బేత్లహేము మరియు క్రిస్మస్‌ను గూర్చిన సత్యమేమి?
“బేత్లెహేము . . . అనంత ప్రేమకు రుజువు, అది వినయమందు ఒక పాఠము.”—మారియా థెరీసా పెట్రోస్సీ, బేత్లెహేము అను పుస్తకముయొక్క గ్రంథకర్తరాలు.
బేత్లెహేము అనగా మీకు అటువంటి భావమేయున్నదా? బహుశ కావచ్చును, ఎందుకనగా ప్రపంచవ్యాప్తముగా నిష్కపటులైన మరియు సమాధానమును ప్రేమించు కోట్లాదిమంది ప్రత్యేకముగా క్రిస్మస్ కాలములో, బేత్లెహేమును పవిత్రముగా చూసెదరు. మధ్యప్రాచ్యమందలి ఈ చిన్న పట్టణము “సమాధానకర్తయగు” యేసుక్రీస్తు జన్మస్థలమని వారెరిగియున్నారు. బహుశ పూజించుటకు, క్రీస్తుమత సామ్రాజ్యముయొక్క అతిపరిశుద్ధ స్థలములలో ఒకటైన దీనిని దర్శించుటకు శతాబ్దములుగా యాత్రికులు తండోపతండాలుగా వచ్చిరి. అది గ్రొట్టొ ఆఫ్ నేటివిటి (క్రీస్తు జన్మించిన గుహ), యేసుక్రీస్తు సంప్రదాయ జన్మస్థలము. అది చర్చ్ ఆఫ్ నేటివిటి అని పిలువబడిన బహుపెద్దదైన చరిత్రాత్మక భవన సముదాయమందు కలదు.—యెషయా 9:6; మత్తయి 2:1.
యేసు జన్మస్థల పరిస్థితులనుగూర్చిన సత్యమేమైయున్నది? ఉదాహరణకు, ఆయన ఎప్పుడు జన్మించెను? ఇప్పుడు నేటివిటి గ్రొట్టొ అనబడు స్థలములో ఆయన జన్మించెనా? నీవు లేక మరెవరైనను ఆయన జన్మస్థలమును పూజింపవలెనా?
“బేత్లెహేముయొక్క మర్మమును గూర్చి ఆలోచించినప్పుడు ప్రశ్నలు మరియు సందేహములు మనస్సులోనికి రానీయకుండా ఉండలేము.”—మారియా థెరీసా పెట్రోస్సీ ద్వారా వ్రాయబడిన, బేత్లెహేము.
‘ప్రశ్నలు మరియు సందేహములు ఎందుకు?’ నీవు అడుగవచ్చు. క్రిస్మస్‌ను గూర్చి వేరువేరు నమ్మకములు మరియు ఈ నమ్మకములతో సంబంధము కలిగిన స్థలములు, వాస్తవముపై ఆధారపడియున్నవి కావా? అది నిజమా?
ఆయన ఎప్పుడు పుట్టియుండెను?
యేసుయొక్క పుట్టుక దినమునుగూర్చి మారీయా థెరీసా పెట్రోస్సీ అడుగుచున్నది: “విమోచకుడు ఖచ్ఛితముగా ఎప్పుడు పుట్టియుండెను? ఆ సంవత్సరమే కాకుండా, ఆ నెల, దినము మరియు గంటను కూడా తెలిసికొనుటకు ఇష్టపడుదుము. ఖచ్ఛితమైన గణితము మనకు ఇవ్వబడలేదు.” న్యూ కాథోలిక్ ఎన్ సైక్లోపీడియా దీనిని బలపరచుచున్నది: “యేసుక్రీస్తు యొక్క జన్మదినమును సుమారుగానే లెక్కించగలము.” యేసు పుట్టెను అని చెప్పబడుతున్న దినమునుగూర్చి అది ఇట్లనుచున్నది: “డిశంబరు 25 క్రీస్తు జన్మించిన దినముతో పొందిక కలిగిలేదు కాని, నటాలిస్ సాలిస్ ఇన్‌విక్టి విందుతో, సాల్‌స్టిస్‌లో రోమీయుల సూర్య పండుగతో పొందికను కలిగియుంది.”
కావున మీరిట్లడుగవచ్చును, ‘యేసు డిశంబరు 25న పుట్టినట్లయితే ఎప్పుడు పుట్టియుండెను?’ మత్తయి 26 మరియు 27 అధ్యాయములద్వారా యేసు యూదుల పస్కా సమయములో చనిపోయి యుండెను అని అర్థము చేసికొందుము. అది ఏప్రిల్ 1, సా.శ. లో మొదలాయెను. అంతేకాకుండా లూకా 3:21-23 తెలియజేయునదేమనగా యేసు తన పరిచర్యను మొదలు పెట్టినప్పుడు 30 సంవత్సరముల వయస్సు గలవాడై యుండెను. ఆయన భూలోక పరిచర్య మూడున్నర సంవత్సరముల పొడుగైయుండెను గనుక ఆయన చనిపోయిన సమయములో 33 1/2 సంవత్సరముల వయస్సుగలవాడై యుండెను. ఆరునెలల తరువాత యేసుకు 34 సంవత్సరములు పూర్తి అయియుండేది. అది అక్టోబరు 1న వచ్చియుండేది. మనము యేసు ఎప్పుడు పుట్టాడని వెనుకకు లెక్కచేసినట్లయిన మనము డిశంబరు 25 లేక జనవరి 6 కాక, అక్టోబరు 1 సా.శ.పూ. 2వ శతాబ్దమునకు వచ్చెదము.
మరియొక గమనారక్ష విషయమేమనగా డిశంబరు నెలలో బేత్లెహేము మరియు దాని చుట్టూవున్న ప్రాంతములో చలికాలపు చల్లని వాతావరణము, చల్లని వర్షము మరియు కొన్నిసార్లు మంచుకు గురి అవును. ఆ సమయములో గొర్రెల కాపరులు మందలతో సహా రాత్రులు బయట కనిపించరు. ఇది ఇటీవలి వాతావరణ ప్రక్రియకాదు. లేఖనములు చూపునదేమనగా యూదయ రాజైన యెహోయాకీము “తొమ్మిదవ మాసమున [చిస్లేవ్, నవంబరు-డిశంబరుతో సరిపడును] రాజు శీతాకాలపు నగరులో కూర్చిండి యుండగా అతని ముందర కుంపటిలో అగ్ని రగులు చుండెను.” (యిర్మీయా 36:22) అతడు వెచ్చగా ఉండుటకు ఆ వేడి అవసరమై యుండెను. మరి ఎక్కువగా ఎజ్రా 10:9, 13 లో స్పష్టమైన నిదర్శనము చూపునదేమనగా చిస్లేవ్ నెల వర్షాకాలమైయుండెను. “వర్షము బలముగా వచ్చుచున్నందున మేము బయట నిలువలేము.” ఇదంతయు చూపించునదేమనగా డిశంబరులో బేత్లెహేములోని వాతావరణ పరిస్థితులు, బైబిలు వర్ణించిన రీతిగా యేసు జన్మించిన సమయములో జరిగిన వాటితో పొందిక కలిగిలేవు.—లూకా 2:8-11.
ఏ స్థలములో?
ఒక లక్షకంటే ఎక్కువ ఫ్రెంచ్ సైనికుల జీవములను బలిగొన్న ‘రక్తపాతముతో కూడిన పోరాటమైన’ క్రిమియా యుద్ధానికి (1853-56) కారణమైన స్థలమునుగూర్చి సరియైన దృష్టి ఏమైయున్నది? ఆ స్థలము నిజముగా యేసు పుట్టిన స్థలమా?
ఆరంభించుటకు బైబిలు ఖచ్ఛితముగా యేసు పుట్టిన స్థలమునుగూర్చి ప్రస్తావించుట లేదు. యేసు పుట్టుక, మీకా 5:2 (NW) లోని మెస్సీయ ప్రవచనాన్ని పూర్తిచేసెనని మత్తయి మరియు లూకా స్థిరపరచిరి. అది ఇట్లు ప్రవచించెను: “పురాతన కాలమందు ఆది కలిగినవాడు, ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు” బేత్లెహేమునుండి వచ్చును. (మత్తయి 2:1, 5; లూకా 2:4) రెండు సువార్త వర్ణనలు కేవలము అవసరమైన విషయములనే ప్రస్తావిస్తున్నవి. ఏదనగా, యేసు బేత్లెహేములో పుట్టెను మరియు లూకా ప్రకారముగా శిశువు బట్టలతో చుట్టబడినవాడై పశువుల దొడ్డిలో ఉంచబడెను.—లూకా 2:7.
సువార్త లేఖికులు ఎక్కువ వివరములను ఎందుకు ఇవ్వలేదు? మారియా థెరీసా పెట్రోస్సీ ఇట్లు అభిప్రాయపడిరి: “సువార్తికులు ఈ వివరములను నిర్లక్ష్యము చేసిరి, ఎందుకనగా స్పష్టమైన రీతిగా అవి అర్థరహితమని వారు తలంచిరి.” వాస్తవముగా యేసు తన పుట్టుకను గూర్చిన వివరములు ప్రత్యేకముగా అర్థవంతమైనవని తలంచలేదని స్పష్టమగుచున్నది, ఎందుకనగా ఆయన ఒక్కసారికూడా తన పుట్టిన తేదీని లేక తాను పుట్టిన స్థలమునుగూర్చి చెప్పినట్లు ఎక్కడ వ్రాయబడలేదు. ఆయన బేత్లెహేములో పుట్టినప్పటికి ఆయన దానిని తన నివాస స్థలముగా ఎంచలేదు. గాని గలిలయ ప్రాంతము ఆయన స్వదేశము అని చెప్పబడెను.—మార్కు 6:1, 3, 4; మత్తయి 2:4, 5; 13:54.
యోహాను 7:40-42 చదివినప్పుడు స్పష్టమగునదేమనగా, సాధారణంగా ప్రజలు ఆయన జన్మస్థానమునుగూర్చి ఎరిగియుండలేదు. ఆయన గలిలయలో పుట్టెను అని అనుకొనుచుండిరి. “మరికొందరు ఏమి క్రీస్తు గలిలయలోనుండి వచ్చునా” అనిరి. యోహాను 7:41 లో వ్రాసిన దానిని చర్చిస్తూ ది చర్చ్ ఆఫ్ ది నేటివిటి, బేత్లెహేమ్ ఇట్లనుచున్నది: “అటువంటి చర్చలు జరిగాయనుటకు క్రీస్తు బేత్లెహేములో పుట్టెనను వాస్తవమును విమర్శించుట లేదు. అయితే అతని అనుచరులలో అనేకులు దానిని ఎరుగక ఉండిరి అని చూపించుచున్నది.”
యేసుయొక్క భూమిపైన జీవిత కాలమున ఆయన తన పుట్టుకనుగూర్చిన వివరములను ప్రకటించలేదని స్పష్టమగుచున్నది. ఆయన పుట్టిన స్థలమునకు ఏ ప్రాముఖ్యత ఇవ్వబడలేదు. అయితే యోసేపు మరియను ప్రసవించుటకు తెచ్చిన స్థలము గ్రొట్టొ ఆఫ్ నేటివిటి (క్రీస్తు జన్మించిన గుహ) అని నమ్ముటకు ఏ ఆధారము కలదు?
పెట్రోస్సీ యథార్థముగా ఇట్లు ఒప్పుకొనినది: “ఆ గ్రొట్టొ బేత్లెహేము ప్రాంతములో ఉన్న అసంఖ్యాకమైన గుహలలో ఒకటా లేక పూటకూళ్ల ఇంట్లో పశువులదొడ్డియా అనేది నిశ్చయముగా తెలిసికొనుట సాధ్యము కాదు. అయినను 2వ శతాబ్దముయొక్క మొదటి భాగమున ఉన్న సంప్రదాయము ప్రకారముగా స్పష్టమైన దేమనగా అది ఒక గుహ-పశువులదొడ్డి.”—ఇటాలిక్కులు మావి.
కేవలము సంప్రదాయము
మారియా థెరీసా పెట్రోస్సీ మరియు ఆర్. డబ్ల్యు. హామిల్టన్ మరియు బేత్లెహేము చరిత్రయొక్క ఇతర పాఠకులు సా.శ. 2వ శతాబ్దములో ఉన్న జస్టిన్ మార్టిర్, ఏది అని స్పష్టముగా చెప్పకుండా యేసు ఒక గుహలో పుట్టాడు అని మొదట ప్రతిపాదించాడు అని చూపించుచున్నారు. జస్టిన్ మార్టిర్‌యొక్క ప్రకటననుగూర్చి హామిల్టన్ ఇట్లు తేల్చిచెప్పెను: “ఇది ఆయన మాటగా చెప్పిన విషయమే మరియు జస్టిన్ మార్టిర్ ఒక విశేషమైన గుహను మనస్సులో ఉంచుకున్నాడనుట లేక ఆయన ప్రస్తుత గ్రొట్టొ ఆఫ్ నేటివిటిని గూర్చి చెప్పుచున్నాడనుట, ఒక్కమాటయొక్క నిదర్శనమును ఎక్కువ దూరం తీసుకుపోయినట్టవుతుంది.”
ఒక పాదవచనమందు హామిల్టన్ ఇట్లు వ్రాయుచున్నాడు: “అదే సమయములో వ్రాయబడిన, ‘అపొక్రిపలోని యాకోబు పుస్తకము’ లేక ‘ప్రోట్‌ఇవాన్‌జిలియమ్’ కనబడు నేటివిటిని గూర్చిన వర్ణనకూడా ఒక గుహను వర్ణించుచున్నది. అయితే అది బేత్లెహేముకు మధ్యదారిలో ఉంది అని వర్ణించుచున్నది. చరిత్రాత్మకముగా దానికి ఏమాత్రము విలువవున్నా ఆ కథ సూచించుచున్నదేమనగా అప్పటి సంప్రదాయము ఏ ఒక్క స్థానమును సూచించలేదు, మరి నిశ్చయముగా నేటివిటి గుహను సూచించలేదు.”
మూడవ శతాబ్దముయొక్క మతగ్రంథ రచయితలు ఓరిగెన్ మరియు యుసేబియస్ అప్పుడున్న సంప్రదాయమును ఒక ప్రత్యేక స్థలమునకు ముడి పెడుతున్నారు. హామిల్టన్ ఇట్లు తర్కించుచున్నాడు: “ఒక్కసారి ఆ కథ ఒక ప్రత్యేక గుహతో ముడిపడిన తరువాత అది అక్కడనుండి కదులుట సాధ్యము కాదు. మరియు క్రీ.శ. 200 తరువాత పర్యాటకులకు చూపబడిన గుహ ప్రస్తుత నేటివిటి గుహతో సమానమని సురక్షితముగా చెప్పవచ్చును.”
డబ్ల్యు. హెచ్. బర్ట్‌లెట్ తన పుస్తకము బాక్స్ అబౌట్ ది సిటీ అండ్ పిన్‌విరాన్స్ ఆఫ్ జెరూసలెమ్ (1842)లో ఈ గుహనుగూర్చి ఇట్లు వ్రాసెను: “ఈ స్థలములో మన రక్షకునియొక్క జన్మస్థలము అని చెప్పు సంప్రదాయము మర్యాదించదగు పురాతనమైనదైనను, మరియు ప్రక్కనున్న గుహలో జీవించి మరణించిన సెయింట్ జరోమ్ కూడా దానిని ప్రస్తావించినను, ఆ స్థలము సంభావ్యతకు భిన్నముగా నున్నది. పాలస్తీనాలో అప్పుడప్పుడు గుహలు పశువులదొడ్లగా వాడబడినప్పటికి, ఇది ఆ సంకల్పమునకు అనుకూలమైనదానికంటే లోతుగా ఉన్నది మరియు దానికితోడు విశేషమైన సంఘటనలు జరిగిన స్థలములను ఎన్నుకొనునప్పుడు, బహుశ ఆ స్థలము ప్రభావితపూరితమైన దైనందునవలన, గుహలను ఎన్నుకొను సన్యాసుల ప్రవృత్తిని మనము మనస్సునందు ఉంచుకొన్నప్పుడు, ఈ స్థలమునకు విరుద్ధము కలిగిన పురోభావన నిర్ధారణ చెందుతుంది.
మనచేతిలో ఉన్న చారిత్రాత్మిక నిదర్శనములను మరియు ఎక్కువ ప్రాముఖ్యముగా యేసుక్రీస్తు మరియు ఆయన శిష్యులు ఆయన జన్మస్థలమునకు ఎటువంటి ప్రాముఖ్యతను ఇవ్వలేదను లేఖనాధారమైన వాస్తములనుండి మనము ఏ తుది నిర్ణయమునకు రావలెను? గొప్ప కాన్సటంటైన్‌యొక్క తల్లియగు హెలీనా రాణి సా.శ. 326లో నేటివిటి చర్చియొక్క స్థానమును నిర్ణయించినప్పుడు ఆమె హామిల్టన్ చెప్పినట్లు ‘సంప్రదాయముపై’ ఆధారపడిచేసెను. అది చరిత్రాత్మక లేక బైబిలు సంబంధమైన రుజువులపై ఆధారపడి కాదు.
క్రీస్తు పుట్టిన వాస్తవమైన స్థలము తెలియదు అను నిర్ధారణకు ఇది నడుపుచున్నది. కావున విశ్వాసము గలవారు నేటివిటి గుహవంటి స్థలములకు వెళ్లి వాటిని ఆరాధించవలెననునది తర్కనీయముగా ఉందా? అయితే వాస్తవముగా క్రైస్తవులనుండి అది కోరబడినట్లయితే యేసు తానే తన శిష్యులకు అది తనకు ఇష్టమని, అది వారి బాధ్యతయని చెప్పియుండేవాడు కాడా? మానవుల లోకము చదువునట్లు అది బైబిలునందు లిఖితమై యుండేది కాదా? పరిశుద్ధ లేఖనములలో అటువంటి రుజువులేమి లేవు గనుక మనము దేనిని స్మరణచేసికొనుట ప్రాముఖ్యము అని యేసు తలంచెనో అని అడుగుట సరియైయున్నది.
మనమెంత వెదకినను యేసుయొక్క శిష్యులు తరతరములుగా గుర్తుంచుకొనవలసిన ఒకే సంఘటన ఆయనయొక్క బలిమరణము అని కనుగొందుము. వసంతకాలములో తన శిష్యులతో ఆఖరిపస్కా భోజనము జరుపుకొనిన కొద్దిసమయము తరువాతనే ఆయన మరణించెను. ఆ సందర్భములో తన నమ్మకమైన శిష్యులు మాట్జోత్‌వంటి పులియని రొట్టెను మరియు ఎర్రని ద్రాక్షారసమును వాడి ఒక సూచనార్థకమైన భోజనమును చేయవలెనని ఆదేశించెను. సా.శ. 33, ఏప్రిల్ 1న జరిగిన ఈ సరళమైన ఆచరణనుగూర్చి ఆయన ఇట్లు ఆజ్ఞాపించెను: “నన్ను జ్ఞాపకము చేసికొనుటకు దీనిని చేయుడి.”—లూకా 22:19, 20.
యేసునుండి స్వయంగా వచ్చిన ఈ లేఖనానుసారమైన ఆజ్ఞకు విధేయతగా యెహోవా సాక్షులు లోకమంతటా ప్రతిసంవత్సరము యేసుయొక్క బలిమరణ జ్ఞాపకార్థదినమును ఆచరించెదరు. ఈ క్రైస్తవ కూటమును ఒక విశేషమైన స్థలములో యెరూషలేములోని మేడగదిలో చేయరు. ఎందుకనగా యేసు విశేషముగా అట్లు చెప్పలేదు. అయితే లోకమంతటా వారు తమ రాజ్యమందిరములలో లేక మరి యితర అనుకూల స్థలములలో కూడుకొందురు. తరువాయి ఆచరణ ఏప్రిల్ 17, 1992 సూర్యాస్తమయ సమయము తర్వాత జరుగును. మీయింటికి దగ్గరలోవున్న యెహోవా సాక్షుల రాజ్యమందిరములో మీరుకూడా హాజరగుటకు ఆహ్వానింపబడుచున్నారు.
యేసుయొక్క ఆజ్ఞకు విధేయతగా ఈ ఆచరణకు హాజరగుటకు మీరు యెరూషలేము లేక బేత్లెహేమునకు ప్రయాణము చేయవలసిన అవసరము లేదు. యేసుగాని ఆయన శిష్యులుగాని కొన్ని స్థలములు క్రైస్తవ ఆరాధనకొరకు ప్రాముఖ్యమైనవిగా చూపించలేదు. దానికి భిన్నముగా, యెరూషలేమునకు ఉత్తరముగా సమరయలో ఒక పర్వతమైన గెరీజీమునొద్ద తన ఆరాధనను కేంద్రీకరించిన ఒక సమరయ స్త్రీతో ఆయన ఇట్లనెను: “అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను, యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నామాట నమ్ముము. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. అది ఇప్పుడును వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరుచున్నాడు.”—యోహాను 4:21, 23.
తండ్రిని ఆత్మతోను సత్యముతోను ఆరాధించువారు బేత్లెహేమువంటి విశేష స్థలములపై లేక చిత్రములవంటి వస్తువులపై తమ ఆరాధన కొరకు ఆధారపడరు. అపొస్తలుడైన పౌలు ఇట్లనెను: “వెలిచూపువలనకాక విశ్వాసము వలననే నడచుకొనుచున్నాము, గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నాము.”—2 కొరింథీయులు 5:6, 7.
అయితే ఒకడు దేవుడు స్వీకరించే విధముగా ఆయనను ఎట్లు ఆరాధించవలెను అని నీవు ఆలోచించుచుండవచ్చును. మరియొకసారి యెహోవా సాక్షులు మీయింటికి వచ్చినప్పుడు అతని లేక ఆమెను అడుగుము. (w90 12/15)
[22వ పేజీలోని చిత్రాలు]
చలికాలములో బేత్లెహేము దగ్గరి ప్రాంతము మంచుతో కప్పబడగలదు. గొర్రెల కాపరులు తమ గొర్రెలతో బయట పడుకొనగలరా?
[23వ పేజీలోని చిత్రాలు]
బేత్లెహేములోని నేటివిటి చర్చి మరియు దాని భూగర్భ గుహ
[22వ పేజీలోని చిత్రసౌజన్యం]
Pictorial Archive (Near Eastern History) Est.
[క్రెడిట్ లైను]
[23వ పేజీలోని చిత్రసౌజన్యం]
Pictorial Archive (Near Eastern History) Est.
[క్రెడిట్ లైను]
Garo Nalbandian