యేసుయొక్క దైవభక్తి మాదిరిని అనుసరించుము
“నిరాక్షేపముగా దైవభక్తినిగూర్చిన మర్మము గొప్పదైయున్నది: ఆయన (యేసు) సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యెను”—1 తిమోతి 3:16.
1. (ఎ) ఏ ప్రశ్న 4,000 సంవత్సరములకు మించి సమాధానము లేకుండా పోయెను? (బి) ఎప్పుడు మరియు ఎట్లు సమాధానము ఇవ్వబడెను?
ఇది 4,000 సంవత్సరాలు మించి సమాధానము లేకుండ పోయిన ప్రశ్న. మొదటి మానవుడగు, ఆదాము, యథార్థతను కాపాడుకొనుటలో విఫలుడైన సమయమునుండి ఉన్నప్రశ్న: దైవభక్తి మానవుల మధ్య ఎట్లు ప్రత్యక్షమగును? చివరిగా, సా.శ. మొదటి శతాబ్దములో దేవునికుమారుడు భూమిమీదికి వచ్చుటతో సమాధానము లభించినది. ప్రతి తలంపులో, మాటలో మరియు క్రియలో యెహోవాతో తనకుగల వ్యక్తిగత అనుబంధమును యేసుక్రీస్తు ప్రదర్శించెను. అట్లు ఆయన ‘దైవభక్తిని గూర్చిన మర్మమును’ బయలుపరచి అట్టి భక్తిని కాపాడుకొనుటకు సమర్పించుకొనిన మానవులు అవలంభించు మార్గమును ప్రదర్శించెను.—1 తిమోతి 3:16.
2. దైవభక్తిని వెంబడించుటలో యేసు మాదిరిని సమీపముగా ఎందుకు తలంచవలెను?
2 సమర్పించుకొని బాప్తిస్మము తీసుకొనిన క్రైస్తవులుగా దైవభక్తిని వెంబడించుటలో మనము యేసుమాదిరిని “తలంచుకొనుట” మంచిది. (హెబ్రీయులు 12:3) ఎందుకు? రెండు కారణములున్నవి. మొదటిది, దైవభక్తిని అలవరచుకొనుటలో యేసు మాదిరి మనకు సహాయపడును. ఏ ఒక్కరి కంటేకూడ తన తండ్రిని యేసు బాగుగా ఎరిగియున్నాడు. (యోహాను 1:18) “నన్నుచూచినవాడు తండ్రిని చూచియున్నాడు” అని చెప్పగలిగినంతగా, యెహోవా మార్గములను మరియు లక్షణములను యేసు ఎంతో సమీపముగా అనుకరించెను. (యోహాను 14:9) యేసు జీవితము మరియు పరిచర్యనుండి, యెహోవా యొక్క మృదువైన లక్షణముల యెడల లోతైన మెప్పును పొందగలిగి ప్రేమగల మన సృష్టికర్తతో మన వ్యక్తిగత అనుబంధమును బలపరచుకొనగలము. రెండవది, దైవభక్తిని ప్రదర్శించుటలో యేసు మాదిరి మనకు సహాయపడగలదు. దైవభక్తిని ప్రత్యక్షపరచు ప్రవర్తనయొక్క పరిపూర్ణమైనమాదిరిని ఆయన ఉంచెను. అట్లు మనము ఎట్లు ‘క్రీస్తును ధరించుకొనగలమో,’ అనగా ఆయన పద్దతిని తీసికొని ఆయన మాదిరిని ఎట్లు అనుకరించగలమో బాగుగా తలంచుకొందుము.—రోమీయులు 13:14.
3. మన వ్యక్తిగత పఠన కార్యక్రమములో ఏది చేరియుండవలెను, మరియు ఎందుకు?
3 యేసు చెప్పిన మరియు చేసిన ప్రతిది వ్రాతపూర్వకముగా భద్రపరచబడలేదు. (యోహాను 21:5) అందుకని, దైవప్రేరేపణచేత నమోదుచేయబడిన విషయములు మనకు ప్రత్యేకముగా ఆసక్తికరమైనవిగా యుండవలెను. కనుక వ్యక్తిగత బైబిల్ పఠనములో యేసు జీవితమును తెల్పు సువార్తలను క్రమముగా చదువుటను చేర్చవలెను. దైవభక్తిని వెంబడించుటలో అట్టి పఠనము మనకు సహాయపడుటకు మనము చదువుదానిని మెప్పుతో ప్రతిబింబించుటకు మనము సమయము తీసికొనవలెను. కనబడుదానిని మించి చూచుటకు మనము చురుకుగా ఉండవలెను.
తండ్రివలె, కుమారునివలె
4. (ఎ) యేసు ఆప్యాయత మరియు లోతైన భావముగల ఒక వ్యక్తియని ఏమిచూపించును? (బి) ఇతరులతో వ్యవహరించునపుడు యేసు తనంతటతాను ఏమిచేసెను?
4 ఒక ఉదాహరణను తలంచుము. ఆప్యాయత మరియు లోతైన భావములుగల ఒకమనిషి, యేసు. అన్ని వయస్సులవారు మరియు వివిధరకములైన మనుష్యులు ఆయనను స్వేచ్ఛగా సమీపించగలుగుచున్నారని మార్కు 10:1, 10, 13, 17 మరియు 35నుండి గమనించుము. ఒకటికంటె ఎక్కువ సందర్భములలో ఆయన పిల్లలను తన ఒడిలోనికి తీసికొనియున్నాడు. (మార్కు 9:36; 10:16) పిల్లలతో సహా ప్రజలందరు ఆయనతో స్వేచ్ఛగా ఎందుకు ఉంటున్నారు? ఎందుకనగా వారియందు ఆయనకున్న యథార్థమైన మరియు నిజమైన ఆసక్తి. (మార్కు 1:40, 41) అవసరములోనున్న ఇతరులను ఆయనే ముందు అనేకసార్లు సమీపించుట దీనిని రుజువు చేయుచున్నది. అట్లు నాయీనులోని ఆ విధవరాలుయొక్క చనిపోయిన కుమారుడు మోసుకొని పోబడుతున్నపుడు ఆయన ఆమెను “చూచి,” అక్కడకు “సమీపించి” ఆ బాలుని పునరుత్థానముచేసెనని, మనము చదివెదము. ఆయనను అట్లు చేయుమని ఎవరును అడిగినట్లు తెల్పబడలేదు. (లూకా 7:13-15) ఎవరును అడుగకుండానే బలహీనతచేత ఒంగిపోయిన ఒకస్త్రీని మరియు జలోదర వ్యాధితో బాధపడుచున్న ఒక పురుషుని ఆయన స్వస్థపరచెను. —లూకా 13:11-13; 14:1-4.
5. యేసు పరిచర్యయొక్క ఈ వ్రాతలు యెహోవా లక్షణములను మరియు మార్గములను గూర్చి ఏమి చెప్పుచున్నవి?
5 అట్టి సంఘటనలనుగూర్చి చదువునపుడు ఆగి, నిన్ను నీవు ఇట్లు ప్రశ్నించుకొనుము: ‘యేసు తన తండ్రిని సంపూర్ణముగా అనుకరించెను గనుక, ఈ విషయములు, యెహోవా యొక్క లక్షణములను మరియు ఆయన మార్గములను గూర్చి నాకేమి తెలియజేయును? యెహోవా ఆప్యాయత మరియు లోతైన భావముగల దేవుడు అని అవి మనకు నిశ్చయత నొసంగవలెను. మానవుని కుటుంబములోని ఆయన ఆసక్తియొక్క తీవ్రత, వారితో వ్యవహరించుటలో తనంతట తానేచర్య తీసుకొనునట్లు ఆయనను కదలించినది. “అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనము”గా తనకుమారుని, యిచ్చుటలో ఆయన భయపడనవసరము లేకుండెను. (మత్తయి 20:28; యోహాను 3:16) ప్రేమతో ఆయనను సేవించువారికి “సన్నిహితుడగు” అవకాశములకొరకై ఆయన చూచును. (ద్వితీయోపదేశకాండము 10:15) బైబిల్ చెప్పునట్లుగా: “తనయెడల యథార్థహృదయముగలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది.”—2 వృత్తాంతములు 16:9.
6. ఆయన కుమారుని ద్వారా మాదిరిగా చూపబడిన యెహోవాయొక్క ఆప్యాయత మరియు లోతైన భావమును ప్రతిబింబించినపుడు ఫలితమేమైయుండును?
6 ఈ విధముగా ఆయనకుమారుడు చూపిన మాదిరివలె, యెహోవాయొక్క ఆప్యాయత మరియు లోతైన భావమును, ప్రతిబింబించుట నీహృదయమును తాకి, ఆయన మృదువైన మరియు ఆకర్షణీయమైన లక్షణములయెడల కలుగు గొప్పమెప్పుచే ఆ హృదయము నింపబడును. అప్పుడు అది నిన్ను ఆయనకు సమీపముచేయును. ఆయనను అన్ని కాలములలో మరియు అన్ని పరిస్థితులలో స్వేచ్ఛగా సమీపించుటకు నీవు కదలింపబడుదువు. (కీర్తన 65:2) ఆయన తోటి నీ వ్యక్తిగత సంబంధమును అది బలపరచును.
7. యెహోవాయొక్క ఆప్యాయత మరియు లోతైన భావములను ప్రతిబింబించిన తరువాత నిన్ను నీవు ఏమి ప్రశ్నించుకొనవలెను, ఎందుకు?
7 అయినను, గుర్తుంచుకో, దైవభక్తిలో కేవలము ఆరాధన భావముకంటే మించి విషయములు చేరియున్నవి. బైబిల్ పండితుడైన, ఆర్. లెన్‌స్‌కి గమనించినట్లు, అది, “మన లోతైన గౌరవము, ఆరాధన స్వభావము మరియు దానినుండి ఉద్భవించు క్రియలను” కలిగియున్నది. (ఇటాలిక్కులు మావి.) యేసుచూపినట్టి యెహోవా యొక్క ఆప్యాయత మరియు లోతైన భావమును ప్రతిబింబించిన తరువాత నిన్నునీవు ఇట్లు ప్రశ్నించుకొనుము: ‘ఈ విషయములలో నేను ఎట్లు సమీపముగా యెహోవావలె ఉండగలను? ఇతరులు నన్ను సమీపించదగు వానిగా కనుగొనుచున్నారా?’ నీవు ఒక తండ్రివి లేక తల్లివైనట్లయితే నీ పిల్లలు నిన్ను సమీపించదగువ్యక్తిగా చూడవలెను. మరియు నీవు ఒక సంఘ పెద్దవైనట్లయితే, నీవు తప్పక సమీపించదగు వానిగా ఉండవలెను. అయితే నీవు బాగుగా సమీపించదగువానిగా నుండునట్లు చేయునదేది? మరియు ఆప్యాయతగాను, లోతైన భావముగలవానిగా చేయునదేది? ఒక యథార్థమైన మరియు నిజమైన ఆసక్తిని నీవు ఇతరులలో పెంపొందించుకొనవలెను. నీవు ఇతరులను వాస్తవముగా లక్ష్యపెట్టి వారికొరకు త్యాగముచేయుటకు ఇష్టపడునప్పుడు, వారు దానిని గమనించి మీకు సమీపముగా నుండు భావమును కలిగియుందురు.
8. (ఎ) యేసును గూర్చి బైబిల్‌లోని సంఘటనలను చదివినపుడు నీ మనస్సులో ఏమి ఉంచుకొనవలెను? (బి) ఫుట్‌నోట్‌లోని లేఖనములనుండి యెహోవానుగూర్చి ఏమి నేర్చుకొందుము?
8 కనుక నీవు యేసును గూర్చిన బైబిల్ సంఘటనలను చదువునపుడు, ఆయన చెప్పిన మరియు చేసిన సంగతులనుండి, యెహోవాను ఒక వ్యక్తిగా బాగుగా తెలిసికొనగలవని మనస్సునందుంచుకొనుము.a యేసు ప్రతిబింబించినట్లుగా, మరియెక్కువగా నీవు ఆయనవలెనుండుటకు ప్రయత్నించుటకు, దేవునిలక్షణముల కొరకైన నీ గుణగ్రహణ నిన్ను కదిలించినప్పుడు, నీవు దైవభక్తి రుజువును యిచ్చుచున్న వాడవగుదువు.
కుటుంబ సభ్యులయెడల దైవభక్తిని అభ్యసించుట
9, 10. (ఎ) ఆయన మరణమునకు ముందు తన తల్లియైన మరియ కొరకై యేసుయొక్క ప్రేమ మరియు చింత ఎట్లు వ్యక్తపరచబడెను? (బి) మరియ యొక్క సంరక్షణను యేసు బాహాటముగా అపొస్తలుడైన యోహానుకు ఎందుకు అప్పగించెను, ఆయన స్వంత శరీర సంబంధులైన సహోదరులకు ఎందుకు అప్పగించలేదు?
9 యేసుక్రీస్తు యొక్క జీవితము మరియు పరిచర్య, దైవభక్తి ఎట్లు ప్రత్యక్షపరచబడవలెనో వెల్లడిపరచును. హృదయమును తాకు ఒక ఉదాహరణ యోహాను 19:25-27, (NW) నందు నమోదైయున్నది, దానిని మనమిట్లు చదువగలము: “ఆయన తల్లియు, ఆయన తల్లి సహోదరియు, క్లొపా భార్యయునైన మరియయు, మగ్దలేనే మరియయు యేసు హింసకొయ్యవద్ద నిలుచుండిరి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి ‘అమ్మా, ఇదిగో నీ కుమారుడు’ అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ‘యిదిగో నీ తల్లి’ అని చెప్పెను. ఆ గడియనుండి ఆ శిష్యుడు ఆమెను తన యింట చేర్చుకొనెను.”
10 దాని ఊహించుము! తన భూసంబంధమైన జీవితమును అప్పగించే ముందు తన తల్లియైన మరియ (ఆ సమయమునకు ఆమె విధవరాలై యుండవచ్చును.) సంరక్షణను తన ప్రియ అపొస్తలుడైన యోహానుకు అప్పగించునట్లు ఆయనప్రేమ మరియు చింత నడిపించెను. అయితే యోహానే ఎందుకు, యేసు తోడబుట్టిన సహోదరులు ఎందుకు కాదు? ఎందుకనగా యేసు, కేవలము మరియయొక్క భౌతిక అవసరముల యెడలనే గాక ప్రాముఖ్యముగా ఆమె ఆత్మీయక్షేమము యెడల చింతను కలిగియున్నాడు. మరియు అపొస్తలుడైన యోహాను (బహుశా పినతండ్రికొడుకు) తన విశ్వాసమును రుజువుపరచుకొనెను, కాగా యేసు శరీరసంబంధమైన సహోదరులు అప్పటికి యింకా విశ్వాసులైనట్లు సూచనలేదు.—మత్తయి 12:46-50; యోహాను 7:5.
11. (ఎ) పౌలు చెప్పిన దాని ప్రకారము ఒక క్రైస్తవుడు దైవభక్తిని తన స్వంత గృహములో ఎట్లు అభ్యసించును? (బి) నిజమైన క్రైస్తవుడు వృద్ధులైన తల్లిదండ్రులకు సంరక్షణ ఎందుకు ఏర్పరచును?
11 ఇది దైవభక్తియొక్క ప్రత్యక్షత ఎట్లయినది? అపొస్తలుడైన పౌలు వివరించుచున్నాడు: “నిజముగా అనాధలైన విధవరాండ్రను సన్మానింపుము. అయితే ఏ విధవరాలికైన పిల్లలు గాని మనుమలుగాని యుండినయెడల వీరు మొదట తమ ఇంటివారి యెడల [దైవ]భక్తి కనుపరచుటకును, తమ తలిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును, నేర్చుకొనవలెను; ఇది దేవుని దృష్టికనుకూలమైయున్నది. (1 తిమోతి 5:3, 4) పౌలు చెప్పినట్లు, అవసరము ఏర్పడినపుడు తలిదండ్రుల పోషణకు సంబంధించి వారికి భౌతిక ఊతనిచ్చుట దైవభక్తిని ప్రదర్శించుటగా యుండును. అది ఎట్లు? కుటుంబ ఏర్పాటుకు మూలమైన యెహోవా, తమ తలిదండ్రులను సన్మానించవలెనని పిల్లలను ఆజ్ఞాపించుచున్నాడు. (ఎఫెసీయులు 3:14, 15; 6:1-3) కనుక అట్టి కుటుంబ బాధ్యతనుస్వీకరించుట, ఒకని తలిదండ్రులను అతడు ప్రేమించుచున్నాడని చూపుటయేగాక దేవునియెడల మర్యాద మరియు ఆయన ఆజ్ఞలకు విధేయతను ప్రదర్శించుచున్నవాడగును.—కొలస్సీ. 3:20తో పోల్చుము.
12. వృద్ధులైన తల్లిదండ్రులయెడల దైవభక్తిని నీవు ఎట్లు అభ్యసించగలవు, మరియు ఆ విషయములో ఎట్టి స్వభావమును కలిగియుండవలెను?
12 అయితే, కుటుంబ సభ్యులయెడల నీవు దైవభక్తిని ఎట్లు అభ్యసించగలవు? యేసు చేసినట్లు, దీనియందు వృద్ధులైన తలిదండ్రుల భౌతిక మరియు ఆత్మీయ అవసరముల సంరక్షణకై ఏర్పాట్లుచేయుట ఇమిడియున్నది. అట్లు చేయుటలో విఫలమగుట దైవభక్తి లోపించునట్లు తెలుపును. (2 తిమోతి 3:2, 3, 5 పోల్చుము.) సమర్పించుకొనిన క్రైస్తవుడు, అవసరములోనున్న తలిదండ్రులకు, కేవలము దయచొప్పున లేక కర్తవ్యముచొప్పున, అవసరములను తీర్చడుగాని తనకుటుంబమును ప్రేమించుటనుబట్టి మరియు అట్టి బాధ్యతవహించుటపై యెహోవా చూపిన ఎక్కువ శ్రద్ధనుబట్టి వారిని సంరక్షించును. అట్లు వృద్ధులైన తలిదండ్రులను సంరక్షించుట దైవభక్తిని వ్యక్తపరచు ఒక మార్గమైయున్నది.b
13. ఒక క్రైస్తవ తండ్రి తనకుటుంబముయెడల దైవభక్తిని ఎట్లు అభ్యసించగలడు?
13 గృహములో దైవభక్తిని ఇతరమార్గములలో కూడా అభ్యసించవచ్చు. ఉదాహరణకు ఒక క్రైస్తవ తండ్రి తన కుటుంబమునకు భౌతికముగా, భావోద్రేకముగా మరియు ఆత్మీయముగా తగినదానిని అందించు బాధ్యతను కలిగియున్నాడు. కనుక, భౌతిక అవసరముల నందించుటయేగాక, ప్రేమపూర్వకముగా క్రమమైన ఒక కుటుంబ బైబిలు పఠనమును ఆయన ఏర్పాటుచేయును. తనకుటుంబముతో ప్రాంతీయసేవయందు క్రమముగా పాల్గొనుటకు కాలపట్టికను ఏర్పరచును. విశ్రాంతి మరియు వినోదమునకు సంబంధించి వారి అవసరమును గమనించుటలో సమతూకముగా నుండును. సంఘమునకు చెందు కార్యములో లేక కర్తవ్యములను తనకుటుంబమును నిర్లక్ష్యము చేయునంతగా అనుమతించక వేటికి ప్రాధాన్యతనివ్వవలెనో వాటికే వివేకముగా ప్రాముఖ్యతనిచ్చును. (1 తిమోతి 3:5, 12) దీనినంతటిని ఆయన ఎందుకు చేయును? కేవలము కర్తవ్యమునుబట్టికాక తనకుటుంబముయెడల ప్రేమనుబట్టి చేయును. ఒక కుటుంబమును సంరక్షించుటపై యెహోవా పెట్టిన ప్రాముఖ్యతను ఆయన గుర్తించును. అట్లు ఆయన భర్తగా మరియు తండ్రిగా బాధ్యతను నెరవేర్చుటచే అతను దైవభక్తిని అభ్యసించుచున్నాడు.
14. ఒక క్రైస్తవ భార్య తన గృహములో దైవభక్తిని ఎట్లు ప్రత్యక్షపరచగలదు?
14 ఇంటివద్ద దైవభక్తిని అభ్యసించు బాధ్యతను క్రైస్తవ భార్యలుకూడా కలిగియున్నారు ఎట్లు? ఒక భార్య తన భర్తకు లోబడియుండవలెననియు, మరియు భర్తయెడల భయమును (లోతైనగౌరవము) కలిగియుండవలెనని బైబిల్ చెప్పుచున్నది. (ఎఫెసీయులు 5:22, 33) తనభర్త ఒక విశ్వాసికాకపోయినను ఆమె ఆయనకు లోబడియుండవలెను. (1 పేతురు 3:1) తనభర్త తీసికొను నిర్ణయములకు, దేవుని చట్టములకు వ్యతిరేకము కానంతవరకు పూర్తి మద్దతునిచ్చుటద్వారా, ఆ క్రైస్తవ స్త్రీ భార్య చూపవలసిన అట్టి విధేయతను ప్రదర్శించును. (అ.కార్యములు 5:29) ఆమె ఈ కర్తవ్యమునెందుకు అంగీకరించుచున్నది? ఆమె తన భర్తను ప్రేమించుటను బట్టియేగాక ముఖ్యముగా అది ప్రభువునుబట్టి యుక్తమైనది అని ఆమె గుర్తించును. (కొలస్సీయులకు 3:18) అట్లు తనభర్తకు యిష్టపూర్వకముగా లోబడుట దైవభక్తిని వ్యక్తపరచుటకు ఒకమార్గమైయున్నది.
“యిందునిమిత్తమే నేను బయలుదేరివచ్చితిని”
15. ఏ ఉత్తమమైన మార్గములో యేసు దైవభక్తిని ప్రత్యక్షపరచెను?
15 యేసు దైవభక్తిని ప్రదర్శించిన ఉన్నతమైన మార్గములలో ఒకటి ‘దేవునిరాజ్యసువార్తను ప్రకటించుట.’ (లూకా 4:43) సా.శ. 29లో యొర్దానునందు బాప్తిస్మము తీసుకొనిన తరువాత మూడున్నర సంవత్సరములు ఈ అతిప్రాముఖ్యమైన పనిలో యేసు గడిపెను. “యిందునిమిత్తమే గదా నేను బయలుదేరివచ్చితిని” అని ఆయన వివరించెను. (మార్కు 1:38; యోహాను 18:37) అయితే ఇది ఆయన దైవభక్తియొక్క ప్రత్యక్షత ఎట్లు ఆయెను?
16, 17. (ఎ) సువార్తను అందించుట మరియు బోధించుటయందు మిక్కుటముగా నిమఘ్నడగునట్లు యేసును ఏమి ప్రేరేపించినది? (బి) సువార్తనందించుట మరియు బోధించుటయొక్క యేసు పరిచర్య ఆయన దైవభక్తియొక్క ఒక ప్రత్యక్షత ఎందుకైనది?
16 దేవునియొక్క ప్రియమైన లక్షణములను లోతుగా మెచ్చుకొని ఆయనను నీవు ప్రేమించుచుండుటచే, ఆ దేవుని సంతోషపెట్టు మార్గములో జీవించుట దైవభక్తిలోయిమిడియున్నదని గుర్తించుకొనుము. భూమిమీద తన తుది సంవత్సరములలో సువార్తనందించుట మరియు బోధించుటయందు మిక్కుటముగా నిమఘ్నడై గడుపునట్లు యేసును ఏమి ప్రేరేపించినది? కేవలము దానిని కర్తవ్యముగాను బాధ్యతగాను తీసికొనుటను బట్టియా? ప్రజలయెడల ఆయనకు చింతయున్నదనుటలో సందేహములేదు. (మత్తయి 9:35, 36) ఆయన పరిశుద్ధాత్మ చేత అభిషేకింపబడుటద్వారా తాను తన పరిచర్యలో కొనసాగుటకు నియమింపబడెననియు, మరియు ఆజ్ఞాపింపబడెననియు ఆయన పూర్తిగా గ్రహించెను. (లూకా 4:16-21) అయినను, ఆయన ఉద్దేశ్యములు మరీ లోతుగా వెళ్లినవి.
17 “నేను తండ్రిని ప్రేమించుచున్నానని” తన భూజీవితములోని చివరిరాత్రి యేసు స్పష్టముగా తన అపొస్తలులకు తెల్పెను. (యోహాను 14:31) ఆ ప్రేమ యెహోవాలక్షణములయొక్క లోతైన మరియు సన్నిహితమైన జ్ఞానముమీద ఆధారపడియున్నది. (లూకా 10:22) లోతైన మెప్పువలన హృదయముచే ప్రేరేపింపబడి దేవుని చిత్తము చేయుటలో యేసు ఆనందమును కనుగొనెను. (కీర్తన 40:8) అది అతని “ఆహారము”—జీవమునకు ఎంతో అవసరము మరియు రుచికరమైనదిగా యుండెను. (యోహాను 4:34) స్వార్థమును మొదట పెట్టుటకు బదులు మొదట ఆ “రాజ్యమును వెదకుటలో” పరిపూర్ణమైన మాదిరిని ఆయన ఉంచెను. (మత్తయి 6:33) కనుక, అతడు ఏమి చేశాడు లేక ఎంత చేశాడు అని కాదుగాని ఆయన దానిని ఎందుకు చేశాడనునుదియే సువార్తనందించుట మరియు బోధించుటయొక్క తనపరిచర్యను ఆయన దైవభక్తికి ఒక నిదర్శనమైనదిగా చేసినది.
18. పరిచర్యలో కొంత భాగము వహించుట, తప్పక దైవభక్తియొక్క ఒక ప్రత్యక్షత ఎందుకు కాదు?
18 ఈ విషయములో యేసు మనకు విడిచిన “మాదిరిని” ఎట్లు అనుసరించగలము? (1 పేతురు 2:21) “నీవు వచ్చి నన్ను వెంబడింపుము” అను యేసు ఆహ్వానమును అంగీకరించువారు ఈ రాజ్యసువార్తను ప్రకటించి శిష్యులనుగాచేయు దైవిక ఆజ్ఞక్రింద ఉన్నారు. (లూకా 18:22; మత్తయి 24:14; 28:19, 20) సువార్తను ప్రకటించుటలో కొంతభాగము వహించుటచే మనము దైవభక్తిని వెంబడించుచున్నామని దీని భావమా? కాదు. ఈ పరిచర్యలో నామకార్థముగా లేక దానికొరకే అన్నట్లు కుటుంబసభ్యులనో లేక యితరులనో సంతోషపెట్టవలెనను ఉద్దేశ్యముతో భాగము వహించిన అది ‘దైవభక్తియొక్క క్రియగా’ పరిగణింపబడదు.—2 పేతురు 3:11.
19. (ఎ) మనము పరిచర్యలో ఏమిచేయుదము అనుదాని ప్రాథమిక కారణము ఏమైయుండవలెను? (బి) దేవునియెడల లోతుగా నాటబడిన ప్రేమచే ప్రేరేపింపబడినపుడు ఫలితములేవి?
19 యేసువలె, మన ఉద్దేశ్యములు లోతుగా వెళ్లవలెను. యేసు ఇట్లనెను: “నీవు నీ పూర్ణహృదయము (భావములు, కోరికలు, మరియు అంతరంగ పురుషుని భావములు) తోను, నీ పూర్ణాత్మ (నీ జీవితము నీవంతయు) తోను మరియు నీ పూర్ణవివేకము (మనస్సుయొక్క వివేకముగల శక్తి) తోను మరియు నీ పూర్ణబలముతోను నీదేవుడైన యెహోవాను ప్రేమింపవలెను”. దీనికి ఒక వివేకముగల శాస్త్రి యిట్లు కలిపెను: “అది. . .సర్వాంగ హోమములన్నిటికంటెను బలుల కంటెను అధికము.” (మార్కు 12:30, 33, 34) కనుక మనమేమి చేయుదము, అనునది మాత్రమేగాక ఎందుకు చేయుచున్నామనునది పరిగణింపబడును. మన శరీరములోని ప్రతిపొర చేరియున్న దేవుని కొరకైన లోతైన ప్రేమ, మనము పరిచర్యలోచేయు ప్రతిపనికి ప్రాథమికకారణము కావలెను. అట్లయినప్పుడు నామకార్థముగా భాగము వహించుట మనకు తృప్తినివ్వదు. బదులుగా మనశక్తియంతటి చొప్పున చేయుటచే దైవభక్తియొక్క లోతును ప్రదర్శించుటకు ప్రేరేపింపబడుదుము. (2 తిమోతి 2:15) అదేసమయములో, దేవునియెడల ప్రేమ మన ఉద్దేశ్యమైనప్పుడు మనపరిచర్య యితరుల పరిచర్యతో పోల్చుకొని విమర్శించువారముగా ఉండము.—గలతీయులు 6:4.
20. దైవభక్తిని వెంబడించుటలో యేసు మాదిరినుండి మనమెట్లు పూర్తి ప్రయోజనమును పొందగలము?
20 దైవభక్తియొక్క పవిత్ర మర్మమును తెల్పినందుకు యెహోవాకు మనమెంత కృతజ్ఞులము! యేసుచెప్పిన మరియు చేసిన సంగతులను జాగ్రత్తగా పఠించుటచే ఆయనను అనుకరించుటలో కృషిచేయుటచే దైవభక్తిని పూర్తి పరిమాణములో సాధకముచేయుటకు మరియు ప్రత్యక్షపరచుటకు మనము సహాయము పొందెదము. సమర్పించుకొని బాప్తిస్మము పొందినవారముగా దైవభక్తిని వెంబడించుటలో యేసుమాదిరిని మనము అనుకరించుచుండగా యెహోవా మనల్ని గొప్పగా దీవించుగాక!—1 తిమోతి 4:7, 8. (w90 3/1)
[అధస్సూచీలు]
a యెహోవాను గూర్చి మనమేమి నేర్చుకొనగలమో విచారించుటకు, మరికొన్ని ఉదాహరణల కొరకు ఈ క్రింది వృత్తాంతములను చూడుము: మత్తయి 8:2, 3; మార్కు 14:3-9; లూకా 21:1-4; మరియు యోహాను 11:33-36.
b వృద్ధులైన తలిదండ్రులయెడల దైవభక్తిని అభ్యసించుటలో చేరియున్నదాని పూర్తి చర్చకొరకు, వాచ్‌టవర్, 1987, జూన్ 1, పుటలు 13-18 చూడుము.
గుర్తుకు తెచ్చుకొందురా?
◻ దైవభక్తిని వెంబడించుటలో యేసుయొక మాదిరిని మనమెందుకు తలంచవలెను?
◻ యేసుచేత ఉదహరింపబడిన ఆప్యాయత మరియు లోతైన భావమునుండి యెహోవానుగూర్చి మనమేమి నేర్చుకొనగలము?
◻ కుటుంబసభ్యులయెడల దైవభక్తిని మనమెట్లు ప్రత్యక్షపరచగలము?
◻ మనపరిచర్యను దైవభక్తిని వ్యక్తపరచు ఒక క్రియగా చేయుటకు మన ఉద్దేశ్యము ఏమైయుండవలెను?
[21వ పేజీలోని చిత్రాలు]
ఒక క్రైస్తవ తండ్రి తనకుటుంబమునకు భావోద్రేకమైన, వస్తుదాయకమైన, మరియు ఆత్మీయమైన సంగతులను దయచేయు వాడైయుండవలెను
[23వ పేజీలోని బాక్సు/చిత్రం]
“అయితే ఏ విధవరాలికైన పిల్లలు గాని మనుమలుగాని యుండినయెడల, వీరు. . .తమ ఇంటివారి యెడల తమ తలిదండ్రులకు ప్రత్యుపకారముచేయుటకును, నేర్చుకొనవలెను.”