అని అరిచేవాడు, మూఢ భక్తి గలవాడు, ప్రతివారి విషయములో మరియు ప్రతిదాని విషయములో తృప్తిలేనివాడు. యిర్మీయా 38 సంవత్సరములనుండి వారిని హెచ్చరించుచుండెను; ఆ 38 సంవత్సరములు యెరూషలేము నివాసులు ఆయనను ఎగతాళి చేయుచుండిరి. ఈ సమయమువరకు ప్రజలు యెహోవాను నిర్లక్ష్యము చేయుచుండిరి, ఆయన చింతించవలసిన శక్తి కాడని వారనుకొనుచుండిరి. “యెహోవా మేలైనను కీడైనను చేయువాడు కాడని” మరియు “యెహోవా దేశమును విసర్జించెననియు ఆయన మమ్మును కానడనియు” వారు అనిరి.—జెఫన్యా 1:12; యెహెజ్కేలు 9:9.
ప్రవక్తలైన యిర్మీయా మరియు యెహెజ్కేలు యెరూషలేముయొక్క నాశనమును గూర్చి ప్రకటించుచుండిరి, కాని ఏమియు జరుగలేదు. కావున ఇశ్రాయేలీయులు అటువంటి ఏ దర్శనములు వారి దినములలో నెరవేరగలవను దానిని త్రోసిపుచ్చి ఇట్లనిరి: “దినములు జరిగిపోవుచున్నవి, ప్రతిదర్శనము నిరర్థకమగుచున్నది.” దానికి యెహోవాయొక్క ప్రత్యుత్తరము ఇలాగుండెను: “దినములు వచ్చుచున్నవి . . . యెహోవానైన నేను మాటయిచ్చుచున్నాను, నేనిచ్చు మాట యికను ఆలస్యములేక జరుగును. తిరుగుబాటు చేయువారలారా, మీ దినములలో నేను మాటయిచ్చిదాని నెరవేర్చెదను.”—యెహెజ్కేలు 12:22-25.
యెహోవా తన వాక్యమును నెరవేర్చుటకు సా. శ. పూ. 609లో సమయము వచ్చినది. యిర్మీయా హెచ్చరికను అందించుచుండిన నాలుగు దశాబ్దముల తర్వాత, యెరూషలేము పట్టణము బబులోను సేనలతో ముట్టడివేయబడెను. పద్దెనిమిది నెలల తరువాత ప్రాకారములు పడవేయబడినవి, మందిరము కాల్చబడినది, మరియు అత్యధిక ప్రజలు బబులోనుకు చెరగా తీసికొనిపోబడిరి. ప్రవచించబడినరీతిగా, ఆ పట్టణము ఖడ్గము, కరువు మరియు తెగులు వలన నాశనము చేయబడినది.—2 రాజులు 25:7-17; 2 దినవృత్తాంతములు 36:17-20; యిర్మీయా 32:36; 52:12-20.
యిర్మీయా సరియై ఉండెను. ప్రజలు తప్పయివుండిరి. వారు అనుకున్నదానికంటే అది తరువాత జరిగినది! ఆ దర్శన నెరవేర్పు ఎన్నో సంవత్సరముల దూరమున ఉండలేదు. అది వారి దినముల కొరకైయుండెను.
ఇది కేవలము చరిత్రకాదు. యెరూషలేమునకు సంభవించినది ప్రవచనార్ధమును కలిగియుండెను. అది రానైయున్న దానికి ఛాయగా ఉండెను. ఈ దిన క్రీస్తుమత సామ్రాజ్యము క్రీస్తునామమును ధరించినది. దేవునితో నిబంధనా సంబంధమును కలిగియున్నానని చెప్పుకొనుచున్నది. అయినను అది పురాతన యెరూషలేముయొక్క ప్రజల అడుగుజాడలలో నడచుచున్నది. అత్యధికముగా క్రీస్తుమత సామ్రాజ్యముయొక్క చర్చీలు అన్యమత సిద్ధాంతములను బోధించుచున్నవి. లైంగిక అవినీతితో కలుషితము అయ్యాయి. రాజకీయ పథకములను బలపరచుచున్నవి. లోకపు యుద్ధములను బలపరచుచున్నవి. సృష్టికర్తయైన దేవునిని త్రోసిపుచ్చి పరిణామ సిద్ధాంతమును హత్తుకొన్నవి. అనుకూలత అను బలిపీఠముమీద లక్షలాది గర్భస్థశిశువుల బలిని చూచిచూడనట్లుండి, మరియు సాధారణంగా మానవ తత్వజ్ఞానమును స్వీకరించి బైబిలు ఒక కట్టుకథ అని ప్రతిపాదించుచున్నవి.
యెరూషలేముయొక్క ప్రజలు యిర్మీయాను, అపహసించిరి. అలాగే క్రీస్తుమతసామ్రాజ్యము ఈనాడు యెహోవాసాక్షులను అపహసించుచున్నది. ఆర్మగెద్దోనను రానైయున్న నాశనమును గూర్చి సాక్షులు చేయు హెచ్చరిక త్రోసిపుచ్చబడుతున్నది. ‘దేవుడు భూమిపైన ఆసక్తిని కలిగిలేడు ఆయన పరలోకమును నడుపనీయండి; మేము భూమిని నడుపుతాం. మరియు ఒకవేళ ఆర్మగెద్దోను వస్తే, అది మన తరములో రాదు. మేము దానిని గూర్చి విన్నాములే. మేము దాని ద్వారా మోసపరచబడము’ అని క్రీస్తుమతసామ్రాజ్యము అంటుంది.
ఇది చరిత్ర యొక్క పునరావృత్తమా? లక్షలాది ప్రజలు తాము అనుకున్నదానికంటే తరువాత జరగనైయున్నదని తెలుసుకొనుటకు ఇది మరియొక సమయము కానున్నదా? (w91 4/1)