కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w90 7/1 పేజీలు 24-28
  • వివేకము కొరకు యెహోవావైపు చూడుము

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • వివేకము కొరకు యెహోవావైపు చూడుము
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • వివేకమునందు ఏమి యిమిడియున్నది
  • యెహోషువ ఎట్లు వివేకముగల వాడాయెను
  • యెహోవా ఈనాడు వివేకమునెట్లు యిచ్చును
  • వివేకమును కోల్పోకుండా జాగ్రత్తపడుము
  • యెహోవా దయచేసిన వివేకము
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
  • లోతైన అవగాహన చూపించండి, ‘విజయం సాధించండి’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2026
  • యెహోవాను సేవించేలా మీ పిల్లలకు శిక్షణనివ్వండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2015
  • “జ్ఞానము ఆశ్రయాస్పదము”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
w90 7/1 పేజీలు 24-28

వివేకము కొరకు యెహోవావైపు చూడుము

“నీకు ఆలోచన (వివేకము) చెప్పి, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను.”—కీర్తన 32:8, NW.

1. మనము చేయు తీర్మానములు జ్ఞానయుక్తమైనవో కాదో నిర్ధారించు వాస్తవములు కొన్ని ఏమైయున్నవి? (ద్వితీయోపదేశకాండము 32:7,29 పోల్చుము.)

ప్రతిదినము మనమెన్నో నిర్ణయాలు చేయు పరిస్థితిని ఎదుర్కొందుము—కాగా వాటిలో కొన్ని చిన్నవిగా, మరికొన్ని చాలా ప్రాముఖ్యమైనవిగా యుండును. మరి మన నిర్ణయములు జ్ఞానయుక్తముగా యుండునా? చాలావరకు అది మనము దురుసుగా ఉన్నామా లేక మాట్లాడుటకు లేక చేయుటకు ముందు ఆలోచిస్తున్నామా అను దానిపై ఆధారపడియుండును. జ్ఞానయుక్తమైన తీర్మానములు చేయునపుడు పైకి కనపడుదానికన్న ఎక్కువగా చూడగలుగుటకు అవసరమగు అనేక విషయములున్నవి. ఇందుకు ప్రస్తుత ప్రపంచసంఘటనల తుది ఏమైయుండునని, అలాగే ఆత్మీయసామ్రాజ్యమందు ఏమిజరుగుతుందని తెలుసుకొనుటయు అవసరము కావచ్చును. దానిని మనము చేయగలమా? ఊరకనే ఊహించి చెప్పుట కాకుండ దీనిని చేయుట ఏ మానవునికైనా సాధ్యమా?

2. జీవనవిధానములో విజయము సాధించుటకు, మనకే సహాయము అవసరము, మరియు ఎందుకు? (సామెతలు 20:24)

2 మానవులు అద్భుతమైన మానసిక సామర్థ్యమును అనుగ్రహింపబడియున్నారు, అయితే దీనముగా దేవుని సహాయమును అంగీకరించకుండా తమజీవిత విధానమును విజయవంతముగా మలచుకొను సామర్థ్యముతో మాత్రము వారు కలుగజేయబడలేదు. ప్రేరేపింపబడిన ప్రవక్తయగు యిర్మీయా వ్రాసినట్లు: “యెహోవా, తమ మార్గము నేర్పరచుకొనుట నరులవశములో లేదనియు మనుష్యులు తమ ప్రవర్తనయందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేనెరుగుదును.”—యిర్మీయా 10:23.

3. నడిపింపు కొరకు మనము యెహోవావైపు చూచుటకు విఫలమైనట్లయిన, దాని ఫలితమేమై యుండును? (ఆదికాండము 3:4-6, 16-24 పోల్చుము.)

3 ఈ సత్యమును తృణీకరించి ఏది జ్ఞానమో లేక ఏది అజ్ఞానమో లేక ఏది ఒప్పో లేక ఏది తప్పో నిర్ణయించు కొనుటకు మనపైమనమో లేక ఇతర మానవులపైనో ఆధారపడిన దాని ఫలితమేమైయుండును? శరీరసంబంధమైన తర్కముచే నడిపించబడుటనుబట్టి, దేవుడు చెడు అన్నదానిని మంచియనో లేక దేవుడు బుద్ధిహీనమని తెలిపినదానిని జ్ఞానమనో మనము దృష్టించగల సమయములుండును. (యెషయా 5:20) దీనిని మనము అనుకోకుండా చేసినను, మనము యితరులకు అభ్యంతర కారణము కావచ్చును. (1 కొరింథీయులు 8:9 పోల్చుము.) యెహోవా నడిపింపును వెదకుటలో తప్పిపోవుటయందు కొనసాగువారికి కలుగు తుదిఫలితమును గూర్చి ఆయనవాక్యము యిలా చెప్పుచున్నది: “ఒకని యెదుట సరియైనదిగా కనబడు మార్గము కలదు. అయితే తుదకు అది మరణమునకు త్రోవతీయును.”—సామెతలు 14:12.

4. ఔదార్యముతో యెహోవా తన సేవకులకు ఏ సహాయమును వాగ్ధానము చేయుచున్నాడు? (యిర్మీయా 10:21 పోల్చుము.)

4 దీని దృష్ట్యా, మనకేమి అవసరము? క్లుప్తముగా చెప్పవలెనంటే, మనకు యెహోవా యిచ్చు సహాయము అవసరము. ప్రోత్సహకరముగా ఆయన యిలా చెప్పుచున్నాడు: “నీకు ఉపదేశముచేసెదను (వివేకము కలుగజేసెదను). నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను, నీమీద దృష్టియుంచి నీకు ఆలోచన చెప్పెదను.”—కీర్తన 32:8, NW.

వివేకమునందు ఏమి యిమిడియున్నది

5. “వివేకమనగా” ఏమి?

5 లేఖనములలో చూపబడినట్లుగా, “వివేకము” ఏమైయున్నది? ఒక పరిస్థితిలోకి చూడగలిగిన సమర్థత, పైకి కనపడుదానికి మించి చూచుట. థియోలాజికల్‌ వర్డ్‌బుక్‌ ఆఫ్‌ది ఓల్డ్‌టెస్ట్‌మెంట్‌ ప్రకారము “వివేకము” అని అనువదించబడిన హెబ్రీ పదము విషయముల కొరకు “కారణహేతువుయొక్క బుద్ధిసూక్ష్మతల జ్ఞానమునకు” సంబంధమును కలిగియున్నది. అది ఒకవ్యక్తి జ్ఞానయుక్తముగా పనిచేసి కృతార్థుడయ్యేందుకు శక్తిమంతునిచేయు ఒక రకమైన జ్ఞానమైయున్నది. ఆ మూల భావమునకు అనుగుణ్యముగా మరియు అదే హెబ్రీ క్రియాపద సారమును అందజేయుటకు న్యూవరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌ ‘వివేకము కలిగియుండుము,’ అని అనువాదించుటతోపాటు, ‘విచక్షణతో ప్రవర్తించుము,’ ‘యుక్తాయుక్త పరిజ్ఞానముతో నడుచుకొనుము,’ ‘కృతార్థుడవు కమ్ము,”అను పదములను ఉపయోగించుచున్నది.

6. “తన పెదవులు మూసికొనువాడు” విచక్షణతో లేక వివేకముతో ప్రవర్తించువాడని ఎందుకు చెప్పవచ్చును?

6 ఆవిధముగా, “తన పెదవులను మూసికొనువాడు” “విచక్షణతో ప్రవర్తించువాడని,” లేక వివేకముతో ప్రవర్తించువాడని చెప్పబడినది. (సామెతలు 10:19) ఆతడు తాను చెప్పుదానిని ఇతరులు ఎట్లు అర్థము చేసుకొందురు, ఇంకొక వ్యక్తిని గూర్చి తానుచెప్పునది జ్ఞానయుక్తమేనా, ప్రేమగలదేనా, లేక అవసరమైనదేనా అను వాటిని పరిగణనలోనికి తీసుకొంటూ, మాట్లాడుటకు ముందు ఆలోచించును. (సామెతలు 12:18; యాకోబు 1:19) యెహోవామార్గముల యెడల ప్రేమ మరియు తోటి మనుష్యునికి సహాయముచేయవలెనను నిజమైన కోరికతో అతడు ప్రేరేపింపబడియున్నందున తాను చెప్పునది ఇతరులకు క్షేమాభివృద్ధికరముగా ఉండును.—సామెతలు 16:23.

7. యుక్తాయుక్త పరిజ్ఞానముతో నడుచుకొనువాడను పేరు సంపాదించుటకు దావీదుకు సహాయపడినదేమి?

7 యెష్షయి కుమారుడగు దావీదును గూర్చి యిలా వ్రాయబడినది: “సౌలు తనను పంపినచోటకెల్లను పోయి, అతడు ‘యుక్తాయుక్త పరిజ్ఞానముతో నడుచుకొనుచు వచ్చెను,” లేక వివేకముతో చేసికొని వచ్చెను. కేవలము మానవయోధుల మధ్యగల వివాదముకన్న తన పనిలో మరెంతో ఇమిడియున్నదని దావీదు వివేచించెను. తాను తనతోనున్న మనుష్యులు యెహోవా తరపున యుద్ధములను చేయుచున్నారని ఆయన గుర్తించెను. ఆ విధముగా, దావీదు నడిపింపు మరియు ఆశీర్వాదము కొరకై యెహోవావైపు చూచెను. (1 సమూయేలు 17:45; 18:5; 2 సమూయేలు 5:19) తత్ఫలితముగా దావీదు దండయాత్రలు విజయవంతమాయెను.

8. క్రైస్తవ గ్రీకు లేఖనములలో, “వివేకము కలిగియుండుము” అని భాషాంతరము చేయబడిన క్రియాపదము ద్వారా మరియేయితర తలంపులు అందించబడినవి?

8 క్రైస్తవ గ్రీకులేఖనములలో ‘వివేకము కలిగియుండుము’ అని తర్జుమాచేయబడిన క్రియాపదము ‘భావమును గ్రహించుట’ మరియు ‘అవగతము చేసుకొనుట,’ అనికూడా అనువదింపబడినది. (రోమీయులు 3:11; మత్తయి 13:13-15; ఎఫెసీయులు 5:17) వీటిని చేయు సామర్థ్యమునిత్తునని దేవుడు వాగ్ధానము చేయుచున్నాడు. అయితే వారికెట్లు ఆయన అట్టి వివేకమునిచ్చును?

యెహోషువ ఎట్లు వివేకముగల వాడాయెను

9. ప్రాచీన ఇశ్రాయేలునందు, ప్రజలకు యెహోవా వివేకమును ఎట్లు దయచేసెను?

9 పురాతన ఇశ్రాయేలులో, జనాంగమునకు ధర్మశాస్త్రమును ఉపదేశించవలెనను ఆజ్ఞను యెహోవా లేవీయులకిచ్చెను. (లేవీయకాండము 10:11; ద్వితీయోపదేశకాండము 33:8, 10) ధర్మశాస్త్రము దేవునిచే ప్రేరేపింపబడినదై, దానిని బోధించుటకు ఏర్పాటుచేయబడిన వ్యవస్థీకరణపై యెహోవా ఆత్మ పనిచేయుచుండెను. (మలాకీ 2:7) దీనిమూలముగా, నెహెమ్యా 9:20, NWలో చెప్పబడినట్లు యెహోవా ‘ఇశ్రాయేలీయులను సుబుద్ధిగలవారిగాచేసెను,’ లేక వారికి వివేకమును దయచేసెను.

10, 11. (ఎ) యెహోషువ 1:7, 8నందు చూపించబడినట్లుగా, వివేకముతో ప్రవర్తించుటకు యెహోషువాను ఏమి బలపరచును? (బి) ఉపదేశము కొరకువున్న ఏ యేర్పాటును యెహోషువ గుణగ్రహించవలసిన అవసరముండెను? (సి) యెహోషువకు యేవిధమైన వ్యక్తిగతకృషి అవసరమైయుండెను?

10 అయితే జనాంగమందలి ఆయావ్యక్తులు వివేకముతో ప్రవర్తింతురా? వారట్లు చేయవలెనన్న, తమపక్షముగా వారు కొంతచేయుట అవసరమైయుండెను. ఇశ్రాయేలీయులను వాగ్ధానదేశమునకు నడిపించు బాధ్యతను యెహోషువపై పెట్టిన సమయమున, యెహోవా ఆయనతో యిట్లనెను: “నీవు నిబ్బరముకలిగి జాగ్రత్తపడి బహుధైర్యముగానుండి, నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతిమార్గమున చక్కగా ప్రవర్తించునట్లు నీవు దానినుండి కుడికిగాని యెడమకుగాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్రగ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్తపడునట్లు దివారాత్రము దాని ధ్యానించినయెడల నీ మార్గమును వర్ధిల్లజేసికొని చక్కగా ప్రవర్తించెదవు.” ఇచ్చట “చక్కగా ప్రవర్తించుట” అని అనువదింపబడిన హెబ్రీపదమునకు “వివేకముతో ప్రవర్తించుట,” అను భావము కూడాకలదు.—యెహోషువ 1:7, 8.

11 యెహోషువకు అట్టి వివేకమును యెహోవా ఎట్లు యిచ్చును? ఏదో అద్భుతరీతిలో ఆయనలోనికి దానిని చొప్పించుట ద్వారా మాత్రము కాదు. దాని కీలకము దేవుని లిఖితవాక్యమై యుండెను. దానిని క్రమముగా చదువుట, మరియు ధ్యానించుటద్వారా, యెహోషువ దానిని తన మనస్సునందు, హృదయమునందు నింపుకొనవలసియుండెను. యెహోషువ ఎరిగియున్నట్లు, లేవీయులద్వారా ధర్మశాస్త్రమునుండి ఉపదేశము వచ్చునని దేవునివాక్యము చెప్పినది. కావున, యెహోషువ జనాంగములో తనకు బాధ్యతగలస్థానము కలదను దృష్ట్యా, తానే స్వయంగా కావలసిన దానిని కనుగొనగలనని తన్నుతాను వేరుపరచుకొనకుండా, ఈ ఏర్పాటును ఆయన గుణగ్రహించవలసిన అవసరముండెను. (సామెతలు 18:1) దేవుని లిఖితవాక్యమును యెహోషువ పట్టుదలతో పఠించుట ప్రాముఖ్యమైయుండెను. అలా చేసి, దానిలో ఏ భాగమును అతడు నిర్లక్ష్యముచేయకుండా వున్నట్లయిన, మరియు దానికి విధేయుడైనట్లయిన అప్పుడు ఆయన వివేకముతో ప్రవర్తించును.—1 రాజులు 2:3 పోల్చుము.

యెహోవా ఈనాడు వివేకమునెట్లు యిచ్చును

12. యెహోవా మనకు లభ్యపరచుచున్న వివేకమునుండి ప్రయోజనము పొందుటకు ఏ మూడు సంగతులు అవసరము?

12 మనకాలము వరకును, తన సేవకులు జ్ఞానయుక్తముగా ప్రవర్తించుటకు అవసరమైన నడిపింపును యెహోవా అనుగ్రహించుచునేయున్నాడు. ఆ నడిపింపునుండి ప్రయోజనముపొందుటకు ఆయావ్యక్తులుగా మననుండి అనేక విషయములు అవసరమైయున్నవి: (1) యెహోషువ వలెనే మనము యెహోవా సంస్థను గుణగ్రహించవలసిన అవసరత కలదు. మన విషయములో అట్టి గుణగ్రహింపునందు “నమ్మకమును బుద్ధిమంతుడునైన దాసునితో,” అభిషక్తుల క్రైస్తవసంఘమును, దాని గవర్నింగ్‌బాడితో సహకరించుట ఇమిడియున్నది. (మత్తయి 24:45-47; అ.కార్యములు 16:4ను పోల్చుము) మరియు ఈ గుణగ్రహింపునందు క్రమముగా కూటములకు హాజరగుటయు ఇమిడియున్నది. (హెబ్రీయులు 10:24, 25) (2) వ్యక్తిగతముగా దేవునివాక్యమును, మరియు దానిని అర్థము చేసుకొన సహాయముచేయుటకు “దాసుని” తరగతి అందించు సాహిత్యములను పఠించుటయందును మనము పట్టుదల కలిగియుండవలెను. (3) మరియు మనము నేర్చుకొన్న సంగతులను మనజీవితములో ఎట్లు అన్వయించవచ్చును, అలాగే ఇతరులకు సహాయపడ వాటిని ఎట్లు ఉపయోగించవచ్చును అను విషయములను ధ్యానించుటకు సమయమును తీసుకొనుటయు ప్రాముఖ్యమైయున్నది.

13. యిర్మీయా 3:15నందు వ్రాయబడిన వాగ్ధానముయొక్క భావమేమైయున్నది?

13 మనదినములలో ఆయన మనకు అందించు పర్యవేక్షణ మరియు ఆత్మీయపోషణగూర్చి యిర్మీయా 3:15లో యెహోవా యిలాగు సెలవిచ్చెను: “నాకిష్టమైన కాపరులను మీకు నియమింతును, వారు జ్ఞానముతోను వివేకముతోను మిమ్ము నేలుదురు.” నిజముగా, ఈ ఆత్మీయపోషణకార్యక్రమము, మనము పరిస్థితులను గమనించి, కృతార్థులగుటకు ఏ విధానమును చేపట్టవలెనో వివేచించుటకు విశేషమైన సామర్థ్యమును మనకు అందించును. ఆ వివేకమునకు మూలాధారుడు ఎవరు? యెహోవా దేవుడే.

14. ‘నమ్మకమైన దాసుని’ తరగతికి వివేకము ఎందుకు కలదు?

14 ‘నమ్మకమైన దాసుని’ తరగతి ఎందుకట్టి వివేకమును కలిగియున్నది? ఎందుకనగా దేవునివాక్యమును వారు తమ ముఖ్యమైన శ్రద్ధగా చేసుకొని దాని నడిపింపును వారు అనుసరింతురు. అంతేకాకుండ, వారు యెహోవా నడిపింపునకు లోబడియున్నందున, వారిని తనసంకల్పమునకు తగినట్లుగా వాడుకొనుచు, ఆయన తన ఆత్మను వారిలో ఉంచియున్నాడు. (లూకా 12:43, 44; అ.కార్యములు 5:32) ప్రేరేపితుడైన కీర్తనల రచయిత ఎంతోకాలము క్రితము యిట్లు వ్రాసెను: “నీ శాసనములు నాకు ఎంతో శ్రద్ధాకరమైనందున, నా బోధకులందరికంటె నాకు విశేషమైన వివేకము కలదు.”—కీర్తన 119:99, NW.

15. (ఎ) “దాసుని” తరగతి మనకు ఎప్పుడును యిచ్చు సలహాయొక్క క్లుప్తవాక్యము ఏమైయున్నది? (బి) అనేక సంవత్సరముల క్రితము, రక్తమార్పిడి విషయములో క్రైస్తవ దృష్టినిగూర్చి కావల్సిన “జ్ఞానవివేకములను” దయచేయుటకు “దాసుని” తరగతికి ఎట్లు సాధ్యమైనది?

15 చేయుటకు ఏది సరియైనదను విచారణలకు సమాధానముగా, “నమ్మకమును బుద్ధిమంతుడునైన దాసుడు,” అన్ని సమయములలో యిలా సలహాయిచ్చెను: ‘బైబిలులో వ్రాయబడిన దానిని అన్వయించుడి. యెహోవాయందు నమ్మకముంచుడి.’ (కీర్తన 119:105; సామెతలు 3:5, 6) రక్తమార్పిడి వైద్యచికిత్సయొక్క ప్రామాణిక పద్ధతిగా దృష్టించబడి యెహోవాసాక్షులు ఎదుర్కొనవలసిన వివాదాంశముగా అది తయారైనప్పుడు, దివాచ్‌టవర్‌ 1945, జూలై 1, రక్తముయొక్క పవిత్రతనుగూర్చిన క్రైస్తవ దృష్టిని వివరించినది. దైవిక నిషేధమునందు మానవునియొక్కయు జంతువులయొక్కయు రక్తము చేర్చబడియున్నవని అది చూపించెను. (ఆదికాండము 9:3, 4; అ.కార్యములు 15:28, 29) దానివలనకలుగు ఇతర భౌతిక ప్రభావములు ఆ శీర్షికలో చర్చించబడలేదు. వాటిని గూర్చిన జ్ఞానము ఆ కాలములో చాలా పరిమితమైయుండెను. నిజమైన వివాదాంశము దేవుని ఆజ్ఞకు లోబడుటయైయుండెను, అది యింకను అట్లేయున్నది. ఈనాడు అనేకులు రక్తమార్పిడులను తిరస్కరించుటలోని ఆచరణాత్మకమైన వివేకమును గుర్తిస్తూ, పెక్కుమంది అలాచేయుచున్నారు. అయితే ఈ కాలమంతటిలో యెహోవాసాక్షులు వివేకముతో ప్రవర్తింప శక్తిమంతులైయున్నారు, ఎందుకనగా, ఏ మానవునికంటెను రక్తమును గూర్చి బహుగా ఎరిగియున్న సృష్టికర్తయందు వారు తమ నమ్మికయుంచుదురు.

16. లైంగిక నీతి, తలిదండ్రులలో ఒకరేగల కుటుంబములు, కృంగుదలవంటి విషయములపై వాచ్‌టవర్‌లోని సలహా సరిగ్గా అవసరమైనదే అని ఎందుకు నిరూపించబడినది?

16 లైంగికనీతి విషయమై అదుపుతప్పిన దృక్పధములు బలముగా విస్తరించుకొలది, ది వాచ్‌టవర్‌ జనసమ్మతమైన విధానమును ప్రచారము చేయుటకు బదులు, శ్రేష్టమైన లేఖన నడిపింపును అందించినది. ఇది అనేకులకు యెహోవాతో తమకుగల విలువైన సంబంధమును కాపాడుకొనుటకును, క్షణకాలముండు సంతోషముకన్న నిరంతరముండు సంతోషముపై మనస్సునిలుపుటకు సహాయపడినది. అలాగే, తలిదండ్రులలో ఒకరు మాత్రమే ఉన్నకుటుంబములకు, కృంగిపోవుటతో పోరాడుచున్నవారికి ఉద్దేశించి వ్రాయబడిన వాచ్‌టవర్‌ శీర్షికలు, యెహోవా తలంపులు ఎవరికి ప్రశస్తమైయుండెనో, మరియు ఎవరు ఆతురతతో: “నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము,”అని ప్రార్థించిరో, వారికే సాధ్యమవునట్టి వివేకమును ప్రతిబింబించెను.—కీర్తన 143:10; 139:17.a

17. (ఎ) దశాబ్దముల పూర్వమే 1914ను గూర్చి యెహోవా సేవకులు ఏమి ఎరిగియుండిరి? (బి) 1914తర్వాత దేవుని ప్రజలు యింకను కలిగియున్న ప్రశ్నలకు వివరములున్నను, వారి జీవితములకు మంచి నడిపింపునిచ్చిన దేనిని వారు ఎరిగియుండిరి?

17 తన “నమ్మకమును బుద్ధిమంతుడునైన దాసుని” ద్వారా దశాబ్దములకు పూర్వమే 1914వ సంవత్సరము అన్యరాజుల కాలముల ముగింపును గుర్తిస్తుందని గ్రహించునట్లు యెహోవా తనసేవకులకు సహాయము చేసెను. (లూకా 21:24, కింగ్‌ జేమ్సు వర్షన్‌) మొదటి ప్రపంచయుద్ధానంతరకాలములో, వారిని కొన్ని ప్రశ్నలు కలవరపరచిన మాట నిజమే. అయితే వారికి అప్పటికి తెలిసియున్నది, వారు వివేకముగా ప్రవర్తించుటకు చాలును. పాతవిధానము నాశనముచేయబడు సమయము సమీపించియున్నది; కాబట్టి దానియందు తమ నమ్మకమును నిలుపుట, మరియు దాని విజయవంత వస్తుసంబంధమైన ప్రమాణములు తమ జీవితములను ఏలుటకు అనుమతించుట అవివేకమని లేఖనములనుండి వారు ఎరిగియుండిరి. మానవజాతిని పీడించు సమస్యలన్నిటికి యెహోవా రాజ్యమే పరిష్కారమని వారెరిగి యుండిరి. (దానియేలు 2:44; మత్తయి 6:33) మరియు వారు యెహోవా అభిషక్త రాజును, ఆయన రాజ్యమును ప్రకటించుట నిజమైన క్రైస్తవులందరి బాధ్యతయని స్పష్టముగా చూసిరి. (యెషయా 61:1, 2; మత్తయి 24:14) 1925లో “బర్త్‌ ఆఫ్‌ ది నేషన్‌” అను వాచ్‌టవర్‌ శీర్షికద్వారా ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము యొక్క స్పష్టమైన గ్రహింపుతో వారు బలపరచబడిరి; కాగా వారిప్పుడు మానవకన్నులకు అదృశ్యముగా పరలోకములో ఏమి జరుగుచున్నదో అర్థము చేసికొనిరి. అట్టి వివేకము వారి జీవితములకు మంచి నడిపింపు నిచ్చినది.

18. మనమిప్పుడు ఏ ఆధిక్యతను మరియు బాధ్యతను కలిగియున్నాము, మరియు మనమే ప్రశ్నను వేసుకొనవలెను?

18 విశ్వాసముతో ప్రవర్తించినవారై తన సాక్షులుగా ఆనాడు యెహోవాను సేవించుచున్న కొన్నివేలమంది దేవుని స్థాపించబడిన రాజ్యసువార్త ప్రకటనను ప్రపంచములోని అన్ని భాగములకు తీసుకెళ్లిరి. తత్ఫలితముగా, లక్షలాదిమంది ప్రజలు యెహోవాను తెలుసుకొని, ఆయనను ప్రేమించినవారై నిత్యజీవ ఉత్తరాపేక్షను కలిగియుండసాగిరి. వారి ప్రేమగల కష్టఫలితముగా సత్యమును పొందియున్న మనమందరికి, ఆ పనిలో పాల్గొని, మనముచేరు ప్రతివారికి మంచిసాక్ష్యమిచ్చుచు పనిపూర్తియైనదని యెహోవా చెప్పువరకు దానిని కొనసాగించు ఆధిక్యత మరియు బాధ్యత కలదు. (ప్రకటన 22:17; అ.కార్యములు 20:26, 27ను పోల్చుము.) నీవు నీ జీవితమును ఉపయోగించు విధానము, యెహోవా తన సంస్థద్వారా దయచేసిన వివేకమును నీవు గుణగ్రహించుచున్నావను రుజువునిచ్చుచున్నదా?

19. (ఎ) యెహోవా తన సంస్థద్వారా యిచ్చు వివేకము యెడలగల గుణగ్రహింపును ప్రతిబింబించు జీవితముగల వారి ఒక ఉదాహరణనిమ్ము. (బి) ఆ ఉదాహరణనుండి మనమేమి నేర్చుకొనగలము?

19 భూమియందలి అన్ని ప్రాంతములలోనున్న గొప్పసమూహపు వ్యక్తుల జీవితములు వారివిషయములో దానికి సమాధానము అవునని సాక్ష్యమిచ్చుచున్నవి. ఉదాహరణకు జాన్‌ కట్‌ఫోర్త్‌ను పరిశీలించుము. ఇప్పటివలెనే అప్పుడును: “ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీ కనుగ్రహింపబడును. రేపటినిగూర్చి చింతింపకుడి,” అనుదానికి ‘నమ్మకమైన దాసుని’ తరగతి అవధానమును మరల్చు లేఖన ఉపదేశమును, దాదాపు 49 సంవత్సరముల క్రితము ఆయన తన హృదయములోనికి తీసుకొనెను. (మత్తయి 6:33, 34) యెహోవా సేవలో కొన్నియేండ్ల అనుభవము తరువాత సహోదరుడైన కట్‌ఫోర్త్‌ యిలా చెప్పెను: ‘నా మనస్సుపై బలముగా ముద్రవేసిన విషయములలో ఒకటి ఏమనగా యెహోవా తాను నడిపించుచున్న ఒక సంస్థను భూమిమీద కల్గియున్నాడు. నేను ఒక వ్యక్తిగా దానితో పనిచేసిన, దాని నాయకత్వమును, దాని నడిపింపును పూర్తిగా అనుసరించిన అది నాకు సమాధానమును, సంతృప్తిని, తృప్తిని, అనేకమంది స్నేహితులను, దానితోపాటు నిండైన దీవెనలను యిచ్చును.’ తాను సంయుక్త రాష్ట్రములలో, కెనడా, ఆస్ట్రేలియా, పాపువా న్యూ గినీయాలోను నిండైన ఆత్మీయ ఆశీర్వాదములుగల జీవితమును ఆనందించినపుడు ఆ నమ్మకము అనేకమార్లు తిరిగిచెప్పబడినది.b నిజముగా, మనందరికి జ్ఞానయుక్తమైన విధానమేమనగా యెహోవా తన ప్రజలకు వివేకమునిచ్చు మార్గముయెడల గుణగ్రహింపును ప్రతిబింబించుటయై యున్నది.—మత్తయి 6:19-21.

వివేకమును కోల్పోకుండా జాగ్రత్తపడుము

20, 21. (ఎ) తాము ఒకప్పుడు కలిగియున్న దైవవివేకమును కొంతమంది వ్యక్తులు ఎట్లు పోగొట్టుకొనిరి? (బి) హానికరమైన విధానమునకు వ్యతిరేకముగా సంరక్షించుకొనుటకు మనకేమి సహాయము చేయును?

20 యెహోవా అందించు వివేకము ప్రశస్తముగా కాపాడుకొనవలసిన సంపదైయున్నది. దైవిక వివేకమును పొందుటకు మనకు తోడ్పడిన విధానమందు మనము కొనసాగకపోయిన దానిని పోగొట్టుకొనగలము. విచారకరముగా కొందరు అదే అనుభవమును కలిగియుండిరి. (సామెతలు 21:16; దానియేలు 11:35) తమకు వ్యక్తిగతముగా తాకిన క్రమశిక్షణను త్రోసిపుచ్చుచు తాముచేయుదానిని సమర్థించుకొనుటకు కొందరు ప్రయత్నించిరి. గర్వము వారికి ఉరియాయెను. దేవునివాక్యము చెడుగా చూపుదానిని వారు మంచిదిగా యెంచి, యెహోవాసంస్థనుండి ప్రక్కకు వైదొలగిపోయిరి. ఎంత విచారకరము!

21 అట్టి వ్యక్తి యొక్క పరిస్థితులు కీర్తన 36:1-3లో వర్ణించబడినట్లున్నవి. అక్కడ మనమిలా చదువుదుము: “భక్తిహీనుల హృదయములో అతిక్రమము. . .పలుకుచున్నది.” అనగా తన స్వంత స్వార్థతలంపులు, మరియు కోరికలు తనను అతిక్రమములోనికి నడుపును. “వాని దృష్టియెదుట దేవుని భయము బొత్తిగా లేదని,”అంటూ కీర్తనల రచయిత యింకను యిట్లు కొనసాగించుచున్నాడు. “వాని దోషము బయలుపడి అసహ్యముగా కనబడువరకు అది వాని దృష్టియెదుట వాని ముఖస్తుతి చేయుచున్నది. వాని నోటిమాటలు పాపమునకును కపటమునకును ఆస్పదములు.” అందువలన వానికి కలుగు ఫలితమేమి? ‘బుద్ధికలిగి ప్రవర్తింపను (వివేకముతో) మేలుచేయను వాడు మానివేసియున్నాడు.’ నిజానికి తానుచేయునది సరియైనదని తననుతాను ఒప్పించుకొనుచు, ఇతరులును తనను అనుసరించునట్లు ప్రేరేపించును. కావున, మనము వివేకమును కలిగియుండుటయేగాక, దానిని మనము పొందుటకు యెహోవా ఏర్పరచిన మార్గమును గుణగ్రహించుటద్వారా దానిని కాపాడుకొనుటయు, ఎంత ప్రాముఖ్యము! (w89 3/15)

[అధస్సూచీలు]

a “మ్యారేజ్‌,” “ఫ్యామిలీస్‌,” “మోరల్‌ బ్రేక్‌డౌన్‌,” మరియు “డిప్రెషన్‌ (మెంటల్‌),” అనువాటి క్రింద వాచ్‌టవర్‌ పబ్లికేషన్స్‌ ఇండెక్స్‌ 1930-1985 చూడుము.

b ది వాచ్‌టవర్‌ 1958, జూన్‌ 1, సంచిక పుటలు 333-6, చూడుము.

మీకేమి గుర్తున్నవి?

◻ జ్ఞానయుక్తమైన నిర్ణయములు చేయుటకు మనకేమి సహాయము చేయును?

◻ “వివేకము”నందు చేరియున్నదేమి?

◻ మనకాలములో యెహోవా వివేకమును ఎట్లు దయచేయుచున్నాడు?

◻ యెహోవా దయచేయుచున్న వివేకమునుండి మనము పూర్తి ప్రయోజనము పొందవలెనంటే మన పక్షముగా ఏమి అవసరము?

[28వ పేజీలోని చిత్రాలు]

యెహోవా దయచేయుచున్న వివేకమునుండి ప్రయోజనము పొందుటకు, ఆయన సంస్థను గుణగ్రహించుట, వ్యక్తిగత పఠనమునందు పట్టుదల, నేర్చుకొనిన దానిని ఎట్లు అన్వయించవలెనో ధ్యానించుట మనకు అవసరము

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి