35వ అధ్యాయం
పేరుగాంచిన కొండమీది ప్రసంగం
కొండమీది ప్రసంగం
పన్నెండుమంది శిష్యుల్ని అపొస్తలులుగా ఎంచుకోవడానికి రాత్రంతా ప్రార్థన చేసి యేసు అలసిపోయి ఉంటాడు. ఇప్పుడు ఉదయమైంది. ప్రజలకు సహాయం చేయడానికి కావాల్సిన బలం, కోరిక ఆయనలో ఇంకా ఉన్నాయి. ఆయన గలిలయలోని ఒక కొండ మీద ఉన్నాడు. బహుశా అది, ఆయన పరిచర్య కేంద్రమైన కపెర్నహూముకు దగ్గర్లోనే ఉండివుంటుంది.
ప్రజలు సుదూర ప్రాంతాల నుండి ఆయన దగ్గరికి వచ్చారు. కొంతమంది దక్షిణాన ఉన్న యెరూషలేము నుండి, ఇతర యూదయ ప్రాంతాల నుండి వచ్చారు. ఇంకొంతమంది వాయవ్య దిశలో ఉన్న కోస్తా నగరాలైన తూరు, సీదోనుల నుండి వచ్చారు. వాళ్లు యేసును వెతుక్కుంటూ ఎందుకు వచ్చారు? “ఆయన చెప్పేది వినాలని, తమ రోగాలు నయం చేసుకోవాలని” వాళ్లు వచ్చారు. వాళ్లు కోరుకున్నట్టే యేసు ‘వాళ్లందర్నీ బాగుచేశాడు.’ ఒక్కసారి ఆలోచించండి, అనారోగ్యంతో ఉన్న వాళ్లంతా బాగయ్యారు! “అపవిత్ర దూతల వల్ల” అంటే చెడ్డదూతల వల్ల “పీడించబడినవాళ్లు” కూడా బాగయ్యారు.—లూకా 6:17-19.
యేసు ఆ తర్వాత కొండ మీద చదునుగా ఉన్న చోటు చూసుకొని కూర్చున్నాడు, ప్రజలంతా ఆయన చుట్టూ చేరారు. ఆయన శిష్యులు, ముఖ్యంగా 12 మంది అపొస్తలులు ఆయనకు దగ్గరగా కూర్చొని ఉండవచ్చు. అంత గొప్ప అద్భుతాలు చేసిన ఈ బోధకుడు చెప్పేది వినాలని అందరూ ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. అప్పుడు యేసు, వినేవాళ్లకు ప్రయోజనం చేకూర్చే ఒక ప్రసంగం ఇచ్చాడు. ఆ ప్రసంగం నుండి ఇప్పటికీ ఎంతోమంది ప్రయోజనం పొందుతున్నారు. ఆ ప్రసంగంలో, యేసు లోతైన ఆధ్యాత్మిక విషయాల్ని సరళంగా, స్పష్టంగా తెలియజేశాడు కాబట్టి మనం కూడా దాన్నుండి ప్రయోజనం పొందవచ్చు. రోజూ చూసేవాటిని, ప్రజలకు బాగా తెలిసినవాటిని ఉపయోగిస్తూ యేసు బోధించాడు. దానివల్ల, దేవుని మార్గంలో నడవాలని ప్రయత్నిస్తున్న వాళ్లందరికీ ఆయన బోధలు చక్కగా అర్థమయ్యాయి. ఏ ముఖ్యమైన అంశాల వల్ల ఆయన ప్రసంగం ప్రత్యేకమైనదిగా నిలిచింది?
ఎవరు నిజంగా సంతోషంగా ఉంటారు?
సంతోషంగా ఉండాలని ప్రతీఒక్కరు కోరుకుంటారు. అందుకే, ఎవరు నిజంగా సంతోషంగా ఉంటారనే అంశంతో యేసు తన ప్రసంగం మొదలుపెట్టాడు. వినేవాళ్లను ఆ అంశం ఎంత ఆకట్టుకొని ఉంటుందో ఊహించండి. అయితే, కొన్ని విషయాలు వాళ్లను తికమక పెట్టివుంటాయి.
ఆయన ఇలా అన్నాడు: ‘దేవుని నిర్దేశం తమకు అవసరమని గుర్తించేవాళ్లు సంతోషంగా ఉంటారు, ఎందుకంటే పరలోక రాజ్యం వాళ్లది. దుఃఖించేవాళ్లు సంతోషంగా ఉంటారు, ఎందుకంటే వాళ్లు ఓదార్చబడతారు. నీతి కోసం ఆకలిదప్పులు గలవాళ్లు సంతోషంగా ఉంటారు, ఎందుకంటే వాళ్లు తృప్తిపర్చబడతారు. నీతి కోసం హింసించబడేవాళ్లు సంతోషంగా ఉంటారు, ఎందుకంటే పరలోక రాజ్యం వాళ్లది. మీరు నా శిష్యులు అనే కారణంతో ప్రజలు మిమ్మల్ని నిందించి, హింసించినప్పుడు మీరు సంతోషంగా ఉంటారు. సంతోషించండి, ఆనందంతో గంతులు వేయండి.’—మత్తయి 5:3-12.
యేసు ఇక్కడ ఏ “సంతోషం” గురించి మాట్లాడుతున్నాడు? నవ్వుతూ గడపడం గురించో, సరదాగా ఉండడం గురించో కాదుగానీ హృదయలోతుల్లో నుండి వచ్చే నిజమైన సంతోషం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. అందులో నిజమైన సంతృప్తి, అర్థవంతమైన జీవితం గడుపుతున్నామనే భావన ఉంటాయి.
దేవుని నిర్దేశం తమకు అవసరమని గుర్తించేవాళ్లు, తమ పాపపు స్థితి గురించి దుఃఖించేవాళ్లు, దేవుణ్ణి తెలుసుకొని ఆయన్ని సేవించేవాళ్లు నిజంగా సంతోషంగా ఉంటారని యేసు చెప్తున్నాడు. దేవుని ఇష్టాన్ని చేస్తున్నందుకు ద్వేషించబడినా, హింసించబడినా వాళ్లు సంతోషంగా ఉంటారు. ఎందుకంటే తాము దేవుణ్ణి సంతోషపెడుతున్నామని, దేవుడిచ్చే శాశ్వత జీవితాన్ని బహుమానంగా పొందుతామని వాళ్లకు తెలుసు.
ఆస్తిపాస్తులు సంపాదించుకొని సుఖాల్ని అనుభవిస్తే సంతోషంగా ఉంటామని చాలామంది అనుకుంటారు. కానీ యేసు అలా చెప్పలేదు. వినేవాళ్లను ఆలోచింపజేసే ఈ భిన్నమైన అంశాన్ని ఆయన చెప్పాడు: “ధనవంతులైన మీకు శ్రమ, ఎందుకంటే మీరు పొందబోయే సౌకర్యాలన్నీ ఇప్పటికే పొందేశారు. ఇప్పుడు తృప్తిగా ఉన్న మీకు శ్రమ, ఎందుకంటే మీరు ఆకలితో అలమటిస్తారు. ఇప్పుడు నవ్వుతున్న మీకు శ్రమ, ఎందుకంటే మీరు దుఃఖిస్తారు, ఏడుస్తారు. మనుషులందరూ మీ గురించి మంచిగా మాట్లాడినప్పుడల్లా మీకు శ్రమ, ఎందుకంటే వాళ్ల పూర్వీకులు అబద్ధ ప్రవక్తల విషయంలో అలాగే చేశారు.”—లూకా 6:24-26.
ధనవంతులుగా ఉండడం, సంతోషంగా నవ్వడం, ప్రశంసలు పొందడం ఎందుకు శ్రమను తీసుకొస్తాయి? ఎందుకంటే వాటిని ప్రేమించే వ్యక్తి దేవుని సేవను నిర్లక్ష్యం చేసి, నిజమైన సంతోషాన్ని కోల్పోవచ్చు. దానర్థం పేదవాళ్లు లేదా ఆకలితో ఉన్నవాళ్లు మాత్రమే సంతోషంగా ఉంటారని కాదు. సాధారణంగా, ఏమీ లేనివాళ్లే యేసు బోధలకు స్పందిస్తారు, నిజమైన సంతోషాన్ని పొందుతారు.
తన శిష్యుల్ని మనసులో ఉంచుకొని యేసు ఇలా అన్నాడు: “మీరు లోకానికి ఉప్పు లాంటివాళ్లు.” (మత్తయి 5:13) యేసు ఎందుకలా అన్నాడంటే, ఉప్పు ఆహారపదార్థాల్ని పాడవ్వకుండా ఉంచుతుంది. ఆలయంలోని బలిపీఠం దగ్గర చాలా ఉప్పు ఉంచేవాళ్లు, దాన్ని అర్పణల్లో కలిపేవాళ్లు. అంతేకాదు కుళ్లిపోకుండా, పాడవ్వకుండా ఉండడాన్ని కూడా అది సూచిస్తుంది. (లేవీయకాండం 2:13; యెహెజ్కేలు 43:23, 24) యేసు శిష్యులు ప్రజల్ని ఆధ్యాత్మికంగా, నైతికంగా పాడవ్వకుండా కాపాడతారు కాబట్టి వాళ్లు “లోకానికి ఉప్పు లాంటివాళ్లు.” అవును, వాళ్లు ప్రకటించే సందేశం, దాన్ని స్వీకరించే వాళ్లందరి ప్రాణాల్ని కాపాడగలదు.
యేసు తన శిష్యులతో, “మీరు లోకానికి వెలుగు లాంటివాళ్లు” అని కూడా అన్నాడు. ఎవరూ దీపాన్ని వెలిగించి గంప కింద పెట్టరు గానీ, అది అందరికీ వెలుగు ఇచ్చేలా దీపస్తంభం మీద పెడతారు. అందుకే యేసు వాళ్లను ఇలా ప్రోత్సహించాడు: “మీ వెలుగును మనుషుల ముందు ప్రకాశించనివ్వండి, అప్పుడు వాళ్లు మీ మంచిపనులు చూసి పరలోకంలో ఉన్న మీ తండ్రిని మహిమపరుస్తారు.”—మత్తయి 5:14-16.
తన అనుచరుల కోసం ఒక ఉన్నత ప్రమాణం
యూదా మతనాయకులు యేసును ధర్మశాస్త్రాన్ని మీరిన వ్యక్తిగా చూశారు, ఈ మధ్యే ఆయన్ని చంపడానికి కుట్ర కూడా పన్నారు. అందుకే యేసు అందరిముందు ఇలా అన్నాడు: “నేను ధర్మశాస్త్రాన్ని గానీ, ప్రవక్తల మాటల్ని గానీ రద్దు చేయడానికి వచ్చానని అనుకోకండి. నేను వాటిని రద్దు చేయడానికి కాదు, నెరవేర్చడానికే వచ్చాను.”—మత్తయి 5:17.
అవును, యేసు ధర్మశాస్త్రాన్ని ఎంతో గౌరవించాడు, అలా గౌరవించమని ఇతరుల్ని కూడా ప్రోత్సహించాడు. నిజానికి, ఆయన ఇలా అన్నాడు: “కాబట్టి ఎవరైనా దీనిలోని అతిచిన్న ఆజ్ఞల్లో ఒకదాన్ని మీరి, అలా చేయమని ఇతరులకు బోధిస్తే ఆ వ్యక్తి పరలోక రాజ్యంలో అందరికన్నా తక్కువవాడిగా ఎంచబడతాడు.” అసలు అలాంటి వ్యక్తి దేవుని రాజ్యంలో అడుగుపెట్టడు అని యేసు చెప్తున్నాడు. తర్వాత ఆయన ఇలా అన్నాడు: “అయితే ఎవరైనా ఈ ఆజ్ఞలు పాటిస్తూ, వాటిని ఇతరులకు బోధిస్తే ఆ వ్యక్తి పరలోక రాజ్యంలో గొప్పవాడిగా ఎంచబడతాడు.”—మత్తయి 5:19.
ఎలాంటి ఆలోచనలు దేవుని ధర్మశాస్త్రాన్ని మీరేలా చేస్తాయో కూడా యేసు చెప్పాడు. “హత్య చేయకూడదు” అని ధర్మశాస్త్రంలో ఉన్న విషయాన్ని చెప్పిన తర్వాత, యేసు ఇలా అన్నాడు: “తన సహోదరుని మీద మనసులో కోపం పెట్టుకునే ప్రతీ వ్యక్తి న్యాయస్థానం ముందు హాజరవ్వాల్సి ఉంటుంది.” (మత్తయి 5:21, 22) సాటిమనిషి మీద మనసులో కోపాన్ని ఉంచుకోవడం తప్పు, అది హత్య చేయడానికి కూడా దారితీయవచ్చు. అందుకే, సాటిమనిషితో సమాధానపడడానికి ఎంతమేరకు కృషిచేయాలో చెప్తూ యేసు ఇలా అన్నాడు: “నువ్వు బలిపీఠం దగ్గరికి నీ అర్పణను తెస్తున్నప్పుడు, నీ సహోదరుడు నీ వల్ల నొచ్చుకున్నాడని అక్కడ నీకు గుర్తొస్తే, బలిపీఠం ఎదుటే నీ అర్పణను విడిచిపెట్టి వెళ్లి ముందు నీ సహోదరునితో సమాధానపడు; తర్వాత తిరిగొచ్చి నీ అర్పణను అర్పించు.”—మత్తయి 5:23, 24.
వ్యభిచారం చేయకూడదనే ఆజ్ఞ కూడా ధర్మశాస్త్రంలో ఉంది. యేసు ఇలా అన్నాడు: “‘వ్యభిచారం చేయకూడదు’ అని చెప్పబడిందని మీరు విన్నారు కదా. కానీ నేను మీతో చెప్తున్నాను, ఒక స్త్రీ మీద కోరిక కలిగేలా అదేపనిగా ఆమెను చూస్తూ ఉండేవాడు అప్పటికే తన హృదయంలో ఆమెతో వ్యభిచారం చేశాడు.” (మత్తయి 5:27, 28) కేవలం అలా వచ్చి ఇలా వెళ్లిపోయే చెడు ఆలోచన గురించి కాదుగానీ, ‘అదేపనిగా చూస్తూ ఉండడం’ వల్ల కలిగే తప్పుడు కోరిక గురించి యేసు మాట్లాడుతున్నాడు. అదేపనిగా చూడడం వల్ల లైంగిక కోరికలు బలపడుతూ ఉంటాయి. దానివల్ల, అవకాశం దొరికినప్పుడు వ్యభిచారానికి పాల్పడే ప్రమాదం ఉంది. అలా జరగకూడదంటే కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్తూ యేసు ఇలా అన్నాడు: “నీ కుడి కన్ను నీతో పాపం చేయిస్తుంటే, దాన్ని పీకేసి దూరంగా పడేయి. . . . నీ కుడిచెయ్యి నీతో పాపం చేయిస్తుంటే, దాన్ని నరికేసి దూరంగా పడేయి.”—మత్తయి 5:29, 30.
కాలుకు గానీ, చెయ్యికి గానీ తీవ్రమైన వ్యాధి సోకి వాటివల్ల ప్రాణానికి ప్రమాదం అని తెలిస్తే, వాటిని తీసేయించుకోవడానికి కూడా కొంతమంది సిద్ధపడతారు. అదేవిధంగా చెడు ఆలోచనలకు, వాటివల్ల వచ్చే చెడు ఫలితాలకు దూరంగా ఉండాలంటే దేన్నైనా సరే, చివరికి ఎంతో విలువైన కన్నునైనా చేతినైనా తీసేసుకోవడం చాలా ముఖ్యమని యేసు చెప్తున్నాడు. ఆయన ఇలా వివరించాడు: “నీ శరీరమంతా గెహెన్నాలో పడేయబడడం కన్నా నీ అవయవాల్లో ఒకదాన్ని పోగొట్టుకోవడం నీకు మేలు.” గెహెన్నా (యెరూషలేము గోడల అవతల చెత్తకుప్పను తగలబెట్టే స్థలం) శాశ్వత నాశనాన్ని సూచిస్తుంది.
మనల్ని గాయపర్చేవాళ్లతో, నొప్పించేవాళ్లతో ఎలా వ్యవహరించాలో కూడా యేసు చెప్పాడు. ఆయన ఇలా అన్నాడు: “చెడ్డవాణ్ణి ఎదిరించవద్దు, బదులుగా నిన్ను కుడి చెంప మీద కొట్టేవాడికి ఎడమ చెంప కూడా చూపించు.” (మత్తయి 5:39) ఎవరైనా మనమీద, మన కుటుంబం మీద దాడిచేసినప్పుడు మనల్ని మనం కాపాడుకోకూడదని దానర్థం కాదు. యేసు ఇక్కడ చెంపదెబ్బ గురించి మాట్లాడుతున్నాడు. అది తీవ్రంగా గాయపర్చడానికో, చంపడానికో కొట్టే దెబ్బ కాదుగానీ అవమానించడానికి కొట్టే దెబ్బ. ఎవరైనా కొట్లాటకు లేదా వాదులాటకు దిగేలా మనల్ని రెచ్చగొట్టడానికి చెంపదెబ్బ కొట్టినా లేదా అవమానకరంగా మాట్లాడినా, మనం తిరిగి అలా చేయకూడదని ఆయన చెప్తున్నాడు.
ఆ సలహా, సాటిమనిషిని ప్రేమించాలని దేవుడు ఇచ్చిన నియమానికి తగ్గట్టుగానే ఉంది. కాబట్టి వింటున్నవాళ్లతో యేసు ఇలా అన్నాడు: “మీ శత్రువుల్ని ప్రేమిస్తూ ఉండండి, మిమ్మల్ని హింసించేవాళ్ల కోసం ప్రార్థిస్తూ ఉండండి.” అందుకుగల బలమైన కారణాన్ని ఆయన ఇలా వివరించాడు: “అప్పుడు మీరు పరలోకంలో ఉన్న మీ తండ్రికి పిల్లలుగా ఉంటారు. ఎందుకంటే ఆయన దుష్టుల మీద, మంచివాళ్ల మీద తన సూర్యుణ్ణి ఉదయింపజేస్తున్నాడు.”—మత్తయి 5:44, 45.
తన ప్రసంగంలోని ఈ భాగాన్నంతటినీ యేసు ఈ ఒక్కమాటలో ముగించాడు: “మీ పరలోక తండ్రి పరిపూర్ణుడు కాబట్టి మీరు కూడా ఆయనలా పరిపూర్ణులుగా ఉండాలి.” (మత్తయి 5:48) అంటే మనం పూర్తిస్థాయిలో దేవునిలా పరిపూర్ణులం అవ్వాలని కాదుగానీ, దేవుణ్ణి అనుకరించాలని యేసు చెప్తున్నాడు. అలా అనుకరిస్తే మన శత్రువుల్ని సైతం ప్రేమిస్తాం. మరో మాటలో చెప్పాలంటే, “మీ తండ్రిలాగే మీరూ కరుణ చూపిస్తూ ఉండండి” అని యేసు అంటున్నాడు.—లూకా 6:36.
ప్రార్థన, దేవుని మీద నమ్మకం
యేసు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ, వినేవాళ్లను ఇలా ప్రోత్సహించాడు: “మనుషులకు కనిపించాలని వాళ్ల ముందు మీ నీతికార్యాలు చేయకుండా జాగ్రత్తపడండి.” మనుషులకు కనిపించేలా దైవభక్తి ఉన్నట్లు నటించడం తప్పని చెప్తూ ఆయన ఇలా అన్నాడు: “నువ్వు దానధర్మాలు చేస్తున్నప్పుడు నీ ముందు బాకా ఊదించుకోవద్దు, వేషధారులు . . . అలా చేస్తుంటారు.” (మత్తయి 6:1, 2) కాబట్టి దానధర్మాలు ఎవరికీ తెలియకుండా చేయడం మంచిది.
యేసు ఆ తర్వాత ఇలా అన్నాడు: “మీరు ప్రార్థించేటప్పుడు వేషధారుల్లా ఉండకండి; మనుషులకు కనిపించేలా సమాజమందిరాల్లో, ముఖ్య వీధుల మూలల్లో నిలబడి ప్రార్థించడం వాళ్లకు ఇష్టం. . . . నువ్వు ప్రార్థన చేయాలనుకున్నప్పుడు, నీ గదిలోకి వెళ్లి, తలుపులు వేసుకుని, ఎవరూ చూడలేని నీ తండ్రికి ప్రార్థించు.” (మత్తయి 6:5, 6) అసలు బహిరంగంగా ప్రార్థించడమే తప్పని యేసు అనట్లేదు, ఎందుకంటే ఆయన కూడా అలా ప్రార్థించాడు. వినేవాళ్లను ముగ్ధుల్ని చేయాలని, వాళ్ల పొగడ్తల్ని అందుకోవాలని ప్రార్థించడం తప్పని ఆయన చెప్తున్నాడు.
ప్రజలకు ఆయన ఈ సలహా ఇచ్చాడు: “నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు, అన్యజనుల్లా చెప్పిన మాటలే మళ్లీమళ్లీ చెప్పకు.” (మత్తయి 6:7) ఒక విషయం గురించి పదేపదే ప్రార్థించడం తప్పని యేసు చెప్పట్లేదు. బట్టీపట్టి “మళ్లీమళ్లీ” అవే వాక్యాల్ని వల్లిస్తూ ప్రార్థించడాన్ని ఆయన ఖండిస్తున్నాడు. తర్వాత ఆయన ఏడు విన్నపాలు ఉన్న మాదిరి ప్రార్థన నేర్పించాడు. మొదటి మూడు విన్నపాలు దేవుని పరిపాలనా హక్కు గురించి, ఆయన సంకల్పాల గురించి చెప్తున్నాయి. అవేంటంటే దేవుని పేరు పవిత్రపర్చబడడం, ఆయన రాజ్యం రావడం, ఆయన ఇష్టం నెరవేరడం. అలాంటివాటి గురించి ప్రార్థించిన తర్వాతే మన సొంత విషయాల గురించి అడగాలి. అంటే ఆ రోజుకు అవసరమైన ఆహారం ఇవ్వమని, మన పాపాల్ని క్షమించమని, సహించగలిగే దానికన్నా ఎక్కువ ప్రలోభాలు రానివ్వద్దని, దుష్టుని నుండి కాపాడమని ప్రార్థించాలి.
ఆస్తిపాస్తులకు మనం ఎంత విలువ ఇవ్వాలో చెప్తూ యేసు ఇలా అన్నాడు: “భూమ్మీద మీ కోసం సంపదలు కూడబెట్టుకోవడం ఆపండి; ఇక్కడ చెదలు, తుప్పు వాటిని తినేస్తాయి; దొంగలు కన్నం వేసి దోచుకుంటారు.” అది చాలా తెలివైన సలహా కదా! వస్తుసంపదలు నాశనమయ్యే అవకాశం ఉంది, అలా అవుతాయి కూడా. అంతేకాదు అవి దేవుని దగ్గర మనకు మంచి పేరు తీసుకురాలేవు. అందుకే యేసు ఆ తర్వాత, “పరలోకంలో మీ కోసం సంపదలు కూడబెట్టుకోండి” అని చెప్పాడు. మన జీవితంలో దేవుని సేవకు మొదటి స్థానం ఇవ్వడం ద్వారా అలా చేయవచ్చు. దేవుని దగ్గర మనకున్న మంచి పేరును, దానివల్ల వచ్చే శాశ్వత జీవితమనే బహుమానాన్ని ఎవ్వరూ మన నుండి తీసేసుకోలేరు. “నీ సంపద ఎక్కడ ఉంటే నీ హృదయం కూడా అక్కడే ఉంటుంది” అని యేసు చెప్పిన మాట ఎంత నిజం!—మత్తయి 6:19-21.
ఆ విషయాన్నే నొక్కిచెప్తూ యేసు ఒక ఉదాహరణ చెప్పాడు: “శరీరానికి దీపం కన్నే కాబట్టి, నీ కన్ను ఒకేదానిపై దృష్టి నిలిపితే నీ శరీరమంతా ప్రకాశవంతంగా ఉంటుంది. అయితే నీ కన్ను ఈర్ష్యతో నిండిపోతే నీ శరీరమంతా చీకటౌతుంది.” (మత్తయి 6:22, 23) మన కన్ను సరిగ్గా పనిచేస్తే అది మన శరీరానికి దీపంలా ఉంటుంది. కానీ అలా ఉండాలంటే మన కన్ను ఒకే విషయంపై దృష్టి నిలపాలి, లేదంటే మనం జీవితాన్ని చూసే విధానం మసకబారవచ్చు. దేవుని సేవ మీద కాకుండా వస్తుసంపదల మీద దృష్టి నిలిపితే “శరీరమంతా చీకటౌతుంది.” అంటే మన శరీరం చీకటి పనుల వైపు లేదా అవినీతి పనుల వైపు మొగ్గు చూపవచ్చు.
తర్వాత యేసు ఒక శక్తివంతమైన ఉదాహరణ చెప్పాడు: “ఏ వ్యక్తీ ఇద్దరు యజమానులకు దాసునిగా ఉండలేడు. అతను ఒక యజమానిని ద్వేషించి ఇంకో యజమానిని ప్రేమిస్తాడు, లేదా ఒక యజమానికి నమ్మకంగా ఉండి ఇంకో యజమానిని చిన్నచూపు చూస్తాడు. మీరు ఒకే సమయంలో దేవునికీ సంపదలకూ దాసులుగా ఉండలేరు.”—మత్తయి 6:24.
యేసు మాటలు వింటున్న కొంతమంది తమ భౌతిక అవసరాల గురించి ఆందోళన పడుతుండవచ్చు. అందుకే, దేవుని సేవకు మొదటి స్థానం ఇస్తే ఆందోళన పడాల్సిన అవసరం ఉండదని యేసు వాళ్లకు భరోసా ఇచ్చాడు. “ఆకాశపక్షుల్ని బాగా గమనించండి; అవి విత్తవు, కోయవు, గోదాముల్లో పోగుచేసుకోవు, అయినా మీ పరలోక తండ్రి వాటిని పోషిస్తున్నాడు.”—మత్తయి 6:26.
మరి, ఆ కొండమీద ఉన్న గడ్డి పూల సంగతేంటి? “తన పూర్తి వైభవంతో ఉన్న సొలొమోను కూడా ఈ పూలలో ఒకదానంత అందంగా అలంకరించబడలేదు” అని యేసు అన్నాడు. ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడు? ‘ఇవాళ ఉండి రేపు పొయ్యిలో వేయబడే గడ్డిమొక్కలనే దేవుడు అలా అలంకరిస్తున్నాడంటే, ఆయన మీకు తప్పకుండా బట్టలు ఇస్తాడు కదా?’ (మత్తయి 6:29, 30) అందుకే యేసు ఈ తెలివైన సలహా ఇచ్చాడు: ‘ఏమి తినాలి, ఏమి తాగాలి, ఏమి వేసుకోవాలి అనుకుంటూ ఎన్నడూ ఆందోళన పడకండి. మీకు ఇవన్నీ అవసరమని మీ పరలోక తండ్రికి తెలుసు. కాబట్టి మీరు ఆయన రాజ్యానికి, ఆయన నీతికి మొదటిస్థానం ఇస్తూ ఉండండి; అప్పుడు ఆయన వీటన్నిటినీ మీకు ఇస్తాడు.’—మత్తయి 6:31-33.
జీవాన్ని ఎలా పొందవచ్చు?
అపొస్తలులు, మంచి మనసున్న ఇతరులు దేవునికి ఇష్టమైన విధంగా జీవించాలని కోరుకున్నారు. కానీ అప్పుడున్న పరిస్థితుల్లో అది అంత తేలిక కాదు. ఉదాహరణకు, చాలామంది పరిసయ్యులు ప్రజల్ని ప్రతీ విషయంలో తప్పుపడుతూ కఠినంగా తీర్పు తీర్చేవాళ్లు. అందుకే, వినేవాళ్లకు యేసు ఈ సలహా ఇచ్చాడు: “తీర్పు తీర్చడం ఆపేయండి, అప్పుడు మీకు తీర్పు తీర్చబడదు; మీరు ఎలా తీర్పు తీరుస్తారో, మీకూ అలాగే తీర్పు తీర్చబడుతుంది.”—మత్తయి 7:1, 2.
ప్రతీ చిన్న విషయంలో తప్పుపట్టే పరిసయ్యుల్ని అనుసరించడం ప్రమాదకరమని వివరిస్తూ, యేసు ఈ ఉదాహరణ చెప్పాడు: “ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డివాడికి దారి చూపించగలడా? అలాచేస్తే ఇద్దరూ గుంటలో పడిపోతారు కదా?” యేసు ప్రసంగాన్ని వింటున్నవాళ్లు ఇతరుల్ని ఎలా చూడాలి? వాళ్లు తప్పుపట్టే వాళ్లుగా ఉండకూడదు. ఎందుకంటే అదే ఒక పెద్ద తప్పు. యేసు ఇలా అన్నాడు: “నీ కంట్లో ఉన్న దూలాన్ని చూసుకోకుండా నీ సహోదరునితో, ‘సహోదరుడా, నన్ను నీ కంట్లో ఉన్న నలుసును తీసేయనివ్వు’ అని అతనితో ఎలా అంటావు? వేషధారీ! ముందు నీ కంట్లో ఉన్న దూలాన్ని తీసేసుకో, అప్పుడు నీ సహోదరుని కంట్లో ఉన్న నలుసును ఎలా తీసేయాలో నీకు స్పష్టంగా కనిపిస్తుంది.”—లూకా 6:39-42.
దానర్థం, శిష్యులు అసలు ఏ విషయంలోనూ తీర్పు తీర్చకూడదని కాదు. యేసు వాళ్లకు ఈ సలహా ఇచ్చాడు: “పవిత్రమైన వాటిని కుక్కలకు పెట్టకండి, మీ ముత్యాలు పందుల ముందు వేయకండి.” (మత్తయి 7:6) దేవుని వాక్యంలోని సత్యాలు ముత్యాల్లా అమూల్యమైనవి. ఎవరైనా ఆ అమూల్యమైన సత్యాల్ని లెక్కచేయకపోతే శిష్యులు వాళ్లను వదిలేసి, వాటిని అంగీకరించే వాళ్లకోసం వెతకాలి.
యేసు మళ్లీ ప్రార్థన గురించి మాట్లాడుతూ, పట్టుదలగా ప్రార్థించడం ఎందుకు ప్రాముఖ్యమో చెప్పాడు. ఆయన ఇలా అన్నాడు: “అడుగుతూ ఉండండి, మీకు ఇవ్వబడుతుంది.” ప్రార్థనలకు జవాబు ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడని నొక్కిచెప్తూ యేసు ఇలా అన్నాడు: “మీలో ఎవరైనా, మీ కుమారుడు రొట్టెను అడిగితే రాయిని ఇస్తారా? . . . మీరు చెడ్డవాళ్లయినా మీ పిల్లలకు మంచి బహుమతులు ఇవ్వడం మీకు తెలుసు, అలాంటిది పరలోకంలో ఉన్న మీ తండ్రి తనను అడిగేవాళ్లకు ఇంకెంతగా మంచి బహుమతులు ఇస్తాడో కదా!”—మత్తయి 7:7-11.
ఆ తర్వాత ప్రవర్తనకు సంబంధించి యేసు ఇచ్చిన ఈ నియమం ఎంతో పేరుగాంచింది: “ఇతరులు మీతో ఎలా వ్యవహరించాలని మీరు కోరుకుంటారో మీరూ వాళ్లతో అలాగే వ్యవహరించండి.” మనందరం ఆ చక్కటి ఉపదేశాన్ని మనసులో ఉంచుకుని, దాన్ని పాటిస్తే ఎంత బాగుంటుందో కదా! కానీ అది అంత తేలిక కాదు. యేసు ఇచ్చిన ఈ నిర్దేశంలో అది స్పష్టమౌతుంది: “ఇరుకు ద్వారం గుండా వెళ్లండి; ఎందుకంటే నాశనానికి నడిపించే ద్వారం వెడల్పుగా, ఆ దారి విశాలంగా ఉంది; చాలామంది దాని గుండా వెళ్తున్నారు. అయితే జీవానికి నడిపించే ద్వారం ఇరుకుగా, ఆ దారి కష్టంగా ఉంది; కొంతమందే దాన్ని కనుక్కుంటున్నారు.”—మత్తయి 7:12-14.
జీవానికి నడిపించే మార్గం నుండి శిష్యుల్ని పక్కదారి పట్టించడానికి ప్రయత్నించేవాళ్లు ఉంటారు. అందుకే యేసు ఇలా హెచ్చరించాడు: “గొర్రె తోలు కప్పుకొని మీ దగ్గరికి వచ్చే అబద్ధ ప్రవక్తల విషయంలో జాగ్రత్తగా ఉండండి, లోలోపల వాళ్లు క్రూరమైన తోడేళ్లు.” (మత్తయి 7:15) చెట్టు మంచిదో కాదో దాని పండ్లను బట్టి తెలుసుకోవచ్చని యేసు అన్నాడు. అలాగే అబద్ధ ప్రవక్తల్ని కూడా వాళ్ల బోధల్ని బట్టి, పనుల్ని బట్టి గుర్తుపట్టవచ్చు. అవును, ఒక వ్యక్తి తన శిష్యుడా కాదా అనేది కేవలం అతని మాటల్ని బట్టే కాదుగానీ, పనుల్ని బట్టి కూడా తెలుస్తుందని యేసు వివరించాడు. కొంతమంది యేసు తమ ప్రభువని చెప్పుకుంటారు కానీ దేవుని ఇష్టాన్ని చేయరు. మరి వాళ్ల సంగతేంటి? యేసు ఇలా చెప్పాడు: “నేను వాళ్లతో, ‘అక్రమంగా నడుచుకునే వాళ్లారా, మీరు ఎవరో నాకు అస్సలు తెలీదు, నా దగ్గర నుండి వెళ్లిపోండి!’ అని అంటాను.”—మత్తయి 7:23.
యేసు తన ప్రసంగాన్ని ఇలా ముగించాడు: “కాబట్టి, నేను చెప్పే ఈ మాటలు విని వాటిని పాటించే ప్రతీ వ్యక్తి, బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిగల వ్యక్తి లాంటివాడు. పెద్ద వర్షం కురిసి, వరదలు వచ్చి, భయంకరంగా గాలులు వీచినా ఆ ఇల్లు కూలిపోలేదు, ఎందుకంటే దాని పునాది బండ మీద వేయబడింది.” (మత్తయి 7:24, 25) ఆ ఇల్లు ఎందుకు నిలిచింది? ఎందుకంటే ఆ వ్యక్తి, “ఇల్లు కట్టడానికి లోతుగా తవ్వి బండ మీద పునాది” వేశాడు. (లూకా 6:48) కాబట్టి మనం యేసు మాటల్ని వింటే సరిపోదు, వాటిని ‘పాటించడానికి’ తీవ్రంగా కృషిచేయాలి.
మరి, “ఈ మాటలు విని వాటిని పాటించని” వ్యక్తి సంగతేంటి? అతను “ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న తెలివితక్కువ వ్యక్తి లాంటివాడు.” (మత్తయి 7:26) వర్షం, వరదలు, గాలులు వస్తే ఆ ఇల్లు కూలిపోతుంది.
యేసు ఈ ప్రసంగంలో బోధించిన తీరు చూసి ప్రజలు చాలా ఆశ్చర్యపోయారు. ఆయన మతనాయకుల్లా కాకుండా అధికారం ఉన్నవాడిలా బోధించాడు. బహుశా ఆ ప్రసంగం విన్నవాళ్లలో చాలామంది ఆయన శిష్యులుగా మారివుంటారు.