హానికరమైన వదరుబోతు మాటల విషయంలో జాగ్రత్తపడండి!
“విస్తారమైన మాటలలో దోషముండక మానదు, తన పెదవులను మూసికొనువాడు బుద్ధిమంతుడు.”—సామెతలు 10:19.
1. ద్వేషముతో కూడిన వదరుమాటలు లేదా చాడీలు ఎంత ప్రమాదకరమైనవి?
విషమును ఆరోగ్యకరమైన పానీయముగా ఏదియు మార్చజాలదు. ద్వేషముతో కూడిన వదరుమాటలను లేదా చాడీని (కొండెము) విషముతో పోల్చుట సరియే. అవి సత్పురుషుని మంచి పేరును కూడ చెరచి వేయగలవు. కొండెములు “విషములన్నింటిలోకెల్లా అతి ప్రమాదమైనవని” రోమీయుల కవి జువినల్ అన్నాడు. ఆంగ్లేయనాటక రచయిత విలియం షేక్స్ఫియర్ ఈ మాటలను ఒకానొక పాత్రదారుని నోటనుండి పల్కించెను: “నాకున్న మంచి పేరును నానుండి సంగ్రహించినవాడు, తన్ను సంపన్నుని చేయని దానిని నానుండి దోచుకొని నన్ను నిజంగా పేదవాడిని చేస్తున్నాడు.”
2. ఏ ప్రశ్నలు చర్చించవలసియున్నది?
2 అయితే అసలు వదరులు అంటే ఏమిటి? కొండెములకు దానికి ఉన్న వ్యత్యాసమేమిటి? హానికరమైన వదరు మాటల విషయంలో ఎందుకు జాగ్రత్త కల్గియుండాలి? అది ఎలా సాధ్యమగును?
అవి ఎలా వ్యత్యాసమును కల్గియున్నవి
3. వదరుమాటలు, చాడీలమధ్య నున్న వ్యత్యాసమేమిటి?
3 వదరుట అనగా “ఇతరులనుగూర్చి వారి వ్యవహారములనుగూర్చి వ్యర్థమైన మాటలు పల్కడం, కొన్నిసార్లు వాటిలో నిజముండక పోవచ్చును.” అది “చులకనైన, బాగా పరిచయమున్న మాట లేక వ్రాతయైయున్నది.” మన మందరము ప్రజలయందు ఆసక్తికల్గి యున్నందున యితరులకు మేలుకరమైన ప్రోత్సాహకరమైన వాటిని కొన్ని సార్లు మనము పల్కియుండవచ్చును. చాడీయైతే (కొండెము) వేరు. “ఇతరునికున్న మంచి పేరు ప్రతిష్టకు భంగము కల్గించే ఒక తప్పుడు మాట చెప్పుటే” కొండెము. అట్టి మాటలు సాధారణంగా ద్వేషముతో కూడినవి కనుక క్రైస్తవునికి తగవు.
4. ఒక రచయిత చెప్పినట్లు చాడీ ఎలా ప్రారంభమగును, అది దేనినుండి ఉత్పన్నమగును?
4 ప్రమాదములేని వదరుమాటలు కూడ తీవ్రమైన కొండెములుగా మారవచ్చును. ఆర్థర్ మీ అను లేఖికుడు యిలా చెప్పెను: “తరచు ఎక్కువగా చాడీలు ఒకవ్యక్తికి హానిచేసి, అతని పతనానినికి దారితీయవు. వదరుమాటలు బహుశ మొదట్లో సరదాగానే, ఏమి ప్రమాదంలేని విధంగా కన్పించే వదరు మాటలతో ప్రారంభమగును.” లోకమందున్న అతి చెడ్డవాటిలో ఇది ఒకటి. కాని వాస్తవంగా అది అవివేకమునుండి ఉత్పన్నమగును. చేయడాన్కి పని ఏమి లేని వారిలోను, జీవితములో ఒక ధ్యేయములేనివారిలోను ముఖ్యంగా మనము దీనిని కనుగొంటాము.”
5. పౌలు 1 తిమోతి 5:11-15 నందు యిచ్చిన సలహా సారాంశమేమిటి?
5 వ్యర్థమైన మాటలు కొండెములకు నడుపును గనుక కొంతమంది వదరుబోతులను గూర్చి అపొస్తలుడైన పౌలు మాట్లాడెను. సంఘ సహాయమునకు అర్హులైన విధవలనుగూర్చి తెల్పిన పిదప ఆయనిట్లు వ్రాసెను: “యౌవనస్థులైన విధవరాండ్రను లెక్కలో చేర్చవద్దు, వారు క్రీస్తునకు విరోధముగా నిరంకుశులైనప్పుడు మరియు వారు ఇంటింట తిరుగులాడుచు, బద్ధకురాండ్రగుటకు మాత్రమేకాక, ఆడరాని మాటలాడుచు వదరుబోతులును పరులజోలికి పోవువారునగుటకును నేర్చుకొందురు. కాబట్టి యౌవన స్త్రీలు వివాహము చేసికొని పిల్లలను కని గృహపరిపాలన జరిగించుచు, నిందించుటకు విరోధికి అవకాశమియ్యకుండవలెనని కోరుచున్నాను. ఇంతకు ముందే కొందరు త్రోవనుండి తొలగిపోయి సాతానును వెంబడించిన వారైరి.”—1 తిమోతి 5:11-15.
6. కొండెములు చెప్పుటకు నడుపునటువంటి వదరుమాటలు పల్కే వ్యక్తిగత బలహీనతను జయించడాన్కి ఏమిచేయాలి?
6 పౌలు దైవ ప్రేరేపణచేత వ్రాసెను గనుక, ఈ స్త్రీలను గూర్చి ఆయన అన్యాయంగా మాట్లాడుట లేదు. అతడు చెప్పినది ప్రతి తీవ్రమైన యోచనకు మేతవంటిది. దైవికమైన ఏ స్త్రీయు ‘తాను త్రోవనుండి తొలగిపోయి సాతానును వెంబడించగోరదు.’ అయితే, కొండెములు చెప్పుచున్నదనే దోషారోపణ చేయునటువంటి మాటలు పల్కే బలహీనత తనకు ఉన్నదని ఒక క్రైస్తవ స్త్రీ కనుగొంటే ఏమిచేయాలి? అప్పుడు తాను వినయంతో పౌలు మాటలను లక్ష్యపెట్టాలి: “స్త్రీలు మాన్యులును, కొండెగత్తెలునై యుండక ప్రవర్తనయందు భయభక్తులు గలవారైయుండవలెను.” (1 తిమోతి 3:11; తీతు 2:3) సహోదరులు కూడ అట్టి వివేకమైన సలహా సాదరముగా అన్వయించవలెను.
7. లేఖనముల ప్రకారము, మనము పల్కేవాటిని మన మంతా నియంత్రణ చేసికోవాలని నీవెందుకు సలహాయిచ్చెదవు?
7 నిజమే, కొన్నిసార్లు మనమంతా ఇతరులను గూర్చి పరిచర్యలోవారి అనుభవములను మున్నగువాటినిగూర్చి మాట్లాడుచు ఉంటాము. అయితే, మనమెన్నడు, ‘కూర్చుండి మన సహోదరునికి విరోధముగా మాట్లాడక’ యుందము. (కీర్తన 50:19, 20) నిజమే, అధికంగా మాట్లాడటం మంచిది కాదు, ఎందుకనగా “విస్తారమైన మాటలలో దోషముండక మానదు తన పెదవులను మూసికొనువాడు బుద్ధిమంతుడు.” (సామెతలు 10:19) కనుక వదరు మాటలు పల్కకుండ, అది యితరులకు హానికల్గించదని అనిపించినను దాని విషయములో జాగ్రత్త పడాలి. ఎల్లవేళల యితరులను గూర్చి మాట్లాడవలసిన అవసరత మనకులేదు. ఎందుకంటే ఏవి సత్యమైనవో, ఏవిమాన్యమైనవో ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతిగలవో వాటిని మనము యోచిస్తే మంచి అంశాలను మనము ఎంచుకొనవచ్చును.—ఫిలిప్పీయులు 4:8.
వదరుమాటలు ఎలా చాడీలు కాగలవు
8. తోటిక్రైస్తవులనుగూర్చి మాట్లాడుట అన్నివేళల ఎందుకు తప్పుకాదు?
8 మనతోటి విశ్వాసుల పరిచర్య, యితర దైవిక లక్షణములనుగూర్చి మనకు ఖచ్చితంగా తెలిసినయెడల, మనము చెప్పేదానినిబట్టి ఏ హాని కలుగదని అనుకుంటే దానినిగూర్చి మాట్లాడటంలో తప్పులేదు. వాస్తవానికి యిటువంటి సద్భావ వ్యాఖ్యలు యితరులను బలపర్చవచ్చును. (అపొస్తలుల కార్యములు 15:30-33 పోల్చుము.) నమ్మకమైన పెద్దయగు గాయును గూర్చి కొందరు మాట్లాడుకున్నారు. అపొస్తలుడైన యోహాను ఆయన కిలా వ్రాసెను: “ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసినదెల్ల విశ్వాసికి తగినట్లుగా చేయుచున్నావు. వారు నీ ప్రేమనుగూర్చి సంఘము ఎదుట సాక్ష్యమిచ్చిరి.” (3 యోహాను 5, 6) కనుక తోటి క్రైస్తవులనుగూర్చి మాట్లాడుట అన్నివేళల తప్పుకాదు.
9. (ఎ) యథార్థవంతుని గూర్చిన స్వల్పమైన మాటలు కొండెములుగా ఎలా మారగలవు? (బి) సరియైన విధంగా మనలను మనము ఏ ప్రశ్నలనడుగుకొనవలెను?
9 అయితే యథార్థవంతుని వ్యక్తిగత వ్యవహారములలో జోక్యం చేసికొనిన, వారి దృక్పథాలను ప్రశ్నించిన, లేక వారి ప్రవర్తననుగూర్చి అనుమానములు లేవదీసిన అట్టి స్వల్పమైన మాటలు కొండెములుగా మారగలవు. మనలను మనము యిట్టి ప్రశ్నలడుగుకొన అలవాటు చేసికోవాలి: వేరొక వ్యక్తి ప్రతిష్టను నా సంభాషణ పాడుచేయునా? నేను చెప్పేది సత్యమా? (ప్రకటన 21:8) అతని సమక్షములో అదే సంగతిని నేను చెప్పగలనా? సంఘములో అది విరోధమును సృష్టించునా? నామాటలు అతనికున్న సేవా ఆధిక్యతలను కోల్పోవునట్లు చేయునా? నా హృదయములో అసూయ ఉన్నదేమో? (గలతీయులు 5:25, 26; తీతు 3:3) నా వ్యాఖ్యానముల ఫలితము మంచా లేక చెడా? (మత్తయి 7:17-20) అపొస్తలులను గూర్చి కూడ నేను అట్టి సంగతులే చెప్పియుండే వాడినా? (2 కొరింథీయులు 10:10-12; 3 యోహాను 9, 10) అట్టిమాటలు యెహోవాయందు భయభక్తులు గలవారికి తగునా?
10, 11. కీర్తన 15:1, 3 ప్రకారము దేవుని అతిథిగా ఉండదల్చిన యెడల మనము ఏమిచేయకూడదు?
10 దేవుని సేవించువారిని ఉద్దేశించి కీర్తన 15:1 యిట్లడగుచున్నది: “యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగినవాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగినవాడెవడు?” అట్టి వ్యక్తిని గూర్చి కీర్తనల రచయిత దావీదు సమాధానమిస్తున్నాడు: “అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తనచెలికానికి కీడుచేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు.” (కీర్తన 15:3) ఇచ్చట “కొండెము లాడడు” అను పదము హెబ్రీ క్రియా పదమునుండి వచ్చినది, అర్థమేమనగా “అడుగుపెట్టెను” ఆవిధంగా “దానికైవెళ్లెను” అని చెప్పవచ్చును. ఇశ్రాయేలీయులకు యిలా ఆజ్ఞాపించబడెను: “నీ ప్రజలలో కొండెములాడుటకు వెళ్లవద్దు” (లేవియకాండము 19:16, న్యూఇంటర్నేషనల్ వర్షన్) ‘కొండెమును వ్యాప్తిచేయుటకు వెళ్లువాడెవడైన’ దేవుని అతిథిగా లేక స్నేహితునిగా ఉండజాలడు.
11 దేవునికి స్నేహితులెవ్వరు తమ తోటివారికి ద్రోహముచేయరు, యథార్థవంతులైన తమ సహవాసులకు అపకీర్తిని కల్గించు ఎట్టి కట్టు కథలనైనను వాస్తములని అంగీకరించరు లేదా స్వీకరించరు. తోటి విశ్వాసులనుగూర్చి తప్పుడు కథలను వ్యాప్తిచేసే భక్తిహీనుల మూలంగా వారు అప్పటికే భరిస్తున్న అపనిందలను అధికం చేసే బదులు, వారిని గూర్చి మనము మంచిగా మాట్లాడవలెను. మన సహోదరులనుగూర్చి అవమానకరమైన మాటలు పల్కి వారికున్న భారమును అధికముచేయుటకు ఎన్నడు కోరము.
కష్టములు వచ్చినపుడు
12. మనకు ఎవరితో అనంగీకారమున్నదో వారిని గూర్చి వదరు మాటలు పల్కుటకు మనము శోధింపబడితే అపొస్తలులకార్యములు 15:36-41 మనకు ఎలా సహాయముచేయును?
12 అపరిపూర్ణులము గనుక, మనకు ఎవరితోనైతే తీవ్రమైన అనంగీకారమున్నదో వారికి వ్యతిరేకముగా మాట్లాడుటకు మనము శోధింపబడవచ్చును. అయితే అపొస్తలుడైన పౌలు తన రెండవ మిషనరీ ప్రయాణమునకు ఆయత్తమగుచుండగా ఏమి జరిగిందో గమనించుము. మార్కు తమ వెంట ఉండాలని బర్నబా పట్టుబట్టినను, “పంపూలియలో పనికొరకు తమతోకూడ రాక తమ్మును విడిచి వెళ్లాడని గమనించి” పౌలు అంగీకరించలేదు. అంతట “తీవ్రమైన వాదము” చెలరేగివారు విడిపోయారు. బర్నబా మార్కును వెంటబెట్టుకొని కుప్రకు వెళ్లెను, పౌలైతే సిరియా, కిలికియగుండా ప్రయాణించుటకు సీలను తీసుకొనివెళ్లెను. (అపొస్తలుల కార్యములు 15:36-41) పౌలు, బర్నబా, మార్కుల మధ్య ఏర్పడిన కలహము అటుపిమ్మట మానిపోయింది. రోమునందు మార్కు అపొస్తలునితో ఉండెను. పౌలు అతని గూర్చి మంచి సాక్ష్యమిచ్చెను. (కొలొస్సయులు 4:10) వారిమధ్య విరోధమున్నప్పటికిని, ఆ క్రైస్తవులు తమ తోటి విశ్వాసుల మధ్య ఒకరినిగూర్చి మరొకరు వదరుచుండిరనుటకు సాక్ష్యాధారము లేదు.
13. పేతురు యిమిడియున్న ఏ పరిస్థితులలో తోటిక్రైస్తవునిగూర్చి వదరు మాటలు పల్కే శోధనను పౌలు ఎదుర్కొనెను?
13 యెరూషలేము నుండి వచ్చిన కొంతమంది యూదయ క్రైస్తవులున్నారని, అన్యుల నుండి విశ్వాసులైనవారితో భోజనముచేసి, సహవాసముచేయుటకు సిగ్గుపడిన కేఫానుగూర్చి (పేతురు) గద్దించినపుడు హానికరమైన వదరుబోతు తనమునకు నడిపే శోధనను కూడ పౌలు ఎదురించెను. పేతురునుగూర్చి చాటుమాటుగా మాట్లాడే బదులు పౌలు “అతనిని ముఖాముఖిగా ఎదురించెను” “అందరియెదుట మాట్లాడెను.” (గలతీయులు 2:11-14) తన్ను గద్దించిన వానిని గూర్చి పేతురు కూడ వదరుచు మాట్లాడలేదు. వాస్తవానికి, అతడు ఆయనను “మన ప్రియసహోదరుడైన పౌలు” అని అటుపిమ్మట సంబోధించెను. (2 పేతురు 3:15) కనుక ఒక తోటి విశ్వాసి గద్దించబడవలసియున్నను, అతనిని గూర్చి వదరుచూ మాట్లాడుటకు అది ఎట్టి అవకాశమివ్వదు. అట్టి మాటలను గూర్చి జాగ్రత్త పడుటకు, హానికరమైన వదరుబోతు మాటలను వ్యాప్తిచేయు శోధనను ఎదురాడుటకు ఎన్నోమంచి కారణములున్నవి.
ఎందుకు జాగ్రత్తపడాలి?
14. హానికరమైన వదరుమాటలను వినకుండుటకు లేదా వ్యాప్తిచేయకుండుటకు గల ప్రాథమిక కారణమేమిటి?
14 హానికరమైన వదరు మాటలను వినుటకు లేదా వ్యాప్తిచేయుటకు మనము యిష్టపడకుండుటకు గల ముఖ్యకారణమేమనగా కొండెములను అసహ్యించుకొను యెహోవాను మనము ప్రీతిపర్చగోరుచున్నాము. అట్టి మాటలను దేవుడు ఎలా దృష్టించుచున్నాడో ఇశ్రాయేలీయుల కివ్వబడిన ఆజ్ఞలో తేటపడింది: “నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరుగ కూడదు, నీ సహోదరునికి ప్రాణ హానిచేయ చూడకూడదు, నేను యెహోవాను.” (లేవీయకాండము 19:16) మనము దైవ అనుగ్రహమును పొందదల్చితే, మన సంభాషణలో ఎవరిని గూర్చియు కొండెములు పలుకకూడదు.
15. మొట్టమొదట కొండెగాడు ఎవడు, హానికరమైన వదరుబోతుతనమందు పాలుపొందుట దేవునితో మనకు గల సంబంధముపై ఎట్టి ప్రభావమును కల్గించును?
15 హానికరమైన వదరు మాటలలో పాలుపంచుకొనకయుండుటకు గల మరొక హేతువేమనగా, అది యెహోవామీద మొట్టమొదట కొండెములు చెప్పిన సాతానును అనుసరించుటకు నడుపును. దేవుని బద్ధ శత్రువైన యితనికి “అపవాది” (గ్రీకు డ.యా’బొ.లోస్) అనే పేరు తగినట్లుగానే పెట్టబడెను, అనగా “కొండెములు చెప్పువాడు” అని అర్థము. దేవునికి వ్యతిరేకముగా కొండెములు పల్కిన సాతాను మాటను హవ్వ విని దాని ప్రకారము చేసినందున ఆ మొదటి మానవ దంపతులు తమ మంచి స్నేహితుని నుండి వేరైపోయారు. (ఆదికాండము 3:1-24) దైవ అనుగ్రహమును పోగొట్టు హానికరమైన మాటలలో యిమిడిపోయి తద్వారా మన మంచి స్నేహితుడైన యెహోవా దేవుని నుండి మనలను వేరు చేయగల్గు సాతాను కల్పనలకు ఎన్నడు లొంగిపోకయుందము.
16. కొండెగాడు ఎట్లు మిత్రబేధము చేయును?
16 ద్వేషముతో కూడిన వదరుబోతు మాటలను మనము వినకూడదు, ఎందుకంటె వారు స్నేహితులను విడదీస్తారు. కొండెగాళ్లు తరచు, అతిశయోక్తిగా, తప్పుడు అభిప్రాయముతో అబద్ధములు చెప్పి ఆగ్రహమును కలుగజేయు మాటలను కుప్పలుగా పోస్తారు. వ్యక్తితో ముఖాముఖిగా మాట్లాడే బదులు వారి చాటుగా గుసగుసలాడటం అంతుచిక్కని అనుమానాలు లేవదీయబడును. ఆవిధంగా “కొండెగాడు మిత్రబేధము చేయును.”—సామెతలు 16:28.
17. స్వల్పమైన వదరుబోతు తనమందు తీవ్రముగా యిముడుటనుగూర్చి మనమెందుకు జాగ్రత్త వహించాలి?
17 స్వల్పంగా వదరుమాటలను పల్కు విషయములోను తీవ్రంగా యిమిడియుండుటను గూర్చి మనము జాగ్రత్త వహించాలి. ఎందుకు? ఎందుకనగా ఎవరినైనా గాయపర్చుటకు చేసిన ఒక వ్యాఖ్యానము, అది మరలా మరలా చేస్తే మరీ గాయమవుతుంది. దైవభక్తిగల వ్యక్తియొక్క ప్రతిష్టను పాడుచేసేంతవరకు, అతని మంచి పేరును పోగొట్టేంతవరకు అది వర్ణించబడవచ్చు లేదా వక్రీకరించబడవచ్చును. అదే జరిగితే, ఆ కథను నీవే ప్రారంభిస్తే, లేదా దానిని వ్యాపింపజేస్తే నీవు ఎలా భావించెదవు? నీవు ద్రోహము తలపెట్టేవాడవని ప్రజలు నిన్ను గూర్చి తలంచి, నీ సహవాసమును ఎన్నడు కోరకపోవచ్చును.—సామెతలు 20:19 పోల్చుము.
18. వదరుబోతుతనము ఒక వ్యక్తిని ఎలా అబద్ధికుని చేయగలదు?
18 పాడుచేయగల వదరుబోతుతనము గూర్చి జాగ్రత్త వహించవలసిన మరొక హేతువేమనగా అది నిన్ను ఒక అబద్ధికునిగా చేయగలదు. “కొండెగాని మాటలు రుచిగల పదార్థములవంటివి అవి కడుపులోనికి దిగిపోవును.” (సామెతలు 26:22) నీవు అబద్ధాలను దిగమ్రింగి వాటిని వల్లించుచుంటే ఏమి జరుగుతుంది? అబద్ధాలు నిజమని నీవు నమ్మినను, వాటిని వ్యాప్తి చేసేటప్పుడు నీవు అబద్ధమాడుచున్నావు. అవి అసత్యాలని బయలు పడినప్పుడు, నీవు అబద్ధికుడవని ఎంచబడతావు. అది నీకు సంభవించాలని కోరెదవా? మత సంబంధమైన అబద్దాలకు అబద్ధ బోధకులను దేవుడు బాధ్యులను చేయడా? అవును, అబద్ధములాడు కొండెగాండ్లను కూడ ఆయన లెక్క అడుగును. యేసు హెచ్చరించెను: “మనుష్యులు పలుకు ప్రతి వ్యర్థమైన ప్రతిమాటను గూర్చియు విమర్శదినమున లెక్క చెప్పవలసియుండును. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పునొందుదువు, నీ మాటలనుబట్టియే అపరాధివని తీర్పునొందుదువు.” (మత్తయి 12:36, 37) “మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్క యొప్పగింపవలెను” గనుక, అబద్ధములాడు కొండెగాడవని ఆయన నిన్ను గూర్చి తీర్పుచేయగోరుదువా?—రోమీయులకు 14:12.
19. హానికరమైన వదరుమాటలు నరహత్యతో సమానమని ఎందుకు చెప్పబడెను?
19 హానికరమైన వదరుమాటలను వ్యాప్తిచేయకుండుటకుగల మరొక కారణమేమంటే అది నరహత్యకాగలదు. అవును, ఒక అమాయకుని మంచి ప్రతిష్టను నాశనముచేసి, ప్రాణహాని కల్గించగలవుకూడ. కొందరి మాటలు పదునైన కఠినమైన మాటలు లోపములేని వారికి గుచ్చుకొనిన బాణములవంటివి. దావీదు యిలా ప్రార్థించెను: “కీడు చేయువారి కుట్రనుండి దుష్టక్రియలు చేయువారి అల్లరినుండి నన్ను దాచుము. ఒకడు కత్తికి పదునుపెట్టునట్లు వారు తమ నాలుకలకు పదును పెట్టుదురు. యథార్థవంతులను కొట్టవలెనని చాటైన స్థలములలో చేదు మాటలను బాణములుగా సంధించుదురు. వారు భయమేమియు లేక అకస్మాత్తుగా వారిని కొట్టెదరు.” (కీర్తన 64:2-4) తోటి మానవుని గూర్చి అట్టి చెడ్డ మాటలు పల్కి, అతడును కీర్తన గ్రంథకర్తవలె సహాయము నిమిత్తము దేవునికి విధిగా ప్రార్థించునట్లుగా చేయుదువా? నరహత్యకు సమానమైన నేరమును నీవు చేయగోరుదువా?
20. (ఎ)దేవుని సంఘములో పశ్చాత్తాపపడని కొండెగానికి ఏమి సంభవించును? (బి) వదరుమాటలు కొండెములు వీటి విషయములో పెద్దలు ఎట్టి జాగ్రత్త వహించాలి?
20 కొండెములు దేవుని సంస్థనుండి బహిష్కరించబడుటకు నడుపును; కొండెగాడు పశ్చాత్తాపపడని అబద్ధికునిగా బహిష్కరించబడవచ్చును. అయితే స్వల్పమయిన వదరు మాటలను గూర్చి అట్టి చర్య తీసుకొనబడదు. అది కేవలం ఒక వదరు మాటా లేక తీవ్రమైన కొండెమా అని వీటి మధ్యతేడాను పెద్దలు విచక్షణచేసి విషయాలను ప్రార్థనాపూర్వకంగా చూడవలెను. అపరాధికుడు ద్వేషముతో కూడినవాడై పశ్చాత్తాపపడని కొండెగాడైతేనే బహిష్కరించబడవలెను. అబద్ధము లేక ద్వేషముతో కూడినదికాక మానవేచ్చను బట్టి కల్గే స్వల్పమైన వదరుమాటలను బట్టి ఎవనినైనా బహిష్కరించుటకు పెద్దలకు అధికారములేదు. విషయములను తగుమాత్రము కంటె ఎక్కువ చేయకూడదు, నిస్సందేహముగా అతడు కొండెములాడెనని నిరూపించుటకు తగిన సాక్ష్యాధారములుగల సాక్య్షులుండాలి. (1 తిమోతి 5:19) ద్వేషముతో కూడిన అట్టి వదరుమాటలను అణిచివేయుటకును, సంఘమును పాపముతో పులిసిపోకుండా కాపాడుటకును పశ్చాత్తాపపడని కొండెగాళ్లు ముఖ్యంగా బహిష్కరింపబడవలెను. (1 కొరింథీయులు 5:6-8, 13) అయితే లేఖనాధారములేని విషయములను బట్టి పెద్దలు ఎవరినైనా బహిష్కరించుటకు త్వరపడకూడదు. ప్రార్థన హెచ్చరికలవలన, ఆ వ్యక్తి పశ్చాత్తాపడునట్లును, క్షమాపణ కోరి లేదా మరి యితర సర్దుబాట్లుచేసికొని, నాలుకను స్వాధీనపర్చుకొనుటలో అభివృద్ధిసాధించునట్లు వారు సహాయపడగల్గుదురు.
అది కొండెమా?
21. తప్పుచేసిన వానిని గూర్చి వదరుమాటలు పల్కే బదులు, నీవు ఏమి చేయాలి?
21 జ్ఞానముగల సామెత యిట్లనుచున్నది: “కొండెగాడై తిరుగులాడువాడు పరులగుట్టు బయటపెట్టును. నమ్మకమైన స్వభావముగలవాడు సంగతిదాచును.” (సామెతలు 11:13) తీవ్రమగు పాపములో ఎవరైన రహస్యంగా పాలుపంచుకొనుచుంటే, అయితే ఆ విషయాన్ని గూర్చి నీవు వదరుమాటలు పలుకకూడదు. తప్పుచేసిన వానితో నీవు మాట్లాడి, పెద్దల సహాయమును కోరుమని నీవు అతనిని వేడుకొనవచ్చును. (యాకోబు 5:13-18) తగిన సమయములో అతడు అలా చేయక పోయినయెడల సంఘము పవిత్రతయెడల నీకుగల శ్రద్ధ, ఆ విషయాన్ని పెద్దలకు తెలియజేయునట్లు నడుపవలెను.—లేవీయకాండము 5:1.
22. మొదటి కొరింథీ 1:11 నందలి మాటలు వదరు మాటలు కావని మనమెందుకు చెప్పుచున్నాము?
22 అట్టి నివేదిక తప్పుచేసినవానిపై క్రమ శిక్షణ చర్యతీసుకొనుటకు నడుపవచ్చును. అది సంతోషాన్ని కలిగించక పోవచ్చును. అయినప్పటికిని క్రమ శిక్షణ మూలంగా తర్ఫీదు పొందిన వ్యక్తి నీతియను ఫలమును కోయును. (హెబ్రీయులు 12:11) అట్టి విషయాలను చేపట్టుటకు నియమించబడిన వారికే ఆ తప్పిదములను తెలియపర్చాలి తప్ప దానిని గూర్చి చాటింపు వేసే వదరుబోతులకు కాదు. కొరింథీ క్రైస్తవులకు పౌలు యిలా చెప్పెను: “సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మునుగూర్చి క్లొయొ యింటివారి వలన నాకు తెలియవచ్చెను.” (1 కొరింథీయులు 1:11) విశ్వాసులనుగూర్చి ఆ యింటి వారు వదరు మాటలు పల్కుచున్నారా? లేదు, అయితే జీవనమార్గమునకు వారిని మరల్చుటకు తగిన సహాయముచేయుటకు చర్యతీసుకొనగల్గు బాధ్యతాయుత పెద్దకు ఆ విషయము తెలియజేయబడెను.
23. ఏప్రశ్నలు చర్చకొరకు మిగిలియున్నవి?
23 హానికరమైన వదరు మాటలలో చిక్కుబడకుండా కాపాడుకొనునట్లు ఒకనికి మనము సహాయముచేసిన యెడల, అతని మేలుకొరకే మనము చేయుచున్నాము. జ్ఞానయుక్తమైన ఒక సామెత యిలా అంటున్నది: “తన నోరుకాచుకొనువాడు తన్ను కాపాడుకొనును. ఊరకొనక మాటలాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును.” (సామెతలు 13:3) అట్లయితే, హానికరమైన వదరు మాటలు మరియు చెడ్డకొండెముల విషయములో జాగ్రత్త వహించుటకు తగిన కారణములు కలవు. అయితే హానికరమైన వదరుమాటలను ఎలా అణచివేయాలి? జూలై నెలలో వచ్చు ఒక శీర్షిక దానిని తెల్పును. (w89 10/15)
మీ ప్రత్యుత్తరమేమిటి?
◻ స్వల్ప వదరుమాటలు, కొండెములు వీటిమధ్యగల తేడా ఏమిటి?
◻ వదరు మాట ఎలా కొండెమగును?
◻ హానికరమైన వదరు మాటలను గూర్చి జాగ్రత్త వహించాల్సిన కొన్ని కారణములేమిటి?
◻ మరోవ్యక్తి యొక్క తీవ్రమైన తప్పిదమునుగూర్చి మనము తెలియజేస్తే అది ఎందుకు కొండెము కాజాలదు?
[27వ పేజీలోని చిత్రాలు]
ఒక వ్యక్తిని గూర్చి వదరు మాటలు పల్కి అతని వెనుక భాగమును బాణముతో కొట్టిన వాడవనే నేరము నీకు రాకుండా జాగ్రత్తపడుము