కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w91 6/1 పేజీలు 10-15
  • పై అధికారుల విషయములో క్రైస్తవుల దృష్టి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పై అధికారుల విషయములో క్రైస్తవుల దృష్టి
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • పై అధికారులను గుర్తించుట
  • “పరిమితమైన స్థానములందు దేవునిద్వారా నియమింపబడెను“
  • “ఈ యుగ సంబంధమైన దేవత”
  • మంచి మనస్సుగల అధికారములు
  • అధికారాన్ని గూర్చి క్రైస్తవ దృక్పథము
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • మీరు ఎవరి అధికారాన్ని గుర్తించాలి?
    నిత్యజీవానికి నడిపించే జ్ఞానము
  • దేవుడు, కైసరు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • అధికారం పట్ల గౌరవం ఉండడం—ఎందుకంత ప్రాముఖ్యం?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
w91 6/1 పేజీలు 10-15

పై అధికారుల విషయములో క్రైస్తవుల దృష్టి

“ప్రతివాడును పై అధికారులకు లోబడియుండవలెను; ఏలయనగా దేవునివలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు; ఉన్న అధికారములు పరిమితమైన స్థానములందు దేవునిద్వారా నియమింపబడి యున్నవి.”—రోమీయులు 13:1 NW.

1, 2. (ఎ) పౌలు రోమాలో ఖైదిగా ఎందుకు యుండెను? (బి) పౌలు కైసరుకు వినతిచేయుట ఏ ప్రశ్నలను ఉత్పన్నము చేసినది?

దాదాపు సా.శ. 56లో అపొస్తలుడైన పౌలు పైనున్న మాటలను రోమీయులకు వ్రాసెను. కొన్ని సంవత్సరముల తర్వాత ఆయన తానుగా రోమాలో ఖైధీగాయుండెను. ఎందుకు? యెరూషలేములో ఒక గుంపు ప్రజలు ఆయన మీద దాడిచేయగా రోమా సైనికులు ఆయనను కాపాడిరి. కైసరయకు తీసుకు వెళ్లబడినప్పుడు, ఆయన అబద్ధ ఆరోపణలను ఎదుర్కొనెను, అయితే రోమా రాజపరిపాలకుడైన ఫేలిక్సు సమక్షములో ఆయన తన పక్షముగా వాదించుకోగలిగెను. ఫేలిక్సు లంచము ఆశించి, ఆయనను రెండు సంవత్సరములు అట్లే చెరసాలలో యుంచెను. చివరకు, పౌలు మరొక రాజపరిపాలకునిగా ఫేస్తు వచ్చినప్పుడు, తన విషయము కైసరు వినవలెనని అడిగెను.—అపొ.కార్యములు 21:27-32; 24:1–25:12.

2 రోమా పౌరునిగా ఇది ఆయన హక్కుయైయుండెను. అయితే యేసు సాతానును “ఈ లోకాధికారియని” సూచించియుండగా, ఆలాగే పౌలు తానుగా సాతానును “యుగసంబంధమైన దేవత” అని పిలిచియుండగా పౌలు ఇలా ఒక సామ్రాజ్యాధికారమునకు వినతిచేయుట పొందికగాయున్నదా? (యోహాను 14:30; 2 కొరింథీయులు 4:4) లేక తన హక్కుల పరిరక్షణ కొరకు ఆ అధికారమువైపు పౌలు చూచుటను సరియైనది చేయు ‘పరిమితమైన స్థానమును’ రోమా అధికారము కలిగియున్నదా? “మనుష్యులకు కాదు మేము పరిపాలకునిగా దేవునికే లోబడవలెనని” అపొస్తలులు అంతకుముందు చెప్పిన మాటలు, దేవునికి అవిధేయతచూపు పరిస్థితి లేనప్పుడు క్రైస్తవులు మానవ పరిపాలకులకు లోబడుటను అనుమతించుచున్నవా?—అపొ.కార్యములు 5:29 NW.

3. ఎటువంటి పరిపక్వతగల దృష్టిని పౌలు బయల్పరచెను, మరియు మనస్సాక్షి ఇందు ఎలా చేరియున్నది?

3 రోమీయులకు వ్రాసిన పత్రికలో ఈ ప్రశ్నలకు జవాబిచ్చుటకు పౌలు మనకు సహాయము చేయుచున్నాడు, దానియందు ఆయన మానవ పరిపాలన విషయములో పరిపక్వమైన దృష్టిని వెల్లడిచేయుచున్నాడు. “పై అధికారులకు” పరిమితమైన విధేయతతో, సర్వోన్నత అధికారియగు యెహోవా దేవునికి సంపూర్ణ విధేయతను సమతూకము చేయుటలో క్రైస్తవ మనస్సాక్షి వహించవలసిన పాత్రను పౌలు రోమీయులు 13:1-7 లో స్పష్టము చేయుచున్నాడు.

పై అధికారులను గుర్తించుట

4. 1962లో అభిప్రాయమందు ఎటువంటి సవరణ చేయబడెను, ఏ ప్రశ్నలు ఉత్పన్నమయినవి?

4 కొన్ని సంవత్సరములు, 1962 వరకు, యెహోవా సాక్షులు పైఅధికారులంటే యెహోవా దేవుడు మరియు యేసుక్రీస్తు అని అనుకొనిరి. అయితే, సామెతలు 4:18 ప్రకారము, వెలుగు ప్రకాశవంతమై ఈ అభిప్రాయము సవరింపబడినది, ఇది కొందరి మనస్సులలో ప్రశ్నలను ఉత్పన్నము చేయవచ్చును. ఈ అధికారులు ప్రపంచములో లౌకిక, రాజకీయ అధికారమును ఉపయోగించు రాజులు, రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు, నగరపాలకులు, న్యాయాధీశులు మరియు ఇతరులని, అందువలన వారికి పరిమితమైన విధేయతను మనము చూపవలెనని చెప్పుటలో మనమిప్పుడు సరిగా ఉన్నామా?

5. రోమీయులు 13:1 లోని సందర్భము పైఅధికారులను గుర్తించుటకు ఏ రీతిగా సహాయము చేయును, మరియు ఈ గుర్తింపును వివిధ బైబిలు భాషాంతరములు ఎట్లు బలపరచుచున్నవి?

5 సా.శ. రెండవ శతాబ్ద రచయితయైన ఐరేనియస్‌, తన కాలమందలి కొందరి ప్రకారము, రోమీయులు 13:1 లో పౌలు, “అదృశ్య పరిపాలకుల [లేక] దూతల అధికారములకు సంబంధించి” మాట్లాడుచుండెనని చెప్పెను. ఐరేనియస్‌ తానుగా పైఅధికారులను “నిజమైన మానవ అధికారులుగా” దృష్టించెను. పౌలు మాటల సందర్భము ఐరేనియస్‌ సరియని చూపించుచున్నది. రోమీయులు 12వ అధ్యాయములోని ముగింపు వచనములందు, పౌలు క్రైస్తవులు ‘శత్రువులతో’ సహితము ప్రేమతో శ్రద్ధతో వ్యవహరించుచు, “మనుష్యులందరి” ఎదుట తామెట్లు ప్రవర్తింపవలెనో వివరించుచున్నాడు. (రోమీయులు 12:17-21) “మనుష్యులందరు” అనుమాట స్పష్టముగా క్రైస్తవ సంఘమునకు వెలుపల గలవారికిని అన్వయించును. కాబట్టి పౌలు ఆ తర్వాత ఇంకను చర్చించుచుండిన, “పైఅధికారులు” కూడ క్రైస్తవ సంఘమునకు వెలుపలగలవారై యుండవలెను. దీనికి అణుగుణ్యముగా రోమీయులు 13:1 నందలి ఈ భాగమును వివిధ భాషాంతరములు ఎట్లు అనువదించుచున్నవో గమనించుము: “ప్రతివాడును రాష్ట్ర అధికారులకు లోబడవలెను” (టుడేస్‌ ఇంగ్లీష్‌ వర్షన్‌); “ప్రతివాడును తానుగా పరిపాలనా అధికారులకు లోబడవలెను” (న్యూ ఇంటర్నేషనల్‌ వర్షన్‌); “ప్రతివానికి పౌర అధికారులకు లోబడవలసిన బాధ్యతగలదు.”—ఫిలిప్స్‌ న్యూ టెస్ట్‌మెంట్‌ ఇన్‌ మోడర్న్‌ ఇంగ్లీష్‌.

6. పన్ను మరియు సుంకము చెల్లించుటనుగూర్చి పౌలు చెప్పిన మాటలు పైఅధికారులు తప్పక లోక అధికారులని ఎట్లు చూపించుచున్నవి?

6 ఈ అధికారులు పన్ను లేక సుంకము అడుగుదురని పౌలు ఇంకను తెలియజేయుచున్నాడు. (రోమీయులు 13:6, 7) క్రైస్తవ సంఘము పన్ను లేక సుంకము అడుగదు; ఆలాగే యెహోవా లేక యేసు లేక ఏ యితర “అదృశ్య పరిపాలకులు” అట్లు అడుగరు. (2 కొరింథీయులు 9:7) పన్నులు కేవలము లోక అధికారులకు మాత్రమే చెల్లింపబడును. దీనితో అంగీకరించుచు, “పన్ను” మరియు “సుంకము” అని రోమీయులు 13:7 లో పౌలు ఉపయోగించిన గ్రీకు పదములు ప్రత్యేకముగా ప్రభుత్వమునకు చెల్లించు మూల్యమును సూచించుచున్నవి.a

7, 8. (ఎ) క్రైస్తవులు ఈ లోక రాజకీయ అధికారులకు లోబడివుండవలెనను తలంపుతో వివిధ లేఖనములు ఎట్లు పొందికను కలిగియున్నవి? (బి) ఎప్పుడు మాత్రమే క్రైస్తవుడు “అధికారము” యొక్క ఆజ్ఞలను పాటించడు?

7 ఇంకను పైఅధికారులకు లోబడియుండుడని పౌలు చేసిన విన్నపము “కైసరువి కైసరునకు” తిరిగి చెల్లించుడని యేసు యిచ్చిన ఆజ్ఞకు అనుగుణ్యముగా యున్నది, ఇక్కడ “కైసరు” లౌకిక అధికారమునకు ప్రాతినిధ్యమైయున్నాడు. (మత్తయి 22:21) అంతేకాకుండ, పౌలు ఆ తర్వాత తీతుకు వ్రాసిన మాటలతోకూడ ఇది అంగీకరించుచున్నది. “ప్రభుత్వములకును పరిపాలకులుగాయున్న అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలెనని, . . . వారికి జ్ఞాపకము చేయుము.” (తీతు 3:1 NW) కాబట్టి, క్రైస్తవులు సామాజిక సేవలందు భాగము వహించవలెనని ప్రభుత్వములు ఆజ్ఞాపించినప్పుడు, ఆ పనులు ఏదో లేఖనరహిత సేవకొరకు ప్రత్యామ్నాయముగా రాజీపడుటకు, లేక యెషయా 2:4 లో కనుగొనబడు లేఖన సూత్రముల వంటివాటిని ఉల్లంఘించుటకు కారణము కానంతకాలము వారు సరియైన రీతిలో ఆ ఆజ్ఞలను పాటింతురు.

8 ఈ లోక లౌకిక అధికారులకు మనము లోబడవలెనని పేతురుకూడ స్థిరముగా చెప్పుచున్నాడు. ఆయనిట్లనెను: “మనుష్యులు నియమించు ప్రతి కట్టడకును ప్రభువు నిమిత్తమై లోబడియుండుడి. రాజు అందరికిని అధిపతియనియు, నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజువలన పంపబడినవారనియు వారికి లోబడియుండుడి.” (1 పేతురు 2:13, 14) దీనికి అనుగుణ్యముగా, పౌలు తిమోతికి ఇచ్చిన ఉపదేశమును కూడ క్రైస్తవులు లక్ష్యపెట్టుదురు: “మనము సంపూర్ణభక్తియు మాన్యతయు కలిగి, నెమ్మదిగాను సుఖముగాను బ్రదుకు నిమిత్తము, అన్నింటికంటె ముఖ్యముగా మనుష్యులందరికొరకును రాజులకొరకును ఉన్నతస్థానమందున్న వారందరికొరకును విజ్ఞాపనములును ప్రార్థనలును యాచనలును కృతజ్ఞతాస్తుతులును చేయవలెనని హెచ్చరించుచున్నాను.”b—1 తిమోతి 2:1, 2 NW.

9. మానవ అధికారులను “పైఅధికారులని” సూచించుట ఎందుకు యెహోవాయొక్క మహిమనుండి దూరము చేయదు?

9 లోక అధికారులను “పైఅధికారులని” పిలుచుటలో, యెహోవాకు ఇవ్వవలసిన ఘనతనుండి మనము ఏదోఒకవిధముగా దూరమగుదుమా? లేదు, ఎందుకనగా యెహోవా కేవలము పైనున్న దానికంటే ఎంతో ఉన్నతుడు. ఆయన “సార్వభౌమాధిపతి,” “సర్వోన్నతుడు.” (కీర్తన 73:28 NW; దానియేలు 7:18, 22, 25, 27 NW; ప్రకటన 4:11; 6:10) మానవ అధికారులకు లోబడియుండుట ఏ విధముగాను సర్వోన్నత అధికారి, సార్వభౌమాధిపతియగు యెహోవా ఆరాధననుండి మనలను దూరముచేయదు. అట్లయిన, ఎంతమేరకు ఈ అధికారులు పైనున్న వారైయున్నారు? కేవలము ఇతర మనుష్యుల సంబంధముగా మరియు వారి అధికారకార్యముల పరిధిలోనే వారు పైనున్న వారు. మానవ సమాజములను కాపాడుట మరియు వారిని పాలించుట వారి బాధ్యతయైయున్నది, అందుకే వారు ప్రజా వ్యవహారముల విషయమై నియమనిబంధనలను జారి చేయుదురు.

“పరిమితమైన స్థానములందు దేవునిద్వారా నియమింపబడెను“

10. (ఎ) పైఅధికారులను వారి ‘స్థానములో నియమించుటను’ గూర్చి పౌలుచెప్పిన మాట యెహోవా స్వంత అధికారమునుగూర్చి ఏమి నిరూపించుచున్నది? (బి) కొంతమంది పరిపాలకులు వారి ‘స్థానములో’ ఉండుట సంబంధముగా యెహోవా ఏమి అనుమతించెను, ఆ విధముగా ఆయన సేవకులు ఎట్లు పరీక్షింపబడిరి?

10 ఈ అధికారులు “పరిమితమైన స్థానములందు దేవునిద్వారా నియమింపబడెనని” చెప్పబడినప్పుడు లౌకిక అధికారముల మీద సహితము యెహోవా దేవుని సర్వోన్నతత్వమును మనము చూడవచ్చును. అయితే, ఈ మాట ఒక ప్రశ్నను లేవదీయును. ఈ మాటలను పౌలు వ్రాసిన కొన్ని సంవత్సరముల తర్వాత రోమా చక్రవర్తియగు నీరో క్రైస్తవులపై పెద్దఎత్తున కౄరమైన హింసను తీసుకువచ్చెను. దేవుడు వ్యక్తిగతముగా నీరోను అతని స్థానమందుంచెనా? కానేకాదు! ప్రతి పరిపాలకుడు దేవునిచే ఎంపిక చేయబడి ‘దేవుని కృపవలన’ అతని స్థానములో ఉంచబడునని కాదు. బదులుగా, సాతాను కొన్నిసార్లు నిర్దయులైన మానవులను పరిపాలకుల స్థానములోనికి వచ్చునట్లు చేయును, కాగా అటువంటి పరిపాలకులు యథార్థపరులైన తన సేవకులపై తీసుకువచ్చు పరీక్షలతోపాటు దీనిని యెహోవా అనుమతించును.—యోబు 2:2-10 పోల్చుము.

11, 12. లౌకిక అధికారములు వాటి స్థానమునకు వచ్చుట లేక తొలగిపోవుట విషయములో యెహోవా పనిచేసిన ఏ సంఘటనలు వ్రాయబడియున్నవి?

11 ఏమైనను, తన ఉన్నత సంకల్పములను నెరవేర్చుటకుగాను యెహోవా కొంతమంది పరిపాలకులు లేక ప్రభుత్వముల విషయములో వ్యక్తిగతముగా చొరవ తీసుకొనెను. ఉదాహరణకు, అబ్రాహాము కాలములో కనానీయులను కనాను దేశములోనే నిలిచియుండునట్లు అనుమతించెను. కాని ఆ తర్వాత, యెహోవా వారిని అక్కడ లేకుండచేసి ఆ దేశమును అబ్రాహాము సంతతికి ఇచ్చెను. ఇశ్రాయేలీయులు అరణ్యమందు ప్రయాణించిన కాలములో అమ్మోనీయులను, మోయాబీయులను, శేయీరు మన్యప్రాంతమును కొల్లగొట్టుటకు యెహోవా వారిని అనుమతింపలేదు. అయితే సీహోను, ఓగు రాజ్యములను నాశనము చేయవలెనని ఆయన వారిని ఆజ్ఞాపించెను.—ఆదికాండము 15:18-21; 24:37; నిర్గమకాండము 34:11; ద్వితీయోపదేశకాండము 2:4, 5, 9, 19, 24; 3:1, 2.

12 ఇశ్రాయేలీయులు కనానులో స్థిరనివాస మేర్పరచుకొనిన పిదప, తన ప్రజలపై ప్రభావముచూపు అధికారములపై సూటిగా యెహోవా ఎడతెగక శ్రద్ధచూపెను. కొన్నిసార్లు, ఇశ్రాయేలీయులు పాపము చేసినప్పుడు, వారు అన్య అధికారము క్రిందికి వచ్చునట్లు యెహోవా అనుమతించెను. వారు పశ్చాత్తాపము చూపినప్పుడు, ఆ అధికారమును ఆయన వారి దేశమునుండి తొలగించెను. (న్యాయాధిపతులు 2:11-23) చివరకు, ఇతర అనేక జనాంగములతోపాటు, యూదాను బబులోను ఆధిపత్యము క్రిందికి వచ్చునట్లు చేసెను. (యెషయా 14:28–19:17; 23:1-12; 39:5-7) ఇశ్రాయేలీయులు బబులోను చెరకువెళ్లిన తర్వాత, బబులోను కాలమునుండి మనకాలము వరకు తన ప్రజలపై ప్రభావము చూపు వివిధ ప్రపంచ ఆధిపత్యములు అధికారమునకు వచ్చిపోవుటనుగూర్చి యెహోవా ముందుగానే తెలియజేసెను.—దానియేలు 2, 7, 8, మరియు 11 అధ్యాయములు.

13. (ఎ) మోషే కీర్తన ప్రకారము, యెహోవా ప్రజలకెందుకు వారి సరిహద్దులను శాసించెను? (బి) ఆ తర్వాత దేవుడెందుకు ఇశ్రాయేలీయులను తమదేశమునకు పునరుద్ధరించెను?

13 మోషే యెహోవానుగూర్చి ఇలా కీర్తనపాడెను: “మహోన్నతుడు జనములకు వారి స్వాస్థ్యములను విభాగించినప్పుడు, నరజాతులను ప్రత్యేకించినప్పుడు, ఇశ్రాయేలీయుల లెక్కనుబట్టి ప్రజలకు సరిహద్దులను నియమించెను. యెహోవా వంతు ఆయన జనమే; ఆయన స్వాస్థ్యభాగము యాకోబే.” (ద్వితీయోపదేశకాండము 32:8, 9; అపొ.కార్యములు 17:26 పోల్చుము.) అవును, తన సంకల్పములను నెరవేర్చుటకు, ఏ అధికారము నిలిచియుండును, ఏది నాశనము చేయబడునో దేవుడు శాసించెను. ఈ విధముగా, ఆయన అబ్రాహాము సంతానమునకు స్వాస్థ్యముగా కొంత దేశమును కేటాయించి, ప్రవచింపబడినట్లుగానే, చివరకు అక్కడనుండే వాగ్దాన సంతానము వచ్చునట్లు, ఆ తరువాత కాలములో వారు ఆ దేశమును స్వతంత్రించుకొనునట్లు చేసెను.—దానియేలు 9:25, 26; మీకా 5:2.

14. అధిక భాగము, ఏ భావమందు యెహోవా మానవ అధికారములను పరిమితమైన స్థానములందుంచెను?

14 అయితే, అనేక సందర్భములలో పరిపాలకులు ఒకరికొకరు పరిమితమైన అధికారముల స్థానములలో, అయితే అన్ని సమయములలో తనకంటే తక్కువ స్థానములో ఉండునట్లు ఆయన మానవులను నియమించెను. ఆ విధముగా, యేసు పొంతి పిలాతు ఎదుట నిలబడినప్పుడు, ఆ పరిపాలకునితో ఇట్లుచెప్పెను: “పైనుండి నీకు ఇయ్యబడియుంటేనే తప్ప నామీద నీకు ఏ అధికారమును ఉండదు.” (యోహాను 19:11) అంటే, దేవుడు వ్యక్తిగతముగా పిలాతును ఆ స్థానమందుంచెనని కాదుగాని, యేసుమీద జీవ-మరణముల అధికారము అతనికి కేవలము దేవుని అనుమతితోనే లభించునని దాని భావమైయుండెను.

“ఈ యుగ సంబంధమైన దేవత”

15. ఏ విధముగా సాతాను ఈ లోకములో అధికారము చేయుచున్నాడు?

15 అయితే సాతాను ఈ ప్రపంచ దేవత, లేక పరిపాలకుడని బైబిలు చెప్పిన మాట విషయమేమి? (యోహాను 12:31; 2 కొరింథీయులు 4:4) సాతాను యేసుకు లోక రాజ్యములన్నింటిని చూపించి, “ఈ అధికారమంతయు, . . . నాకప్పగింపబడియున్నది, అదెవనికి నేను ఇయ్యగోరుదునో వానికిత్తునని” చెప్పినప్పుడు అది నిజముగా అతడు డంబముగా చెప్పిన సంగతియైయున్నది. (లూకా 4:6) అలా సాతాను డంబముగా చెప్పుటను యేసు విభేధించలేదు. ఆలాగే సాతాను మాటలు ఎఫెసీయులకు పౌలు వ్రాసిన మాటలతో పొందికను కలిగియున్నవి: “మనము పోరాడునది శరీరులతో కాదు, గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకారసంబంధులకు లోకనాథులతోను, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము.” (ఎఫెసీయులు 6:12) అంతేకాకుండ, ప్రకటన గ్రంథము సాతానును, “తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారమును” లోక రాజకీయ విధానమునకు చిహ్నమైన ఒక కౄరమృగమునకు ఇచ్చిన మహా ఘటసర్పముగా వర్ణించుచున్నది.—ప్రకటన 13:2.

16. (ఎ) సాతాను అధికారము పరిమితమని ఎట్లు చూడగలము? (బి) మానవజాతియందు అధికారము కలిగియుండుటకు యెహోవా ఎందుకు సాతానును అనుమతించుచున్నాడు?

16 “ఈ అధికారమంతయు . . . నాకు అప్పగింపబడియున్నది” అని సాతాను యేసుతో పలికిన మాటలను గమనింపుము, అతనుకూడ కేవలము అనుమతితోనే తన అధికారమును చెలాయించుచున్నాడని అవి చూపుచున్నవి. దేవుడెందుకు తన అనుమతినిచ్చుచున్నాడు? పూర్వము ఏదెనులో దేవుడు అబద్ధమాడుచున్నాడని అన్యాయముగా తన సార్వభౌమాధికారమును ఉపయోగించుచున్నాడని సాతాను బహిరంగముగా ఆరోపించినప్పుడు లోక పరిపాలకునిగా అతని అధికారము మొదలాయెను. (ఆదికాండము 3:1-6) ఆదాము హవ్వలు సాతానుననుసరించి యెహోవాకు అవిధేయులైరి. ఆ సమయములో యెహోవా పరిపూర్ణ న్యాయముతో సాతానును అతని ఇద్దరు క్రొత్త అనుచరులను హతమార్చియుండగలిగేవాడే. (ఆదికాండము 2:16, 17) అయితే సాతాను మాటలు నిజముగా యెహోవాకు వ్యక్తిగత సవాలుగా యుండెను. కాబట్టి దేవుడు తన జ్ఞానమందు సాతానును కొంతకాలము జీవించుటకు, ఆదాము హవ్వలను తాము చనిపోకముందు పిల్లలను కనుటకును అనుమతించెను. ఈ విధముగా సాతాను విసిరిన సవాలుయొక్క అబద్ధము ప్రదర్శింపబడుటకు దేవుడు సమయమును అవకాశమును దయచేసెను.—ఆదికాండము 3:15-19.

17, 18. (ఎ)సాతాను ఈ లోకమునకు దేవతయని మనమెందుకు చెప్పగలము? (బి) ఏ విధముగా ఈ లోకములో “దేవునివలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు”?

17 ఏదెను కాలమునుండి ఇప్పటివరకు జరిగిన సంఘటనలు సాతాను ఆరోపణలు అబద్ధమని చూపించినవి. ఆదాము సంతానము అటు సాతాను పరిపాలనక్రిందగాని, ఇటు మానవ పరిపాలనక్రింద గాని సంతోషమును కనుగొనలేదు. (ప్రసంగి 8:9) మరోవైపున, తన ప్రజలతో దేవుడు నెరపిన వ్యవహారములు దైవిక పరిపాలనయొక్క ఉన్నతత్వమును ప్రదర్శించినవి. (యెషయా 33:22) అయితే ఆదాము సంతానములో అనేకులు దేవుని సార్వభౌమాధిపత్యమును అంగీకరించనందున, తెలిసో తెలియకో వారు సాతానును తమ దేవునిగా సేవించుచున్నారు.—కీర్తన 14:1; 1 యోహాను 5:19.

18 త్వరలోనే ఏదెనులో లేవదీయబడిన వివాదాంశము పరిష్కరింపబడును. దేవుని రాజ్యము మానవ వ్యవహారముల పరిపాలనా బాధ్యతను పూర్తిగా చేపట్టును, మరియు సాతాను బంధింపబడును. (యెషయా 11:1-5; ప్రకటన 20:1-6) ఈలోగా, క్రమబద్ధముచేయబడిన జీవితము సాధ్యపడులాగున మానవజాతియందు ఒకవిధమైన ఏర్పాటు లేక నిర్మాణము అవసరము. యెహోవా “సమాధానమునకే కర్తగాని అల్లరికి కర్తకాడు.” (1 కొరింథీయులు 14:33) కాబట్టి, ఏదెను వెలుపల వృద్ధియైన సమాజములలో అధికారిక నిర్మాణములు ఉనికిలోనికి వచ్చేందుకు ఆయన అనుమతించెను, మరియు ఈ ఏర్పాటునందు మానవులు అధికారమును ఉపయోగించుటకు అనుమతించెను. ఈ విధముగా “దేవునివలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు.”

మంచి మనస్సుగల అధికారములు

19. ప్రతి పరిపాలకుడు సూటిగా సాతాను ఆధిపత్యము క్రింద ఉన్నాడా?

19 ఏదెను కాలమునుండి సాతాను మానవజాతిలో విస్తారమైన స్వాతంత్ర్యము ఉండునట్లు చేసెను, మరియు అతడు యేసుతో తాను డంబముగా పలికిన మాటల ప్రకారము, భూమిపై సంఘటనలు జరుగునట్లు పనిచేయుటకు ఈ స్వాతంత్ర్యమును ఉపయోగించెను. (యోబు 1:7; మత్తయి 4:1-10) అయితే, ఈ లోకములోని ప్రతి పరిపాలకుడు సూటిగా సాతాను ఆధిపత్యమునకు లోబడియున్నాడని దీని భావము కాదు. కొందరు—మొదటి శతాబ్దమందలి నీరో, మనకాలమందలి హిట్లరు—నిజముగా సాతానువంటి పైశాచిక ఆత్మను కనబరచిరి. అయితే ఇతరులు అలాచేయలేదు. కుప్రకు చెందిన అధిపతియగు సెర్గి పౌలు, “వివేకముగలవాడైయుండి, . . . దేవుని వాక్యము వినగోరెను.” (అపొ.కార్యములు 13:7) అకయకు చెందిన అధిపతియగు గల్లియో, పౌలుమీద ఆరోపణలు చేయవచ్చిన యూదుల వత్తిడికి లొంగలేదు. (అపొ.కార్యములు 18:12-17) ఇంకా అనేక ఇతర పరిపాలకులు గౌరవపూర్వకముగా మనస్సాక్షిపూర్వకముగా తమ అధికారమును ఉపయోగించిరి.—రోమీయులు 2:15 పోల్చుము.

20, 21. మానవ పరిపాలకులు అన్ని సమయములలో సాతాను ఇష్టము నెరవేర్చరని 20వ శతాబ్దమందలి ఏ సంఘటనలు ప్రదర్శించినవి?

20 1914లో ఆరంభమగు “ప్రభువు దిన” కాలములో, సాతాను సంకల్పములను అడ్డగించునట్లు యెహోవా మానవ అధికారములను సహితము యుక్తిగా ఉపయోగించునని, ప్రకటన గ్రంథము ముందే తెలియజేసినది. అభిషక్తులైన క్రైస్తవులమీదకు సాతాను ప్రవాహమువలె తీసుకొనివచ్చు హింసను, “భూమి” మ్రింగివేయునని ప్రకటన వర్ణించుచున్నది. (ప్రకటన 1:10; 12:16) “భూమి” యందలి మౌలికపదార్థములే, అనగా ఇప్పుడు భూమిపై ఉనికియందున్న మానవ సమాజము, సాతానుయొక్క హింసనుండి యెహోవా ప్రజలను కాపాడును.

21 ఇది నిజముగా సంభవించెనా? అవును. ఉదాహరణకు 1930 మరియు 1940 దశాబ్దకాలములో, మూకుమ్మడి దాడులకు గురియగుచు, తరచుగా అన్యాయముగా బంధింపబడుచు అమెరికా సంయుక్త రాష్ట్రములలో యెహోవా సాక్షులు గొప్ప వత్తిడిక్రింద యుండిరి. వారి పని చట్టబద్ధమని గుర్తించుచు అమెరికా సంయుక్త రాష్ట్రముల సర్వోన్నత న్యాయస్థానము అనేక తీర్మానములు చేసినప్పుడు వారికి విడుదల లభించెను. ఇతర ప్రాంతములలోకూడ, అధికారులు దేవుని ప్రజలకు సహాయము చేయుటకు ముందుకువచ్చిరి. దాదాపు 40 సంవత్సరముల క్రితము ఐర్లండులో, కార్క్‌ పట్టణములో ఇద్దరు సాక్షులమీద రోమను కాథోలిక్కు గుంపు ఒకటి దాడిచేయగా, స్థానిక పోలీసు ఒకరు ఆ సాక్షులకు సహాయముచేసి, దోషులను కోర్టు శిక్షించునట్లు చేసెను. కేవలము అటు పోయిన సంవత్సరము ఫిజిలో యెహోవాసాక్షుల కార్యకలాపములను నిషేధించవలెనను ప్రతిపాదన ఒక ఉన్నతాధికారుల సమావేశములో ప్రస్తావనకు రాగా, అందులో ఒక అధికారి సాక్షుల తరఫున ధైర్యముగా మాటలాడెను, కాగా ఆ ప్రతిపాదన బలములేనిదై వీగిపోయెను.

22. తర్వాతి శీర్షికలో ఏ ప్రశ్నలు చర్చించబడును?

22 లేదు, లోక అధికారములు అన్ని సమయములలో సాతాను కార్యములను చేయవు. సాతానుకు లోబడకుండానే క్రైస్తవులు లోక అధికారములకు లోబడగలరు. నిజానికి, ఈ అధికారములు ఉనికిలో ఉండుటకు దేవుడు అనుమతించునంత కాలము వారు ఈ అధికారములకు లోబడుదురు. అయితే అటువంటి విధేయత అనగా దాని భావమేమి? పైఅధికారులనుండి తిరిగి క్రైస్తవులు ఏమి ఎదురుచూడవచ్చును? ఈ ప్రశ్నలు తర్వాతి శీర్షికలో చర్చించబడును. (w90 11/1)

[అధస్సూచీలు]

a ఉదాహరణకు, లూకా 20:22 లో “పన్ను” (ఫోరొస్‌) అను పదము ఉపయోగింపబడుటను చూడుము. ఆలాగే ఇక్కడ “సుంకము” అని తర్జుమా చేయబడిన గ్రీకు పదమగు టెలోస్‌ ను కూడ చూడుము, ఇది మత్తయి 17:25 లో “విధులు” అని తర్జుమా చేయబడెను.

b “ఉన్నతస్థానమందున్నవారు” అని తర్జుమా చేయబడిన గ్రీకు నామవాచకమగు, హైపరొకె, క్రియా పదమగు హైపరెకొ కు సంబంధమును కలిగియున్నది. “పైఅధికారులు” అను పదమందలి “పై” ఈ గ్రీకు క్రియా పదమునుండి వచ్చినదే, ఇది పైఅధికారులు లౌకిక అధికారులనుటకు రుజువును మరింత ఇనుమడింపజేయుచున్నది. ది న్యూ ఇంగ్లీషు బైబిలు రోమీయులు 13:1 ను “ప్రతివ్యక్తి తప్పక సర్వోన్నత అధికారులకు లోబడియుండవలెను” అని తర్జుమా చేయుట సరికాదు. ఇతర మానవులకంటె పైన ఉన్నను, “ఉన్నతస్థానమందున్న” మానవులు సర్వోన్నతులు కారు.

మీరెట్లు సమాధానమిత్తురు?

◻ పైఅధికారులు ఎవరు?

◻ “దేవునివలన తప్ప మరి ఏ అధికారమును లేదు” అని మనమెట్లు చెప్పగలము?

◻ లోకము సాతాను అధికారము క్రింద ఉండుటకు యెహోవా ఎందుకు అనుమతించుచున్నాడు?

◻ ఏ విధముగా దేవుడు మానవ అధికారములను “పరిమితమైన స్థానములయందు” నియమించుచున్నాడు?

[13వ పేజీలోని చిత్రాలు]

రోమా తగులబడిన తర్వాత, నీరో నిజముగా సాతానువంటి పైశాచిక ఆత్మను ప్రదర్శించెను

[15వ పేజీలోని చిత్రాలు]

కుప్రకు చెందిన సెర్గి పౌలు దేవుని వాక్యము వినగోరెను

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి