దైవభక్తిని గూర్చిన పరిశుద్ధమర్మమును నేర్చుకొనుట
“క్రీస్తుకూడ మీకొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకొనునట్లు మీకు మాదిరి యుంచిపోయెను.”—1 పేతురు 2:21.
1. ‘దైవభక్తినిగూర్చిన మర్మము’ విషయములో దేవుని సంకల్పమేమైయున్నది?
“దైవభక్తిని గూర్చిన పరిశుద్ధ మర్మము” ఇప్పుడేమాత్రము మర్మముకాదు! (1 తిమోతి 3:16) మర్మములుగానే మిగిలియున్న త్రిత్వమువంటి అబద్ధమత మర్మములకంటే ఈ మర్మము ఎంత వేరుగా ఉన్నది! వాటిని ఎవరు అర్థము చేసికొనలేరు. అయితే యేసు క్రీస్తుద్వారా బయలుపరచబడిన పరిశుద్ధ మర్మము అతివిస్తారంగా ప్రకటించబడవలెనని యెహోవా సంకల్పించెను. యేసు తానుగా దేవుని రాజ్యమును ఆసక్తితో ప్రకటించుటలో ఒక ప్రాముఖ్యమైన ఉదాహరణమైయున్నాడు. ఆయన సందేశము మరియు ఆయన ప్రకటించు విధానముద్వారా మనమెంతో నేర్చుకొనగలమని ఇప్పుడు చూడనైయున్నాము.
2. యేసు తన పరిచర్యను విమోచనకంటే ముందు ఎందుకుంచెను? (మత్తయి 20:28)
2 యేసు “సశరీరుడుగా ప్రత్యక్షుడ” గుటను గూర్చి మరియొకసారి ఆలోచించెదము. (1 తిమోతి 3:16) “యేసు పరిచారము చేయించుకొనుటకు రాలేదుగాని పరిచారముచేయుటకును, అనేకులకు ప్రతిగా విమోచనా క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చెను,” అని మత్తయి 20:28లో మనము చదువుదుము. ఇది ఆయన పరిచర్యను, విమోచన కంటే ముందుంచుచున్నది. ఎందుచేత? సరే, ఏదెను తోటలో కుయుక్తిగల సర్పము మానవజాతిపై యెహోవా నీతియుక్తమైన సార్వభౌమాధిపత్యమునుగూర్చి వివాదమురేపి, దేవుని సృష్టి లోపముగలదని మరియు పరీక్షకు గురియైనప్పుడు ఎవరును సర్వోన్నతునియెడల యథార్థత నిలుపుకొనరనియు అనెను. (యోబు 1:6-12; 2:1-10తో పోల్చుము.) “కడపటి ఆదాము” అయిన యేసు ఒక పరిపూర్ణమానవుడిగా తన లోపములేని పరిచర్యద్వారా, వివాదము రేపిన సాతాను ఒకదుష్ట అబద్ధికుడని నిరూపించెను. (1 కొరింథీయులు 15:45) అంతేకాకుండా, యెహోవాయొక్క సార్వభౌమాధిపత్యమును మహిమపరచుటకు, “అధిపతిగాను, రక్షకునిగాను” మరియు “నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పుతీర్చుటకు,” తన అర్హతను యేసు పూర్తిగా నిరూపించెను.—అ.కార్యములు 5:31; 17:31.
3. సాతాను రేపిన వివాదమును యేసు ఎట్లు సంపూర్ణముగా తప్పని నిరూపించెను?
3 సాతానుయొక్క నిందాపూర్వక వివాదమును యేసు సంపూర్ణంగా ఖండించెను. చరిత్ర అంతటిలో ఏ మానవుడు ఎగతాళి, కొరడాదెబ్బలు, మరియు అతి శారీరక, మానసిక వ్యధను అనుభవిస్తూ అంత భక్తితో దేవుని సేవించలేదు. దేవుని కుమారునిగా క్రీస్తు దైవదూషణతో కూడిన నిందను సహించవలసివచ్చెను. దీనియంతటిలోను—చివరకు కౄరమైన మరియు సిగ్గుతోకూడిన మరణము వరకు—దృఢముగా తన తండ్రియందు యథార్థతతో కదలకయుండెను. ఫిలిప్పీయులు 2:8, 9లో పౌలు వ్రాస్తు, ‘ఆయన కొయ్యమీద మరణము పొందునంతగా విధేయత చూపెను, కాగా దేవుడు ప్రతినామమునకు పైనామమును అతనికి అనుగ్రహించెను’ అని అనెను. యేసు సాతాను ఒక విషపూరితమైన అబద్ధికుడని బహిర్గతము చేసెను!
4. సత్యమునకు సాక్ష్యమిచ్చుటకు ఈ లోకమునకు వచ్చితినని యేసు పిలాతుతో ఎందుకు చెప్పగలిగియుండెను?
4 ఆ కారణముచేత కొన్ని సంవత్సరములు తీవ్రముగాచేసిన ప్రచారపు పని ముగియు సమయములో యేసు పొంతి పిలాతుతో ధైర్యముగా ఇట్లు సాక్ష్యమియ్య గలిగెను: “నీవన్నట్టు నేను రాజునే, సత్యమునుగూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని, ఇందునిమిత్తమే ఈ లోకమునకు వచ్చితిని. సత్యసంబంధియైన ప్రతివాడును నామాట వినును.” (యోహాను 18:37) యేసు పాలస్తీనా అంతటిలోను దేవుని రాజ్యమునుగూర్చిన సత్యము ప్రకటించుటలో అత్యున్నతమైన దైవభక్తిని ప్రదర్శించెను. ఆయన తన శిష్యులకుకూడా ఆసక్తికరమైన ప్రచారకులవుటకు తర్ఫీదునిచ్చెను. ఆయన మాదిరి తన అడుగుజాడలయందు నడుచుటకు ఈరోజు మనలనెంతగా పురికొల్పుచున్నది!
మన మాదిరికర్తనుండి నేర్చుకొనుట
5. యేసువైపు తీక్షణంగా చూడటంద్వారా దైవభక్తిని గూర్చిమనమేమి నేర్చుకొనగలము?
5 దైవభక్తితో యెహోవా చిత్తము చేయుటద్వారా మనముకూడా అపవాది ఒక అబద్ధికుడని నిరూపించగలము. ఎటువంటి సమస్యలను మనము ఎదుర్కొనినప్పటికిని, యేసు అనుభవించిన తీవ్ర వ్యధ మరియు అవమానముతో సమానము కాదు. కావున మన మాదిరికర్తనుండి మనము నేర్చుకొందము. హెబ్రీయులు 12:1, 2 మనలను ప్రోత్సహించురీతిగా మన “విశ్వాసమునకు కర్తయు, దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు మనయెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము.” దైవభక్తి విషయములో పరీక్షించబడినప్పుడు తప్పిపోయిన ఆదామువలెకాక యేసుభూమిపై అన్ని పరీక్షలను పరిపూర్ణముగా ఎదుర్కొన్న ఒకేఒక మనుష్యుడయ్యెను. మరణించువరకు ఆయన “పవిత్రుడును నిర్దొషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడుగా” రుజువు పరుచుకొనెను. (హెబ్రీయులు 7:26) లోపములేని యథార్థతతో తన శత్రువులతో ఆయన ఇట్లనగలిగెను: “నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును?” సాతాను సవాలును తిరిగి అతనిపై విసురుతు, ఆయన ఇట్లు ప్రకటించెను: “ఈ లోకాధికారి వచ్చుచున్నాడు. నాతో వానికి సంబంధమేమియు లేదు.” తరువాత తాను అప్పగింపబడి బంధింపబడకముందు తన శిష్యులతో చివరి సంభాషణ ముగిస్తూ ఆయన వారికిట్లు చెప్పెను: “ధైర్యము తెచ్చుకొనుడి! నేను లోకమును జయించియున్నాను.”—యెహాను 8:46; 14:30; 16:33.
6. (ఎ) మానవజాతికి ఎటువంటి విశ్రాంతి అవసరమో యేసుకు ఎందుకు తెలియును? (బి) యేసు ఎంతమట్టుకు దైవిక భయమును ప్రదర్శించెను?
6 శరీరధారిగా ఈ భూమిపై ఉన్నపుడు “దూతలకంటే కొంచెము తక్కువగా” వున్న మనుష్యునిగా వుండుట అంటే ఏమిటో అనుభవించి తెలిసికొన్నాడు. (హెబ్రీయులు 2:7) ఆయన మానవుల బలహీనతలతో పరిచయమయ్యాడు, తద్వారా వెయ్యేండ్లవరకు మానవజాతిపై రాజుగాను మరియు న్యాయాధిపతిగాను సేవించుటకు సంసిద్ధుడయ్యెను. “ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నాయొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును” అని చెప్పిన ఈ దేవుని కుమారునికి మానవజాతికి ఎటువంటి విశ్రాంతి అవసరమో తెలియును. (మత్తయి 11:28) హెబ్రీయులు 5:7-9 మనకిలా చెప్పుచున్నది: “శరీరధారియై యున్నదినములలో మహారోదనముతోను, కన్నీళ్లతోను తన్ను మరణమునుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగియున్నందున ఆయన అంగీకరించబడెను. ఆయన కుమారుడైయుండియు తాను పొందిన శ్రమలవలన విధేయత నేర్చుకొనెను. ఆయన [విధేయతలో] సంపూర్ణ సిద్ధిపొందినవాడై తనకు విధేయులైన వారందరికిని నిత్యరక్షణకు కారకుడాయెను.” ఆయన మరణకాటును అనుభవించవలసి వచ్చి ఆ ద్వేషించతగిన సర్పము ద్వారా ‘మడిమెమీద దెబ్బ’ పొందవలసినంత మటుకు సహించినను, ఆయన చలించలేదు. (ఆదికాండము 3:15) మనవిన్నపములను విని యెహోవాదేవుడు మనకు రక్షణ దయచేయగలడను దృఢనమ్మకముతో, యేసువలె మనము కూడా, అవసరమైతే మరణము వరకుకూడా దైవికభయమును ప్రదర్శించెదము.
‘నీతివిషయమై జీవించుట’
7. 1 పేతురు 2:21-24 ప్రకారంగా యేసు మనకు ఎటువంటి మాదిరిని విడిచిపోయెను, మరియు ఆయన విధానము మనలను ఎట్లు ప్రభావితము చేయవలెను?
7 యేసు సశరీరుడుగా ప్రత్యక్షుడైనపుడు, ఆయననమ్మకముగా దైవభక్తిని గూర్చిన పరిశుద్ధమర్మమును వెల్లడిచేసెను. మొదటి పేతురు 2:21-24లో మనమిట్లు చదువుదుము: “క్రీస్తుకూడ మీకొరకు బాధపడి మీరు తన అడుగుజాడలయందు నడుచుకొనునట్లు మీకు మాదిరియుంచిపోయెను. ఆయన పాపము చేయలేదు; ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు; ఆయన శ్రమపెట్టబడియు బెదిరింపక, న్యాయముగా తీర్పుతీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించునట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రానుమీద మోసికొనెను.” మనము యేసు విధానము పై మననము చేసినపుడు, దైవభక్తిలో కొనసాగుటకు, యథార్థతను నిలుపుకొనుటకు మరియు ఆయన చేసినవిధంగా నీతి విషయమై జీవించుటకు అది మనలను ఎంతగా ప్రోత్సహించును!
8. యేసువలె నీతివిషయమై మనమెట్లు జీవించగలము?
8 యేసు నిజముగా నీతివిషయమై జీవించెను. కీర్తన 45:7 ఆయనను గూర్చి ఇట్లు ప్రవచించెను: “నీవు నీతిని ప్రేమించి భక్తి హీనతను ద్వేషించుచున్నావు.” ఆ వాక్యములను యేసుకు అనువర్తిస్తూ అపొస్తలుడైన పౌలు హెబ్రీయులకు 1:9లో ఇట్లు చెప్పెను: “నీవు నీతిని ప్రేమించితివి దుర్నీతిని ద్వేషించితివి.” దైవభక్తిని గూర్చిన మర్మమును అర్థము చేసుకొన్నదాని వెలుగులో, మనమెల్లపుడు యేసువలె నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించుదము. సాతాను లోకములో తీవ్రదాడికి గురి అవుతున్న క్రైస్తవ నైతికతలోను దేవుని సంస్థలోపల మరియు వెలపలి వారితోను మన వ్యవహారములలోను, నీతివిషయమై జీవించి, యెహోవా నీతి సూత్రములను సమర్థించుటకు తీర్మానించుకొందము. అపవాదిని మరియు అతని కుయుక్తులను ఎదిరించుటకు కావలసిన దైవపరిజ్ఞానము పొందుటకై మన మెల్లపుడు దేవుని వాక్యముతో జీవించుచుందుము గాక!
9. పరిచర్యవిషయములో యేసుయొక్క ఆసక్తితో ఏమి కలిసియుండెను, మరియు ఇందులో అబద్ధమతకాపరుల విషయమై ఏమి యిమిడియుండెను?
9 తన సేవలో ఆసక్తి కలిగియుండుటకు మరియొక విషయము యేసును ప్రేరేపించెను. అది ఏమైయుండెను? మత్తయి 9:36లో మనము ఇలా చదువుదుము: “ఆయన సమూహములను చూచివారు కాపరిలేని గొఱ్ఱెలవలె చెదరియున్నందున వారిమీద కనికరపడెను.” కావున యేసు “వారికి అనేకసంగతులు బోధింపసాగెను.” (మార్కు 6:34) అబద్ధమత కాపరుల దుష్టత్వము మరియు దుర్నీతిని బహిర్గతము చేయడము ఇందులో ఇమడ్చవలసిన అవసరముండెను. మత్తయి 15:7-9 ప్రకారము అటువంటి వారిలోని కొందరితో: “వేషధారులారా, ‘ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురుకాని వారి హృదయములు నాకు దూరముగా ఉన్నవి. మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు’ అని యెషయా మిమ్మునుగూర్చి ప్రవచించిన మాట సరియే అని చెప్పెను.”
నిందించదగిన మర్మము
10. ఈనాడు, ఈ “ధర్మవిరోధ మర్మము” ఎవరిపై కేంద్రీకరించబడినది, అయితే వారు ఏవిషయములో దోషులైయున్నారు?
10 అబద్ధమత నాయకులకు విరుద్ధంగా యేసు మాట్లాడిన రీతిగా ఈ రోజు మనము దైవభక్తిని గూర్చిన పరిశుద్ధ మర్మమునకు తీవ్రవిరుద్ధంగాయున్న మర్మమును నిందించుచున్నాము. 2 థెస్సలొనీకయులకు 2:7లో పౌలు దానిని, “ధర్మవిరోధ సంబంధమైన మర్మము” అని పిలిచెను. అది సా.శ. మొదటి శతాబ్దములో మర్మమైయుండెను, ఎందుకనగా అపొస్తలుల మరణము తరువాత ఎంతో సమయము గడచువరకు అది వెల్లడి కాకుండా యుండును. ఈ రోజు అది దేవుని నీతియుక్తమైన రాజ్యము యొక్క సువార్తను ప్రకటించుట కంటె రాజకీయములలో ఎక్కువ ఆసక్తిని కలిగియున్న క్రీస్తుమత సామ్రాజ్య మతనాయకులపై కేంద్రీకరించబడియున్నది. వారి పంక్తులలో వేషధారణ మిక్కిలిగా ఉన్నది. క్రీస్తుమండలము యొక్క ప్రొటెస్టంట్ శాఖలలోని దూరదర్శిని ప్రచారకులు ఇందుకు కొట్టవచ్చినట్లున్న ఉదాహరణములైయున్నారు. వీరు తమ మందను దోచుకొను నాటు ప్రచారకులు, లక్షలడాలర్ల సామ్రాజ్యములను కడుతు వేశ్యాసాంగత్యము చేయుదురు. మరియు వారు బహిర్గతము చేయబడినప్పుడు మొసలి కన్నీరుకార్చుదురు. మరి ఇంకా ఎక్కువ డబ్బుకావలెనని యాచింతురు. రోమన్ కాథోలిక్ల వాటికన్ దాని అవినీతికరమైన రాజకీయ సంబంధములతో, పైకి కనిపించే ఆడంబరము, దుర్నీతికరమైనబ్యాంకుల వ్యవహారముల ద్వారా సారములేని చరిత్రను కలిగియున్నది.
11. క్రీస్తుమత సామ్రాజ్యములోని మతబోధకులవర్గము మరియు మహాబబులోను అంతటికిని ఏమిసంభవించును?
11 క్రీస్తుమండలములోని బోధకుల వర్గము “ధర్మవిరుద్ధపురుషుడుగా” గుర్తించబడటంలో ఆశ్చర్యమేమియులేదు. (2 థెస్సలొనీకయులు 2:3) వేశ్యవంటి మహాబబులోనులో ప్రభలమైన భాగముగల ఇది, అబద్ధమతముయొక్క ఇతర భాగములతో సహా, విసర్జించబడి నాశనము చేయబడును. ప్రకటన 18:9-17లో మనము చదువురీతిగా భూరాజలు మరియు వర్తకులు (మరియు వారి బ్యాంకులను నడిపించువారు), రొమ్ము కొట్టుకొంటూ, “అయ్యో! అయ్యో! బబులోను మహాపట్టణమా!” అని ఏడ్చుదురు. మహాబబులోను మరియు దాని మర్మములన్నియు బహిర్గతము చేయబడును. కాగా దీనియంతటికి భిన్నమైన రీతిలో దైవభక్తినిగూర్చిన మర్మము మరింత ప్రకాశవంతమగును.
12. నీతియెడల యేసుకుగల ప్రేమ ఆయనను ఏమిచేయుటకు నడిపించెను?
12 నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించుట, యేసును సత్యారాధన నిమిత్తమై వెనుకంజ వేయకుండా శ్రమించుటకు నడిపెను. అభిషక్త దేవుని కుమారునిగా యెరూషలేమునకు మొదటిసారి వెళ్లినపుడు, క్రీస్తు వర్తకులను, రూకలు మార్చువారిని దేవాలయమునుండి వెళ్లగొట్టి, “వీటిని ఇక్కడనుండి తీసికొనిపొండి! నాతండ్రి ఇల్లు వ్యాపారపుటిల్లుగా చేయకుడని చెప్పెను.” (యోహాను 2:13-17) మరియొకసారి దేవాలయమునకు వెళ్లినపుడు యేసు వ్యతిరేకించు యూదులతో ఇట్లు చెప్పెను: “మీరు మీతండ్రియగు అపవాది సంబంధులు; మీతండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆదినుండి వాడు నరహంతకుడైయుండి సత్యమందు నిలిచిన వాడుకాదు. వానియందు సత్యమేలేదు; వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే మాటలాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునైయున్నాడు.” (యోహాను 8:44) ఆ మతగురువుల ముఖములముందే వారు అబద్ధికులని మరియు అపవాది కుమారులని చెప్పుటలో యేసు ఎంత ధైర్యమును ప్రదర్శించెను!
13. (ఎ) దుర్నీతియెడల యేసుకున్న ద్వేషము ప్రాముఖ్యముగా ఎక్కడ వ్యక్తపరచబడెను? (బి) యేసు శాస్త్రులు మరియు పరిసయ్యులపై ప్రకటించినలాంటి న్యాయతీర్పు ఈనాటి అక్రమమైన మతగురువుల వర్గము పొందనెందుకు తగియున్నారు?
13 మత్తయి 23వ అధ్యాయములో చూపబడినరీతిగా, సర్పములవంటి శాస్త్రులు మరియు పరిసయ్యులకు తీవ్రబాధను కలిగించురీతిగా బహిరంగంగా నిందించుట యేసు దుర్నీతిని ఎంత ద్వేషించెనో ప్రకటించుచున్నది. అచ్చట ఏడు విధములైన “శ్రమలను” వారిపై ప్రకటించి వారిని ‘సున్నము కొట్టిన సమాధులతో పోల్చి వారు సమస్తకల్మషముతోను వేషధారణతోను, అక్రమముతోను నిండియున్నారని’ చెప్పెను. అక్రమముతో అణచివేయబడిన ఆ ప్రజలను రక్షించవలెనని యేసు ఎంత వాంఛించెను! “యెరూషలేమా యెరూషలేమా, కోడి తన పిల్లలను రెక్కల క్రిందకేలాగు చేర్చుకొనునో ఆలాగే నేనును నీ పిల్లలను ఎన్నోమార్లు చేర్చుకొనవలెనని యుంటిని గాని మీరు ఒల్లక పోతిరి. ఇదిగో మీ యిల్లు మీకు విడువబడియున్నది,” అని ఆయన పలికెను. (37, 38 వచనములు) మన దినములనాటి అక్రమమైన మతగురువులు కూడా అటువంటి తీర్పును పొందనర్హులైయున్నారు. ఎందుకనగా 2 థెస్సలొనీకయులు 2:12 చెప్పినరీతిగా వారు ‘సత్యమును నమ్మక దుర్నీతియందు అభిలాషగల వారైయున్నారు’. యేసు భూమిపై యున్నపుడు చూపిన దైవభక్తి మరియు యథార్థతకు వారి అక్రమము పూర్తివిరోధముగా వున్నది.
దేవుని తీర్పులను ప్రకటించుట
14. దైవభక్తిని గూర్చిన మర్మము యెడల గుణగ్రహణ మనలను ఏమిచేయుటకు నడుపవలెను?
14 దైవభక్తిని గూర్చిన మర్మము యెడల మనకున్న గుణగ్రహణ మనలనెల్లపుడు యేసుక్రీస్తు అడుగుజాడలను అనుసరించుటకు నడుపవలెను. ఆయనవలె మనమెల్లపుడు, యెషయా 61:2 వర్ణించిన “యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకు” ఆసక్తిగలవారమైయుండవలెను. మరియు మనమందరము “దుఃఖాక్రాంతులందరిని ఓదార్చుటకు” మన భాగమును ఆసక్తిపూర్ణంగా చేయుదము గాక! యేసు భూమిపై ఉన్నప్పటివలె వాచ్‌టవర్ మరియు రెవలేషన్—ఇట్స్ గ్రాండ్ క్లెమక్స్ ఎట్ హ్యాండ్! పుస్తకమునందు ధైర్యముగా వెల్లడిచేయబడిన శీర్షికలతోసహా యెహోవా తీర్పులను ప్రకటించుటకు ఈనాడు ధైర్యము అవసరమైయున్నది. మనము ధైర్యముతోను మరియు యుక్తితోను ప్రకటించవలెను. మరియు మన సంభాషణ “ఉప్పువేసినట్లు” నీతిని ఇష్టపడువారికి రుచికరముగా ఉండవలెను. (కొలొస్సయులు 4:6) దైవభక్తిని యేసు ఉదాహరణముద్వారా నేర్చుకొని యెహోవా మనకిచ్చిన పని పూర్తి చేశామని భవిష్యత్తులో చెప్పగలవారమగుటకు ప్రయత్నింతుము గాక!—మత్తయి 24:14; యెహాను 17:4.
15. దేవుని పరిశుద్ధమర్మము విషయము, 1914 నుండి ఏమి జరిగెను?
15 సశరీరుడుగా ప్రత్యక్షుడైన యేసు ఎంతటి శ్రేష్టమైన ఉదాహరణమైయుండెను! దైవభక్తిని గూర్చిన మర్మము ఆయనలో ఎంత స్పష్టముగా పూర్తియాయెను! యెహోవా నామమును ఆయన ఎంత ధైర్యముగా ఘనపరచెను! అతని యథార్థత నిలుపు మార్గమునకు ప్రతిఫలముగా యేసు తండ్రి, ఎంత అద్భుతముగా ఆయనను ఆశీర్వదించెను! అయితే దేవుని పరిశుద్ధమర్మమునకు ఇంకను ఉన్నది. 1914 నుండి “మనము ప్రభువు దినమందు” జీవించుచున్నాము. (ప్రకటన 1:10) ప్రకటన 10:7 చెప్పినట్లు “సువార్త ప్రకారము దేవుని గూర్చిన పరిశుద్ధమర్మము సమాప్తమగుటకు” సమయము వచ్చియున్నది. పరలోక స్వరములు ఇప్పుడు ఇట్లు ప్రకటించెను: “ఈ లోక రాజ్యము మన ప్రభువు (యెహోవా) రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమును ఆయెను. ఆయన యుగయుగములు ఏలును.” (ప్రకటన 11:15) యెహోవా మెస్సీయా రాజైన యేసుక్రీస్తును తన మహిమాపూరిత సింహాసనము మీద తనతో సహ రాజుగా ఉండుటకు నియమించెను!
16. క్రొత్తగా సింహాసనాసీనుడైన యేసుక్రీస్తు వెంటనే పరలోకములో దైవత్వమునకు గౌరవమును ఎట్లుచూపెను?
16 క్రొత్తగా జన్మించిన రాజ్యములో దేవునితో సహరాజుగా ఉన్న యేసు మిఖాయేలు అనికూడా పిలువబడును. (అర్థము “దేవునివలె ఎవరున్నారు?”) ఏ విరోధి కూడా ఎప్పటికిని దేవునితో సమానుడు కాలేడు. క్రొత్తగా సింహాసనాసీనుడైన రాజు ఆదిసర్పమైన సాతాను మరియు అతని దూతలను భూమిపై పడద్రోయుట ద్వారా వెంటనే దీనిని ప్రదర్శించెను. (ప్రకటన 12:7-9) అవును, యేసుభూమిపై దైవభక్తిని ప్రదర్శించినట్లు పరలోకంలో కూడా దైవత్వమునకు గౌరవము చూపెను. మహిమపరచబడిన యేసుక్రీస్తు అబద్ధమతమును అంతమొనర్చి, సాతాను యొక్క దృశ్య మరియు అదృశ్య సంస్థను తుడిచి వేయునంతవరకు విశ్రమించడు.
17. 1914 నుండి మత్తయి 25:31-33లో చెప్పబడిన దాని నెరవేర్పుగా ఏమి జరుగుచున్నది?
17 1914 నుండి మత్తయి 25:31-33లోని యేసుయొక్క స్వంత ప్రవచన నెరవేర్పు దేవుని పరిశుద్ధమర్మమును తేజోమయంగా ఉజ్వల పరిచెను. అక్కడ యేసు ఇలా ప్రకటించెను: “తన మహిమతో మనుష్యకుమారుడును ఆయనతో కూడ సమస్త దూతలును వచ్చునప్పుడు ఆయన తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడైయుండును. అప్పుడు సమస్త జనములు ఆయన యెదుట పోగుచేయబడుదురు; గొల్లవాడు మేకలలోనుండి గొఱ్ఱెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచి, తన కుడివైపున గొఱ్ఱెలను ఎడమవైపున మేకలను నిలువబెట్టును.” పరలోకములో తన అనుకూల స్థలమునుండి ఈ మహిమగలరాజు, న్యాయాధిపతి, మరియు దైవభక్తిని గూర్చి చాటించువాడు మొదట ధర్మవిరోధపురుషునిపై మరియు మహాబబులోనులోని ఇతరభాగములపై అటుతరువాత, సాతానుయొక్క భూసంస్థను బలపరిచిన మేకలతో సహా ఇతరమూల పదార్ధములపై ప్రతిదండన తెచ్చును. అటుతరువాత సాతాను అగాధములో పడద్రోయబడును. (ప్రకటన 20:1-3) అయితే గొఱ్ఱెలవంటి “నీతిమంతులు” నిత్యజీవమునకు పోవుదురు. (మత్తయి 25:46) దైవభక్తిని వెంటాడుట మిమ్మునుకూడా ఆ లోపములేని గుంపులో ఉంచునుగాక!
18. దైవభక్తిని గూర్చిన పరిశుద్ధమర్మము సంబంధముగా మనము ఏ సంతోషకరమైన ఆధిక్యతను కలిగియున్నాము?
18 ప్రకటన 19:10 “దేవుని ఆరాధించమని” మనలను ప్రోత్సహించుచున్నది. ఎందుకు? ఆ లేఖనము ఇంకను చెప్పునదేమనగా: “యేసునుగూర్చిన సాక్ష్యము ప్రవచనసారము.” పూర్వము దైవావేశమువలన కలిగిన ఎన్నో ప్రవచనములు యేసునుగూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి, మరియు ఈ ప్రవచనములు నెరవేరినకొలది దేవుని పరిశుద్ధమర్మము స్పష్టమైనది. దైవభక్తిని గూర్చిన ఈ పరిశుద్ధమర్మము యేసునందు వ్యక్తీకరించబడినదని తెలిసికొనుటకు మనము సంతోషించుచున్నాము. దేవునిరాజ్యముయొక్క వినయ సేవకులుగా ఆయన అడుగు జాడలయందు నడుచుటకు మనము అద్భుత ఆధిక్యతను కలిగియున్నాము. అవును, సువార్తసారముగా దేవుని పరిశుద్ధ మర్మము నంతటిని అర్థము చేసికొనుటలో భాగము వహించి దానిని ప్రకటించుటలో మనము గౌరవించబడుతున్నాము! (w90 1/15)
మీరెట్లు ప్రత్యుత్తరమిచ్చెదరు?
◻ దైవభక్తిని గూర్చిన యేసు ఉదాహరణముద్వారా మనము ఏమి నేర్చుకొనగలము?
◻ క్రీస్తువలె మనము నీతివిషయమై ఎట్లు జీవించగలము?
◻ దైవభక్తిని గూర్చిన పరిశుద్ధమర్మమునకు తీవ్రవిరుద్ధంగా నిందించదగిన ఏ మర్మము నిలిచియున్నది?
◻ దైవభక్తిని గూర్చిన పరిశుద్ధమర్మము యెడలగల మన గుణగ్రహణ మనలను ఏమిచేయుటకు నడుపవలెను?
[20వ పేజీలోని చిత్రాలు]
దైవభక్తిని చాటించువానిగా మరియు ఆసక్తిగల రాజ్యప్రచారకునిగా యేసు పిలాతుతో ఇట్లు చెప్పగలిగెను: “సత్యమునకు సాక్ష్యమిచ్చుటకు నేను ఈ లోకమునకు వచ్చితిని”
[22వ పేజీలోని చిత్రాలు]
యేసు శాస్త్రులను పరిసయ్యులను ఖండించినప్పుడు ఆయనకు గల దైవభక్తి వ్యక్తపరచబడెను