రాజ్యమును మరియు దేవుని నీతిని వెదకుడి
“కాబట్టి, మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును.”—మత్తయి 6:33.
1, 2. స్వతహాగా మంచివైన క్రియలను పరిసయ్యులు ఎటువంటి క్రియలుగా మార్చివేసిరి, మరియు యేసు తన అనుచరులకు ఎటువంటి హెచ్చరికనిచ్చెను?
శాస్త్రులు, పరిసయ్యులు దేవుని పద్ధతిలో కాక, తమ స్వంత పద్ధతిలో నీతిని వెదకిరి. అంతేకాదు, స్వతహాగా మంచివైన క్రియలను చేయునప్పుడు, మనుష్యులు చూసేవిధముగా చేయుచు వారు వాటిని వేషధారణతో కూడిన క్రియలుగా మార్చివేసిరి. వారు దేవుని కాదుగాని, తమ స్వంత నిష్ఫలతను సేవించుచుండిరి. అటువంటి కపటనాటకములకు వ్యతిరేకముగా యేసు తన శిష్యులను హెచ్చరించెను: “మనుష్యులకు కనబడవలెనని వారియెదుట మీనీతి కార్యము చేయకుండా జాగ్రత్తపడుడి; లేనియెడల పరలోకమందున్న మీ తండ్రియొద్ద మీరు ఫలము పొందరు.”—మత్తయి 6:1.
2 బీదలకిచ్చు వారిని యెహోవా మెచ్చుకొనును—అయితే పరిసయ్యులిచ్చినట్లుగా ఇచ్చువారిని కాదు. వారిని అనుకరించుటకు వ్యతిరేకముగా యేసు తన శిష్యులను హెచ్చరించెను: “కావున నీవు ధర్మము చేయునప్పుడు, మనుష్యుల వలన ఘనత నొందవలెనని, వేషధారులు సమాజమందిరములలోను, వీధులలోను చేయులాగున నీముందర బూర ఊదింపవద్దు; వారు తమ ఫలమును సంపూర్ణముగా చెల్లింపబడి యున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.”—మత్తయి 6:2 NW.
3. (ఎ) ఏ విధముగా శాస్త్రులు, పరిసయ్యులు తామిచ్చిన దానికి సంపూర్ణముగా చెల్లింపబడిరి? (బి) ఇచ్చుట విషయములో యేసు స్థానమెట్లు భిన్నముగా యుండెను?
3 ‘వారు తమ ఫలమును పొందియున్నారు’ అనుటకు ఉపయోగింపబడిన గ్రీకు పదము (అపెకొ) తరచు వ్యాపార రశీదులలో కన్పించును. కొండమీది ప్రసంగములో దానిని ఉపయోగించుట, “వారు తమ ఫలమును పొందియున్నారని,” అనగా “వారు తమ ఫలముకొరకు ఇవ్వబడిన రశీదుమీద సంతకము చేసియున్నారని: ప్రతిఫలముపొందు వారి హక్కు సఫలమైనదని, మరివిశదముగా దానికొరకు వారికిదివరకే రశీదు ఇవ్వబడెనని” సూచించుచున్నది. (ఎన్ ఎక్స్‌పోజిటరీ డిక్షనరీ ఆఫ్ న్యూ టెస్ట్‌మెంట్ వర్డ్స్, డబ్ల్యు. ఇ. వైన్ వ్రాసినది) పేదలకు బహుమానములిచ్చుట వీధులలో వాగ్దానము చేయబడెడిది. సమాజమందిరములలో దాతల పేర్లు ప్రకటింపబడెడివి. ఎక్కువ మొత్తము ఇచ్చినవారిని ఆరాధన సమయములో రబ్బీల వెనుక స్థానమిచ్చి ప్రత్యేకముగా గౌరవించెడివారు. వాటిని మనుష్యులు చూచుచుండగా ఇచ్చెడివారు; అవి చూడబడి మనుష్యులచే మహిమ పర్చబడెడివి; కావున, వారిచ్చిన దానికి ఫలముగా “సంపూర్ణముగా చెల్లింపబడి యున్నారని” రశీదుమీద ముద్ర వేసినట్లు అయ్యెడిది! యేసు స్థానము ఎంత భిన్నముగా ఉండెను! “రహస్యముగా” దానమిమ్ము; “అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును.”—మత్తయి 6:3, 4; సామెతలు 19:17.
దేవుని ప్రీతిపరచు ప్రార్థనలు
4. పరిసయ్యుల ప్రార్థనలు ఎందుకు యేసు ఆ మనుష్యులను వేషధారులని పిలుచునట్లు చేసెను?
4 తనకు చేయు ప్రార్థనలను యెహోవా ప్రశంసించును—అయితే పరిసయ్యులు ప్రార్థించినట్లుగా కాదు. యేసు తన అనుచరులకు ఇట్లు చెప్పెను: “మీరు ప్రార్థన చేయునప్పుడు వేషధారులవలె ఉండవద్దు; మనుష్యులకు కనబడవలెనని సమాజమందిరములలోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థనచేయుట వారికిష్టము; వారు తమ ఫలము పొందియున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.” (మత్తయి 6:5) వారెక్కడ ఉన్నను, ఆయా ప్రత్యేక సమయములలో ప్రతిదినము వల్లించవలసిన ప్రార్థనలనేకము పరిసయ్యులు కలిగియుండిరి. సిద్ధాంతపరముగా, రహస్యమందు వాటిని చేయవలెను. అయితే వారు పథకము ప్రకారము ప్రార్థించు ఘడియవచ్చే సమయానికి ఎటుతిరిగి, నాలుగుదార్ల కూడలిలో మనుష్యులకు కనబడునట్లు తాము “వీధుల మూలలలో నిలిచియుండునట్లు” చూచుకొనెడివారు.
5. (ఎ) పరిసయ్యుల మరింకే కార్యములు దేవుడు వారి ప్రార్థనలు వినకుండుటకు కారణమయ్యెను? (బి) తన మాదిరి ప్రార్థనలో యేసు ఏ సంగతులను ముందుంచెను, మరియు ఈనాటి ప్రజలు దాని ప్రకారముగా ఉన్నారా?
5 అబద్ధ పవిత్రతను ప్రదర్శించుచు, వారు “మాయవేషముగా దీర్ఘప్రార్థనలు” చేసెడివారు. (లూకా 20:47) ఒక నోటిమాట పారంపర్యాచారము ఇట్లు చెప్పెను: “పూర్వము భక్తిపరులైన మనుష్యులు టెఫిల్షా [ప్రార్థన] చేయుటకు ముందు ఒక గంట వేచియుండెడివారు.” (మిష్నా) అప్పటికి ప్రతివారు నిశ్చయముగా వారి ధర్మనిష్టను చూచి ఆశ్చర్యపడెడివారు! అటువంటి ప్రార్థనలు వారి తలలకంటె ఎక్కువ పైకి ఎక్కిపొలేదు. నిరర్థకముగా పునరుచ్చరించకుండా, రహస్యమందు ప్రార్థించవలెనని యేసు చెప్పెను మరియు వారికి సరళమైన ఒక మాదిరిని ఇచ్చెను. (మత్తయి 6:6-8; యోహాను 14:6, 14; 1 పేతురు 3:12) యేసు మాదిరి ప్రార్థన మొదటి సంగతులను మొదట ఉంచెను: “పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడుగాక; నీ రాజ్యము వచ్చుగాక; నీ చిత్తము . . . నెరవేరుగాక.” (మత్తయి 6:9-13) ఈనాడు కేవలము కొద్దిమంది మాత్రమే దేవుని నామమును ఎరిగియున్నారు, మరియు దానిని పరిశుద్ధపరచుటకు దాదాపు కోరుకొనుటలేదు. ఆ విధముగా వారు ఆయనను పేరులేని దేవునిగా తయారుచేయుచున్నారు. దేవునిరాజ్యము వచ్చుగాక? అది ఇప్పటికే ఇక్కడ, తమయందే ఉన్నదని అనేకులు తలంచుదురు. ఆయన చిత్తము నెరవేరుగాకయని వారు ప్రార్థించవచ్చును, అయితే అనేకులు వారి స్వంత చిత్తమునే చేయుదురు.—సామెతలు 14:12.
6. యూదుల ఉపవాసములను అర్థరహితములని యేసు ఎందుకు ఖండించెను?
6 ఉపవాసముండుట యెహోవాకు అంగీకృతము—అయితే పరిసయ్యులు చేసినట్లుగా కాదు. శాస్త్రులు, పరిసయ్యులు చేసిన దానములు మరియు ప్రార్థించుట యెడల చేసినట్లుగానే, వారి ఉపవాసముకూడా అర్థము లేనిదని యేసు కొట్టిపారవేసెను: “మీరు ఉపవాసము చేయునప్పుడు వేషధారులవలె దుఃఖముఖులై యుండకుడి; తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుష్యులకు కనబడవలెనని వారు తమ ముఖములను వికారము చేసికొందురు; వారు తమ ఫలము పొందియున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. (మత్తయి 6:16) వారి నోటిమాట పారంపర్యాచారములు ఉపవాసముండు సమయములో పరిసయ్యులు శరీరమును శుభ్రపరచుకొనుటగాని తైలము పూసుకొనుటగాని చేయక తమ తలలపై బూడిద పొసికొనవలెనని సూచించెను. ఉపవాసముండని సమయములో, యూదులు క్రమముగా తమను శుభ్రపరచుకొని శరీరమునకు తైలము పూసికొనెడివారు.
7. (ఎ) ఉపవాసమున్నప్పుడు యేసు అనుచరులు ఎట్లు ప్రవర్తింపవలెను? (బి) ఉపవాసము సంబంధముగా, యెషయా దినములలో యెహోవా ఏమికోరెను?
7 ఉపవాసముండుటను గూర్చి, యేసు తన అనుచరులకు ఇట్లు చెప్పెను: “మనుష్యులకు కనబడవలెనని కాక, రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలెనని, నీవు ఉపవాసము చేయునప్పుడు నీ తల అంటుకొని, నీ ముఖము కడుగుకొనుము.” (మత్తయి 6:17, 18) యెషయా దినములలో విశ్వాసరహిత యూదులు ప్రాణాలను ఆయాసపరచుకొనుచు, తలవంచుకొనుచు, గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చొనుచు, ఉపవాసముండుటలో ఆనందించిరి. అయితే వారు బాధింపబడువారిని విడిపించవలెనని, ఆకలిగొనినవారికి ఆహారమియ్యవలెనని, వస్త్రహీనులకు వస్త్రములివ్వవలెనని యెహోవా కోరెను.—యెషయా 58:3-7.
పరలోక ధనము సమకూర్చుకొనుము
8. దేవుని గుర్తింపును సంపాదించుటలో శాస్త్రులు, పరిసయ్యులు దృష్టి కోల్పోవుటకు ఏది కారణమయ్యెను, మరియు ఆ తర్వాత పౌలు వ్యక్తపరచిన ఏ సూత్రమును వారు లక్ష్యపెట్టలేదు?
8 నీతిని వెంటాడుటలో, శాస్త్రులు, పరిసయ్యులు దేవుని గుర్తింపును పొందవలెనను దృష్టిని పొగొట్టుకొని మనుష్యులచే కొనియాడబడుట మీద దృష్టి నిలిపిరి. వారు మనుష్యుల పారంపర్యాచారములచే ఎంతగా చుట్టుకొనిపోయిరంటే వారు దేవుని లిఖిత వాక్యమునే ప్రక్కనబెట్టిరి. పరలోక ధనమునకు బదులు వారు భూసంబంధమైన స్థానముమీద తమ హృదయములను నిలిపిరి. నిజం చెప్పాలంటే, ఆ తర్వాత సంవత్సరములలో క్రైస్తవునిగా మారిన ఒక పరిసయ్యుడు చెప్పిన సామాన్యమైన ఈ సత్యమును వారు లక్ష్యపెట్టలేదు. ఆయనిట్లు వ్రాసెను: “యెహోవావలన స్వాస్థమును ప్రతిఫలముగా పొందుదుమని యెరుగుదురు గనుక, మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక యెహోవా నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి.”—కొలొస్సయులు 3:23, 24, NW.
9. భూసంబంధమైన ఐశ్వర్యమును ఎటువంటి అపాయములు బెదిరించగలవు, అయితే నిజమైన ఐశ్వర్యమును ఏది భద్రముగా ఉంచును?
9 యెహోవా నీ బ్యాంకు ఖాతాకంటె తనయెడల నీ భక్తియందు శ్రద్ధ కలిగియున్నాడు. నీ ధనమెక్కడ ఉండునో నీ హృదయమక్కడ ఉండునని ఆయనకు తెలుసు. తుప్పు మరియు చిమ్మెట నీ ధనమును తినివేయగలదా? మట్టిగోడలకు కన్నమువేసి దొంగలు నీ ధనమును దొంగిలించగలరా? లేక ఆర్ధిక అస్థిరతగల ఈ ఆధునిక లోకములో, ద్రవ్యోల్బణము దాని కొనుగోలు విలువను తగ్గించివేయగలదా లేక స్టాక్-మార్కెట్ కుప్పకూలిపోయి దానిని తుడిచిపెట్టగలదా? పెరుగుచున్న నేరాలసంఖ్య నీ ధనము దొంగిలింపబడుటకు కారణమగునా? ఒకవేళ పరలోకములో దానిని దాచకపోయినట్లయిన అట్లు జరుగగలదు. నీ కన్ను—నీ శరీరమంతటిని వెలుగుమయము చేయు దీపము—తేటగా, దేవుని రాజ్యము మరియు ఆయన నీతిపై నిలిచియుండనట్లయిన అట్లు జరుగును. ఐశ్వర్యము మరుగైపోగలదు. “ఐశ్వర్యము పొంద ప్రయాసపడకుము. నీకు అట్టి అభిప్రాయము కలిగినను దానిని విడిచిపెట్టుము. నీవు దానిమీద దృష్టి నిలిపినతోడనే అది లేకపోవును నిశ్చయముగా అది రెక్కలు ధరించి యెగిరిపోవును. పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును.” (సామెతలు 23:4, 5) కావున ఐశ్వర్యము కొరకు నిద్రనెందుకు చెడగొట్టుకొనుట? “ఐశ్వర్యవంతులకు తమ ధనసమృద్ధిచేత నిద్రపట్టదు.” (ప్రసంగి 5:12) యేసు హెచ్చరికను జ్ఞాపకముంచుకొనుము: “మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు.”—మత్తయి 6:19-24.
చింతను పారద్రోలు విశ్వాసము
10. వస్తుదాయక సంపత్తినందు కాక దేవునియందు మీ విశ్వాసమును కలిగియుండుట ఎందుకు ప్రాముఖ్యము, మరియు యేసు ఏ సలహానిచ్చెను?
10 వస్తుదాయక సంపత్తినందు కాక నీవు తనయందు విశ్వాసముంచవలెనని యెహోవా కోరుచున్నాడు. “విశ్వాసము లేకుండా దేవునికి యిష్టుడైయుండుట అసాధ్యము; దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా.” (హెబ్రీయులు 11:6) యేసు ఇట్లనెను: “ఒకనికి కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు.” (లూకా 12:15) బ్యాంకులోని లక్షలకోట్ల రూపాయలు రోగగ్రస్త ఊపిరితిత్తులను, అలసిన గుండెలను పనిచేయించలేవు. తన కొండమీది ప్రసంగమును కొనసాగించుచు యేసు ఇట్లనెను: “అందువలన నేను మీతో చెప్పునదేమనగా, ఏమి తిందుమో యేమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చియైనను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చియైనను చింతింపకుడి; ఆహారముకంటె ప్రాణమును, వస్త్రముకంటె దేహమును గొప్పవి కావా?”—మత్తయి 6:25.
11. తన ఉపమానములలో అధికశాతము యేసు ఎక్కడ కనుగొనెను, మరియు ఇది కొండమీది ప్రసంగములో ఎట్లు ప్రదర్శింపబడెను?
11 యేసు అప్పటికప్పుడు నోటిమాటగా ఉపమానములు చెప్పుటలో దిట్ట. ఆయన ఎటుచూసినను వాటిని గూర్చి ఆలోచించెను. ఆయన ఒక స్త్రీ దీపమును దీప స్తంభముమీద పెట్టుటను చూసి దానిని ఒక ఉపమానముగా మార్చెను. ఆయన గొల్లవాడు గొర్రెలను మేకలను వేరుచేయుట చూసెను; అది ఒక ఉపమానముగా తయారయ్యెను. పిల్లలు సంత వీధిలో ఆడుటను చూసెను; అది ఒక ఉపమానముగా తయారయ్యెను. అదే ప్రకారము కొండమీది ప్రసంగములో కూడ. ఆయన భౌతిక అవసరతలను గూర్చి మాట్లాడెను, దానికి అవసరమగు ఉపమానములను ఆయన రివ్వున ఎగిరిపోవు ఆకాశపక్షులలో, కొండ ప్రాంతమంతయు తివాచివలె పరచుకొనియున్న అడవిపువ్వులలో చూసెను. ఆకాశపక్షులు విత్తి పంటకోయునా? లేదు. అడవిపువ్వులు దారముతీసి ఒడుకునా? లేదు. దేవుడు వాటిని చేసెను; వాటియెడల శ్రద్ధవహించును. అయితే మీరు, ఆకాశపక్షులకంటె అడవిపువ్వులకంటె శ్రేష్ఠులైయున్నారు. (మత్తయి 6:26, 28-30) వాటికొరకు కాదు, నీ కొరకు ఆయన తన కుమారునిచ్చియున్నాడు.—యోహాను 3:16.
12. (ఎ) ఆకాశపక్షుల మరియు అడవిపువ్వుల ఉపమాన భావము యేసు శిష్యులు పనిచేయ నవసరములేదనా? (బి) పని మరియు విశ్వాసము సంబంధముగా యేసు ఏ అంశమును తెల్పుచుండెను?
12 తన అనుచరులు తమను పోషించుకొనుటకు, వస్త్రములు ధరించుటకు పనిచేయనవసరములేదని యేసు ఇక్కడ చెప్పుట లేదు. (ప్రసంగి 2:24; ఎఫెసీయులు 4:28; 2 థెస్సలొనీకయులు 3:10-12 చూడుము.) ఆ వసంతకాల ఉదయాన, పక్షులు గింజలకొరకు నేలను జిమ్ముటలో, జట్లు కట్టుటలో, గూళ్లు నిర్మించుటలో, గుడ్లపై కూర్చొనుటలో, వాటి పిల్లలకు తినిపించుటలో మునిగియుండెను. అవి చీకుచింతా లేకుండా పనిచేయుచుండెను. అడవిపువ్వులు సహితము నీటిని మరియు ఖనిజములను అన్వేషించుటకు తమ వేర్షను నేలలోనికి పంపించుటలో, సూర్యరశ్మికొరకు ఆకులను పైకితెచ్చుటలో తీరికలేకయుండెను. అవి పెరిగి వికసించవలెను మరియు చనిపోకముందే తమజాతి విత్తనములను వెదజల్లవలెను. అవి పనిచేయుచున్నవి, అయితే చింతించుట లేదు. ఆకాశపక్షులకు మరియు అడవి పువ్వులకు దేవుడు సమకూర్చుచున్నాడు ‘అల్పవిశ్వాసులైన మీకు ఆయన మరి శ్రేష్ఠముగా సమకూర్చడా?’—మత్తయి 6:30.
13. (ఎ) ఒకని జీవిత కాలమును ఎక్కువ చేసికొనుటను గూర్చి మాట్లాడునప్పుడు యేసు ఒక క్యూబిట్ అను కొలతను ఉపయోగించుట ఎందుకు సరియైయుండెను? (బి) నీ జీవితమును అనంతమైన లక్షలాది మైళ్లు అన్నట్లు, ఎట్లు ఎక్కువ చేసికొనగలవు?
13 కాబట్టి విశ్వాసము కలిగియుండుము. దేనినిగూర్చియు చింతించకుము. “చింతించుట వలన మీలో యెవడు తన జీవితకొలతను ఒక క్యూబిట్ (అడుగున్నర) ఎక్కువ చేసికొనగలడు?” అని యేసు అడిగెను. (మత్తయి 6:27 NW) అయితే జీవిత కాలమును కొలుచుటకు యేసు భౌతిక కొలతను అనగా దూరమును, క్యూబిట్‌ను ఎందుకు వివరించెను? బహుశ ఎందుకనగా బైబిలు తరచు “పాపుల మార్గము,” “నీతిమంతుల మార్గము,” ‘విశాలమార్గము నాశనమునకు,’ ‘ఇరుకుమార్గము జీవమునకు’ అను మాటలనుపయోగించుచు మానవుల జీవిత కాలమును ఒక ప్రయాణమునకు పోల్చుచున్నది. (కీర్తన 1:1; సామెతలు 4:18; మత్తయి 7:13, 14) అనుదిన అవసరతలను గూర్చిన చింతలు నీ జీవిత కాలమును కాస్తయినను, అనగా “ఒక అడుగున్నర” అయినను పొడిగించలేవు. అయితే నీ జీవిత దూరమును అనంతమైన లక్షలాది మైళ్లదూరము వరకు అన్నట్లు, పొడిగించుకొనుటకు మార్గము కలదు. చింతకలిగి “ఏమి తిందుము?” లేక “ఏమి త్రాగుదుము?” లేక “ఏమి ధరించుకొందుము?” అని చెప్పుకొనుట ద్వారా కాదుగాని, విశ్వాసము కలిగియుండి మనము చేయవలెనని యేసు చెప్పిన దానిని చేయుట ద్వారా. ఆయనిట్లనెను: “కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహించబడును.”—మత్తయి 6:31-33.
దేవుని రాజ్యమును ఆయన నీతిని సంపాదించుట
14. (ఎ) కొండమీది ప్రసంగముయొక్క మూలాంశము ఏమైయున్నది? (బి) ఏ తప్పిదమైన మార్గమందు శాస్త్రులు, పరిసయ్యులు రాజ్యమును నీతిని వెదికిరి?
14 తన కొండమీది ప్రసంగములోని ప్రారంభ వాక్యమందు, యేసు ఆత్మీయ అవసరతలయెడల మెలకువగా ఉండువారికి పరలోకరాజ్యము చెందునని మాట్లాడెను. నాల్గవ వాక్యమందు, ఆయన నీతికొరకు ఆకలిదప్పులు గలవారు తృప్తిపరచబడుదురని చెప్పెను. ఇక్కడ యేసు రాజ్యమును యెహోవా నీతిని మొదటి స్థానమందుచుచున్నాడు. అవి కొండమీది ప్రసంగముయొక్క మూలాంశములై యున్నవి. అవి సమస్త మానవుల అవసరతలకు జవాబులైయున్నవి. అయితే దేనిద్వారా దేవుని రాజ్యము మరియు దేవుని నీతి సంపాదించుకొన సాధ్యమగును? మనమెట్లు ఎడతెగక వాటిని వెదకగలము? శాస్త్రుల, పరిసయ్యుల పద్ధతిలో కాదు. వారు రాజ్యమును నీతిని మోషే ధర్మశాస్త్రము ద్వారా వెదికిరి, దానియందు నోటిమాట పారంపర్యాచారములును చేరియున్నవని వారు చెప్పుకొనిరి, ఎందుకనగా వారు లిఖిత ధర్మశాస్త్రము మరియు నోటిమాట పారంపర్యాచారములు ఈ రెంటిని సీనాయి కొండమీద దేవుడు మోషేకు ఇచ్చెనని వారు నమ్మారు.
15. (ఎ) యూదుల ప్రకారము, వారి నోటిమాట పారంపర్యాచారములు ఎప్పుడు ఆరంభించబడెను, మరియు వారెట్లు వాటిని మోషే లిఖిత ధర్మశాస్త్రముకంటే హెచ్చించిరి? (బి) నిజానికి ఈ పారంపర్యాచారములు ఎప్పుడు ప్రారంభమాయెను, మరియు అవి మోషే ధర్మశాస్త్రముపై ఎటువంటి ప్రభావమును చూపెను?
15 దీనిని గూర్చి వారి పారంపర్యాచారము ఇట్లు చెప్పుచున్నది: “సీనాయి నుండి మోషే ధర్మశాస్త్రమును [పాదవచనము, “నోటిమాట ధర్మశాస్త్రము”] పొంది దానిని యెహోషువకు, యెహోషువ పెద్దలకు, పెద్దలు ప్రవక్తలకు అందజేసిరి; ప్రవక్తలు దానిని మహా సమాజమందిరములోని మనుష్యులకు అందజేసిరి.” తగిన కాలములో వారి నోటిమాట ధర్మశాస్త్రము లిఖిత ధర్మశాస్త్రముకంటె కూడ ఎక్కువగా హెచ్చింపబడెను: “అతడు [ఒకవేళ] ధర్మశాస్త్రములోని [లిఖిత] మాటలను తప్పిపోయినట్లయిన అతడు దోషి కాడు,” అయితే “అతడు శాస్త్రుల మాటలకు [నోటిమాట పారంపర్యాచారమునకు] ఏమి చేర్చినను అతడు దోషియగును.” (మిష్నా) వారి నోటిమాట పారంపర్యాచారములు సీనాయినొద్ద ఆరంభము కాలేదు. వాస్తవానికి, అవి క్రీస్తుకు ముందు దాదాపు రెండు శతాబ్దముల పూర్వము త్వరత్వరగా సమకూర్చబడుటకు ఆరంభించబడెను. అనేకము చేర్చబడెను, తీసివేయబడెను, మరియు అవి మోషే వ్రాతపూర్వక ధర్మశాస్త్రమును విలువలేనిదానిగా చేసెను.—ద్వితీయోపదేశకాండము 4:2; 12:32 పోల్చుము.
16. మానవులకు దేవుని నీతి ఎట్లు వచ్చెను?
16 ధర్మశాస్త్రముద్వారా కాదుగాని దేవుని నీతి వేరొక విధముగా వచ్చును: “ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు; ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా నీతి బయలుపడుచున్నది; దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలును సాక్ష్యమిచ్చుచున్నారు. అది యేసు క్రీస్తునందలి విశ్వాసమూలమైనదై, నమ్మువారందరికి కలుగు దేవుని నీతియైయున్నది.” (రోమీయులు 3:20-22) కావున దేవుని నీతి యేసుక్రీస్తునందలి విశ్వాసమూలముగా వచ్చును—ఇది “ధర్మశాస్త్రమును ప్రవక్తలును సాక్ష్యమిచ్చుట” ద్వారా నిరూపించబడెను. మెస్సీయను గూర్చిన ప్రవచనములు యేసునందు నెరవేరెను. ఆయన ధర్మశాస్త్రమును సహితము నెరవేర్చెను; అది ఆయన హింసాకొయ్యకు మేకులతో కొట్టబడి అడ్డములేకుండా ఎత్తివేయబడెను.—లూకా 24:25-27, 44-46; కొలొస్సయులు 2:13, 14; హెబ్రీయులు 10:1.
17. అపొస్తలుడైన పౌలు ప్రకారము, యూదులు దేవుని నీతినెరుగుటను ఎట్లు తప్పిపోయిరి?
17 కాబట్టి, అపొస్తలుడైన పౌలు నీతిని వెదకుటలో యూదులు తప్పిపోవుటనుగూర్చి వ్రాయుచున్నాడు: “వారు దేవునియందు ఆసక్తిగలవారని వారినిగూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను; అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఏలయనగా వారు దేవుని నీతినెరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తియైయున్నాడు.” (రోమీయులు 10:2-4) పౌలు ఇంకను యేసుక్రీస్తునుగూర్చి ఇట్లు వ్రాసెను: “మనమాయనయందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను.”—2 కొరింథీయులు 5:21.
18. “కొయ్యకు వ్రేలాడదీయబడిన క్రీస్తును” యూదా సంప్రదాయవాదులు, గ్రీసుదేశ తాత్వికులు, మరియు “పిలువబడిన వారు” ఎట్లు దృష్టించిరి?
18 చనిపోవుచున్న మెస్సీయను యూదులు ఏమిలేని బలహీనుడని దృష్టించిరి. గ్రీసుదేశ తాత్వికులు మెస్సీయను వెర్రివాడని అపహసించిరి. అయినను, పౌలు ప్రకటించినట్లుగా: “యూదులు సూచకక్రియలు చేయుమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానము వెదకుచున్నారు. అయితే, మేము కొయ్యకు వ్రేలాడదీయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు; గాని యూదులకేమి, గ్రీసుదేశస్థులకేమి, పిలువబడినవారికే క్రీస్తు దేవుని శక్తియును జ్ఞానమునై యున్నాడు. దేవుని వెర్రితనము మనుష్యుల జ్ఞానముకంటె జ్ఞానము గలది, దేవుని బలహీనత మనుష్యుల బలముకంటె బలమైనది.” (1 కొరింథీయులు 1:22-25 NW) క్రీస్తుయేసు దేవుని శక్తి మరియు జ్ఞానముల ప్రదర్శనయైయున్నాడు మరియు నీతికి, విధేయతచూపు మానవుల నిత్యజీవమునకు దేవుని మూలమైయున్నాడు. “మరి ఎవనివలనను రక్షణ కలుగదు; ఈ నామముననే మనము రక్షణ పొందవలెనుగాని, ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము.”—అపొ.కార్యములు 4:12.
19. తర్వాత శీర్షిక ఏమి చూపించును?
19 మనము నాశనమును తప్పించుకొని నిత్యజీవమును సంపాదించుకొనవలెనంటే, మనము దేవుని రాజ్యమును ఆయన నీతిని వెదకవలెనని దీని తర్వాత శీర్షిక చూపించును. కేవలము యేసు మాటలను వినుట మాత్రమే కాదు వాటి ప్రకారము ప్రవర్తించుట ద్వారాకూడ దానిని మనము చేయవలెను. (w90 10/1)
పునఃసమీక్ష ప్రశ్నలు
◻ కనికరముతో ఇచ్చు దానములను, ప్రార్థనలను, మరియు ఉపవాసములను యూదామతము దేనిలోనికి మార్చివేసెను?
◻ మీ ధనమును సమకూర్చుకొనుటకు సురక్షితస్థలము ఎక్కడ కలదు?
◻ మన వస్తుదాయక అవసరతలపై చింతించుటను మనమెందుకు విసర్జించవలెను?
◻ తమ నోటిమాట పారంపర్యాచారముల ఆరంభమునుగూర్చి యూదులు ఎటువంటి అబద్ధము చెప్పుచున్నారు?
◻ దేని మూలముగా దేవుని రాజ్యము మరియు నీతి కలిగెను?
[16వ పేజీలోని చిత్రాలు]
తమను మనుష్యులు చూడగల్గునట్లు, పరిసయ్యులు వీధి మూలలలో నిలువబడి ప్రార్థనచేయుటకు ఇష్టపడెడి వారు