శాంతికి ఎలాంటి అవకాశములున్నవి?
వార్తా పత్రిక ముఖ్యాంశములను ప్రక్కకుపెట్టి, మనలో అనేకమంది గమనించినట్లు నిజమైన శాంతికి మానవులు యింకా అతి దూరంగా ఉన్నారనునది వాస్తవమే. ఆఫ్ఘనిస్తాన్‌నుండి విదేశీ సైన్యములను ఉపసంహరించి నంతమాత్రమున ఆ దేశమునకు శాంతి లభించలేదు. ఫిలిపైన్స్, సూడాన్, ఇశ్రాయేల్, దక్షిణ ఐర్లాండు, లెబనాన్ మరియు శ్రీలంక, పేర్కొనడానికి కొన్నిదేశాలైనను వీటియందు ఏదోఒక విధమైన పోరాటము ఇంకనూ కొనసాగుచున్నది.
అనేకమంది ప్రజలు యుద్ధమునకు బదులు శాంతిని కోరుచున్నను, శాంతి ఎందుకు లభించకున్నది? శాంతిని తెచ్చుటలో రాజకీయ నాయకులు అనేక శతాబ్దములనుండి వివిధ మార్గములు ప్రయత్నించినను, వారియత్నములు ఎల్లప్పుడు విఫలమైనవి. ఎందుకు? కొన్ని ఉదాహరణలపై దృష్టిని సాధించి చూచెదము.
మతము మరియు చట్టముద్వారా శాంతి
శాంతి స్థాపనలో రోమాసామ్రాజ్యము విజయవంతమైన కార్యసాధన చేసెనని కొందరు తలంతురు. దాని ఆధ్వర్యములో, స్థిరమైన చట్టముయొక్క అనుసంధానము, మార్చదగు పాలనానిర్వహణ, బలమైన దళము, చక్కగా నిర్మించబడిన రహదారులు పాక్స్ రోమనా (రోమా శాంతి) అని పేరుగాంచిన అంతర్జాతీయ స్థిరత్వము పశ్చిమాసియా, ఆఫ్రికా మరియు ఐరోపా ప్రాంతమంతటా కొన్ని శతాబ్దముల వరకు కలిగియుండునట్లు చేసినవి. అయినను, రోమా సామ్రాజ్యము తుదకు అంతర్గత దుర్నీతికి, బాహ్య ముట్టడులకులోనై రోమా శాంతి పటాపంచలయ్యింది.
మానవ ప్రయత్నముల చేదు సత్యమును ఇది దృష్టాంతపరచుచున్నది. తొలుత ఆశాజనకమైన ప్రారంభమును కలిగియుండి, అవి సామాన్యంగా క్షీణించిపోవుచున్నవి. దేవుడు తానే యిట్లనెను: “నరుల హృదయాలోచన వారి బాల్యమునుండి చెడ్డది,” మరి కాలంగడిచేకొలది ఈ చెడు ఆలోచన వృద్ధియగుచునే యున్నది. (ఆదికాండము 8:21) అంతేకాదు, ప్రవక్తయైన యిర్మీయా ఇట్లన్నాడు: “హృదయము అన్నింటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధికలది, దాని గ్రహింపగలవాడెవడు?” (యిర్మీయా 17:9) మానవులను గూర్చి ముందుగా చెప్పజాలము. ఒకవ్యక్తిలోని మంచి దృక్పధములు ఇతరుల స్వార్థకోరికలు లేదా అసూయ మూలంగా పెడత్రోవపట్టగలవు లేదా ఉన్నత ప్రమాణములు కలిగిన పాలకుడు తానే చెడిపోవచ్చును. అందునుబట్టి, ఎన్నటికైనా మానవులు శాంతిని ఎట్లు తేగల్గుదురు?
సా.శ. పూ. మూడవ శతాబ్దములో, ఇండియానందలి ఒక రాజ్యమునుండి శాంతికి సంబంధించిన అద్భుతప్రయత్నమునుగూర్చి పేర్కొనబడెను. అశోకుడనే శక్తివంతుడైన పాలకుడు యుద్ధము, రక్తపాతముద్వారా అతిపెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించాడు. పిమ్మట, అతడు బౌద్ధమత సిద్ధాంతాలకు మారినట్లు నివేదిక తెల్పుచున్నది. యుద్ధాన్ని నిషేధించి, తన సామ్రాజ్యమందంతటా తన ప్రజలు మంచి జీవితములను జీవించడానికి తోడ్పడు మాటలను చెక్కిన స్థూపములను నిలువబెట్టించాడు. అతని సామ్రాజ్యము శాంతి, సౌభాగ్యాలతో నిండినట్లు కన్పించింది.
అశోకుని మార్గమే శాంతికి మూలమైయున్నదా? విచారకరంగా, కాదని రుజువైనది. చక్రవర్తి చనిపోగానే, అతని శాంతి అతనితోనే అంతమైనది. అతని సామ్రాజ్యము శిధిలమైపోయింది. మంచి దృక్పధములను కలిగిన సమర్థుడైన పాలకుని వ్యయప్రయాసలు కూడా తుదకు నిరుత్సాపర్చును, ఎందుకనగా అతడు చనిపోవలసియున్నదని యిది విశదపరచినది. ప్రసంగి గ్రంథకర్త ఈ సమస్యనుగూర్చి ఇట్లు పేర్కొన్నాడు: “నేను. . .ప్రయాసపడి చేసిన పనులన్నింటిని నాతరువాత వచ్చువానికి నేను విడిచిపెట్టవలెనని తెలిసికొని నేను వాటియందు అసహ్యపడితిని. వాడు జ్ఞానముగలవాడైయుండునో బుద్ధిహీనుడై యుండునో అది ఎవనికి తెలియును? అయితే సూర్యుని క్రింద నేను ప్రయాసపడి జ్ఞానముచేత సంపాదించుకొన్న నా కష్టఫలమంతటి మీదనువాడు అధికారియై యుండును; ఇదియును వ్యర్థమే.”—ప్రసంగి 2:18, 19.
అవును, మానవుడు శాశ్వత శాంతిని తెచ్చుటకు మర్త్యమైన అతని జీవితము ఒక అసాధ్యమైన ఆటంకముగానున్నది. ఈ విషయమై కీర్తనల గ్రంథకర్త సలహా నిశ్చయంగా జ్ఞానయుక్తమైయున్నది: “రాజులచేతనైనను నరులచేతనైనను రక్షణ కలుగదు వారిని నమ్ముకొనకుడి. వారి ప్రాణము వెడలిపోవును వారు మంటి పాలగుదురు, వారి సంకల్పములు నాడే నశించును.”—కీర్తన 146:3, 4.
శాంతినిగూర్చిన తదితర ప్రయత్నములు
శాంతిని నెలకొల్పుటలో మానవుడు తన కృషియందు ఎందుకు విఫలుడగుచున్నాడో మరి ఇతర మానవ యత్నములుకూడ వివరించుచున్నవి. దృష్టాంతమునకు, పదవ శతాబ్దములో, దేవునియొక్క శాంతియని పిలువబడే ఒక ఉద్యమము ఐరోపాలో మొదలైనది. చర్చి ఆస్తిని కాపాడుటకు ఏర్పాటుచేయబడినదై కలహములు లేకుండా చేయు ఒడంబడికగా వృద్ధిచెంది, 12వ శతాబ్ద మధ్యకాలానికి ఐరోపాలోని చాలా ప్రాంతములకు అది వ్యాపించింది.
“అధికార సమతుల్యమని” మరో ఆశయానికి పేరిడిరి. ఈ సిద్ధాంతము ననుసరించి—ఐరోపావంటి సమాజదేశాలలో రాష్ట్రములమధ్య ఎక్కువ లేదా తక్కువకాని సమతుల్యమైన అధికారమును కలిగియుండుటద్వారా యుద్ధాన్ని నిరుత్సాహపర్చారు. ఒక బలమైన దేశము బలహీన దేశాన్ని బెదిరించినట్లయిన, కలహము ఆరంభించబోవు వానిని నిరుత్సాహపరచుటకు మరొక బలమైన దేశము ఆ బలహీనమైన దానితో తాత్కాలికంగా కలిసిపోవును. నెపోలియన్ చేసిన యుద్ధముల ముగింపునుండి 1914లో మొదట ప్రపంచ యుద్ధము చెలరేగేవరకు ఈ సూత్రమే ఐరోపా సంబంధాలను నడిపించినది.
ఆ యుద్ధానంతరము దేశములు ఒకదానిపై మరొకటి తలపడేబదులు తమ విభేధాలను గూర్చి మాట్లాడుకునే న్యాయసభగా, నానాజాతి సమితి స్థాపించబడింది. రెండవ ప్రపంచయుద్ధము ప్రారంభమైనప్పుడు, సమితి పనిచేయడం మానివేసింది; కాని యుద్ధానంతరము దాని జీవము నేటికిని నిలిచియున్న ఐక్యరాజ్యసమితిలో పునరుజ్జీవముపొందెను.
అయినను, నిజమైన లేదా శాశ్వత శాంతిని తెచ్చుటలో ఈ ప్రయత్నములన్నీ విఫలమైనవి. ఐరోపాలో దేవునియొక్క శాంతి అనే ఉద్యమము నిలిచియుండగనే, రక్తసిక్త క్రూసేడ్లతో ఐరోపావాసులు ముస్లింలతో పోరాడిరి. అధికార సమతుల్యముచేత ఐరోపాలో శాంతిని కాపాడుటకు రాజకీయవేత్తలు కృషిచేయుచుండగా, ఐరోపా వెలుపల వారు యుద్ధము చేయుచు సామ్రాజ్యాలను నెలకొల్పుకొనుచున్నారు. నానాజాతిసమితి రెండవ ప్రపంచ యుద్ధమును నిలుపజాలలేకపోయెను మరియు కంపూచియాలో ఘోరమైన జనసంహారమును లేదా కొరియా, నైజీరియ, వియత్నామ్, జైరి వంటి ప్రాంతములందలి పోరాటములను ఐక్యరాజ్యసమితి ఆపలేకపోయింది.
నిజమే, రాజకీయ నాయకులు నేటివరకుచేసిన ఉత్తమ శాంతి యత్నములన్నీ విఫలమైనవి. మర్త్యమైన జీవితము, తమ మరియు యితరుల వైఫల్యములచే బంధములు వేయబడినందున శాశ్వత శాంతిని ఎలా తేవలెనో పాలకులకు తెలియకున్నది. అయినప్పటికి, అలా జరుగకపోయినాకూడ, రాజకీయ నాయకులు శాంతిని తేలేరు. ఎందుకు తేలేరు? ఎందుకనగా నిజంగానే ఘోరమైన మరొక విఘాతమున్నది.
ఒక మెరుగైన శక్తి శాంతిని ఆటంకపరచుచున్నది.
ఈ విఘాతమునుగూర్చి బైబిలు ఇట్లనుచున్నది: “లోకమంతయు దుష్టుని యందున్నది.” (1 యోహాను 5:19) ఈ దుష్టుడు మనకంటె ఎంతో శక్తిమంతుడైన మానవాతీత ఆత్మీయ ప్రాణియగు అపవాదియైన సాతాను. ప్రారంభమునుండి, సాతాను అబద్ధము, నరహత్యవంటి వాటితో సంబంధమును కలిగియుండెను. (ఆదికాండము 3:1-6; యోహాను 8:44) మరుగైనదైనను లోక వ్యవహారములపై అతని శక్తివంతమైన ప్రభావమునుగూర్చి ఇతర ప్రేరేపిత వ్యాఖ్యాతలు రూఢిగా చెప్పుచున్నారు. పౌలు అతనిని “యుగసంబంధమైన దేవత” “వాయుమండల సంబంధమైన అధిపతి” అని పిలిచెను. (2 కొరింథీయులు 4:4; ఎఫెసీయులు 2:2) యేసు అతనిని ఒకటికంటె ఎక్కువమార్లు “ఈ లోకాధికారియని” పిలిచెను.—యోహాను 12:31; 14:30; 16:11.
లోకము సాతానుచేతిలో ఉన్నది గనుక, మానవ రాజకీయనాయకులు శాశ్వత శాంతిని తీసుకువచ్చు అవకాశమే లేదు. శాంతి ఇక ఎన్నటికి రాదని దీని భావమా? మానవులను ఎవరైనా శాంతికి నడుపగలరా? (w90 4/1)
[5వ పేజీలోని బాక్సు]
ఒక పాలకుడు ఎంతో జ్ఞానముగలవాడై, ఉన్నత ప్రమాణములు గలవాడైనను చివరకు అతడు మరణించును పిమ్మట తరచూ తక్కువ సామర్థ్యముగల వారును అల్ప ప్రమాణములుగల యితరులు అధికారమునకు వచ్చుచున్నారు
[6వ పేజీలోని బాక్సు]
శాంతికి ఒకేఒక అతిపెద్ద విఘాతము అపవాదియైన సాతాను
[5వ పేజీలోని చిత్రసౌజన్యం]
U.S. National Archives photo