నైతిక పరిశుభ్రత యువతకు సౌందర్యమైయున్నది
“యౌవనుడా, నీ యౌవనమందు సంతోషపడుము, . . ..నీ హృదయమును సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరికచొప్పునను నీ దృష్టియొక్క యిష్టముచొప్పునను ప్రవర్తింపుము; అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకముంచుకొనుము.”—ప్రసంగి 11:9.
1, 2. (ఎ) యువకులు ఏలాగుండవలెనని యెహోవా కోరుచున్నాడు? (బి) నీ హృదయమునకు, కన్నులకు అంగీకారమగు ప్రతిదానిని వెంటాడుట ఎందుకు బుద్ధిహీనతయైయున్నది?
“యౌవనము, ఉత్సాహము, లేతవయస్సు వసంతకాల దినములలాంటివి. కొద్దిపాటిదైన ఆ కాలమును గూర్చి ఫిర్యాదుచేయుటకు బదులు. . .దానిని అనుభవించుటకు ప్రయత్నించుము.” అని 19వ శతాబ్దపు జర్మను కవి ఒకరు వ్రాసెను. యౌవనస్థులైన మీకు చెప్పబడిన ఆ మాటలు, వేలసంవత్సరములకు పూర్వమే బైబిలుపుస్తకమైన ప్రసంగిలో వ్రాయబడిన మాటలను ప్రతిధ్వనించుచున్నవి: “యౌవనుడా, నీ యౌవనమందు సంతోషపడుము, నీ యౌవనకాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరికచొప్పునను, నీ దృష్టియొక్క యిష్టముచొప్పునను ప్రవర్తింపుము.” (ప్రసంగి 11:9ఎ) నీ యౌవనము యిష్టపడు కోరికలనుగూర్చి భిన్నమైన దృక్పధమును యెహోవాదేవుడు తీసికొనడు. నీ యౌవనపు బలమును నీ పుష్టిని పూర్తిగా అనుభవించుమని ఆయన కోరుచున్నాడు.—సామెతలు 20:29.
2 అంటే నీ హృదయము, నేత్రములకు ఏది ప్రీతికరముగా కనబడితే దానిని వెంటాడుమని దీని భావమా? ఎప్పటికిని కాదు! (సంఖ్యాకాండము 15:39; 1 యోహాను 2:16) లేఖనము యింకను యిలా చెప్పుచున్నది: “అయితే వీటన్నిటినిబట్టి [నీ కోరికలను తృప్తిపరచుకొనుటకు నీవు వెంటాడు వాటిని] దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకముంచుకొనుము.” (ప్రసంగి 11:9బి) ఔను, నీ క్రియల ఫలితములను నీవు తప్పించుకొనలేవు. పెద్దవారివలెనే యౌవనులును యెహోవా తీర్పునకు లోనుకాగలవారైయున్నారు.—రోమీయులు 14:12.
3, 4. (ఎ) నైతికపరిశుభ్రత కొరకు ఉన్నత ప్రమాణమును ఎందుకు కాపాడుకొనవలెను? (బి) దేవుని యెదుట నీ పరిశుభ్రమైన స్థానమును పోగొట్టుకొనుటకు నీపైన ఎటువంటి వత్తిడియున్నది, మరియు ఏ ప్రశ్నలు లేవదీయబడినవి?
3 యెహోవాయొక్క దయాప్రాప్తమైన తీర్పునుపొందుట నిత్యజీవమునకు నడుపుటయేగాక ప్రస్తుతము దేవునితో సన్నిహితసంబంధమును కలిగియుండుటకు వీలుకల్గించును. ఏమైనను, నీవు మాత్రము తప్పక నైతిక పరిశుభ్రత విషయములో ఉన్నత ప్రమాణమును కాపాడుకొనవలసియున్నావు. కీర్తన 24, 3 నుండి 5 వచనములు దానిని యిలా చూపుచున్నవి: “యెహోవా పర్వతమునకు ఎక్కదగినవాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగినవాడెవడు? వ్యర్ధమైన దానియందు మనస్సుపెట్టకయు కపటముగా ప్రమాణముచేయకయు, నిర్దొషమైన చేతులును, శుద్ధమైన హృదయమును కలిగియుండువాడే. వాడు యెహోవా వలన ఆశీర్వాదమునొందును తనరక్షకుడైన దేవునివలన నీతిమత్వమునొందును.” ఔను, నీవు నైతిక పరిశుభ్రతను కాపాడుకొనినప్పుడు యెహోవాకన్నులకు నీవు సౌందర్యమును కలిగియున్నావు.
4 అయినను, దేవునితో నీవు కలిగియున్న పరిశుభ్రమైన స్థానమును పోగొట్టుకొనుటకు నీపై యెడతెగని ఒత్తిడియున్నది. ఈ అంత్యదినములు వాటి ముగింపునకు నడచుచుండగా, అవినీతికరమైన ప్రవర్తన మరియు అపరిశుభ్రమైన ప్రభావముల తెగులు వునికిలోయున్నది. (2 తిమోతి 3:1-5) నైతిక పరిశుభ్రతను కాపాడుకొను సవాలు యువతకు ఎన్నడును ఇంతగా ఉండలేదు. నీవు విజయవంతముగా ఈ సవాలును ఎదుర్కొనుచున్నావా? నీవు అట్లు చేయుటయందు కొనసాగుదువా?
నీవు ఎదుర్కొను సవాలు
5. ఏ అపరిశుభ్ర ప్రభావములు దేవుని ఎదుట పరిశుభ్రమైన స్థానమును నిలువబెట్టుకొనుటను కష్టతరము చేయును?
5 యోగ్యమైనవాటిని ప్రక్కకునెట్టి నీచమైన లైంగిక అవినీతిని ఘనపరచు సంగతులద్వారా వినోదము యువతపై ముట్టడివేయుచున్నది. ఉదాహరణకు, వరుసగా వచ్చుచున్న నేరప్రవృత్తిగల హర్రర్ చిత్రములలో విడుదలైన ఒక సినిమాను గూర్చి ఒక విమర్శకుడు ఇట్లువ్రాసెను: “సెక్స్-షాక్, మర్డర్-షాక్, అశ్లీలత-షాక్‌ల మార్పు ఈ చిత్రములో ఎక్కువ మోతాదులలో యుండుట దీని మామూలు కార్యమైపోయినది. ఒకవేళ దీనిని చూచువారు ఎక్కువగాయుండినయెడల చిత్రములయెడలగల అభిరుచి. . .నీచమైన స్థాయికి పడిపోయినదనుటను వారు గుర్తుచేయువారైయుందురు.” అట్టి చిత్రములకు తోడు లైంగికతను కలిగియుండు పాటలు, దుర్నీతికరమైన, అక్రమ లైంగికతలను ఉన్నతపరుచు టెలివిజన్ కార్యక్రమములున్నవి. అట్టి “అపరిమితమైన ఆ దుర్వ్యాపారము”ల విషయమై నిన్నునీవు భద్రపరచకొనకుండా, దేవునితో పరిశుభ్రమైన స్థానమును నీవు కాపాడుకొనగలవా? (1 పేతురు 4:4) సామెత చెప్పునట్లు: “ఒకడు తన ఒడిలో అగ్నినుంచుకొనినయెడల వాని వస్త్రములు కాలకుండునా?—సామెతలు 6:27.
6. తమ తోటి వయస్కులనుండి యువకులు ఎటువంటి వత్తిడిని ఎదుర్కొందురు?
6 దేవునితోగల నీ పరిశుభ్రమైన స్థానమును పోగొట్టుకొనుటకు నీపై ఒత్తిడి ఇంకొకమూలమునుండి కూడా—నీ స్నేహితుల నుండి—వచ్చును. లోకస్తురాలైన, ఒక 17 సంవత్సరముల బాలిక యిలా విలపించినది: “నేను మొదటిసారి లైంగికానుభవమునకు పోవుటకు, నాకు అన్నియు చెడుకారణములేయుండెను: ఎట్లనగా, నా బాయ్‌ఫ్రెండ్ నన్ను బలవంతపెట్టినందునను, ప్రతివారు దానిని చేయుచున్నారని నేను తలంచుటచేతను నేనాపనిచేసాను.” ఎవరును నవ్వులపాలు కావలెనని కోరుకొనరు. యితరులు మెచ్చుకొనవలెనని ప్రతివారును కోరుకొనుట సహజమే. అయితే నీవు బైబిలు నైతికత్వము కొరకు నిలువబడినట్లయిన, ఇతరయువకులు నిన్ను హేళనచేయవచ్చును. వారితో కలసిపోవలెనను కోరిక, అలాగే నీ స్నేహితుల అంగీకారమును పొందవలెననుట, తప్పని తెలిసినదానిని నీవు చేయుటకు అది నీపై వత్తిడిని తెచ్చును.—సామెతలు 13:20.
7. అపరిశుభ్ర ప్రభావములను ఎదుర్కొనుటలో ప్రత్యేకముగా యువకులకు ఎందుకు కష్టము, అయితే యెహోవా సంస్థలోవున్న వేలాదిమంది యువకులు తమ్మునుతాము ఏమని నిరూపించుకొనిరి?
7 ప్రత్యేకముగా, యీడు వచ్చినప్పుడు, అనగా అంతర్గతమందు లైంగిక వత్తిడులు బలముగావున్నప్పుడు ఈ ప్రభావములకు వ్యతిరేకముగా పోరాడుట కష్టము. (1 కొరింథీయులు 7:36) ఒక పరిశోధక సంస్థ యిలా తేల్చిచెప్పినదనుటలో ఆశ్చర్యము లేదు: “19 సంవత్సరముల లోపు ఒక యువకుడు వివాహమునకు ముందు లైంగికసంబంధమును కలిగిలేడంటే అది చాలా అరుదైన విషయము.” అయినను, యెహోవాసంస్థలో నున్న యౌవనస్థులైన మీరు మిమ్మును మీరు అరుదైనవారిగా చూపించుకొనియున్నారు. మీరు నలుదిశలనుండి సవాలును ఎదుర్కొనుచున్నను, నైతిక పరిశుభ్రతను కాపాడుకొనుచున్నారు.
8. ఎందుకు కొంతమంది క్రైస్తవ యువకులు తమపై ఈ లోకపు అనైతిక దృక్పధములు రుద్దబడునట్లు అనుమతించారు, దాని ఫలితమేమి?
8 చెప్పుటకు విచారకరమైన సంగతేమనగా, కొందరు క్రైస్తవ యౌవనులు లోకసంబంధమైన అవినీతికర దృక్పధములు తమపై రుద్దబడునట్లు అనుమతించియున్నారు. వారు నీతిని ప్రేమించుచున్నామని చెప్పుకొన్నను, చెడును ద్వేషించినవారు కారు. కనీసము అవసరమైనంతమట్టుకైనను వారు చెడును ద్వేషించినవారు కారు. (కీర్తన 97:10) కొన్నిసార్లు, వారు చివరకు దానిని ప్రేమించినట్లును కనబడుచున్నది. కీర్తన 52:3 చెప్పినట్లుగా: “మేలుకంటె కీడు చేయుటయు, నీతి పలుకుటకంటె అబద్ధము చెప్పుటయు నీ కిష్టము.” కొందరు, వివాహము కాకముందు స్త్రీపురుషులు ఒంటిరిగా కలసిమెలిసి తిరుగుట, వినోదము, మరియు నైతికత విషయములో యెహోవా సంస్థ యిచ్చిన నడిపింపును తిరస్కరించునంత దూరము వెళ్లిరి. తత్ఫలితముగా వారు తరచు తమమీదికి తమ తల్లిదండ్రులమీదికి అవమానమును తెచ్చుదురు. అంతేకాకుండా, వారు దేవుని దృష్టియందును తమ సౌందర్యమును కోల్పోవుదురు.—2 పేతురు 2:21, 22.
సవాలునెదుర్కొనుటలో సహాయము
9. నైతికముగా పరిశుభ్రముగానుండు సవాలును ఎదుర్కొనుటకు ఏమి అవసరమైయున్నది?
9 నైతికముగా పరిశుభ్రతను కలిగియుండు సవాలును మీరు ఎట్లు ఎదుర్కొనగలరు? ఇదే ప్రశ్నను కీర్తనల రచయిత అడుగుచున్నాడు: “యౌవనులు, దేనిచేత తమనడతను శుద్ధిపరచుకొందురు?” తరువాత ఆయన సమాధానము యిలాగున్నది: “నీవాక్యమునుబట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుటచేతనే గదా?” (కీర్తన 119:9) అవును, మీకు దేవుని వాక్యమునుండి నడిపింపు అవసరమైయున్నది. మరియు ప్రేమగల మన పరలోకపు తండ్రి ఈ లోకపు అపరిశుభ్రమైన ఒత్తిడులను ఎదిరించుటకు సహాయపడుటకై తన సంస్థ నడిపింపునిచ్చునట్లు చేసియున్నాడు.
10, 11. (ఎ) యౌవనులు నైతికముగా పరిశుభ్రతతో నిలిచియుండునట్లు సహాయముచేయుటకు ఏ ప్రచురణలు తయారుచేయబడినవి? (బి) “యంగ్ పీపుల్ ఆస్క్. . . ” అను వరుస శీర్షికలద్వారా కొంతమంది యౌవనస్థులు ఏ విధముగా సహాయము పొందిరి? (సి) నీవు వ్యక్తిగతముగా “యంగ్‌పీపుల్ ఆస్క్. . . ” శీర్షికలనుండి ఎట్లు ప్రయోజనము పొందితివి?
10 ప్రత్యేకముగా యౌవనులను దృష్టిలో యుంచుకొని గడచిన సంవత్సరములయందు యువర్ యూత్—గెటింగ్ ది బెస్ట్ అవుట్ ఆఫ్ ఇట్, లాంటి ప్రచురణలు ఎన్నో తయారుచేయబడినవి. 1982నుండి అవేక్! పత్రికలో వరుసగా ప్రచురింపబడుచున్న “యంగ్ పీపుల్ ఆస్క్ . . . ”నందు బూతుసాహిత్యములు, ప్రేమకథల పుస్తకములు, కలిసిమెలిసి తిరుగునప్పుడు కలిగియుండవలసిన ప్రవర్తన మొదలగు వాటిపైన సహాయకరమగు సలహాలనందించినది. అట్టి సమాచారము యౌవనులకు నిజముగా సహాయపడినదా? ఒక ఉదాహరణను గమనించండి. హస్తప్రయోగపు అలవాటును గూర్చి, ఆ అలవాటు చివరకు లైంగిక కోరికను పెంచి ఒకరిని ఎట్లు సులభముగా లైంగిక అవినీతిలోకి దింపునో చూపించు శీర్షికలు అనేకము ఆ వరుసలో ప్రచురింపబడినవి.a (కొలస్సయులు 3:5) ఆ అలవాటుకు వ్యతిరేకముగా ఎట్లు పోరాడవలసినది, మానివేసిన తరువాత మరలా దానిలో పడకుండా ఎట్లు వ్యవహరించవలెను వంటి విషయములపై ఆచరణయోగ్యమైన సలహాలు అందించబడెను. ఈ శీర్షికలకు ప్రత్యుత్తరముగా కొందరు యౌవనులు యిలా వ్రాశారు: “ఈ హస్తప్రయోగపు అలవాటును నేను 12సంవత్సరముల వయస్సునుండి కలిగియున్నాను. ఇప్పుడు నాకు 18సంవత్సరములు మెల్లగా దానినుండి తేరుకొనుచున్నాను. అటువంటి శీర్షికలను ప్రచురించినందుకు నేను మీకు వందనములు తెలియజేయుచున్నాను.” “ఆ శీర్షికలు యిచ్చిన సలహాను నేను చేపట్టియున్నాను. ఇప్పుడు బహుశ్రేష్టమైన మానసిక స్థితిలోయున్నాను. మునుపటికంటే యిప్పుడు నేనెంతో పరిశుభ్రముగా యున్నట్లు భావించుకొనుచున్నాను.”
11 అట్టి సమాచారమును చదువుటకు, శ్రద్ధగా పఠించుటకు సమయమవసరము, అంతేకాకుండా, అట్లు చేయుటవలన నీవు నైతికముగా పరిశుభ్రముగా యుండుటకు అది నీకు సహాయపడగలదు. ఆవిధముగా ప్రచురింపబడిన సమాచారమునుండి నీవు పూర్తిప్రయోజనమును పొందుచున్నావా? “యంగ్ పీపుల్ ఆస్క్ . . .”లోని “పెండ్లికాకముందే లైంగిక సంబంధము—ఎందుకు కూడదు?”b అను శీర్షికకు ప్రత్యుత్తరమిస్తూ, అప్పటికే బైబిలును గూర్చి నేర్చుకొనుచున్న ఒక యౌవన బాలిక యిట్లు వ్రాసినది: “వివాహమునకు ముందే కలిగియుండు లైంగికసంబంధము ఫలితముగా కలుగు చెడు, దోషము, అసూయాభావములను నేను ఎరిగియున్నాను. దాని విషయమై నేనెంతో దుఃఖించుచున్నాను. నన్ను అంగీకరించినందుకు మరియు క్షమించినందుకు నేను ప్రతిదినము యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాను. నేను చేసినట్లు యితరులును చేయకముందే వారికి మీ శీర్షిక సహాయపడగలదని ఆశించుచున్నాను. అది నిజముగా గాయపరచును. యెహోవా దేవుడు మనలను ‘వ్యభిచారమునకు దూరముగా పారిపోవుడి’ అని ఎందుకు చెప్పుచున్నాడో నేనిప్పుడు అర్థము చేసుకొనుచున్నాను.”—1 థెస్సలొనీకయులు 4:3.
12. యెహోవాను సంతోషపరచగోరుటకు మనలను ఏది నడిపించును?
12 మీరు సవాలును విజయవంతముగా ఎదుర్కొనుటకు సహాయపడు మరొక విషయమునకు ఇది మనలను తెచ్చుచున్నది. అదేమనగా: యెహోవా విశ్వసార్వభౌముడని మీరు గుణగ్రహించి ఆయనకు విధేయులు కావలెను. (ప్రకటన 4:11) అయినను, అదేసమయములో ఆయన మనప్రేమగల పరలోకపుతండ్రియైయుండి, మనకు కావలసిన శ్రేష్ఠమైన సంగతులను తన హృదయమందు కలిగియున్నాడు. (సామెతలు 2:20-22; యెషయా 48:17) ఆయన ఆజ్ఞలు మనను అనవసరముగా కట్టివేయునవిగాకాక, మనలను సంరక్షించుటకై ఉద్దేశించబడియున్నవి. వాటికి విధేయులగుట జ్ఞానయుక్తమైన విధానమైయుండును. (ద్వితీయోపదేశకాండము 4:5, 6) నైతిక పరిశుభ్రతను ఎందుకు గట్టిగా కోరుచున్నాడో అర్థము చేసుకొనుట, అందులోని నిజమైన సౌందర్యమును చూడగలిగి, ఆయనను సంతోషపరచుటకు నీవు కోరునట్లు నిన్ను నడిపించుటకు సహాయము చేయును.—కీర్తన 112:1.
13. జారత్వమును నిషేధించు యెహోవా ఆజ్ఞయందు ఆయన మన మేలులను తన హృదయమందు కలిగియున్నాడని నీవెట్లు వివరింతువు?
13 లైంగికసంబంధమును దేవుడు కేవలము వివాహమునకు మాత్రమే పరిమితముచేసి ఖండితముగా వ్యభిచారమును నిషేధించుచున్నాడను వాస్తవమును విచారించుము. (హెబ్రీయులు 13:4) ఈ ఆజ్ఞకు విధేయులగుట, నీవు అనుభవించు మేలును తీసివేయునా? జీవితములో నీవు అనుభవించు సంతోషమును ప్రేమగల పరలోకపుతండ్రి దోచుకొనునా? ఆయనలా చేయడు! దేవుని నైతికచట్టమును లక్ష్యపెట్టని నీతోటి వారికి ఏమి సంభవించుచున్నదో చూడుము. కోరుకొనని గర్భములు తరచు గర్భస్రావములకు లేక, బహుశ ఈడురాకముందే వివాహములు చేసుకొనుటకు నడుపుట జరుగుచున్నది. అనేక సందర్భములలో భర్తలేకుండ పిల్లలను పెంచుపరిస్థితి ఏర్పడుచున్నది. అంతేకాకుండా, జారత్వము జరిగించు యౌవనులు ‘తమస్వంత శరీరములకు వ్యతిరేకముగా పాపముచేయుచు తమ్మునుతాము సుఖవ్యాధులకు గురిచేసుకొనుచున్నారు. (1 కొరింథీయులు 6:18) యెహోవాకు సమర్పించుకొనిన యువకుడు జారత్వము జరిగించినయెడల, దానికి తోడుగాకలుగు వినాశనకరమైన భావోద్రేకమునకు లోనగును. దోషమనస్సాక్షి వలనకలుగు యెడతెగని చింతను అణచుకొనుటకు చేయు ప్రయత్నములు అలసటకు, నిద్రలేని రాత్రులకు నడిపించును. (కీర్తన 32:3, 4; 51:3) కావున, వ్యభిచారమును నిషేధించు యెహోవా ఆజ్ఞ నిన్ను సంరక్షించుటకై రూపించబడినది కాదా? నైతిక పరిశుభ్రతను కాపాడుకొనుటలో నిజమైన ప్రయోజనమున్నది!
14. యౌవనపు తొలిదశలోని వివాహము ఒక రక్షణ అను వాదము దృష్ట్యా, 1 కొరింథీయులు 7:9, మరియు 7:36 లలోని పౌలు మాటలను మనము ఏ విధముగా దృష్టించవలెనో వివరించుము?
14 నిజమే, నైతికతను గూర్చిన దేవుని కఠినమైన ఆజ్ఞలను పాటించుట అంత సులభమైనదేమి కాదు. విషయమిట్లుండుటను బట్టి కొందరు యువకులు, కౌమారదశలోనే వివాహము చేసుకొనుట రక్షణప్రదమను ముగింపుకొచ్చిరి. ‘ఏముంది’ 1 కొరింథీయులు 7:9లో: “మనస్సు నిలుపలేనియెడల పెండ్లి చేసికొనవచ్చును; కామతప్తులగుటకంటె పెండ్లిచేసికొనుట మేలు” అని బైబిలు చెప్పుటలేదా?’ అని వారు తర్కింతురు. అయితే, అట్టి దృష్టి ముందుచూపు లేనిదైయున్నది. పౌలు మాటలు కౌమారదశలో యున్నవారినుద్దేశించి కాక, “ఈడుమించిన” వారినుద్దేశించి మాట్లాడినవైయున్నవి. (1 కొరింథీయులు 7:36) దాదాపుగా, యౌవనపు తొలిదశలోయున్నవారు ఎవరును ఇటు భావోద్రేకముగాను, అటు ఆత్మీయముగాను వివాహవత్తిడులను, బాధ్యతలను మోయగలిగనంత స్థితికి ఎదిగినవారైయుండరు. జర్నల్ ఆఫ్ మ్యారేజ్ అండ్ ది ఫ్యామిలి అను పత్రిక యిట్లు రిపోర్టు చేయుచున్నది: “లేతవయస్సులో వివాహముచేసుకొను వారు వివాహసంబంధమైన తృప్తిని తక్కువగా అనుభవింతురు, కారణమేమనగా వివాహితపాత్రను నిర్వహించుటకు కావలసిన సిద్ధత వారికుండదు. పాత్రనిర్వహణాలోపము తృప్తిని క్షీణింపజేయును, కాగా అది వివాహ అస్థిరతకు నడిపించును.” కాబట్టి దానికి పరిష్కారమేమనగా, యౌవనతొలిదశలోనే వివాహమాడుట కాదుగాని, వివాహమును విజయవంతముచేయుటకు అవసరమైన లక్షణములన్నిటిని నీవు పెంచుకొనువరకు పవిత్రముగా ఒంటరితనమును కాపాడుకొనుటయే.
మిమ్మును మీరు పరిశుభ్రముగా యుంచుకొనుడి!
15. నీవు నైతిక పరిశుభ్రతను కలిగియుండుటకు ఏ గట్టిచర్యలను తీసుకొనవలెను?
15 అపొస్తలుడైన పౌలు యిట్లు వ్రాసెను: “భూమిమీదనున్న మీ అవయములను, జారత్వమును, అపవిత్రతను, కామాతురతను. . .చంపివేయుడి.” (కొలస్సయులు 3:5) అవును గట్టిచర్యలు అవసరము; నైతికముగా పరిశుభ్రముగానుండుటకు నీవు తప్పక నిర్ణయించుకొనవలెను. “చంపివేయుడి” అను క్రియాపదముపై వ్యాఖ్యానించుచు ది ఎక్స్‌పొజిటర్స్ బైబిలు కామెంటరీ యిలా చెప్పుచున్నది: “అది కేవలము మన చెడుక్రియలను లేక దృక్పధములను అణచివేసుకొనుటను మరియు అదుపు చేసుకొనుటను గూర్చి మాత్రమే సలహానిచ్చుటలేదు. అయితే వాటిని మనము పూర్తిగా తుడిచివేయవలెను, సంపూర్ణముగా పాత జీవితవిధానమును నిర్మూలము చేయవలెను. ‘పూర్తిగా హతముచేయుము’ అనునది దాని తీవ్రతను వ్యక్తపర్చవచ్చును. . .క్రియ అర్థము మరియు చెప్పబడిన తీవ్రత బలమైన పోరాటముతో కూడిన మరియు బాధాకరమైన వ్యక్తిగత తీర్మానమును సూచించుచున్నది.”—మత్తయి 5:27-30ను పోల్చుము.
16. నైతికముగా పరిశుభ్రముగా నిలిచియుండుటకు నీవెందుకు మానసికముగా పరిశుభ్రముగా యుండుటకు కష్టించి పనిచేయవలెను, మరియు అట్లు చేయుటలో నీవెట్లు గెలుపొందగలవు?
16 మరి నీవు ఎట్లు నైతికముగా అపరిశుభ్రమైన క్రియలను, వైఖరులను ‘పూర్తిగా హతము’చేయగలవు లేక ‘తుడిచి వేయగలవు? ఈ మాటలను చెప్పినప్పుడు యేసు సమస్యకు నిజమైన మూలమును తెల్పెను: “లోపలినుండి, అనగా మనుష్యుల హృదయములోనుండి దురాలోచనలును, జారత్వములును, దొంగతనములును. . .వచ్చును.” (మార్కు 7:21, 22) సూచనార్థక హృదయమందు, ఆలోచన సామర్థ్యములును యిమిడియున్నవి. అందుకే అది “ఆలోచనలతో” జతపరచబడెను. నైతికముగా నీవు పరిశుభ్రముగానుండుటకు మొదట నీవు మానసికముగా పరిశుభ్రముగావుండుటకు ప్రయత్నించవలెను. ఎట్లు? జ్ఞానేంద్రియములతో మనసు నింపబడును గనుక, కండ్లతో చూచువాటిని, అనగా లైంగిక అవినీతిని చూపించు లేక సమర్ధించు టి.వి. కార్యక్రమములు, సినిమాలు, పుస్తకములు మొదలగు విషయములకు వ్యతిరేకముగా నీవు జాగ్రత్తపడవలెను. అలాగే నీ చెవులతో నీవు వినువాటి విషయమందును జాగ్రత్తపడవలెను, అనగా లైంగికసంబంధమైన మాటలతోనిండిన పాటలు వినుటను నీవు విసర్జించవలెను. ప్రత్యేకముగా నీ తోటివయస్సువారి ముందు అటువంటి స్థానమును తీసుకొనుటకు నీకు ధైర్యమవసరము, అయితే అలాచేయుట నీవు నైతికముగా పరిశుభ్రముగాయుండి వ్యక్తిగత గౌరవమును కాపాడుకొనుటకు నీకు సహాయము చేయును.
17. నైతిక అపరిశుభ్రతను మీమధ్య కనీసము ఉచ్చరించుటయైనను ఎందుకుండకూడదు?
17 అపొస్తలుడైన పౌలు యిట్లు హెచ్చరించెను: “మీలో జారత్వమేగాని, యే విధమైన అపవిత్రతయేగాని, లోభత్వమేగాని, వీటిపేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది.” (ఎఫెసీయులు 5:3; 12వ వచనమును కూడా చూడుము) కావున నైతిక అపరిశుభ్రత ఉచ్చరింపబడకూడదు అనగా, దానిపై మనస్సునిలుపుట లేక దానిని తమాషాకైనను ప్రస్తావించుట కూడదు. ఎందుకు? బైబిలు విద్వాంసుడైన విలియమ్ బార్‌క్లే వివరించినట్లుగా: “ఒక విషయమును గూర్చి మాట్లాడుట, లేక సరసోక్తులాడుట లేక తరచు మన సంభాషణా అంశముగా చేయుట దానిని మనస్సులోకి ప్రవేశింపజేసుకొనుటయు, అలాగే దానిని వాస్తవమందు జరిగించుటకునైయున్నది.” (యాకోబు 1:14, 15) ప్రత్యేకముగా ఇతర యువకులు బూతు పరిహాసములు చెప్పునప్పుడు లేక లైంగికచర్యలను వివరించుటకు ద్వందార్థభాషను ఉపయోగించునప్పుడు ‘నీ నోటికి కాపుదలగా దానికి చిక్కమువేసుకొనుటకు’ నిజమైన తీర్మానము అవసరము. (కీర్తన 39:1) అయితే యథార్థముగాను, పరిశుభ్రముగాను నిలిచియుండుటద్వారా నీవు యెహోవా హృదయమును సంతోషపెట్టుదువు.—కీర్తన 11:7; సామెతలు 27:11.
18. (ఎ) నైతిక అపరిశుభ్రతకు వ్యతిరేకముగా చేయు పోరాటములో గెలుపొందుటకు, కేవలము అపరిశుభ్ర ఆలోచనలను, భాషను తిరస్కరించుట మాత్రమే ఎందుకు చాలదు? (బి) ఫిలిప్పీయులకు పౌలు యిచ్చిన సలహానుండి నీవెట్లు ప్రయోజనము పొందవచ్చును?
18 నైతిక అపరిశుభ్రతకు వ్యతిరేకముగా జరిగించు పోరాటములో గెలుపొందుటకు, కేవలము అపరిశుభ్రమైన ఆలోచనలను మరియు మాటలను తృణీకరించుట మాత్రమే సరిపోదు. చైనీయుల సామెత ఒకటి యిట్లు చెప్పుచున్నది: “ఖాళీగా ఉన్న మనస్సు సమస్త సూచనలకు తెరుచుకొని యుండును.” (మత్తయి 12:43-45ను పోల్చుము.) అందుకే మనస్సును ఆరోగ్యకరమైన, మరియు పరిశుభ్రమైన తలంపులతో నింపవలసిన అవసరతను పౌలు గుర్తించెను. ఫిలిప్పీయులను ఆయన దృఢముగా యిట్లు పురికొల్పెను: “ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో, వాటిమీద ధ్యానముంచుకొనుడి. [వాటిని జాగ్రత్తగా తలపోయు అంశములుగా చేసుకొనుడిc].”—ఫిలిప్పీయులు 4:8.
19. దేవుని వాక్యమును పట్టుదలతో ఎందుకు చదువవలెను, మరియు నైతికముగా పరిశుభ్రముగా యుండుటకు ఇది ఏ విధముగా సహాయముచేయును?
19 దేవుని వాక్యమును శ్రద్ధతో పఠించుటయని దీని భావము. (యెహోషువ 1:8; కీర్తన 1:2) అది నీ మనస్సును, నీ హృదయమును బలపరచి యెహోవాతో సన్నిహిత సంబంధమును వృద్ధిచేసికొనుటకు సహాయము చేయును. అప్పుడు లైంగిక అపరిశుభ్రమైన ప్రవర్తనయందు పాల్గొనుటకు ఎదురయ్యే శోధనలను ఎదిరించగల మంచి స్థానములో నీవుందువు. యెహోవా నామమునకు, నీ కుటుంబమునకు, సంఘమునకు అవమానమును తెచ్చు సాహసమును అతిసులభముగా చేయవు. బదులుగా యౌవనములో నీవు కలిగియున్న పుష్టిని మరియు బలమును తరువాత దుఃఖపడు రీతిగా కాకుండునట్లు ఉపయోగింతువు. అవును, యెహోవాను సేవించు యువతకు నిజమైన సౌందర్యమగు నైతిక పరిశుభ్రతామార్గమును నీవు అనుసరించెదవు! (w89 11/1)
[అధస్సూచీలు]
a ఈ అవేక్! సంచికలను చూడుము, సెప్టెంబరు 8, 1987, పుటలు 19-21; నవంబరు 8, 1987, పుటలు 18-20; మరియు మార్చి 8, 1988, పుటలు 20-3.
b అవేక్! డిశంబరు 8, 1985, పుటలు 10-13.
c ది ఎక్స్‌పోజిటర్స్ గ్రీక్ టెస్ట్‌మెంట్.
యౌవనులారా—మీరు ఎట్లు జవాబిచ్చెదరు?
◻ నైతిక పరిశుభ్రతయొక్క ఉన్నతప్రమాణమును నీవెందుకు కాపాడుకొనవలయును?
◻ దేవుని ఎదుట పరిశుభ్రమైన స్థానమును నిలబెట్టుకొనుటను ఏవి ఒక సవాలుగా చేయును?
◻ నైతికముగా పరిశుభ్రతను కలిగియుండుటకు సంబంధించిన సవాలును ఎదుర్కొనుటలో మీకు ఏమి సహాయముచేయును?
◻ నిన్ను నీవు పరిశుభ్రముగా ఉంచుకొనవలెనన్న ఏ గట్టిచర్యలు అవసరము?
[23వ పేజీలోని బాక్సు]
యవనదశ తొలిప్రాయమందున్న దాదాపు అందరు తలిదండ్రులుగా బాధ్యతను చేపట్టుటకు చాలినంత వయస్సులేని పసివారైయుందురు