క్రైస్తవ స్వాతంత్రము నందు స్థిరముగా నిలబడుడి!
గలతీయులనుండి ఉన్నతాంశములు
యెహోవా స్వాతంత్ర్యమునిచ్చు దేవుడు. (2 కొరింథీయులు 3:17) ఆయన కుమారుడైన, యేసుక్రీస్తు ఇలా చెప్పాడు: “మీరు సత్యమును గ్రహించెదరు; అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును.” (యోహాను 8:32) అలాగే క్రీస్తును అనుకరిస్తూ, అపొస్తలుడైన పౌలు స్వాతంత్ర్యమునిచ్చు సువార్తను ప్రకటించాడు.—రోమీయులు 6:18; 8:21.
పౌలు స్వాతంత్ర్యమునిచ్చు ఆవర్తమానమును ప్రకటించుటద్వారా గలతీయలో (ఆసియా మైనరులోని రోమా ప్రాంతము) తన మొదటి మిషనరీ యాత్రయందు సంఘములను స్థాపించెను. (సా.శ. 47-48) గలతీయులు క్రైస్తవులకు సున్నతి అవసరములేదను గవర్నింగ్ బాడి తీర్మానమును ఎరిగియున్నారు. (అ. కార్యములు 15:22-29) కాని క్రైస్తవులై యూదామత సిద్ధాంతములకు హత్తుకొనియుండవలెనని కోరువారు (జూడైజర్స్) సున్నతి పొందవలెననుట ద్వారా వారిని దాసత్వములోనికి తీసుకురావలెనని చూచుచున్నారు. కాబట్టి దాదాపు సా.శ. 50-52లో కొరింథు లేక సిరియా అంతియొకయ నుండి తాను గలతీయులకు వ్రాసిన పత్రికలో పౌలు క్రైస్తవ స్వాతంత్ర్యమును నొక్కితెలుపుచున్నాడు. ఉదాహరణకు ఆయన చెప్పినదేమనగా: “ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి, క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసియున్నాడు. కాబట్టి, మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమను కాడిక్రింద చిక్కుకొనకుడి.”—గలతీయులు 5:1.
పౌలు తన అపొస్తలత్వమును సమర్ధించుకొనుట
పౌలు మొదట తన అపొస్తలత్వము దేవుని వలనను మరియు క్రీస్తువలనను కలిగెనని చూపెను. (1:1–2:14) దర్శనము ప్రకారమే, సున్నతిగూర్చిన ప్రశ్ననుగురించి పౌలు (బర్నబా మరియు తీతుతో) యెరూషలేమునకు వెళ్లెను. అక్కడ యాకోబు, కేఫా (పేతురు) మరియు యోహాను ఆయన అన్యజనులకు అపొస్తలునిగా ఉండుటకు శక్తిపొందియున్నాడని గుర్తించిరి. తరువాత యెరూషలేమునుండి యూదా క్రైస్తవులు రాగానే పేతురు వారికి భయపడి అంతియొకయలోని అన్యులైన విశ్వాసులనుండి వేరైనప్పుడు పౌలు ఆయనను గద్దించెను.
నీతిమంతులుగా తీర్చబడుట ఎట్లు?
అపొస్తలుడు యేసుక్రీస్తునందలి విశ్వాసము మూలముగానే ఎవరైనను నీతిమంతులుగా తీర్చబడుదురను బలమైన అంశమునుకూడా చూపాడు. (2:15–3:29) గలతీయులు ధర్మశాస్త్రసంబంధమైన క్రియల వలన గాక విశ్వాసమందు సువార్తను అంగీకరించుటద్వారానే దేవుని ఆత్మను పొందిరి. అబ్రాహాము యొక్క నిజమైన కుమారులు విశ్వాసమును కలిగియుండిరి, అయితే “ధర్మశాస్త్రసంబంధమైన క్రియలమూలముగా నీతిమంతులుగా తీర్చబడ ప్రయత్నించువారు శాపమునకు లోనైయున్నారు.” ఎందుకు? ఎందుకనగా వారు ధర్మశాస్త్రమును పరిపూర్ణముగా పాటించలేరు. వాస్తవమునకు ధర్మశాస్త్రము పాపములను బయలుపరచి “క్రీస్తుయొద్దకు నడిపించు బాలశిక్షకుడాయెను.”
స్థిరముగా నిలబడుడి
క్రీస్తు తన మరణముద్వారా ‘ధర్మశాస్త్రమునకు లోబడియున్నవారిని విమోచించెను.’ అయితే ఆయన అనుచరులు క్రైస్తవస్వాతంత్ర్యమునందు స్థిరముగా నిలబడవలెను. (4:1–6:18) కాబట్టి దాసత్వమను కాడి క్రిందికి వెళ్లునట్లు తమను ప్రేరేపించు ఎవనినైనను గలతీయులు ఎదిరించవలసియున్నారు. అంతేగాక వారు తమ క్రైస్తవ స్వాతంత్ర్యమును దుర్వినియోగపరచక “శరీరకార్యములను విసర్జించి” దేవుని ఆత్మఫలములను ప్రదర్శించవలెను. ధర్మశాస్త్రపు దాసత్వములోనికి తమను తేగోరువారు “శరీరవిషయమందు చక్కగా అగపడగోరుతు” హింసపొందకుండవలెనని జూచువారైయుండి శరీర విషయమందు అతిశయించగోరుచున్నారు. ఏమైనను, పౌలు సున్నతిపొందుటయందేమియులేదు, పొందకపోవుటయందేమియులేదని చూపెను. అయితే “క్రొత్తసృష్టి పొందుటయే” ముఖ్యమని తెలిపెను. ఆ క్రొత్తసృష్టికి సంబంధించిన ఆత్మీయ ఇశ్రాయేలీయులపై సమాధానము, కృప కలుగునుగాకని ఆయన ప్రార్థించెను.
గలతీయులకు వ్రాసిన పౌలు పత్రిక తమను ఆత్మీయముగా దాసులను చేయగోరువారిని ఎదిరించుటకు వారికి సహాయపడెను. అది మనకును ఆత్మఫలములను ప్రదర్శించుటకు మరియు క్రైస్తవస్వాతంత్ర్యమునందు స్థిరముగా నిలబడుటకు సహాయముచేయునుగాక. (w90 11⁄15)
[30వ పేజీలోని బాక్సు]
ముద్రలు: పౌలు “నేను యేసుయొక్క ముద్రలు నాశరీరమందు ధరించియున్నాను, ఇకమీదట ఎవడును నన్ను శ్రమపెట్టవద్దు” అని వ్రాసెను. (గలతీయులు 6:17) కొంతమంది పురాతన అన్యమత ఆరాధికులలో తాము ఏ యజమాని దాసులో గుర్తించబడులాగున దాసులు ముద్రలు వేయబడెడివారు. వారి శరీరములపై రకారకాల రూపములతో కాల్చబడుట, వ్రాయబడుట జరిగేది. నిస్సందేహముగా తనయొక్క క్రైస్తవ సేవనిమిత్తమై పౌలు శరీరముపైన కొట్టబడిన భౌతిక గాయములు ఆయన శరీరముపై మచ్చలను కలుగజేసినవి. నిస్సందేహముగా, ఇవి ఆయన క్రీస్తుకు సంబంధించిన నమ్మకమైన సేవకుడనుటకును, ఆయన నిమిత్తమై శ్రమపొందెననుటకును రుజువులైయున్నవి. (2 కొరింథీయులు 11:23-27) పౌలు చెప్పిన ఈ “ముద్రలు” అవియే అయ్యుండవచ్చును. లేక తనపరిచర్యను జరిగించుచు, దేవుని ఆత్మఫలమును ప్రదర్శించుచు గడిపిన క్రైస్తవజీవితమును గూర్చి ఆయన తలంచుచుండవచ్చును.
[చిత్రం]
రోమను సైనికులు తమ యజమానులను సేవించునట్లు బలవంతపెట్టబడిరి, అయితే పౌలు మాత్రము యిష్టపూర్వకంగాను, మరియు ఆనందముతోను యేసు క్రీస్తుకు దాసుడైయున్నాడు